[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
[వసంత అన్నయ్య రామచంద్రం ఆమె ఇంటికి వస్తాడు. చెల్లెలు, బావగారి యోగక్షేమాలు అడుగుతాడు. తన కొడుకు కోడలి గురించి చెప్తాడు. మతాంతర విహాహం చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయిన పెద్దకూతురు మళ్ళీ ఇంటికి వచ్చిందని, డబ్బులు ఇవ్వమని అడుగుతోందని చెప్పి, పెద్దకూతురు ఆ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవడం వల్ల చిన్నకూతురికి సంబంధాలు రాలేదని, చివరికి కట్నం ఎక్కువ ఇచ్చి పెళ్ళి చేయాల్సి వచ్చిందని చెప్తాడు. తన దగ్గర డబ్బు లేదని చెప్తే, పెద్ద కూతురు తల్లి బంగారం అడుగుతోందని చెప్తాడు. అయితే కూతురితో అన్నీ వివరంగా చెప్పి ఏమీ ఇవ్వలేమని చెప్పేయమని సలహా ఇస్తుంది వసంత. తనొచ్చిన పెళ్ళి చూసుకుని, హైదరాబాద్‍కి వెళ్లిపోతాడు రామచంద్రం. తన సూపర్ బజార్‍కి షాపింగ్‍కి వచ్చిన తన కాలేజీ రోజుల స్నేహితురాలు విశాలని చూసి మ్రాన్పడిపోతాడు ఓనర్ మాధవ. బిల్లింగ్ కుర్రాడికి ఆమె ఫోన్ నెంబర్ చెప్తుంటే విని నోట్ చేసుకుంటాడు. ఆ రోజుల్లో ముందు వారి స్నేహం కలిసి, కాలక్రమంలో ప్రేమగా మారుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల వారు పెళ్ళి చేసుకోలేకపోతారు. అప్పుడు విడిపోయిన తర్వాత మళ్ళీ విశాలని మాధవ చూడడం ఇదే మొదటిసారి. ఆమెకు ఫోన్ చేసి, మాట్లాడడానికి సంకోచించి, ఫోన్ ఆపేస్తాడు. ఒకరోజు వసంతకి బజారులో తన క్లాసుమేటు ప్రేమజ్యోతి, వాళ్ళ స్వరూప కనబడతారు. వాళ్ళని ఇంటికి తీసుకువస్తుంది వసంత. తమ కుటుంబ సమస్యలను వసంతకి చెప్పుకుంటారు. తనకి తోచిన సలహా చెప్తుంది వసంత. ఆమె చెప్పినట్టే చేస్తామని చెప్పి వీడ్కోలు తీసుకుంటారు అక్కాచెల్లెళ్ళు. ఇక చదవండి.]
[dropcap]ఒ[/dropcap]కరోజు పార్వతమ్మ సహాయకురాలు సీతమ్మ పనికి రాలేదు. సాయంత్రం వరకూ చూసినా రాలేదు. దాంతో ఆవిడ బెంబేలు పడిపోయింది. తనలో తాను మాట్లాడేసుకుంటూ బెంగ పెట్టేసుకుంది. ఇద్దరికీ పెరటివైపు ఒకటే వాకిలి. ఆవిడని గమనిస్తున్న వసంత తన ఇంటిలో పనిచేసే అమ్మాయిచేత ఆమె పనులు కొన్ని చేయించింది. దాంతో ఆవిడ కాస్త తెప్పరిల్లింది.
“ఏంటో వసంతా! ఒక్క రోజు సీతమ్మ రాకపోతే నానా గోల చేసి నిన్నిబ్బంది పెట్టాను. తప్పట్లేదు”
“అయ్యో ఎంత మాట పిన్నీ! మీ వయసుకి మీరు ఒకరికి భారం కాకుండా ఒక్కరూ వండుకు తినడమే గొప్ప విషయం. సాయం చేసే మనిషి లేకపోతే కష్టం కాదా!” అంది వసంత వంటింటి గుమ్మం పక్కనే ఉన్న వాకిలివేపు నడుస్తూ. “ఈ మాట అందరూ అంటారు కానీ నా కొడుకులూ, కోడళ్ళూ మాత్రం పొరపాటున కూడా అనరు” అందావిడ తనలో తానే అనుకున్నట్టు. వాకిట్లో మొక్కలు చూసుకుంటున్న వసంత ఏమీ మాట్లాడలేదు.
