మలిసంజ కెంజాయ! -4

8
2

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[ఒకరోజు పార్వతమ్మ సహాయకురాలు సీతమ్మ పనికి రాకపోతే, ఆవిడ కంగారుపడతారు. అది గమనించిన వసంత తన ఇంటిలో పనిచేసే అమ్మాయి చేత ఆవిడకి సాయం చేయిస్తుంది. మర్నాడు ఉదయం సీతమ్మ వస్తే, నిన్న ఏమయింది రాలేదు అని అడిగితే, ఒంట్లో బాలేదని అందువల్ల రాలేదనీ, ఈరోజు కూడా రాకపోతే పార్వతమ్మ కంగారుపడతారని వచ్చానని చెప్తుంది. పార్వతమ్మ, సీతమ్మ ఇడ్లీలు తిని కాఫీ తాగాక వసంత వచ్చి సీతమ్మకి రెండు టాబ్లెట్లు ఇచ్చి ఒకటిప్పుడు, ఇంకొటి రాత్రి వేసుకోమంటుంది. ఒంట్లో బాలేనప్పుడు కొడుకు ఇంటికి వెళ్ళచ్చుగా అని పార్వతమ్మ అడిగితే బాధపడుతుంది సీతమ్మ. తనని కోడలు సరిగా చూసుకోదని, చీదరించుకుంటుందనీ, అందుకే అక్కడికి వెళ్ళనని అంటుంది. అవసరమైతే చివరిదశలో ఏ ఆశ్రమంలోనైనా చేరిపోతానని అంటుంది సీతమ్మ. సీతమ్మ వెళ్ళాకా, ఎనభై ఏళ్ళు దాటాక బతక్కూడదని వసంతతో అంటుంది పార్వతమ్మ. మన జీవితం మీద మనకి గౌరవం ఉండాలి అంటూ వసంత ధైర్యం చెబుతుంది. ఒకరోజు వసంత మనవలిద్దరూ వస్తారు. వారం రోజుల పాటు మనవలతో ఆనందంగా గడుపుతారు వసంత, పార్వతమ్మ. వారం తర్వాత అల్లుడు శ్రీరామ్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. నిర్మల రాలేదేం అని వసంత అడిగితే, స్నేహితులు వచ్చారు, వాళ్ళతో తిరిగుతోందని అని చెప్పి వెళ్ళిపోతాడు. ఓ రోజు వసంతకి వెంకటేశ్వరరావు మాస్టారు ఫోన్ చేసి తాను కాసేపట్లో వసంత వాళ్ళింటికి వస్తున్నానని, పార్వతమ్మ గారిని కూడా పిలవమని చెప్తారు. ఆయన వసంత పని చేసిన స్కూలుకి హెడ్ మాస్టర్‍గా చేసి రిటైరయ్యారు. ‘వెంకటలక్ష్మీ పెద్దల ఆశ్రమం’ అని ఆశ్రమాన్ని స్థాపించి, పాతిక నుంచి ముప్ఫయి మంది ఆడవారికి ఆశ్రయం కల్పించారు. అవసరమైన వసతులతో ఏర్పాటు చేసి పెద్దలందరికీ అనువుగా ఉండే వాతావరణాన్ని కల్పించారు. అక్కడ అందరూ ఒకరిపై మరొకరు ప్రేమతో, ఆప్యాయతతో ఉంటారు. అందరూ కలిసి పనులు చేసుకుంటారు. ఆ ఆశ్రమంలో అప్పుడప్పుడూ ప్రవచనకారుల్నీ, పెద్దల్నీ పిలిచి సత్సంగం పెట్టిస్తూ ఉంటారు. అలాంటి మీటింగులకి వసంత, పార్వతమ్మ గారు కూడా వెళుతూ ఉంటారు. ఆ ఆశ్రమానికి తమకి వీలైనంత విరాళం అందించే వసంత, పార్వతమ్మలంటే ఆయనకి బాగా అభిమానం. ఇక చదవండి.]

