మలిసంజ కెంజాయ! -13

5
2

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[పుట్టింటికొచ్చిన రాణి కూతురు శివానీ తమ అత్తగారు చేసిన కాలిఫ్లవర్ ఆవకాయ, జంతికలు తల్లికిస్తుంది. వాటిని పెద్దగా ఇష్టపడదు రాణి. తన అత్తగారిని చులకనగా చూస్తే శివానీ బాధపడుతుందని రాణికి చెప్పాలని అనుకుంటుంది పార్వతమ్మ. కానీ ఊరుకుంటుంది. పిల్లాడికి మంచి అలవాట్లు నేర్పించావని మనవరాలిని మెచ్చుకుంటుంది పార్వతమ్మ. అవన్నీ తన అత్తగారు నేర్పారని అంటుంది శివానీ. శివానీ అత్తగారింటి వారు ధనవంతులైనా, దర్పం అదీ ప్రదర్శించక నిరాడంబరంగా ఉంటారు. అది రాణికి నచ్చదు. శివానీ నానమ్మని గుడికి తీసుకువెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఓ చీర కొనిస్తుంది. నానమ్మని మా ఇంటికి తీసుకెళ్తానని శివానీ అంటే, నువ్వు వేరు కాపురం పెట్టినప్పుడు తీసుకెళ్ళు అంటుంది రాణి. మర్నాడు శివానీ బయల్దేరుతూ, నానమ్మకి వీడ్కోలు చెబితే, కనీసం పండగ పూటయినా ఫోన్ చేసి పలకరించమని అడుగుతుంది పార్వతమ్మ. ఇక నుంచి ప్రతీ పండక్కీ ఫోన్ చేస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోతుంది శివానీ. ఓరోజు అత్తగారితో మాట్లాడుతూ, అత్తగారు పెద్ద కోడలి ఇంట్లో ఉన్నప్పుడు తమ గురించి ఏమైనా మాట్లాడుతుందా అని అడుగుతుంది. లేదంటుంది పార్వతమ్మ. తమ విషయాలు కూడా అక్కడ చెప్పద్దంటుంది రాణి. అక్కడికి మోసుకుపోయి చెప్పే విషయాలేముంటాయి అంటుంది పార్వతమ్మ. ఇంటికొచ్చిన మిత్రురాలు రేణుకతో వాళ్ళ కోడలి గురించి మాట్లాడుతుంది. కోడల్ని అదుపులో ఉంచాలని చెబితే, తన పద్ధతి అది కాదని అంటుంది రేణుక. ఓ రోజు వసంత ఫోన్ చేస్తుంది. పార్వతమ్మ సంతోషంగా మాట్లాడుతుంది. అది రాణికి నచ్చదు. వసంతని ఏదో అంటుంది, దానికి పార్వతమ్మ సమాధానం ఇస్తుంది. మరో వారం పది రోజులుండి తన ఊరికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది పార్వతమ్మ. ఇక చదవండి.]

[dropcap]త[/dropcap]ర్వాత పార్వతమ్మ కొడుకుని “ఇంక వెళతానురా! అమలాపురం” అంటూ అడిగింది. ఆమె అనుకున్నట్టుగానే మరో వారం గడిచాక తల్లి మళ్ళీ ఇంకో రెండుసార్లు బతిమాలాక కారు సిద్ధం చేసాడు రాజేష్. దారిలో తినడానికి అన్నీ సర్ది, “దిగగానే ఫోన్ చెయ్యండి” అంది రాణి. అలాగే అంటూ తలూపి వీడ్కోలు తీసుకుని వైజాగ్ నుంచి అమలాపురం బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకి ఇంటికి చేరింది పార్వతమ్మ.

వసంత ముందురోజే పనమ్మాయిచేత ఇల్లంతా దులిపించి తుడిపించి, తడిబట్ట పెట్టించి, వంట గిన్నెలన్నీ మరోసారి కడిగించి బోర్లించి రెడీగా ఉంచింది. రాగానే ఆమెకు ఇష్టమైన అరటికాయ బజ్జీలు వేసి టీ ఇచ్చింది. డ్రైవర్ కూడా అవి తిని టీ తాగి “వస్తానమ్మా” అంటూ బయలుదేరాడు. వసంత పార్వతమ్మకి ఆ రాత్రి తన ఇంట్లోనే భోజనం వడ్డించింది. మర్నాటినుండే పాలు వచ్చేట్టు చెప్పి పెట్టింది. ఉదయమే వచ్చిన పాలు తీసుకుని కాఫీ చేసుకుని తులసమ్మ పక్కనున్న గట్టుమీద కూర్చుంది పార్వతమ్మ.