తెల్లవారి పొద్దున్నే మొక్కల్లో తుడుస్తున్న చప్పుడుకి పార్వతమ్మ ఆనందంగా నిద్ర లేచింది. మొహం కడుక్కునొచ్చి ఇద్దరికీ ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేసింది. వంటిల్లు మెట్లు దిగి సీతమ్మ దగ్గరికి వచ్చిందామె.
“నిన్నంతా వొళ్ళు నొప్పులేనమ్మా! లేవలేదు. ఇయాల కూడా అలాగే ఉంది కానీ ఎలాగో ఓపిక చేసుకునొచ్చాను. మీరు కంగారు పడతారని”
ఆమె పని సగం అయ్యాక ఇద్దరూ ఇడ్లీలు తిని, కాఫీ తాగడం మొదలు పెట్టారు ఒకరు గుమ్మంలో కుర్చీలోనూ మరొకరు వాకిట్లో గట్టుమీదా కూర్చుని. వీళ్ళ సంభాషణ వింటున్న వసంత వచ్చి సీతమ్మకి రెండు టాబిలెట్లిచ్చింది. ఒకటిప్పుడు ఒకటి రాత్రి వేసుకో అంటూ.
“అలాగే బంగారు తల్లీ!” అంటూ తీసుకుందామె.
“నిన్నేమన్నా తిన్నావా?” పార్వతమ్మ ప్రశ్నకి “చారన్నం తిన్నానమ్మా నేనే వొండుకుని” అంది సీతమ్మ
“బాగోలేనప్పుడు నీ కొడుకు దగ్గరికి వెళ్లొచ్చు కదా పక్క వీధే కదా!”
“ఏమోనమ్మా ఎల్ల బుద్ధి కాదమ్మా.. మనసొప్పదు” అంది ఏం గుర్తొచ్చిందో బాధతో చివరి మాట మింగేసింది.
“మరీ అంత అభిమానం రాదు సీతమ్మా! నేను చెప్పేది విను. ఇలా వంట్లో బాగోలేనప్పుడు వెళ్ళాలి. ఒక్కదానివీ ఉండకూడదు. ఏ అర్ధరాత్రన్నా తేడా వచ్చిందనుకో..” అని ఆపేసింది వసంత.
“ఒక సంగజ్జెపుతాను. తర్వాత మీరు సెప్పినట్టింటాను. సెప్పనామ్మా?” అంది సీతమ్మ.
“చెప్పు” అంది పార్వతమ్మ.
“ఐదారేళ్ళ కితం ఓసారి నన్ను నెల్లాళ్ళు కడుపునెప్పి సంపేసిందండి. అప్పుడు ముందు ఓ పదిరోజులు బాధపడ్డాక మాయబ్బాయొచ్చి తనింటికి తీసుకెళ్ళాడండి. డాట్టర్‌కి చూపిచ్చాడండి. ఆయన మందులిచ్చాడండి. మా కోడలు మొహం మాడుసుకునే వండిపెట్టీదండి. పది రోజులు గడిసినా నాకు కడుపు నెప్పితగ్గలేదండి. ‘నెప్పి, నెప్పి’ అంటా ఉండీదాన్నండి. ‘ఇన్ని మందులేశాక ఎందుకు తగ్గదు? కూంతుంటే కాంతని కనబడ్డోళ్లందరికీ నెప్పి, నెప్పి అని సెబుతావు. నీకలా పాడ్డం అలవాటైపోయింది. ఏదో ఒంట్లో బాగోలేదని ఈ పాలికి తీసుకొచ్చామని, బాగోనప్పుడల్లా తీసుకొత్తామనుకోకు!’ అని మా కోడలు మావోడు లేనప్పుడు తిట్టిందండి. ఆ తర్వాత ఒక వారానికి మెల్లిగా తగ్గిందండి. అదే ఆకరండి అక్కడికెళ్ళడం. సత్తే ఇక్కడే సత్తాను కానీ అక్కడికెళ్ళనని ఒట్టేసుకున్నానండి. ఈ కోడళ్ళకి మనం ఎప్పుడికీ ముసలోళ్లం అవ్వం. మాకెవరి అవసరం ఉండదు. మాకు ఒంట్లో శక్తి ఉందని విర్రవీగుతారు. కాలం గడిసిపోతాదండి. మా లాంటి వయసు ఒకరోజు ఆళ్ళకీ వత్తాదండి. అప్పుడు మేముండవనుకోండి, అప్పుడర్థం అవుతాదండి ఆళ్ళకి” అంది సీతమ్మ ఆవేదనగా.
