Site icon Sanchika

మన ఉగాది!

[dropcap]తొ[/dropcap]లిపొద్దు సూర్య కిరణాలు జగతిని మేలుకొలుపుతుండగా..
తెలుగు వాకిళ్ళు లేత మావిడాకులతో అలంకరించుకుంటుండగా..
జగతికి సంతోష సంబరాలను అందించడానికి.. ఉగాది,
చైత్ర శుద్ద పాడ్యమితో ప్రారంభమవుతుంది!
వసంతాగమనంతో ప్రకృతి పులకరిస్తుంటుంది !
కొత్తగా చిగురించిన మావిచిగురులు తింటూ కొమ్మలమాటున దాగిన ..
కోయిలమ్మలు శ్రావ్యంగా రాగాలెన్నో ఆలపిస్తుంటే
వింటున్న హృదయం ఆనందపరవశం అవుతుంది!
ఉగాది అంటే.. నూతనత్వం !
ఉగాది అంటే.. చైతన్యం!
ఉగాది అంటే.. తెలుగు వారి ప్రియమైన పండుగ!
జీవితం లోని విభిన్న పార్శ్యాలను పరిచయం చేస్తున్నట్లుగా ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమై..
తెలుగు లోగిళ్ళలో ప్రసాదమై.. పంచబడుతుంది!
సాయంత్ర వేళ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ..
పురుషులు చక్కని పంచెకట్టులతో.. స్త్రీలు పట్టుచీరల అందాలతో .. ఆలయాలకి వస్తారు!
పంచాంగ శ్రవణాలతో గుళ్ళు కొత్త సందళ్ళను సంతరించుకొనగా ..
తెలుగువారంతా ఆధ్యాత్మిక, హాయైన వాతావరణంలో .. కలుసుకుంటారు!
చెదరని చిరునవ్వులు, చెక్కుచెదరని ఆత్మవిస్వాసం, ప్రతిభ, పౌరుష ప్రతీకారాలకు.. తెలుగు వారు పెట్టింది పేరు!
మమతానురాగాలే ఐశ్వర్యాలుగా గల తెలుగువారి పండుగ.. ఉగాది!
మనందరి పండుగ ఉగాది!
స్నేహ సౌరభాలతో వర్ధిల్లే ఈ నేల ‘ఉగాది వెలుగు’ల కవిసమ్మేళనాలతో పరవశిస్తుంటుంది!
తెలుగు… తరగని వెలుగై అవనిలో “అమృత భాషై” వికసిస్తుంటుంది!

Exit mobile version