కుమావన్ లో నరభక్షక పులులవేట – దాదాపు నూరేళ్ళ నాటిమాట

0
2

[box type=’note’ fontsize=’16’] పులులను వేటాడేందుకు ప్రత్యేకంగా నియమింపబడిన జిమ్ కార్బెట్ తన అనుభవాలను, అడవితోనూ పులులతోనూ తన అనుబంధాలను తెలిపేలా వ్రాసిన పుస్తకం ‘మాన్ ఈటర్స్ ఆఫ్ కుమావన్’ను విశ్లేషిస్తున్నారు బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. [/box]

ప్రపంచంలో కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి. ప్రతి ఒక్కప్రాణికీ జీవించడం సహజధర్మం, హక్కు. జీవచక్రంలో ఒకదానికొకటి బలవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ చక్రగతిలో అపశృతులు ఏర్పడుతాయి. వాటిని సరిచేయడంలో మరికొన్ని అపశృతులు ఏర్పడడం కూడా కద్దు.

సర్వే సంతు నిరామయాః

మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్

సర్వే జనాః సుఖినో భవంతు

ఉపనిషద్వాక్యాలు ఇవి. అందరూ ఎలాంటి బాధలు లేకుండా ఉండాలి. ఎవరికీ ఏ దుఃఖమూ కలుగరాదు. అన్ని రకాల జీవరాసులూ సుఖంగా ఉండాలి అని అర్థం.

ఈనాడు పులులు మొదలైన వన్యప్రాణుల జాతులు అదృశ్యమయ్యే దశను చూసి పర్యావరణం గురించి ప్రాథమికావగాహన ఉన్న మనుష్యులకందరికీ చింత ఏర్పడుతున్నది. ప్రతి ప్రాణిజాతీ ఇతర అనేక ప్రాణిజాతుల మీద ఆధారపడుతూ మనుగడ కొనసాగిస్తుంది. అదే సమయంలో ఇతర ప్రాణుల మనుగడలో తనవంతు పాత్ర పోషిస్తుంది. ఇదే జీవచక్రం. పరస్పరాధారితం.

ఇతర ప్రాణులకన్నా బుద్ధి వివేకం, పరస్పర అనుదానాల విషయంలో అధికశక్తి వంతమైన మానవజాతి ఇతర ప్రాణిజాతులను రక్షించడంలో అధికంగానే తన కర్తవ్యం నిర్వహించాలి. కానీ ఏ ప్రమాదం చేయని సాధుజంతువులైన కొన్ని వన్యప్రాణులు కూడా ఈమధ్య కాలంలో మానవుల దురాగతాలకు బలైనాయి. వాటి జాతులు అంతరించే ప్రమాదం ఏర్పడుతున్నది. ఇది వినోదం కోసం జరగడం మరింత బాధాకరమైన విషయం.

అలా కాక ఆకలి తీర్చుకోవాల్సిన విధిలేని పరిస్థితులలో కొన్ని ప్రాణులు ఇతర ప్రాణుల మీద దాడికి పాల్పడతాయి. ఇటువంటి సంఘటనలో వందలమంది ఆడా మగా పిల్లా పీచు పులుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వేళ పులులను వేటాడేందుకు ప్రత్యేకంగా నియమింపబడిన వ్యక్తి జిమ్ కార్బెట్ తన అనుభవాలను, అడవితోనూ పులులతోనూ తన అనుబంధాలను తెలిపేలా వ్రాసిన పుస్తకం Man-eaters of Kumaon (మాన్ ఈటర్స్ ఆఫ్ కుమావన్).

1944 లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, 1947 లో మద్రాస్ విశ్వవిద్యాలయం ప్రచురించిన ఈ పుస్తకం ఇవి కాక నాలుగు పునర్ముద్రణలను (పదిహేనేళ్ళలోపలే) పొందింది. ఇప్పుడు ఆన్లైన్‌లో చదవవచ్చు.

