మన సంస్కృతి – పీరీలు

0
2

[box type=’note’ fontsize=’16’] “భాషలంత వేరు పరతత్వమొక్కటే అన్నట్లుగా యిక్కడ హిందువులందరు గూడ ముస్లింలతో బాటుగా పీరీలను సేవించేటోళ్ళు” అని పీరీల గురించి చెబుతున్నారు నల్ల భూమయ్య ఈ వ్యాసంలో. [/box]

[dropcap]అ[/dropcap]వి ‘పీరీ’ల బంగ్లాలు. ‘బంగ్ల’ అంటే అది కుమ్మరి గూన పెంకులు కప్పిన చిన్నయిల్లు. ఆ చిన్న యిల్లు వంటి దాన్నే ‘బంగ్ల’ అని ఎందుకంటున్నరంటే అప్పట్లో అక్కడి అందరి యిండ్లు గూడ తడకల గుడిసెలో, గడ్డి యిండ్లో అయి వుండేటియి. అటు వంటప్పుడు ఈ గూన కప్పిన చిన్న యింటినే ‘బంగ్ల’ అనేటోళ్ళు. కాదంటే గీదీంట్ల ‘పీరీలు’ అంటే దేవుండ్లు అటువంటోళ్ళు వున్నందున కావచ్చు, ఆ చిన్న యింటినే ‘బంగ్ల’ అనేటోళ్ళు.

భాషలంత వేరు పరతత్వమొక్కటే అన్నట్లుగా యిక్కడ హిందువులందరు గూడ ముస్లింలతో బాటుగా పీరీలను సేవించేటోళ్ళు.

కాలేర్లల్ల వున్న పీరీలకన్నా గూడ పల్లెలల్ల వుండే పీరీలే పెద్ద మహిమలు గలవి అనేటోళ్ళు. ‘భూమమ్మ’ పీరీలన్నింటికన్న పెద్దది. మహత్యాలు గలది. అందుకని ‘కొంగుముడి వేసుకుని కొత్తదంపతులు, కొడుకు పుట్టాలని కోరుకున్నారని’ అన్నట్టుగ మా మొక్కకుంటరు. కానీ బిడ్డె పుట్టినా గూడ సరేనే. కొడుకు పుట్టితే ‘భూమన్న’ అనీ, బిడ్డె పుట్టితే ‘భూమక్క’ భూదేవి, భూద అని ఆ భూమమ్మ పేరు మీద పేర్లు పెట్టుకునెటోళ్ళు.

పల్లెటూర్లల్లనే ‘బారెగూడెం’ ‘భట్టిపల్లి’ అటువంటి జాగాలల్లనే భూమమ్మ పీరీ వుండేటిది. కాలేర్లల్ల – వూర్లు పెద్దవి గాబట్టి ఎన్నో పీరీల బంగ్లాలు వుండేటివి. వాట్లల్ల వుండే పీరీలు చిన్న సైజులే. ‘కౌడిపీరీల’ కన్న కొంచెం పెద్దవి. భూమమ్మ కన్న చిన్న పీరీల పేర్లు కూడా పెటుకుంటారు. ఆశన్న, ఊశన్న,ఆశక్క, ఊశక్క.. యిటువంటి పేర్లు.

పీరీలు నీళ్ళ పడే రోజుకు చాలా రోజులు ముందుగానే పీరీలను నిలబెట్టెటోళ్లు, పీరీల బంగ్లలల్ల. పీరీల కన్నిటికి గూడ భారీ సిల్కు బట్టలే. నెలపొడుపు ఆకారపు పీరీల తలలు వెండితో జేసినవి కొన్ని, రాగి, యిత్తడితో చేసినవి కొన్ని వాటికి పూలదండలు, ఊదుపొగలు..

