Site icon Sanchika

మలిసంజ కెంజాయ! -9

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[భానక్క ఇంట్లోకి ప్రవేశించిన వసంత దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని అక్షింతలు తలపై వేసుకుని, దేవుడి పాదల దగ్గరున్న పువ్వును తలలో పెట్టుకుని బయటకి వస్తుండగా భానక్క ఎదురుపడుతుంది. ఆప్యాయంగా కౌగిలించుకుంటారిద్దరూ. అందరూ మరో గదిలో ఉన్నారంటూ లోపలికి తీసుకువెళ్తుంది భానక్క. అక్కడ భానక్క నలుగురు కూతుర్లు కనబడతారు. అందరినీ పలకరించి హత్తుకుంటుంది వసంత. కాఫీ తాగి కబుర్లలో పడతారు భానక్క, వసంతలు. కాసేపటికి భోజనాలకి కబురొస్తుంది. భోజనాల సమయంలో వసంతని గుర్తు పట్టిన పెద్దవాళ్ళను తమ ఇళ్ళకి వచ్చి వెళ్ళమంటారు. మర్నాడు వస్తానని చెబుతుంది. అన్నాలు తిని వచ్చాక, ఇల్లాంతా తిప్పి చూపిస్తుంది భానక్క. తర్వాత వసంతని ఓ బెడ్ రూమ్‍లోకి తీసుకువెళ్ళి కాసేపు పడుకోమంటుంది. నువ్వూ కాసేపు పడుకో అంటుంది వసంత. కాసేపయ్యాక, భానక్క లేచి ఒక అలమారా తెరిచి అందులోని చీరల్లోంచి ఒక చీరని తీసుకోమని అంటుంది. మీ కోడలు ఇస్తుందేమో, మనిద్దరమే ఉన్నప్పుడు తీసుకుంటే బాగుండదేమో అక్కా అంటుంది వసంత. అది విని భానక్క బాధపడుతుంది. దుఃఖం పొంగుకొస్తుంది. వసంత ఓదారుస్తుంది. సాయంత్రం బజ్జీలు, టీ ఏర్పాటు చేశారు. భానక్క కూతుళ్లు తమ తమ ఊర్లకి బయల్దేరుతారు. భాస్కర్ వాళ్ళందరిని బస్సులెక్కించి వస్తాడు. రాత్రి చాలా సేపటివరకూ భానక్కా, వసంత కబుర్లు చెప్పుకుంటారు. మర్నాడు ఉదయం నిద్రలేచేసరికి భానక్క పక్కన కనబడదు. మొహం కడుక్కుని రాగానే భాస్కర్ భార్య ఉమ వచ్చి టిఫిన్ పెట్టి, కాఫీ ఇస్తుంది. అత్తయ్య ఎక్కడ అంటే వంటశాల్ వైపు చూపిస్తుంది. అక్కడికి వెళ్తుంది వసంత. అది చూడడానికి మరో పోర్షన్‍లా ఉంటుంది. భానక్కని అడిగితే, అది తన కోసమే ననీ, ఇప్పుడు తాను ఇక్కడే ఉంటున్నానని చెబుతుంది. కొడకు కోడలు తీరును చెప్పుకుని బాధపడుతుంది. వసంత ధైర్యం చెబుతుంది. కొన్ని సూచనలు చేస్తుంది. కాసేపయ్యాకా, భానక్కని తీసుకుని తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళివస్తుంది. సాయంత్రం భాస్కర్, ఉమ – భానక్కకి జాగ్రత్తలు చెప్పి కాకినాడకి బయల్దేరిపోతారు. భానక్క, వసంతా కబుర్లలో పడతారు. ఆస్తి అంతా ఆడపిల్లలకి దోచిపెట్టేసానని కొడుకూ, కోడలు తన మీద నింద వేశారని అంటుంది భానక్క. ఇక చదవండి.]

