మలిసంజ కెంజాయ! -16

5
2

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[చెప్పిన సమయానికి విశాల ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు మాధవ. ఎవరో తెలీని మహిళ తలుపు తీస్తుంది. ఇది విశాల ఇల్లు కాదా అని అడిగితే, తాను విశాల స్నేహితురాలు సుమిత్రనని, లోపలికి రమ్మని పిలుస్తుందామె. లోపలికి వెళ్ళిన మాధవని పలకరిస్తుంది విశాల. తాను తీసుకువెళ్ళిన స్వీట్ బాక్స్ అక్కడి బల్ల మీద పెట్టి విశాల కేసి చూస్తాడు. నిర్మలమైన ఆమె రూపం, చిరునవ్వు మాధవకి ఉల్లాసం కలిగిస్తాయి. సుమిత్ర ముగ్గురికీ టీ తెస్తుంది. సుమిత్రని పరిచయం చేస్తుంది విశాల. మాధవ మాటిమాటికి లోపలి బెడ్ రూమ్‌లో ఎవరైనా ఉన్నారా అని చూస్తుంటే, విశాలకి అర్థమయి, తాను సహజీవనం చేసేది సుమిత్రతోనే అని చెబుతుంది. ముగ్గురు అనేక విషయాలు మాట్లాడుకుంటారు. మాధవ సూపర్ మార్కెట్ బిజినెస్ గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుంటారు వాళ్ళిద్దరూ. మరి కాసేపు మాట్లాడి సెలవు తీసుకుంటాడు మాధవ. ఆశ్రమంలో రామ్మారుతి గారి ప్రసంగం ఉందంటే బయల్దేరుతారు వసంత, పార్వతమ్మ. కొత్త ఆటో ఎక్కినందువల్ల, అతను చాలా తొందరగా తీసుకెళ్ళి దింపేస్తాడు. అప్పటికి ఇంకా ఎవరూ రాకపోతే, ఆఫీసు గదిలోకి వెళ్ళి వెంకటేశ్వరరావు గారిని పలకరిస్తారు. అప్పుడాయన నాగమణి అని ఆవిడతో మాట్లాడుతూంటారు. ఆవిడని వీళ్ళకి పరిచయం చేసి, కాసేపు మాట్లాడుండమని ఆయన బయటకి వస్తారు. నాగమణి తన గురించి వసంతకీ, పార్వతమ్మకీ చెబుతుంది. తనని కొడుకు ఎలా నిరాదరించినది చెప్పి, ఇక్కడైతే తోటివాళ్ళు ఉంటారనీ, వెంకటేశ్వరరావు గారు ఓ తమ్ముడిలా చూసుకుంటారని వచ్చేశానని చెబుతుంది. తన కొచ్చే పెన్షన్ నుంచి ఓ ఐదువేలు నెల నెలా ఆశ్రమానికి ఇస్తున్నానని చెబుతుంది. ఇంతలో రామ్మారుతి గారు రావడంతో, హాల్లోకి వెడతారు. రామ్మారుతి గారు తన ప్రసంగంలో వృద్ధులకి జీవన విధానంలో అనుసరించివలసిన కొన్ని సూచనలు చెప్తారు. ఇక చదవండి.]

“ఇకపోతే చాదస్తం. ఒక విషయం గురించి ఒకసారి చర్చించి దాని మీద సలహా ఇచ్చి వదిలెయ్యాలి. అంతే! అక్కడితో ఆ విషయం మర్చిపోవాలి. మనకి ప్రేముంటుంది. వీళ్ళు మర్చిపోతారేమో మరోసారి జాగ్రత్త చెబుదాం అని. అలా అని మళ్ళీ మళ్ళీ అదే సలహా చెప్పకూడదు. చెబితే ఏమవుతుంది అంటారా? మనకి  చాదస్తం సుబ్బారావు అనో సుబ్బమ్మ అనో బిరుదిస్తారు. ఏ ‘పద్మశ్రీ’ అనో, ‘కళారత్న’ అనో ఇస్తే బావుంటుంది కానీ ఈ చాదస్తం అనే మాట మన పేరుకి ముందు పెడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే చాలు, ఇంకెప్పుడూ మీరు చెప్పిందే చెప్పి ఇతరులని విసిగించరు.

