[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]
[dropcap]“ఏ[/dropcap]మండీ సాయంత్రం తొందరగా వచ్చేయండి. పెళ్ళికి వెళ్ళాలి” మరోసారి గుర్తుచేసిన భార్య మీనాక్షమ్మకి “అలాగే” అని నోటితోను తలతోను చెప్పి ఆఫీసు దారి పట్టాడు సుబ్రమణ్యం. స్నేహితులు, దూరపు బంధువులూ అయిన కైలాసం గారి కొడుకు పెళ్ళి మరి!
చెప్పినట్లుగా తొందరగానే వచ్చేసాడు సుబ్రమణ్యం.
“గిఫ్ట్ సంగతేమిటి” అడిగాడు తయారవుతూ..
“నూట పదహార్లు బాగుండదేమోనండి” అన్నది మీనాక్షమ్మ.
“అబ్బే! ఈ రోజులలో అయిదువందల పదహార్లు పెట్టకపోతే బాగుండదు” అన్నాడు సుబ్రమణ్యం.
“ఏమండి మన అబ్బాయి పెళ్ళికి వచ్చిన బహుమతులు ఉన్నాయండి. అవి వాడటం కూడా లేదు. ఒకదాన్ని చదివించేస్తే..” దారి చూపించింది మీనాక్షమ్మ.
“ఏవీ చూపించు” అంటూ కూర్చొన్నాడు సుబ్రమణ్యం.
గిఫ్ట్‌లు చాలానే ఉన్నాయి..
వాటిలో వెతికి వెతికి ఒక బహుమతిని ఎన్నుకున్నారు.
“చూడు! అసలు మనకిది ఎవరు పెట్టారో” అడిగాడు.
ప్యాక్ మీద ఉన్న లేబుల్ చిరిగిపోయి ఉండటంతో ఎవరు ఇచ్చారో తెలియటం లేదు.
“ఆ.. ఇది మా అన్నయ్య బావమరిది గారు ఇచ్చిందండి.. నాకు బాగా గుర్తు” అన్నది మీనాక్షమ్మ.
“ఇకనేం.. మళ్ళీ ప్యాక్ చెయ్..” అంటూ గిఫ్ట్ కాగితం, లేబుల్ ఇచ్చాడు సుబ్రమణ్యం.
ఆ బహుమతిని అలంకరించి లేబుల్ అతికించి బయలుదేరారు. బయలుదేరేముందు రెండు మూడు ఫోన్లు
రావడంతో అనుకొన్నదానికన్నా ఆలస్యంగా బయలుదేరారు.
***
సరిగ్గా ముహూర్తం సమయానికి చేరుకొన్నారు.
పెళ్ళిపెద్దలు వేదికమీద ఉన్నారు.. “ఇదీ మంచిదే.. మనం ఎప్పుడు వచ్చామో తెలియదు.. లేదంటే ‘ఇప్పుడా రావడం’ అంటూ గొడవ చేసేది వదిన” అన్నది మీనాక్షి.
అక్షింతలు వెయ్యడానికి వరుస కట్టారు అందరూ.. ఇలా అక్షింతలు వెయ్యడం డైనింగ్ హాల్ వైపు దారి తియ్యడం.. అదీవరస. కొందరైతే వేదిక ముందు నుంచే అక్షింతలు జల్లి వెడుతున్నారు. అక్షింతలు పురోహితుడి మీదో వధువు తల్లి మీదో పడుతున్నాయి.
‘వచ్చాం..’ ‘చూశాం..’, ‘వేసాం..’, ‘ఇచ్చాం..’, ‘తిన్నాం..’, ‘పుచ్చుకొన్నాం..’.
ఇదీ పెళ్ళి వేడుక చూసే పద్ధతి అయిపోయింది.