“వసంతా! నా కొడుకు రెండు కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లయినా, నా రెండు గదుల్లో పడుకుంటేనే నాకు సుఖంగా నిద్ర పట్టింది ఎందుకంటావ్?” అంది ముసిముసిగా నవ్వుతూ

“అవును పిన్నీ! మనిల్లు మనిల్లే! ” అంది వసంత నవ్వుతూ.

“అదీ!” అంది పార్వతమ్మ సరైన జవాబు చెప్పావు అన్నట్టు.

ఆ మర్నాడే వసంత ఒక ఫంక్షన్‌కి వెళ్ళవలసి వచ్చింది. అమలాపురానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మురమళ్ళ గ్రామంలో ఆమె స్నేహితురాలు తన మనవరాలికి లంగా వోణీ కట్టిస్తున్నామనీ, ఫంక్షన్ భారీగా చేస్తున్నామనీ మరీ మరీ పిలవడంతో భర్తని షాప్‌కి పంపి బయలుదేరింది బస్టాండుకి. బస్టాండ్‌కి రాగానే బస్సు దొరికింది. ఖాళీగా కూడా ఉంది అమ్మయ్య, అనుకుంటూ ఒక కిటికీ పక్క సీట్లో కూర్చుని ఆకుపచ్చని చేలని చూస్తూ ఆనందపడుతోంది.

“ఏయ్ వసంతా ఎలావున్నావే?” అంటూ ఒకావిడ పక్కనే కూర్చుంటూ భుజంపై చెయ్యివేసింది. ఉలిక్కిపడి చూసిన వసంతకి కాషాయం రంగు చీరా, జాకెట్టూ వేసుకుని తన వయసే ఉన్న ఒక స్త్రీ కనబడడంతో “మీరెవరండీ?” అంది వసంత.

“నేనేనే కామాక్షిని, నీ డిగ్రీ క్లాసుమేట్‌ని” అంది నవ్వుతూ. ఆ నవ్వును చూసి గుర్తుపట్టింది వసంత.

“సారీ! కామాక్షీ, నీ కాషాయ బట్టలు చూసి” అంది వసంత నవ్వుతూ.

“ఏం ఫర్వాలేదు. అంతా ఇదే మాటంటారే!” అంటూ గట్టిగా నవ్వేసిందామె

“బావున్నావా? ఈ వేషం ఏమిటే?”

“నేను కర్నూల్‌లో ఉండే ఆనంద్ స్వామి శిష్యురాలిని. అక్కడే ఉంటాను. రెండెకరాలుంటుంది ఆశ్రమం. నువ్వెప్పుడూ పేరు వినలేదా? మొన్నే వచ్చాను, అక్కడి నుంచి”

“మరి కుటుంబం లేదా?”

“ఎందుకు లేదు? ఆయన కోసమే నెలకో పదిరోజులు ఇక్కడ ఉండి వెళుతుంటాను. యానాంలోనే మా ఇల్లు”

“మరి పిల్లలు?”

“ఒకే ఒకమ్మాయి. ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. అల్లుడు కూడా అదే కంపెనీ. ఇద్దరమ్మాయిలు. ఎనిమిదేళ్ళూ, ఆరేళ్లూ”

“నువ్వు ఆశ్రమంలో ఏం చెయ్యాలి రోజూ?”

“ఆనంద్ స్వామి ప్రధాన శిష్యగణంలో ఉంటాను. అక్కడ రోజూ ఉదయాన్నే నగరసంకీర్తన, నిత్యపూజలూ ఉంటాయి. పర్వదినాల్లో చాలా పూజలుంటాయి. యజ్ఞాలు కూడా చేస్తారు తెలుసా! స్వామి దగ్గరికి ఇంటర్వ్యూల కోసం వచ్చేవాళ్ళుంటారు. విదేశాల నుంచి కూడా వస్తారు. వాళ్ళతో ముందుగా నేనే మాట్లాడి పంపుతాను”

“అసలు ఇలా భక్తిలో పడి ఎన్నాళ్లయిందే?”