[dropcap]స[/dropcap]రిగ్గా నాలుగయ్యేసరికి వసంతా,పార్వతమ్మగారు సిద్ధంగా కూర్చోగానే వెంకటేశ్వరరావు వచ్చేసారు.

“రండి బాబూ!” అంది పార్వతమ్మగారు గేట్ లోంచి మాష్టారు రావడం చూసి, కటకటాల తలుపు తీస్తూ. కటకటాలకి కుడి వైపు వసంత ఇంటి భాగమూ, వెనక పార్వతమ్మగారి వాటా ఉంటుంది.

“అక్కయ్య గారికి నమస్కారం. ఎలా ఉన్నారమ్మా?”

“ఏదో మీ దయ వల్ల బానే ఉన్నాం. మీరిలా అప్పుడప్పుడూ వచ్చి పలకరిస్తుంటే మా వయసు వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందో! మా తమ్ముడొచ్చినట్టే నాకు” అందామె.

“నా దయ కాదు, మీ దీవెన”

“మావి ఉత్తుత్తి దీవెనలు. పని చేసేది మీరు”

“పని ఫలించాలంటే మంచి మనసుతో ఇచ్చే దీవెనలుండాలి కదా!” అంటూ నవ్వారాయన.

“మాష్టారూ! కాస్త కాళ్ళూ, చేతులూ, మొహమూ కడుక్కుంటే చల్లగా ఉంటుంది” అంటూ తువ్వాలిచ్చింది వసంత.

“నిజమేనమ్మా! ఎక్కడెక్కడో తిరిగాను కదా!” అంటూ మొహం కడుక్కునొచ్చారాయన.

వసంత, ప్లేట్లలో యాపిల్ ముక్కలూ, బిస్కట్లూ తెచ్చింది. ముగ్గురూ మాట్లాడుకుంటూ తిన్నారు. తర్వాత వెళ్లి వసంత తీసుకొచ్చిన టీ తాగడం మొదలు పెట్టారు.

“మాష్టారూ! ఇలా అప్పుడప్పుడూ, మనమంతా కలిసి సత్సంగంలో కూర్చుని, నాలుగు మంచి మాటలు వినడంవల్ల మనోవికాసం కలుగుతుంది. ఇంటినుండి బైటికి రావడంవల్ల శరీరానికి కూడా ఈ కదలిక ఉత్సాహాన్నిస్తుంది” అంది వసంత.

పార్వతమ్మ కూడా నవ్వుతూ “మొన్నే అనుకున్నాం, మన ఆశ్రమంలో ప్రోగ్రాం కెళ్ళి చాలా రోజులయ్యిందని నేనూ, వసంతా” అంది.

“అందుకేగా వెంటనే పెట్టేసాను! మీ కిష్టమైన పెద్దాయన వస్తున్నారు ఎల్లుండి ఆదివారం నాడు. మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఆయన”

“రామ్మారుతి గారా?” అడిగింది పార్వతమ్మ గబుక్కున.

“చూసావా వసంతా! హెడ్ మాస్టర్‌ల కన్నా అక్కయ్యగారిది చురుకైన బుర్ర” అని అనగానే ముగ్గురూ నవ్వుకున్నారు.

“ఈ సారి మారుతి గారు దేని గురించి మాట్లాడతారో?” అన్న పార్వతమ్మ ప్రశ్నకి,

“ఏకాంతం” అన్నాడాయన. ఆశ్చర్యంగా చూసిన ఆమెతో “అదేనమ్మా ఒంటరితనం. రెండిటి గురించీ”

“నా కిప్పుడదే కదా వస్తాం” అందామె.

“అలా అనుకోకూడదు. అందరం ఎవరికి వారు ఒంటరివారమే” అన్నఆయన మాటలకి జవాబుగా

“మారుతి గారు చెప్పే సంగతి ఏదయినా మనసు తేలిక పడేట్టూ, నవ్వుకునేట్టూ చెబుతారు మాష్టారూ! అందుకే మాకిష్టం” అంది వసంత.

“మనకి అలాంటి వాళ్లే కావాలి కానీ, పాపం, పుణ్యం అంటూ మనల్ని ఇంకా భయపెట్టేవాళ్ళు వద్దు” అన్నారాయన వెళ్ళడానికి లేస్తూ.