“కొడుక్కి నాలుగేళ్లప్పుడు భర్త పోతే తల్లీ, తండ్రీ అయ్యి పెంచి పెద్దచేసి వాడికి పెళ్లి చేసావు. ఇద్దరు మనవలు పుట్టారు. వాళ్ళూ పెద్దోళ్ళయిపోయారు. ఇప్పుడు నీ కొడుక్కీ కోడలికీ తీరికే కదా!” అంది పార్వతమ్మ.
“అయితే మాత్రం, ఆడింట్లో నాకు అక్కుంటాదామ్మా? నేనేమన్నా ఇళ్లిచ్చానా? తలాలిచ్చానా? బంగారమిచ్చానా? మీలాంటి దనమంతులైతే పిల్లలకి అన్నీ ఇత్తారు గనక ఆళ్ళు మిమ్మల్ని నెత్తినెట్టుకుని సూసుకుంటారు”
“పిచ్చిదానా! నీకలాగే అనిపిస్తుందిలే!”
“మీరే ఓపిక సేసుకుని, ఆళ్ల నిబ్బంది పెట్టడమెందుకని మీ ముద్ద మీరే వొండుకుని తింటన్నారు. నాలాంటి దాన్ని కూడా సూత్తన్నారు” అంది గౌరవం చూపెడుతూ.
“మరే.. బాగా కనిపెట్టి చెప్పావు” అంది పార్వతమ్మ నవ్వుతూ.
“ఒక్క పోను కొట్టారంటే కారేసుకొచ్చి తీసుకుపోతారు మీ కొడుకులు మిమ్మల్ని” అంది తడి గిన్నెలు పొడిగుడ్డతో తుడుస్తూ సీతమ్మ. “దూరపు కొండలు నునుపంటారు ఇందుకే!” అంది పార్వతమ్మ.
“నీక్కాస్త ఓపికుంది కనక పౌరుష పడుతున్నావు. తగ్గిపోయాక కొడుకు దగ్గరికెళ్ళక తప్పదు. అలా మనసులో నిష్ఠూరం పెట్టుకోకు” అంది వసంత బట్టలారేసుకుంటూ.
“నేను ఇంకా బాగా ముసల్దాన్నైపోతే ముసలోళ్ల ఆశ్రమంలో చేరిపోతాను, గానీ కొడుకు దగ్గర కెల్లను”
“విన్నావా వసంతా? దీనికెంత పట్టుదలో! “
“ఉన్నాదండి మరి. ఆ ధైర్నం ఉంది కనకే బండినిన్నాళ్ళూ లాక్కొచ్చేను. లేదంటే ఎప్పుడో బెంగెట్టుకుని, పోదును” ఆత్మవిశ్వాసంతో అంది సీతమ్మ.
“ఉండాలిలే సీతమ్మా ఆ పట్టుదల” అంది వసంత ఆమెని మెచ్చుకుంటూ.
“అక్కడ ఎవరూ లేని వాళ్ళకే భోజనాలు పెడతారు కానీ కొడుకున్న వాళ్ళకి పెట్టరే” అంది పార్వతమ్మ ఉడికిస్తూ.
“ఎవరూ లేరని సెప్పేత్తాను. ఎవరొచ్చి సాచ్చికం సెబుతారో సూత్తాను” అని నవ్వుతూ వెళ్ళిపోయింది సీతమ్మ.
పార్వతమ్మ గోడ పట్టుకుని లేస్తూ “ఎనభై ఏళ్ళు దాటాక బతక్కూడదు వసంతా!” అంది.