“పదేళ్ళయింది. ఎలాగంటే అదో పెద్ద కథలే. నాకొక కష్టం వచ్చింది. అప్పుడే ఆ స్వామి దగ్గరికి వెళ్లడం జరిగింది. నాకష్టం చెప్పాను. తిరిగి వచ్చేసరికి అది తొలగిపోయింది. అందుకు కృతజ్ఞతగా అలా అక్కడే ఉంటున్నాను”

“అలా అని ఆ స్వామి కండిషన్ పెట్టారా?”

“ఛ.. ఛ.. అదంతా ఆయనకి తెలీనే తెలీదు కూడా. ఏదో నా మనస్సాక్షి! అంతే”

“మరి పిల్ల పురుళ్ళూ, పుణ్యాలూ?”

“మరి, నేను భగవాన్ ఆశ్రమంలో ఉన్నాను కాబట్టి చెయ్యలేను కదా! అని వాళ్ళత్తగారే అన్నీచూసుకుంది”

“భర్తకి న్యాయం చెయ్యాలని మాత్రం వచ్చిపోతూ ఉంటున్నావన్నమాట”

“ఇల్లూ అదీ కాస్త చూసుకోవాలి కదా! ఆయనే వండుకు తింటున్నారనుకో!”

“నువ్వు భక్తురాలయినందుకు మీ ఆయనకీ, పిల్లకీ శిక్షన్నమాట. బావుందే!”

“నీలా సంసారబంధంలో ఉన్నవారికి మాలాంటి భక్తుల శ్రద్ధా, సబూరీ అర్థం కావులేవే!”

“అవసరం లేదులే కానీ, ఒక్కగానొక్క ఆడపిల్ల. దానికి నీ సహాయం, సహకారం, ఆసరా ఇవ్వకపోవడం పాపం కాదే?”

“అలా అని సంసార లంపటాలన్నీ మీద వేసుకుంటే ముక్తి ఎప్పటికీ రాదే! అందుకే వదిలించుకొన్నాను. అది తప్పంటావా?” బేలగా అడిగింది కామాక్షి.

“ముమ్మాటికీ తప్పే! ఒక తల్లిగా నీ కూతురికి చెయ్యవలసిన సేవ కూడా ముఖ్యమే కదా! ఆశ్రమంలో నీ పని ఇంకొకరు చెయ్యగలరు. నీ కూతురికి ఎవరు చేస్తారు?”

“మా అమ్మాయి మంచిదే! అలా ఏమీ అనుకోదు కానీ ఒకోసారి బాధపడుతుంది. అన్నిటికీ మా అత్తగారి మీద ఆధారపడుతుంటే ఒకోసారి ఆవిడ చేతకాక విసుక్కుంటుంది. మీ అమ్మ దేవుడి పేరు చెప్పి పని తప్పించుకుని సుఖపడుతోంది. నువ్వేమో ఉద్యోగం చేసుకుంటావు. పిల్లల్ని చూడకుండా నేను తప్పించుకోలేను అంటుందిట”

“అందంటే తప్పులేదులే!” అంది వసంత.

“నిజమే అనుకో! కానీ జీవుడికి విముక్తి ఉండదే! ఇలా వెంపర్లాడితే”

“మరి పూర్తిగా నువ్వు మాత్రం సంసారం వదిలావా?”

“అవును. నా భర్తా, ఇల్లూ వరకూ దాన్ని తగ్గించుకున్నానే”

“ఎలా నీ భర్త కోసం కొంత తగ్గించుకున్నావో, అలాగే కూతురి కోసం కూడా కొంత తగ్గించుకుని ఆ మనవల పెంపకంలో కాస్త సాయం చెయ్యి. వేసవి సెలవుల్లో పిల్లల్ని తెచ్చుకో. వాళ్ళకి అమ్మమ్మ ఊరూ విశేషాలూ తెలుస్తాయి. నీ కూతురు కాస్త ఊపిరి పీల్చుకుంటుందక్కడ”

“దీనికి అంతెక్కడే!”

