మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-7

0
1

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఏ పనిలో ఐనా ఏకాగ్రత:

[dropcap]వ్య[/dropcap]క్తిత్వ వికాసంలో ఇది చాలా ముఖ్యం. అగ్రతః అంటే ఎదుట, ఏకః అంటే ఒకే ఒక్కవిషయమే ఉండాలి. ఇది ధ్యానానికి మాత్రమే పరిమితం కాదు. అన్నిపనుల్లోనూ అవసరమే. ఏకాగ్రత (Concentration) ను దెబ్బతీయడానికి రకరకాల మళ్లింపులు (diversions) వస్తాయి. అందులో కొన్ని మనం తెచ్చుకొనేవి, మరికొన్ని బలవంతంగా దూరేవి. రెండింటినీ పరిహరిస్తే, చేసే పనిపై ఏకాగ్రత కుదురుతుంది.

తులసీదాస్ మహారాజ్ ఇలా అంటారు.

“జప్‌మాలా హాథ్ మే ఫిర్‌తీ హై; మన్ చారోం ఓర్ ఘూమ్‌తా రహతాహై!”

జపమాల చేతిలో తిరుగుతూనే ఉంటుంది. మనస్సు నాలుగువైపులా సంచరిస్తూంటూంది. అటు వంటి జపం వ్యర్థం. అది ఒక mechanical ritual అవుతుంది. ఏకాగ్రతను సాధించడానికి దగ్గరి దారులు (shortcuts) ఏవీ ఉండవు. చేసే పని ఒక్కటీ లక్ష్యం (aim) కావాలి. దాని పట్ల dedication (అంకితభావం), Commitment (విధిపట్ల వ్యగ్రత) ఉండాలి.

దాని వల్ల పని తక్కువ సమయంలో, నాణ్యంగా పూర్తవుతుంతుంది. Career Advancement లో సైతం ఏకాగ్రత ప్రముఖ పాత్ర వహిస్తుంది.

భారతంలో ద్రోణాచార్యుల వారు కురుపాండవ బాలలకు ధనుర్విద్యా కౌశలాన్ని నేర్పిస్తుంటారు. చెట్టుకొమ్మ మీద ఉన్న ఒక పక్షిని బాణంతో కొట్టాలి. గురి చూసుకుంటూన్నవారిని ఆయన “మీకేం కనబడుతూన్నది?” అని అడిగితే అందరూ “చెట్టు, కొమ్మ, వెనక ఆకాశం, అన్నీ కనబడుతున్నాయి గురువుగారు” అని చెబుతారు. అర్జునుడు మాత్రం “నాకు లక్ష్యంగా మీరు నిర్దేశించిన పక్షి తప్ప మరేదీ కనబడ లేదు” అంటాడు. అదీ ఏకాగ్రత అంటే! మిగతావన్నీ కనబడుతున్నాయంటే అవి Diversions అన్నమాట. లక్ష్యాన్ని ఛేదించడానికి అవి అడ్డుపడతాయి. అందుకీ అర్జునుడు ద్రోణాచార్యులకు ప్రియశిష్యుడైనాడు. వేగంగా చలిస్తూన్న మత్స్యయంత్రాన్ని క్రింద కొలసోని నీటిలో, ప్రతిబింబంగా చూస్తూ, కొట్టగలిగినాడు.

ఏకాగ్రతకు మరో పేరుంది. ‘తదేక దీక్ష!’.