పీరీలను నిలపెడ్తున్నారు అంటే పిల్లగాండ్లకు అందరికి సంబరాలు మొదలు.. డప్పుల, బాజాల చప్పుళ్ళు. ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ, వేడుక జేసేది వసంత మొక్కటే అన్నట్టుగ పిల్లగాండ్లకు పీరీలే ఎక్కువ సంబంరం. పిల్లగాండ్ల పొద్దున మంచాల నుండి లేచిన దగ్గర్నుంచి, రాత్రి నిదుర పోయ్యే వరకు ఈ అన్ని రోజులు పీరీల వెంటనే. పీరీలను నిలబెట్టిన మూడు రోజుల తర్వాత, పీరీలు ‘లేచేటవి’ అప్పట్నించి, వూరు, వాడలు, యిల్లిల్లు తిరిగేటివి. తెల్లారగట్ల లేస్తే తిరిగి రాత్రికి బంగ్లలల్లకు తిరిగి వచ్చేటివి బాజలు, డప్పులు చప్పుల్లతో.

నీళ్ళల్ల పడుటానికి ముందు భూమమ్మ పక్క నున్న పల్లెల్నుంచి కాలేరుకు వచ్చేటిది. కాలేర్ల పాత వాడలల్ల యింటింటికి పొయ్యేటిది. బాజాలు, డప్పులు చప్పుల్లతో భూమమ్మ వస్తున్నదంటే ఆ వాడకట్టోళ్ళు మబ్బులనే లేచేటోళ్ళు. యింటి యిల్లాళ్ళు నిద్రలవున్న పిల్లలను బిర బిరా నిద్ర లేపేటోళ్ళు..

 ‘లేవ్వండి, లెవ్వండి, బిరాన. బూమమ్మ మనింటి కస్తన్నది.’ అని లేపి భూమమ్మ వాకిట్లకు వచ్చి నిలువంగనే కడువల తోటి బిందెలతోటి నీళ్ళు ఎత్తుక వచ్చి భూమమ్మను ఎత్తుకుని నిల్చున్న మనిషి, కాళ్ళకు నీళ్ళారగిచ్చుడు, కాళ్ళు కడుగుడు సుస్వాగతములు పలుక అన్నట్టగ. ఊదు తెచ్చుడు. ఊదు కాలిపోగలెల్ల తుంటే, భూమమ్మ కొఱకు అంతకు ముందే సిద్దం జేసుకున్న ముడుపు పైసలను భూమమ్మ కొంగుకు కట్టేటిసి. నిదురల వున్న చంక పిల్లల్ని భూమమ్మ కొంగు కింద కప్పుడు ఎడ పిల్లల్ల భూమమ్మ కొంగు చాటుకు చేర్చడు.

 ‘అవ్వా, తల్లి, నీ బాంచెను. నా పిల్లగండ్లని సల్లగ జూడాలె’ అని భూమమ్మ కొంగు తోటి ఆళ్ళను దిగదుడ్చుడు. భూమమ్మను ఎత్తుకున్నాయన చేతులతో ఊదుపొసిన విభూతిని నుదుట పూపించుడు పిల్లలకు పెద్దలకు. భూమమ్మకు పొరుదండాలు పెట్టుడు, పిల్లలను పొర్లింపిచ్చుడు పొరుదండాలు పెట్టింపించుడు.

ఏదో కారణంగా భూమమ్మ పల్లెల్నించి కాలేరుకు రావడం లేదని తెలిస్తే, వీళ్ళే పల్లెలకు పోయేవాళ్ళు. బందువుల యిండ్లల్ల దిగేవాళ్ళు. వాళ్ళు వచ్చిన బందువులను యిల్లునింపుకునే వాళ్ళు సంబురంగ.

అగ్గి గుండాల చుట్టూ ఎగురుడు, అగ్గిగుండాల్నించి నడ్చుడు.. పులి వేశాలు..

‘సవారి’ వచ్చినాయన సోయిల లేకుండ నిగ్గదన్ని పడిపోతూంటే, పడకుండ అందరూ పట్టుకునుడు బలవంతంగా.. సవారీ వచ్చినాన అందరికీ దేవుడే. ఆయనకు మొక్కేవాళ్ళు. ఈ రోజుల్లోనే గాదు, ఎప్పటికి గూడ అందరూ ఆయనను గౌరవించేవాళ్ళు. అతను గూడ అందర్లో మర్యాదగ మెసులుకునే వాడు..