“సరే మాష్టారూ! ఆదివారం నాడు ఓ అరగంట ముందొచ్చి పిన్నిగారూ, నేనూ ఆ పక్కనున్న మామిడి తోటలో కాస్త నాలుగడుగులు వేస్తాం” అంది వసంత.

“అడుగులే వెయ్యాలి కానీ, కాయలు తెంపరాదు సుమా!”

“అవి తినే వయసా మాస్టారూ?” అని వసంత అనగానే ముగ్గురూ నవ్వుకున్నారు.

ఆ ఆదివారం సరిగ్గా రెండయ్యేసరికి వసంత కుదిర్చిన ఆటో అబ్బాయి వచ్చి కూర్చున్నాడు ఇంటిముందు. అక్కడికి అయిదు కిలోమీటర్లుంది ఆశ్రమం. పావుగంటలో అక్కడికి చేరారు వసంతా, పార్వతమ్మా. తిన్నగా ఆశ్రమం లోకి వెళ్లకుండా పక్కనున్న తోటలోకి ప్రవేశించారిద్దరూ.

“ఈ తోటలోకి రాగానే మా తాతగారి మావిడి తోట గుర్తొస్తుంది నాకు” అంది పార్వతమ్మ. కొంతసేపు నడిచి అక్కడున్న సిమెంట్ గట్టుపై కూర్చుంటూ “ఇక్కడ కాస్త నీడగా ఉంది” అంది. వసంత కూడా పక్కనే కూర్చుంది. ఓ పది నిమిషాలు కబుర్లు చెప్పుకున్నారు.

ఇంతలో వాచ్‌మాన్ కొడుకు పరుగున వచ్చి “ఉపన్యాసం పంతులు గారు వచ్చేశారమ్మా! రండి, రండి.” అన్నాడు.

ఇద్దరూ కాస్త గబగబా నడిచి ఆశ్రమం పక్క గేట్ లోంచి లోపలికి నడిచారు. అప్పటికే రామ్మారుతి గారు మీటింగ్ హాల్‌లో మైక్ ముందు కూర్చున్నారు.అంతా కాస్త హడావిడిగా సర్దుకున్నారు. సరిగ్గా మూడయ్యింది. ముందువరసలో వెంకటేశ్వరరావుగారూ ఆయన మిత్రులూ ఉన్నారు. “అయ్యా! మేము రోడ్ మీద ఎదురు చూస్తూనే ఉన్నామండీ. ఎలా వచ్చేసారో మరి మీరు?” అన్నాడు ఆఫీస్‌లో పనిచేసే క్లర్క్ పట్టాభి, రామ్మారుతి గారికి మంచినీళ్లిస్తూ.

నీళ్లు తాగి “నా పేరే మారుతి, నేనెలాగైనా వచ్చెయ్యగలను. అంటే చెట్లెక్కి రాలేదమ్మా! చేల గట్లమ్మటా వచ్చేనన్నమాట” అంటూ అందరినీ నవ్వించి ప్రసంగం మొదలు పెట్టారు.

“అందరికీ నమస్కారం. అమ్మా అందరూ కులాసాయేనా?” అంటూ అక్కడుండే స్త్రీలను పలకరించి “మన ఆశ్రమం మూల స్తంభాలు మనకి పంచ పాండవులున్నారు. మనకేమీ భయం లేదమ్మా!” అంటూ వెంకటేశ్వరరావు గారి మిత్రులందరి వైపూ చూసి పలకరించారు.

“అంతా కులాసాయే బాబూ!” అన్నారు మహిళలంతా.

“ఇక ప్రసంగం మొదలెడదాం. ఇవాళ మన విషయం ఏకాంతం, ఒంటరితనం” అంటూ అందరివైపూ చూసి “రెండూ ఒకటేనా? చూద్దాం” అంటూ ఉపన్యాసంలోకి వెళ్లిపోయారు.

