[స్వాతీ శ్రీపాద గారు రచించిన ‘మనకు మిగిలేది’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]సౌం[/dropcap]దర్య సీమలను కాచివడబోసినట్టు
మేఘాలను తొక్కిపట్టి
చుక్కలు పొదిగిన నీలి ఆకాశంతో
సరాగాలాడే రాత్రిలా
ఆమె వయ్యారపు నడక.
పొగలు మూగిన చీకటీ
తళుక్కున వెలిగే చెక్కిళ్ళ మెరుపూ
ఆమె అరవాలిన కళ్ళలో వాలి
అంతలోనే కొనగోటి చివర చేరి
లావణ్యంగా సవరించే కుసుమ కోమల
పెదవి విరుపు.
ఒక్కింత ఎక్కువైనా లేశమంత తరిగినా
అసూర్యంపశ్య అందాల సీమలు
ఏ సముద్ర గర్భానికో,
చెరిగిన కాటుక నీడల్లోకో పాదరసపు సర్పమై
చటుక్కున జారిపోదూ.
అందలాలెక్కి ఊరేగుతున్న ఆలోచనలు
రేపు ఉదయానికి దిగంతాల అంచుల్లోకో
దిగదుడిచి నీళ్ళలో పారేసిన ఉప్పు సముద్రానికో
స్వప్నాలు మాత్రం ఎక్కడా రాజీ పడవు.
విజయ విహారమో, పలాయనమో
పెద్ద ఫరకేం పడదు.
ఎవరు గెలిస్తేనేం
అవే ఊడిగపు భవిష్యత్తులు
ఎవరు మెరిస్తేనేం
అదే కష్ట సుఖాల జాతర
రాజకీయపు మాయామోహిని
ఎన్ని రంగులు ఒలకబోస్తేనేం
మనకు మాత్రం వెలుగు తిరగేస్తే చీకటే.