Site icon Sanchika

మలిసంజ కెంజాయ! -22

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[ఆశ్రమానికి వచ్చిన పవన్‍ని ఏవైనా సందేహాలుంటే అడగమని వెంకటేశ్వరరావు గారు చెప్తారు. అడుతామని అంటారు ఆడవాళ్ళు. పవన్ జీవితాన్ని బాగా కాసి వడపోసినవాడనీ, ఏదడిగినా తడుముకోకుండా చెప్పగలడనీ అంటారాయన. పవన్ పెళ్ళి ఎందుకు వద్దనుకున్నాడని ఒక ఆవిడ అడిగితే, నేను వద్దనుకోలేదు, ఆడపిల్లలే నన్ను వద్దనుకున్నారని చెప్తాడు. కారణమడిగితే, తనకి మంచి ఉద్యోగం, జీతం ఉన్నా – తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‍ని కానందున కొందరు, వాళ్ళకిష్టమైన హీరోలా లేనని కొందరు, అమెరికా వెళ్ళనని చెప్పినందున కొందరు, అమ్మా, పెళ్ళికాని ఇద్దరు అక్కలున్నందున మరికొందరు తనని తిరస్కరించారని చెప్తాడు పవన్.  వ్యక్తిగత విషయాలని వదిలి ధర్మసందేహాలని అడగమని వెంకటేశ్వరరావు గారు సూచిస్తారు. భోజనాల వాన్ రావడానికి ఇంకో అరగంట టైం ఉందంటూ, తన మిత్రులందరినీ ఆయన బయటకి తీసుకువెళ్ళడంతో అక్కడున్న ఆడవాళ్ళలో సంకోచం తొలగుతుంది. పవన్ తన కుర్చీని వాళ్ళకి దగ్గరగా జరుపుకుంటాడు. అప్పుడు అక్కడున్న ఆడవాళ్ళు ధ్యానం గురించి, పూజ గురించి, దైవం గురించి, భక్తి గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి తగిన జవాబులిస్తాడు పవన్. ఒకావిడ తన పిల్లల నిర్లక్ష్యం గురించి చెబుతుంది. పిల్లల మీద కోపం పెంచుకోవద్దని, ప్రశాంతంగా ఉండమని, పిల్లలతో రూల్స్ మాట్లాడే రోజులు కావని అంటాడు. బంధాలని వదిలించుకోమని, సంసార వ్యామోహాలని తగ్గించుకోమని, పిల్లలని అర్థం చేసుకోమని, పిల్లలు పట్టించుకోవట్లేదని బాధపడవద్దని, ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతామని అంటాడు. ఎవరెవరినో తప్పని పరిస్థితుల్లో మీరు క్షమించారు, మీ పిల్లల విషయంలో ఇప్పుడూ అదే చెయ్యండని చెప్తాడు. ఇప్పటిదాకా బాగా జరిగింది, ఇక ముందూ బాగా జరుగుతుందని భావించమని చెప్తాడు. మరికొన్ని మంచి మాటలు చెప్తాడు. వాళ్ళకి తెలిసిన విషయాలే అయినా అందరూ ఎంతో శ్రద్ధగా వింటారు. ఇంతలో భోజనాల ట్రక్ వస్తుంది. ఇద్దరు కుర్రాళ్ళు ఆహార పదార్థాలని బల్లలపై జాగ్రత్తగా అమరుస్తారు. ఇవాళ్టికింక ఈ సత్సంగం ముగించి, భోజనాల సంగతి చూసుకుందామని అంటాడు పవన్. సరేనని, మంచి విషయాలు చెప్పావు అంటూ అందరూ భోజనాలకి లేస్తారు. ఇక చదవండి.]

[dropcap]మ[/dropcap]రో రెండు నిమిషాలకి వెంకటేశ్వరరావుగారి మిత్రులూ వచ్చారు. భోజనాల గిన్నెలు దగ్గర నలుగురు ఆడవాళ్లు నిలబడి అందరికీ నమస్కరిస్తూ వడ్డించడం మొదలు పెట్టారు. వసంత పార్వతమ్మగారిని వెంటబెట్టుకుని వరసలో నిలబడింది. పళ్లెంలో పదార్థాలు వేయించుకున్నాక, ఆమెను జాగ్రత్తగా ఒక కుర్చీలో కూర్చోబెట్టింది వసంత. వాళ్ళిద్దరికీ మంచినీళ్ల గ్లాస్‌లు తెచ్చిపెట్టింది ఒకామె.

