మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-8

0
3

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

మనుచరిత్ర

అల్లసాని పెద్దన రచించిన మను చరిత్రలో అతిథి సత్కారం, నిష్ఠ, ఇంద్రియ నిగ్రహం మొదలయిన అంశాలు – ప్రవరాఖ్యుడు, ఆయన గృహిణి పాత్రల ద్వారా వివరించబడినాయి. దురదృష్టవశాత్తు, ఇప్పుడు, అతిథులెవరైనా వస్తున్నారంటే విసుక్కునే వ్యక్తిత్వాలు తయారయ్యాయి. ‘అతిథి దేవోభవ’, ‘అభ్యాగతః స్వయం విష్ణుః’ లాంటి సూక్తులు భారతీయ సనాతన ధర్మంలో, అతిథులను ఆదరించడం, అన్నం పెట్టడం పరమధర్మమని చెబుతున్నాయి. ఉత్తమ వ్యక్తిత్వం మనం అతిథులను ఎలా రిసీవ్ చేసుకుంటాము, ఎలా వారిని గౌరవిస్తాము అనే విషయాల్లో బయటపడుతుంది.

ప్రవరుడు నిత్యాగ్నిహోత్రి. నిరతాన్నదాత. ఆయన భార్య ఆయనకు తగిన యిల్లాలు. పెద్దన ఆమెను గురించి ఇలా అంటాడు.

“వండనలయదు వేవురు వచ్చిరేని
అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి”

ఎంతమంది వచ్చినా, వారికి వండిపెట్టడానికి ఆమెకు అలుపు లేదు: ఆమె సాక్షాత్తు అన్నపూర్ణ. ఇక గృహస్థుడు అతిథులను ఎలా ఆదరిస్తున్నాడో చూడండి.

“ఆ నిష్ఠానిధి గేహసీమ నడురే యాలించినన్ మ్రోయు నెం
తే నాగేంద్ర శయాను పుణ్యకథలుం దివ్యప్రబంధాను సం
ధానధ్వానము నాస్తి శాకబహుతా, నా స్త్యుష్ణతా, నాస్త్యపూ
పో, నాస్త్యోదన సౌష్ఠవంచ, కృపయాభోక్తవ్యమన్ పల్కులున్”

ప్రవరుని ఇంట్లో అర్ధరాత్రి కూడ అతిథులకు భోజనం పెడతారట. “అయ్యా, భోజనం వేడిగా లేదు, మంచి కూరలు లేవు. భోజన సౌకర్యం మీకు చక్కగా కల్పించలేకపోయాము. దయచేసి తినవలసినది” అని ఆయన వారిని వేడుకుంటాడట.

ఇక ఆయన ఏకపత్నీవ్రతుడు. హిమాలయాల్లో చిక్కుకున్న ఆయనను వరూధిని మోహించి, పొందుకోరి వెంటపడితే ‘హా శ్రీహారీ! పొమ్మ’ని తోసివేశాడాయన. అంత సౌందర్యవతి కూడా ఆయన నిగ్రహన్ని సడలించలేకపోయింది “గలంచునే సతుల మాయల్‌ ధీర చిత్తంబులన్‌?” అంటాడు పెద్దన ఆ సందర్భంలో. తర్వాత తన దాన జపాగ్నిహోత్ర శక్తితో, అగ్నిని పార్థించి, తన నెలవు చేరుకుంటాడు.

మన గోదావరి జిల్లాల్లో డొక్కా సీతమ్మగారి పేరు చాలా ప్రసిద్ది. ఎవరు ఏ వేళలో ఆకలంటూ ఆమె తలుపు తట్టినా ఆమె అన్నం పెట్టి ఆదరించేది. అన్ని దానాల్లల్లోకి అన్నదానం గొప్పది. ఆకలికి కులమత భేదాలు లేవు. ఒక్కసారి దగ్గర డబ్బున్నా, అన్నం దొరకదు. ‘అందాలరాముడు’ సినిమాలో బాపు దీన్ని చక్కగా చూపారు. పడవలో అందరూ భద్రాచలం వెళుతూంటారు. ప్రమాదవశాత్తు పడవ ఒక నిర్జనమైన ఒడ్డుకు చేరుతుంది. నాగభూషణం తాను ధనవంతుడినని విర్రవీగుతూ, మిగతావారిని లోకువ కట్టి చూస్తుంటాడు. వీళ్ళంతా వంటలు చేసుకుంటుంటారు. ‘డబ్బిస్తాను నా కూతురికి (హీరోయిన్), అన్నం పెట్ట’మని దబాయిస్తాడు నాగభూషణం. అతనికి అతని కూతురికి బుద్ధి రావాలని అక్కినేని వారికి అన్నం పెట్టవద్దంటాడు. చివరికి లక్ష రూపాయలిస్తాను నా కూతురికి అన్నం పెట్టమని ప్రాధేయపడతాడు. డబ్బు కంటే మానవత్వం గొప్పదని తెలుసుకుంటాడు.