1925 డిసెంబర్ నుంచి 1930 మార్చ్ వరకూ జరిగిన విషయాలు, వాటిపై వ్యాఖ్యానంతో ఆసక్తికరమైన కథనం ఈ రచనలో ఉంది. ఒళ్ళు గగుర్పొడిచే సంఘటనలు, హృదయవిదారకమైన దృశ్యాలు, సామాన్యుల జీవనపరిస్థితులు, యుద్ధసదృశ వాతావరణాలు, ప్రకృతిని, జీవప్రకృతిని సాక్షాత్కరింపచేసే మనోహర వర్ణనలు, వివిధ విషయాలపై సాధికారక వివరణలు వంటి అనేకం ఈ రచనలో లభ్యం.

వీర, బీభత్స , భయానక రసాలే అధికంగా విస్తరించిన ఈ రచనలో కరుణ, అద్భుత రసాలకు కూడా తగినంత స్థానం దక్కింది. ఆయా రసావిష్కరణ అంతా సహజంగానే జరిగింది తప్ప ప్రయత్నపూర్వకంగా కాదన్నది స్పష్టం.

దాదాపు 1500 కి.మీ పరిధిలో విస్తరించిన అనేక గ్రామాల నేపథ్యం. వాటిలో రెండు మూడిండ్లు మాత్రమే గల ఊళ్ళు కూడా కొన్ని. ఈ గ్రామాల మధ్యలో రోడ్ సౌకర్యం లేదు. అన్నీ కాలిబాటలే. ఈ ప్రాంతాన్ని ఆవరించిన అడవిలో పెరిగే ఓక్ గడ్డిని తమ పశువులకోసం కోసుకురావడానికి, కట్టెలేరుకోవడానికి, గ్రామాంతరం వెళ్ళడానికి, కొండొకచో చిన్న జంతువుల వేటకు ఈ గ్రామాలనుంచి మనుష్యులు అడవిలోకి ప్రవేశిస్తూ ఉండడం మామూలే. చాలా మటుకు గుంపులుగా కలిసే వెళ్తారు. ఆ అడవుల్లో సంచరించే పులులు కొన్ని ఒకానొక కాలంలో నరభక్షకులుగా మారి ఆ ప్రజలమీదికి దాడి చేయడం, చంపి తినడం, ఒక్కోసారి ఊళ్ళోకి కూడా ప్రవేశించడం జరుగుతుంటాయి. అలాంటప్పుడు పులి గురించిన సమాచారం వెన్వెంటనే పక్కూరికి తెలియచేయాలంటే ఎత్తైన రాయి మీదెక్కి గట్టిగా అరిచి చెప్తూ అలా అన్ని గ్రామాలను హెచ్చరిస్తారు.

ఒకరొకరుగా అలా యాభై, అరవైలుగా మనుష్యులు చనిపోతుంటే అక్కడి ప్రజలు భయభ్రాంతులై గుమ్మంలోంచి అడుగుపెట్టడం మానేస్తారు. ఆనాటి వైస్ రాయ్ లిలిత్ గౌ, బ్రిటిష్ ప్రభుత్వం వీరి యోగక్షేమాల గురించి కాకపోయినా, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడడం వల్ల తప్పనిసరై అదే ప్రాంతంలో పుట్టి పెరిగిన వేటగాడిని పిలిపిస్తారు.

జిమ్ కార్బెట్ తానిక్కడికి వచ్చే ముందు రెండు షరతులు పెడతాడు. ముందు పులిని చంపినందుకు ప్రకటించిన బహుమతులను తత్క్షణం రద్దు చేయాలి. ఇప్పటికే నియమించిన వేటగాళ్ళను వెనక్కి పిలిపించాలి. ప్రభుత్వం ఒప్పుకున్నాక సదరు ప్రాంతానికి చేరినవెంటనే పని ప్రారంభిస్తాడు.