[dropcap]“దా[/dropcap]రేపోయే దానయ్యలకిచ్చి పెళ్లిళ్లు చేసి ఆస్తి మొత్తం వాడికోసం దాచవలసింది అని వాళ్ళ బాధ. ఆడపిల్లలకి ఎక్కువగా ఆస్తులూ, బంగారాలూ ముట్టచెప్పి ఆఖరుకి కొడుకులకి ఏమీ లేకుండా చేసిన వాళ్ళు కూడా ఉన్నార్లే. అది కూడా చాలా తప్పు. కానీ మీ బావ నలుగురు ఆడపిల్లలకీ ఎంత ఇచ్చారో అంత కన్నా ఎక్కువే కొడుక్కి ఉంచారు. మిగిలిన పదెకరాలూ నా పేర ఉన్నాయిప్పుడు. నీకు తెలుసు కదా మొత్తం అంతా నా పేరే ఉండేది. నాలుగో పిల్ల పెళ్లప్పుడు అందరికీ రాసేసాను. పెద్దవాడు వెళ్ళిపోయాడు, వాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఉన్నది వీడికే రాసేసాను. అయినా వాడికి తృప్తి లేదు. ఆడపిల్లల సూడిదలకనీ, పురుళ్లకనీ, బిడ్డ సారె అనీ అధికంగా పెట్టేసానని నా మీద నిష్టూరం”

“నీకుంది గనక నీ కూతుళ్ళకి బాగా జరిపావు. అదీ తప్పేనా? కొడుకూ, కోడలూ ఇప్పుడొచ్చి ఎప్పుడో పెట్టినవాటి గురించి పంచాయితీ పెట్టడం ఏమిటి?”

“అదే కదా మరి కలికాలం అంటే! ఆస్తి అంతా నాదై ఉంటేనే నాకు విలువ లేదు చూడు, చిత్రం! కాస్తో కూస్తో నలుగురిలో నాటకానికైనా మా కోడలు ప్రేమగా మాట్లాడుతుంది. వీడది కూడా లేదు. నేనెవరో పై దానినన్నట్టు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. నేను పలకరిస్తేనే పలుకుతాడు”

“చిన్నాడు, చిన్నాడని మేమంతా వీడినెంతలా మోసే వాళ్ళమో అప్పుడు” అంది వసంత.

“అవును ఆఖరి వాడని వాణ్ణి అంతా ముద్దు చేసేవారు. ఇప్పుడిలా మొండి శిఖండిలా తయారయ్యాడు. నేనేమో ఒకో పండక్కి ఒకో కూతురి దగ్గరికి వెళ్లి ఒకో నెల ఉండి వస్తూ ఉంటాను. నాక్కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అలా వెళ్లి వస్తూ ఉండడం వల్లే నేనింకా బతికున్నానే. అక్కడ ఆడపిల్లలు సినిమాలకనీ, గుళ్ల కనీ, షాపింగ్ లకనీ, హోటళ్లకనీ తిప్పుతూ ఉంటారు. తిరగడానికి ఓపిక ఉండదు కానీ వాళ్ళకోసం వెళుతూ ఉంటాను”

“మంచి పని చేస్తున్నావక్కా! ఇక్కడే ఒంటరిగా ఉంటే నీకు పిచ్చెక్కుతుంది మరి”

“రాత్రుళ్ళు నిద్ర పట్టదు నాకు. ఏవేవో గుర్తొచ్చి బెంగగా ఉంటుంది. ఇప్పుడు వాడికి నా పేరనున్న పదెకరాలూ వాడికే రాసెయ్యాలని కోరిక. మళ్ళీ ఆడపిల్లలకి ఇవ్వొద్దని వాడి ఆలోచన. నా దగ్గర ఇంకా బంగారం వుంది కదా! అదంతా కూడా వాడికే ఇస్తే బాగుండును అని వాడి ఆశ.