మంత్రం మనసు

తదీక దీక్షగా ఒక మంత్రాన్ని జపిస్తే, మననం చేస్తే, ఆ మంత్రాధీనమైన దైవశక్తి మనకు ప్రసన్నమవుతుందని మన హిందూ సనాతన ధర్మం చెబుతుంది. ‘మననాత్ త్రాయతే ఇతి మంత్ర’. మననం ద్వారా రక్షణ ఇచ్చేదే మంత్రం. ఇది కేవలం సంస్కృత శబ్దాలతో, ఉదాత్త అనుదాత్తాలతో, ఆరోహణ అవరోహణ స్వరాలతో ఉచ్చరించేది మాత్రమే కాదు. ఆధునిక జీవితానికి కూడ వర్తించే మంత్రాలున్నాయి. Modern personality development లో ‘సక్సెస్ మంత్ర’ ‘మేనేజ్‌మెంట్ గురు’ లాంటి పద బంధాలు మనకు వినబడుతుంటాయి. ఇంగ్లీష్ పదాలతో ఈ పదాలను ఎందుకు జోడించారు? వాటికి English equivalents అంత బాగుండవు కాబట్టి. మన ‘మంత్రాన్ని’, ‘గురువు’ను వారు కూడ స్వీకరించారు.

“ఆ మాటలు అతని మీద మంత్రంలా పనిచేశాయి.” అని అంటూంటారు. మెకానిక్ పని నేర్పేవాడు కూడ గురువే. దానిలో సైతం ఏకాగ్రత కావాలి.

రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారి కథల్లో. సామాన్య జనం, వారి సమస్యలు ఉంటాయి. వారంతా అధోజగత్ సహోదరులే. శ్రీశ్రీ గారన్నట్లు వాళ్లల్లో జీవితాన్ని కాచి వడబోసిన వారుంటారు. వారిని గురుస్థానంలో ఉంచి, శిసువు (శిష్యులకు) లకు బోధ చేయిస్తుంటారు రావిశాస్త్రి. ‘సక్సెస్ మంత్ర’ను వాళ్లు విశాఖ జిల్లా యాసలో చెబుతూంటారు.

సంధ్య యల్లాప్రగడ గారు తమ ‘సత్యాన్వేషణ’ అనే గ్రంథంలో మంత్రాన్ని అద్భుతంగా నిర్వచించారు. “జడమైన మనస్సును చైతన్యపరచి, అయస్కాంతం వలె దానిని ఆకర్షించి, దైవంలో లగ్నం చేసేదే మంత్రం” అనీ; “మనసు ఇనుము అయితే మంత్రం అయస్కాంతం” అనీ అంటారామె.

మహా భారతం శాంతి పర్వం; వశిష్ఠ జనక సంవాదం

‘ధ్యానం’ వ్యక్తిత్వ వికాసంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. దానిని సగుణ భావంతో చేస్తే ఫలవంతం అవుతుంది. సగుణం అంటే ఏదో ఒక దేవతా స్వరూపాన్ని ఎదుట నిలుపుకొని ధ్యానించడం. దానికంటే ఉత్కృష్టమైనది నిర్గుణ భావంతో ధ్యానించడం. ఇది చాలా కష్టం. ఏకాగ్రతను నిలుపుకోవడానికి ఎదుట భౌతికమైన గమ్యం ఏదీ ఉండదు. కాని దీనిని సాధిస్తే, లౌకిక విషయాలతో కూడా విజయం సాధిస్తారు. ఈ విషయాలను మహభారతంలోని శాంతిపర్వంలో వశిష్ఠ జనక సంవాదంలో చర్చించారు.

ధ్యానం అంటే Meditation మాత్రమే కాదు

మనం చేసే పని మీద మనసు లగ్నం చేయడం కూడా ధ్యానమే. కేవలం మౌనంగా నిశ్చలంగా కూర్చొని చేసేది మాత్రమే కాదు, అన్నిదినుసులూ సమపాళ్లలో తీస్తూ, రుచిగా రుచిగా వంట చేయడం కూడ ధ్యానమే. సెల్‍ఫోన్‍లో మాట్లాడుతూ వంట చేస్తే అది బాగుండదు. వాహనాన్ని జాగ్రత్తగా నడపడం కూడా ధ్యానమే, సైకిలు తొక్కడంతో సహా. సిస్టమ్ ముందు కూర్చొని పని చేయడం కూడ ధ్యానమే. చక్కని సంగీతాన్ని ఆస్వాదిస్తూ వినడం కూడ ధ్యానమే. ఒక మంచి సినిమాను దానిలో లీనమై, ఆ పాత్రలతో మమేకమై, అనుభూతి చెందుతూ, తదేక దీక్షతో చూడటం కూడ ధ్యానమే. అయితే ఇది కమర్షియల్ సినిమాలకు, నేలవిడిచి సాము చేసే సినిమాలకు వర్తించదు.

