Site icon Sanchika

మనదేశంలో టీకాల చరిత్ర: ఒక పరిచయం

[dropcap]ప్ర[/dropcap]స్తుత పరిస్థితుల్లో మనలో చాలామంది ఆలోచనల్లో, ఆశల్లో ఒక భాగమైన పదం “టీకా”. టీకా ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో వచ్చింది, ఎడ్వర్డ్ జెన్నర్ పద్దెనిమిదో శతాబ్దం చివర్లో మశూచికి కనిపెట్టిన టీకానే మొదటి టీకా.  మరి అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అన్న ప్రశ్న కొందరికైనా కలిగే ఉంటుంది. కొన్ని వారాల క్రితం నేను కోవిడ్ దెబ్బకి అతలాకుతలం అవుతున్న ప్రపంచాన్ని చూస్తూ ఇదే ప్రశ్న వేసుకున్నాను. సరే, కాసేపు అంతర్జాలంలో వెదుకుదాం, మనకి అర్థమయ్యే స్థాయికి ఏదో ఒకటి కనబడకపోదు అనుకుని చూస్తూంటే తర్వాత భారతదేశంలో‌ టీకాల చరిత్ర అని ఒక పరిశోధన పత్రం కనబడింది. ఇక తరువాత అలా అలా ఇతరులతో సంభాషణ వల్ల కొన్ని పుస్తకాల గురించి తెలిశాయి. వీటిని చదివాక నాకర్థమైన సారాంశం   రాసుకుందామనిపించి ఈ వ్యాసం రాస్తున్నాను.

ప్రపంచంలో టీకాల చరిత్ర మశూచి (small pox) టీకాతో మొదలైంది అని చెప్పవచ్చేమో. మశూచిని గురించి ప్రాచీన భారత దేశంలో అవగాహన ఉంది. ఈ రోగం మూడువేళ్ళ ఏళ్ళ క్రితం భారతదేశం లేదా ఈజిప్టులో మొదలైందని ఒక అంచనా. శాస్త్ర చరిత్ర రచనకు పితామహుడిగా భావించే తూసిడైడిస్ అన్న గ్రీకు పరిశోధకుడు 430 BC లోనే ఒకసారి మశూచి వచ్చిన వారికి ఇక జీవితంలో అది మళ్ళీ రాదన్న పరిశీలన చేశాడు. ఒక సారి మశూచి వచ్చి బతికిన వారిని అప్పట్లో ఆ వ్యాధి వచ్చిన వారి సేవలకి నియమించేవారట. అబు బక్ర్ అన్న ఫారసీ వైద్యుడు కూడా 910 ADలో ఈ విషయాన్ని నిర్థారించాడు. ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి? అన్న ఆలోచనలూ, పరిశోధనలూ అప్పటి శాస్త్ర జ్ఞానం పరిధిలో అప్పటి వారు కూడా చేశారు. 1000 AD నాటికే చైనా లో ఈ వ్యాధికి ఒక టీకా పద్ధతి ఉండేదని అంటారు. ఇదే సమయంలో భారతదేశం, టర్కీ, ఆఫ్రికా వంటి చోట్ల కూడా వివిధ టీకా పద్ధతులు ఉండేవని అంటారు. ఇవన్నీ ఇదివరకే ఆ వ్యాధి వచ్చిన వాళ్ళ శరీరం పై వచ్చిన పొక్కుల నుండి చీము తీసి ఇతరులలోకి దాన్ని ప్రవేశపెట్టడం మీద ఆధారపడేవి. ఈ విధంగా చేసి తక్కువ తీవ్రతతో మశూచిని తెప్పించేవారన్నమాట. దీనివల్ల మరణాలు, తీవ్రంగా వ్యాధి రావడం తగ్గేవని అంటారు. అయితే, అసలు సరిగ్గా ఎక్కడ ఎప్పుడు మొదలైంది? అసలు పద్ధతి వివరాలు ఏమిటి? అన్న విషయమై మాత్రం చరిత్రకారులకి ఒక ఏకాభిప్రాయం ఉన్నట్లు లేదు. చైనా లేదా భారతదేశంలో మొదలయి ఉండొచ్చని రెండు బలమైన వాదనలు ఉన్నా, ఖచ్చితంగా శాస్త్రవేత్తలు/చరిత్రకారులు ఏదీ తేల్చి చెప్పలేదు ఇప్పటివరకూ. అన్ని వందల సంవత్సరాల క్రితం నాటి విషయాల గురించి మనకి తెల్సిన వివరాలు తక్కువ కనుక, కొంచెం ముందుకొచ్చి ఎంతో కొంత తెలిసిన చరిత్ర వైపు చూడాలసిందే.