నా పేరనున్న ఆ పదెకరాల పొలం మీద వచ్చే అయివేజు పండగలకనీ, నోముతగవులకనీ, మనవల పుట్టినరోజులకనీ ఖర్చు పెట్టుకుంటాను. వాడి పిల్లలకు కూడా పెడతాను. అయినా ఆడపిల్లలకి పెట్టేస్తున్నానని వాడికి కడుపు మంటే. నలుగురు ఆడపిల్లలుంటే ఖర్చుండదా చెప్పు? వాడు మాత్రం ఎన్నడూ ఒక్క రూపాయి కూడా వాళ్లకి పెట్టి ఎరగడు. తోడబుట్టిన అక్కచెల్లెళ్ళ పిల్లల లంగా వోణీ ఫంక్షన్లో, గృహప్రవేశం ఫంక్షన్లో జరుగుతాయి కదా! దంపతులిద్దరూ వెళ్లి అక్షింతలు వేసి భోజనం చేసి మొహమాటం లేకుండా ఏమీ పెట్టకుండా వెళ్ళిపోతారు. పై వాళ్ళెవరైనా అడిగితే ‘అమ్మ పెడుతోంది కదా ఇంకా నేనెందుకు? నా ఇల్లు గుల్లవదా!’ అంటాడంట, విన్నవాళ్ళు నవ్వుతారనే ఇంగితమైనా లేకుండా! తండ్రి లేడు కదా. వాళ్ళకి నేను పెట్టకపోతే ఎవరు పెడతారు చెప్పు?” వసంత మౌనంగా వింటోంది.

“ఇప్పుడే నేనుండగానే వీడు ఈ మాత్రం ఉంటే రేపు నేను పోయాక ఆ నలుగురినీ అసలు చూస్తాడంటావా? పిల్చినా కూడా పలకడు. వాళ్ళకి వీడంటే వెర్రి ప్రేమ. తమ్ముడూ! తమ్ముడూ! అంటూ వెనక వెనకనే తిరుగుతారు. చిన్నప్పటి నుంచీ అంతే! ఈ ఆడపిల్లలు. వీడికా ధ్యాసే ఉండదు. మా పెద్ద వాడితో సంబంధాలే లేవు. ఆనాడు వెళ్లిన వాడు మళ్ళీ రాలేదు. ఉన్నవాడు వీడొక్కడే కదా! అయ్యో! తోడబుట్టిన ఈ అక్కలకి నేనొక్కడినే కదా! వీళ్లని నేను కాక ఇంకెవరు యోగక్షేమాలు అడుగుతారు అని లేనే లేదు. ఆ విషం వాడి తలలో ఎవరు పోశారో! తెలీదు. వాళ్ళని సవతి అక్కలన్నట్టు చూస్తాడు”

“చిత్రం! డబ్బులూ, ఆస్తులూ, బాగా ఉంటే పెద్దవాళ్ళని బాగా చూస్తారనీ అవి లేకపోతే కొడుకులూ, కోడళ్ళూ, ముసలివాళ్ళకి తిండి పెట్టడానికి ఏడుస్తారనీ అనుకునేదాన్నక్కా ఇన్నాళ్లూ!”

“నీ మొహం! ఉండడం లేకపోవడం అనేది ముఖ్యం కాదు. చూసే వాళ్ళు డబ్బు లేకపోయినా చూడడం ధర్మం అనుకుని చూస్తారు. చూడని వాళ్ళు ఎన్ని ఇచ్చినా, మనకి కాక ఇంకెవరికి ఇస్తార్లే! అన్న ధీమాతో చూడరు. నా కొడుకు లాంటి వాళ్ళకి నేను చెప్పాను కదా! అలాంటి బాధలన్నమాట. పిల్లల చదువుకోసం సిటీ వెళ్లడాన్ని తప్పు పట్టను. నన్ను కూడా వాడుండే కాకినాడకు రమ్మనొచ్చుకదా! నచ్చకపొతే నేనే వచ్చేస్తాను కదా! అసలు ఒక్కదానివీ ఉండగలవామ్మా? అన్న మాటే ఎత్తలేదు. వాళ్ళు ఎన్నాళ్ళు అక్కడ ఉంటారో తెలీదు. సర్లే ఇదంతా నా సొద. నీ గురించి చెప్పు” అంది భానక్క.

