Site icon Sanchika

మలిసంజ కెంజాయ! -15

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[హైదరాబాద్‌లో పెళ్ళి చూసుకుని, ప్రమీలక్క ఇంటికి చేరుతారు వసంత, వెంకట్రావ్. మర్నాడు మధ్యాహ్నం ప్రమీలక్క కూతురు భార్గవి ఇంటికి బయల్దేరుతారు. భార్గవి ఫోన్‍లో లొకేషన్ పంపడం వల్ల సరిగ్గా ఇంటి ముందు క్యాబ్ దిగుతారు. భార్గవి, ఆమె భర్తా, పిల్లలూ పలకరిస్తారు. ఇల్లంతా రిచ్‍గా ఉంటుంది. అత్యంత అధునాతమైన ఫర్చీచర్, సౌకర్యాలు ఉన్నాయి. భర్త సహాయంతో వంట పూర్తి చేసి వడ్డిస్తుంది భార్గవి. అన్నాలు తిన్నాకా, కాసేపు విశ్రమిస్తారంతా. భార్గవి, తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆమె విషయాలు అడుగుతూ, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని బాధ్యత చెబుతుంది వసంత. మర్నాడు ఉదయం బయల్దేరి ప్రమీలక్క వాళ్ళింటికి వచ్చేస్తారు. అక్కకి అన్నీ సర్దిబెడుతుంది. ఆ సాయంత్రం మాధవ ప్రమీలక్క వాళ్ళింటికి వస్తాడు. మాధవని వసంతకి పరిచయం చేసి తమ బంధువే అని చెబుతుంది. మాధవ గురించి భర్తకీ, వెంకట్రావుకీ చెప్తుంది ప్రమీల. పలకరింపులాయ్యా, వెంకట్రావూ, ప్రమీల భర్తా చిన్నపని ఉందంటూ బయటకి వెళ్తారు. మాధవ, వసంత మాట్లాడుకుంటారు. అమలాపురం వస్తే తమ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది వసంత. ఆ రాత్రే బయలుదేరి అమలాపురం వచ్చేస్తారు వెంకట్రావూ, వసంతా. విశాలతో మాట్లాడి ఆమెని క్షమాపణ కోరుకున్నాక తనకి ప్రశాంతంగా ఉందనుకుంటాడు మాధవ. ఓ రోజు ఫోన్ చేసి మాట్లాడుతాడు. కాలేజీ రోజుల గురించి, డిగ్రీ క్లాసుమేట్ల గురించి మాట్లాడుకుంటారు. కాసేపయ్యాక, మాటల మధ్యలో తమ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది విశాల. నువ్వొక్కదానివే ఉంటావు కదా, రావడం బావుండదు అంటాడు మాధవ. తానొక్కదాన్నీ ఉండననీ, తనతో పాటు మరొకరుంటారనీ, తాను సహజీవనం చేస్తున్నానని అంటుంది. అది విని బాధపడతాడు మాధవ. విశాల ఫోన్ పెట్టేస్తుంది. మళ్ళీ ఓ వారం తరువాత ఫోన్ చేసి, వచ్చే ఆదివారం మీ ఇంటికి రానా అని విశాల అడుగుతాడు. భోజనానికి వచ్చేయమంటుంది. కాదు, టీ కొస్తానంటాడు మాధవ. ఇక చదవండి.]

[dropcap]మ[/dropcap]నసులో బాధగా ఉన్నా, ఉత్సాహం తెచ్చుకుని ఆదివారం నాడు సాయంత్రం మూడు దాటాక బయలుదేరాడు మాధవ. బెల్ కొట్టగానే తలుపు తీసింది విశాల కాదు. ఒక్క క్షణం తెల్లబోయాడు. “ఇది విశాల గారిల్లు కాదా?”

“అవును. మీరు మాధవగారా? రండి, రండి. నేనామె ఫ్రెండ్ సుమిత్రని” అందామె మంచినీళ్ల సీసా ఇస్తూ.