పద్దెనిమిదో శతాబ్దంలో భారతదేశంలో టీకాదార్లుగా పిలవబడే వారి గురించి బ్రిటీషు వాళ్ళు కొంత వివరంగా రాశారు. వీళ్ళు ఇప్పటి బెంగాల్ ప్రాంతంలో సంచారులై తిరుగుతూ మశూచి టీకాలు ఇచ్చేవారట. ఇందాక రాసినట్లు వీళ్ళ పద్ధతి వాళ్ళ వద్ద నున్న మశూచి కారక పదర్థాన్ని అప్పటికి మశూచి లేనివారిలోకి ఎక్కించడం పైన ఆధారపడేది. అయితే ఎలా ఎక్కించాలి? ఎంత ఎక్కించాలి? ఎక్కిస్తున్నపుడు ఏం చేయాలి? అసలు ఈ వ్యాధి కారక పదార్థాన్ని ఎలా సేకరించాలి? ఎలా భద్రపరచాలి? – ఇదంతా వారికి తరతరాలుగా వస్తున్న పద్ధతిలో సాగేదట. ఇది వందల సంవత్సరాలనాటిదని వారి నమ్మకం. ఈ టీకాదారులలో రెండు మూడు కులాల వారు కనబడేవారట – ఎవరి పద్ధతి వారిది, ఎవరి మూల గ్రంథాలు వారివి .  ఈ పద్ధతి భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉండేదనీ, సర్వవ్యాప్తంగా లేదనీ చరిత్రకారుల అభిప్రాయం.

ఇలాంటి పద్ధతులే పర్షియా, టర్కీ వంటి దేశాల మీదుగా ఐరోపా ఖండాన్ని, బ్రిటీషు వారినీ చేరాయి. వీటిని కాస్త మెరుగు పరుస్తూ డేనియల్ సట్టన్ అనే ఆంగ్లేయుడు రూపొందించిన టీకా పద్ధతి అప్పట్లో చాలా పేరు పొందింది. అదొక పెద్ద వ్యాపారంలా franchise పద్ధతిలో దేశదేశాలకూ వ్యాపించింది. ఆ రోజుల్లో గోమశూచి (ఆవులకి వచ్చే మశూచి వంటి రోగం) ఆవులతో నిరంతరం పనిచేసే వారికి కూడా వస్తుందనీ, అది వస్తే మశూచి రాదని నమ్మేవారు. ఈ గోమశూచి మాములు మశూచి అంత భయంకరమైన వ్యాధి కాదు. మరి అప్పట్లో చెలామణీలో ఉన్న పద్ధతిలోనే గోమశూచి పదార్థాన్ని మనిషి నుండి మనిషికి ఎక్కిస్తే మశూచి రాకుండా నివారించొచ్చా? అన్న ప్రశ్న ఉదయించింది ఇంగ్లండులోనే ఎడ్వర్డ్ జెన్నర్ అన్న వైద్యుడికి. వెంటనే ఆయనకి అందుబాటులో ఉన్న పేషంట్ల మీద ప్రయోగం చేసి ఇది నిజమేనని నిర్థారించాడు 1796లో (అసలు ఇలా మనుషుల మీద ప్రయోగాలు ఇపుడు ఇంత తేలిగ్గా చేయనిస్తారా? అన్నది నాకు పెద్ద సందేహం!).