కొంతమంది విందు ముగించుకొని అక్షింతలు వేసి వెడుతున్నారు. మీనాక్షీ సుబ్రమణ్యంలు మాత్రం వరుసలో వేదికపైకి వెళ్ళి ఆశీర్వదించారు.
“ఇప్పుడా రావడం?” అడగనే అడిగారు, కైలాసం దంపతులు.
“చాలా సేపయింది వచ్చి.. నువ్వు నీ హడావుడిలో ఉన్నావు అని పలుకరించలేదు” అని చెప్పి బహుమతి ఇచ్చేసి అక్షింతలు వేసి దిగిపోయారు ‘ఓ పనైపోయింది బాబూ’ అన్నచందాన..
ఇక రెండోదీ అసలు పనీ ఉంది.. విందు.
అదీ కూడా ముగించుకొని ఇంటిదారి పట్టారు. దాదాపుగా నేటి పెళ్ళిళ్ళలో అందరిదీ ఇదే తంతు.
***
రెండురోజుల తర్వాత ఆ పెళ్ళికొడుకు తల్లితండ్రులు పెళ్ళికి వచ్చిన బహుమతులను చూస్తున్నారు ఒక్కొకటి ప్యాకింగ్ విప్పుతూ. మీనాక్షి సుబ్రమణ్యంగార్ల బహుమతి కనబడింది. విప్పి చూసారు.
చక్కటి డైనింగ్ సెట్.. “బాగుంది కదూ! అచ్చంగా మనం ఇలాంటి సెట్టే వాళ్ళ అబ్బాయి పెళ్ళికి ఇచ్చాం కదండీ” అన్నది ఆవిడ. ఆయన పరిశీలనగా చూసి “ఇలాంటి సెట్ కాదు.. ఇదే సెట్.. ఇది మనం ఇచ్చిందే” అన్నారు. “మరలా మనకే వచ్చిందన్నమాట.. చూసుకోవద్దూ” అన్నది ఆవిడ.
ఆయన ఆ పేకింగ్ డొక్కును అటుఇటు చూసి “ఇది అంతకు ముందు మనకి ఎవరో ఇచ్చిందే.. వాళ్ళకి ఇచ్చాం.. వాళ్ళు ఇప్పుడు తిరిగి చదివించేసేరు.” అన్నారు. చేసేది ఏమీలేక నవ్వుకొన్నారని మీనాక్షీ సుబ్రమణ్యంలకు తెలియదు.
***
“ఏమండీ! మా మామయ్యగారి అబ్బాయికి ఏక్సిడెంట్ అయిందట.. ఓసారి చూసి రావాలటండీ” అన్నది మీనాక్షమ్మ సుబ్రమణ్యంతో.
“ఎక్కడా? ఎప్పుడు?” అడిగాడు సుబ్రమణ్యం.
“మూడురోజులయిందట. ఇక్కడే హాస్పిటల్లో జాయిన్ చేసారట. ఆపరేషన్ చేసారట.. సాయంత్రం తొందరగా వస్తే వెళ్ళొద్దాం” అన్నది.
“సాయంత్రం కుదరదు. ఐ.టి. రిటర్న్స్ ఫైల్ చెయ్యాలి. రేపు చూద్దాం” అన్నాడు సుబ్రమణ్యం.
మర్నాడు వెళ్ళారు.
“అయ్యో! ఎలా జరిగింది” అడిగింది మీనాక్షమ్మ బెడ్ ప్రక్క స్టూల్ మీద కూర్చొంటూ, సుందరాన్ని.