సోఫాలో కూర్చుని అతను మొహం ఎలా పెట్టుకోవాలో తెలీక సతమతమవుతున్నప్పుడు “మాధవా! సరిగ్గా టైంకి భలే వచ్చేసావే! టైం సెన్స్ బావుందన్నమాట!” లోపలినుంచి వస్తూ అంది విశాల ఎదురుగా ఉన్న మరో సోఫాలో కూర్చుంటూ. నెమ్మదిగా తలెత్తి చూసాడతను. లేతరంగు కాటన్ చీర కట్టుకున్న విశాల, ఎంతో నిర్మలంగా కనబడింది. ఆనాటి చిరునవ్వే ఆమె పెదాల మీద. మాధవ మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపించింది. తను తెచ్చిన డ్రై ఫ్రూట్స్ బాక్స్ అక్కడున్న టీపాయి మీద పెట్టాడు.

ఇంతలో సుమిత్ర ముగ్గురికీ టీ తెచ్చి విశాల పక్కన కూర్చుంది. “మాధవా! ఈమె సుమిత్ర అని నా ప్రియనేస్తం. మా ఊరే. మా ఊరి హైస్కూల్‌లో ఇద్దరం టెన్త్ వరకూ చదువుకున్నాం. ఈమె పెళ్ళో, పెళ్ళో అని ఏడ్చింది, అందుకే టెన్త్ సెలవుల్లో పెళ్లి చేసేసారు” అన్న విశాల మాటలకి ముగ్గురూ నవ్వుకున్నారు.

మాధవ బిడియంగా మాట మాటకీ లోపలి బెడ్ రూమ్‌లో ఎవరో ఉన్నారన్నట్టు చూస్తుంటే విశాలకి అర్థమయ్యి “నేను సహజీవనం చేసేది మా సుమిత్రతోనే!” అని నవ్వుతూ అనగానే, మాధవ హాయిగా మనస్ఫూర్తిగా నవ్వాడు.

సుమిత్ర కలుపుగోలుమనిషి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల నుంచి, కొత్త సినిమాల వరకూ అన్నీ చర్చకు పెట్టేస్తూ ముగ్గురి మధ్యా ఇబ్బంది లేకుండా చేసేసింది. ముగ్గురూ హాయిగా, సహజంగా మాట్లాడుకున్నారు.

మరో గంటకి వార్తాపత్రిక మాధవ చేతిలో పెట్టి, పావుగంటలో ఒకరు మైసూర్ పాక్ స్వీట్, మరొకరు మరమరాల ఛాట్ చేసేసారు. వాటిని ముగ్గురికీ ప్లేట్ లలో వేసి తెచ్చేసారు.

“అయ్యో! నా కోసం మీరిద్దరూ శ్రమ తీసుకున్నారు” మొహమాటపడ్డాడతను.

“మీర్రాకపోయినా ఈవేళ మా ఈవెంగ్ స్నాక్స్ ప్రోగ్రాం ఇదే” అంది సుమిత్ర.

టీలు తాగుతూ ఇద్దరూ మాధవ చేసే సూపర్ మార్కెట్ బిజినెస్ ఎలా ఉంటుందీ, ఇబ్బందులేమైనా ఉంటాయా, ఉంటే ఎలా ఉంటాయీ? లాభాల సంగతి ఏమిటీ? లాంటి ప్రశ్నలతో అతన్ని ఇంటర్వ్యూ చేశారు. మాధవ తన వ్యాపారం గురించి టూకీగా వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పాడు.

“ధన్యవాదాలండీ! చాలా మంచి విషయాలు తెలియచేసారు” అంది సుమిత్ర ఆఖర్న.

“అర్థమయ్యిందండీ! మరి నాకు శలవు. విశాలా, సుమిత్రా! మీరిద్దరూ నాకు చిన్ననాటి స్నేహాల కాలాన్ని గుర్తుచేశారు” మనస్ఫూర్తిగా అంటూ లేచాడు.

“నా ఉద్దేశం అది కాదండీ, మరికొంతసేపు ఉండండీ” అని సుమిత్ర అంటుంటే ముగ్గురూ నవ్వుకున్నారు. మాధవకి వీడ్కోలు చెప్పారిద్దరూ.

