మనం

1
3

[dropcap]“ఏ[/dropcap]విటి మూర్తిగారూ – మీ రిటైర్మెంటుకు ఇంకా ఆరునెలలుండగానే ఏవిటీ హడావుడీ – అప్పుడే సామాన్లు సర్దడం, లారీలకు ఎక్కించడం – ఎందుకా తొందరా?” ఆశ్చర్యంతో నాకు ముప్పయ్యేళ్లుగా పరిచయం ఉన్న సీనియర్ కొలీగ్ మూర్తిగారిని అడిగాను.

“ఈ ఊరు వదిలి ఎంత త్వరగా వెళితే అంత మంచిదిగదా – ఇది మన ఊరుగాదు, మన భాషగాదు, మన సంస్కృతిగాదు, మన మనుషులుగారు – వీళ్లకు మన పొడ గిట్టదు, అందుకే ఈ తొందర…” మూర్తిగారి సమాధానం.

దాదాపు నలభై ఏళ్లు ఢిల్లీ నగరంలో గడిపిన మూర్తిగారి నోటివెంట వచ్చిన మాటలు నన్ను గొప్ప ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆయనతో నాకున్న ముప్పయ్యేళ్ళ చనువువల్ల, అడగకుండా ఉండలేకపోయాను.

“చిన్నవయసులో వచ్చి జీవితమంతా ఇక్కడే గడిపిన మీరు ఇంత అసౌకర్యంగా ఇబ్బందిగా మాట్లాడటం చాలా అన్యాయం… ఈ ఊరు మనకేం తక్కువ చేసిందీ – కావాలని ఒక చోటకి వచ్చాక ఆ ప్రదేశంతో అనుబంధం ఏర్పరచుకోకపోతే ఎలా?” కొంచెం విసురుగానే అన్నాను.

దెబ్బతిన్న భావనతో నావేపు తీక్షణంగా చూసి మూర్తిగారు అన్నారు. “ప్రసాద్! ఒక మాట అడుగుతాను – నువ్వీ ముప్ఫై యేళ్లలో ఇక్కడి ఉత్తరాదివాళ్లతో మనస్ఫూర్తిగా స్నేహం చేశావా? వాళ్లు చెయ్యనిచ్చారా? ఇప్పుడు మా ఇంటికి వచ్చినంత చనువుగా వాళ్ల ఇళ్ళకు వెళిపోయి – భాయ్! ఈ రాత్రి భోజనం మీతోనే అనగలవా?” సవాలు నిండిన ప్రశ్న.

నాకు కనీసం పదిమంది అలాంటి ఉత్తరాది మిత్రులు ఉన్నారు.

ఆ మాటే అన్నాను మూర్తిగారితో. ‘స్నేహం కలుపుకోడం మనలో ఉంటుందండీ’ అని ఇంకో మాట జోడించాను.

“అవ్వచ్చు. నాకు చాలా చెడు అనుభవాలు ఎదురయ్యాయి. ఈపాటికి గ్రహించే ఉంటావు. మన ఆఫీసులో రెండు వర్గాలు. దక్షిణాది వాళ్ళది వేరు, ఉత్తరాది వాళ్ళది వేరు. వీలయినంతవరకూ ఈ ఉత్తరాదివాళ్ళు మనకు మంచి జరగకుండా చేస్తారు. ఈ మధ్య తూర్పు వాళ్ళ వర్గం ఇంకోటి తయారయ్యింది. పైకి నవ్వుతూ మాట్లాడతారు కానీ వెనకనుంచి గోతులు తవ్వేస్తారు. జీవితంలో సగభాగం ఉద్యోగాల్లో గడిపేసే మనకి, ఆఫీసులో ఊపిరాడని పరిస్థితులు ఏర్పడితే, ఇక్కడ ఇంకా ఉండాలని ఎలా అనిపిస్తుంది?” మూర్తిగారి మాటలో, ముఖంలో ఏదో చెప్పలేని బాధ కనిపించింది. ఎక్కడో బాగా దెబ్బతిన్నట్టున్నారు.

ఆ మాటకొస్తే ఆఫీసుల్లో గొడవలు ఎక్కడ ఉండవు? దానికి ఈ ప్రాంతం వాళ్ళు దోషులు అనడం అన్యాయం అనిపించింది. ఆ మాటే అన్నాను మూర్తిగారితో.