సత్యం, మాయ, ఆనందం

ధ్యానం వల్ల సత్యం ఆవిష్కృతం కావాలి. అదే Ultimate Truth. ప్రమాణాలతో రుజువై హృదయానికి దగ్గరయ్యేదే సత్యం. ఈ ప్రమాణాలు లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు. మాయ అంటే ఒక విధమైన illusion. మనం, ఈ జగత్తు వేరు కాకపోయినా, వేరు అనిపించడమే మాయ. ఆనందం రెండు రకాలు. లౌకికం, అలౌకికం. రోడ్డు మీద వెళుతూన్నాము. ఎవరో పర్స్ పడేసుకున్నారు. తీసి చూస్తే అందులో చాలా డబ్బు ఉంది . “ఆకస్మిక ధనలాభం అని ఉదయం పేపర్లో మన వారఫలాల్లో రాశారు. అలాగే డబ్బు దొరికింది” అని దాన్ని సొంతం చేసుకోవడం లౌకికమైన ఆనందం.

అలా కాకుండా, “అయ్యో! ఈ పర్సు పోగొట్టుకున్న వారు ఎంత బాధపడుతుంటారో కదా!” అనుకుని పర్సులోని ఐడి కార్డులో వారి ఫోన్ నంబర్ చూసి, వారికి ఫోన్ చేసి, వారికి ఆ పర్స్ అందజేస్తే వచ్చి ఆనందం అలౌకికం. మొదటిది Joy. రెండవది Bliss. వ్యక్తిత్వవికాసం అంటే రెండో దాన్ని పొందడమే.

సాఫల్యం; The fulfillment

జీవిత సాఫల్యం అంటే ఏమిటి? కొందరికి జీవిత సాఫల్య పురస్కారం అందిస్తూంటారు. అంటే వారి జీవితంలో బహుముఖ ప్రజ్ఞ చూపి, పరిపూర్ణులైనారని అర్థం. ఇంకా, సమాజం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే మహానీయులుంటారు. ఇంకా, ఆధ్యాత్మికంగా ఎదిగి, సాటివారికి మార్గనిర్దేశం చేసేవారుంటారు. వీరందరూ సాఫల్యం పొందినవారే. అలాంటి వారు పదుల్లో ఉంటారు.

మరి మనలాంటి సామాన్యుల మాటేమిటి? మనకు ‘సాఫల్యం’ లభించదా? ఇది ఇతివృత్తంగా ‘సాఫల్యం’ అనే నవల వ్రాశాను. చాలా పెద్ద నవల. ‘సంచిక డాట్ కామ్’ అను ప్రసిద్ధ అంతర్భాల వారపత్రికలో దాదాపు 60 వారాలకు పైగా ధారావాహికగా ప్రచురింపబడింది. దానిలో సామాన్య మానవుడు కూడ సాఫల్యం పొందగలడని చర్చించాను, ఫిక్షన్ రూపంలో. సాఫల్యం అంటే కేవలం గొప్పగొప్ప వారికి మాత్రమే కాదు, మనకూ సాధ్యమే. దాన్నిమనం ఇలా పొందొచ్చు.