డొక్కా సీతమ్మగారి తండ్రి ‘బువ్వన్న’గా ప్రసిద్ధులు. ఆయన అడిగిన వారందరికీ ‘బువ్వ’ పెట్టడం వల్ల ఆ పేరు వచ్చింది. ఆయన బాటలోనే నడిచి ఆమె అపర అన్నపూర్ణగా పేరు తెచ్చుకుంది. ఆమె ఖ్యాతి దేశమంతానే కాక ఇంగ్లండు వరకు వ్యాపించింది.

మన దేవస్థానాల్లో అన్నదాన వితరణ వేలమందికి జరుగుతుంది. మన వ్యక్తిత్వం వికసించినందుకు తార్కాణం మనం ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే. మనం శిబి చక్రవర్తి, రంతి దేవుడు, డొక్కా సీతమ్మ వారి స్థాయిలో చేయలేకపోయినా, మన పరిధిలో మనం ఈ గుణాన్ని అలవర్చుకోవాలి. అసలు పితృకార్యాల్లో బ్రాహ్మలను ‘భోక్తలు’ అంటారు. అంటే ఆకలిగొని తినేవారని.

తెనాలి రామకృష్ణుని నిగమశర్మోపాఖ్యానం

దీనిలో నిగమశర్మ Spoilt child. వ్యసనపరుడు. అతన్ని ‘జీవత్తాత పాదుండు’ అంటారు తెనాలివారొక పద్యంలో. అంటే తండ్రి ఇంకా జీవించి ఉన్నవాడని అర్థం. అందువల్లే వాడి ఆటలు సాగుతున్నాయి.

నిగమశర్మ అక్క

తమ్ముడికి బుద్ధి చెప్పి, దారిలో పెట్టడానికి అతని అక్క వస్తుంది పుట్టింటికి. ఆమె బంగారు తల్లి. దొడ్డ యిల్లాలు. ఆమెను గురించి ‘నిగమశర్మ యక్క’ అనే వ్యాసాన్ని శ్రీమాన్ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మగారు వ్రాశారు. అందులో ఆమె పేరు ఎక్కడా ఉండదు. తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకొని మందలిస్తూ ఆమె చెప్పిన మాటలు వ్యక్తిత్వ వికాస సూత్రాలే. తల్లిదండ్రుల విలువ, భార్యను ప్రేమించడం, చెడు సావాసాలను మానడం దుర్వ్యసనాలకు లోనుకాకపోవడం ఇవన్నీ ఆమె నోట పలికిస్తారు కవి. ఆమెను universal sister గా చిత్రీకరించాడా మహాకవి. ఆమె మందలింపు ఇలా ఉందట.

‘తరంగిత వినయసౌహార్ద మార్దవ మధురం
బులగు మాటల తేటలం బందిరి వెట్టినది’.

వాడు అక్క మాటలు వినక, మళ్లీ ఆమె సొమ్మునీ సంగ్రహించి పారిపోతాడు. అది వేరే సంగతి. ఇక్కడ మనం గమనించాల్సింది ఆమె చాకచక్యం, సౌజన్యం, మాట తీరు, counselling skills. ఇవన్నీ వ్యక్తిత్వ వికాస పాఠాలే.

అభిజ్ఞాన శాకుంతలం, కాళిదాసు

“కావ్యేషు నాటకం రమ్యం
నాటకేషు శకుంతలా
తస్యాంచ చతుర్ధ్వాంకః
తస్మిన్ శ్లోక చతుష్టయమ్”

కావ్యాల్లో కెల్లా నాటకం రమ్యమయినది, నాటకాల్లో ‘శాకుంతలం’ గొప్పది. అందులో నాల్గవ అంకము చాలా బాగుంటుంది. దానిలో నాలుగు శ్లోకాలు ఇంకా బాగుంటాయి.