ఇక అప్పట్నుంచి క్రమంగా ఈ టీకా పద్ధతి ప్రాచుర్యం పొందుతూ పాత పద్ధతి ఇంగ్లండులో క్రమంగా మరుగున పడింది. కొంతకాలానికే పాత టీకా పద్ధతిని బ్రిటీషు ప్రభుత్వం నిషేధించింది. దీనికి కొన్ని కారణాలున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైనది – ఈ పాత పద్ధతిలో పుచ్చుకునే టీకాల వల్ల ఏదో ఒక తీవ్రతతో వ్యాధి వస్తుంది కనుక ఆ వ్యక్తి దాన్ని ఇతరులకి అంటించకుండా జాగ్రత్త పడడం తప్పనిసరి. ఆధునిక టీకాతో ఇలాంటి ప్రమాదం లేదు అని ఆలోచించి భారతదేశంలో కూడా ఈ కొత్త టీకాని ప్రవేశపెట్టి పాత పద్ధతిపై నిషేధం విధించారు. దీనికి స్థానికంగా కొంత వ్యతిరేకత ఎదురైనా, చివరకి ఈ ఆధునిక పద్ధతి పాత పద్ధతి కంటే శ్రేయస్కరం అని క్రమంగా టీకాదారులు, ప్రజలూ కూడా నమ్మడంతో పందొమ్మిదో‌ శతాబ్దంలో ఆ సంప్రదాయ పద్ధతి క్రమంగా అలా మరుగున పడిపోయింది. కాలక్రమంలో ఈ కొత్త టీకా తయారీలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక అక్కడ నుండి ప్రపంచంలో శాస్త్రాభివృద్ధితో పాటు నెమ్మదిగా రకరకాల వ్యాధులకి టీకాలు కనిపెట్టడం మొదలయ్యింది. మామూలుగా ఓ వ్యాధికి టీకా అంటే కొన్నేళ్ళ పరిశోధనలు జరుగుతాయి కానీ, కోవిడ్ విషయంలో శరవేగంతో ముందుకు కదిలి ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో వివిధ సంస్థల టీకాలు అందుబాటులో ఉండే స్థాయికి మనం చేరుకున్నాము .

మళ్ళీ మన దేశం విషయానికి వస్తే, 1802 లో ముంబయిలో ఓ మూడేళ్ళ బాలికకి మన దేశంలో మొదటి జెన్నర్ టీకా వేశారు మశూచి నివారణకు. ఈ టీకా మొదట్లో “arm to arm transmission” పద్ధతిలో వేసేవారట! అంటే ఒకళ్ళకి వేశాక వాళ్ళ శరీరం నుండి రసిక (lymph) తీసి ఇంకోళ్ళకి వేసేవారట. ఇలా మానవ హారంలా భారతదేశంలో ఈ మొదటి టీకా ముంబయి నుండి మద్రాసు, హైదరాబాదు ఇలా వివిధ ప్రాంతాలు చేరిందట. ఇపుడు వింటే ఆశ్చర్యంగా ఉంది ఈ విషయం – అసలు ఇదంతా ఎలా నిర్వహించేవారో అని. శిక్షణ పొందిన కొత్త టీకాదారులు గతంలో లాగానే ఊరూరూ తిరిగి సంచార క్లినిక్ లలో టీకాలు వేస్తూ తిరిగేవారు. పందొమ్మిదో‌శతాబ్దం చివరికి వచ్చేసరికి ఈ పద్ధతిలో టీకా ఇవ్వడంలో కొన్ని ప్రమాదాలున్నాయని… ఇతర వ్యాధులేవన్నా మనిషి నుండి మనిషికి వ్యాపించవచ్చని గ్రహించి బ్రిటీషు ప్రభుత్వం దీన్ని నిషేధించింది. అప్పటికే ప్రత్యామ్నాయ పద్ధతులు (ఇప్పటి లాగా ఇంజక్షన్ ఇవ్వడం వంటివి) వచ్చాయి.