“నలుగురితో ఉండడం ఆనందం. ఏకాంతంగా ఉండడం బ్రహ్మానందం. ఏకాంతం దొరకటం అదృష్టం అనుకోవాలి. చాలా మంది ఒంటరిగా ఉంటున్నాం అని తమమీద తామే జాలి పడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఒంటరితనాన్ని అందమైన ఏకాంతంగా మలచుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనలోకి మనం వెళ్ళడానికి అది మంచి అవకాశం. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఏకాంతంగా ఉంటేనే ప్రశాంతత దొరుకుతుంది.

అందరం ఉంటే ఏముంటుంది? ఏవో కబుర్లు. మంచి మాటలు చెప్పుకోవచ్చు. కానీ సూరమ్మ, సుబ్బమ్మ కబుర్లు చెప్పుకుంటే లాభం ఏముంటుంది? వాళ్ళలాగా, వీళ్ళిలాగా అని గంటలకి గంటలు చర్చిస్తే తలనొప్పి మిగులుతుంది తప్ప కలిసొచ్చేదేముంటుంది? మనం ఇంకోళ్ళ మీద చెప్పుకుని నవ్వుకుంటాం. మన మీద ఇంకెవరైనా చెప్పుకున్నారంటే మనకి దుఃఖం కలుగుతుంది. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళరాదు. ఎప్పుడైనా ఒక మంచి అనుభవం గురించో, గుణపాఠం గురించో చెప్పుకోవచ్చు, తప్పులేదు. అలా అని నేను నలుగురితోటీ కలవడం తప్పనడం లేదు సుమా! అందరితోటీ కలిసి మెలిసి కబుర్లు చెప్పుకోవడం, స్నేహ సంబంధాలు కలిగి ఉండడం అవసరమే, కాదని కాదు. ఒక్కళ్ళమే ఉన్నప్పుడు మన జీవితాన్ని సింహావలోకనం చేసుకోవచ్చు. పాత రోజుల్ని గుర్తు చేసుకుంటుంటే ఒక తృప్తి కూడా కలుగుతుంది.

అయితే అరుదుగా మనకి మనం ఒకళ్ళమే ఉండే అవకాశం దొరుకుతుంది. అది ఒక గొప్ప యోగం అని భావించాలి. పూజ మందిరంలో ఒక్కళ్ళే కూర్చుని ఆ భగవంతునితో మాట్లాడుకుంటే ఎంత తృప్తిగా, ధైర్యంగా ఉంటుందో గమనించండి. మన ఇబ్బందులూ, చికాకులూ చెబుతూనే, మన తప్పులు ఒప్పేసుకుంటే సరి. అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు. మన కష్టానికి ప్రపంచంలోని జనమంతా కారణం అంటాం. కానీ మనం మన తప్పు ఒప్పుకోము. అహం అడ్డొస్తుంది మనకి. దాన్ని తొలగించుకుని తండ్రి ముందు పిల్లాడివలే అన్నీ చెప్పుకుని, అలా ఆయన చిత్ర పటం ముందు కూర్చుని చూడండి. ఆ అనుభవం ఎంత బావుంటుందో!

 భగవానుని ఏ ఫోటోలో అయినా అభయ హస్తం ఉంటుంది. ఆయన నవ్వుతూనే ఉంటాడు. మనల్ని కూడా నవ్వుతూనే ఉండమంటాడు. భక్తీ, జ్ఞానమూ వాటంతట అవే పెరుగుతాయి. అలా మీరు ఏకాంతంగా ఉండడంలోని రుచిని పట్టుకోండి. అసలు గొడవలూ, అభిప్రాయభేదాలూ ఉండవు. మనసు నెమ్మదిస్తుంది. పక్కనే తోట ఉంది. ఒక భక్తి పుస్తకం పట్టుకుని ఓ చెట్టుకింద కూర్చోండి. వీలు కాలేదనుకోండి. మీ ఆశ్రమంలోనే వెనక వైపున్న ఖాళీ స్థలంలో ఓ చాపేసుకుని కూర్చోండి. లేదంటే మేడెక్కి కూర్చోండి. అందరూ అలా మౌనంగా ఉంటే అందరికీ అది ఏకాంతమే కదా! దీని వల్ల మానవ సంబంధాలు దూరమయితే అవనీయండి. అన్ని బంధాలూ తెగిపోక తప్పదు. భార్యాభర్తలకీ వియోగం ఖాయం. మానవులంతా ఏదో రోజు పడిపోయేవారే. ఎంత గొప్ప అమెరికా ప్రెసిడెంట్ అయినా, కోటానుకోట్లకు అధిపతి అయినవాడైనా ఒక రోజు వెళ్లిపోయేవాడే!