“అక్కా! మేం ఒక రెండు బెడ్ రూమ్‌లూ, ఒక హాల్, వంటిల్లూ ఉన్న చిన్న ఇల్లు కట్టుకుని అందులో పక్కగా ఒక చిన్న పోర్షన్‌లా కూడా కట్టి అద్దెకిచ్చాము. అందులో పార్వతమ్మ గారు అని ఎనభై ఏళ్ల పెద్దావిడ. ఒక్కతే ఉంటుంది. చాలా మంచావిడ. ఆస్తి ఉంది. డబ్బుంది. కొడుకులిద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా బాగా సంపాదించుకున్నారు. ఈమెను రమ్మని తీసుకెళతారు. కానీ ఈవిడ ఎందుకో మరి నెల తిరిగేసరికి వచ్చేస్తుంది. అక్కడే ఉండి పోవచ్చు కదా! వేళకింత పెడతారు కదా! ఇక్కడ ఒంటరిగా ఉంటూ, వంట చేసుకుని తినాలి కదా! అని జాలిపడుతుంటాను”

“నువ్వింకా చిన్నదానివి. అందుకే నీకు తెలీదు. ఆ కోడళ్ళు నోటితో ఏమీ అనకుండానే పొగపెడుతుండొచ్చు. ఈవిడ వెనక్కి వెళ్లేట్టు చేస్తారు. అవన్నీ వాళ్ళ ట్రిక్కులు. పెద్దావిడని ప్రేమగా చూస్తే ఎందుకుండదు? ఆవిడ కేమైనా సరదానా ఒక్కతే ఇక్కడ, అద్దె ఇంట్లో ఉండడానికి. ఇవన్నీ అనుభవం అయితే కానీ తెలీవు, మొన్నటి వరకూ ఉద్యోగం చేసావు. ఇప్పుడు మీ ఆయన చేస్తున్నారు కనక ఇవన్నీ అనుభవం కాలేదు నీకు”

“అంతే అంటావా?”

“ముమ్మాటికీ అంతే అమ్మాయ్! సందేహం లేదు” అంటూ నవ్వేసింది భానక్క.

“అక్కా! నేనింక బయలు దేరతాను. ఓ గంటలో వెళ్ళిపోతాను. ఇక్కడ ఆటోలు దొరుకుతాయా? మెయిన్ రోడ్ కి వెళ్లాలా?”

“సాయంత్రం అవుతోంది. ఆటోలు భయం. మరిది గారికి ఫోన్ చేసి చెప్పెయ్యి. రేపొస్తానని”

“రేపు పొద్దున్నే బయలుదేరి పోతాను మరి” అంది ఫోన్ తీస్తూ. సరేనంది భానక్క. భర్తకి ఫోన్ చేసి చెప్పేసింది వసంత.

తర్వాత ఇద్దరూ ఇంటి పక్కనే ఉన్న తోటలోకి వెళ్లి భానక్క పెంచిన మొక్కలన్నీ చూసారు.

“ఎంత ఓపిగ్గా పెంచుతున్నావో కదా!”

“అవే నా పిల్లలే బాబూ! భాస్కర్ వచ్చినప్పుడల్లా ఈ కూరలు సంచీలో వేసి పంపుతాను”

“సూపర్ అక్కా! కూరగాయల రైతువన్నమాట!” అని నవ్వింది వసంత.

ఇద్దరూ కాసేపు అక్కడే తిరిగి, కాళ్ళూ చేతులూ కడుక్కుని లోపలికి వెళ్లి రెండేసి దోశలు వేసుకుని, తిని మజ్జిగ తాగి కూర్చున్నారు.

“అక్కా! నాకు ఒక్కసారి నా కాలేజీ రోజులు తిరిగొస్తే బావుండుననిపిస్తుందే!”

“నాక్కూడా! అప్పుడు నేను చిన్న పిల్లలనేసుకుని ఆనందంగా తిరిగేదాన్ని. అమ్మా నాన్నా అన్నీ చూసుకునేవారు. అలసట తెలిసేది కాదు ఆనందం తప్ప. నువ్వు కాలేజీ విశేషాలు చెబుతూ నా వెనకే తిరిగేదానివి వసంతా!”

ఇద్దరూ ఆ రోజులు చాలా సేపు తలుచుకున్నారు. “నా కధంతా చెప్పాను కదా! సమస్యలు కూడా చెప్పాను. పరిష్కారం చెప్పు మరి “అంది భానక్క మంచంపై పడుకుని వసంత వైపు తిరుగుతూ.

“నేనా?” అంది వసంత నవ్వుతూ.

“అవును.హెడ్ మాస్టరమ్మవి కదా చెప్పాలి మరి” అంది భానక్క.