“సంసారబాధ్యతల్ని వదిలేసి అక్కడ జేరితేనే ముక్తి వస్తుందనుకోకే! ఇక్కడే ఉండి రాగద్వేషాలతో బాధపడుతూ మరొకళ్ళని బాధపెట్టకుండా ఎలా ఉండాలో చూపించు. నిర్మమకారంగా ఉంటూ మా అందరికీ ఆదర్శంగా ఉండు. వేలకి వేలు ఖర్చు పెట్టుకుని గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు తిరిగితేనే మోక్షం దొరుకుతుందనే, మా భ్రమలను వదిలించు. పనిలో పనిగా మానస సరోవరం నుంచి తెచ్చిన నీరు ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుందనీ, అప్పులు తీరతాయనీ భావించే మా మూఢనమ్మకాల్ని వదిలించుకునే విధంగా మాకు జ్ఞానబోధ చెయ్యి. అదీ సేవే. నువ్వెళ్ళి స్వామీజీ దగ్గరే ఉండడం కంటే నువ్వే ఇక్కడ చిన్న స్వామీజీగా మాకు నాలుగు మంచి మాటలు చెబుతూ ఉండు. సత్సంగాలు పెట్టు! మమ్మల్ని కూడా సంసార బంధనాల నుంచి విముక్తుల్ని చెయ్యి”

“అలా అంటావా? నాక్కూడా లోపల గిల్టీగానే ఉంటుంది. ఒకోరాత్రి నిద్ర పట్టదు. నన్ను నేనే ఓదార్చుకుంటాను”

“ఇప్పుడిలాగే ముసలివాళ్ళను వదిలించుకుని, పుణ్యక్షేత్రాలకీ, ఆశ్రమాలకీ పరుగులు తీస్తూ, చెయ్యవలసిన డ్యూటీని తప్పించుకుని, ‘మేం భక్తులం’ అని మెడలో టాగ్ వేసుకుని చాలా మంది తిరుగుతున్నారు. అలా చెయ్యమని నాకు తెలిసి ఏ మంచి గురువూ చెప్పడు. ఇదంతా మన అన్వయలోపం అని నేననుకుంటాను”

“ఇంతవరకూ ఎవరూ అనలేదు, ఈ మాటలు నా ఎదురుగా!”

“అవును. నేను మిత్రురాలిని కాబట్టి మొహమాటం లేకుండా చెప్పాను. ముందు నువ్వు పుణ్యం, మోక్షం సంపాదించాలనే మోహరాగాలను జయించు. వైరాగ్యం అలవరచుకో! అదే జీవన్ముక్తి. ఇన్నేళ్లూ ఆ స్వామి చెప్పిన విషయాలు విన్నావుగా. అవి మాక్కూడా చెప్పు. సంసారం వదిలి పారిపోవడం గొప్ప కాదు. అక్కడే ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండగలగడం గొప్ప. నేను చెప్పిన విషయాలు బాగా ఆలోచించు.”

“చాలా థాంక్స్ వసంతా! ఇన్నాళ్లూ నాలో నేను గుంజాటన పడుతున్న సంగతులకి నువ్వు సరిగ్గా పరిష్కారం చెప్పావు. నువ్వు చెప్పినట్టు చేస్తానే!” అని కామాక్షి అంటుండగా, తన స్టాప్ రావడంతో “సరే మరి” అంటూ బస్సు దిగిపోయింది వసంత.

***

అలా ఆ రోజు విశాలను పలకరించిన మాధవకి గొప్ప సంతోషం కలిగింది. జీవితంలో కనబడదు అనుకున్న తన సహాధ్యాయిని మళ్ళీ కనబడి ఆ పై మాట్లాడడం గొప్ప వరం అనిపించిందతనికి.

ఆ తర్వాత ఒక అర్జెంటు పనిమీద ఒక నెల తన ఊరికి వెళ్ళవలసి వచ్చింది మాధవకి. నెల తర్వాత వచ్చిన రోజే రాత్రి తొమ్మిది గంటలకి ఆమెకి ఫోన్ చేసాడు.

“చెప్పు మాధవా! ఏమైపోయావూ?” అంది విశాల.

“థాంక్యూ! నేను నిజంగానే ఒక నెల మన ఊరికి వెళ్ళొచ్చాను. నీకెలా తెలిసింది?”