ఇలా ఆయన ప్రసంగం అనేక ఉదాహరణలతో, బోలెడన్ని చమత్కారాలతో మరో అరగంట సాగింది.

చివరిగా ఆయన ముగిస్తూ మీలోకి మీరు ప్రయాణం చేయడం అలవాటు చేసుకోండి. అదొక అభ్యాసం. సాధన, చెయ్యగా చెయ్యగా మీ మనసులు తేలికవుతాయి. అప్పుడు సరదాగా అందరితో మాట్లాడుకోవాలనిపిస్తుంది తప్ప, లేని పోని మానసిక సమస్యలు రావు. వాళ్ళలా అన్నారు, వీళ్ళు నన్ను చూడడానికి రాలేదు లాంటి చిన్న చిన్న విషయాల మీదికి మనసు వెళ్ళదు. ఒక ఆనందం నిరంతరం మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ అమ్మవారు, భగవానుడూ మనల్ని సదా కాపాడుతూనే ఉన్నారు. ఇక ముందు కూడా వాళ్లదే భారం. జీవితంలో ఇన్ని దశలు దాటి బాగానే ఉన్నాం. ఇకముందు కూడా ఉంటాం. అనుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

అంచేత మిత్రులారా! ఏకాంతాన్ని ప్రేమించండి. ఒంటరిగా ఉంటూనే ధైర్యంగా ఉండండి. పసిపిల్లల్లా సంతోషంగా ఉండండి. ఏవేవో జ్ఞాపకం చేసుకుని దిగులు చెందకండి. ఉల్లాసంగా ఉండండి” అంటూ ముగించి లేచారాయన. ఆశ్రమవాసులైన ఆడవారందరూ ఆయనకి దగ్గరగా వెళ్లి “చాలా మంచి, మంచి మాటలు నవ్విస్తూ చెప్పారు బాబూ! మీరు ఇలాగే మళ్ళీ మళ్ళీ వస్తా ఉండాలి” అంటూ నమస్కరించారు.

“తప్పకుండా అమ్మా! ఇక్కడికి రావడం నాక్కూడా ఆనందమే. మీరంతా నా అక్కచెల్లెళ్ళే కదా! తప్పక వస్తానమ్మా” అన్నారాయన. వెంకటేశ్వరరావుగారూ మిత్రులూ మారుతి గారిని ఆఫీస్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి పాలూ, పళ్ళూ ఇచ్చారు. అక్కడ కొంతసేపున్నాక ఆయన్ని వెంకటేశ్వరరావు గారు తన కారులో ఇంటివరకూ తీసుకెళ్లి దింపి వచ్చారు.

ఆటోలో తిరిగి వస్తుంటే అంది పార్వతమ్మ “మారుతిగారు చెప్పింది నిజమే వసంతా! ఇక్కడుంటే అయ్యో! ఒక్కదాన్నీ ఉన్నానే! అనిపిస్తుంది. పిల్లల దగ్గరికి వెళితే పెద్ద గందరగోళంలో పడ్డట్టనిపిస్తుంది.”

“అవును పిన్నీ! రిటైర్ అయ్యాక, నాక్కూడా స్థిమితంగా ఉంది. ఒకో పనీ నెమ్మదిగా చేసుకుంటున్నాను. అప్పుడు హడావిడిగా మొక్కుబడిగా పూజచేసేదాన్ని” అంటూండగానే ఆటోలో ఇల్లు చేరారిద్దరూ. “ఇలా వెళ్లడం వల్ల వొళ్ళు కాస్త అలిసినా, మనసుకి బావుంది” అంటూ తాళం తీసి ఇంట్లోకెళ్ళిపోయింది పార్వతమ్మ.

