[డా. సి. భవానీదేవి రచించిన ‘మన భజన సంప్రదాయ సాహిత్యం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
[dropcap]ఆం[/dropcap]ధ్రుల సాహిత్య చరిత్రలో భజన సంప్రదాయం ప్రముఖ స్థానంలో ఉంది. ఇది రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది సామూహికమైన భజన సంప్రదాయం. రెండవది వైయక్తికమైన కీర్తన సంప్రదాయం. ఈ రెండు సంప్రదాయాలు దాదాపు 300 సంవత్సరాల నుంచి ఆంధ్రుల భక్తిసామ్రాజ్యంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. తెలుగు వాగ్గేయకారులతో పాటు సంస్కృతంలో కీర్తనలు రచించిన ప్రముఖులెందరో ఉన్నారు. కీర్తన సంప్రదాయంలో సంస్కృతంలో కీర్తనలు రచించిన జయదేవ మహాకవి, నారాయణతీర్థులు, అన్నమాచార్యులు మొదలైనవారు భక్తిభావంతో మనకు అనేక రచనలు అందించారు. తెలుగులో అన్నమాచార్యులు, త్యాగరాజస్వామి, సదాశివ బ్రహ్మేంద్రులు, రామదాసు, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, తూము నరసింహాదాసు, బొమ్మరాజు నరసింహదాసు, వాసుదాసు మొదలైన అనేకులు భక్తి సంప్రదాయంలో కీర్తనలు, భజనలు రచించి పాడిన వాగ్గేయకారులు. వీరందరూ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, నరసింహస్వామి, పాండురంగస్వామి, శ్రీ వెంకటేశ్వరస్వామి, మొదలైన దైవాలను ప్రస్తుతిస్తూ తరంగాలను, భజనలనూ కీర్తనలను భక్తిభావంతో రచించి గానంచేశారు. ఆయాసంకీర్తనలకు రాగం, తాళం వారే సమకూర్చారు. ఈ మహాభక్తులు, వాగ్గేయకారులందరూ చాలావరకు మంత్రోపదేశం పొందినవారు. సహజ కవితాకౌశలంతో సరస్వతీ ఉపాసన సాధించి భక్తితో భావరాగతాళ లయబద్ధంగా గానం చేస్తుంటే వీరి గానామృతమును వింటున్న ప్రజలు ఆ భక్తిసముద్రంలో పారవశ్యంలో ఓలలాడేవారు.
నారాయణతీర్థుల వారి రచనల ప్రభావం వల్లనే తెలుగులో త్యాగరాజస్వామి కృతులను అందించారని పెద్దల అభిప్రాయం. సిద్దప్ప సిద్ధేంద్రయోగిగా మారటానికి ఇది ఒక ఉదాహరణ.
మా బాల్యంలో కూచిపూడి భాగవతులు, పగటివేషధారులు కూడా బాలగోపాల తరంగాలను ఆలపిస్తూ నర్తించటం చాలాసార్లు చూశాము. అలాగే తరచుగా విన్న హరికథలలో ఏదో ఒక ఘట్టంలో కథకులు తరంగాలను పాడుతూ చిరతలు వాయిస్తూ నృత్యం చేయటం చూసి ఆనందించిన సందర్భాలున్నాయి. మన సంస్కృతిలో ఈనాటికీ సజీవంగా ఉన్న భక్తి సంకీర్తనల్లో ఆధ్యాత్మిక ఔన్నత్యమేగాక పండిత పామర రంజకమైన సంగీత మహానీయత ఉండటం వల్ల ఈ సాహిత్యం సజీవనదిలా ప్రవహిస్తోంది. భక్తజనులు నాటకాలు, యక్షగానాలు, హరికథలు, పురాణాలు, భజన కాలక్షేపాలు ఏర్పాటు చేసి పాల్గొనేవారు. చాలామంది గ్రంథకర్తలకు తరంగాలను, భజనలను గానంచేసే సంస్కారం ఉంది.