“మరి హెడ్ మాస్టరమ్మకి కష్టాలొస్తే? ఎవరు చెప్పాలి పరిష్కారం?”

“ఎవరో చెప్పేదేంటి? నీకు నువ్వే ఆలోచించుకోవాలి. చదువుకున్నదానివి. నీకన్నీ తెలుస్తాయిలే!

“మీ అమ్మాయిలేమంటారు?” అడిగింది వసంత.

“పెద్దమ్మాయిలిద్దరూ విసుక్కుంటారు. వదిలెయ్యమ్మా! అవన్నీ పట్టించుకోకు. అసలక్కడికి వెళ్లడం ఎందుకు? మా దగ్గరే అటూ, ఇటూ తిరుగు” అంటారు.

కొడుకుండగా వాళ్ళ దగ్గర ఉంటే చూసే వాళ్ళకి బాగోదు కదా వసంతా! చిన్నవాళ్ళిద్దరూ నేను చెప్పేవన్నీ విని లైట్ తీసుకోవాలి” అంటూ ప్రతి దాన్నీ జోక్‌గా తీసుకుంటారు. ఇంతసేపూ నా కథే చెప్పాను. నీ కుటుంబం గురించి చెప్పవే” అంది భానక్క.

“ఏముందీ! అమ్మాయి పని బావుంది. కోరి,కోరి చేసుకున్నారు మా నిర్మలని. తనకి ఇద్దరబ్బాయిలు. వియ్యపురాలు మంచిది. పుట్టినరోజులకనీ, వాటికనీ మేం వెళ్లి చూసివస్తూ ఉంటాము. అది కూడా అప్పుడప్పుడూ వస్తుంటుంది. పిల్లలు సెలవులప్పుడు వచ్చి వెళతారు. మా వాడు బెంగళూరులో ఉంటాడు. ఇద్దరు పాపలు వాడికి. మీ మరిది గారు కాలక్షేపం అంటూ ఆ షాప్‌లో అకౌంట్స్ పని చేస్తూ ఉంటారు”

“అదృష్టవంతురాలివే. నీ కాపురం ముచ్చటగా ఉంది. చూసేవాళ్ళకి హాయి కలుగుతుంది. నువ్వు నూరేళ్ళకీ అలాగే ఉండాలి బంగారం!”అంది భానక్క ప్రేమగా వసంతపై చెయ్యి వేస్తూ.

“అక్కా! ఒక పని చెయ్యి మీ భాస్కర్ ఇక్కడున్నప్పుడు ఒకరోజు కార్లో మా ఇంట్లో దింపెయ్యమను. రెండురోజులుండి వద్దువు గానీ. నీకూ మార్పుగా ఉంటుంది”

“అలాగే తప్పకుండా వస్తాను” అంది భానక్క నిద్రకుపక్రమిస్తూ. ‘నేను టీచర్‌ని కాబట్టి నాకున్న సమస్యను నన్నే పరిష్కరించుకోమని చెప్పేసింది భానక్క’ అని నవ్వుకుంటూ తనూ నిద్రపోయింది వసంత.

మర్నాడు పొద్దున్నే లేచి బయలుదేరుతుంటే “ఇదిగో కుంకుమ భరిణె. బొట్టు పెట్టుకో. ఈ చీర బాగ్‌లో పెట్టుకో!” అంటూ బీరువాలోంచి ఒక చీర ఉన్న కవర్ ఇవ్వబోయింది భానక్క. “మీ కోడలు పెట్టింది కదా మళ్ళీ ఎందుకు?” అంది వసంత వెనక్కి జరుగుతూ. “అది అందరికీ పెట్టే చీర. ఇది నేను నీకు పెడుతున్నాను. మా చిన్నమ్మాయి తెచ్చింది. నీకు బావుంటుంది. మాట్లాడకు” అంటూ బలవంతంగా చేతిలో పెడుతుంటే తల్లి గుర్తొచ్చి ఆమె కాళ్ళకి దణ్ణం పెట్టి కళ్ళ నీళ్లు పెట్టుకుంది వసంత. “తప్పకుండా వస్తాన్లే నీ ఇంటికి” అంది భానక్క. చేతిలో చెయ్యి వేయించుకుంది వసంత “వస్తావు కదా!” అంటూ.