“చాలులెండి పిన్నీఅర్థం లేని మాటలు! దేవుడు ఆయుర్దాయం ఇచ్చినన్నాళ్ళూ బతకాలి. మన జీవితం మీద మనకి గౌరవం ఉండాలి కానీ బెంగ కూడదు. దేవుడి నిర్ణయాన్ని కాదనకూడదు.” పార్వతమ్మ బేలగా చూసింది ఆమె వైపు.
వసంత పార్వతమ్మ వీపుపై చెయ్యి వేసి నడిపిస్తూ “అప్పట్లో పెద్దవాళ్ళ దగ్గరే కొడుకులూ, కోడళ్ళూ ఉండేవారు. పెద్దవాళ్ళకి అలవాటయిన విశాలమయిన ఇంటిలో, అదే ఊరిలో వృద్ధులు హాయిగా ఉండేవారు. కొడుకులూ, కోడళ్ళూ ఇల్లు చక్కబెట్టుకునేవారు. ఇప్పుడు మా తరంలో చదువులూ, ఉద్యోగాలూ వచ్చాక సంతానం వేరే ఊర్లకి వెళ్ళవలసి వచ్చింది. పల్లెల్లో అలవాటయిన తల్లితండ్రులు ఆ సిటీలోని ఇళ్లల్లో, పిల్లల దగ్గరికి వెళ్లి ఉందామన్నా ఉండలేకపోతున్నారు. చేసి పెట్టే వాళ్ళకి కూడా, గతంలోలా సౌఖ్యంగా ఉండడంలేదు. ఈ కారణాల వల్లే పెద్దవాళ్ళు ఒంటరిగా పల్లెటూళ్లలో ఉండడం కనబడుతోంది”. “ఆ మాటా నిజమేలే వసంతా!” అంది పార్వతమ్మ నిట్టూరుస్తూ.
వసంత ఆమెను లోపలి తీసుకొచ్చి, వెనకగుమ్మం తలుపేసి, “టీవీలో ఉదయాన్నే మంచి మంచి సినిమాలొస్తాయి. చూసాక వంట చేసుకోవచ్చు. ఈ రోజు మీకు గుమ్మడికాయా, చింతకాయా కలిపి వండిన కూర ఇస్తాను. అన్నం కుక్కర్‌లో పెట్టుకోండి చాలు” అంటూ టీవీ పెట్టింది. ఒక చోట మంచి పాత సినిమా వస్తుంటే ఆ ఛానల్ పెట్టి ఆమెకి రిమోట్ ఇచ్చి నిలబడింది.
“నువ్వెళ్లు వసంతా! మీ ఆయనకి వంటకాలస్యం అయిపోతుందేమో” అనడంతో తన పోర్షన్ లోకి వెళ్ళిపోయింది వసంత.
అదొక ఉమ్మడి కుటుంబం ఉన్న పాత సినిమా. అది చూస్తూ ‘రోజులెంత మారిపోయాయో! తమ కొడుకుల పెళ్ళి విషయాల్లో కూడా అత్తగారి, మావగారి పెత్తనమే ఉండేది. తానెప్పుడూ వాళ్ళ మాటలకి గౌరవం ఇస్తూ భయ భక్తులతో ఉండేది. ఇప్పుడు నా పెద్దకోడలైతే తననొక దూరపు చుట్టంలా చూస్తుంది. కొడుక్కి నాతో మాట్లాడాల్సిన విషయాలే ఉండవు. మనవలు వాళ్ళ గొడవలో వాళ్ళుంటారు’ అనుకుంటూ కొంతసేపు దిగులు పడి ఆ తర్వాత సినిమాలో లీనమైపోయి మొత్తం చూసేసి పడుకుని నిద్రపోయింది పార్వతమ్మ.