  1. భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకోవడం
  2. వృద్ధులైన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం
  3. పిల్లలను నిర్మాణాత్మక రీతిలో పెంచడం
  4. మన చేతనైనంత ఇతరులకు సాయపడడం
  5. ఇతరులను మానసికంగా గాయపరచకుండా ఉండడం.
  6. అయిష్టతను ద్వేషంగా మార్చుకోక పోవడం
  7. మన వృత్తిని, అది ఏదైనా సరే, నిజాయితీగా నిర్వర్తించడం
  8. అత్యాశకు పోకుండా, ‘Accept Life as it is’ – జీవితాన్ని యథాతథంగా స్వీకరించడం
  9. ఉన్నదానితో తృప్తి చెందడం
  10. అసూయకు దూరంగా ఉండడం

That’s all! అంతే! పైన చెప్పిన సూత్రాలను పాటిస్తే చాలు! మనం కూడ fulfilment ను పొందవచ్చు. దానికోసం మనం లబ్ధప్రతిష్ఠులం కానక్కరలేదు. అసలు వారితో పోల్చుకోవడం అనవసరం. సాఫల్యం ఎప్పుడూ వైయక్తికమే.

భారతీయ వ్యక్తిత్వ వికాసం: శ్రీ కస్తూరి మురళీకృష్ణ

శ్రీ కస్తూరి మురళీకృష్ణ రచించిన అద్భుత గ్రంధం ‘భారతీయ వ్యక్తిత్వ వికాసం’. యండమూరి లాంటి వారు ‘విజయానికి మెట్లు’ లాంటి పుస్తకాలు వ్రాసినా, వాటిమీద పాశ్చాత్య దృక్పథ ప్రభావం ఉంది. ‘స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః’ అని భగవానుడు చెప్పనే చెప్పాడు. మన ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో కావలసినంత వ్యక్తిత్వ వికాసం ఉంది.

మురళీ కృష్ణ భారతీయ దృక్పధాన్ని 11 అంశాలతో సంధానించి చూపారు. అవి:

  1. విజయం
  2. మనస్సు
  3. దైవం
  4. ఆదర్శం
  5. మాట
  6. భయం
  7. ఆలోచన
  8. బ్రహ్మచర్యం
  9. శాంతం
  10. ధనం
  11. అధికారం

పై అంశాలను ఆయన objective గా, కాలానికి, ధర్మానికి relate చేస్తూ చర్చించారు. వాటిని క్లుప్తంగా ప్రస్తావించడం ద్వారా ఈ గ్రంథానికి మరింత పుష్టి చేకూరుతుందని భావిస్తున్నాను. దీనికి అనుమతి ఇచ్చిన కస్తూరి వారికి కృతజ్ఞతలు!

విజయం

ఇది రెండు రకాలు. తాత్కాలికం, శాశ్వతం. పాశ్చాత్యులు ‘మనసు’కు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ సృష్టి నాలుగు మూలకాలతో జరిగిందన్నారు. మట్టి, నీరు, అగ్ని, వాయువు. ఆకాశాన్ని వారు వదిలేశారు. భారతీయ వ్యక్తిత్వ వికాసంలో ఆకాశమే ఆధ్యాత్మికతకు దారి. భౌతిక, తాత్కాలిక విజయానికి కొలబద్దలున్నాయి. శాశ్వత, మానసిక విజయానికి అలాంటివేమీ ఉండవు. కస్తూరి ఇలా అన్నారు. “ఏది సాధిస్తే, ఆ తరువాత సాధించాల్సినదేదీ ఉండదో, ఆ విజయ సాధన మార్గం తెలుసుకోవాలి.”

అద్భుతమైన, లోతైన, వాక్యం!

భారతీయులకు ప్రత్యేకంగా వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పే పనిలేదు. ధర్మాన్ని పాటిస్తే చాలు. అదే వ్యక్తిత్వ వికాసం. గృహస్థాశ్రమాన్ని వారు శ్రేష్ఠమైన దానిగా పేర్కొన్నారు. బాల్యంలో రక్షణ, సంతానం ద్వారా సమాజాభివృద్ధి, సంతులకు భిక్ష, వార్ధక్యంలో ఆసరా, కేవలం గృహస్థాశ్రమం లోనే లభిస్తాయి. “సన్యాసి లేకపోయినా సంఘం నడుస్తుంది. గృహస్థు లేకపోతే సమాజం లేదు” అంటారు మురళి. దీనినే “Being a householder is much more difficult than, being a sanyasi” అన్నారు వివేకానంద.