అవి చిక్కటి అడవులు. నరసంచారం కొద్ది దూరం వరకే ఉంటుంది. వేటలో ముఖ్యంగా కావలసినది ధైర్యం మాత్రమే కాదు. దూరాలోచన, ప్రణాళిక, తయారీ, జారిపోని పట్టుదల తప్పనిసరి. నడుస్తూంటే శబ్దం రాని షూస్, రైఫిల్స్, పెన్ నైఫ్ వంటి అవసరమైన తయారీ కూడా ముఖ్యం.

పులులు సహజంగా నరభక్షకులు కానే కావని ఘంటాపథంగా చెప్తాడు రచయిత. తన కున్న అపారమైన అనుభవంతో ఈ మాటన్నాడని చదువరులకు స్పష్టంగా తెలుస్తుంది. ముసలి వయసు కారణంగా పటుత్వం తగ్గిపోవడం వల్ల, ముళ్ళపందిని తిన్నప్పుడు వాటి పదునైన ముళ్ళు పులి కోరలలో, పండ్లలో ఇరుక్కొని బాధించడం వల్ల, శరీరం మీది ఇతర గాయాల ద్వారా బలహీన పడడం వల్ల ఆకలి తీర్చుకోడానికి నరమాంసం మాత్రమే వాటికి దిక్కవుతుంది. (బహుశా మిగతా జంతువులతో పోలిస్తే మనుష్యుల ప్రతిఘటన గానీ, శక్తి గానీ తక్కువేనని నేననుకుంటున్నాను.) కొండొకచో ఈ పులికి సహాయపడుతున్న పులి పిల్లలు గానీ ఇతర పులులు గానీ ఉండుంటే, ఒకసారి తిన్నాక అవీ అలా అలవాటుపడే అవకాశముంది. కానీ సహజ పరిస్థితులలో పులులు నరభక్షకులు కావని రచయిత లోతైన అవగాహన ద్వారా మనకు తెలుస్తుంది.

పులులు పగటివేళ మనుష్యులను వేటాడతాయి. చిరుతపులులు రాత్రివేళ మనుష్యులను వేటాడతాయి. మనిషిని గానీ జంతువును గానీ చంపాక వారి మెడ భాగాన్ని గానీ, వీపు భాగాన్ని గానీ నోట కరచుకొని తన ప్రాంతానికి తీసుకొని వెళ్తాయి. అప్పుడు మిగతా శరీరభాగం ఈడ్చబడినట్టుగా భూమి మీద గుర్తులు కనిపిస్తాయి. ఆ గుర్తులను బట్టి వెళ్ళేవారికి ముళ్ళకంపల్లో ఇరుక్కున్న జుట్టు, రక్తసిక్తమైన బట్టలు కనిపించడం మామూలే. తనకు కావలసినంత తిని వెళ్లిపోయి మళ్ళీ మరురోజు ఆ పులి తన ఆకలివేళకు వచ్చి మిగిలినది తింటుంది. చనిపోయిన వారి దహన సంస్కారాలకోసం శరీరంలోని ఒకభాగమైనా సాంప్రదాయికంగా అవసరమై పులి ఎటువైపు తీసుకెళ్ళిందో అటు ఆ దారిగుండా వెళ్ళవలసి వస్తుంది. ఒక్కొక్కసారి ఒక ఎముక వంటి దేదైనా దొరికితే తెచ్చి ఇచ్చిన జ్ఞాపకాన్ని గురించి రచయిత ఉటంకిస్తాడు.

తన అక్కను కళ్ళెదురుగా పులి చంపడం చూసిన ఒక చెల్లెలు దిగ్భ్రాంతికి గురి కాగా ఆమె మాట పడిపోయింది. పన్నెండు నెలల నుంచీ నోరు తెరిచి మాటాపలుకు లేకుండా అయిపోయిన ఆమె పులిని చంపిన వార్త వినగానే పలుకడం రచయిత స్వయంగా చూస్తాడు. ఆ గ్రామాల్లోని అందరి ఆత్మీయులూ ఏదో ఒకరకంగా పులివాత పడ్డవారే.

