మల్లె పువ్వు

0
2

[dropcap]క[/dropcap]ట్టడాలు నలువైపులా భారీ యెత్తున ఆకాశం యెత్తున లేస్తూన్న పొరుగారుకి వెళ్ళి తోటి తాపీ పనివాళ్ళతో కలసి పనులు పూర్తి చేసుకుని వెసులుబాటు చూసుకుని యెట్టకేలకు తెరపి కలిగి పెళ్ళాం బిడ్డల్ని చూసిపోవడానికి మర్రిపాలెం వస్తున్నాడు చంద్రప్పడు. నిజానికి అతడు మూడు నెలల తరవాతనే ఊరికి వస్తున్నాడు. మొగడి రాక గురించి విన్న మంగమ్మకు మనసు మనసులో లేకుండా పోయింది, కాలు కాలిన పిల్లిలా ఇంటి చుట్టూ తిరిగి పోపుడబ్బాలలో చిల్లర చిల్లరగా మిగిలిన డబ్బుల్ని యేరి కూర్చి భర్తకు యిష్టమని సంతకు వెళ్లి మేకపోతు మాంసం తెచ్చి వండింది. ఐదేళ్ళ ఇంద్రయ్య – నాలుగేళ్ళ ముత్యాలు తల్లి మేకమాంసం తెచ్చి వండుతుందని తెలుసుకుని సంబరపడి పోయారు. మేకపోతు తల మాంసం యెలా ఉంటుందని – వండితే ఘుమఘుమలతో ముక్కుపుటాలు యెగిరిపోవూ!

అంతవరకూ మాంసం తరగడంలోనూ – వర్ర(మసాలా) దట్టించడంలోనూ నూనె వేగించడంలోనూ తలమునకలైన మంగమ్మకు చటుక్కున గుర్తుకి వచ్చింది; భర్తకు మల్లెపువ్వులంటే చాలా యిష్టమని; కొప్పులోని మల్లెల సువాసనలు తాకిన తోడనే ఇక ఓపలేనంతగా రెచ్చిపోతాడని. తను చాలు చాలు అనేంతవరకూ విడవడని – తన మతిమరుపు మండిపోనూ! తక్షణం చెంగు ముడి విప్పి చూసింది. ప్చ్ -ముసలి అవ్వ ఆదెమ్మ చప్పున గుర్తుకి వచ్చింది. ఆనంద సాగరంలో మునిగిపోతూ ఆ విషయమే మర్చిపోయిందామె. ఉష్ణంతో ఉందని, బన్నురొట్టె తీసుకుని ఘాటైన గుళిక వేసుకోవాలని ఆదెమ్మ అవ్వ అడిగితే తను చెంగు ముడిలో దాచుకున్నదంతా కర్ణుడి పెద్దక్కయ్యలా హెచ్చులుపోతూ ఇచ్చేయలేదూ! మరిప్పుడెలా? మరి కాస్పేపట్లో ఇల్లు చేరబోతున్నడు చంద్రప్పడు. రాత్రికి మల్లెపూల ఘుమఘుమలు లేకుండా చెంత చేరితే ముఖం చాటేసుకోడూ!

మంగమ్మ వంట పూర్తి చేసి ఉప్పూ కారమూ సరిగ్గా ఉందో లేదోనని ఓసారి మాంసపు చారుని రవంత నాలికచివరన రుచి చూసి పిదప పిల్లలిద్దరికీ మాంసపు కూరతో అన్నం వడ్డించి, రెండు గ్లాసుల నిండా మజ్జిగపోసి గుడిసె ఆవరణలోకి వచ్చింది.

