Site icon Sanchika

మల్లెల తీర్థం : అత్తిరంపిల్లి ఆఫ్ తెలంగాణా

[dropcap]కా[/dropcap]లేజీ జీవితంతో బోరుకొట్టి సరదాగా దసరా సెలవులలో ఎక్కడికైనా టూరు వెళదామని ఇంట్లో ప్రపోజ్ చేశాను. కొన్నిరోజులైనా వంట చేసే పని తప్పుతుందని అమ్మ వెంటనే నా ప్రపోజల్‌కు మద్దతు పలికింది. అన్నయ్య కూడా సుముఖత వ్యక్తం చేశాడు. మెజారిటీ నిర్ణయం ఐపోయాక ఇక తప్పేదేముందన్నట్టు నాన్న ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.  ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసే విషయంలో తలోదారి అయ్యింది. నేను కూర్గ్ అన్నాను. అన్నయ్య దండేలి అన్నాడు. అమ్మ శ్రీశైలం అంది. నాన్నేమో రామోజీ ఫిలిం సిటీ అన్నాడు. పోయినేడాది కేరళ ట్రిప్‌లో చూడకుండా మిగిలిపోయిన కుమరకోమ్, అలెప్పీ అన్నాను నేను. అన్నయ్య హార్స్‌లీ హిల్స్ అన్నాడు. అమ్మ అరకు వేలీ అంది. బడ్జెట్ లెక్కలేస్తున్న నాన్న తన మనసులోని భావాలను మొహంపై ప్రదర్శించనీయకుండా తంటాలు పడుతున్నాడు. ఎటూ తేలకుండానే రెండురోజులు వేస్ట్ అయ్యింది. అలకలు, బుజ్జగింపులు అన్నీ ఐపోయాక చివరకు అందరం శ్రీశైలం వెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చాము. మూడు రోజులు శ్రీశైలం, దాని చుట్టుముట్టు ప్రదేశాలు చూడాలని నిర్ణయించుకున్నాము. నిజానికి నాకు ఈ గుళ్ళూగోపురాలూ అంటే అంతగా ఇష్టం వుండదు. ఎందుకంటే దేశంలోని జనాభా అంతా అక్కడే ఉన్నట్లు ఎప్పుడూ రద్దీగా వుంటాయి. దేవుడి దర్శనానికి గంటల కొద్దీ వేచివుండాలి. క్యూలో తోపులాటలు, తొక్కిసలాటలు తప్పవు. పుణ్యతీర్థాలు దర్శిస్తే లభించే పుణ్యం మాటేమో కానీ మనస్సు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని పొందలేదన్నది నా అభిప్రాయం. ఫ్యూచర్‌లో నా అభిప్రాయం మారుతుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం యిదే. టూర్ వెళ్లడానికి ఎక్కువ టైమ్ లేకపోవడం, రైలు/బస్సు టికెట్ల రిజర్వేషన్ ప్రాబ్లం, అమ్మ కోరిక వగైరాలు దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం వెళ్లడానికి అంగీకరించాను. పదిహేనేళ్ల క్రితం ఒకసారి శ్రీశైలం చూశాను కానీ గుర్తులేదు.

టూర్ ప్లేస్ డిసైడైన వెంటనే నాన్న ఎ.పి.టూరిజం వారి హరిత హోటల్‌లో రూములు ఆన్‌లైన్‌లో బుక్ చేశాడు. టాక్సీ కూడా మాట్లాడాడు. శనివారం తెల్లవారు జామునే బయలు దేరి శని, ఆదివారాలు అక్కడే వుండి సోమవారం ఉదయం బయలుదేరి సాయంకాలానికి వాపసు వచ్చేలా అనుకున్నాము. క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్ ప్రేమ్‌గౌడ్ మాకు తెలిసిన వ్యక్తే కాబట్టి ముందురోజు రాత్రే మా అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చేశాడు.

తెల్లవారి 5.30కల్లా మా కాలకృత్యాలు, స్నానకాఫీపానాదులు ముగించుకుని క్యాబ్ ఎక్కాము. పావుగంటకల్లా క్యాబ్ ఓ.ఆర్.ఆర్. ఎక్కి మరో అరగంటకల్లా దిగింది. ఆర్.టి.సి వాళ్ల సమ్మె ఆరోజు నుండే మొదలవడంతో రోడ్లన్నీ బోసి పోయి వున్నాయి. స్టీరియోలో ఎఫ్.ఎం.రేడియోలో చాగంటి కోటేశ్వరరావు లలితా సహస్రనామంపై చేసిన ప్రవచనం వినిపిస్తోంది. నాన్న డ్రైవర్‌తో దారిలో చూడదగ్గ ప్రదేశాలేవైనా ఉంటే చూసి వెళదామని అంటే ఉమామహేశ్వరం ఉంది చూడవచ్చు అన్నాడు. నాన్న మల్లెల తీర్థం గురించి ఆరా తీశాడు. అది కూడా చూద్దామని డ్రైవర్ తన అంగీకారాన్ని చెప్పాడు.