ముందు ఆగి ఉన్న కారు డోర్ సడెన్‌గా తీయటంతో ఆ డోర్‌కి కొట్టుకొని పడిపోయినట్లు బైక్ బరువంతా పడటంతో మోకాలు విరిగినట్టు చెప్పారు నీరసంగా.. అప్పటికి అదే విషయాన్ని ఫోన్లలోను వచ్చిన వాళ్ళతోను చెప్పి చెప్పి నీరసం వచ్చింది మరి! దెబ్బకన్నా! మీనాక్షమ్మ మేనల్లుడు సుందరం.. భార్యాభర్తలిద్దరు ప్రైవేట్ ఉద్యోగస్తులు. ఇద్దరు పిల్లలు. తల్లి ఉంటారు. యాక్సిడెంట్ అయి అప్పటికి వారం రోజులు. లీవు లేకపోవడంతో సుందరం భార్య ఉద్యోగానికి వెళ్ళిపోయింది. వారం రోజులే లీవు దొరికింది. ఇంట్లో వంట చేసి పిల్లల్ని స్కూళ్ళకు పంపించేసి హాస్పిటల్లో భర్తకి, అత్తగారికి క్యారియర్ ఇచ్చేసి ఆ ఉద్యోగానికి వెళ్ళిపోయింది. అంగబలమూ, అర్థబలమూ తక్కువవడంతో కొంచెం ఇబ్బందిగానే ఉన్నది వాళ్ళకి. ఆపరేషన్ ఖర్చు కొంత ఆఫీస్ స్టాఫ్ సహాయం చేసారు. అత్త మీనాక్షమ్మ ఏమైనా సహాయం చేస్తుందేమోనని ఆశగా చూసాడు సుందరం. సహాయం అంటే అప్పుగానే. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ ఏమైనా అవసరం అంటే చెప్పు అంటారేగానీ ఇదిగో ఈ అయిదువేలూ ఉంచు అంటారేమోననే ఆశ ఎంతకీ తీరటం లేదు.
కరెంటు బిల్లు గడువు తేదీ అయిపోయింది భార్యకి కుదరటం లేదు అనే విషయాన్ని చూఛాయగా చెప్పినా “ఇలా ఇయ్యి నేను కట్టేస్తాను” అని సుబ్రమణ్యం అనటం లేదు. “ఏమైనా కావాలంటే చెప్పు” అంటారేగాని.
“ఆరువారాలు విశ్రాంతి తీసుకొంటే నయమైపోతుంది ఏం పరవాలేదు” అంటూ వాళ్ళ బంధుమిత్రులులో ఎవరెవరికి ఏయేం విరిగాయో ఎలా విరిగాయో ఎంతకాలంలో తేరుకొన్నారో చెప్పారు. వారిలో కొంతమందికి నయంగాక అవిటివాళ్ళుగా బ్రతుకుతున్నారో కూడా చెప్పి తెలుసున్నట్లుగా ఎక్స్‌రేలు రిపోర్ట్స్ చూసి “మరేం పర్వాలేదు.. రెస్ట్ తీసుకోండి.. తగ్గిపోతుంది.. ఏమైనా అవసరమయితే ఫోన్ చెయ్యండి” అని వచ్చేశారు మీనాక్షీ, సుబ్రమణ్యంలు, ‘ఓపనైపోయింది బాబూ’ అనుకొంటూ.. తెలిసిన వాళ్ళు ఆసుపత్రి పాలైతే బాగోగులు కనుక్కోవడం మర్యాద. కాని యాంత్రికంగా, కృతకంగా ఓ సారి మోహం చూపించకపోతే ‘బాగుండదు కాబట్టి’ ఏమైనా కావాలంటే చెప్పండి అని అనకపోతే ‘బాగుండదు కాబట్టి’ వెళ్ళారు, చూసారు వచ్చేసారు.
***
“ఏమండోయ్! రేపు మీ కజిన్ వెంకటేశ్, భార్యా వస్తున్నారంట. మీరు బాత్రూంలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది” మీనాక్షమ్మ చెప్పింది.
“ఏమిటట.. విశేషం” అడిగాడు సుబ్రమణ్యం.
“అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీ సీటుకోసం అనుకొంటా.. కాలేజికి వెళ్ళిరావాలి అన్నారు.”
మరునాడు వచ్చారు వేంకటేశ్ దంపతులు..