వారి రచనలు మహనీయమైన గ్రంథాలు. అనాది కాలంనుంచి నిరక్షరాస్యులు కూడా విని నేర్చుకొని పాడే ఈ తరంగాలు భజనలలో కొన్ని కూచిపూడి యక్షగానాలలో, నృత్యకార్యక్రమాలలో, నాటకాలలో, గానంచేసి రక్తి కట్టించటం జరుగుతున్నది. వాగ్గేయకారుల కీర్తనల గురించి రాయడమే కాక వాటిని రచించిన రచయితల జీవనచిత్రాలను కూడా కొందరు రచయితలు గ్రంథాలుగా అందించారు. లోక సామాన్యంలో ప్రచారాల్లో ఉన్నవి, చారిత్రక ఆధారాలతో ఉన్నవి, పెద్దలు చెప్పినవి, అనేకకాంశాలు ఈ గ్రంథాలలో చిత్రాలతో సహా అందించడం జరిగింది. నారాయణతీర్థులవారు పడుకొని తరంగాలు గానం చేస్తుంటే బాలకృష్ణుడు ఆయన బొజ్జపై ఆ పాటకు అనుగుణంగా నర్తించేవాడట. ఈ విషయం శిష్యుడు చెబితేనే తీర్థుల వారికి తెలుసింది. వారి తన్మయభక్తి అటువంటిది. ఇలాంటి కథనాన్ని హిందీ భక్తకవులలో ముఖ్యుడైన సూరదాసు తాను అంధుడైనా అనేకగీతాలను స్వీయరచనలుగా గానం చేస్తుంటే ఆ కవి ఎదుట బాలకృష్ణుడు నటించేవాడట.
అధిక ప్రచారంలో ఉన్న శ్రీకృష్ణ లీలాతరంగిణిలోని ‘కృష్ణం కలయసఖీ సుందరం’ , ‘శరణం భవ కరుణామయి కురు దీనదయాలో’ మొదలైన తీర్థులవారి తరంగాలు; ‘రామ నామమే జీవనము- భక్తావనము పతిత పావనము’ ; ‘రామా నీవాడ సుమీ – ఇక నన్ను- బాముల పెట్టకుమీ’ తూము నరసింహదాసు కీర్తనలు; ‘దొరవలె కూరుచున్నాడు భద్రగిరి రాముడితడేమో చూడు’ , ‘చూడగలిగెను రాముని సుందరరూపము’; అల్లూరి వెంకటాద్రి స్వామివారి ‘కస్తూరిరంగయ్య కరుణించవయ్యా’, బొమ్మరాజు నరసింహదాసుగారు సీతారామదాసుగారు, బొమ్మరాజు కుటుంబ తరంగాలు; ‘ ఆంధ్రవాల్మీకి’ శ్రీ వాసుదాస స్వామి రచించిన ‘రామం భజే రఘురామం భజే’ మొదలైన అనేక తెలుగు సంకీర్తనలతో పాటు జయదేవుని అష్టపదులు, దశావతారాల కీర్తన ‘చందన చర్చిత’; భద్రాచల రామదాసు కీర్తనలు, మునిపల్లె సుబ్రమణ్యంకవి ‘అచ్యుతం కేశవం రామనారారాయణం’ వంటి అనేక రచనలు మన సంప్రదాయ భజన సాహిత్యంలో ఉన్నాయి. తరంగగానంలో వివిధ సాంప్రదాయాలు, బాణీలు, తాళాల ప్రక్రియలు, మారుతున్న పోకడలు, సప్తాహాల్లో, ఏకాదశి భజన గోష్ఠులలో, కళ్యాణ మహోత్సవాలలో, ఎన్నో తీరుల్లో ఉంటాయి. ఇవి మనకూ, రాబోయేతరాలకు వారసత్వ సంపదగా భద్రపరచుకోవాలి.
ఈ తరంగాలు, కీర్తనలు మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. మన నాలుకలపై అవి నర్తిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆ కీర్తనారచయిత లేదా వాగ్గేయకారుడు ఎవరో కూడా తెలియకపోవచ్చు. కానీ ఆ రచనలు ప్రజల హృదయాలలో తరానికి తరానికి ప్రవహిస్తూ రంజింపచేస్తున్నాయి. ఈ భూమిమీద సనాతనధర్మం వర్థిల్లినంతకాలం, ఈ భక్తకవులు స్మరిస్తూ, స్తుతిస్తూ రచించిన అద్భుతమైన ఈ నాదసామ్రాజ్యంలో విహరిస్తున్న వారంతా ధన్యులే!