మనస్సు

మనస్సును అదుపుచేయడం వ్యక్తిత్వ వికాసంలో ప్రధానం. భారతీయ ధర్మంలో శిశువు గర్భంలో ఉన్నప్పటినుండి అది ప్రారంభం అవుతుంది. గర్భవతియైన తల్లి సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలి. ఆమెలో ఏ ఉద్వేగాలు కలిగినా, అవి శిశువుపై ప్రభావం చూపుతాయి. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉండగానీ, నారదమహర్షి ద్వారా విష్ణుతత్త్వాన్ని నేర్చుకుంటాడు. శిశువుకు తొలి వ్యక్తిత్వ వికాస గురువు తల్లి! ఆమె పాటలు, మాటలు, బుజ్జగింపులు, ముద్దులు, స్పర్శ అన్నీ వ్యక్తిత్వ వికాస పాఠాలే. తర్వాత తండ్రి చూపే ప్రేమ, ఆయన Concern, బంధువుల ఆదరణ అతన్ని తీర్చిదిద్దుతాయి.

పాఠశాలలో రెండో దశ వ్యక్తిత్వ వికాసం మొదలవుతుంది. తనను ఇతరులతో పోల్చుకుని, తన ఐడెంటిటీని పిల్లలు తెలుసుకుంటారు.

బాల్యంలో వ్యక్తిత్వ వికాసానికి ఎన్నో అవరోధాలు, diversions ఎదురవుతాయి. టి.వి. సెల్‌ఫోన్, మార్కులు, ర్యాంకులు, పాశ్చాత్య ఆకర్షణలైన తిండి పదార్థాలు పిల్లల వ్యక్తిత్వాన్ని నకారాత్మకంగా ప్రభావితం చేస్తాయి. యవ్వనం బాల్యానికి ముందే వస్తుంది. ప్రేమ, సెక్స్ భావనలు Premature గా కలుగుతాయి. Consumerism, utilitarian culture వారి వ్యక్తిత్వాన్ని కలుషితం చేస్తాయి.

ఈ దశలోనే పిల్లలను పెద్దలు అదుపు చేయాలంటారు కస్తూరి వారు. తమని తాము అదుపు చేసుకోవడం కూడా నేర్పించాలి. ‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అన్నారు కదా! పిల్లల అవయవాలు ఇంద్రియాలు శక్తివంతం కావాలి. ఆ బాధ్యత పెద్దలదే!

దైవభావన

చిన్నవయసుతోనే దైవాన్ని గురించిన అవగాహన కల్గించడం మన భారతీయ వ్యక్తిత్వ వికాసంలో ఉంది. ప్రహ్లాదుడు, ధృవుడు, మార్కండేయుడు మొదలైన వారి కథలను తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తారు. వారి సినిమాలను చూపిస్తారు. దానివల్ల వారిలో దైవభావన పెరుగుతుంది. అదే సమయంలో పిల్లల్లో ప్రశ్నించే గుణాన్ని, తర్కాన్ని, విశ్లేషణను, నిర్ధారించుకోగల శక్తిని పెద్దలు ప్రోత్సహించాలి.

దైవభావన వల్ల భగవంతునిపై విశ్వాసం, వేదాలు, ఉపనిషత్తులపై నమ్మకం, మంచీ చెడుల విచక్షణ, అవి లోకంలో ఎందుకున్నాయనే ఎఱుక కలుగుతాయి. తద్వారా ఆత్మశక్తి బలోపేతమౌతుంది.

ఆదర్శం (aim, target, ideal)

‘ఆదర్శం లేని జీవితం చుక్కాని లేని నావ’ అంటారు కస్తూరి. ఆదర్శహీనులు ప్రలోభాలకు సులభంగా లొంగుతారంటారాయన. వ్యక్తిత్వ వికాసంలో ఆదర్శం ప్రముఖ పాత్రను పోషిస్తుంది. దాని వల్ల ఏకాగ్రత కలుగుతుంది. పిల్లలకు పురాణ కథలు చెప్పి, అందులో ఆదర్శాలను అనుకరించేలా చేయాలి.