“అయినా నాకు మా ఊరిలో మా వాళ్ళంతా ఉన్నారు. ఉన్న ఒక్క కొడుకూ వేరే ఊళ్ళో చదువు ముగించబోతున్నాడు. ఇక్కడ ఏమీ కాని వాళ్ళతో బ్రతకడం కన్నా, మన వాళ్ళతో కలిసి బ్రతకడంలో సుఖం, సంతోషం ఉన్నాయి. మంచికీ, చెడుకీ మనవాళ్ళు ఉంటారు. ఉద్యోగం కోసం ఇక్కడ ఉండక తప్పలేదు. ఎవరు ఎన్ని గొడవలు పెట్టినా, ఏదో గౌరవంగా రిటైరు అవుతున్నాను. ఇంకా ఈ చేదు అనుభవాలను గుర్తు చేసుకోకుండా వెళ్ళి పోతాను. ఈ ఆరు నెలల్లో అక్కడి ఇల్లు బాగు చేయించి రిటయిరయీ అవగానే స్వగ్రామం వెళ్లిపోతాను,” మూర్తిగారి మాటల్లో దృఢనిశ్చయం, పట్టుదల.

“ఏం జరిగింది మూర్తిగారూ, ఎప్పుడూ మా ఎవరితో ఏమీ చెప్పలేదు?” స్నేహితుడు మనసులో ఇంత బాధ పెట్టుకుని ఉంటే నాకూ బాధ అనిపించింది.

“ముందుగా చెప్పడానికి ఏముందీ?! అయినా మొన్నీమధ్యనేగా జరిగిందీ!”

“ఏం జరిగిందీ?”

“ఈమధ్య నాకు మేనేజరుగా రావాల్సిన ప్రమోషన్ రాలేదుకదా, ఎందుకనుకున్నావూ? ఆ ప్రమోషను వచ్చిన మనిషి ఇక్కడివాడు కనుక, నాకివ్వకుండా అతనికిచ్చారు.”

 ఆశ్బర్యపోయాను. నాకు తెలిసినంతవరకూ మా డైరెక్టర్ గారికి ఇలాంటి ప్రాంతీయాభిమానాలు లేవు. ఆయనకి వర్క్ కరెక్ట్‌గా చేసి, టైముకి అందించాలి అంతే. ఆ చేసిన మనిషి ఏ ప్రాంతంవాడూ అన్నది ఆయనకి అనవసరం. ‘పని జరగడమే ముఖ్యం’ అన్నట్టుంటారు ఎప్పుడూ. ఇప్పుడు హఠాత్తుగా మూర్తిగారికి ఈ అభిప్రాయం ఎందుకు కలిగినట్టూ? అదే అడిగాను.

“నేనూ మొన్నటి దాకా అలాగే అనుకున్నాను ప్రసాద్. కానీ మొన్న ఏవో పేపర్లు పట్టుకొని డైరెక్టర్ గారి రూంకి వెళ్తూంటే, ఆయన ఫోన్‌లో ఎవరితోనో చెబుతూన్న మాటలు నా చెవినబడ్డాయి. అప్పుడర్థమయింది.”

“ఏమన్నారూ? ఏం వినబడిందీ?” అడిగాను.