***

ఆ రోజు రామ్మారుతి గారి ప్రసంగానికి కాస్త ముందుగా బయలుదేరారు పార్వతమ్మా, వసంతా. ఒక కొత్త ఆటో ఎక్కారేమో వాడు చాలా త్వరగా తీసుకెళ్లిపోయాడు ఆశ్రమానికి. ఇంకా ప్రసంగానికి అరగంట టైం ఉంది. ఎవరూ రాలేదు. ఇద్దరూ వెంకటేశ్వరరావు గారు కూర్చునే ఆఫీస్ రూంకి వెళ్లారు. వెళ్ళేటప్పటికి ఆయన ఆశ్రమంలో ఉండే ఒకావిడ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉంది. వీళ్ళని చూస్తూనే “రండి, రండి, పిన్నీ కూతుళ్లిద్దరూ త్వరగా వచ్చేసారే!” అంటూ వెంకటేశ్వరరావుగారు “ఈమె పేరు నాగమణి. మేమంతా నాగమ్మగారని పిలుచుకుంటాం. ఈమె ఇక్కడ ఉంటూ, వద్దని చెబుతున్నా వినకుండా ప్రతి నెలా అయిదువేలిస్తూ ఉంటారు” అంటూ నాగమ్మని వారికి పరిచయం చేసి “మాట్లాడుకుంటూ ఉండండి” అంటూ రూమ్ బైటికి వెళ్లారు.

“కూర్చోండి పార్వతమ్మగారూ! మీరిద్దరూ నాకు తెలుసు” అందామె స్నేహంగా. ఇద్దరూ అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నాక పార్వతమ్మ ఆవిడవైపు ఆసక్తిగా చూస్తూ “ఏ ఊరమ్మా మీదీ?” అనడిగింది.

“మాది ముమ్మిడివరం పక్క ఊరేనండీ. నేనొక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేసి రిటైర్ అయ్యానండి. మాకు కొంత పొలం ఉండేదండి. మా ఆయన అదీ, నేను ఉద్యోగం చేసుకునే వాళ్ళమండి. మాకు ఒక్కడే కొడుకండి. వాడి చదువు కోసం ఆ పొలం అమ్మేసి, చదివించి ఉద్యోగం వచ్చాక, పెళ్లి చేశామండి. నేను రిటైర్ అయ్యాక వచ్చిన కొంచెం డబ్బూ బ్యాంకులో వేసుకుని వచ్చే, వడ్డీతో మేమిద్దరమూ బతికే వాళ్ళమండి.”

“మీ అబ్బాయెక్కడ ఉద్యోగం?” వసంత అడిగింది.

“భీమవరంలోనండి. మంచి ఉద్యోగమేనండి. వాడికి కూడా పిల్లలూ, మనవలూ ఉన్నారండి. ఎప్పుడన్నా మేమిద్దరమూ వెళ్లి రెండేసి రోజులుండే వాళ్ళమండి మా అబ్బాయి దగ్గర. మాకు తెలిసినాళ్ళ ఇంటిలో ఒక చిన్న పోర్షన్‌లో ఉండేవాళ్ళం. టీచర్‌నని గౌరవంతో ఉండేవారు ఇంటిగలవాళ్ళు. ఏనాటి బట్టో అక్కడే ఉండేవాళ్ళం. నాలుగేళ్ళ క్రితం మా ఆయన పోయాక నేనొక్కదాన్నే వండుకుని తింటూ ఉండేదాన్ని. నా ఆరోగ్యం కొంచెం పాడయ్యిందప్పటి నుంచీ. ఎప్పుడైనా వచ్చి ఒక్క గంట ఉండి చూసి వెళ్ళేవాడు కానీ మా అబ్బాయి నన్ను రమ్మని అనలేదు. ఇరుగూ పొరుగు మరీ బాగోలేనప్పుడు డాక్టర్‌కి చూపించేవారు. ఏ నెలకో రెణ్ణెల్లకో నేనే మనసు ఒప్పక ఫోన్ చేసేదాన్ని.