సవారి వచ్చినాయనతో అరచేతి చరుపులు తినే వాళ్ళు జనాలు. దేవుని చేత చరుపులు తిన్నందుకు మస్తు ఖుషీ.

మంది ఎంత ఆపుతున్నా గూడా సవారి వచ్చినాయన నిగ్గదన్నుల్లతో ఈడిగిల్ల పడ్తుండడంతో కింద భూమికి ఆనడం వల్ల మోకళ్ళు, మోచేతులు కొట్టుకు పోయేటివి. దేవుని పూనకం దిగిపోయిం తర్వాత ఆ మనిషి శరీరం నొప్పులతో రోజులకు రోజులు లేవలేనంత మంచాల పడేవాడు. మొసకొట్టడు.

జనాలు మొక్కుకునే వాళ్ళు – భూమమ్మ దయవలన పిల్లవాడు పుడితే, చల్లగ వుంటే పిల్లవాడికి తొమ్మదేండ్ల వయసు వచ్చేవరకు ఫకీర్‌ను చేస్తాం అని. అనుకున్నట్లుగానే చేసే వాళ్లు. ఫకీర్లను జేసే పిల్లలను కొత్త బట్టలు కుట్టించి, ఎర్రరంగు దారం దండలు జందెం లాగ వేసి మలీద ఉండలు జేసి పీరీలు నిలవడిన రోజు నుండి నీళ్ళల్లో పడే రోజు వరకు రోజూ ఈ ఫకీర్లయిన పిల్లల్ని పీరీల బంగ్లలకు తీసుకు పోవడం, అక్కడ ‘మలీద’ పెట్టి, పైసలు పెట్టి, ఊదుపొగవేయించి, ఆ విభూతిని పిల్లల నుదుట పూయించేవాళ్ళు. ఆ తర్వాత ఆ పిల్లలతో వాడల ‘ఐదు’ యిండళ్ళ ‘భిక్షం’ ఎత్తుకొపించుడు. ఆ బిచ్చెం ఎత్తిన గింజలతో వాళ్ళకు వంట,తిండి. వాళ్ళు ఫకీర్లుగ వున్న ఈ అన్ని రోజులు మంచాలను తాకరాదు. నేల మీద పడుకోవాలె, ఫకీర్లు ఆయిన ఆ పిల్లలందరికి సంబరం. కొత్త బట్టలు, మలీదలు, పీరీల బంగ్లలు, బిక్షమెత్తుడు. ఈ ఫకీర్లు అంటే వాడకట్టోళ్ళకు దేమళ్ళ వంటి వాళ్ళు. వాళ్ళకు భిక్షం వేసుడంటే దేవుని వరం పొందినంత విలువ – మామూలు ఫకీర్లు ‘సందకమలం’ కొఱకు వస్తే అప్పుడప్పుడు ‘మాఫ్‌కర్‌నా’ అని తిప్పిపంపేవాళ్ళు గానీ, ఈ ఫకీర్లకు తప్పుకుండ భిక్షం వేసేవాళ్ళు.

పీర్లు నీళ్ళళ్ళ పడే రోజు దగ్గెరి చుట్టు పల్లెల పీరీలు, కాలేర్ల అన్ని దిక్కుల పీర్లు కాలేరు నడి బజారుకు వచ్చి జమ అయ్యేవి. అన్నీ చేరేటప్పటికి మలి సంధ్య చీకట్లు కమ్మేవి. అప్పుడు ముస్లింలు అంగీలు లేని వీపుల మీద కొరడాలతో నెత్తరు కారేటంతగా వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటూ, శోకాలు పెట్టుకుంటూ సాగుతూంటే వాళ్ళ వెంట హిందువులు కూడా పోయేవాళ్ళు.

అక్కడ వాళ్ళు పీరీలను నీళ్ళళ్ళ వేసింతర్వాత యిక్కడ యిండ్లల్లో ఫకీర్లయిన పిల్లల, అందరు గూడా స్నానాలు ఆచరించే వాళ్ళు – రాత్రి పూట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here