[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
[వసంతకి ఫోన్‍లో చెప్పిన కాసేపటికి వెంకటేశ్వరరావుగారు వాళ్ళింటికి వెళ్తారు. పార్వతమ్మ ఆయనని అభిమానంగా పలకరిస్తుంది. ఆయనని తమ్ముడిలా భావిస్తుందామె. మొహం కాళ్ళు చేతూలు కడుక్కుని రమ్మని తువ్వాలు ఇస్తుంది వసంత. ఆయన కడుక్కుని వచ్చకా, ఒక ప్లేట్‍లో యాపిల్ ముక్కలూ, బిస్కట్లూ తెస్తుంది. అవి తిని, వసంత తెచ్చిన టీ తాగాకా, ఆయన తను ఎందుకు వచ్చింది చెప్తారు. ఎల్లుండి ఆదివారం రామమారుతి గారితో ఆశ్రమంలో కార్యక్రమం ఉందని చెప్తారు. ఈసారి ఆయన దేని గురించి మాట్లాడుతారని పార్వతమ్మ అడిగితే – ఏకాంతం, ఒంటరితనం గురించి అని చెప్తారాయన. వాళ్ళిద్దరూ తప్పక వస్తామని చెప్తారు. కాసేపు కూర్చుని వెంకటేశ్వరరావు గారు వెళ్ళిపోతారు. అనుకున్నట్టు గానే ఆదివారం ఆశ్రమానికి కాస్త ముందుగానే వెళ్ళి, అక్కడి తోటలో కాసేపు నడుస్తారు వసంత, పార్వతమ్మ. కాసేపటికి రామమారుతి గారు రావడంతో కార్యక్రమం మొదలవుతుంది. కాసేపు ఆయన అందరినీ నవ్వించి, తరువాత తన ప్రసంగం మొదలుపెడతారు. ఏకాంతం, ఒంటరితనం – రెండూ ఒకటే అనిపించినా, అవి ఒకటి కావని – అందరికీ అర్థమయ్యేలా ఉదాహరణలతో వివరిస్తారు. బోలెడన్ని చమత్కారాలతో మరో అరగంట మాట్లాడి, తన ఉపన్యాసం ముగిస్తారాయన. ఆటోలో ఇంటికి తిరిగివస్తూ రామమారుతి గారు చెప్పినవన్నీ నిజాలే అని అనుకుంటారు పార్వతమ్మా, వసంత. మర్నాడు – తన అక్క ప్రమీలతో మాట్లాడి చాలా రోజులయ్యిందని – ఆమెకి ఫోన్ చేస్తుంది. కూతురు వచ్చిందని, చెల్లెల్ని మరిచిపోయావని వసంత అనగానే ప్రమీల ఏడ్చేస్తుంది. రెట్టించి అడగగా కూతురు భార్గవితో తాను ఎదుర్కుంటున్న సమస్యలని వసంతకి చెప్పుకుంటుంది ప్రమీల. మన పిల్లల మీద ఎవరికైనా ఏం చెప్పుకుంటాం చెప్పు అని అంటుంది. వసంత అక్కని ఓదారుస్తుంది. వీలు చేసుకుని తాను భార్గవితో మాట్లాడుతానని, తనకి అర్థమయ్యేలా చెప్తానని అక్కని భరోసా ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది వసంత. ఇక చదవండి.]
[dropcap]మ[/dropcap]ర్నాడు ఆదివారం. వెంకట్రావు తన మిత్రుడొకాయన రమ్మన్నాడని తొమ్మిదికల్లా టిఫిన్ చేసి బైటికెళ్ళాడు.
వాతావరణం ఎంతో చల్లగా, హాయిగా ఉంది ఆ రోజు. పెరటివైపు గట్టు మీద పార్వతమ్మ తీరిగ్గా కూర్చుంది.