మూడేళ్ళ క్రితం ఓ సారి బొత్తిగా బాగోక ఫోన్ చేసి విషయం చెప్పానండి. అదీ పక్కనుండేవాళ్లు కొడుక్కి మీ అనారోగ్యం గురించి చెప్పాలి కదా! అంటే చెప్పానండి. ‘ఒకరోజు బావుంటే రెండు రోజులు బాగుండడం లేదు. భయంగా ఉందిరా!’ అని. విని ఊరుకున్నాడు. ఏమీ జవాబు చెప్పకుండానే ఫోన్ పెట్టేసాడు.

మరో రెండు రోజులు పోయాక ఫోన్ చేసాడండి. నేను ‘అలాగే ఉందిరా అబ్బాయీ! డాక్టర్ దగ్గరికి తిరుగుతూనే ఉన్నాను. మందులు వాడుతున్నా తగ్గడంలేదు’ అన్నాను.

‘నీ మనవడికి ఇంటర్నేషనల్ స్కూల్‌లో సీట్ వచ్చిన సంగతి చెబుదామని చేసాను. టీచర్‌వి కదా సంతోషిస్తావని. ఎప్పుడు చూసినా ఒంట్లో బాలేదంటావు. ఏం కష్టపడిపోతున్నావక్కడ నువ్వు?. ఒక్కదానివి కాస్త వండుకు తినలేవా? పెద్ద వయసొచ్చాక కాస్త జాగ్రత్తగా తినాలి! ఏది బడితే అది తినకూడదు!’ అని కోప్పడ్డాడు. ఆ రోజు ఆ మాటలు వినగానే అప్పటిదాకా ఉన్న కాస్త ఆశా వదిలేసుకున్నాను.

ప్రపంచంలోని కొడుకులంతా ఇంతే! అన్న జ్ఞానోదయం కలిగింది. వెంటనే ఇల్లు ఖాళీ చేసేసి ఇంట్లో ఉన్న సామానూ, నా మెడలో ఉన్న కాస్త బంగారమూ అమ్మేసి, ఆ సొమ్మంతా నెలకింత వడ్డీ వచ్చేలా బ్యాంకులో వేసేసి ఇక్కడ జేరిపోయానండీ, పార్వతమ్మగారూ!” అందామె నవ్వుతూ. పార్వతమ్మ వసంత వైపు చూసింది ఎంత అన్యాయమో చూడు! అన్నట్టు.

“ఇక్కడ డెబ్భయ్యేళ్ళు దాటిన నాకు ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ ఉండే బాధలేదు. తోటివాళ్ళందరితో ఎంతో సందడిగా ఉంటుంది. అప్పుడప్పుడూ మీలాంటి వాళ్లొస్తూ ఉంటారు. ఏ అనారోగ్యం ఉన్నా వెంకటేశ్వరరావుగారు సొంత తమ్ముడిలా చూసుకుంటారు. రక్త సంబంధం, పిల్లలూ ఇవన్నీ వెర్రి భ్రమలు. పిచ్చి మాటలూ కదా?” అందామె, ఏమంటారు? అన్నట్టు. పార్వతమ్మ ఆమె భుజం తట్టింది “మంచి మాట చెప్పావు నాగమ్మా! లోకం అలాగే వుంది. వృద్ధాప్యం శాపంలా వుంది ఈ రోజుల్లో! ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఇంటిల్లిపాదికీ సలహాలు చెబుతూ తమ పెద్దరికం నిలబెట్టుకునేవారు. చిన్నవాళ్లు వాళ్ళని గౌరవించి వాళ్ళ అనుభవానికి విలువ ఇచ్చేవారు. ఈ కాలం బొత్తిగా బాగోలేదు. వయసయిపోయిన వాళ్ళు తమ బాధ పైకి చెప్పుకోలేక లోపల్లోపలే కుమిలిపోతారు. నువ్వు చదువుకున్నదానివి కాబట్టి ఇంత ధైర్యం చెయ్యగలిగావు” అంది మెచ్చుకోలుగా చూస్తూ.

“నెలకి నాకు ఏడెనిమిది వేలు వస్తాయి. అందుకే ఐదు వేలిస్తాను. మిగిలిన వాళ్ళు వాళ్ళకి లేక ఇవ్వలేరు. నాకున్నప్పుడు నేనివ్వాలి కదా!” అందామె ప్రకాశంగా ఇద్దరివైపూ చూస్తూ. ఇద్దరూ మంచి పని చేస్తున్నావు నిజం అన్నట్టు తలూపారు ప్రేమగా.