మర్నాడు భర్త వెళ్ళాక బట్టలారేసుకుంటూ ఉండగా వసంతకి ప్రమీలక్క గుర్తొచ్చింది. ‘ఈ మధ్య అక్కతో సరదాగా మాట్లాడి చాలా కాలం అయింది. అయిదారు నెలలయినట్టుంది. నెలకొకసారయినా అక్క తన ఆరోగ్యం గురించీ, బావగారి ఆరోగ్యం గురించీ, ఇంకా అమెరికాలో ఉండే కూతురి గురించీ బోలెడు కబుర్లు ఒక గంటైనా చెప్పేది. ఈ మధ్య తానే రెండు మూడు సార్లు చేసినట్టుంది. అప్పుడు అక్క ముక్తసరిగా మాట్లాడింది ఎందుకో. ఆ! ఏముంది? కూతురు ఫ్యామిలీ వచ్చాక సామాను వచ్చి ఉంటుంది. ఇల్లు చూసుకుని, పాలు పొంగించి, సామాను సర్దే పనులుంటాయి కదా! అదే ఓ నెల పట్టి ఉంటుందిలే. కూతురిప్పుడు ఊళ్ళోనే ఉందిగా. అటూ ఇటూ అంతా సరదాగా తిరుగుతూ ఉండి ఉంటారు. ఇవాళ ఫోన్ చెయ్యాలి’ అనుకుంటూ భోజనం చేసాక అక్కగారికి కాల్ చేసింది వసంత.

ఫోన్ ఎత్తిన అక్కయ్యతో “ఏంటక్కా ఫోన్ చేయట్లేదు. నేను చేసినా సరిగా మాట్లాడట్లేదు. బిజీబిజీగా ఉన్నట్టున్నావ్? కూతురు వచ్చింది కదా! అందుకే చెల్లెల్నిమర్చిపోయావు” అంది వసంత నవ్వుతూ.

అవతల నుంచి అక్క ప్రమీల “వసంతా! ఏం చెప్పనే?” అంటూ ఏడ్చేసింది.

“అయ్యో! అక్కా! ఏమైంది? అంతా కులాసాయే కదా!” ఆతృతగా అంది వసంత.

“ఆ కులాసానేలే!”

“మరెందుకక్కా! బాధ పడుతున్నావ్? చెప్పమ్మా! చెప్తే కదా తెలిసేది. ఒంట్లో బాగోకపోతే నేను రానా? వారం రోజులు ఉండమంటావా? మీ మరిది గారు ఏదో ఒకటి తింటారులే. అలా అనుకునే మనిషి కాదులే! రమ్మంటావా?”

“నువ్వు రావడం కాదు. చెప్పేది విను. నా ఆరోగ్యం బానే ఉంది. భార్గవి వచ్చి, సామాను సర్దుకుంది. మంచి ఇల్లు తీసుకుంది. ఇద్దరూ ఉద్యోగాలు చూసుకుని చేసుకుంటున్నారు. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్‌లో వేసింది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కదా! వాళ్ల చదువు వాళ్ళు చదువుకుంటున్నారు. సంతోషమే! అంతా బానే ఉంది. కాకపోతే అది పిల్లల్ని, అల్లుణ్ణీ, తీసుకుని ప్రతి శుక్రవారం రాత్రి వచ్చేసి శని ఆదివారాలు ఇక్క డే ఉండి, ఆదివారం రాత్రి భోజనాలు చేసి వెళుతోంది.

ఆరునెలల క్రితం అది ఇక్కడే దిగింది. తర్వాత మాదాపూర్‌లో కోటిన్నర పెట్టి పెద్ద ఫ్లాట్ తీసుకుంది. దానిలో ఫర్నిచర్ కోసం, గృహప్రవేశము కోసం షాపులకూ, వాటికీ వీటికీ ఓ రెండునెలలు తెగతిరిగాం. తర్వాత పూజ చేసుకుని ఇంట్లో దిగింది. కార్ కూడా కొనుక్కుంది. అమ్మయ్య! దానింట్లో అది పడింది. నా ఇంట్లో నేను పడి ఉండొచ్చు ఎప్పుడైనా వాళ్ళూ రావొచ్చు. మేమూ వెళ్లొచ్చు అనుకున్నాను. ఇప్పటి పరిస్థితి అది కాదే తల్లీ!