మరొక్క విషయం ఆవేశకావేషాలు, కోపోద్రేకాలు పడే వయసు దాటిపోయిందని మర్చిపోయి వాడలా కూశాట్ట. కనబడనీ  కడిగి పారేస్తా! ఈవిడిలా వాగిందిట. ఫోన్ చేసి దులిపి పారేస్తా! ఇలాంటివన్నీ వ్యర్థపు ఆలోచనలు. మన రక్తపోటును పెంచే ప్రమాదాలు. ఆవేశంలో మాట జారటం, ఆ తర్వాత మాట పడటం! ఎవరిమీదో పక్కింటావిడకి పితూరీలు చెప్పడం, ఆ మహాతల్లి వెళ్లి ఆ మాట అసలు వాళ్ళకి చేరెయ్యడం, వాళ్ళు ఇంటిమీదికొచ్చి నిలదీయడం, సాక్ష్యాలూ, తీర్పులూ, ఇంట్లోనే కోర్టులూ, బుకాయింపులూనూ. ఎంత అల్లరీ! ఎంత అవమానం? ఇవన్నీ ఈ వయసులో మనకి అవసరమా! ఒక్కసారి ఆలోచించుకుందామమ్మా! నోరు అదుపు చేసుకుందాం.

అసలు వృద్ధాప్యంలో అహం, గర్వం పోవాలి, వినయం, విచక్షణ రావాలి. నాకు కావాలీ అంటే అశాంతే! నాకేమీ వద్దు అనుకుంటే అంతా శాంతే! శరీరానికి శక్తి పోతుంది. అందం పోతుంది. అది ప్రకృతి పరిణామ క్రమం, పువ్వు పూస్తుంది. వాడిపోయి రాలిపోతుంది. వచ్చిన ప్రతిదీ వెళ్ళిపోతుంది. ప్రతి దానికీ ఒక ఎక్ప్‌పైరీ డేట్ ఉంటుంది. మనం కూడా ఒకరోజు ఖర్చైపోతాం. అది సినిమా భాష. భూమి మీద నుండి నిష్క్రమిస్తాం, ఇది పండిత భాష.

అటువంటి ఎరుక వచ్చేసిందనుకోండి. అప్పుడు మనం దాన్ని ఆహ్వానిస్తాం. తయారుగా ఉంటాం. మమకారాల్నీ, రాగాల్నీ, మోహాల్నీ వదులుకుంటాం. ఆ దిశగా ప్రయాణం సాగిస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. దిగుళ్ళుండవు. మనసుకు గొప్ప స్తిమితంగా ఉంటుంది. దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఈ సూత్రాలన్నీ పాటించొచ్చు. నమ్మే వాళ్లకు మరికాస్త వెసులుబాటు ఉంటుంది. ఎలా అంటే రోజూ కాసిని పువ్వులు తెచ్చుకుని (గోడ మీద నుంచి పక్కింటి వారి చెట్ల నుంచి తెంపకండి దయచేసి. నిత్యం నీళ్లు పోసి కష్టపడి, పెంచుకుంటున్న వారి మనసు క్షోభ పెట్టకండి) పూజ చేసుకుంటూ, వచ్చిన స్తోత్రాలు చదువుకుంటూ ధ్యానం చేసుకోండి. రామాయణ భారత భాగవతాది గ్రంథాలు అందరిళ్లలోనూ ఉంటాయి. ఎవరూ చదవరు. వాళ్ళని కాస్త బతిమాలి తెచ్చుకుని చదివి ఇచ్చెయ్యండి. అప్పుడు వాళ్ళు కూడా చదవడం ప్రారంభిస్తారు. మీకు అదో పుణ్యం. సరే! పాప పుణ్యాలు లేవని అనే మేధావులుండొచ్చు. వాళ్ళు మనశ్శాంతి కోసమైనా ఆటవిడుపుగా  పుస్తకాలు చదవొచ్చునమ్మా! ప్రయత్నించండి దయచేసి.