అచ్చంపేట చేరేముందు హైవేలో ఒక హోటల్ దగ్గర బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆగాము. బ్రేక్‌ఫాస్ట్ ఫరవాలేదు బాగానే వుంది. తరువాత బయలుదేరి దగ్గరలోనే ఉన్న ఉమామహేశ్వరం చేరుకున్నాము. అక్కడ ఉమామహేశ్వరుని దర్శించుకున్నాము. శ్రీశైలానికి ఇది ఉత్తర ముఖద్వారం అంటారు. ఈ పుణ్యక్షేత్రం దర్శించుకోకుండా శ్రీశైలయాత్ర పరిపూర్ణం కాదని అంటారు. అన్నట్టు ఈ ప్రాంతాన్ని పూర్‌మెన్’స్ ఊటీ అంటారట. దేవాలయానికి కొద్ది దూరంలో పాపనాశనం ఉంది. ఏడాది పొడుగునా అక్కడ నీరు ధారగా వస్తూవుంటుంది.  ఆ ధారలో కాళ్లుకడుగుకొని నీటిని నెత్తిమీద జల్లుకుని అక్కడ నెలకొనివున్న లింగాన్ని నమస్కరించుకున్నాము.  అరగంట వ్యవధిలో ఉమామహేశ్వరం దర్శించుకుని క్యాబ్ ఎక్కాము.

మరికొంచెం సేపట్లోనే ఫారెస్ట్ ఏరియాలోకి ప్రవేశించాము. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని, ది లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అనీ పెద్ద పెద్ద బోర్డులు కనిపించాయి. టైగర్ రిజర్వ్ అనగానే నాకు కొన్నేళ్ళ క్రితం మైసూరు నుండీ ఊటీ వెళ్లే మార్గంలో చూసిన బండీపూర్ – మదుమలై అడవులు గుర్తుకు వచ్చాయి. పొడుగైన చెట్లతో కూడిన దట్టమైన అడవులు అవి. అప్పటి మా క్యాబ్ డ్రైవర్ (పేరు  కమాల్) ప్రతి పది పదిహేను నిమిషాలకు బండిని ఆపో, స్లో చేసో ఎన్నో జంతువులను దగ్గరగా చూపించాడు. ఏనుగులు, నెమళ్లు, జింకలు, జడల బర్రె, ఖడ్గమృగం మొదలైన ఎన్నో జంతువులను ఆ ప్రయాణంలో చూసి ఆనందించాము. పొడవాటి నీలగిరి చెట్ల దగ్గర ఆగి ఫోటోలు తీసుకున్నాము. ఆ అనుభూతులు మళ్ళీ ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. ఈ అడవులలో పచ్చదనం వుంది కానీ చెట్లు 4-5 మీటర్ల ఎత్తు మించి లేవు. అడవి దట్టంగా లేదు. పలచగా వుంది. టైగర్ మినహా (అది కనిపిస్తుందని ఆశ ఎలాగూ లేదు) మిగిలిన అడవి జంతువులు ఏమైనా దూరంగా కనిపిస్తాయేమో డ్రైవర్‌ను మెల్లగా పోనిమ్మని అడగుదామని నాన్న తన తలను కిటికీ వైపు నుండి తిప్పనే లేదు. పాపం ఏ జంతువూ నాన్నకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. అయితే కోతులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా దర్శనమిచ్చాయి. ఫోటో సెషన్ పెట్టుకోడానికి మంచి షూటింగ్ స్పాట్ కనిపించలేదు. డ్రైవర్ అంకుల్ ఎక్కడా ఆపకుండా బండిని స్పీడుగా పోనిస్తున్నాడు.

అలా ఒక గంట ప్రయాణించిన తర్వాత వట్వర్లపల్లి అనే ఊరులో బండి ఎడమవైపుకు తిరిగింది. అక్కడి నుండి మల్లెల తీర్థానికి 9 కి.మీ.దూరం. రోడ్డు అంతా గతుకుల మయం. మట్టిరోడ్డు. అంతవరకు 80కి.మీ.స్పీడులో వెళ్లిన క్యాబులోని స్పీడోమీటర్ ముల్లు 10-20 మధ్యనే వుంది. డ్రైవర్ తనంతతానే మల్లెలతీర్థం ప్రస్తావన ఎందుకు తేలేదో ఇప్పుడు మాకు బోధపడింది.