కాళిదాసు విశ్వకవి. ఆయనను ‘Shakespeare of India’ అంటారు గాని అది తప్పు. Shakespeare నే ‘Kalidas of England’ అంటే బాగుంటుంది. ఈ నాలుగు శ్లోకాల్లో మానవ జీవితానికి సంబంధించిన అద్భుతమైన విషయాలు అత్యద్భుతంగా వివరించాడు మహాకవి.

మొదటి శ్లోకం:

“పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషు యా
నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవమ్
ఆద్యే వః కుసుమప్రసూతిసమయే యస్యా భవ త్యుత్సవః
సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతామ్”

ఇందులో మనిషికీ ప్రకృతికీ గల సున్నితమైన అనుబంధం హృద్యంగా చెప్పబడింది. ఈనాడు మనం ‘పర్యావరణ పరిరక్షణ’, ‘వాతావరణ సమతౌల్యత’ అని ఉద్యమాలు చేస్తున్నాం. ప్రకృతిని పరిరక్షించుకోవడం మనిషి బాధ్యత. అది అతని వ్యక్తిత్వవికాసంలో భాగమే.

“శకుంతల మొక్కలకు నీళ్లు పోయకుండా తాను మంచినీళ్లు కూడా తాగేది కాదు. ఎంత తనకు ఇష్టమున్నా, అలంకరణ కోసం చిగురుటాకులను తుంచేది కాదు. తాను పెంచిన మొక్క పువ్వు పూస్తే ఉత్సవం జరిపేది.”

ఈ శ్లోకం మొక్కలను సాటి మనిషిగా, అతిథిగా, సన్నిహితులుగా, బంధువులుగా చూపుతుంది. ప్రకృతితో మమేకం కావడం, దాన్ని పోషించడం, పరిరక్షించడం, దాని అందాలను ఆస్వాదించడం కూడా ఉత్తమ వ్యక్తిత్వానికి తార్కాణాలు. Personality Development కీ, మొక్కల పెంపకానికీ ఏం సంబంధం అని అడిగేవాళ్లను ఆ దేవుడే కాపాడాలి.

రెండవ శ్లోకం:

‘From particular to General’ అన్నది కావ్య ప్రయోజనం. దానిని మహాకవి, శకుంతలను కణ్వుడు అత్తవారింటికి పంపే సందర్భంలో, ఈ శ్లోకం ద్వారా అత్యంత కరుణ రసప్లావితంగా చెప్పారు. మానవ సంబంధాలలోని సున్నిత పార్శ్వాన్ని చూపారు. సున్నితమైన స్పందనలు కలిగి, వాటి ద్వారా ఇతరులతో సహానుభూతిని దర్శించడం అత్యుత్తమ వ్యక్తిత్వ ఆవిష్కరణం. వెళుతూన్నది పెంచిన కూతురు. తానేమో సర్వసంగపరిత్యాగి. అటువంటి తనకే పుత్రికావియోగం ఇంత దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటే, ఇక సామాన్య సంసారుల మాట ఏమిటి? అంటాడు కణ్వుడు ఈ శ్లోకంలో!

“యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా
కంఠస్థంబిత బాష్పవృత్తి కలుషశ్చింతా జడం దర్శనం
వైక్లవ్యం మమతావదీ దృశ మిదం స్నేహాదరణ్యౌ కసః పీడ్యంతే
గృహిణః కథంనుతనయా విశ్లేష దుఃఖైర్నవైః”

“నా తల్లి అత్తవారింటికి వెళుతూంటే బాధతో నా గొంతు పట్టేసి, నోట మాట పెగలడం లేదు. కళ్ల నిండా నీళ్ల వలన చూపు మసకబారింది. అంతా నిర్వేదంగా కనిపిస్తూంది. ఏ బంధాలకూ అతీతుడనైన నాకే ఇంత బాధ కలుగుతూ ఉంటే, సాధారణ గృహస్థులు ఇంకెంత బాధపడతారో కదా!”