ఇకపోతే ఆరోగ్యం గురించి. జాగ్రత్తగానే ఉండాలి. కానీ అతిగా ఆలోచించకూడదు. ఎవరు ఫోన్ చేసినా మన అనారోగ్యం గురించి అదే పనిగా రికార్డు వేసినట్టు చెప్పామనుకోండి. వాళ్లింక మనకి ఫోన్ చెయ్యడం మానేస్తారు జాగ్రత్త! నాక్కూడా కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. వాటితో మందులనే  ఆయుధాల సాయంతో పోరాటం చేస్తుంటాను.

అరవై ఏళ్ళు, ఈ మిషన్ బాగానే పని చేసింది. ఇప్పుడిప్పుడే కాస్త రిపేర్లు అవసరం అవుతున్నాయి. పళ్ళూ, కళ్ళూ, ఒకోసారి గుండె కూడా ట్రబుల్ ఇస్తుంది. మంచి మందులున్నాయి. వేలు వేలుకీ, కీలు కీలుకీ ఒకో నిపుణుడు ఉంటున్నాడు. బాగు చేస్తారు కాబట్టి భయం వద్దు. ఇంకా మనం అదృష్టవంతులం. తల్లితండ్రులు మనకిచ్చిన శరీరాలు మంచివి, బాగా పనిచేస్తున్నాయి. అందుకు వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి. మన తర్వాత తరానికి అన్నీ నెప్పులే. అరవై ఏళ్ల అత్తకీ, ముప్పై ఏళ్ల కోడలికీ నడుం నొప్పే! పాత గ్రైండర్లు, ఫ్రిజ్‌లూ కొత్త వాటికన్నా బాగా పని చేస్తాయి కదా! అలాగన్నమాట. అంచేత ధైర్యంగా ఉందామమ్మా!

మరొక్క మాట. ఇలా నేను మీకు ఏవేవో నీతులు చెప్పేస్తున్నానని అపార్థం చేసుకోకండి. నేను చర్చించే విషయాలు నాక్కూడా వర్తిస్తాయమ్మా! నేను కూడా నిత్యం సాధన చేస్తూనే ఉంటానమ్మా! ఇకపోతే ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారని చెప్పి, మానసిక నిపుణుల దగ్గరికి తీసుకెళ్లి వేలకి వేలు సమర్పించుకుంటున్నారు పిల్లలు. మన జీవితాన్ని అదుపు చేసుకోవడం రాకపోతే మనం పిల్లలకి బరువవుతాము. అందుకు ఇదొక ఉదాహరణ.

‘మారుతి గారూ! మీరు ఎంతసేపూ వృద్ధులకు యువతతో  ఎలా ప్రవర్తించాలో, సర్దుకుపోవాలో  బోధలు చేస్తారు కానీ వాళ్ళకి తల్లితండ్రుల పట్ల గల బాధ్యత గురించి ఏమీ చెప్పరు’ అంటూ కొంతమంది నన్ను నిలదీస్తూ ఉంటారు. వారికి కూడా చెబుతున్నాం బాబూ! ఆధునిక యువతీ యువకులు తిరిగే దారులు వెతికి, ‘యూ’ ట్యూబుల్లో, వాట్సాప్పుల్లో అనేక ప్రవచనాలను ఆడియో, వీడియోలలో పంపుతున్నారు పుణ్యాత్ములు కొందరు. వాణిజ్య రేడియో స్టేషన్ ప్రసారాల్లోనూ పాటల మధ్య పెద్దలు చెప్పిన నాలుగు మంచి మాటలు అందజేస్తున్నారు. ఉదయాన్నే పండితులు చెప్పిన రామాయణ, భారతాలు ప్రసారం చేస్తున్నారు. అవి విన్నవారు తప్పక సన్మార్గం పడతారు. వారిని చూసి మిగిలినవాళ్లు అనుసరిస్తారని గీత సాక్షిగా ఆశ పడదామమ్మా! అంతకు మించి మన చేతిలో ఏమీ లేదమ్మా! స్వస్తి” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మారుతిగారు.

ఇంటికి తిరిగి ఆటోలో వెళుతుంటే పార్వతమ్మ అంది. “ఈ మారుతి గారు ఏం చెప్పినా తల తిప్పకుండా వినాలనిపిస్తుంది కదా!”