“మీ అబ్బాయికి ఈ సంగతి తెలిసిందా? తెలిస్తే వెంటనే పరిగెత్తుకుని రాలేదా?” అడిగింది పార్వతమ్మ

“తెలీకుండా ఉంటుందా? ఎవరో చెప్పే ఉంటారు. పరుగున రావలసిన అవసరం ఏముంది? అంత ముల్లె నా దగ్గర ఎలాగూ లేదు కాబట్టి పీడా పోయింది. మా అమ్మ పైకి పోయినా వాళ్లే చూసుకుంటారులే! అని ధీమా పడి ఉంటాడులేమ్మా” అందామె నవ్వుతూ.

వసంతా, పార్వతమ్మా నవ్వలేకపోయారు.

ఇంతలో వెంకటేశ్వరరావు గారు వచ్చి “వెళదామా హాల్‌కి వసంతా!” అనగానే ముగ్గురూ ఆయన వెనక నడిచారు.

మీటింగ్ హాల్‌లో అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. రామ్మారుతి గారు తన ప్రసంగం మొదలు పెట్టారు.

“అందరికీ నమస్కారం! అంతా కులాసాయే కదా?”

ఆడవాళ్ళందరూ తలలూపారు.మగవాళ్ళు ‘బావున్నాం!’ అన్నట్టు చేతులు పైకెత్తి ఊపారు.

“సంతోషం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ‘వృద్ధాప్యంలో సుఖ సంతోషాలు.’ వృద్ధాప్యంలో సుఖ సంతోషాలేముంటాయండి? నొప్పులూ, నీరసాలూ తప్ప! అనుకుంటున్నారు కదా మీరంతా! మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు తెలుసు. నేను చెప్పబోయేదంతా వింటే మీకు సుఖ సంతోషాలు గ్యారంటీ! నాది హామీ! ఇక విషయంలోకి వెళ్ళిపోతున్నాను.

ముందుగా మనమంతా ఒక పని చెయ్యాలి. వయసుతో నిమిత్తం లేకుండా మనసును యవ్వనంగా ఉంచుకోవాలి. అంటే ఎలాగో చెబుతాను. అమ్మో! అరవయ్యేళ్లొచ్చేశాయి! ఇంకేముంది? ముసలాళ్లం అయిపోయాం అని దిగులు పడకండి. ఇప్పుడు మనకి అనేక సుఖాలున్నాయి. పెద్ద పెద్ద బాధ్యతలూ, పిల్లల చదువులూ, ఉద్యోగాలూ, పెళ్ళిళ్ళూ లాంటి పెద్ద ప్రాజెక్ట్ లన్నీ పూర్తి చేసేసాము. హాయిగా టీవీలో పాత సినిమాలు చూసుకుందాం.

ఇకపోతే జుట్టూడిపోతోంది, మగాళ్ళకి బాధ. ఊడనివ్వండి. పూర్తిగా బట్టతల అయిపోయాక ఊడడం ఆగిపోతుంది. రోజూ నెత్తిమీద నుంచి నీళ్లు పోసుకుందాం. నిత్య తలస్నానం ఎంతో హాయిగా ఉంటుంది. ఇక ఆడవాళ్ళ సంగతి. అమ్మా! జుట్టు తెల్లబడితే బెంగ పడకండి. వదిలెయ్యండి ఆ విషయం. డై పాకెట్లు కొనడం, వేసుకుంటుంటే చేతులు లాగడం, పోనీ అని పార్లర్లకు వెళితే వాళ్ళు మన పర్స్ లోంచి వేలు లాగడం, అవసరమా? మనకి.

టీవీ సీరియళ్లు చూడండి. అత్తా కోడలూ పోటాపోటీ మీద ముస్తాబవుతారు. ఒకోసారి కోడలికంటే అత్తే చిన్నపిల్లలా కనబడుతుంది. పాపం శమించుగాక! అటువంటి ప్రమాదాలు జరక్కూడదంటే అత్తలు తెల్లజుట్టు ఉంచుకోవాలి!” అనగానే అంతా పడీ పడీ నవ్వారు. “అలా అని నేనా సీరియల్స్ చూస్తున్నాననుకునేరు! బైటినుంచి వస్తూనో, వెళుతూనో ఒక్క చూపు చూస్తానంతే సుమీ!