తనకు కలిగిన బాధను వేరే వారికన్వయించి, వారి పట్ల సానుభూతి చూపడం అనేది ఉత్తమోత్తమ వ్యక్తిత్వ లక్షణం. ‘ఆత్మవత్ సర్వభూతాని’ అన్న సూక్తికి ఇది దగ్గరగా వస్తుంది. తల్లిదండ్రులు ఎంత గొప్పవారైనా, ఆడపిల్ల ఎంత విద్యాధికురాలు, ఉన్నతోద్యోగి అయినా, ఆమె పెళ్లిలో, అప్పగింతల సమయంలో వారంతా ఏడుస్తారు. అది విశ్వజనీనం. అన్నట్లు ఉత్తమ సాహిత్యం చదవడమే ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. అందులో ఇటువంటి universal phenomenon ను గ్రహించడం మన వ్యక్తిత్వానికి వన్నెలు దిద్దుతుంది.

మూడవ శ్లోకం:

ఇది శకుంతల భర్త ఐన దుష్యంతునికి కణ్వ మహాముని పంపే సందేశం.

“అస్మాన్ సాధు విచింత్య సంమ్యమధనాన్ ఉచ్ఛైః కులంచాత్మనః
త్వైయస్యాః కథమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం
సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా
భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వధూబంధుభిః”

“మేము సారెలు కట్నకానుకలు ఇవ్వలేము. మాకు తపస్సు, నీతి నియమాలే ధనం. నీవు మహారాజువు. మా కూతురే ఒక అపురూప ధనం. అవేమీ ఇవ్వలేదని శకుంతలను దెప్పిపొడవకు.”

ఆధునిక సమాజంలో వరకట్నం చాలలేదని కోడలిని వేధించేవారు, ఆమెను హత్య చేసేవారు కూడా ఉన్నారు. ఎంత నాగరికత పెరిగినా వివాహబంధాన్ని, ఆర్థిక విషయాలతో ముడిపెట్టడం తగ్గలేదు. దానివల్లే సున్నితమైన భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఈ శ్లోకంలో ఈ విషయాలను పరోక్షంగా ప్రస్తావించాడు మహకవి. మానవ సంబంధాలలో, ఆర్థిక ప్రయోజనాలు ముడిపడితే, వ్యక్తిత్వ వికాసం మసకబారుతుంది.

నాలుగవ శ్లోకం:

ఇది భార్యాభర్తల బంధం ఎలా ఉండాలా చెప్పే అత్తవారింట అమ్మాయి ఎలా మెలగాలో, వారి ప్రేమను ఎలా చూరగొనాలో కణ్వ మహాముని బోధిస్తున్నాడు. ఈనాడు ఎంత మైక్రోఫ్యామిలీస్ ఏర్పడినా, రెండువైపులా ‘in laws’ ఉంటారు. రెండు కుటుంబాలు ఒకటవుతాయి వివాహం వల్ల. విభిన్న పరిస్థితుల నుండి, నేపధ్యాల నుండి వచ్చిన ఇద్దరు స్త్రీ పురుషులు కలసి జీవించాల్సి వస్తుంది. కొన్ని ego clashes, అభిరుచుల్లో తేడాలు, అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇద్దరిలో కొంత రాజీ ధోరణి అవసరం. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గుర్తించి గౌరవించడం అవసరం. భార్యాభర్తల అనురాగ బంధం వ్యక్తిత్వ వికాసంలో ఒక కీలకమైన అంశం. కూతురికి చెప్పే ఈ శ్లోకంలో ఇవన్నీ ఉన్నాయి.

“సుశ్రూషస్వ గురూన్ ప్రియసఖీ వృత్తిం సపత్నీజనే
భర్తుర్విప్ర కృతాపి రోషణతయా మాస్మం ప్రతీ పంగమః
భూయిష్ఠం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః”

“తల్లీ, పెద్దలకు, అత్తమామలకు సేవ చెయ్యి, భర్తతో ఒక స్నేహితురాలిగా మెలుగు. మగడు కోపంతో ఏమైనా అన్నా నీవు సంయమనం కోల్పోకు. సేవకులను హీనంగా చూడకు, దయకలిగి ఉండు. భోగభాగ్యాల వల్ల కలిగే గర్వాన్ని దూరం పెట్టు. ఈ విధంగా యువతులు ఉత్తమ గృహిణులవుతారు కూతురా!”

ఇంత కంటే వ్యక్తిత్వ వికాస బోధన ఉంటుందా? ఇది లేకపోవడం వల్లే డైవోర్సులు, బ్రేకప్‍లూ, సింగిల్ పేరెంట్స్, సమాజంలో unrest ని సృష్టిస్తున్నాయి. ఈ శ్లోక చతుష్టయాన్ని చక్కగా అర్థం చేసుకొని, ఆచరిస్తే, వ్యక్తిత్వం పదును తేలుతుంది.