మాట

‘మాటే మంత్రం’ అన్నారు మహాభారతం, రామాయణంలో, ఇంకా ఎన్నో పురాణ ప్రబంధాలలో. ‘మాట’ ఇవ్వడం, దాన్ని తప్పకపోవడం, దాన్ని నిలబెట్టుకోవడానికి నానా కష్టాలు పడడం మనకు కనిపిస్తుంది. ఇక్కడ కస్తూరి వారొక చక్కని పరిశీలన చేశారు.

“ఒక విషయాన్ని సాధించాలంటే, ఎవరితో ఐతే అది సాధ్యమో వారి స్వభావాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. వారు అనుకూలంగా ఉంటే సమస్య లేదు. లేకపోతే మాత్రం, మనం వారి ‘అహాన్ని’ సంతృప్తి పరచాలి. కాని దానికోసం మన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టగూడదు.”

ఇది Strategy కాదు వ్యక్తిత్వ వికాస సూత్రం! ‘అనువు గాని చోట అధికులమనరాదు’ అన్నాడు వేమన. దీనికి సావిత్రిని, నచికేతుని ఉదాహరణలుగా చూపారు రచయిత.

వ్యక్తిత్వ వికాసంలో బ్రహ్మస్త్రం..

“సత్యం ప్రియంగా చెప్పాలి. ప్రియమైన సత్యం చెప్పాలి. అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు, ప్రియమైన అబద్ధాన్ని చెప్పకూడదు.”

‘మాటకు ప్రాణము సత్యము’ అన్నాడు సుమతీ శతకకారుడు.

మనిషిని మనిషికి దగ్గర చేసేది మాటే! దానికి శక్తి పదాల ద్వారా రాదు, ఆ పదాలను ఉచ్చరించే వారి మనస్సు వల్ల వస్తుంది. మంచి మనసు వల్ల!

చిరునవ్వుతో మాట్లాడితే, పనిచేస్తే (Service with a smile) శరీరం ఉల్లాస భరితమౌతుంది. అదే కోపంగా చెబితే, శరీరం కంపిస్తుంది. ప్రేమతో చెబితే, గొంతు మృదువుగా మారుతుంది. మాటలు ప్రోది (తయారు) చేసుకోవడం ముఖ్యం. మాట ఆయుధం. దాన్ని జారకూడదు. జారితే వెనక్కు తీసుకోలేము. చక్కని మాటలను అలవర్చుకోవడం వ్యక్తిత్వ వికాసంలో ప్రధానం. దానికి మార్గాలు కస్తూరి ఇలా చెప్పారు.

“చక్కని సాహిత్యం చదవడం, మంచివారితో స్నేహం చేయడం, ప్రేమపూర్వక భాషణం, విచక్షణతో కూడిన ప్రవర్తన”.

పబ్లిక్ స్పీకింగ్

ఇది ఒక కళ. వ్యక్తిత్వ వికాసంలో పూర్ణులైనవారే దీన్ని చేయగలరు. వక్త, సభలోని శ్రోతలు ఏం వినాలనుకుంటున్నారో? వారి మూడ్‌ను గ్రహించగలగాలి. వారిని, వారి మనోభావాలను ఆకట్టుకోగలగాలి. వివేకానందుడు, వాజపేయి, అబ్దుల్ కలాం ఈ ప్రతిభకు  కొన్ని  ఉదాహరణలు.

భయం

భయాన్ని జయించాలంటే, ముందు భయస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆధునిక మనస్తత్వశాస్త్రం భయాన్ని, Phobia అంటుంది. దాన్ని వర్గీకరించింది. భయానికి వ్యక్తిత్వ వికాసానికి సంబంధం ఏమిటి? భయం దానికి ముఖ్యమైన అవరోధం. దాన్ని తొలగిస్తే, వికాసానికి దారి ఏర్పడుతుంది.