వసంత మొక్కల్లో పని చూసుకుంటోంది భర్త వెళ్ళాక. ఖాళీ స్థలంలో మొక్కలు బాగా పెంచిందామె. పెరటివైపు నందివర్ధనం, నిత్యమల్లి, పచ్చపూలు నిత్యం దేవుడికి పూలనిస్తుంటాయి.ఆ పక్కనే కరివేపాకు చెట్టుంది. ఇంటికి ఒక పక్క మల్లెపందిరీ, జాజి పందిరీ ఉన్నాయి. మరోవైపు గన్నేరు, రెండు రకాల మందారాలు పూస్తుంటాయి.
ఆ మొక్కల్లో చిన్న గునపం తీసుకుని తవ్వుతూ ఎండు ఆకుల్ని తీసేస్తోంది. కొంత సేపు కూర్చుని మెల్లగా నడుచుకుంటూ వసంత పని చేసుకునే దగ్గరకి ఒక స్టూల్ తెచ్చుకుని చూస్తూ కూర్చుంది పార్వతమ్మ.
“టిఫిన్ ఏంటి?” వసంత ప్రశ్నకి “అటుకుల ఉప్మా” అందామె.
“ఇవాళ మీ అమ్మాయీ, మా సీతమ్మా త్వరగా వచ్చి వెళ్లారు. మనకి తీరిగ్గా అనిపిస్తోంది. దానికి తోడు చల్లగా కూడా ఉంది”
“అవును పిన్నీ! ఈయన కూడా బైటికెళ్లారు. అందుకే ఇక్కడ పని పెట్టుకున్నా!”
“కష్ట పడే పిల్లవి నువ్వు. టీవీ ముందు మొద్దులా పడి ఉండలేవు”
“ఉద్యోగం చేసిన అలవాటు. ఆ సీరియళ్ల మీద మోజుండదు మాకు. జీవితం వేరు అవి వేరు. పనికొచ్చే పనేదైనా చెయ్యడం, లేదంటే మంచి పుస్తకాలు చదువుకోవడం ఇష్టం పిన్నీ నాకు”
అలా ఆ కబురూ,ఈ కబురూ చెబుతూ నిన్న తన అక్క ప్రమీల గురించి చూచాయగా పార్వతమ్మకి చెప్పింది వసంత.
పార్వతమ్మ ముక్కున వేలేసుకుంది. “నేనెప్పుడూ నా కడుపున నీ లాంటి ఓ ఆడపిల్ల పుడితే నన్ను కడుపులో పడేసుకునేది కాదా? అని బాధ పడతాను. ఇలాంటి కూతుళ్లు కూడా ఉంటారా? కలికాలం! ఎన్ని విడ్డూరాలైనా జరుగుతాయి.”
“ఇది విడ్డూరం కాదు పిన్నీ. బాధాకరం”
“కాదు మరీ! అన్యాయం కూడానూ” అందామె.
“మీ చిన్నబ్బాయి కబురేమన్నా తెలిసిందా? పిన్నీ!”
“తెలిసేదేముందీ? నేను చేస్తే మాట్లాడతారు కొడుకూ, కోడలూ. అంతే తప్ప వాళ్ళు ఫోన్ చెయ్యరు! వాళ్లంత ఖాళీ లేకుండా ఉంటారు. నేనొకదాన్ని ఇక్కడ ఉన్నానన్న ధ్యాసే ఉండదు వాళ్ళకి. పండగ పూట కూడా నేను గుర్తు రాను. పలకరిస్తే పలకడానికి బాధ. కొడుక్కే అమ్మెలా ఉందో అని లేనప్పుడు కోడలికీ, మనవలికీ లేకపోవడంతో తప్పేముందీ!”
పార్వతమ్మ మాటల్లో కోపం ఉన్నా, ఆమె గుండెల్లో ఉన్న దుఃఖం స్పష్టంగా వినిపించింది వసంతకి.
చిన్నకొడుకూ, కోడలి మాట ఎత్తి అప్పటివరకూ పెద్దావిడకున్న ఉల్లాసం కాస్తా పోగొట్టానేమో! అని బాధ పడింది వసంత. మరో మాట మాట్లాడకుండా మౌనం దాల్చింది.