ఒక పెద్దామె తన ఒక్కగానొక్క మనుమడిని పులివల్ల కోల్పోయింది. పులిని చంపేందుకు ఎరగా నా గొడ్లన్నిటినీ కావాలంటే తీసుకోండి అని వచ్చి చెప్తుంది. పులి మనుష్యులను చంపడం బాధాకరం. అందుకని ఆత్మరక్షణకై ఆ పులిని చంపడం బాధాకరం. పైన ఆ పులిని చంపడానికి గొడ్లను, మేకలను ఎరగా వేయడం కూడా అంతే బాధాకరం. పుట్టుక పుట్టుకకూ , చావు చావుకూ కారణమౌతూ ఉంటాయా? ఏమో.

పులివేటలో రచయితకు తోడుగా వచ్చిన ఒక ఊళ్ళోని పెద్దాయన తన అనుభవాన్ని విశదంగా చెప్తాడు. తన కళ్ళెదురుగానే పులి వయసుకు వచ్చిన తన కొడుకును నోటబెట్టుకుందని, తన చుట్టూ పది ఇరవై మంది ఉన్నా ఎవరూ కాపాడలేకపోయారని చెప్తాడు. మిగతా వారు కూడా తమ తప్పును ఒప్పుకుంటారు. కానీ అందరికీ ప్రాణభయం ఉంటుంది కదా! నిజంగా పులి పది పన్నెండడుగుల దూరంలో ఉన్నప్పుడు తెలుస్తుంది ఎవరికి భయం ఉంది, ఎవరికి ధైర్యం ఉంది అని. భద్రంగా జనావాసాల్లో నిశ్చింతగా తిరుగుతున్నప్పుడు తెలిసే అవకాశం తక్కువ.

రుడ్ యార్డ్ క్లిప్పింగ్ వ్రాసిన జంగిల్ బుక్ లో అడవిజీవనాన్ని గురించి విస్తృత వర్ణన ఉన్నా, అది ఒక కల్పిత కథ. కానీ కుమావన్ నరభక్షక పులుల గురించి జిమ్ కార్బెట్ వ్రాసిన ఈ man-eaters of kumaon తన స్వంత అనుభవాలతో కూర్చిన విశేషమైన విస్తృత స్వీయ అవగాహన కలిగిన రచన.

అనేక సార్లు అడవిలో పారే సెలయేళ్ళలో స్నానాదికాలు కానిస్తూ, అక్కడ ఏది సౌకర్యవంతంగా భద్రంగా ఉంటుందో ఎన్నుకొని ఆ చెట్లపై నిద్రిస్తూ, అప్పుడప్పుడూ రెండు మూడు రోజుల పాటు సరైన ఆహారం కూడా లేకుండా పులులవేటలో గడిపిన స్వీయ అనుభవాల గాధ. ఈ కష్టాలన్నీ భరించి ఎందుకు వేటాడడం అంటే నరభక్షక పులినీడలో బ్రతుకు గడపడం ఎంత దుర్భరమో తెలిసీ ఆ పల్లె వాసులని అలా వదిలేయలేక మాత్రమే.

గన్ షూటింగ్ మొదటి సారి చూసి ఆశ్చర్యపోయే ఆ పల్లె జనుల మీద ఉన్నంత కరుణనూ, వేరే గతిలేక ఆకలి తీర్చుకోడానికి మనుష్యులను చంపడానికి అలవాటు పడిన ఆ పులుల మీద కూడా అంతే స్థాయిలో చూపేవాడు రచయిత. వాటి అందాన్ని, వాటి నిలువుచారలను, వాటి వ్యవహారశైలిని కూలంకషంగా వర్ణిస్తూ, అడవి లోని చెట్లు, ఇతర జంతువుల గురించి, అక్కడి వాతావరణం గురించి ఆసక్తికరమైన వివరణ ఇస్తాడు రచయిత.