మేమిద్దరమే ఉంటే నా పని నాకు పెద్ద భారం కాదు. నీకు తెలుసు కదా! నాకు కూడా చాలా కంప్లైంట్‌లు ఉన్నాయి కదే! బిపి ఉంది, షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది. దాంతో ఎక్కువ పని చేయలేకపోతున్నాను. అది వచ్చినప్పుడు అన్నీ స్పెషల్స్ చేయాల్సి వస్తోంది. చెయ్యొచ్చు. చెయ్యాలి. నిజమే. కానీ అది నా కూతురే కదా! పరాయిది కాదు. అయితే నాకు కొంచెం కూడా సాయం చేయదు. ‘నేను వచ్చాక వండుదాం, నువ్వు చేయకు’ అని మాటవరసకు అంటుంది. సరిగ్గా భోజనం చేసే టైంకి వస్తుంది. ఆ టైం వరకూ వండకుండా ఉండలేను కదా! నాకు రెస్ట్ తగ్గిపోయి నీరసంగా ఉంటోంది. నేను చెయ్యలేనే బాబూ! అని చెప్పలేను. మీ బావగారికివన్నీ తెలీవు. వాళ్లొస్తున్నారంటే అన్నీ తెచ్చి పడేసి, నా పని నేను చేసేసాను అనుకుంటూ ఉంటారు.

పిల్లలు చికెన్ తప్ప ఏదీ తినరు. శుక్రవారమే తెచ్చి వండుకుని, పెరుగు తోడు పెట్టుకుని, సాంబారు పెట్టుకుని, స్వీట్ హాట్ తెప్పించుకుని కూర్చుంటున్నాను. నాకిప్పుడు శనివారం వస్తోందంటే భయం వేస్తోంది. వాళ్ళు వెళ్ళాక రెండు రోజుల వరకూ ఒకటే వళ్ళు నెప్పులుంటాయి వసంతా!” అంటుంటే ఆమెకి కంఠం రుద్ధమయ్యింది.

వసంతకీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంతలోనే సర్దుకుని “బావని ఇటు పిలు?” అంది కోపంగా.

“వద్దులే! ఆయనకి కూతురంటే ప్రాణం. దాని తర్వాతే నేను. ఆయన అన్నీ చూస్తూనే ఉంటారు. ఏమీ ఎరగనట్టుంటారు. తండ్రీకూతురూ ఒకే రకం. వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు. పక్క వాళ్ళు ఏమయిపోయినా వాళ్లకు పట్టదు. ఎప్పుడైనా అల్లుడే రండి మా ఇంటికి అంటాడు. ఇది ఆ మాట కూడా ఎప్పుడూ అనదు”

“నేను చేయలేనని చెప్పు.ఆరోగ్యం బాలేదని చెప్పు”

“దానికన్నీ తెలుసు. నాకు మోకాళ్ళు నొప్పులనీ తెలుసు. కుంటుతున్నా కూడా చూస్తూనే ఉంటుంది. ఏమీ అనదు. చూసీ చూడనట్టు ఊరుకుంటుంది. మనవలకీ, కూతురికీ చెయ్యడం నీ బాధ్యత, తప్పదు నీకు అన్నట్టుంటుంది దాని వరస. దయలేని కోడలిపై ఊరందరికీ చెప్పుకుంటాం. కూతురి గురించి చెప్పుకోలేం. ఇది కదా నరకం.”

“మరి మీరు కూడా ఎప్పుడైనా వెళ్లి రెండు మూడు రోజులు దానింట్లో ఉండటం లేదా? అలా చేస్తే నీకు కూడా కాస్త ఉత్సాహంగా ఉండేదేమో!”

