[dropcap]ఎం[/dropcap]డాకాలమంటే భయంతో పాటు చాలా ఇష్టం కూడా. భయం అంటే ఎండలకు అనుకునేవారు. పిల్లలకు ఎండలంటే భయమెంత? ఎండలకే పిల్లలంటే భయం రావాలి. పిల్లలు భయపడేది పరీక్షలకు. పరీక్షల కోసం రాత్రింబగళ్ళు చదవాలి. చదవటంతో పాటు పరీక్షలున్నాన్నాళ్ళు ఆటలు ఉండవు. దీనితో పాటు నిద్రను త్యాగం చెయ్యాలి. అసలు ఎండకాలాల్లో తెల్లవారుఝామున చల్లని గాలి వచ్చి బాగా నిద్రపోవలనిపిస్తుంది. కానీ పరీక్షలనగానే అమ్మలు అప్పుడే మొహాన నీళ్ళు చల్లి నిద్ర లేపి పుస్తకం చేతికిస్తారు చదువుకోమని. పుస్తకం చేతిలో పట్టుకొని పరీక్షలు ఎప్పుడయిపోతాయా ఎప్పుడెప్పుడు ఆటలాడుకుందామా అని పగటి కాలాల్లోకి జారిపోయేవాళ్ళం. పరీక్షల సమయంలో సెలవుల గురించి ఆలోచిస్తుంటేనే చాలా మజాగా ఉంటుంది. మన కిష్టమైన స్వీటు తినబోయేముందు నోరూరినట్లుగా అదో తీయనైన భావన. ‘అమ్మలకైతే ఈ పరీక్షలూ ఉండవు. వీళ్ళ పని హాయి. మనం కూడా పెద్దవాళ్ళమైపోతే ఈ పరీక్షల గోల లేకుండా హాయిగా ఎండాకాలపు నిద్రను తనివిదీరా ఆస్వాదించవచ్చు’ అని అనుకునేవాళ్లం. ఇప్పుడు కదా తెల్సింది పెద్ద వాళ్ళమయితే ఒక్క ఎండాకాలమే కాదు అన్నీ కాలాల్లోనూ నిద్రలొదిలేసి ఇంటి పనులు, పిల్లల పనులు చేసుకోవాల్సి వస్తుందని. ఇప్పుడు ఆలోచిస్తే ఆ విద్యార్థి జీవితం ఎంత మధురమో కదా అని అనిపిస్తుంది.
ఎండాకాలనికీ, ఆడపిల్లలకూ మధ్య బలమైన అనుబంధమే ఉంది. ఆకుపచ్చని స్కర్టూ, తెల్లని బ్లౌజు వేసుకుని వేసవి కాలానికల్లా ఠంచనుగా వచేస్తాయి మల్లెబాలలు. ఆ పూ బాలల కోసమే ఆడపిల్లలంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసేది. రోజు సాయంత్రాలు మల్లెలు, కనకాంబరాలు కొనుక్కొని వాటిని చక్కగా మాలలల్లి పెట్టుకొని నీళ్ళు చల్లి ఉంచితే ఐదారుగంటల కల్లా చక్కగా విచ్చుకుంటాయి. స్నానం చేసి మల్లెపూలు తల్లో పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతుంటే దాని సుగంధం చుట్టుపక్కలంతా వ్యాపిస్తుంది. పిల్లలకూ పెద్దలకూ పూలంటే ఎంతో ఇష్టం. అంతేనా ఈ కాలంలో పూలజడలు వేసుకోవడం ఎంత మోజు ఆడపిల్లలకు. అసలు పూలజడ అంటేనే అదో పెద్ద అనుభూతి. పూలజాడల్లో ఎన్ని రకాలు. సదా జడ, వాన్కుల జడ, పూలమాలను జడకు చుట్టేసే మామూలు జడ నుంచి మల్లెపూలతో వేసే పెద్ద జడ వరకూ అనీ వేసుకునే వాళ్ళు.
ఒక్క మల్లె పూలేనా, బంతిపూలు, చామంతులు, సంపెంగలు, సన్నజాజులు, మొగలి పూలు ఇలా రకరకాల పూలతో జడలు వేసేవాళ్ళు. కానీ అన్నింటి కన్నా మల్లెలు, కనకాంబరాలు, మరువం దవనాలతో కలిపి వేసే జడే అద్భుతమైనది. పూలజడ వేసుకోవడమంటే ఆరోజు ఉదయం నుంచే పని ప్రారంభమయినట్లు. ఉదయమే త్వరత్వరగా ఇంటి పనులు ముగించుకొని పూల బుట్టల కోసం ఎదురుచూడడం 12 గంటలు దాటిన నుంచే పూలమ్మే వాళ్ళు వస్తారు. నాలుగురైదుగురి దగ్గర చూసి లావుగా, పొడుగ్గా ఉన్న మొగ్గల్ని మానికల లెక్కన తీసుకునే వాళ్ళు. మల్లె మొగ్గల్ని దండలుగా గుచ్చడానికి ఇరుగు పొరుగు సహకారం తీసుకునేవాళ్లు.