“ఇక లేచి స్నానం చేసి వంట చేసుకో, వసంతా! ఎండెక్కింది. నేను కూడా వంటింట్లోకి వెళతాను” అంటూ పక్కనున్న చెట్టు కొమ్మ ఊతం చేసుకుని లేవబోతుంటే వసంత లేచి చెయ్యి పట్టుకుంది. ఇద్దరూ ఎవరి పోర్షన్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి వంట పనిలో పడ్డారు.
ఆ మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఇంటి ముందు కారాగిన చప్పుడుకూ, తర్వాత గేటు సరిగా రాక అవస్థ పడుతున్న చప్పుడుకూ, బైటికొచ్చిన వసంత గేటు తీసింది.
ఎదురుగా చక్కటి డ్రెస్ వేసుకున్న ఒకామె కారు దిగడం చూసి ఎవరబ్బా? అనుకుంది వసంత. “బావున్నారా? వసంతా! నేను రాణిని” అని పలకరించగానే గుర్తు పట్టింది పార్వతమ్మ చిన్నకోడలు రాణిని.
“రాణీ, మీరా? రండి రండి. నిన్ననే అనుకున్నాం మీ గురించి” అంటూ వెనక్కి నడిచిందామె.
మాటలు వినబడి తలుపు తీసిన పార్వతమ్మ ఎదురుగా వస్తున్న కోడల్ని చూసి సంబరపడిపోయింది.
“రా తల్లీ!” అంటూ కటకటాల్లోంచి లోపలికి నడిచిందామె.
లోపలికి అడుగు పెడుతూనే అత్తగారి కాళ్ళకి నమస్కారం చేసి, ఆపై కౌగలించుకుని “లవ్ యూ అత్తయ్యా!” అంది రాణి. అక్కడే నిలబడి చూస్తున్న వసంత ‘పండగ రోజు ఉదయాన్నే ఫోన్ చేస్తే విసుక్కున్న రాణీయేనా ఈమె? రకరకాల మూడ్స్‌లో ఉంటుందన్న మాట’ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. డ్రైవర్ బ్యాగులు తెచ్చి ఇంట్లో పెట్టాడు.
“ఇదిగో అత్తయ్యా! పూతరేకులు, సున్నుండలూ! ఈ బాక్స్‌లో ఉన్నాయి. పాలకోవా, కారప్పూసా ఈ పొట్లాల్లో ఉన్నాయి” అంటూ ప్యాకెట్లు తీసి టీపాయ్ మీద పెట్టింది. ఈ స్వీట్స్ అన్నీ తలో రెండూ వసంతగారికివ్వండి. మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటోందావిడ” అంది రాణి.
“ఎందుకివ్వనూ? తానేది వండినా నాకు వాటా ఇస్తుంది వసంత” అంది పార్వతమ్మ.
“మనిద్దరికీ టిఫిన్ ప్యాక్ చేయించుకు తెచ్చేసాను తినేద్దాం. మొహం కడుక్కుని వచ్చేస్తాను” అంటూ బాత్రూంకి వెళ్లి, వచ్చింది. ఇద్దరూ టిఫిన్ తిన్నాక కాఫీ తాగారు.
“అత్తయ్యా! నాకు రెండు ఫంక్షన్ లున్నాయి. ఒకటి పెళ్లి, మరొకటి లంగావోణీ వేడుక. ఓ నాలుగు రోజులుంటాను నేను. వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. మీరు రెడీ అవ్వండి. బట్టలవీ చూసుకోండి”
“ఇప్పుడెందుకు రాణీ! తర్వాత చూద్దాంలే”
“అదేం కుదరదు. బావగారింటికి వెళ్లొచ్చారు. మా దగ్గర కూడా ఉండాల్సిందే!”
పార్వతమ్మ ఏదో అనేలోగానే “బావగారి షష్టిపూర్తి బాగా జరిగిందా?” అంటూ వివరాలడిగి, “చూసారా? బావగారు మమ్మల్ని మాట వరసకయినా రమ్మనలేదు. అంత కానివాళ్ళం అయ్యామా?” అంటూ ఒక గంట “అక్కా, బావగారూ ఎంత అన్యాయంగా మమ్మల్ని ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని మాటలన్నారో గుర్తుందికదా మీకు?” అంటూ ఒక పాత రికార్డు వేసింది. పార్వతమ్మ మౌనంగా ఫ్రిజ్ లోంచి కూరగాయలు బైట పెట్టే పనిలో పడింది.