“అవును పిన్నీ! చాలా క్లిష్టమైన సంగతుల్ని కూడా హాస్యంగా మార్చి చెబుతారు అందుకే మనకి వినడానికి సరదాగా ఉంటుంది. అందుకే  బాగా అర్థం అవుతాయి. ఆయన చెప్పినవి ఆచరించాలనిపిస్తుంది” అంది వసంత. అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ ఇల్లు చేరారు.

***

అలవాటుగా, సాయంత్రం నాలుగున్నరకి ఆ రోజు పార్క్‌కి వెళ్ళింది వసంత. ఓ ఇరవై నిమిషాలు చకచకా నడిచాక కాస్త అలసట అనిపించి ఒక బెంచ్ మీద కూర్చుంది. నీరెండ వీపుపై పడి హాయిగా ఉంది. పక్కనే ఉన్న బెంచ్ పై ఒక మహిళ ఎదురుగా జారుడు బండపై ఆడుకుంటున్న ఐదారేళ్ళ మనవడిని చూస్తూ కూర్చుంది. మొహం మీద నీరెండ పడడంతో ఆమె మొహం చిట్లించి పెట్టుకుంది. ఇంతలో ఆ కుర్రాడు పైనుంచి జారుతూ ఆఖర్న కాస్త పక్కకి పడ్డాడు. అక్కడున్న చెట్టుకొమ్మ పిక్కపై తగలడంతో ఒక్కసారిగా ఏడుపు రాగం అందుకున్నాడు. ఆవిడతో పాటు వసంత కూడా పరుగున వెళ్లి చూసింది. కొంచెం కొమ్మ గీరుకుంది. అక్కడ కొన్ని గీతలు పడి చర్మం ఎర్రగా కందింది, అంతే! దానికే వాడు కాలు విరిగిపోయిందన్నట్టుగా గుక్క పట్టి ఏడుస్తున్నాడు.

ఆవిడ బెంబేలు పడిపోతోంది. “ఫర్వాలేదు లెండి. పెద్ద దెబ్బ కాదు. రక్తం కూడా రావడం లేదు లెండి” అంది వసంత. ఆ పిల్లాడు ఏడుపు ఆపడం లేదు. ఆవిడ బిక్కమొహం వేసుకుంది. “ఓ పని చేద్దాం! రండి! ఈ పక్కనే మా ఇల్లు” అంటూ వాళ్ళిద్దరినీ తన ఇంటికి తీసుకొచ్చింది. మొక్కల మధ్య నున్న పంపు దగ్గరికి తీసుకెళ్లి కాస్త వాడి కాలు కడిగించి, కటకటాల్లో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది. మరో కుర్చీలో ఆవిడని కూర్చోమని చెప్పి లోపలి వెళ్లి ఇద్దరికీ కాసిని మంచినీళ్ళిచ్చి వాడి కాలు మీద దెబ్బతగిలిన చోట దూదితో తుడిచి నెబాసెల్ఫ్ పవుడర్ వేసాక వాడు కాస్త తెప్పరిల్లాడు. మళ్ళీ ఇంట్లోకి వెళ్లి ఒక చిన్న క్యాడ్బరీ చాకోలెట్ తెచ్చి ఇవ్వగానే, చటుక్కున ఏడుపు మర్చిపోయి, తినే పనిలో పడ్డాడు.

“మీరెక్కడుంటారు? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు పార్కులో?” అంది వసంత.

“మా రెండో అబ్బాయికి కాకినాడ బ్యాంకు నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఇక్కడికి ఈ మధ్యనే వచ్చామండి”

“ఓహో! మీరెక్కడుంటారు?”

“ముగ్గురు కొడుకుల దగ్గరా ఉంటానండి. మా ఆయన రెండేళ్లక్రితం పోయారండి. పిల్లల్ని చదివించాలన్న ధ్యాసే కానీ వాళ్ళు రెక్కలొచ్చి వెళ్ళిపోయాక ఎలా బతకాలీ? అని ఆలోచించలేదండి, మేమిద్దరం! ఇప్పుడు నిలబడడానికి నాకిల్లు లేదు.ఒక్క రూపాయీ లేదు. అందుకే మూడు చోట్లా తిరుగుతూ..” అంటూ ఆవిడ మాట ఆపేసి లేచిపోబోయింది.

