Site icon Sanchika

మన ఉగాది

[2024 క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘మన ఉగాది’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]క[/dropcap]మ్మని మావిచిగుళ్ళు తింటూ
కోయిలమ్మలు ‘కుహు..కుహూ..’
అంటూ రాగాలు ఆలపించే శుభసమయం..
వసంత రుతువు ఆగమనంతో
ప్రకృతి అంతా
మురిసే సంతోష సంబరాల పరిచయం..
ఉగాది పండుగ ప్రత్యేకం!
వేదాలను హరించిన సోమకుని వధించి
శ్రీమహావిష్ణువు బ్రహ్మకి అప్పగించిన శుభతరుణం..
బ్రహ్మ సృష్టిని ఆరంభించిన సందర్భం..
శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి రోజున
పట్టాభిషిక్తుడై శాలివాహన యుగకర్తగా వర్థిల్లిన
స్వర్ణయుగ స్థాపక ధీరుడిగా కీర్తినందుకున్న కాలసూచికగా ..
ఉగాదిని జరుపుకుంటున్నాము!
షడ్రుచులు..
తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరుల సమ్మేళనం ఉగాది పచ్చడి
జీవితం లోని విభిన్న పార్శాలకు సంకేతమై నిలుస్తుంది!
పిల్లాపాపలు పెద్దలంతా సంప్రదాయ వస్రాలను ధరించి
ఆలయాలను సందర్శిస్తుంటే..
పంచాంగ శ్రవణాలు..
వేదపండితుల ఆశీర్వచనాల దివ్యాశీస్సులతో..
ఉగాది పండుగ తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తుంది!

Exit mobile version