కోడలు స్నానం చేసి వచ్చి కూరలు వండేసి, ఓ రెండు గంటలు నిద్రపోయి లేచి, ఎవరెవరితోనో ఒక గంట ఫోన్ మాట్లాడింది. మర్నాడు ఐదుకే లేచి కొన్ని చీరలు చిన్న బాగ్‌లో సర్దుకుని కార్లో వెళ్ళిపోయింది.
వెంకట్రావు వెళ్ళిపోయాక స్వీట్ లూ, కారప్పూసా చెరొక బాక్స్‌లో వేసుకుని వచ్చి వసంతకిస్తూ “గాలివాన వెలిసింది” అంటూ కూర్చుంది పార్వతమ్మ.
“ఎందుకు పిన్నీ! మీరే ఉంచుకోండి. తినండి నాలుగు రోజులు” అంది మొహమాటపడుతూ వసంత.
“ఇవ్వమని కూడా రాణి గారి ఆర్డర్ మరి” అందామె నవ్వుతూ.
“కాళ్ళకి దణ్ణాలు బాగానే పెట్టిందండోయ్!” అన్న వసంత మాటకి “దణ్ణాలు పెట్టాగలదు. కాళ్ళు పట్టుకు లాగి కింద పడెయ్యనూ గలదు. అన్నిటికీ సమర్థురాలు అమ్మగారు” అన్న పెద్దావిడ మాటలకి వసంత పడీ పడీ నవ్వింది. ఇద్దరూ పనుల్లో పడ్డారు.
రాణీ తండ్రి రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు.
చాలా బాగా సంపాదించగలిగాడాయన. ఆపై, వచ్చిన దాన్ని వృద్ధి కూడా చేసుకున్నాడు. ఇద్దరూ అమ్మాయిలే. ఎంతో ముద్దుగా పిల్లల్ని పెంచుకున్నాడు. పెద్దమ్మాయి ధనవంతుల కోడలు. అమెరికాలోనే సెటిల్ అయ్యింది. భర్త డాక్టర్. చిన్నమ్మాయి రాణి అంటే మరీ గారం ఆయనకి. బాగా వెతికి తన డిపార్టుమెంటులోనే కొత్తగా జేరిన సివిల్ ఇంజనీర్ అయిన పార్వతమ్మ చిన్నకొడుకు రాజేష్ కిచ్చి పెళ్ళిచేసాడు.
రాణి తెచ్చుకున్న పుట్టింటి కట్నకానుకలతో ఇల్లంతా లక్ష్మీకళతో ఉంటుంది. ఆ ఇల్లుకూడా ఆమె తండ్రి కట్టించిందే కాబట్టి ఇంటితో సహా ఆ ఇంటిలోని వారందరిపైనా ఆమెకే సర్వహక్కులూ ఉన్నాయనుకుంటుంది రాణి. అందరూ తదనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటారు.
రెండురోజుల తర్వాత ఉదయమే రాణీ వచ్చి “అత్తయ్యా సర్దుకున్నారా? పాలవాడికీ, పనమ్మాయికీ చెప్పారా? ఎల్లుండి పొద్దున్నే మన ప్రయాణం” అంది.
“తప్పదంటావా?” అంది పార్వతమ్మ ఆఖరి ఆశగా. “తప్పదు” అంది రాణీ బాత్రూం లోకి స్నానానికి వెళుతూ.
బైటికొచ్చి తెచ్చిన బాగ్ లోంచి బట్టలు సూట్ కేసులో పడేసుకుని, మరో రెండు జతలు బాగ్‌లో సర్దుకుంది. పార్వతమ్మ వంటింట్లో హడావిడి పడుతూ ఉండడం చూసి “టిఫిన్ అన్నీ అక్కడే అత్తయ్యా! నాకేమీ వద్దు. రేపు రాత్రికి వస్తాను. ఎల్లుండి తెల్లవారుజామునే బయలుదేరిపోదాం” అని చెప్పేసి వెళ్ళిపోయింది.