“ఒక్క నిమిషం కూర్చోండి. ఏమీ అనుకోకండి. నేనూ మీ వయసుదాన్నే! మిమ్మల్ని మీరిలా తక్కువ చేసుకోకండి. మీది మీ మనవల వయసే అనుకోండి. వాళ్ళ వెనకే తిరుగుతూ, వాళ్లతో ఆడుకోండి. ఇవన్నీ మర్చిపోండి. మనసప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మీ కొడుకులేగా! పైవాళ్ళు కాదు కదా! ఎంతో మంది పిల్లలు దగ్గర లేక ఒంటరిగా వండుకు తింటూనో, ఆశ్రమాల్లో ఉంటూనో ఉంటారు. మీరదృష్టవంతులు. మీ అబ్బాయిలు చక్కగా మిమ్మలి దగ్గరుంచుకున్నారు.”

వసంత చెప్పిన ఈ మాట ఆవిడకెందుకో ఊరట కలిగించింది. మొహం పై కాస్త చిరునవ్వు వచ్చింది. “మీరు చెప్పింది కూడా నిజమేలెండి. పిల్లలు నన్ను వదిలిపెట్టరు. అంత వరకూ అదృష్టమే. ఉంటానండి! ఒక్క మాటతో చాలా ధైర్యం ఇచ్చారు” అంటూ పిల్లాడిని తీసుకుని బయలుదేరుతూ దిగులు తగ్గిన మొహంతో వసంత వైపు కృతజ్ఞతగా చూసిందామె. వసంత చెయ్యి ఊపుతూ గేట్ దగ్గర నిలబడింది.

ఒక రోజు వసంత బీరువా సర్దుతూ ఉంటే ఫోన్ నంబర్స్ ఉన్న ఒక చిన్న పుస్తకం కనబడింది. అందులో ముందుగా  కనబడింది సుగుణ నెంబర్. ఆమె వసంత కన్నా ఐదారేళ్లు పెద్దది. అక్క వరుస. సుగుణ తల్లీ, వసంత తల్లీ అక్కాచెల్లెళ్ల పిల్లలు. వసంత ఊరే! సుగుణ పెళ్లయ్యాక భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళిపోయింది కాపురానికి.

‘ఎలా ఉందో సుగుణ? దాదాపు దశాబ్దం అయ్యింది మాట్లాడి. ఆ నంబర్లో ఉందో లేదో? ట్రై చేసి చూస్తే ఏం పోయింది!’ అనుకుంటూ ఫోన్ చేసింది. వసంత గొంతు వినగానే గుర్తుపట్టేసింది సుగుణ “ఓ నా వసంతం!” అంటూ అరిచింది. కుశల ప్రశ్నలయ్యాక “నీ పిల్లలెక్కడే?” అడిగింది సుగుణ. “అమ్మాయి ఊర్లోనే, అబ్బాయి బెంగుళూర్‌లో” అని వివరం చెప్పింది వసంత.

“నీ సంగతి చెప్పక్కా? హ్యాపీగా ఉన్నావా? బావ బాగున్నారా? పిల్లలిద్దరూ అమెరికాలో హాయిగా సెటిల్ అయ్యినట్టున్నారు కదా! ఇంకేం కావాలి మీకు?” అంది ప్రేమగా వసంత.

“అడిగావు కాబట్టి చెబుతాను. పనుందా? లేకపోతే కూర్చో తీరిగ్గా” అంది సుగుణ.

“తీరికేలే చెప్పు”

“మీ బావ బావున్నారులే! మా అమ్మాయీ, అబ్బాయీ అమెరికా నుంచి రోజూ వీడియో కాల్‌లో  ఫ్యామిలీతో పనులు చేసుకుంటూ దర్శనం ఇస్తారు. ఏదైనా చెప్పబోతే ఫోన్ చేస్తాం అంటారు. చెయ్యనే చెయ్యరు. ఓ వారం తర్వాత మనం చెప్పాల్సిన సంగతేదో మర్చిపోతాం. ఏటా ఓ నెల ఇండియా వస్తారు. మాకు కూడా కొన్ని చాకోలెట్లూ, కొన్ని షుగర్ లేని బిస్కట్లూ, కాసిని డ్రై ఫ్రూట్స్, కొన్ని కాల్షియం టాబిలెట్లూ తెస్తారు.

