మనం నేర్పితే కదా!

0
2

[dropcap]ఏ[/dropcap]దో పని మీద అలా పెద్ద రోడ్డు దాకా పెడుతున్నాను. శివరాం గారు ఇంటికి సున్నాలు వేస్తున్నారు. భానుమతి గారు అక్కడే ఉంది.

“సున్నాలు వేయిస్తున్నారు. ఏదైనా విశేషమా”

“ఆఁ! విశేషమే. మా అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు. కుదిరితే రమ్మన్నాడు”

“ఎప్పుడు”

“వచ్చే సోమవారం”

“సోమవారం పెళ్లేమిటి?”

“ఏమో! వాళ్లు చేసుకుంటారట.”

ఓ నవ్వు నవ్వి నా దారిన నేను వెడుతున్నాను కానీ నా మనసంతా బరువెక్కింది.

***

మేము ఇల్లు కట్టుకుని ఈ వాడకట్టుకి వచ్చేసరికే శివరాం గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ల పిల్లలు హైస్కూల్లో చదువుతుండేవాళ్ళు. వాళ్ళ మాటలును బట్టి వాళ్ళ పిల్లలు బాగా చదువుతారని తెలిసేది. కానీ శివరాం దంపతుల మాటలు, పద్ధతులు నాకు కొంత వింతగా తోచేవి. తెలుగు ఎందుకు పనికిరాదు అన్నట్టు, వాళ్ల పిల్లలు గొప్ప చదువులు చదివి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తారని, అక్కడ ఉండని తెలుగుని ఇక్కడ కూడా నేర్చుకోనక్కర్లేదు అన్నట్టు మాట్లాడేవారు. ఎంతసేపు ర్యాంకులు, మార్కుల గొడవ, గొప్పలే. పండగ, పెళ్లి, వేడుక, విందు, వినోదం లాంటివి ఆ పిల్లలు ఎఱగరు. కానీ మార్కులు, ర్యాంకులు కావాలనుకున్నవి సాధించేవారు. భానుమతి గారు వచ్చీరాని ఇంగ్లీషు తప్పులు తడకలు మాట్లాడేది కానీ శుభ్రమైన తెలుగు పిల్లలతో ఎప్పుడు మాట్లాడేది కాదు. శివరాం గారు సరే సరి. తెలుగు మాట్లాడడం పాపం అన్నట్టుగా ఉండేవారు. కాలంతో పాటు వాళ్లూ పరుగులు పెట్టి పేరుమోసిన కళాశాలలో చదివి, ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించారు. విన్నవారందరూ కళ్ళు, నొసలు ఎగరేసి, ఆశ్చర్యపోయి అభినందించేంత పెద్ద జీతాలు సాధించారు. కొన్నాళ్ళు సందడిగానే ఉండేవారు. తరువాత్తరువాత ‘ఏమి ఉద్యోగాలో ఏమిటో’ అంటుండేవారు. పెళ్లి సంబంధాలకు ఆడపిల్లల తల్లిదండ్రులు బాగానే వచ్చేవారు. కొన్ని వీళ్లకు నచ్చేవికావు. తర్వాత అబ్బాయి నచ్చలేదు అనేవాడుట. మీకు ఎలాంటి కోడలు కావాలి అని అడిగితే ఒక పెద్ద కోరికల జాబితా చెప్పేది. ఆ జాబితాలో ఎక్కడ ‘మన’కు సంబంధించిన ఊసులసలుండేవి కాదు. ఇంతలో కొడుకు నేను పెళ్లి చేసుకుంటున్నానని సమాచారమిచ్చారు. ఇప్పుడు వధువు పరిచయ కార్యక్రమానికి పిలిచారు. వెళ్ళాము. వాళ్లకి బాగా కావాల్సిన వాళ్ళు కొద్ది మంది మాత్రమే కనపడ్డారక్కడ. ఇంతలో ఎదురు మెమ్మేడలో (అపార్ట్మెంట్) ఉండే శేషు గారు నా పక్కన వచ్చి కూర్చున్నారు.

***

“ఎప్పుడొచ్చారు? మీరు ఇంకా వచ్చే నెలలో వస్తారనుకున్నాను.”

“మీకు అలానే చెప్పాను. ఉండలేక వచ్చేశాను.”

“అదేమి? మనుమలు ఉన్నారుగా కాలక్షేపానికి”

 “ఏం మనవలు! వాళ్ళేమన్నా మన మాట మాట్లాడతారా?”

 “తెలుగు రాదా”

“మా అమ్మాయి నేర్పితే కదా! కాంతికి రాయడం కాదు. ఏదో కూడుకుని సినిమా పేర్లు అవీ చదువుతుంది. అంతే.”

 “పిల్లలకి మాట్లాడడం నేర్పలేదా?”