తర్వాత లేచి స్నానం చేసి పూజ మొదలు పెట్టింది. “ఈ రోజు ఇంత ఆలస్యంగా పూజ చేస్తున్నాను క్షమించు దేవుడా!” అంటూ ముగించింది. ‘ఏమిటో మనసు రోజుకొకలా ఉంటుంది.ఒకరోజు ధైర్యంగానూ, మరొకరోజు అధైర్యంగానూ ఉంటుంది. వయసు మహిమ.’ అనుకుంటూ ఉంటే వసంత వచ్చి కూర బాక్స్ టేబుల్ మీద పెట్టి, “బియ్యం పెట్టుకున్నారు కదా!” అంది. పార్వతమ్మ తలూపాక వెళ్ళిపోయింది. ‘బంగారు తల్లి. నూరేళ్లు సంతోషంగా బతుకు’ అంటూ మనసులోనే దీవించిందావిడ వసంతను.
***
ఒకరోజు వసంత భర్తను షాప్‌కి పంపాక పెరటివైపున్న సిమెంట్ గట్టుపైన ఎండలో కూర్చుని, వార్తాపత్రిక చదువుతోంది. వెనకనుంచి వచ్చిన నిర్మల కొడుకులిద్దరూ ఆమె వీపుపై చెరో దెబ్బవేసి, పక్కకి వచ్చి కిలకిలా నవ్వారు. ఉలిక్కిపడిన వసంత ఇద్దరినీ దగ్గరికి తీసుకుని “కుశలవులెలా వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు?” అంది సంభ్రమంగా.
“మాకు వారం రోజులు శలవులిచ్చారు కదా! అందుకే మా డ్రైవర్ మమ్మల్నిక్కడ వదిలేసి వెళ్ళాడు. మేం చప్పుడు కాకుండా మా బట్టల బ్యాగులక్కడ పెట్టేసి నిన్ను భయపెట్టాలని ఇలా వచ్చేము అమ్మమ్మా!” అన్నారువాళ్ళు. “మంచి పని చేసారు నాన్నా!” అంటూ ఆనందంగా వాళ్ళని లోపలి తీసుకొచ్చింది వసంత.
అప్పటికప్పుడు వాళ్ళనడిగి వంటచేసింది. వాళ్లిద్దరూ కార్టూన్ ఛానల్ పెట్టుకుని కూర్చున్నారు. అదే రోజు సాయంత్రం వాళ్ళకోసం జంతికలూ, తీపి గవ్వలూ చేసింది. మర్నాడు కారప్పూసా, మైసూర్ పాక్ చేసింది. రోజూ సాయంత్రాలు వాళ్ళని తీసుకుని పార్క్‌కి వెళ్లడం, రాత్రి ఓ కథ తాను చెప్పి, వాళ్లిద్దరూ చెప్పే చెరో కథా వినడం, ఇలా సరదా సరదాగా వాళ్లతో గడిపింది వసంత. తాతగారు ఉన్నప్పుడు ఆయన దగ్గరా, ఆయన లేనప్పుడు వసంత దగ్గరా చేరేవారు పిల్లలు. అంతలోనే ఆటలాడుతూ ఇంటి చుట్టూ పరుగులు తీశాక వాళ్ళిద్దరి మధ్యా తగవులూ జరిగేవి. అమ్మమ్మ తీర్పుకోసం వచ్చేవాళ్ళిద్దరూ. ఒకోసారి పార్వతమ్మ వాటాలోకి కూడా ప్రవేశించి అల్లరి చేసేవారు. ఇలా సందడి సందడి చేసారు మనవలిద్దరూ ఆ వారమంతా. ఒకరోజు సాయంత్రం అల్లుడు శ్రీరాం వచ్చాడు.”నిర్మలేదీ?” అడిగింది వసంత.
“నేను పని మీద విజయవాడ వెళ్ళాను. వీళ్ళ స్కూల్ రేపటినుంచి కదా! అందుకే తిన్నగా ఇలా వచ్చేసానత్తయ్యా!”
“అవునా!” అంటూ స్నాక్స్ ఏవీ వద్దనడంతో అల్లుడికి కాఫీ ఇచ్చింది వసంత. పిల్లలు తినగా మిగిలిన తినుబండారాలన్నీ కవర్‍లో వేసి ఇచ్చేసింది శ్రీరామ్ వద్దంటున్నావినకుండా.
“నిర్మల బిజీగా ఉందా? ఫోన్ కూడా చెయ్యలేదు” అడిగింది వసంత.