కాలేజికి పనిమీద వెళ్ళివస్తాం అన్నారు స్నానపానాదులు అయ్యాక. కాలేజీకి ఎలా వెళ్ళాలో ఏయే బస్సులు వెడతాయో వివరాలు అన్నీ చెప్పి పంపించారు సుబ్రమణ్యం.
సుబ్రమణ్యంకి ఆ రోజు సెలవు అని తెలుసు వేంకటేశ్‌కి. సరదాగా తనతో వస్తాడేమోనని ఆశపడ్డాడు కాని సుబ్రమణ్యం బస్ నెంబర్లు మాత్రం ఇచ్చి పంపించాడు. ముందురోజు రాత్రి మీనాక్షమ్మ గీతోపదేశం చేసింది.. “వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకొంటారు.. మీరేమి కలుగ చేసుకోకండి. ఇక్కడే సీటు వస్తే హాస్టల్లో పెట్టినా చూడటానికి వచ్చినప్పుడల్లా మన దగ్గరకి తయారవుతారు. అప్పుడప్పుడు మిమ్మల్ని చూడమంటారు. ఎటువంటి హామీలు ఇవ్వొద్దు. వీళ్ళతో రాసుకు తిరిగితే మనకు లాభముండదు. ముభావంగా పొడిపొడిగానే మాట్లాడండి. ఈ రోజులలో పిల్లల బాధ్యతలు తీసుకోకూడదు. మన పిల్లలతోనే పడుతున్నాం” అని.
“ఏమండీ మనం ఏమైనా మన అబ్బాయిని వాళ్ళ ఇంట్లో పెట్టుకోమని అడిగామా? ‘ఊర్లో ఉన్న కాలేజీయే కదా! చేర్పించండి.. ఏమైనా అవసరం అయితే నేనున్నానుగా.. నెలలో ఓ ఆదివారం ఇంటికి రమ్మనమని చెప్పండి’ అని మాట వరుసకు కూడా అనరేమిటండీ మీ అన్నయ్య” అనీ వేంకటేశ్ భార్య జయ దెప్పింది. పిల్లవాడిని హాస్టల్లోనే చేర్పిస్తున్నాం కదా “నేను చూస్తూ ఉంటాను లెండి” అని అనొచ్చుకదా అని ఆమె మనస్తాపం.
***
మరి నాలుగు రోజులు గడిచాయి.
“మా తమ్ముడు భాస్కరం ఫోన్ చేశాడండి” సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన సుబ్రమణ్యానికి కాఫీ ఇస్తూ చెప్పింది మీనాక్షమ్మ.
“భాస్కరమా? ఈ కేరక్టర్ ఎవరూ” అడిగాడు సుబ్రమణ్యం.
“మీకన్నీ మతిమరుపే.. ఎలాగో నేను, ఇల్లు గుర్తున్నాం” దెప్పింది.
“మరచిపోనిస్తే కదా! సరే! ఎవరీ భాస్కరం? ఏమిటి ఈ మధ్య వరుసగా మన మీద బంధువుల దాడి జరుగుతోందే?”
“ఇది దాడి కాదు లెండి..”
“ఓహో! మా వాళ్ళెవరైనా వస్తే అది దాడి. మీ వాళ్ళవైపు నుంచి ఎవరైనా వస్తే బంధుప్రీతీనా?”
“అబ్బ! సాగదీయకండి! భాస్కరం అని మా పెద్దనాన్నగారి ఆఖరి అబ్బాయి.. వీళ్ళు ముప్పైఏళ్ళ క్రితమే అహమ్మదాబాద్‌లో సెటిల్ అయిపోయారు. గుజరాతీల్లాగా బిజినెస్ ఫీల్డ్.. ఎప్పుడో ఏ పెళ్ళిలోనో కలవడం తప్ప రాకపోకలు అంతగా లేవు. మీరూ చూసారు కానీ గుర్తు పెట్టుకొనుండరు. అయిదారేళ్ళకి ఓసారి కలుస్తుంటాం”
“సరే గుర్తువస్తోంది లే.. పేరు గుర్తులేదు. గుజరాత్ అంటే గుర్తొచ్చింది.. ఇంతకీ ఏ పనిమీద వస్తున్నారట” అడిగాడు సుబ్రమణ్యం.