“ఎవరికి వాళ్ళు వడ్డించుకుంటారు. మీరు కూడా తినండమ్మా!” అని వెంకటేశ్వరరావు గారు చెప్పినా “మీరంతా తిన్నాక తింటాం. ఏమంత ఆలస్యం అయిపోదు! ఓ పావుగంట అంతే కదా!” అన్నారు వాళ్ళు.

అంతా కలిసి నవ్వుకుంటూ భోజనాలు ముగించారు. చేతులు కడుక్కున్నాక అందరికీ తలొక ఆపిల్ పండిచ్చారు. అందరికీ వడ్డించిన నలుగురూ, వసంత కోసం వచ్చి బైట నిలబడిన ఆటో అబ్బాయిని కూడా, తమతో భోజనం చెయ్యమని లోపలికి పిలిచి అంతా కలిసి భోజనం చేశారు. వాళ్ళ భోజనం అయ్యేవరకూ అందరూ కబుర్లు చెప్పుకున్నారు.

“భోజనాలు ఎలా ఉన్నాయి?” అనడిగారు వెంకటేశ్వరరావు గారు.

“అద్భుతహ!” అందొకావిడ కనబడకుండా వెనక నిలబడి. సన్నగా నవ్వులు విరిశాయి. అంతా నిజం అన్నట్టుగా తలలూపారు.

అంతా ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. వసంతా, పార్వతమ్మా మాష్టారుగారికీ, వారి మిత్రులకీ ధన్యవాదాలు చెప్పారు. ఆశ్రమ స్త్రీలంతా కూడా చెప్పారు. పవన్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. “నువ్వు మాకు గురువ్వి బాబూ! మళ్ళీ రావాలి” అన్నారు ముక్త కంఠంతో.

“మీరు నాకు గురువులు!” అన్నాడు పవన్ అందరికీ నమస్కరిస్తూ.

ఆటోలో విశ్రాంతిగా కూర్చున్నాక “ఆశ్రమంలో ఇవాళ చాలా సరదాగా గడిచింది. భోజనం కూడా ఎంతో రుచిగా కుదిరింది” అంది పార్వతమ్మ.

“అవును పిన్నీ! పవన్ మంచి మాటలు చెబుతూనే, మనల్ని బాగా నవ్వించాడు” అంది వసంత.

“పండిత కుటుంబం నుంచి వచ్చాడు. తెలివి వారసత్వంగా వచ్చింది. వయసుతో పనేముంది వసంతా? చిన్నవాడైనా గానీ చక్కగా మాట్లాడాడు” అన్న పార్వతమ్మ మాటలకి నిజం అన్నట్టు ఆనందంగా తలూపింది వసంత.

***

ఆ రోజు ఉగాది పండుగ. పార్వతమ్మ నెమ్మదిగా లేచి స్నానం చేసింది. నిన్న రాత్రి సర్ది పెట్టుకున్న పూజా సామగ్రితో దేవుడి పూజ ముగించి, హారతిచ్చి, స్టూల్ మీదనుంచి లేచింది.

ముందుగా కాచి పెట్టుకున్న కాఫీని ఫ్లాస్కో నుంచి వంపుకుని, మంచంపై కూర్చుని తాగి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఇంతలో ఫోన్ మోగింది. ‘నాకెవరబ్బా పండగ పూట ఫోన్ చేసింది?’ అనుకుంటూ ఎత్తింది. “నానమ్మా! నేను శివానీని” అన్న మనవరాలి గొంతు విని ఆమె మొహం వెలిగిపోయింది.

“ఏంటే! పండగ పూట ఈ నాన్నమ్మ గుర్తొచ్చింది” అంది మురిపెంగా.

“రాదా మరి! ఒట్టేయించుకున్నావుగా? నా చేత. అందుకే చేశా!”

“అవునే మర్చిపోయాను. మాట నిలబెట్టుకున్నావే బంగారుతల్లీ!”

“ఎవరి మనవరాలిననుకున్నావ్? మరి నీ పేరు నిలబెట్టొద్దా?”

“మంచి మాటన్నావ్! ఎలా ఉన్నావ్? దేవుడికి పూజ చేసావా?”