 ఇంతలో భానక్క ఇంట్లో ఉండే అమ్మాయి ఒక కవర్‌లో నిన్న తోటలో చూసిన కాయగూరలన్నీ తెంపి పట్టుకొచ్చింది. “ఇవి కూడా నీకే” అంది భానక్క.

“ఇన్ని కూరలా?”

“ఏం ఫర్వాలేదు. ఆటో తెచ్చిందిలే! ఈ పిల్ల. ఇక్కడెక్కి ఇంటిముందు దిగడమే కదా తీసుకెళ్ళు” అంటుంటే కాదనలేకపోయింది వసంత.

వెనక గుమ్మం వైపుకి వచ్చింది ఆటో. భానక్క చెయ్యి ఊపుతుండగా వసంత ఆటో బయలుదేరింది. భానక్కనూ, తాను పుట్టిన ఊరినీ వదిలి వస్తుంటే బాధతో మనసు మెలితిరిగింది వసంతకు. కొంత సేపటికి తెప్పరిల్లింది. ‘పాపం భానక్క ఒక్కతే ఉండాలి ఇంట్లో’ అనిపించి ఆలోచిస్తూ కూర్చుంది.

‘యుక్త వయసులో తగినంత ఆదాయం వచ్చేలా స్థిరపడి, ఆ పై పెళ్లి చేసుకుని పిల్లల్ని కని, కష్టపడి పెంచి పెద్ద చేసి వాళ్ళ గూళ్ళు వాళ్ళకి ఏర్పరచి ఇచ్చాక, వచ్చి మీద పడే వృద్ధాప్యంలో ఎన్ని రకాల సమస్యలో! వీటికి పరిష్కారం ఒకటే మనసును మళ్ళించుకోవడం. అది చేత కాకపొతే మునగానామ్ తేలానాం అన్నట్టుంటుంది. ఇక బతుకులో విశ్రాంతి ఎప్పుడు? నిశ్చింత ఎప్పుడు? పురాణాల్లో పెద్దవయసు వచ్చాక అడవులకి వెళ్లి ఆకులూ, అలములూ తింటూ జీవితపు ముగింపు కోసం ఎదురుచూసేవారంటారు.

ఇప్పుడు కూడా అడవులు లేకపోయినా ఇంటిలోనే ఆ పని చెయ్యొచ్చు. ఎందుకు చెయ్యకూడదు? కావలసింది సాధన అంతే! అదంత సులువా? ఎందుక్కాదూ! చదువుకుని ఉద్యోగాలు చేసి లోకాన్ని విశాలంగా చూసిన నాలాంటి వాళ్లకి తలుచుకుంటే సాధ్యం కాకపొతే ఎలాగా? మగాళ్ళకి బైట వ్యాపకాలుంటాయి. ఆ పనిలో పడి వాళ్ళకి రోజులు గడిచిపోతాయి. ఇంట్లో పనులు చేసుకుంటూ సున్నితంగా ఆలోచించే ఆడవాళ్లకే ఎక్కువ మానసిక సమస్యలేమో! అందుకే కదా, ఏ గుళ్లో చూసినా అధికంగా ఆడవాళ్లే ఉంటారు. ఆ వచ్చిన కొంతమంది మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ బలవంతం మీద వచ్చిన వాళ్లే అధికం.’

వసంత నవ్వుకుంటూ ‘ఏంటో ఈ ఆలోచనలు’ అనుకుంటూ వాటిని ఆపి చుట్టూ ఉన్న పచ్చని పరిసరాల వైపు మనసును మళ్లించింది. మనసుకు ఆహ్లాదంగా అనిపించింది. మానవాళి జీవితాల్లో ఎన్ని మార్పులు సంభవించినా ప్రకృతి మాత్రం నిత్యం తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. ఎండా కాలంలో మొక్కలు ఎండి, నేల నెర్రెలు విచ్చిపోయినా భూమి ఓర్పు వహిస్తుంది. వర్షాకాలంలో పచ్చని మొక్కలతో కళ కళ లాడిపోతుంది. శీతాకాలంలో చలిలో బంతుల్నీ, చేమంతుల్నీ తయారు చేసి వాటి ద్వారా కిల కిలా నవ్వుతుంది.