“అవునత్తయ్యా! ఎవరో తన డిగ్రీ క్లాసుమేట్స్ ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్లతో తిరుగుతోంది ఖాళీ లేకుండా. ఉంటాం అత్తయ్యా!” మరి అంటూ బయలుదేరాడు శ్రీరామ్.
“బై! అమ్మమ్మా” అంటూ ఇద్దరూ వసంతకి చెరోవైపు బుగ్గలమీద ముద్దు పెట్టి కారెక్కారు.
***
ఒకరోజు మధ్యాన్నం మూడు గంటలకి కుట్టుమిషన్ మీద ఏదో కుట్టుకుంటూ ఉండగా వసంతకి వెంకటేశ్వరరావు మాస్టారి నుంచి ఫోన్ వచ్చింది.”ఎలా ఉన్నావమ్మా వసంతా?” ఆప్యాయంగా అడిగారాయన.
“బావున్నాను మాష్టారూ. మీరెలా ఉన్నారు. ఆరోగ్యం ఎలా ఉంది?” అభిమానంగా అడిగింది వసంత.
“దాన్ని గురించి అడక్కు. అదెన్ని సాకులు చెప్పినా వినీ విననట్టుగా నా పనులు నేను చేసేసుకుంటూ ఉంటాను. చల్తీ కా నామ్ గాడీ అంటే అదేనేమో కదా!” అన్నారాయన హాయిగా నవ్వేస్తూ.
“అంతే మాష్టారూ!మంచి మాట చెప్పారు. చెప్పండి ఏమిటి విశేషాలూ! మీ ఆశ్రమం వాళ్లంతా బావున్నారా?”
“బాగోకేం? బంగారంలా ఉన్నారు పాటలు పాడుకుంటూ, పనులు చేసుకుంటూనూ”
“అందుకే మీరూ ఆనందంగా ఉన్నారు”
“ఇప్పుడు మీకు ఫోన్ చెయ్యడానికి కారణం. మీరింట్లో ఉన్నారా లేదా అని”
“అయ్యో ఇంట్లోనే ఉన్నానండీ”
“ఓ అరగంటలో వస్తానమ్మా!”
“అలాగే! మీ టీ, బిస్కట్ ఇక్కడే” అంది
“అలాగే. మీ పక్కింటి పిన్ని గారిని కూడా పిలువమ్మా!” అన్నాడాయన.
“మాష్టారు టైం అంటే టైమే. నాలుక్కల్లా వచ్చేస్తారు. మీరు రెడీగా ఉండండి పిన్నీ. ఆయన నూనె సరుకులు తినరు కదా! నేను వెంటనే షాప్ కెళ్ళి రెండు రకాల బిస్కట్లూ, పళ్ళూ తెస్తా!” అని పార్వతమ్మకి కబురు అందించి, బైటకి పరుగు తీసింది వసంత.
వెంకటేశ్వరరావు గారు వసంత పని చేసిన స్కూల్ లోనే హెడ్ మాస్టర్‌గా రిటైర్ అయ్యారు. ఆమె కన్నా పదేళ్లు సీనియర్. ఆయనంటే వసంతకి గురుభావం. ఆయనకి కూడా వసంత వినయం, మంచితనం, పెద్దల పట్ల గౌరవం గల స్త్రీ అని అభిమానం. అదే వారిద్దరి స్నేహం కొనసాగడానికి కారణం.
వసంత ఉండే గ్రామానికి అయిదారు కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామంలో ‘వెంకటలక్ష్మీ పెద్దల ఆశ్రమం’ పేరు మీద ఒక స్త్రీల వృద్ధాశ్రమం ఉంది. దాన్ని కట్టించింది వెంకటేశ్వరరావు గారు. తన భార్య లక్ష్మిగారి పేరు మీద పదేళ్ల క్రితం దానిని నిర్మించారాయన. ఆయన బంధువు ఒకరు ఇచ్చిన వెయ్యి గజాల స్థలంలో తన సొంత డబ్బులతో భార్య కోరిక మీద, ఆ స్త్రీల వృద్ధాశ్రమం స్థాపించారు. వారికి ఎంత ఖర్చు అవసరమైతే ఇతర ఖర్చులతో సహా కూడా అంతా ఆయనే చూసుకుంటారు.