“ఎప్పుడో చేసేసాను. నీ డబ్బులతో కొన్న కొత్త చీర కట్టేసుకున్నాను. ఉగాది పచ్చడి చేస్తున్నాను”

“మా అమ్మే! తల్లీ, అలా పూజలు చేస్తూ ఉంటే ఇంటికి శుభం అమ్మా! అవును గానీ అమ్మెలా ఉందీ?”

“అమ్మ ఇప్పుడు శాంతమూర్తిలా మారిపోయింది! వదినతో ప్రేమగా ఉంటోంది!”

“శుభం!” అంది పార్వతమ్మ.

“వదినా, నేనూ అమ్మ పిలిచినప్పుడల్లా వస్తున్నాం. అందుకు అమ్మ ఎంతో సంతోషపడిపోతోంది! ఒకోసారి మేమంతా అన్నయ్య ఇంటికి కూడా వెళుతున్నాం. మా ఇంటికి కూడా అమ్మ వస్తోంది. మా అత్తగారూ, అమ్మా ఆప్తమిత్రులైపోయారు.”

“బ్రెమ్మాండం!” అంది పార్వతమ్మ ఉత్సాహంగా.

“అమ్మలో ఈ మార్పు రావడం, మా అందరికీ ఆనందంగా ఉంది నానమ్మా!” అంది శివాని సంతోషంగా.

“అంతే కదా మరీ! ఇల్లాలి శాంతం ఇంటిల్లిపాదికీ సౌఖ్యం! అన్నారందుకే. పండగ పూట ఉదయాన్నే మంచిమాట చెప్పావే బంగారం!” అంది పార్వతమ్మ సంబరంగా.

“అమ్మ రోజూ అంటోంది. నిన్ను తన దగ్గరే ఉంచేసుకుంటుందంట ఎప్పటికీ!”

“మీ పెదనాన్నా, పెద్దమ్మా కూడా నన్ను ఇక్కడ ఖాళీ చేసేసి వచ్చెయ్యమంటున్నారు”

“అయితే నీకు బంపర్ ఆఫర్ లన్నమాట” అంది శివానీ పకపకా నవ్వుతూ.

“ఆరునెలలు ఇక్కడా, ఆరు నెలలు అక్కడా ఉండనా?” అంది పార్వతమ్మ మనవరాలితో శృతి కలుపుతూ.

“టైం లెక్కేంటి? నీ ఇష్టం వచ్చినన్నాళ్లు ఉండొచ్చు. నాన్నదగ్గర బోర్ కొడితే పెదనాన్న దగ్గరికి, అక్కడ బోర్ కొడితే ఇక్కడికీ అటూ ఇటూ తిరుగుతూ హాయిగా ఉండు” అంది శివానీ.

“నువ్వెలా అంటే అలాగే బంగారం!” అంది పార్వతమ్మ హాయిగా నవ్వుతూ.

 “నాన్నమ్మా! నీకివాళ ఉగాది పచ్చడి ఎవరు పెడతారు?”

“ఉందిగా మా అమ్మాయి వసంత! తనే” అంది పార్వతమ్మ గర్వంగా.

“ఆ ఆంటీని అడిగానని చెప్పు!”

“అలాగే! ఒకసారి, మీ ఆయన్నీ, పిల్లాడినీ తీసుకుని అమలాపురం రావే!” అంది పార్వతమ్మ.

“అలాగే నానమ్మా! పిల్లాడు లేచాడు. వాడికి స్నానం చేయించాలి, ఉంటానే!”

“అలాగే నాన్నా! పిల్లాడు జాగ్రత్త!” అంది పార్వతమ్మ.

ఫోన్ పెట్టేసి తల తిప్పేసరికి వసంత రెండు చేతుల్లో రెండు బాక్స్‌లు పట్టుకుని వచ్చి, భోజనాల బల్ల మీద పెట్టింది. పార్వతమ్మ మంచంపై నుంచి లేచి నిలబడింది. వసంత ఆమె కాళ్ళకి నమస్కారం చేసింది.

“ఇదెందుకమ్మా? పండుగనా?” నవ్వింది పార్వతమ్మ.

“మీరిచ్చిన డబ్బులతో చీరకొనుక్కుని, జాకెట్ కూడా కుట్టేసుకున్నాను. అదే ఇది!” అంది పకపకా నవ్వుతూ.