ఇక మరో సంగతి. అరవయ్యేళ్లు దాటాక మన ప్రవర్తన పరిణతి చెందినదిగా ఉండాలి. ఉబుసుపోని కబుర్లు మనం చెప్పకూడదు. మన చుట్టుపక్కల ఎవరూ చెప్పకుండా కూడా చూసుకోవాలి. ఇంకా ముఖ్యమైన సంగతి ఆత్మస్తుతీ, పరనిందా మానెయ్యాలి. నేను, నేను అన్న అహంకారం తగ్గించుకోవాలి. నేనింత నేనంత అన్న వివరాలు మర్చిపోవాలి. అసలు అరవయ్యేళ్లు దాటాక ఎంతో జీవితాన్ని చూసాం కదా! అన్న నిదానం రావాలి. అంటే మనం తగ్గాలి. మన కన్నా చిన్నవాళ్లు కుప్పిగంతులు వేస్తుంటారు. చూడాలి. గింజుకోకూడదు. ఓర్చుకోవాలి. కొన్నాళ్ళు పోయాక కాస్త వయసు పెరిగాక వాళ్ళూ తెలుసుకుంటారు. అంతవరకూ మనం ఓపిక పట్టాలి తప్ప వాళ్లతో తలపెడితే నష్టపోయేది మనమే.

అసలు తల్లితండ్రుల్నీ, అత్తమావల్నీ, మధ్యవయసులో ఉన్నవారు దయగా చూడాలి. అవసరమైతే వారికి సేవ చెయ్యాలి. అయితే, కొందరు వృద్ధులు, కోడలు ఎంతో బాగా చూస్తున్నా, ‘మమ్మల్ని చక్కగా, ప్రేమగా చూస్తున్నావమ్మా! దేవుడు నిన్నెప్పుడూ సంతోషంగా ఉంచుతాడమ్మా!’ అని దీవించడానికి వారికి నోరు రాదు. ‘చూడకేం చేస్తుందీ? చూడాల్సిందే!’ అని గర్వంతో విర్రవీగుతుంటారు. అది చాలా పొరపాటు. ఇతరులు మనకి చేస్తున్న సేవను, గుర్తించకపోవడమనేది చాలా తప్పు.

మరి కొందరు కోడళ్ళు, అత్తామావల్ని వృద్ధాప్యంలో చూడవలసిన బాధ్యతను తప్పించుకోవడం కోసం, వారితో కావాలని కయ్యం పెట్టుకుని, మాట్లాడడం మానేసి, ఆ వంక పెట్టి, వారి మానాన వారిని వదిలేస్తుంటారు. ఇదెంత అన్యాయమో చూడండి! ఆయా సందర్భాల్లో, భార్య వెనక మౌనంగా నిలబడే కొడుకుల్ని, ఏనాడో వేమన గారే చెదపురుగులతో పోల్చారు కదా! ఇంకా మనమెందుకు నోరు చేసుకోవడం!

భర్తనీ, పిల్లల్నీ అత్తామావల ఛాయలకు కూడా పోనివ్వని గృహిణీమణులను నేనెరుగుదునమ్మా! వాళ్ళు చక్కగా పట్టుచీర ధరించి, పూలసజ్జలు చేతబట్టి గుళ్ళకి వస్తూ ఉంటారమ్మా! ఒక్కసారి, ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుంటే చాలమ్మా! ఎవరి లోపాలు వారికే తెలుస్తాయి. వాటిని సరిదిద్దుకుంటూ పోవాలంతే!