నాలాగే ఉండమని మనుషులకి ప్రకృతి సందేశమేమో! ఇక నుంచీ తాను ధైర్యంగా ఉండాలి. నా కన్నా బాధలు పడుతున్న వాళ్ళున్నారు. అన్నిటినీ తేలిగ్గా తీసుకోవాలి. మనసు మీదికి తీసుకుంటే బతకలేం. జీవితం మీదే విరక్తి కలుగుతుంది. ఏముంది? అరవయ్యేళ్లు బతికాం. మూడు వంతులు అయిపోయింది. ఆ తెలివితో మిగిలిన ఒక్క వంతూ లాగించి పడెయ్యాలి. ఇంత జీవితాన్ని తెలిసిన జ్ఞానంతో తేలిగ్గా బతకాలి. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలంతే!

ఇంటికొచ్చి ఆటో అబ్బాయి బాగ్‌లు లోపల పెట్టాక, అతనికి డబ్బులిచ్చి పంపేసి, తిన్నగా వంటింట్లోకి వెళ్ళింది వసంత. వెంకట్రావు కుక్కర్ పెట్టి, బెండకాయలు తరగడానికి సన్నద్ధమవుతున్నాడు. భార్యను చూడగానే “వచ్చేసావా? ఆలస్యం కావచ్చేమో! ఆటో దొరకలేదేమో? అని వంట మొదలు పెట్టాను” అన్నాడు.

“జరగండి” అంటూ గ్యాస్ గట్టుమీద భానక్క ఇచ్చిన కూరల సంచీ వంపింది.

“ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో! ఎక్కడివి?” అన్నాడతను.

“మా భానక్క దొడ్లో కాయించింది” అంది వెళ్లి కాళ్ళు కడుక్కుని వస్తూ.

ఇద్దరూ ముందు గదిలోకి నడిచారు. వసంత తన బాగ్ లోంచి రెండు కొత్తచీరల కవర్లూ తీసి సోఫాలో పెట్టింది.

“మీ అక్కయ్య గారు నాకు కూరలూ, నీకు చీరలూ ఇచ్చి పంపించారా?” అని నవ్వుతూ అప్పుడే వచ్చిన ఫోన్ అందుకున్నాడతను. వసంత నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది.

భర్త వెళ్ళాక తన బాగ్ ఖాళీ చేసి ఎండలో పెట్టింది. భానక్క ఇచ్చిన చీరల కవర్లు విప్పి రంగులు చూస్తూ ఉండగా కూతురు నిర్మల నుంచి ఫోన్ వచ్చింది.ఆనందంగా ఎత్తి “నిమ్మీ! చెప్పరా! నేను మా ఊరికెళ్లానే! పొద్దున్నే వచ్చాను. మా భానక్క అని చెబుతూ ఉంటానే వాళ్ళ గృహప్రవేశానికి”

“ఇలా వెళుతున్నానని నాకొక మాట చెప్పివెళితే నీ సొమ్మేం పోయింది?” కస్సుమంటున్న నిర్మల గొంతు వినగానే అప్పటివరకూ పుట్టిన ఊరికి వెళ్లి వచ్చిన ఆనందం కాస్తా ఆవిరైపోయింది వసంతకి.

మాటలు తడుముకుంటూ “వెళదామా? వద్దా? అనుకుంటూ మీ నాన్నని అడిగితే వెళ్లమన్నారు. అప్పటికప్పుడు బయలుదేరాను. నీకు ఫోన్ చేస్తే నీ నంబర్ ఎంగేజ్ వచ్చింది. నువ్వు మిస్డ్ కాల్ చూసి చేస్తావులే! అనుకుని బయలుదేరేసాను. నువ్వు ఫోన్ చెయ్యలేదు. మొన్న పొద్దున్న వెళ్లి ఇవాళ పొద్దున్న వచ్చేసాను. ఏం? ఎందుకు? నువ్వు వద్దామనుకున్నావా? మనింటికి?”

“నేనూ, మా అత్తగారూ అలా షాపింగ్‌కి వెళ్లి వస్తూ మనింటికి వచ్చాం టీ తాగుదామని. ఇంటికి తాళం ఉంది. పక్కనుండే మామ్మగారిల్లు కూడా తాళమే. వెనక్కి వచ్చేశాములే” అంది నిష్టూరంగా.