“అదే కదా మరి” అంది విశాల నవ్వేస్తూ.

“మీ శ్రీవారు ఎలా ఉన్నారు? ఆయనేం చేస్తారు? రిటైర్ అయ్యారా సర్వీస్ నుంచి?”

“ఆయన లేరు మాధవా! అయిదు సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ రావడం వల్ల”

“అయ్యయ్యో! సారీ! విశాలా!” బాధపడుతూ అన్నాడతను.

“పర్వాలేదులే! మిత్రులన్నాక క్షేమ సమాచారం అడుగుతాం కదా! దానికి నువ్వంత బాధపెట్టుకోనక్కర్లేదు. ఒక పని చెయ్యి. నువ్వు నీ భార్యను తీసుకుని మా ఇంటికి ఒక రోజు వస్తే బావుంటుంది”

“నాదీ నీ పరిస్థితే! ఆమె పోయి పదకొండేళ్లయ్యింది”

“ఎంత పని జరిగింది మాధవా!” చిన్నబోయింది ఆమె స్వరం. “చాలా బాధాకరం! కారణం ఏంటి?”

“కాన్సర్. ఆ తర్వాతే నేను మన ఊరు వదిలేసి హైదరాబాద్ వచ్చేసాను.”

“మరి భోజనం అదీ ఎట్లా నీకు?”

“అన్నీ నేనే చేసుకుంటాను. అలవాటైపోయింది. ఒకో పూట ఇంట్లో మరో పూట హోటల్లో. అలాగే బండి లాగించేస్తున్నాను”

“సరే! ఆరోగ్యం జాగ్రత్త మరి” అంది విశాల.

“అలాగే నువ్వు కూడా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో!”

“నా ఆరోగ్యానికేం. గుండ్రాయిలా ఉన్నాను” అంటూ నవ్వేసిందామె.

“నువ్వు కాదు ఆ రాయి నేను” అంటున్న మాధవ మాటకి ఆమెకి కూడా నవ్వొచ్చింది. మాధవ కూడా శృతి కలిపాడు.

“మీ అమ్మాయి దగ్గరికి ఎప్పుడూ వెళ్ళవా మాధవా?”

“బోల్డు సార్లు వెళ్ళాను. బోల్డు సార్లు వచ్చాను. నన్ను అక్కడే ఉండమంటారు. కానీ నాకెందుకో అక్కడ ఊపిరాడదు. ఇక్కడ ఉంటేనే హాయిగా ఉంటుంది. నా పాటికి నేనే ఏదో వండుకుని తింటూ, తిరుగుతూ నాకిష్టమైన పని చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటుంటా! అలవాటైపోయిందిలే. దిగులేం లేదు”

“ఆడవాళ్లు లేకుండా మగవాళ్ళకి కష్టమే మాధవా!” సానుభూతిగా అందామె.

“నువ్వంతగా నా గురించి బాధపడకు. అనవసరంగా చెప్పి నిన్ను బాధపెట్టానే! అని నా మీద నాకు కోపం వస్తుంది”

“భలేవాడివిలే! నీకు కష్టంగా ఉందని తెలిస్తే, నాకూ అలాగే ఉంటుంది కదా!”

“నా మీద నువ్వు జాలిపడకూడదు విశాలా!”

“అంతే అంటావా!” నవ్విందామె.

“ముమ్మాటికీ అంతే!”

“అయితే పడనులే జాలి”

“అదీ! సంగతి” అన్నాడతను.

“అయితే ఉంటాను” అందామె ఫోన్ పెట్టేస్తూ.