ఆవపూవు రంగు పువ్వుల చీర మీద కుంకుమ రంగు బోర్డర్, అదే డిజైన్ ఉన్న జాకెట్టూ వేసుకున్న ఆమెను తేరిపారా చూసి “అచ్చం వసంతలక్ష్మిలా ఉన్నావమ్మా! నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లు!” అని దీవించి దగ్గరికి తీసుకుంది పార్వతమ్మ .

“పిన్నీ! ముందు ఉగాది పచ్చడి తిన్నాక గారెలు, చట్నీ తినండి. ఈవేళ మీక్కూడా వంట చేసాను, మనిద్దరం కలిసి తిందాం!” అంటూ వెళుతున్న వసంతను అలాగే అన్నట్టు తలూపుతూ చిరునవ్వుతో చూసింది పార్వతమ్మ.

ఆ ఉగాది రోజున, సాయంత్రం నాలుగు గంటల వేళ, నీరెండ వెలుగులో, పరిసరాలన్నీ తళ తళ మెరుస్తున్నాయి. వసంత చిక్కని ప్రత్యేకమైన టీ మూడు కప్పులు తయారు చేసి, హాల్‌లో టీవీ చూస్తున్న భర్త కొకటి ఇచ్చి, మరో కప్పు పెరట్లో సిమెంట్ గట్టుమీద కూర్చున్న పార్వతమ్మగారికిచ్చింది. తానొకటి తీసుకుని మొక్కల్లో తిరుగుతూ టీ తాగుతోంది. పూలమొక్కలన్నీ, గాలికి పువ్వులతో తలలూపుతూ వసంతను తాకి పలకరిస్తున్నాయి. ఆమె కూడా వాటిని సుతారంగా తాకి మురిసిపోతోంది.

“ఓ వనలక్ష్మీ! ఒక్కసారి కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో!” అన్నమాటలకి వెనక్కి తిరిగింది వసంత. ఎదురుగా సెల్ ఫోన్లో ఫోటో తీస్తూ నిలబడి ఉంది నిర్మల. తల్లి ఏదో అనబోతుంటే ఆగాగు, అన్నట్టు సైగ చేసి “ఒక చేత్తో కప్ పట్టుకుని, మరో చేత్తో ఓ మొక్క కొమ్మని వంచి చూస్తూ నిలబడు” అని చెప్పి, తల్లి పోజ్ పెట్టాక, నాలుగైదు ఫోటోలు తీసింది నిర్మల.

“శ్రీరామ్, పిల్లలూ?” అడిగింది తల్లి.

“ఆ ట్రూప్ అంతా ఎక్కడికో వెళుతూ నన్నిక్కడ దింపారు. ఇవాళే మీ అల్లుడు నాకీ ఐ ఫోన్ కొనిచ్చారు. దాంతో మొదట నీ ఫోటో తియ్యాలని ఇలా వచ్చాను!” అంటూ ఫోన్ చూపించింది.

“భలే బావుందే!” అంది వసంత ఫోన్‌ని పట్టుకుని చూస్తూ.

“ఇప్పుడు నీకూ, నీ ఫ్రెండ్‌కీ తీస్తాను” అంటూ తల్లిని, సిమెంట్ గట్టుపై కూర్చున్న పార్వతమ్మ పక్కన కూర్చోబెట్టి కొన్ని ఫోటోలు తీసింది.

“మన ముగ్గురికీ కూడా తియ్యి!” అంది వసంత. తీసాక ఆ వచ్చిన ఫోటోల్ని పార్వతమ్మగారికీ, తల్లికీ సంతోషంగా చూపించింది నిర్మల.

పార్వతమ్మగారు కూడా ఆ ఫోన్ లోని ఫోటోలు చూసి “చాలా బాగా వచ్చాయి నిర్మలా! ఈ పండక్కి మీ ఆయనిచ్చిన బహుమతా ఇదీ?” అందామె ప్రేమగా నవ్వుతూ.

“అవును మామ్మగారూ!” అంటూ నిర్మల కూడా నవ్వుతూ, ఆమెని దగ్గరికి తీసుకుంది.

తర్వాత తల్లి వైపు చూసి, “పదమ్మా! నాన్నగారికీ, నీకూ కలిపి ఫోటోలు తీస్తా!” అంటూ తల్లి వీపు చుట్టూ చెయ్యి వేసి, లోపలి తీసుకువెళుతుంటే పార్వతమ్మ వాళ్ళిద్దరి వైపూ ఆనందంగా చూసింది.

(సమాప్తం)

Exit mobile version