“అమ్మవారికి వెండి తొడుగులేవో చేయిస్తామని మొక్కుకున్నారట. అందుకోసం వస్తున్నారట. పిల్లలకి పరీక్షలట. వాళ్ళు రావటం లేదు. ఇద్దరే వస్తున్నారంట. బిజినెస్‌లో ఏవో క్రొత్త లాభాలొచ్చుంటాయి. ఇంటి అడ్రస్ అడిగారు. ఇంటికే వచ్చేయమన్నాను. కానీ హోటల్ రూం ఆల్రెడీ బుక్ చేసుకొన్నారట. ఏదో టైంలో కలుస్తానన్నాడండి.. రేపు మీరు సెలవు పెట్టండి. వీలు చేసుకొని దగ్గరుండి అన్నీ చూపించండి” అన్నది మీనాక్షి.
“అదేమిటో! మొన్న మా కజిన్ వస్తే నాకు సెలవే అయినా వాడితో వెళ్ళనివ్వలేదు.. ఇప్పుడేమో ముందుగానే సెలవు పెట్టమంటున్నావు” అడిగాడు సుబ్రమణ్యం.
“ఇద్దరి కజిన్లకీ చాలా తేడా ఉందిలెండి. కొన్ని వదిలించుకోవాలి. కొన్ని పట్టించుకోవాలి. వాళ్ళు తిన్నగా హోటల్‌కి వెడతారు. టీ..కో వీలయితే భోజనానికో వస్తారు. కాలు బయటపెడితే కార్లు, క్యాబ్. వాళ్ళది పెద్ద బంగళా. రేపు మనం అటువైపు యాత్రకెళ్ళినప్పుడు వాళ్ళదగ్గర ఓ మూడు నాలుగు రోజులుండొచ్చు. వాళ్ళకి గెస్టరూంలే రెండున్నాయిట. రెండు కార్లు. అన్నింటికి పనిమనుషులు.. దర్జా.. ఇటువంటి వాళ్ళకు మనం తాహతుకు మించి ఖర్చుపెట్టినా ఫలితం ఉంటుంది. అసలు నన్ను గుర్తుపెట్టుకొని ‘అక్కా ఎలా ఉన్నావు’ అని అడగటమే అదృష్టం” అని ధర్మసూక్ష్మాన్ని చెప్పింది.
మరునాడు సుబ్రమణ్యం చేత సెలవు పెట్టించి వాళ్ళు అమ్మవారి దర్శనం మొక్కులు తీర్చుకొని హోటల్ రూపంకి చేరుకొనే సమయానికి సుబ్రమణ్యాన్ని హోటల్‌కి పంపించి ఇంటికి రప్పించుకొంది భాస్కరం దంపతులని.
భోజనాలు కానిచ్చి ఓ రెండుగంటలు పిచ్చాపాటి మాట్లాడి వెళ్ళిపోయారు భాస్కరం దంపతులు. మాటలలో అక్కడ అంతగా కోచింగ్ బాగోటం లేదని భాస్కరం చెప్పడం తరువాయి “అదేమిటి భాస్కరం.. నేను లేననుకొన్నావా? ఇక్కడ మంచి కోచింగ్ సెంటర్లున్నాయి. ఓ రెండు నెలలు ఇక్కడకి పంపించు.. మా ఇంట్లో ఉండి చదువుకొంటాడు” అని సలహా ఇచ్చింది.