ఆ క్షణంలో ఎదురుగా ఉన్న మాంచాలమ్మ గుడిసె కుబేరుడి భవనంలా గోచరించింది. అడగాలే గాని యెన్నడూ లేదనదు. కాదనదు. మరిప్పుడెలా వెళ్లి అడగడం? మొన్ననే కదా అవసరమైన ఖర్చులకని తన వద్దనుండి నలభై రూపాయలు అప్పడిగి తీసుకు వెళ్ళింది! తెలిసుండీ యే ముఖం పెట్టుకుని వెళ్లి అడగ్గలదు? అదీను రాత్రి భర్త ప్రక్కన పడుకోవడానికి మెల్లెలు కావలసి వచ్చిందని ఎదురప్పు అడగటమా! ఆ సంగతి రేపు గాని మాపు గాని మాంచాలమ్మ తెలుసుకుంటే తనిక మళ్లీ మొహం చూపించగలదా! సరే – దాని సంగతి పోతే పోనియ్యి. అదే వరసలో ఉంటూన్న కాసులమ్మ వద్దకు వెళ్లి పన్నెండు రూపాయల చేబదులివ్వమని అడిగితే – ఊఁహు. ససేమిరా వీలులేని పరిస్థితి. రేషన్ తెచ్చుకోవడానికి ఆఖరు రోజుని కాలవ గట్టెమ్మట వడి వడిగా నడుస్తూ బాడవలో పడి నడుం విరగ్గొట్టుకుంది. అది ఆస్పత్రిలో చేరి మళ్లీ ఇల్లు చేరేలోపల బోలెడన్ని ఖర్చులు. పిల్లలకు బడి ఫీజు కట్టలేక మెడనున్న పుస్తెల బొట్టుల్ని తాకట్టు పెట్టుకుందని విని తను యెంతగా తల్లడిల్లిందని – ఇప్పుడు దాని వద్దకు వెళ్లి అప్పు అడగటమా – అదీను మూడు మూరల పువ్వల కోసం!

ఇప్పుడు మంగమ్మకి ఒకే ఒక ప్రత్యమ్నాయం మిగిలింది. గున్నారావు పూలతోట గేటు ముందు నిల్చుని చేతులు చాచడం. కాని మంగమ్మకి ఆ తలంపు తోచిన వెంటనే ఒడలంతా పాములూ జెర్రులూ ప్రాకినట్లనిపించింది. అతగాడి గురించి పలువురు పలువిధాలుగా చెప్పుకోవడం విన్నది. ముఖ్యంగా రేవుకాడ తోటి ఆడంగులు వెటకారపు నవ్వులతో అతడి చేష్టల గురించి చెప్పుకోవడం విని మరింత జుగుప్సకి లోనయింది. సన్నజాజులు కనకాంబరాలూ ఇచ్చినట్టె ఇచ్చి యేమరు పాటున ఉన్నట్టు నటిస్తూ చేతుల్ని తడుముతూ రవికెను తాకుతాడట. ఇంకేదేదో చేయడానికి వెంపర్లాడుతాడట. ఎవరైనా రోషంతో యెదురు తిరిగితే కూసింత మొహమాటమూ లేకుండా ఇచ్చిన పూలు తిరిగి లాక్కుంటాడట. ఛీ! కీచకుడంతటి కిరాతకుడు.

మంగమ్మకి యేమీ పాలుపోక కాసేపు ఇంటి అరుగుపైన కూర్చున్న తరవాత వీధిలోకి వచ్చింది. అదిగో! తనకు తెలిసినావిడెవరో వస్తున్నట్లుంది. కళ్లు చికిలించి చూసింది మంగమ్మ. ఇంకెవరు – తన చిన్నప్పటి నేస్తం పోలమ్మే! మల్లెపూలు తడిగుడ్డలో పెట్టుకుని నడచి వస్తూంది. అలసిన ప్రాణం బోరు బావిని చూసినట్లనిపించింది. కళ్ళు పెద్దవి చేసుకుని యెదురు వెళ్లింది.

“ఎక్కణ్ణించి వస్తున్నావే పోలమ్మా?”

“ఇంకెక్కణ్ణించి? మన పేట సంతలో మల్లెపూలు దొరక్క పెద్దబజారు నుండి షేరు ఆటో యెక్కి తెస్తున్నాను. అదీను – సమయానికి వెళ్లబట్టి ఆ కాసిన్నీ దొరికాయి. మల్లె మొగ్గలకు ఈరోజు అంతటి గిరాకీ.”

“ఎందుకో?” అన్నట్టు కనుబొమలెగరేసి చూసింది మంగమ్మ.

“గిరాకీ అంటే గీరీకా కాదే మంగా! మనూరికి ప్రతిరోజు మల్లెలు తమిళనాడు మధురైనుండి వస్తున్నాయట. వాటి కాపు తగ్గో లేక మరే కారణమో – మూడు రోజులుగా రావటం లేదట. మనూరి పూలమ్మే వాళ్లు ఊళ్ళో దొరికే మల్లె పూలతోనే సరి పెట్టుకుంటున్నారట – ధరలు ఆకాశానికి పెంచేసి. ఈరోజు గాని పూలు దొరక్కపోతే ఇక నాగతి అంతే.”