మొదట్లో ఈ‌ టీకాలని బ్రిటన్ నుండి దిగుమతి చేసుకున్నా, పంతొమ్మిదో‌ శతాబ్దం చివరికొచ్చేసరికి కొంతవరకూ స్థానికంగా తయారు చేయడం, భద్రపరచడం గురించి పరిశోధన మొదలైంది. 1896లో భారతదేశంలో వ్యాపించిన ప్లేగు మహమ్మారిని ఎదుర్కోడానికి వ్లాదిమిర్ హాఫ్కిన్ తయారు చేసిన టీకా భారతదేశంలోనే తయారైన మొదటి టీకా. ఆయన ల్యాబ్ ఇప్పటికీ ముంబయిలో హాఫ్కిన్ ఇంస్టిటూట్ పేరిట నిలిచి ఉంది. ఇరవయ్యవ శతాబ్దం నాటికి ఇక భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో టీకాల గురించి పరిశోధనలు చేసే సంస్థలు మొదలయ్యాయి. మశూచితో పాటు కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులకి కూడా టీకాలు వచ్చాయి. అలాగే ఒక్కోచోట టీకా ఇవ్వడంలో లోపాల వల్ల జరిగిన ప్రమాదాల గురించి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితుల వల్ల ఈ పరిశోధనలు రకరకాల అంతరాయాలతో సాగినా, స్వాతంత్రం వచ్చాక నెమ్మదిగా కుదురుకుని మశూచి, క్షయ ఇలా వివిధ వ్యాధులకి అందరికీ టీకా వేసే కార్యక్రమాలు జాతీయ స్థాయిలో మొదలయ్యాయి. ఇరవయ్యవ శతాబ్దం పొడుగుతా వివిధ వ్యాధులకీ టీకాలు అందుబాటులోకి రావడం, ఉద్యమ స్థాయిలో ప్రభుత్వం నిర్వహించిన టీకా కార్యక్రమాలూ కొనసాగాయి. అలాగే క్రమంగా పిల్లలు పుట్టగానే మొదటి కొన్నేళ్ళలోనే కొన్ని టీకాలు వేసుకోడం అందరికీ తప్పనిసరి అయ్యింది. ఉదాహరణకి పోలియా నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో గురించి కార్యక్రమం మనలో కొంచెం వయసులో చిన్నవాళ్ళకి కూడా తెలిసినదే!

ఇటీవలే వచ్చిన “Shitala: How India enabled vaccination” అన్న పుస్తకంలో ఓ ఆసక్తికరమైన వివరం ఉంది: ఒక దశలో భారత ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ నేపథ్యంలో సాగిన మశూచి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒక వినూత్నమైన ప్రచారం చేపట్టిందంట. మశూచి క్రమంగా తగ్గిపోతున్న కాలంలో రేడియో, పత్రికలో, వీథుల్లో పోస్టర్లూ ఇలా వేసి కొత్త మశూచి కేసుల గురించి వివరాలు చెప్పిన వారికి బహుమానం ప్రకటించిందట. మశూచి కేసులు తగ్గేకొద్దీ ఈ బహుమానం వెల పెరిగేదట. ఇలా సాగి 1977 నాటికి మశూచి భారతదేశం నుండి పూర్తిగా నిర్మూలించారని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఇపుడు దేశంలో ఎన్నో ప్రభుత్వ/ప్రైవేటు ఫార్మా కంపెనీలు టీకా పరిశోధనలు, తయారీలో నైపుణ్యం కలిగి ఉన్నాయి. ప్రపంచంలో దొరికే చాలా టీకాలు భారతదేశంలో కూడా లభ్యమవుతున్నాయి. తాజాగా కోవిడ్‌కి కూడా స్థానికంగా తయారైన టీకాలని అంతా తీసుకుంటున్నారు! అయితే కోట్ల కొద్దీ ఉన్న జనాభా అందరినీ చేరడం, ఇదంతా సరిగా డాక్యుమెంట్ చెయ్యడం, కొత్త పరిశోధనలు చేస్తూ, కొత్త వ్యాధులని ఎదుర్కోవడం, ఈ శాస్త్ర రంగంలో నైపుణ్యం కోసం మన జనాభాకి తగినట్లు శిక్షణ వనరులు పెంచడం – ఇలా ఇంకా సాధించాల్సినది ఎంతో ఉంది!