‘ఆహా! ఏం లెక్కలేస్తావే’ అనుకొన్నాడు సుబ్రమణ్యం పెళ్ళాన్ని ఉద్దేశించి. భాస్కరం దంపతులు వెడుతూ ఓ ఖరీదైన బహుమతిని మీనాక్షమ్మకి అందచేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వెళ్ళారు.. వాళ్ళకోసం తాను కొనుక్కొన్న కాటన్ చీరను త్యాగం చేసింది మీనాక్షమ్మ.
***
మరో వారం రోజుల తరువాత ఓ పెళ్ళికని హైదరాబాద్ వెళ్ళారు. ఆరునెలల క్రితమే క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఎన్నికయి హైదరాబాద్ లోనే ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాయినయింది వాళ్ళ అమ్మాయి గీత. ఆ అమ్మాయి వాళ్ళని కలవడానికి పెళ్ళికి వచ్చింది. భోజనాలయ్యాక కాస్త విరామం దొరికింది. గీత పనిచేసే ఆఫీసు సుబ్రమణ్యంకి తెలుసు. మీనాక్షమ్మకి తెలియదు. తల్లికి చూపించే ఉద్దేశంతో ఆటో మాట్లాడి తల్లితండ్రులను బయలుదేరతీసింది గీత.
“అమ్మా ఇదిగో నా కొత్త ఫోన్”
“ఎంతే!”
చెప్పబోయి ఆగిపోయింది గీత. ఆమె అప్పటి వరకు తండ్రి కొనిచ్చిన ఆరువేల రూపాయల ఖరీదు కల స్మార్ట్‌ఫోన్‌నే వాడేది. ఈ మధ్యనే క్రొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకొంది. అదే చూపించింది. దాని ఖరీదు 19,000/- అని చెప్పగానే నోరెళ్ళబెట్టింది మీనాక్షమ్మ.
“పాత ఫోన్ పనిచేస్తుంది కదే” అని నసిగింది.
“అది పాతదైపోయిందమ్మా” అనేసి “ఇదిగో ఇక్కడనుంచే సాఫ్ట్‌వేర్ ఆఫీసులన్నీ మొదలవుతాయి” అని మాట మార్చేసింది గీత. తన కార్యాలయ భవంతిని పైనుంచే చూపించింది. ఇంకా తన స్నేహితులు పనిచేసే కార్యాలయ భవనాలు కూడా చూపించి ఓ పెద్ద మాల్‌కి తీసుకెళ్ళింది గీత.
అక్కడ అంతగా ‘అవసరం లేని’ వస్తువులను ‘అధిక ధరలకు’ కొనింది.
“అయ్యో! నీకు కావాలంటే మేం తీసుకొచ్చేవాళ్ళం కదే! రెండు వంతులు ఎక్కువ పెట్టావు. ఇలా అయితే ఎన్ని లక్షలొచ్చినా ఏం లాభం” నసుగుతూనే అంది మీనాక్షమ్మ.
“ఏదో క్రొత్త సరదానే! అస్తమానం మనమూ రాము కదా అదీ కొనదులే..” అని సర్ది చెప్పాడు సుబ్రమణ్యం.
“సరే! ఇక వెడదాం.. ‘ఎదురు సన్నాహం’ సమయం అవుతోంది” అని తిరుగు ప్రయాణానికి తొందరపెట్టింది మీనాక్షమ్మ.. ఇంకా ఇక్కడే ఉంటే కూతురు ఇంకేం అవనసర ఖర్చులు పెడుతుందేమోనని.
తిరిగి కళ్యాణమంటపం చేరుకొన్నారు.. ఆటోలో.
గీత ఎవరి కోసమో ఫోన్ చేయబోయి వ్యానిటీ బ్యాగ్‍లో చేయిపెట్టింది. ఫోన్ కనబడలేదు..