వాళ్ళొచ్చేముందు మనకి ఒక వారం పనుల హడావిడి మొదలవుతుంది. ఇక వాళ్ళు వచ్చిన దగ్గరినుంచీ రోజులు క్షణాల్లా గడిచిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రాం అలా వేసుకుని వస్తారు. రాగానే పిల్లల్ని మా దగ్గర వదిలేసి ఇష్టమైన సిటీలకి మిత్రులతో కలిసి వెళతారు. ఆ పిల్లలు మనతో మాలిమి లేక ఇబ్బంది పెడతారు. మా పిల్లలకి వాళ్ళ  పిల్లలంటే వల్లమాలిన ప్రేమ! పిచ్చి గారాబాలు! వాళ్ళు మాట్లాడుతుంటే మనం మాట్లాడకూడదు. వాళ్ళని రాజకుమారుల్లా, రాజకుమార్తెల్లా చూడాలి. మనం ఆయాల్లా నిలబడాలి. ఏమీ అనకూడదు. పిల్లలకి బొత్తిగా భయం ఉండదు. అలాగే పెంచాలిట. మనం అంత బాగా పెంచలేదట వాళ్ళని! భయం చెప్పేవాళ్ళమట, అది పెద్ద తప్పట! తిరిగి వచ్చాక అత్తగారింటికి వెళ్లి, ఓ రెండు రోజులుంటారు. ఈలోగా మనం ఇడ్లీపిండీ, దోశలపిండీ, చట్నీలు రుబ్బుకోవడానికి టైం ఇస్తారన్న మాట.

మళ్ళీ వచ్చాక మిత్రుల ఇళ్ళకి పోతారు. ఆ తర్వాత షాపింగ్‌లకి పోయి బట్టలూ, బంగారు నగలూ   కొనుక్కుంటారు. అమ్మాయీ, కోడలూ ఆ తర్వాత టైలర్ చుట్టూ తిరుగుతుంటారు. నేనిక్కడ మనిషిని పెట్టుకుని వంటలు చేసి కూర్చుంటే బైట తినేసి వస్తారు. ఆ పిల్లలేమో మన వంటలు నచ్చలేదంటారు. అప్పుడు ఆన్‌లైన్‌లో తెప్పించుకుని తింటారు. వండుకున్నవన్నీ ఫ్రిజ్ లో దాచలేక, తినలేక మనకి బాధ.

వచ్చిన దగ్గరినుంచీ ఏక తిరగడమే! మనతో గడిపేది ఉండదు! అందువల్ల మన అనారోగ్యాల మీద వాళ్ళకి అవగాహనా ఉండదు! ఈ సందట్లో మనకి ఆరోగ్యం బాగాలేదంటే గబగబా మనకేవేవో టెస్ట్‌లు చేయించేసి మందులు కొనిచ్చేసి బోలెడన్ని జాగ్రత్తలు  చెప్పేసి చేతులు దులుపుకుంటారు. వెళ్లే రోజులు దగ్గర పడేసరికి అమెరికాలో ఉండే మిత్రుల ఇళ్ళకి వెళ్లి, వీళ్ళు తెచ్చినవి వాళ్ళ కిచ్చి, వాళ్ళిచ్చే పచ్చళ్ళు తెచ్చుకుంటారు. దానికో రెండు మూడురోజులు పెట్టుకుంటారు” అని ఆగింది సుగుణ.

“బావుందక్కా! అలా ఏడిపిస్తున్నారన్నమాట నీ పిల్లలు!” అని నవ్వింది వసంత.

“నువ్వదృష్టవంతురాలివే వసంతా! ఊర్లోనే పిలిస్తే పలికే కూతురు, బెంగుళూర్‌లో కొడుకు. హాయి పని నీది!” అంది సుగుణ.

“మీరిద్దరూ అమెరికా ఎప్పుడూ వెళ్లలేదా?”

“ఎందుకు వెళ్ళలేదూ? పురుళ్ళకి కొన్ని సార్లూ, పిల్లల చిన్నప్పుడు దగ్గరుండడానికి కొన్నిసార్లూ ఇలా చాలా సార్లు తిరిగాం లే. అక్కడ ప్రదేశాలన్నీ చూశాం. ఇప్పుడు వెళ్లే ఓపిక పోయింది. అన్నేసి గంటల ప్రయాణం అంటే వణుకొస్తుంది. పిల్లలూ పెద్దవాళ్లయ్యారులే!