పులి గాండ్రింపు స్థాయిని బట్టి అది ఉన్న దూరాన్ని, అది గాయపడిన పులా లేక ఆరోగ్యంగా ఉన్న పులా అన్న విషయాన్ని, దాని పాదాల గుర్తుల సైజుని మట్టిలో గుర్తించి, వాటి వయసు, ఆడపులా మగపులా అన్న విషయాలనూ గమనించి చెప్పడం ఆశ్చర్యంగా ఉంటుంది. మెత్తగా అడుగులు వేస్తూ నడిచే జంతువుల పాదాలు గుర్తించడం కష్టం. గట్టిగా అడుగులు వేసే వాటిని మాత్రమే గుర్తించడానికి అవకాశం ఉంటుంది.

అంతే కాదు, పులుల రాకపోకలను పసిగట్టే మరికొన్ని చిట్కాలను కూడా చెప్తాడు. ఒక దారిలో ఎప్పుడూ పులి రాకపోకలు ఉన్నాయంటే ఆ దారికొక వైపు చివరన ఆ మట్టిని గీరిన గుర్తులు ఎన్నోచెప్తాయట. అది ఆడపులా, మగపులా ; అది ఏ దిక్కువైపు వెళ్తోంది; అటుగా వెళ్ళి ఎంతసేపైంది; దాని ఆవాసానికి అది ఎంతదూరంలో ఉంది; అది ఇటీవల తిన్న ఆహారం మనిషిదా కాదా; దాని నాలుగు కాళ్ళూ బాగున్నాయా లేక ఏదైనా కాలు గాయపడి ఉందా అన్న అనేక విషయాలు ఆ గీరిన గుర్తులు తెలుపుతాయట.

ఒకసారి పులిని షూట్ చేశాక అది గాయాలతో కూడా అక్కడినుంచి ఇంకోచోటికి కూడా వెళ్ళడం కద్దు. అది పడిపోయిన చోటికి చేరి ముందుగా రాళ్ళు విసిరి, చప్పుడు చేసి అది కదులుతోందా లేదా అని నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం దానికి స్పృహ ఉన్నా ఆరోజు తో ఆ చూసే వాడి పని ఆఖరు అని తెలుసు కాబట్టి. చచ్చిపోయిందని నిర్ధారించుకున్నాక దాని చర్మం వెంటనే ఒలవడం గంటలపాటు జరిగే కార్యక్రమం. ఆకలి, నిద్రలేమి , అలసట తో ఉన్న రచయిత ఒకానొక పులిని చంపి చర్మం వొలిచాక దాన్ని లాగుకుంటూ ఊరిదాకా తీసుకు వెళ్తూ మొదట నలభై పౌండ్ల బరువున్న తోలు చేరేసరికి రెండొందల కిలోల పైనే అయిందనిపించిందని వ్రాస్తాడు. అంతేకాదు పులిగోళ్ళు వంటివి జాగ్రత్తగా తీసుకెళ్ళి, లాకెట్ గా వేసుకోడానికి ఊళ్ళోని పిల్లలకు ఇస్తాడు.

రాబిన్ అనే తన కుక్క చిన్నగా ఉన్నప్పుడు తనను చేరిందని, అప్పట్లో పదిహేను రూపాయలకు కొన్నాననీ, ఇప్పుడు అనుబంధం ఎంత్ పెరిగిందంటే ఇండియాలోని బంగారమంతా ఇచ్చినా అమ్మనని అంటాడు.

రాత్రి అలా చెట్లమీద నిద్రించేటప్పుడు ఎలుగుబంట్లు చేసే అల్లరిని గురించి చెప్తాడు. కార్ ఫల్ అనే పండ్లను తింటూ, తినిపిస్తూ అవి తెగ అల్లరిచేస్తుంటాయి. అవి ఉండగా నిద్రపోవడం అసాధ్యం. కార్ ఫల్ అనే పళ్ళ చెట్టు సముద్రమట్టానికి ఆరువేల అడుగులకి పైన దాదాపు నలభై అడుగుల ఎత్తు వరకూ పెరిగి చెర్రీ వంటి తియ్యటి చిన్న పండ్లను ఇస్తుంది. ఈ పండ్లు మనుష్యులకూ ఎలుగులకూ కూడా ఇష్టమైనవి.