మంగమ్మ ఆశ్చర్యపోతూ- “ఎందుకూ!”అని అడిగింది.

పోలమ్మ కళ్లు పెద్దవి చేసుకుని చూసింది – “అదేమిటే యేమీ తెలియనట్టు అడుగుతావు! పొరుగూరి నుండి కాంట్రాక్టు పని ముగించుకుని మా వాడూ మీ వాడూ ఈరోజు ఊరు చేరడం లేదూ? ఆవురావురని ఆకలితో వస్తున్నాడాయె – రాత్రికి పడకను పావనం చేయకుండా ఉంటాడా! నీ విషయంలోనూ అంతేలే” అంటూ ముందుకు సాగిపోయింది పోలమ్మ.

మంగమ్మ మనసు చివుక్కుమంది. అంటే – ఇప్పుడు చేతిలో చిల్లర డబ్బులున్నా మల్లెపూలు దొరకవన్నమాట. ఆమె అలా మథనపడుతూ అసంకల్పితంగా తల తిప్పి చూసింది. పోలమ్మ చకచకా నడిచిపోతూంది – అటూ ఇటూ చూడకుండా ఆవేశంతో ఊపిరి బరువెక్కింది. వానలు బాగా కురిసి పెరట్లో కాపు బాగ చేతికందినప్పుడు ఇది యెన్నిసార్లు చిల్లిగవ్వ ఇవ్వకుండా చేతులూపుకుంటూ వచ్చి తనతో లేని వరసలు కలుపుతూ కనకాంబరాలూ పారిజాతాలూ కోసుకుపోలేదని – ఈ ఒక్కసారీ తనకు కాసిని మల్లెలు పంచి పెడ్తే యేమయిపోతుందని – మట్టి కొట్టుకు పోతుందా! మొగుడంటే ఆశ దానికే ఉంటుందా! తనకుండదా? చిన్నప్పుడు బడిపంతులన్నమాట గుర్తుకి వచ్చింది మంగమ్మకి. ఎవరికి వారే యెమునా తీరే – ఇప్పుడు తలచుకుని వాపోతే ప్రయోజనం ఉండబోదు గాని – అయ్యగాని తనను మరికొంత చదివిస్తే తనీపాటికి అంగన్‌వాడి లోనో – సర్కారు క్లీనిక్కు నర్సమ్మకి సహాయకురాలి గానో- లేక మరేదో చిన్నపాటి కొలువులోనో చేరిపోయున్నుకదా! తన కోసమూ బిడ్డల కోసమూ ఈనాడు భర్త పడే వెంపర్లాట ఇంతగా ఉండక పోను కదా! ఊరు విడిచి ఊరు వెళ్ళే అవసరం ఉండకపోను కదా!

***

భర్త వచ్చే వేళయింది.

మంగమ్మ ఆకాశంలోకి తేరి చూసింది. మాడంత మబ్బు యేదో ముంచుకువస్తున్నట్టు దూసుకువస్తూంది. అడుగుల సవ్వడి వినిపించనీయకుండా లోపలకు తొంగి చూసింది. పిల్లలిద్దరూ పగలంతా ఆడుతూ పాడుతూ తిరిగారేమో – అలసి ఆదమరచి నిద్రపోతున్నారు. అద్దంలోకి ముఖం చూసుకుంది. చప్పున మొగుడన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుంది. ఆడదాని రూపంలో రెండు కచ్చితంగా కనుమరుగవకూడదంటాడు చంద్రప్పడు. ఒకటి – ముఖానికి వెలుగునిచ్చే కుంకుమబొట్టు. రెండు -కొప్పులో వాడని పువ్వు. ఆ మాటలు తలంపుకి వచ్చిన తోడనే మంగమ్మ బొట్టుని కుదురుగా దిద్దుకుని, గడప దాటి ఆవరణలోకి వెళ్ళి గడ్డి పువ్వుని తుంచి కొప్పులో తురుముకుంది.