వసంత సాయంతో, పార్వతమ్మ బట్టలుసర్దుకుంది. అన్నట్టుగానే మూడోనాడు అత్తగారిని తీసుకుని వైజాగ్ బయలుదేరింది రాణి. కారెక్కుతూ “వసంతా!ఓ నెలరోజులుండి వచ్చేస్తాను. నువ్వెక్కడికీ వెళ్లవు కదా?” అంది పార్వతమ్మ. “వెళ్ళను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి పిన్నీ! ఉంటాను రాణీ!” అంటూ చెయ్యూపింది వసంత.
“మా అత్తయ్యగారికి అప్పుడప్పుడూ ఫోన్ చేస్తూండండి వసంతా! ఆవిడ మనసంతా మీ దగ్గరే ఉంటుంది” అంది రాణి చెయ్యి ఊపుతూ.
“అలాగే.” అంది వసంత.
***
ఆ రోజు విశాల గొంతు విని ఉద్వేగంతో ఏం మాట్లాడాలో తెలీక ఫోన్ పెట్టేసిన మాధవ రెండు రోజులు బాగా ఆలోచించాడు. ‘నేను ధైర్యం చేసి పలకరించడం వరకూ ఓకే, తర్వాత నా పేరు చెప్పగానే ఫోన్ పెట్టేస్తే ఏం చెయ్యాలి? ఈ నలభై ఏళ్ళనుంచీ తాను పడుతున్న బాధ ఇంకా ఎక్కువ అవుతుందేమో!’
విశాల, ‘ఎంత మోసం చేసావు మాధవా? అంటే నిజమే. నేను చేసింది తప్పే. నన్ను క్షమించగలవా? అన్న ఒక్క మాట చెప్పేస్తే ఈ జన్మకి భారం దిగిపోతుంది.’ ఇలా అనుకోగానే అతనికి ధైర్యం వచ్చింది. మూడవరోజు రాత్రి తొమ్మిది గంటలకి విశాలకి ఫోన్ చేసాక, ఆమె ఎత్తి “హలో” అన్నాక మళ్ళీ అదే పరిస్థితి మాధవది. మాట పెగల్లేదు.
“చెప్పు మాధవా!” అంది విశాల.
తన పేరు చెప్పే అవసరం లేకుండా తనని గుర్తుపట్టినందుకు అతనికి భారం తగ్గినట్లనిపించింది. వెంటనే “ఎలా ఉన్నావు విశాలా?” అనేశాడు ఆత్రంగా.
“నువ్వెలా ఉన్నావు?” అంది ప్రతిగా.
“నేనేనని ఎలా తెలిసింది నీకు?” ఆశ్చర్యపోతూ అన్నాడు.
“అదే కదా మరి..” అందామె.
“నిన్ను సూపర్ మార్కెట్‌లో చూసాన్నేను”
“ఆ రోజు నేనూ నిన్ను చూసాను” అందామె.
“అవునా? నువ్వు నన్ను చూడలేదనుకున్నాను” అన్న అతని మాటకి,
“అవును. అన్నీ నువ్వే అనుకుంటావు. నువ్వే చెబుతావు, చివరికి ఏమీ చెయ్యవు!”
ఆ మాటకి ఏం చెప్పాలో తెలీక, “నువ్వసలు మారలేదు విశాలా! అప్పుడెలా ఉన్నావో ఇప్పుడూ అలాగే ఉన్నావు” అన్నాడు.
“నువ్వు కూడా మారలేదు మాధవా!” అందామె కాస్త ఉత్సాహం తెచ్చుకుంటూ.
“అయ్యో! నేనూ లావయ్యాను. జుట్టు చాలా వరకూ పోయింది”
“నాకు అప్పటి మాధవలాగే ఉన్నావనిపించింది”
“అలా ఎలా?”
“అదేకదా మరి..” అందామె.
మళ్ళీ ఏం మాట్లాడాలో తెలీక “ పిల్లలా?” అన్నాడు.
“ఒకబ్బాయి. ఆస్ట్రేలియా”
“నాకూ ఒకే అమ్మాయి, లండన్” అన్నాడు.