ఈ జీవితం అంటే ఒక ఆట. అప్పుడప్పుడూ ఎవరో ఒకరు అవుట్ అయ్యి, మన మధ్య నుంచి మాయమవుతూ ఉంటారు. కానీ ఆట ఆగదు. ఆడాల్సిందే! అందుకేనమ్మా! నిజమైన వైరాగ్యం తెచ్చుకోవాలి. ఆధ్యాత్మిక చింతనలో పడాలి. మొక్కుబడి పూజలు వద్దమ్మా! ఏదో ఆలోచిస్తూ రామకోటి రాయకండి. భగవానుని ధ్యానిస్తూ రాయండి! ఇంకా కుందుల్లో ఎన్ని వత్తులు వెయ్యాలి? ఏ నూనెతో దీపం పెట్టాలి? ఏ దిక్కుకి తిరిగి కూర్చోవాలి? లాంటి చిన్న చిన్న సందేహాలతో కొట్టుమిట్టాడకండి. అవన్నీ ప్రారంభపు ఓనమాలు. వాటిని దాటేసి ముందుకు వెళ్ళిపోదాం. భగవద్విషయచింతన వల్ల నువ్వెంత ఎదిగావు? అన్నదొక్కటే కొలమానం. మిగిలినవన్నీ పిల్లాటలే!

అసలు మొదటగా మన ఆలోచనల్లో ‘అందరూ మనవారే! అంతా మంచివారే!’ అనుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి. మాటల్లో విద్వేషపు తుంపర్లు రాకుండా చూసుకోవాలి. ‘జగమంతా ప్రేమమయం’ అన్నమాట గుర్తుంచుకుని చక్కని మాటలతో, ప్రేమ నారు నాటాలి. మనం ఈ భూమ్మీదకి వచ్చిన బాటసారులం అన్న చిన్న ఎరుక ఉంటే చాలు. అదే వైరాగ్యం. అదే మనల్ని ఒడ్డుకి చేర్చేస్తుంది.

ప్రాయం పడమటి దిశకు మళ్ళాక అంటే ఓ డెబ్భై ఏళ్ళు దాటాక మౌనాన్ని ఆశ్రయించాలి. లోపలి వెలుగు కోసం ప్రయత్నించాలి. ఒకే పరమాత్మ అందరిలో వెలిగే ప్రకాశం. అంతఃకరణమనే అద్దం మీద మద మాత్సర్యాలూ, కామక్రోధాలూ మాలిన్యాలూ తొలగించుకుని, ఆ లోపలి వెలుగుని దర్శించి అదే నీ అసలు మార్గం అని గ్రహించాలి. నీవూ, నేనూ అనే భేదాలు లేని నిత్యానంద స్థితిని చేరడం, మనిషి జన్మకు పరమ గమ్యం. వైరాగ్యం ఒక్క ప్రసంగంతోనో, ఒక్క మంత్రం తోనో వచ్చెయ్యదు. అభ్యాసం ద్వారా దాన్ని సాధించాలి. అది పొందాలంటే మనం బండగానూ, మొండిగానూ ఉండాలి. వెనక్కి జారకూడదు జారుడుబండ మీద జారినట్టు. వైరాగ్యం పాయింటును గట్టిగా ఉడుంపట్టులా పట్టుకోవాలి. ఇంక దిగకూడదు.

ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండమ్మా! మా హైస్కూల్‌లో ప్రార్థన సమయంలో రోజుకో మంచి ఇంగ్లీష్ వాక్యం చెబుతూ ఉండేవారు. వాటిల్లో ఒకటి, ‘వయసులో ఉన్నప్పుడు పొదుపు చేసుకోండి, వృద్ధాప్యంలో ఖర్చు పెట్టుకోవడానికి’ అని. ఎందుకంటే వృద్ధాప్యంలో డబ్బులు ఎక్కువ అవసరం. మనకి ఎవరూ అప్పులు ఇవ్వరు. మనం తినే తిండికన్నా మందుల ఖర్చు ఎక్కువగా ఉంటుందమ్మా! అందుకు తగిన విధంగా ప్రవర్తించండి.