ఈ వ్యాసం ప్రధానంగా నేను చదివినవి నాకు అర్థం అయినంతలో సారాంశం రాసుకోడానికి రాశాను. అయితే, ఇతరులకి కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇలా బహిరంగంగా పంచుకుంటున్నాను. నాకు సైన్స్ నేపథ్యం లేదు కానీ నా వృత్తి, పరిశోధన అంతా శాస్త్ర సాంకేతిక రంగాలలోనే .  ఏదైనా నేను తప్పుగా అర్థం చేసుకుని ఉంటే వ్యాఖ్య ద్వారా తెలియజేస్తే సరిదిద్దుకుంటాను. ఇక చివరగా నా కోరిక ఏమిటంటే – వ్యాక్సిన్‌ల గురించి, భారతదేశంలో ఆధునిక వ్యాక్సిన్‌లు రాకముందు చేయబడ్డ ప్రక్రియల గురించి, కొంచెం మాములు మనుషులకి అర్థమయ్యే భాషలో తెలుగులో ఏవన్నా వ్యాసాలో, పుస్తకమో వస్తే బాగుంటుంది. టీకాల విషయమై అందరికీ కొంత చరిత్ర తెలియాలి, కొన్ని అపోహలు తొలగాలి. అందుకు ఈ చిన్ని వ్యాసం అమాత్రం దోహదం చేసినా ధన్యోస్మి!!!!

***

ఉపయుక్త వ్యాసాలు/పుస్తకాలు:

  1. Lahariya, Chandrakant. “A brief history of vaccines & vaccination in India.” The Indian journal of medical research 139.4 (2014): 491. (పరిశోధనాపత్రం. ఉచితంగా చదూకోవచ్చు)
  2. History of Vaccines website (ఉచితం)
  3. Dharampal. Indian science and technology in the 18th century (పుస్తకం. పీడీఎఫ్ ఉచితంగానే లభ్యం).
  4. Boylston, Arthur. “The origins of inoculation.” Journal of the Royal Society of Medicine 105.7 (2012): 309-313. (పరిశోధనాపత్రం, ఉచితంగా చదవొచ్చు)
  5. Riedel, Stefan. “Edward Jenner and the history of smallpox and vaccination.” Baylor University Medical Center Proceedings. Vol. 18. No. 1. Taylor & Francis, 2005. (పరిశోధనాపత్రం, ఉచితంగా చదవొచ్చు)
  6. Mitra Desai. “Shitala: How India Enabled Vaccination.”. Thorpe Bowker publishers. 2021. (పుస్తకం. అమేజాన్ లో కొనుగోలుకి ఉంది .)
  7. Gavin Weightman. “The Great Inoculator: The Untold Story of Daniel Sutton and his Medical Revolution”. Yale University Press. 2020 (పుస్తకం. అమేజాన్ లో కొనుగోలుకి లభ్యం – బానే ఆసక్తికరంగా చదివించేలా ఉంది. ఇందులో అసలు ఇండియా/చైనా ప్రస్తావన కనబడలేదు.)

Exit mobile version