శతకసాహిత్యం – వ్యక్తిత్వవికాసం

మన తెలుగు భాషకే సొంతం శతక సాహిత్యం, శతకాలన్నీ వ్యక్తిత్వ వికాస నిధులే. అందరికీ అర్థమయ్యే భాషలలో మానవ జీవితాన్ని తీర్చిదిద్దే ఎన్నో అనర్ఘరత్నాల్లాంటి పద్యాలు మన శతక సాహిత్యం లభిస్తాయి.

సుమతి శతకము

‘వినదగునెవ్వరు చెప్పిన’ అనే పద్యంతో అందరి మాటలూ వినాలి. కానీ తొందరపడకుండా, వితర్కించుకుని, ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోవాలి అని అంటాడు బద్దెన కవి. తర్వాత ‘తప్పించుకు తిరుగువాడె ధన్యుడు’ అన్న మాటను వ్యతిరేకార్థంలో వాడుతుంటారు. కాని ఆ పాదానికి ముందు మూడు పాదాలు వ్యక్తిత్వం తీర్చిదిద్దుకోవడానికి పనికివస్తాయి.

“ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి, యన్యుల మనముల్
నొప్పింపక, తానొవ్వక..”

సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలి. మన మాటలు ఇతరులను నొప్పించకూడదు. అట్లా మనమూ నొచ్చుకోకూడదు. అలాంటివారు ధన్యులు. ఇదేదో ‘గోడమీది పిల్లి’ వాటం కానే కాదు. మాటపై నియంత్రణ ఎలా వుండాలో చెబుతున్నాడు కవి.

మనుషులు స్నేహంగా ఉన్నంతవరక తప్పులు కనబడవు. ఆ స్నేహం వీగిపోతే అంతా తప్పుగా అనిపిస్తుంది. స్నేహన్ని బట్టి కాకుండా తప్పును తప్పుగా చూడగలగాలని కవి చెబుతున్నాడు. కాని మనలో చాలామంది ‘మన’ వాళ్లల్లో తప్పులు వెదకరు. ‘పర’వాళ్లలో అన్నీ తప్పులే. అది సమగ్ర వ్యక్తిత్వం కాదు. దాన్నీ బద్దెన ఇలా చెప్పాడు

“కూరిమిగల దినములలో
నేరము లెన్నడును కలుగనేరవు, మరియా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ.”

~

పరమ మానవుడిని కవి ఇలా నిర్వచించాడు.

“పరీనారీ సోదరుడై
పరధనముల కాశపడక పరులకు హితుడై
పరులు తను బొగడ నెగడక
బరులలిగిన నలుగునతడు పరముడు సుమతీ.”

పరస్త్రీలను సోదరీమణులుగా భావించేవారు, ఇతరుల ధనంపై ఆశ చూపనివాడు, ఇతరులకు మేలు చేయువాడు, ఇతరులు తనను పొగిడినా పొంగిపోనివాడు, ఇతరులు తనమీద కోపం తెచ్చుకున్నా, వారి మీద కోపం కల్గనివాడు, ఉత్తమ మానవుడు. ఒక్కమాటలో చెప్పాలంటే స్థితప్రజ్ఞుడు.

కార్యసిద్ధి కలగాలంటే తొందరపాటు పనికిరాదు. దీనినే భారవి మహాకవి తన ‘కిరాతార్జునీయము’ లో ఇలా చెప్పాడు.

“సహసా విదధీత న క్రియా
మవివేకః పరమాపదాం పదం
వృణుతే హి విమృశ్యకారిణం
గుణలుబ్ధా స్స్వయమేవ సంపదః”

~

ఆలస్యాన్ని, శ్రమను భరించగలిగిన వాడే కార్యసాధకుడు. బద్దెన పద్యం చూడండి

“తడవోర్వక యొడలోర్వక
కడువేగం బడిచిపడిన గార్యంబగునే?
తడవోర్చిన నొడలోర్చిన
జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!”

దీనినే ఇంగ్లీషులో ‘Slow and steady wins the race’ అనీ, ‘haste is waste’ అనీ అన్నారు. ఇంకా తెలుగులోనే ‘ఆత్రగానికి బుద్ధి అల్పంబయా!’ అన్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here