***

ఆ తర్వాతి వారంలో వసంత ఒక పెళ్ళికి హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. వసంతకి తమ్ముడి వరస అయిన కజిన్ తన కూతురి పెళ్ళికి ఫోన్ చేసి పిలిచాడు. “మా అమ్మాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. పిల్లాడు కూడా అదే కంపెనీ. ప్రేమ వివాహం. అయితే పెళ్లి అక్కడే చెయ్యాలని వియ్యాలవారు అన్నారు. మాకు అటువైపు ఎవరూ లేరు. ఇక్కడినుండి అక్కడికి ఎవరూ రారు అన్నారు. అందుకోసం హైదరాబాద్‌లో చేస్తున్నాను. మీరిద్దరూ రాకపోతే స్వయంగా పిలవలేదని రాలేదనుకుంటానక్కా” అన్నాడు. భర్తని అడిగితే “సరే వెళదాం” అనడంతో బయలుదేరింది ఆనందంగా. ఎందుకంటే అక్క ప్రమీలకి మాటిచ్చివుంది వసంత వస్తానని. రెండూ కలిసొస్తాయని ఉత్సాహపడింది. ఆ భార్గవి సంగతేంటో కనుక్కోవాలి. ‘హన్నా! మా అక్కని ఏడిపిస్తావా? అని రెండు మొట్టికాయలు వెయ్యాలి దాన్ని’ అనుకుంటూ నవ్వుకుంది.

పార్వతమ్మ దిగులు పడుతుంటే “ఎంత ! రెండు రోజులే పిన్నీ” అని నవ్వింది.

“సరేనమ్మా!” అందామె. ఆ తర్వాత కొడుక్కి ఫోన్ చేసి “హైదరాబాద్‌కి రానూ పోనూ టికెట్లు తియ్యాలి నాన్నా” అంటూ విషయం చెప్పింది. “ఇంకో గంటలో ఫోన్ చేస్తా. తేదీలు వివరంగా రాసి, కేలండర్ దగ్గర పెట్టుకుని చెప్పు” అన్నాడు శైలేష్. అలాగే గంట తర్వాత ఫోన్ చేసి అన్నీ వివరంగా రాసుకుని తల్లి తండ్రులకి కాకినాడ నుంచి హైదరాబాద్ కి రానూ పోనూ ట్రైన్ టిక్కెట్లు తీసేసాడు.

అమలాపురం నుంచి కాకినాడ వచ్చి ట్రైన్ ఎక్కారు వసంతా, వెంకట్రావూ. మర్నాడు సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగి తిన్నగా పెళ్లివారింటికి చిక్కడపల్లి వెళ్లారు. వసంత కజిన్, కూతురు ఉండే బిల్డింగ్ లోనే, పెళ్లి కోసమని మరొక ఫ్లాట్ అద్దెకి తీసుకుని ఉన్నాడు. ఉదయం పది గంటలకల్లా పెళ్ళికూతుర్ని చేసే కార్యక్రమంలో ఉండగానే ప్రమీలా, ఆమె భర్తా వచ్చారు. అక్కచెల్లెళ్ళిద్దరూ బంధువులందరితోనూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ తిరిగారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక కాసేపు అందరూ ఓ గంట ఓ గదిలో మంచం చూసుకుని, ఒరిగారు. లేచాక పలకరించిన చుట్టాలతో మళ్ళీ బాతాఖానీ వేశారు. పెళ్లి రాత్రి ఎనిమిదికి. అంతా కాస్త స్నాక్స్ తిని టీలు తాగేసరికి చీకటి పడింది. పెళ్లి హాలు ఇంటి వెనకే ఉంది.

అంతా తయారయ్యి వెళ్లేసరికి ఏడయ్యింది. వసంతా ప్రమీలా పక్క పక్కనే కూర్చున్నారు. పెళ్లి బాగా జరిగింది. ఇద్దరూ తాము తెచ్చిన గిఫ్ట్ కవర్‌లు ఇచ్చేసి, భోజనాలు చేసి వాళ్ళకి వీడ్కోలు చెప్పి, మలక్‌పేట్‌లో ఉన్న ప్రమీల ఇంటికి చేరేటప్పటికి రాత్రి పదకొండయ్యింది. “నిన్న రాత్రంతా ప్రయాణం, పొద్దున్నుంచి పెళ్లి హడావిడి పడుకోండి, పడుకోండి” అంటూ ప్రమీల వాళ్ళని పడుకునే వరకూ ఊరుకోలేదు. అలిసిన వసంతా, వెంకట్రావూ ఒళ్ళుమరిచి నిద్రపోయారు. ఉదయం లేచేసరికి కమ్మని పూరీల వాసన వస్తుంటే భర్తని నిద్ర లేపింది వసంత.

టిఫిన్లు తింటుంటే తోడల్లుళ్లిద్దరూ కబుర్లలో పడ్డారు. “భార్గవి ఎలా ఉందక్కా? పిల్లలూ, అల్లుడూ?”