ఏటా వీళ్ళు వచ్చేసరికి రూంలు రెడీ పెట్టాలి. ఇంకా చాలా చాలా రెడీ పెట్టాలి. అనకూడదు కానీ మా పని గెస్ట్ హౌస్‌లో ఉండే వాచ్‌మనూ, అతని భార్యాలా ఉంటుంది. పోలో మంటూ వచ్చి మమ్మల్ని ఒక్క ఊపు ఊపేసి వెళ్ళిపోతారు. పిల్లలు వచ్చారంటే వాళ్లతో ఎన్నో సంగతులు మాట్లాడాలనీ, మన బంధువుల గురించి చెప్పాలనీ ఉంటుంది. ఫోన్‌లో చెప్పుకోలేని విషయాలు ఎదురుగా చెబుతాం కదా. ఏదీ? వాళ్ళసలు మన పక్కన కూర్చుంటే కదా! వచ్చిన దగ్గరుంచీ ఉరుకులూ పరుగులే!”

“మీరెప్పుడూ వాళ్ళని మన దేశానికి తిరిగి వచ్చెయ్యమని అడగలేదా?”

“మా బాగా అడిగావు! మీ బావకి పిల్లలు అమెరికా వెళ్లి బాగా సంపాదించేసుకోవాలని అత్యాశ. ఎప్పుడూ రమ్మని అడిగేవారు కాదు. ఇంకిప్పుడు అడగడానికి ఆయనకి మొహం చెల్లదు. నేనెప్పుడూ అడిగేదాన్ని  ‘ఇంక చాలర్రా! సంపాదనకి అంతేముంది? వచ్చెయ్యండి’ అని. అప్పుడు కొడుకు నడిగితే కోడల్ని అడగమని, కూతుర్ని అడిగితే అల్లుడిని అడగమనీ నవ్వేసేవారు. ఇప్పుడు పిల్లలు పెద్దయిపోతున్నారు. వాళ్ళకి మంచి చదువు అక్కడే ఉంది అంటున్నారు.

ఇదీ పరిస్థితి. మీకేం మీ పిల్లలిద్దరూ అమెరికా అంటకదా అంటారు! ఇప్పుడు  కాస్త ఆరోగ్యంగా ఉన్నాం సరే. రేపు ఇంకాస్త వంగిపోతే, మా పరిస్థితి ఏంటి అని మా బాధ వసంతా!”

“నువ్వు ఎక్కువ అలోచించి బెంగపెట్టుకోకక్కా! కొన్నాళ్ళయ్యాకా వాళ్ళు ఇండియా వచ్చేయొచ్చులే!”

“ఏం రావడమో! చూస్తున్నాం కదా! వెళ్లిన వాళ్ళెవరైనా తిరిగి వచ్చిన దాఖలా ఉందా? కళ్ళ ముందు కనబడుతూనే ఉంటోంది కదా సినిమా! ఐస్ బాక్సుల్లో శరీరాల్ని పిల్లల కోసం దాచిపెట్టడం?” ఆవేశంగా అందామె.

“లేనిపోనివి ఊహించుకోకక్కా! నువ్వెంతో భక్తురాలివి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీ ఇద్దరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి డెబ్భై ఏళ్ళ వయసంటే పెద్దవయసు కాదు” అంటూ మరి కొంతసేపు సుగుణకు ధైర్యం చెప్పి, “నేను మళ్ళీ వీలుచూసుకుని ఫోన్ చేస్తానక్కా! బావను అడిగానని చెప్పు” అని ఫోన్ పెట్టేసింది వసంత.

