[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘మమకారమే అన్ని అనర్థాలకు మూలకారణం’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]మ[/dropcap]నిషికి ఇద్దరు శత్రువులు వున్నారు. ఒకటి అహంకారం మరి యొకటి మమకారం.
అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది అన్న భావనలు.
ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును స్వీకరించినప్పుడు ‘ఇది నాది’ అని మమకారం వల్ల వస్తుంది. అదే విధంగా ఏదైనా పని చేసినప్పుడు ‘ఇది నేను చేసినాను’ అనే భావన అహంకారం వలన కలుగుతుంది.
నాది అనే మమకారం అన్ని అనర్థాలకు మూలకారణం అని శాస్త్ర వాక్యం. తాను జీవితంలో కష్టించి సంపాదించుకున్న ధనంతో కొనుక్కున్న ధన కనక, వస్తు వాహనాలపై మానవుడు తీవ్ర మమకారం ఏర్పరుచుకుంటాడు. అవి ఒక్క క్షణం తన నుండి దూరమైతే భరించలేడు. నాది అనుకున్నది నాకు వ్యతిరేకంగా ప్రవర్తించినపుడు మమకారం బాధిస్తుంది. ఎప్పుడైతే ‘సద్యోముక్తి’ అనే భావన కలుగుతుందో సర్వ భూతములను పాలించే భగవంతుడే అన్నింటికీ స్వంతదారుడు అనే భావన వల్ల ‘ఏది జరిగినా అది మన మంచి కోసమే’ అనే భావాన్ని గుర్తించడం వల్ల మమకారం బాధించదు. ఈ మమకారం నుండి విముక్తిని పొందితే ‘మోక్షసంకల్పం’ వల్ల మోక్షాన్ని సాధించ గలుగుతారు. ఆనందాన్నిచ్చేది ‘మోక్షలక్ష్యం’ తప్ప మిగిలినవి ఏవీ కావు.
ఈ ‘నేను, నాది’ అనే అహంకార మమకారాలే సర్వ దుఃఖాలకూ కారణాలు. మనది అనుకోవడంతోనే మమకారం పుడుతుంది. మమకారం వల్ల దుఃఖం కలుగుతుంది.
మనస్సులో పుట్టే ‘నేను, నాది’ అనే ఆలోచనలు వెంటనే మన చుట్టూ ఒక గొలుసును తగిలించి మనల్ని బానిసల్ని చేస్తుంది. నేను, నాది అని చెప్పుకొనేకొద్దీ బానిసతనం పెరుగుతుంది. బానిసతనంతో దుఃఖమూ పెరుగుతుంది. మనస్సు ఆందోళనతో, ఆవేదనతో నిండిపోతుంది
కాబట్టి లోకంలో ఉన్న అన్ని రకాల సౌందర్యాన్నీ అనుభవించు, కానీ వాటిలో వేటితోనూ తాదాత్మ్యం మాత్రం పొందవద్దు, దేనీతోనూ అనుబంధాలు పెంచుకోవద్దు అని భగవద్గీత లోని కర్మయోగం మనకు బోధిస్తుంది.
‘ఏ వ్యక్తి అయితే తన కోరికలను త్యజించి, మమకారాలను పక్కనపెట్టి, అహంకారానికి దూరంగా ఉండి, అన్ని స్పృహలను వదలి ప్రవర్తిస్తాడో అతడు నిజమైన శాంతిని పొందుతాడు’ అన్న కృష్ణ భగవానుడి వాక్కులలో శాంతి పొందడానికి చక్కని సాధనా మార్గం వివరించబడింది.
‘నేను’ను వదులుకున్నప్పుడు.. అన్నీ ఆనందకరమే. లేకపోతే జీవితం విషాదంగా మారుతుంది అన్నది నిర్వివాదంశం.
అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, జీవితావసరమైనవి తప్ప తక్కిన భోగ విషయాలను గ్రహించకుండా విడిచిపెట్టినవాడు, దేహం మీద, జీవితం మీద మమకారం లేనివాడు, శాంతచిత్తుడు ఇత్యాది సాధనలతో బ్రహ్మత్వం (మోక్షం) పొందటానికి అర్హుడు అవుతాడన్నది ఉపనిషత్తుల సారాంశం.