డబ్బు విషయంలో కొంచెం స్వార్ధంగానే ఉండాలి. పిల్లల దయా దాక్షిణ్యాలపై ఆధారపడకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. వీలయినంతవరకూ ఆడంబరాలు లేని సామాన్య జీవితం గడపాలి. కొత్త కొత్త సుఖాలు మనల్నిఆకర్షించి జీవితంపై మోహాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మిక పంథా ఎంచుకోవాలి. దైవ భక్తి పెంపొందించుకోవాలి. ఎమోషన్స్‌ని అదుపులో పెట్టుకోవాలి. అంటే కూతుళ్ళ మీద అధిక వ్యామోహం, కోడళ్ళమీద అసహనం, అధికారం వదిలెయ్యాలి.

ఆర్థిక విషయం మాట వచ్చింది గనక ఒక ముఖ్యమైన మాటొకటి చెబుతున్నానండీ, దయచేసి మరొకలా అనుకోవద్దు. బాగా ఆస్తులూ, ఉద్యోగాలూ ఉన్న స్త్రీలని పక్కకి పెడదాం. ఎందుకంటే వారికి ఆర్థిక స్వాత్రంత్ర్యం ఉంది. అలా కాక గృహిణులుగా ఉన్న స్త్రీల గురించి చెబుతున్నాను. వారి భర్తలు కాలం బాగోక వెళ్ళిపోతే నా తర్వాత నా భార్య ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, పిల్లల వెనక నిస్సహాయంగా నిలబడిపోకుండా ఉండే విధంగా, తగిన ఏర్పాట్లు చెయ్యవలసిన బాధ్యత ప్రతి భర్తకీ ఉందండి. ఆ విషయమై భర్తలు కాస్త ఆలోచించాలని నా అభ్యర్థన.

ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిత్యం ఎక్కువ నీళ్లు తాగడం, తేలికపాటి ఆహరం తీసుకోవడం మంచిది. వీలయితే పళ్ళు తినండి. ఉదయం, సాయంత్రం కాస్త వీలైనంత దూరం నడవడం మంచిది. దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

తాపత్రయాలు పడడం మానెయ్యాలి. అంటే మనల్ని మనం లిమిట్ చేసుకోవాలి. అబ్బా! అన్నీ వీళ్ళకే కావాలి అనిపించుకోకూడదు. మనకి చెప్పాలనిపిస్తే వాళ్లే చెబుతారు. అప్పుడు అడిగితే సలహా ఇవ్వాలి తప్ప ప్రాణం ఒప్పదండీ చెప్పకపోతే ఎలాగా? అంటూ తగుదునమ్మా! అని అన్నిట్లో దూరిపోతే భంగపాటు తప్పదు.

మూలనున్న ముసలమ్మలని చూడండి. వాళ్లే నిజమైన హీరోయిన్లు. ఒకప్పుడు వాళ్ళు కుటుంబానికి మూలస్థంభాలై సంసారాన్ని నిలబెట్టిన వాళ్లే. ఇప్పుడు వాళ్ళు గోడకి ఆనుకుని మౌనంగా వత్తులు చేస్తున్నారంటే వాళ్ళకి ఏమీ తెలీదనీ, మనమే పెద్ద పోటుగాళ్ళమనీ అనుకుంటే మనంత మూర్ఖులు మరొకరుండరు. వాళ్ళలా ఉన్నారంటే, తమ హద్దులెఱిఁగి ప్రవర్తిస్తున్నారన్నమాట. వేళకింత తింటూ, వాళ్ళు చేయదగ్గ పని చెబితే చేసిపెడుతూ నిమ్మళంగా ఉంటున్నారంటే, వారిదీ పరిణతి అంటే. రాత్రంతా కూర్చుని టీవీ చూడద్దన్నారనీ, మెచ్చుకుని దండ వెయ్యలేదనీ, పరీక్ష ఫెయిల్ అవ్వగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు. ఒక్క మూలన ఉండే ముసలమ్మ ఆత్మహత్య చేసుకోగా విన్నారా! కన్నారా! మీరెవరైనా? అదీ తాత్వికత అంటే. జీవితాన్ని అర్థం చేసుకోవడం అంటే అదీ! అంతే గానీ గొప్ప వేదాంత గ్రంథాలకు సమీక్ష రాసి, నాకు గుర్తింపు రాలేదనీ, నన్నెవరూ గౌరవించడం లేదనీ ఏడవడం కాదు.”

(సశేషం)

Exit mobile version