చక్రాల జడను అట్టముక్కకు మల్లెల్ని ముందుగానే గుచ్చి బిళ్ళల్లా తయారుచేసే వాళ్ళు. ముగ్గురు నలుగురు శ్రమ పడితేగాని పూలజడ పూర్తి కాదు. పూలజడ వెయ్యడం పూర్తయ్యాక జడను ఒకరు పట్టుకుంటే గాని స్నానం చేయడం కుదిరేది కాదు. పట్టులంగా కట్టుకొని, వంటి నిండా నగలు వేసుకొని ఇంట్లోని పెద్దల కాళ్ళకు దణ్ణం పెట్టవాళ్ళం. వాళ్ళు ఆశీర్వదించి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుని చూసుకొని పిల్లలం తెగ సంతోషపడేవాళ్ళం. తర్వాత బంగారు జడ కుప్పేలున్న పూలజడను వీధి వీధంతా చూపించి వచ్చే వాళ్ళం. అలాగే గుడికెళ్ళి దణ్ణం పెట్టుకొని వచ్చేవాళ్ళం. ఆ తర్వాత అసలు తంతు. స్టూడియో కెళ్ళి ఫోటోలు తీయించుకొని ఆ ఆనందాన్ని భద్రపరచుకోవడం పెద్ద పని. పెద్ద పెద్ద అద్దాల ముందు నిలబడి ఫోటో తీయించుకుంటే అద్దం లోంచి పూలజడ కన్పిస్తోంది. ఇలా ప్రతి సంవత్సరం ఎండాకాలం ఎప్పుడొస్తుందా పూలజడ వేసుకొని ఎప్పుడెప్పుడు ఫోటోలు దిగుదామా అని ఆడపిల్లలు సంవత్సరమంతా ఎదురు చూస్తూనే ఉంటారు.
ఎండాకాలమంటే గుర్తొచ్చేది ఆవకాయ కూడా. ఆ రోజుల్లో ఆవకాయ పెట్టుకోవటం పెద్ద పని. మంచి కండగల కాయలు పీచు లేనివి సెలెక్ట్ చేసుకోవడం వాటిని ముక్కలుగా కొట్టుకోవడం ఆ తర్వాత జీడిపిక్కలు తీసేసి చక్కగా తుడవడం, ఆవపిండి, మెంతి పిండి, కారం, ఉప్పులు రెడీ చేసుకోవడటం, మంచి నువ్వుల నూనె తెచ్చి అవకాయగా కలుపుకోవడంతో పని ముగుస్తుంది. ఆవకాయ కలిపాక ముక్క ఎప్పుడు ఊరుతుందా అని రోజు ఎదురు చూడడం. మూడు రోజులకు ముక్క మాగాక ఊరగాయను బయటకు తీయడంతో కూరలన్నీ వదిలేసి అవకాయతోనే అన్నం లాగించేవాళ్ళు. వేడి వేడి అన్నంలో ఎర్రెర్రెని ఆవకాయ కలిపి, కరగబెట్టిన గిన్నెడు నెయ్యిపోసి ముద్దలు కలిపి వెన్నెల రాత్రుల్లో డాబాపై పెడుతుంటే ఎంత తింటున్నామో కూడా తెలిసేది కాదు. దీనికి తోడు ముద్దపప్పు తోడైతే ఆ రుచే వేరు. ఈ ఆవకాయ అన్నానికి కొత్త కూజా లోని నీళ్ళు చల్లగా తోడై మరింత మాజానిస్తాయి. ఇప్పటిలా ఫ్రిజ్ నీళ్ళు కాదు కదా! ఆవకాయ కారానికి కూజా నీళ్ళ చల్లదనం మధురం.
ఎండా కాలపు ఎండల్ని తట్టుకోవడానికి కొబ్బరి బోండాలు తాగటం అప్పట్లో సర్వసాధారణం. ప్రతి ఇంట్లో కొబ్బరి చేట్లుండటం మూలాన కొబ్బరి కాయలు కొనే పని లేదు కాబట్టి ప్రతివాళ్ళూ అవే తాగేవాళ్ళు. ఇంకా తాటి ముంజల మెత్తదనానికి ఇప్పటి హల్వాలు ఏం పనికొస్తాయి. తాటికాయలతో బ్యాండ్లుగా తయారుచేసి మగపిల్లలు ఆడుకునేవాళ్ళు. ఇంకా ఎండల్నుంచి తప్పించుకోవాడనికి సబ్జా విత్తుల్ని నీళ్ళల్లో నానేసి దాన్లో పంచదార కలుపుకొని తాగేవాళ్ళు. సబ్జావిత్తులు నానిన తర్వాత స్పంజి ముక్కల్లా మెత్తగా జారుతూ ఉండేవి. అవి తాగితే కడుపులో చాలా చల్లగా ఉండేది. సాయంకాలాలు సోడాలు తాగటం, వాటిలో నిమ్మకాయ పిండుకొని తాగటం ఇంకా గుర్తొస్తుంది.
ఇంకా మునిమాపువేళ ఇంటి ముందు అరుగుల మీద పిల్లలందరం కూర్చొని కథలు చెప్పుకునేవాళ్ళం. అమ్మ వాళ్ళు అన్నానికి పిలిచేదాక ఆ కథ పరంపర అలా కొనసాగుతూ ఉండేది. అన్నం తిన్నాక ఆరుబయట మంచాలేసుకొని, ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతూ, చెరువు కట్ట మీద మర్రిచెట్ల ఊడల గాలికి, చెరువులోని నీళ్ళ నుంచి తేలి వచ్చే చల్లదనం తోడై ఎప్పుడు నిద్రపట్టిందో కూడా తెలిసేది కాదు తెల్లారేదాకా. అవీ మా ఎండ కాలపు జ్ఞాపకాలు.
Image Courtesy: Internet