“భలే చెప్పావులే. అదేమో అమెరికాలో ఇన్నేళ్లూ ఎక్కడికీ వెళ్లడానికి లేక ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు నేను బాగా సుఖపడాలి. ఊర్లో అమ్మ ఉంది. నాన్న ఉన్నారు. నేను వాళ్ళింటికి వెళ్ళిపోయి అక్కడ హాయిగా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటోంది. నా గురించీ, నా రెస్ట్ గురించీ అదెక్కడా ఆలోచించడం లేదు. నా బీపీ. షుగర్ గురించి ఎన్నడూ అడగదు. నేను చెప్పబోతుంటే, ‘మేమింక వెళ్ళిపోతాం లేమ్మా! నువ్వు రెస్ట్ తీసుకో!’ అని వెటకారంగా అంటుంది. మరోసారి నా ఆరోగ్యం సంగతి ఎత్తకుండా. అంతే తప్ప కన్న వాళ్ళ మీద సానుభూతీ లేదు, చట్టుబండలూ లేదు దానికి. పెద్ద చదువులు చదివి దేశాంతరం పోతే మనుషులిలా మారిపోతారన్నమాట.”

“ఇదెక్కడి బాధే బాబూ! కూతురు ఇండియా వస్తోంది. మీరేమో పెద్దవయసులో పడుతున్నారు, మిమ్మల్ని చూస్తుంది అని మేం అనుకున్నాం.” అంది వసంత బాధగా.

 “ఎవరైనా బయట వాళ్ళు బాధ పెడితే, వాళ్ళకీ వీళ్లకీ చెప్పుకుంటాం. సానుభూతి పొందుతాం. మన పిల్లల మీద ఎవరికైనా ఏం చెప్పుకుంటాం చెప్పు! ఆ విషయం తెలిస్తే నా కూతురికీ, అల్లుడికీ కోపం రాదా? మళ్ళీ అదో తప్పవుతుందే తల్లీ! ఈ మాటలు ఎవరితో అనకు. లేనిపోని గొడవలు. ఏమోనే! ఏం చెప్పమంటావే? కూతురు వచ్చిందన్న ఆనందమే పోయింది. ఇంకా అది పెద్దది అయ్యింది కాబట్టి అన్నీ సర్దుకుంటుంది. నాకు కూడా సాయం చేస్తుంది. ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేకపోతే దాని దగ్గరికి వెళితే చూసుకుంటుంది. అని ఆశ పడ్డానే! రాత్రి పడుకుంటే నిద్ర పట్టట్లేదు” అందామె దుఃఖంతో గొంతు పూడుకుపోగా.

“నువ్వలా బాధపడకక్కా! అది ఇంకా చిన్న పిల్లలే! దానికి తెలియట్లేదు తను పెద్దదయిందనీ తల్లితండ్రుల్ని దయగా, ప్రేమగా చూడాలనీ. ఎక్కువ ఆలోచించకు. అది మన పిల్లే కదా నచ్చచెప్పుకుందాంలే!” ఓదార్పుగా అంది వసంత.

“అది అర్థం చేసుకుంటుందంటావా?” అంది ప్రమీల.

“నీకెందుకు, నేను చూసుకుంటాను. నువ్వీ సంగతి నాకొదిలేయ్” అంది వసంత.

“నీతో చెప్పుకుంటే నాకు అమ్మకు చెప్పుకున్నట్టుందే” కాస్త తేరుకుంటూ అంది ప్రమీల.

“అక్కా! నువ్వు మరీ బెదిరిపోకు. సమస్యలు అలాగే ఉండిపోవు. సర్దుకుంటాయి. వీలు చూసుకుని నేనొస్తాన్లే. అప్పుడు దానికి నేనన్నీ వివరిస్తాను. అది నాకు మాత్రం కూతురు కాదా? నా మాట విని అర్థం చేసుకుంటుందిలే. నువ్వు ధైర్యంగా ఉండు” అంది వసంత.

“సరే అలాగే. ఉంటానే!” అంటూ ఫోన్ పెట్టేసింది ప్రమీల.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here