ఎలాగైతేనేం మల్లెల తీర్థం చేరుకున్నాము.  కారు పార్కింగ్ స్థలం నుండి కొంత దూరం నడవగానే ఎంట్రెన్స్ గేటు కనిపించింది. టికెట్టు కొని లోపలికి వెళ్లగా దిగువకు 400కు పైగా మెట్లు కనిపించాయి. ఆ మెట్లు దిగి క్రిందకు చేరగానే అద్భుత దృశ్యం కళ్లకు కనబడింది. పైనుండి క్రిందకు దూకుతున్న జలపాతం. ఆహ్లాదకరమైన వాతావరణం. మనోహరమైన ప్రకృతి సౌందర్యం. వెంటనే నాకు పోయినేడాది చూసిన కేరళలోని అత్తిరంపిల్లి జలపాతాలు గుర్తుకొచ్చాయి. చెవులు చిల్లులుపడే జలపాతశబ్దం, కొంచెం భీతిని గొలిపే నీటి వుధృతి, వేగం అవేవీ ఇక్కడ కనిపించని దృశ్యాలు. అంతగా హోరు,జోరూలేని ఈ అత్యద్భుత జలపాతాన్ని సందర్శించడానికి మేం వెళ్ళిన సమయానికి అక్కడ పట్టుమని పాతిక మంది కూడా లేరు. రాజమౌళికి ఈ లొకేషన్ తెలిసివుంటే బాహుబలి పాట షూటింగ్ అత్తిరంపిల్లిలో కాకుండా ఇక్కడే చేసేవాడేమో? ఇది కాస్త అతిశయోక్తి అయితే కావచ్చేమో కానీ అసాధ్యం మటుకు కాదు. ఇక్కడ షూట్ చేసి ఆ గ్రాఫిక్స్ఏవో వాడి వుంటే ఇంకా బాగా వచ్చేదని నా నమ్మకం. ఎంతైనా మన తెలుగు వారికి పొరిగింటి పుల్లకూరపైనే మక్కువ ఎక్కువ కదా?

పూర్వం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసుకునేవారట. వారికి శివ సాక్షాత్కారం కూడా కలిగిందంటారు. వేసవిలో ఈ అడవిలో వున్న పులులు ఇక్కడికి దాహం తీర్చుకోవడానికి వస్తాయట.   ఇంత మంచి పర్యాటక స్థలం సరైన నిర్వహణకు నోచుకోక పోవడం విచారించదగ్గ విషయం. అయితే అదీ ఒకరకంగా మంచిదే అనిపిస్తుంది. ఈ ప్రాంతానికి ఎక్కువ పబ్లిసిటీ వచ్చి జనప్రవాహం ఎక్కువైతే పర్యావరణ కాలుష్యం బారిన పడి ఈ ప్రాంతం యొక్క పవిత్రత(?)కు భంగం వాటిల్లదా!  ఈ ప్రాంతాన్ని వదలి వెళ్లబుద్ధి కావడం లేదు. అప్పటికే మధ్యాహ్నం 2 గంటలు దాటడంతో అందరికీ ఆకలి కావడంతో ఇక బయలుదేరక తప్పింది కాదు. ఆ 400 పైచిలుకు మెట్లూ నిదానంగా ఎక్కుకుంటూ పైకి వచ్చి క్యాబులో కూలబడి వెంట తెచ్చుకున్న స్నాక్స్ తిని మళ్ళీ ప్రయాణం కొనసాగించాము.

కొంత సేపటికి మా క్యాబ్ వట్వర్లపల్లి చేరి ఎడమవైపుకు తిరిగి శ్రీశైలం దిక్కుగా దూసుకుంటూ పోసాగింది. ఆ తర్వాత మేము శ్రీశైలంలో సాక్షి గణపతి దర్శనం, హరిత హోటల్‌రూములో చేరి ఫ్రెష్ అయి అక్కడే రెస్టారెంటులో బఫే భోజనం చేయడం, తర్వాత ఓ రెండు గంటలు శుభ్రంగా విశ్రాంతి తీసుకుని సాయంత్రం దర్శనానికి దేవాలయం చేరుకోవడం, అక్కడ క్యూ కాంప్లెక్సులో గంటన్నర పడిగాపులు, అటు పిమ్మట ఎక్కువ శ్రమలేకుండానే భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనం, ఆ తర్వాత రాత్రి త్రిశూల్ హోటల్లో నార్త్ ఇండియన్ ఫుడ్డూ, రాత్రి హోటల్ రూమునుండే నవరాత్రి సందర్భంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు చూడడం, ఉదయమే లేచి మరో సారి దైవదర్శనానికి వెళ్లడం, వచ్చినతర్వాత హరిత హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్టూ, ఆ తర్వాత కేబుల్ కార్లో పాతాళ గంగ వెళ్ళి మళ్ళీ కేబుల్ కార్లో పైకి రావడం, శిఖర దర్శనం, ఫాలధార, పంచధారల దర్శనం, షాపింగు, కుంభకోణం కాఫీ, అన్నయ్యకు సోమవారం శెలవు దొరకక పోవడంతో ఆదివారమే హోటల్ చెక్ ఔట్ చేసి తిరుగు ప్రయాణం కట్టడం ఇవేవీ వివరించదలచుకోలేదు. పాఠకుల ఊహకే వదిలేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.

Exit mobile version