***

ఎట్టకేలకు చంద్రప్పడు ఇల్లు చేరాడు. మొదట లోపలకు వెళ్ళి పిల్లల ముఖాలు చూసాడు. బుగ్గలు నిమిరాడు. ఆ తరవాత వేడినీళ్ళ స్నానం చేసి పొడి బట్లలు మార్చుకున్నాడు. దేవుడి పటాలముందు ప్రణమిల్లి దివంగతులైన అమ్మాబాబులకు నమస్కరించాడు. నుదుట విభూతి పూసుకుని వంట గదిలోకి వచ్చి కూర్చున్నాడు. పెళ్ళాన్ని చూసి చాలా రోజులయిందేమో – అన్నం వండిస్తూన్న మంగమ్మని కనురెప్ప మూయకుండా చూడసాగాడు.

“అదేంవిటి మాఁవా అలా సూత్తున్నావు కొత్తగా!” గిన్నెనిండా మాంసపు కూర నింపి కంచం ప్రక్కనుంచుతూ అడిగింది.

“ఏమీ లేదే!ఊరకే సూత్తున్నాను”

“అబధ్ధమాడబోకు. నీ చూపుల్లో యేదో ఉందనిపిస్తూంది మాఁవా!”

“ఔనే మంగా!నిన్ను, సూత్తుంటే మా పెద్దప్ప(అక్క)కరుణమ్మ గుర్తుకి వస్తుందే – మా అమ్మ నాకు ఆరేళ్లు నిండక ముందే తట్టా బుట్టా సర్దేసుకుని కైలాసం చెక్కేసింది. అప్పట్నించి మా పెద్దప్పే నన్ను పెంచింది. దానికి పెళ్లయిన కొత్తలో కూడా బావతో జాతర్ల కని – రంగుల రాట్నాలకని వెళ్ళేది కాదు. అన్నిటికీ దూరమయ నన్ను సాకేది. అది నాకు అమ్మకన్న మిన్న. దాని మేలు ఈ జన్మలో మరచిపోగలనా!” మంగమ్మ కాసేపు మౌనం వహించి అడిగింది – “అది సరే గాని మా ఆడపడుచు సంగతి తరవాత మాట్లాడుకుందాం గాని ఇప్పుడు కరుణమ్మ యెందుకు గుర్తుకి వచ్చిందట?” చంద్రప్పడు వెంటనే బదులివ్వలేదు. మాంసపు కూరతో కలిపిన మొదటి ముద్ద మంగమ్మకి అందిస్తూ నిదానంగా అన్నాడు-“నీలాగే మాపెద్దప్ప కూడా అంతా నాకే పెట్టేసేది”

‘అంటే?’ – అన్నట్టు చంద్రప్పడి కళ్ళలోకి చూసిందామె.

“నీకు లేకుండా కుండలో ఉన్నదంతా ఊడ్చి నాకు పెట్టింది నాకు తెలవదనుకున్నావా!”

మంగమ్మ నివ్వెరపోయింది. తన మగాడు యెలా కనిపెట్టేసాడో!

***

రాత్రి పడకపైన చంద్రప్పడు మంగమ్మని తన పైకి తీసుకునేందుకు వంగాడు. అప్పుడు – “ఒక్కమాట మాఁవా!” అని ఆపిందామె. చంద్రప్పడు కళ్ళు పెద్దవి చేసుకుని అడిగాడు – “ఏమయిందే నీకు! నెలసరి కాలేదు కదా?”

“ఉఁహు-కాలేదు”

“మరి?” అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసాడు చంద్రప్పడు.

“నీకిష్టమైన మల్లెచెండు కొప్పులో పెట్టుకోలేక పోయాను మాఁవా! మల్లెపువ్వు వాసన లేకపోతే నీకు మూడ్ రాదంటావు కదా! ఏమనుకోకు మాఁవా! నేనిప్పుడు కొప్పులో పెట్చుకున్న ది గడ్డి పూవు.”

పెళ్ళాం బెరుకుతనానికి చంద్రప్పడు నవ్వాపుకోలేక పోయాడు. పెద్దపెట్టున నవ్వుతూ – “ఇంత పెద్ద మల్లెపువ్వు నాకళ్ళ ముందుండగా మరొక మల్లెపువ్వు నాకెందుకే మంగా!” అంటూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు.

సరాసరి గుడిసె నడి మధ్యవరకూ వచ్చిన మాడంత మబ్బు మొగుడూ పెళ్ళాల సరసాలకు నోరు నొక్కుకుంటూ ఆకాశ వీధుల్లోకి జూరుకుంది; దొంగచాటు చూపులు తన హుందాతనానికి తగదు సుమా-అనుకుంటూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here