గుండె జారిపోయింది. వెతికిన చోటే పదిసార్లు వెతికింది. విషయం తెలిసిన మీనాక్షమ్మ “ఆటోలో వదిలేసేవేమోనే.. అయ్యో! ఇరవైవేలు” అంటూ తిట్ల దండకం మొదలుపెట్టింది. సెల్‌కి చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. “అంటే అప్పుడే ఎవరి చేతికో చేరిపోయిందా.. ఇందాక ఆటోవాడు డ్రాప్ చేసి మనలని మరలా వాడే తీసుకొచ్చాడు. ఆటో నెంబర్ ఉండాలి కదా..” అన్నాడు సుబ్రమణ్యం. “అన్ని నెంబర్లు అందులోనే ఉన్నాయమ్మా.. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది” అన్నది గీత ఏడుపు మొహంతో..
“ఆటోవాడు చూస్తే కళ్యాణ మంటపం దగ్గర దిగాం కాబట్టి తీసుకొచ్చి ఇస్తే బాగుండును.. డబ్బులిద్దాం” అన్నది మీనాక్షమ్మ.
“ఇరవైవేల ఫోన్.. పైగా కొత్తది.. ఎంతైనా ఇవ్వొచ్చు.. ఫోన్ చేస్తుండు.. ఎవరైనా ఎత్తితే డబ్బులిస్తాం అని చెప్పు అన్నది.
“ఆ.. వెయ్యి రూపాయలు ఇవ్వొచ్చు” అన్నాడు సుబ్రమణ్యం. ఇంతలో పోగొట్టుకొన్న సెల్ కనెక్ట్ అయింది. ఆటో డ్రైవర్ మాట్లాడాడు. గీత మాట్లాడింది. కళ్యాణమంటపం దగ్గరకే రమ్మనమని చెప్పింది.
“పోన్లే ఎవరో మంచోడే” అని శాంతించింది మీనాక్షమ్మ. ముగ్గురు కళ్యాణమంటపం బయట నుంచున్నారు. ఎదురుగా ఆటో వస్తూ కనబడింది. “వెంటనే చూసినట్లున్నాడు వేరే బేరం ఎక్కి ఉంటే, వాళ్ళు తీసుకెళ్ళినా వీడికి తెలియదు.. పాపం! మంచివాడు” అని ఆటో డ్రైవర్‌ని మరోసారి మెచ్చుకొంది మీనాక్షమ్మ. ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ ఇచ్చేసాడు. గీత థాంక్స్ చెబుతోంది.
“ఓ వంద రూపాయలు చేతిలో పెట్టండి.. ఇదిగో కాస్త స్నాక్స్, టీ త్రాగి వెళ్ళమనండి” అంటోంది మీనాక్షమ్మ. కూతురు ఆనందంలో ఎంత ఇచ్చేస్తుందో అని బెంగపట్టుకొంది మీనాక్షమ్మకు.
ఒక అయిదు నిముషాల క్రితం ‘ఎంతైనా ఇవ్వొచ్చు’ అనుకొని ఆటోడ్రైవర్ తెచ్చి ఇస్తే ‘వెయ్యి రూపాయలు ఇద్దాం’ అని మరీ వందేమిటే” అన్నాడు సుబ్రమణ్యం. “ఆటో ఎంతో దూరం వెళ్ళలేదుగా.. అయిదు నిముషాలలో తెచ్చేసాడుగా” అని “పాపం! మంచివాడు.. చల్లగా ఉండు బాబు!” అని మాత్రం చాలాసార్లు అన్నది మీనాక్షమ్మ.. కూతురు అయిదువందల నోటుని తియ్యబోవటం చూసి. మీనాక్షమ్మ చెప్పిన వందకి ఉదారంగా మరో వందని జోడించి రెండువందలు ఆటోడ్రైవర్ చేతిలో పెట్టి దీవించాడు సుబ్రమణ్యం. కనీసం అయిదువందలేనా ఇస్తారనుకొన్న, ఆటోవాడు ‘అదోలా’ చూసాడు.