అర్జునునికి ఈ భయం వల్లనే యుద్ధం పట్ల విరక్తి కలిగింది. మొదట ఆత్మతత్త్వాన్ని, తర్వాత మరణ తత్వాన్ని బోధించడం ద్వారా శ్రీకృష్ణపరమాత్మ దానిని తొలగించి, అర్జునుడిని కార్యోన్ముడిని చేశాడు.

బాల్యంలో, ఎటువంటి భయాలూ ఉండవు. పెరిగే కొద్దీ ‘భయాలు’ ఆవరిస్తాయి. భయానికి పరిష్కారం తర్కమే అంటారు మురళీకృష్ణ. అవరోధాలను ఊహించుకుని భయపడుతూ, అసలు పనినే చేయని వారిని ‘ఆరంభించరు నీచ మానవులు’ అన్నారు. భారతీయ ధర్మం భయాలు అర్థరహితం అని బోధిస్తుంది. ‘రజ్ఞుస్సర్పభ్రాంతి’ని పోగొడుతుంది. జడత్వం వల్ల భయం కలుగుతుంది. నిరంతర గమనశీలులైనవారికి భయం ఉండదు. మన శక్తి మనకి తెలిసినప్పుడు, దాన్ని ప్రదర్శించగలిగినప్పుడు భయం అసలుండదు.

ఆలోచనలు – నియంత్రణ

మనకు కలిగే ఆలోచనలు తరంగాల రూపంలో ఉండి, మన మెదదు ఒక రిసీవర్‌లా దానిని గ్రహిస్తుంది. Inspiration లేదా creativity ని కస్తూరివారు ఇలా వివరించారు.

“రెండు పరస్పర విభిన్న అంశాలను ముడిపెట్టి సమస్యను పరిష్కరించే ఆలోచన.”

నియంత్రణను సాధించే క్రమమే యమం. దానిలోని అంతర్భాగాలే అహింస, సత్యం, దొంగతనం చేయకపోవడం. అత్యాశకు దూరంగా ఉండడం, బ్రహ్మచర్యం మొదలైనవి. వ్యక్తిత్వ వికాసంలో ఈ నియంత్రణ చాలా ముఖ్యపాత్రని పోషిస్తుంది.

శౌచం

‘Cleanliness is next to Godliness’ అన్నారు పాశ్చాత్యులు. మనవారు దాన్ని మరింత లోతుగా, ‘బాహ్యభ్యంతర శుచి’ అన్నారు. శుభ్రత అనేది inner మరియు outer గా ఉంటేనే సార్థకం అవుతుంది. భారతీయ ధర్మం ఆరోగ్యాన్ని కూడా దైవభావనతో జోడించింది. మన యోగాసనాలు, సూర్యనమస్కారాలు అలాంటివే. శారీరిక శక్తి, ఆత్మశక్తి కలిస్తేనే ఆరోగ్యం సిద్ధిస్తుంది.

బ్రహ్మచర్యం

భారతీయ ధర్మం అని ఒక చక్కని ఆచారం ఇది. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం కాదు. కోరికలను అదుపులో ఉంచుకోవడం. ప్రవరుడు, విప్రనారాయణుడు, శుకుడు దీనికి రోల్‍మోడల్స్. కోరికలు అదుపులో లేకపోతే జరిగే అనర్థాలను విప్రనారాయణ పాత్ర తెలుపుతుంది. ఎటువంటి కోరికలూ లేని సమాధిస్థితిని మోక్షం అంటారు. బ్రహ్మచర్యం అనేది వ్రతం.

శాంతం

క్రోధానికి వ్యతిరేకమే శాంతం. దాన్ని ‘శమం’ అంటారు. కోపం విచక్షణని నశింప చేస్తుంది. “తన కోపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష” అన్నాడు సుమతీ శతకకారుడు. శాంతం నిరంతర అభ్యాసం వల్ల అలవడుతుంది. సహనం అనుషంగికంగా ఉంటుంది.