వెయ్యిగజాల స్థలంలో పొందికగా కట్టబడిన ఆ వెంకటలక్ష్మీ ఆశ్రమాన్ని ఒక పాతిక నుంచి ముప్ఫయి మంది ఆడవారికి ఆశ్రయం కల్పించే విధంగా ప్లాన్ చేశారు. అందులో రూమ్ లన్నీ ఒక వలయాకారంలో కట్టారు. మధ్యలో మొక్కలు వేసుకునే స్థలం ఉంచారు. అక్కడ అనేక పూల మొక్కలు నిత్యం పూలతో అలరారుతూ ఉంటాయి. అక్కడ లేని పూల మొక్క లేదంటే నమ్మాల్సిందే. అన్ని రకాలున్నాయక్కడ. ఆ పూసే పువ్వులు, పూయించిన ఆడవాళ్లందరికీ ఆనందం పంచుతూ ఉంటాయి.
ఆ వలయాకారపు బిల్డింగ్‌లో ఓ రెండు గదులు ఆఫీస్ వారికీ, ఓ రెండు వంటకీ, ఒక హాల్ భోజనాలకీ పోగా మిగిలిన హాళ్లు ఓ అయిదున్నాయి. ఒకో హాల్‌లో ఆరు మందికి పడకలున్నాయి. ఒక్కొక్కరికి ఒక పక్క గోడకి కట్టిన పెద్ద అలమరాలో ఒకో చిన్న అలమారు కేటాయించారు. అందులో ఎవరి సరుకులు వాళ్ళు సర్దుకున్నారు. ఈ బిల్డింగ్‌కి పక్కనున్న ఖాళీ స్థలంలో ఒక పొడవైన రేకుల షెడ్ కట్టారు. దానిలో సగం టీవీ కోసం ఒక ప్రత్యేక హాల్ కట్టారు. మిగిలిన సగం ఖాళీగా కూర్చోవడానికి వీలుగా వదిలేసారు. అందులో అక్కడక్కడా గోడవారంటా సిమెంట్ బెంచీలుంటాయి. ఎవరైనా అక్కడ కూర్చుని చదువుకోవచ్చు. రెండు దినపత్రికలు కూడా అక్కడ ఉంటాయి. టీ, కాఫీలు అక్కడ కూర్చుని తాగొచ్చు. ప్రహరీ గోడవారంటా కొబ్బరి చెట్లూ, నిమ్మ చెట్లూ, దానిమ్మ చెట్లూ, అరటి మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల మట్టి గచ్చు చేసిన వాకిట్లోకి రాకుండా సిమెంట్ అంచు కట్టారు. మొక్కల సంరక్షణ ఆశ్రమవాసులే చేసుకుంటారు.
ఇదంతా దయార్ద్ర హృదయ అయిన లక్ష్మిగారి ఆలోచన. ఆమె తర్వాత ఆమె భర్త వెంకటేశ్వర రావు గారు ఆ కల సాకారం చేశారు. ఇప్పుడాయనకి ఉన్న పెద్ద వ్యాపకం ఈ ఆశ్రమ నిర్వహణే. ఆశ్రమం ఎప్పుడూ కడిగిన ముత్యంలా ఉంటుంది. ఒక్క ఎండుటాకు కనబడకుండా శుభ్రం చేసుకుంటూ ఉంటారు ఆశ్రమవాసులు.
ఆ ఆశ్రమంలో ఉండే వాళ్ళందరూ ఎంతో కొంత శక్తి గలవాళ్లు కావడంతో వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. గదులూ, వాకిలీ ఊడ్చుకోవడం, తడిబట్ట పెట్టుకోవడం, గిన్నెలు తోముకోవడం, టిఫిన్ చేసుకోవడం, వంట చేసుకోవడం అన్నీ వాళ్లే చేసుకుంటారు. వంతుల వారీగా డ్యూటీలు మార్చుకుంటూ కూడా ఉంటారు. ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కుంటారు. పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకుంటారు. కాస్త ఓపిక లేని వారు పెద్ద పనులు చెయ్యకపోయినా, కూరలు కోసి ఇవ్వడం వంటి చిన్న పనులు చేస్తూ ఉంటారు. అందరూ ఒకరిపై మరొకరు ప్రేమతో, ఆప్యాయతతో ఉంటారు. అదంతా వెంకటేశ్వర రావు గారు నేర్పిన క్రమశిక్షణ.