“అంతా బావున్నారు. చెప్పాను, పిన్ని వస్తోందని. పిన్నొచ్చినప్పుడు మేం వస్తాం. మాకు శనాదివారాలే అని సంబరపడింది”

“అవునక్కా! ఇవాళ శనివారమే” అని నవ్వింది వసంత.

టిఫిన్ లయ్యాక అంతా స్నానాలు చేసి కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ.

మరో అరగంటకి భార్గవి ఫోన్ చేసింది తల్లికి, “అమ్మా! పిన్ని వచ్చిందా?” అంటూ.

“వచ్చిందే!” అంటూ ఫోన్ చెల్లెలికి ఇచ్చి ప్రమీల పనమ్మాయికి పనులు చెబుతూ వంటగదిలోకి వెళ్ళింది.

“పిన్నీ ఎలా ఉన్నావూ? చిన్నాన్న కూడా వచ్చారా?”

“వచ్చారు నాన్నా! ఎలా వున్నారు మీరంతా?”

“బావున్నాం. బావున్నాం. పన్నెండువరకల్లా వచ్చేస్తాం పిన్నీ! నలుగురం. నువ్వు వెళ్లేవరకూ అందరం కలిసి గడుపుదాం. ఆదివారం రాత్రి కదా నీ ట్రైన్?”

“అది కాదురా భార్గవీ. ఒక పని చేద్దాం! మేం నలుగురం మీ ఇంటికొస్తాం. మీ ఇల్లు చాలా బావుంటుందంట కదా! చాలా ఖరీదంట కదా! అమెరికా నుంచి ఫర్నిచర్ తెచ్చుకున్నావంట. మీ అమ్మ చెప్పింది. నాకు మీ ఇల్లు చూద్దామని ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో! మీ చిన్నాన్న మళ్ళీ ఇంతలో తీసుకురారు కదా! అందుకన్న మాట. సాయంత్రం వరకూ ఉండి వచ్చేస్తాము. ఆదివారం మీ అమ్మ ఇల్లంతా సర్దుకోవడానికి సాయం చేయమంటోంది. వంటిల్లూ, బట్టల అలమారూ అన్నీ గజిబిజిగా ఉన్నాయంటోంది. అంచేత ఆదివారం అమ్మకి సాయం చేసి ఆ రాత్రి బయలుదేరతాము.”

పిన్ని చెప్పిన మాటలు ఒక్క క్షణం అర్థం కాక మౌనం వహించింది. తర్వాత అర్థం చేసుకుని “అలాగే పిన్నీ! పన్నెండుకల్లా వచ్చెయ్యండి. నేను అన్నీ రెడీ చేసుకుంటాను” అంది.

“సరేరా!” అంటూ ఫోన్ పెట్టేసింది వసంత. వంట కోసం హడావిడి పడుతున్న అక్కగారితో “హైరానా పడకు. మనం ఇప్పుడు భోజనానికి భార్గవి ఇంటికి వెళుతున్నాం నలుగురం” అన్న వసంత మాటలకి తెల్లబోయింది ప్రమీల.

“అవును భార్గవి పిలిచింది” అంది వసంత నవ్వుతూ.

“చాల్లే! అది వండిందే! మనకి పెట్టిందే! గృహప్రవేశం నాడు తప్ప అది మా ఇద్దరికీ ఒక పూట అన్నం పెట్టలేదు. ఇప్పుడు నలుగురికి పెడుతుందా?”

“నువ్వు వంట ప్రయత్నం మాని వంటిల్లు మూసేసి, వెళ్ళడానికి మంచి చీర చూసుకుని కట్టుకుని రెడీ అవ్వు. ఈ లోగా నేనందరికీ టీ చేసిస్తా తలా ఓ అరకప్పూ” అంటూ ఫ్రిజ్ లోంచి పాలు తీసుకుంది వసంత.

“తీరా వెళ్ళాక మనల్ని వండుకోమంటే?” అపనమ్మకంగా అంది ప్రమీల

“నేనొండుతాను. సరేనా!” అన్నాక అప్పుడావిడ తయారవ్వడానికి సిద్దమయ్యింది.

 (సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here