ధనం ఐశ్వర్యం

నిరుత్సాహం చెందకుండా ఉండటం ఐశ్వర్యానికి మాలం. కేవలం ప్రయత్నశీలత వల్లనే అర్థ సమృద్ధి లభిస్తుంది. అన్ని కార్యాలను నిర్వర్తించగలిగేది ధనమే. ‘ధనమూల మిదం జగత్’ అన్నారు.

ధనం గుణం

కాని, ధనం అనేది భారతీయ ధర్మంతో గుణంతో ముడిపెట్టారు. ధనాన్ని అదుపులోన ఉంచుకున్నవాడే నిజమైన ధనవంతుడు, గుణవంతుడు. ధనాశ ఉండటం సహజం. అది మితిమీరితే పాపకార్యాలను చేయిస్తుంది. ఎంత పండితులైనా, కళాకారులైనా, “పసిడి గల వానికి బానిస కొడుకులు” అన్నాడు వేమన. చదువు నేర్చుకోవడానికి రెండు మార్గాలున్నాయట. ‘గురు శుశ్రూషయా విద్యా, పుష్కలేన ధనేన వా’. ఒకటి గురువుకు చక్కగా సేవలు చేయడం. లేదా దండిగా ‘గురు దక్షిణ’ సమర్పించుకోవడం.

అసలు ధనం

భారతీయ ధర్మం ఏమని బోధిస్తుందంటే, సమాజంలో గౌరవమర్యాదలు పొందాలంటే ధనం సంపాదించాలి అని. కాని దానిని ధర్మమార్గంలో సంపాదించాలి. ‘అన్యాయార్జిత విత్తము’ మన అత్మకు హానిచేస్తుంది. సంపాదించిన ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగించాలి. నిజమైన ధనం జ్ఞానమే. దాన్ని చోరులు హరించలేరు. ఇతరులకు ఇచ్చే కొద్దీ పెరుగుతుంది. ధనాన్ని గురించిన ఈ అవగాహన వ్యక్తిత్వ వికాసంలో కీలకమైనది. Money Management అంటే ఇదే!

అధికారం

భారతీయ ధర్మం అధికారాన్ని Divine గా ఆవిష్కరించింది. ‘నావిష్ణు పృధివీపతిః’ అన్న సూక్తిలో రాజును దైవాంశసంభూతునిగా చూపారు. ఆయన కేవలం ప్రజల ఆస్తులకు caretaker మాత్రమే. ఆధునిక Management లో కూడా ఇది కనబడుతుంది. నిజమైన బాస్ ఎలా ఉండాలి? పని సక్రమంగా చేసినవారిని ప్రశంసించాలి, నైపుణ్యం గల వారిని గుర్తించాలి. క్రిందివారిని హీనంగా చూడరాదు. ‘First among equals’ గా ఉండాలి. అధికారం తను కొన్నదన్న ‘consciousness’ ఉండకూడదు

Performers/non-performers ను గుర్తించాలి. చెప్పడు మాటలు వినకూడదు. ఈ Management నాయకత్వ లక్షణాలు అన్నీ వ్యక్తిత్వ వికాసంతో అవినాభావ సంబంధం కలవే. మన పురాణ పురుషులందరూ Best bosses ఉంటారు కస్తూరివారు. ఆయన అన్న ఈ వాక్యం మన మనస్సును హత్తుకుంటుంది.

“వ్యక్తిత్వ వికాసం ఒక కొనుక్కునే అంశం కాదు, అది జీవనంలో ఒక భాగం కావాలి.”

ఎంత భావగర్భితమైన మాట! కస్తూరి మురళీకృష్ణ గారు ఆ విధంగా ‘భారతీయ వ్యక్తిత్వ వికాసము’ను మనకందించారు. అది 350 పేజీల ఉద్గ్రంధం. వ్యక్తిత్వ వికాసమును భారతీయ దృక్కోణంలో వివరించిన తొలి గ్రంథం నాకు తెలిసినంతవరకు ఇదే. దానిలోని ముఖ్యాంశాలను మాత్రం నేను స్పృశించాను. లేకపోతే ఈ రచన అసమగ్రం అవుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here