“అయ్యో! ఊరికేగా వచ్చింది ఏదైనా పనుందా?”

“ఊరికే అయితే మాత్రం మా అత్తగారేమనుకుంటారు?” అంటూ ఠక్కున ఫోన్ పెట్టేసింది నిర్మల.

‘మళ్ళీ మొదలెట్టావా తల్లీ! అత్తపోరూ, ఆడబిడ్డ పోరూ లేదనుకుంటే కూతురి పోరు ఒకటొచ్చి పడింది నాకు’ ఉస్సురనుకుంటూ ఊరువెళ్లొచ్చిన ఉత్సాహం నీరు కారిపోగా, చూడబోయిన చీరల్ని చూడడం మానేసి బీరువాలో పెట్టి తలుపేసేసింది వసంత.

***

రాణీతో అమలాపురం నుంచి వచ్చిన పార్వతమ్మ రాగానే స్నానం చేసి, కోడలు పెట్టిన దోశలు తిని మజ్జిగ తాగి, టాబిలెట్లు వేసుకుని నిద్రపోయింది. తెల్లారి లేచి స్నానం చేసి దేవుడి మందిరం ఎక్కడుందో? అని వెతుక్కుంటూ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇల్లంతా తిరిగింది.

పార్వతమ్మ గృహ ప్రవేశానికి వచ్చింది కానీ అప్పటికి పని బొత్తిగా పూర్తి కాలేదు. గుమ్మాలు ఎత్తారంతే! పైన రూఫ్ వేశారు. మంచి రోజులు అయిపోతున్నాయని గబా గబా పాలు పొంగించేసారు. మొత్తం పూర్తి కావడానికి దాదాపు సంవత్సరం పట్టింది.

కోడలు ఎదురొచ్చింది. “అత్తయ్యా లేచారా? గుడ్ గుడ్” అంటూ అత్తగారికి కాఫీ ఇవ్వమని వంటావిడని పిలిచింది. కాఫీ తాగుతూ ఉంటే అత్తగారి పక్కనే కూర్చుంది బుద్ధిగా. తాగాకా “ఇల్లెలా ఉందత్తయ్యా?” అని గారంగా అడిగింది. “ఎంత బావుందో! ఆ ఏడుకొండలవాడి దయ అంతా. నువ్వు దగ్గరుండి ఓపిగ్గా కట్టించుకున్నావు” అంది కోడలిని మెచ్చుకుంటూ.

“చూసిన వాళ్లంతా అదే మాటత్తయ్యా! ఎంత బావుందో! మన వాళ్ళెవరూ ఇంత బాగా కట్టలేదని మోతనుకోండి. నా ఆరోగ్యం కూడా పాడయ్యింది ఇంటిపనులు చేయించి, చేయించి. మీ అబ్బాయేమో ఆఫీస్ కెళ్ళి కూర్చునేవారు. పిల్లలిద్దరూ     ఎవరి సంసారాలు వాళ్ళవి కదా! అన్నీ నేనే చూసుకున్నాను. ఈ మధ్య కట్టిన మన వాళ్ళందరి ఇళ్లకూ వెళ్లి చూసొచ్చి వాళ్ళందరి ఇళ్ల కన్నా బాగా ఉండాలని కట్టించాం అత్తయ్యా!”

“మంచి పని చేశావమ్మా! మళ్ళీ మళ్ళీ ఇంత పెద్దిల్లు కట్టుకోముకదా! అన్నీ ఓపిగ్గా చేసుకోవాలి తప్పదు. నువ్వంటే ఓర్పు గలదానివి కాబట్టి అంత కష్టపడ్డావు” అంది మనస్ఫూర్తిగా పార్వతమ్మ. ఆ మాటకి “ఎంతయ్యిందీ? అని అందరూ అడగడమే!” అంది మురిపెంగా. అంతలోనే అలక తెచ్చుకుంటూ “బావగారూ, అక్కా చూసారా గృహప్రవేశానికి రాలేదు?” అంది. అవునన్నట్టు తలూపింది పార్వతమ్మ.

(సశేషం)

Exit mobile version