“బావుంది కదా!”
“అవును. బావుంది”
“ఎక్కడుంటున్నావు విశాలా?”
“దిల్‍షుక్‍నగర్ డిపో వెనక”
“నేను కొత్తపేటలో ఉంటాను. ఆ సూపర్ మార్కెట్ నేనూ, నా కజినూ కలిసి పదేళ్లుగా నడిపిస్తున్నాం”
“మేం అయిదేళ్ల క్రితమే ఇక్కడికి నల్లకుంట నుంచి వచ్చాము. ఫస్ట్ టైం మీ షాప్ కొచ్చాను”
“నా అదృష్టం” అన్నాడు.
ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో “నన్ను క్షమించు విశాలా! నేను మాట తప్పాను. మా నాన్నకి భయపడ్డాను. ఈ నలభై ఏళ్లుగా ఈ మాట చెప్పాలని అనుకుంటున్నానంటే నమ్మవేమో!”
“మరీ సినిమా సంభాషణలా లేదూ!”
“నిజాలు అలాగే ఉంటాయి. అబద్ధాలు సహజంగా తోస్తాయి విశాలా!”
“ఇది కూడా సినిమా డైలాగులాగే ఉందేమో!” అంటూ నవ్విందామె
“నిజంగా నా మీద కోపం లేదా?”
“ఏం లేదు. అయినా నువ్వు నాకేమైనా మాటిచ్చావా? మనిద్దరం కలిసి బాస చేసుకున్నామా? ఒట్టి గాలిమాటలే కదా అవన్నీ!”
“గాలిమాటలు కాదు. నా గుండెలో మాటలే! కానీ అలా అయిపోయింది”
“పోన్లే, ఆ పాత సంగతులు వదిలేద్దాం! బావున్నావు కదా మాధవా!”
“చాలా చాలా. నువ్వు కనబడినప్పటి నుండీ మరీ మరీ బావున్నాను”
“ఇప్పుడు నీకు బాగానే మాటలొస్తున్నాయి. అప్పుడు వచ్చేవి కావు కదా!”
“బతుకు నేర్పింది. మళ్ళీ మా షాప్ కెప్పుడొస్తావు?”
“సరుకులు అయిపోయినప్పుడు” అంటూ నవ్వేసింది.
“నువ్వు నాతో మాట్లాడవేమో అనుకున్నాను. నా పేరు వినగానే పెట్టేస్తావేమో! అని భయపడ్డాను. పేరు చెప్పకుండానే గుర్తు పట్టేశావ్” అతని గొంతు దుఃఖంతో వణికింది.
“ఆశ్చర్యం ఏం లేదులే! సహజం అది. ఆ నాటి ఆ భావన అంత విలువైనది మరి!”
“అవును పవిత్రమైనది కూడా!”
“మరి ఉండనా!”
“అలాగే విశాలా! మెనీ మెనీ థాంక్స్!” గొంతు తడబడుతుండగా అన్నాడతను.
“సరే మరి” అంటూ ఫోన్ పెట్టేసిందామె.
మాధవ ఆ ఫోన్‍ని చెవులకి అలాగే ఆనించుకుని ఎంతసేపో ఉండిపోయాడు.
అతని మనసుకిప్పుడు చాలా ఊరటగా అనిపించింది. తృప్తిగా ప్రశాంతంగా తోచింది.
***
పార్వతమ్మగారు వెళ్లిన మర్నాడు మధ్యాహ్నం ఏమీ తోచక, మొక్కల్లో తిరుగుతున్నప్పుడు గుర్తొచ్చింది వసంతకి, కూతురి నిర్మల పుట్టిన రోజు వారం రోజుల్లో ఉందని. వెంటనే తలుపులు మూసి, చెప్పులు వేసుకుని పావు కిలోమీటర్ దూరంలో ఉన్న బట్టలషాప్‌కి వెళ్లి డ్రెస్ మెటీరియల్ తీసుకుని, హ్యాండ్ బాగ్‌లో తెచ్చిన నిర్మల ఆది డ్రెస్సు, సైజు కోసం బట్టలు కుట్టే షాప్‌లో ఇచ్చేసి వచ్చింది.