***

ఒకరోజు పార్వతమ్మ కాఫీ తాగి తీరిగ్గా కూర్చుని ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. వెంటనే ఎత్తింది. పెద్ద కోడలు. “నేనత్తయ్యా! లీలని. ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం బావుందా? బీపీ, షుగర్ కంట్రోల్లో ఉన్నాయా? టాబ్లెట్స్ మానకుండా వేసుకుంటున్నారా?” అంటూ క్షేమ ప్రశ్నల పరంపర కురిపించింది. ‘అసలు కోడలు ఫోన్ చెయ్యడమే ఒక అబ్బురం అనుకుంటుంటే నా ఆరోగ్యం గురించి అడగడం మరీ విడ్డూరం’ అనుకుంటూ “మీరెలా ఉన్నారు? మా అబ్బాయి ఎలా ఉన్నాడు? పిల్లలంతా బాగేనా?” అందామె.

“ఆ! ఆ! అంతా బాగే. మీ అబ్బాయి మాట్లాడతారంట” అంటూ భర్తకి ఫోన్ ఇచ్చిందామె. “అమ్మా ఎలా ఉన్నావే?”

“బావున్నానురా! చిన్నోడింటికి వెళ్లి ఓ నెల రోజులుండి వచ్చాను మొన్నే! ఏంటి సంగతులు?”

“అమ్మా! నిన్ను చూడాలనుంది. వచ్చెయ్యకూడదూ?”

“ఇప్పుడెందుకురా! అర్థాంతరంగా! నేను బానే ఉన్నాను. మొన్నేగా వచ్చాను. ఓ నాలుగు నెలలు పోయాక వస్తానులే” అంది నవ్వేస్తూ. నెల రోజులున్నా పదినిమిషాలు కూడా పక్కన కూర్చుని మాట్లాడని కొడుకు చూడాలనుంది ఇప్పుడే రమ్మంటుంటే ఆశ్చర్యపోయిందామె. కల కాదు కదా! అని కూడా అనుకుంది ఓ క్షణం.

“ఇప్పుడే రావాలి. పోనీ ఓ నెల రోజులుండి వెళ్లిపోదువుగానిలే!”

“ఏమిట్రా అంత అర్జెంటు?”

“పనుంది. రేపు ఉదయమే బయలుదేరు. కారొస్తుంది. నా అమలాపురం మిత్రుడు పంపుతాడులే. రెడీగా ఉండు”

“నిజంగానే రమ్మంటున్నావా? సరేలే వస్తాను!” అంటూ ఫోన్ పెట్టేసి “వసంతా” అంటూ ఆమె ఇంటికి వెళ్లి  కబురు చెప్పేసిందామె.

“శుభం. వెళ్ళండి. మీ పని బావుంది పిన్నీ! ఊర్లూ, షికార్లూ! నన్ను పిలిచేవాడే లేడు” అంది వసంత నవ్వుతూ. పార్వతమ్మకి కూడా నవ్వొచ్చేసింది. నవ్వాపుకుంటూ “నా పెట్టె?” అంది. “నేను సర్దుతాను. బట్టలు తీసి మంచంపై పెట్టండి” అంది వసంత.

“సరే” అంటూ ప్రయాణం పనిలో పడిందామె, ‘నేనక్కడ వెలిగించే పనేముందబ్బా?’ అనుకుంటూ.

వసంత వచ్చి పెట్టె సర్దేసింది. తెల్లారగానే కారొచ్చేసింది. పార్వతమ్మ ఎక్కేసింది.

“ఫోన్ చెయ్యండి” అంది వసంత పార్వతమ్మ చేతిలో చెయ్యి కలుపుతూ.

“తొందరగానే వచ్చేస్తా!” అంది వసంత చెవిలో. ఇద్దరూ నవ్వుకుంటూ ఉండగా కారు కదిలింది. సాయంత్రమయ్యేసరికి కొడుకింటి ముందు దిగింది పార్వతమ్మ.

కోడలు ఎదురొచ్చి మంచినీళ్ళిచ్చింది. “ఏడీ వీడు! ఇంకా ఆఫీసునుంచి రాలేదా?” అడిగింది పార్వతమ్మ. కొడుకు గదిలోకి చేయిపట్టుకుని తీసుకెళ్లింది కోడలు. ఎదురుగా మంచంపై మోకాలినుంచీ పెద్ద కట్టుతో ఉన్నాడు పెద్ద కొడుకు.

“ఏమయిందిరా నాన్నా!” అంటూనే ఏడుపందుకుంది పార్వతమ్మ. కాళ్ళు తడబడ్డాయి. కోడలు జాగ్రత్తగా ఆమెను పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here