చుట్టుపక్కల గ్రామాల్లోని కొందరు మిత్రులు, దాతలు వారికి తోచినపుడు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి వెంకటేశ్వరరావు గారికి కాస్త భారాన్నితగ్గిస్తూ ఉంటారు. పిల్లల పుట్టిన్రోజులూ, పెద్దల తిథులూ ఉన్నప్పుడూ కొందరు వచ్చి ఒకరోజు లేదా, ఒక పూట ఖర్చు ఇస్తూ ఉంటారు. అక్కడే ఉండే బ్లాక్ బోర్డు మీద ఆ రోజు ఖర్చు ఎవరైనా విరాళం ఇస్తే వారి పేరు రాస్తూ ఉంటారు .తన తర్వాత కూడా ఆశ్రమం అలా నడిచే విధంగా ఆయన నిధులు బ్యాంకులో వేసి ఉంచారు. ఆ వివరాలన్నీ రాయడానికీ, వారి సంరక్షణ భారం చూడడానికీ ముగ్గురు ఉద్యోగస్థులుంటారు. వారికి కొంత గౌరవ వేతనం ఇవ్వబడుతుంది. వారు కూడా సేవాభావంతో వచ్చినవారు కావడం విశేషం. ఒకరు మంచి పని తలపెడితే పదిమంది చేతులు వచ్చి కలుస్తాయి అని వెంకటేశ్వరరావు గారు తరచూ అనడానికి కారణం ఇదే.
ఆ ఆశ్రమంలో అప్పుడప్పుడూ ప్రవచనకారుల్నీ, పెద్దల్నీ పిలిచి సత్సంగం పెట్టిస్తూ ఉంటారు వెంకటేశ్వర రావు గారు. అలాంటప్పుడు అంతా కూర్చోవడానికి వీలుగా ఒక చిన్న మీటింగ్ హాల్ ఉంటుంది. అందులో కుర్చీలు కూడా కొందరు దాతలు ఇచ్చారు. ఆ మీటింగ్‍లకి బైట వారు కూడా రావచ్చు. ఆశ్రమంలో ఉండేవారికి బైటవాళ్ళు రాగానే కాస్త ఆటవిడుపుగా ఉంటుంది. అక్కడుండే ఉద్యోగస్థులు వీలుచూసుకుని అప్పుడప్పుడూ ఆశ్రమవాసుల్ని నదీ విహారానికో, గుడికో కూడా తిప్పుతూ ఉంటారు.
ఆ రామాయణం, భారతం చెప్పే సహృదయులైన పెద్దలు కూడా ఒకోసారి ఉచితంగానే అక్కడ చెప్పడానికి వస్తూ ఉంటారు. అలాంటి మీటింగులకి వసంత, పార్వతమ్మ గారు కూడా వెళుతూ ఉంటారు. అటువంటప్పుడు ఇలా స్వయంగా వచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో తన మిత్రులనూ, దాతలనూ, తెలిసిన వారినీ ఆహ్వానిస్తూ ఉంటారు వెంకటేశ్వరరావు గారు. పార్వతమ్మా, వసంతా ఇద్దరూ చెరో పదివేలు ఏటా ఆశ్రమానికి విరాళం ఇచ్చే దాతల్లో ఉన్నారు.
“చాలా బావుంది బాబూ! ఇక్కడ. చూడగానే ఇక్కడికి వచ్చెయ్యాలనిపించేట్టు” అంది పార్వతమ్మ మొదటిసారి వెళ్ళినప్పుడు. “మీరెప్పుడు జేరతానంటే అప్పుడు మీతో కాలక్షేపానికి నేను కూడా ఆఫీస్‌లో క్లర్కుగా జేరిపోతానమ్మా!” అన్నారాయన నవ్వుతూ. అంతటి స్నేహశీలి వెంకటేశ్వరరావు గారు.
(సశేషం)