నాలుగు రోజుల తర్వాత వెళ్లి డ్రస్సు తెచ్చి ఇస్త్రీ చేసి దాచింది. వెంటనే నిర్మలకి ఫోన్ చేసి “నాన్నా! నీ పుట్టిన రోజుకి ముందు రోజే నువ్వూ, అల్లుడూ, పిల్లలూ మనింటికొచ్చెయ్యండి. నీకు తలస్నానం చెయ్యించి గుడికి తీసుకు వెళతాను. నీకు కొత్త డ్రెస్సు కోసం గుడ్డ తీసుకుని కుట్టించేసాను. నీకు నచ్చే రంగేలే” అంది మురిపెంగా వసంత.
“అమ్మా! నీకు చెప్పడం మర్చిపోయాను. మా అత్తగారు నా పుట్టిన రోజుకి ఆవిడ బంధుమిత్రుల్లో ఉన్న ఓ పదిమంది ఆడవాళ్ళని పిలిచి ఒక హోటల్‌లో లంచ్ పెడదాం అన్నారు. ‘మీ అమ్మకి కూడా చెప్పు’ అన్నారు. ఒక పట్టు చీర కూడా జాకెట్టు కుట్టించి ఉంచారు. ఆ రోజు నువ్వు వచ్చేసెయ్యి ఇక్కడికి. నాన్నకి షాప్ ఉండే రోజు కాబట్టి ఆయన రారేమో!”
కూతురు రాననగానే చిన్నబోయింది వసంత మనసు.
“హోటల్‌కి నేనెందుకులే! మీరంతా వెళ్ళండి. ఏదో ఒక టైంలో ఆ రోజొకసారి వచ్చి, కనబడి వెళ్ళు. మీ నాన్నగారున్నప్పుడు రావే!” అంది నీరసంగా.
“ఏంటమ్మా! హోటల్‍కి నువ్వు రాకపోతే ఏం బావుంటుంది?” అంది నిర్మల.
“బావుండేదేముందిలే? మా అమ్మకి ఒంట్లో బాలేదని చెప్పు” అంది వసంత నిరుత్సాహంగా
“ఏడిసినట్టుంది. అసలు నువ్వు మా అత్తగారూ వాళ్లందరినీ పిలిచి నా పుట్టినరోజు చెయ్యాల్సింది పోయి మా అత్తావాళ్ళు చేస్తుంటే, నీకు వచ్చి భోంచేసి వెళ్ళడానికి కూడా బాధేనా? నీ ఇష్టం! వస్తే రా! లేకపోతే లేదు. నీకెప్పుడూ కూతురు ఆనందంగా ఉంటే చూడాలనుండదు. ఏదో నిన్ను అవమానించినట్టు మొహం పెట్టేసుకుంటావు. ఆ రోజు ‘అయిదు వేలు బావుండదు. నేనో అయిదు వేలు నీ గిఫ్ట్ కవర్‌లో వేస్తాను’ అనగానే నీ మొహం మాడిపోయింది. సరిగా అన్నం తినకుండా వెళ్ళిపోయావు. కూతురి మీద ప్రేముంటే అవన్నీ పట్టించుకోకూడదు.
నేను నిన్నేమైనా అన్నానా? మా అత్తగారి ముందు నువ్వు తక్కువ కాకూడదని అలా అన్నాను కానీ నీ మీద కోపంతో అన్నానా? నువ్వు హెడ్ మాస్టర్‍గా రిటైర్ అయ్యావు కాబట్టి అంతా నువ్వు చెప్పినట్టు చెయ్యాలి అనుకుంటావు. అలా కాదు ఇలా అంటే నీకు పౌరుషం వచ్చేస్తుంది”
ఈ మాటలన్నీ వింటున్న వసంతకి గుండెల నిండా దుఃఖం నిండిపోయి మాట రాలేదు. తల్లి మాట్లాడకపోయేసరికి నిర్మలకి కూడా ఉడుకుమోత్తనం వచ్చి ఫోన్ పెట్టేసింది.
(సశేషం)