“వాళ్ళు అరవ్వాళ్ళు కదా! తమిళంలోనే మాట్లాడుకుంటారు. నన్ను కూడా తమిళం నేర్చుకోమంటున్నారు. మా వియ్యపురాలు, అల్లుడు అయితే తెలుగు మాట్లాడితే అస్సలు ఒప్పుకోరు.”

“వాళ్ల భాషాభిమానం అలాంటిది. మనం మన పిల్లలకి మన అనేవి ఏమీ నేర్పుకోము.”

“మనుమలు అమ్మమ్మ అమ్మమ్మ అంటూ నా చుట్టూ చేరతారు అనుకున్నా. కానీ ఆ పిలుపే కరువయ్యింది. ఎలా ఉందీ గౌను చెప్పండి” అని నిట్టూరుస్తూ చేతిలోని కవరు లోంచి ఒక గౌన్ తీసి చూపించారు శేషు గారు.

“మనవరాలికా?”

“కాదు. పనిమనిషి కూతురికి. సంవత్సరం పిల్ల. ఎప్పుడైనా వాళ్ళ అమ్మతో వస్తే మామ్మ మామ్మ అంటుంది. ముద్దుగా ఉంటుంది. దానికి కొన్నాను.” అంటూ ఇంకా ఏవో ఆ పిల్ల ముచ్చట్లు చెప్పారు.

బారసాల నాడు బియ్యంలో పేరు రాయడానికి తప్ప తెలుగెందుకు పనికొస్తుందని నవ్వేది శేషు గారు. ఇప్పుడు ఆ తెలుగు మాట వినపడట్లేదని కొడుకుని, కూతురుని కాదనుకుని తెలుగు వినపడే చోట ఒంటరిగా ఉండటానికి సిద్ధపడుతున్నారు. ఇంతలో నా దృష్టి వేదిక మీదకు మళ్ళింది. భానుమతిగారిని గమనించాను. ఈవిడకి వచ్చిన ఇంగ్లీషు కోడలితో మాట్లాడటానికి సరిపోదు. కోడలికి తెలుగు నేర్చుకోవలసిన అవసరం లేదు. కొడుకుతో చెబితే కొడుకు కోడలికి చెబుతున్నాడు. నాకెందుకో జాలి వేసింది. డబ్బు, హోదా, సంపాదన, చదువు ఇవన్నీ అవసరాలు తీర్చి, సౌకర్యాలను కల్పించి, విలాసాలను అందుబాటులోకి తెస్తాయి కాని మనసుని నింపలేవు. ‘మన’ అన్నది మాత్రమే మనసుకు తృప్తినిస్తుంది.

ఇంతలో భానుమతి గారు మా దగ్గరకు వచ్చారు

“మీ అబ్బాయి పెళ్లెప్పుడు?” అంటూ శేషు గారిని అడిగారు

“ఏ పిల్లని చూపించినా నచ్చలేదంటున్నాడు.”

“అంటున్నాడా” అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు భానుమతి గారు.

కొన్నాళ్ళు గడిచాయి. శివరాం దంపతులు ఇంటి సావిట్లో సీతారామ కళ్యాణం జరిపించి, ఆ వాడకట్టు వారందరికీ డాబా మీద భోజనాలు పెట్టారు. అందరితో ఆదరంగా మాట్లాడుతూ అసలు సిసలైన తెలుగు భోజనం అంటూ దగ్గరుండి వడ్డన చూసుకున్నారు.

“మీ కొడుకు కోడలు రాలేదా?” ఎవరో అడిగారు.

“రాలేదు “

“మీరు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళారా?”

“రమ్మంటాడు. వచ్చి అమ్మాయికి వంట నేర్పమంటాడు. ఉప్మా చేయడం కూడా రాదు. పెళ్లి చేసుకునేటప్పుడేమో మార్కులు, ర్యాంకులు, సంపాదన, కాలేజీలు ఇవి చూసి చేసుకుంటారు. పెళ్లయ్యాక అమ్మానాన్న బాధ్యతగా అన్నీ నేర్పాలంటున్నాడు.”

“వండి పెట్టటానికి రమ్మంటున్నాడన్నమాట”

“అంతే! ఆ పిల్ల వాళ్ళ వంటలు వండుతుంది. వాళ్ళ ఆచారాలనే పాటిస్తుంది. అమ్మను అడుగు అంటే నెట్లో చూసి మీది మాది ఒకటే అని వాళ్ళ పద్ధతిలో చేసేస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ పెద్దల మాట వింటుంది. మన వాళ్ళు మన మాట వినరు” వాపోయింది గుండె బరువు దించుకున్నాను భానుమతిగారు.

వెళ్లేటప్పుడు అందరికీ శతక పద్యాల పుస్తకాలు ఇస్తూ ‘మాకు మీరు మీకు మేము’ అంటూ ఉంటే నాకెందుకు మనసు చివుక్కుమంది. అది నాకొక హెచ్చరికగా అనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here