ఊళ్ళో వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు రచయితకు. ఒక్కొక్క ఊళ్ళో మరీ పేదవాళ్ళు. తనకు భోజనం ఏర్పాటు చేయడం వాళ్ళకు కష్టమౌతుందని ఒకసారి టీ మాత్రం ఇవ్వమని అడుగుతాడు. ఆ గ్రామంలో టీపొడి దొరకదు. చిక్కగా కాచిన పాలల్లో బెల్లం వేసి ఇచ్చారనీ , చాలా రుచిగా అనిపించాయనీ చెప్తాడు. (ఈ రుచి నాకు అలవాటే. చాలా బాగుంటుంది.)

పులుల వేటలో భాగంగా ఎత్తైన కొండల మీదికి ఒక్కోసారి పాకాల్సి వస్తుంది, దోగాడుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఎత్తు కొండమీద నిలబడి షూట్ చేయడం కన్నా సమానహైట్ లోనే ఉండి షూట్ చేయడం మంచిదని రచయిత చెప్తాడు. అప్పుడే గురి సరిగ్గా ఆయువుపట్టులో చూసి కొట్టవచ్చు.

ఎదురెదురుగా ఉన్నప్పుడు దృష్టి కేంద్రీకరించి ఒకరి మీద ఒకరు చేసుకునే దాడులు, ఆత్మరక్షణల గురించి సవివరంగా యుద్ధసన్నివేశంలా ఉత్కంఠ కలిగేలా చెప్తాడు. చనిపోయిన పులిని నిదానంగా పరీక్షించి వాటి కోరలు, పండ్లలో ఉన్న సమస్యలనూ, గాయాలనూ చూసి అది నరభక్షకి గా మారడానికి కారణం ఉందని నిర్ధారిస్తూ ఉంటాడు.

చంపావత్ మాన్ ఈటర్, రాబిన్, చౌగఢ్ పులులు, పవల్ ఘర్ బాచిలర్, మోహన్ మాన్ ఈటర్, ఫిష్ ఆఫ్ మై డ్రీమ్స్, కాందా మాన్ ఈటర్, పైపల్ పానీ టైగర్, థక్ మాన్ ఈటర్, జస్ట్ టైగర్స్ అనే అధ్యాయాలలో మనలను ఆ అడవుల్లోకి తీసుకొని వెళ్తాడు. ఆ కాలం నాటి కొన్ని అస్పష్టమైన, స్పష్టమైన బొమ్మలు కూడా ఉన్నాయి. జిమ్ కార్బెట్ వాడిన రైఫిల్స్ – .275, 450/400.

ఒక ఘటనలో అతి దగ్గరగా ఉన్న పులిని షూట్ చేయాలనుకున్నప్పుడు ఒక చేతిలో అక్కడ దొరికిన వింతైన గుడ్లను పట్టుకొని ఉండగా, అదే టైమ్ లో ఇంకొక చేయి బిగుసుకు పోయి ఒకపట్టాన కదలని క్షణాలవర్ణన ఉద్విగ్నభరితంగా ఉంటుంది.

నేను చూసిన నాలుగైదు థ్రిల్లర్ సినిమాల కన్నా ఎక్కువ థ్రిల్లింగ్ రచన ఇది. జంతు ప్రేమ గలవారు, పులులను ఇష్టపడేవారు, వేట గురించి ఆసక్తి ఉన్నవారే కాక ఎవరు చదివినా ఆసక్తి కలిగించే కథనం గల మంచి పుస్తకం. ఈ పుస్తకాన్ని నాకు పరిచయం చేసినవారికి ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here