“ఇక్కడ మనకు కావలసింది ఇక్కడ నెగ్గుకొచ్చే లోకల్ నాలెడ్జ్! మూర్తిలో అవి లేవు. పబ్లిక్ రిలేషన్స్ తక్కువ! అసలాయన ఇక్కడి వాడు కాదు కదా, ఇక్కడి భాష సరిగ్గా రాదు. అందుకే గుప్తాని సజెస్ట్ చేశాను. అతను ఇక్కడి వాడు, పైగా…” ఇంకా ఏదో అనబోయి నా అలికిడితో ఇటు తిరిగి కుర్చీలో ఇబ్బందిగా కదులుతూ నవ్వు పులుముకుంటూ నాకు సీటు చూపిస్తూ ఫోన్ పెట్టేశాడు. నాకు ఒళ్ళు మండిపోయి తిన్నగా అడిగేశాను. “సర్, నా పనితనంలో లోపం కనిపించిందా, లేక ఇన్నేళ్ల సర్వీస్‌లో నా వలన కంపెనీకి నష్టం వచ్చిందా? ఏ గ్రౌండ్స్ మీద నా ప్రమోషన్ కూడదంటున్నారు?” అని అడిగేశా. “నో నో-అది కాదండీ, ఇప్పుడు వచ్చిన పోస్ట్ అంత మంచి ప్లేస్‌లో లేదు, చుట్టూ రకరకాల వాళ్ళు ఉంటారు. ఆ భాష మీకు కష్టంగా ఉంటుంది. అందుకే,” అన్నాడా గోముఖ వ్యాఘ్రం! ఇన్నేళ్ల ఊడిగం చేసినప్పుడు నేను ‘ఇక్కడి వాడిని‘, ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వాలంటే ‘అక్కడి వాడిని’ అయిపోయాను కాబోలు! అందుకే ఆ రోజు గొడవ పడ్డాను. నా పనికి విలువ లేకుండా పోయిన తరువాత ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎలా ఉండమంటావు ఇక్కడ?” అన్నారు బాధగా. “పోనీ మన ఆఫీసర్స్ అసోసియేషన్ని సంప్రదించారా?” అడిగాను. “ఇక్కడ మనకు న్యాయం జరగదు” అన్నారు ఆయన. “అయ్యో! సారీ మూర్తిగారూ! ఇవన్నీ గుర్తు చేసి మీ మనసుని నొప్పించాను,” అన్నాను.

“మూర్తిగారూ, మీరు రోజంతా సామాన్లు సర్ది సర్ది అలసిపోయి ఉంటారు. ఇంక వంట ఏం చేసుకొంటారూ – మా ఇంటికి వచ్చేయండి” అన్నాను. అన్నట్లుగానే మూర్తిగారిని, భార్యనూ మా ఇంటికి తీసుకుని వెళ్ళాను. సంధ్య “రండి, రండి” అంటూ వాళ్ళను లోపలికి తీసుకువెళ్ళింది. ఆడవాళ్ళిద్దరూ గలగల మాట్లాడుకుంటూ వంట పూర్తి చేశారు. మూర్తిగారు మెల్లమెల్లగా తన కోపం, నిస్పృహలనుంచీ బయటపడుతున్నట్లుగా అనిపించింది.

* * *

భోజనాలకి కూర్చున్నాం. మూర్తిగారు మాటల మధ్యలో సంధ్యను అడిగారు “ఏమ్మా! చుట్టుప్రక్కల వాళ్ళు బాగానే ఉంటారా మీతో?” “దానికేముందండీ, బాగానే ఉంటారు, కాస్త సామరస్యంగా ఉండాలంతే,” అంది సంధ్య నవ్వుతూ. మూర్తిగారు ఏదో ఆలోచనలో పడ్డట్టు తల పంకించేరు.

ఇంతలో మరికొంచెం కూర వడ్డించుకుంటున్న మా అమ్మాయిని చూస్తూ సంధ్య అంది సంతోషంగా- “హమ్మయ్య! మనుషుల్లో పడ్డావు, నిన్ననంతా అసలు నువ్వు మన లోకంలో లేవు. స్కూల్లో ఏదో జరిగుంటుంది, నువ్వే చెప్తావులే అని ఊరుకున్నాం”.

“అవునమ్మా, ఈ సంవత్సరం నన్ను టెన్త్‌కి క్లాస్ టీచర్ని చెయ్యకుండా సిక్స్త్‌కి క్లాస్ టీచర్‌గా ఎందుకు చేసేరని ఎంత బాధపడ్డానో తెల్సా? ఇవాళ మా వైస్ ప్రిన్సిపాల్ మాటలు విని చాలా హుషారుగా అనిపించింది. ఐదో క్లాసునుంచి ఆరో క్లాసుకి మారేటప్పుడు అడ్మిషన్లూ, ఫీజుల గొడవలూ ఉంటాయిట, నేనయితే నిజాయితీగా ఉంటానని అలా చేసేరుట”.

“నువ్వు ఏమీ అనుకోకపోతే ఒకటి చెప్తాను. నువ్వు నిన్న అలా మా లోకంలో లేకుండా బాధగా ఉంటే నాకు చాలా కష్టం అనిపించింది. నీకు నచ్చితే దానికోసం ఆలోచించు – లేకపోతే వినలేదనుకొని వొదిలెయ్. ఎప్పుడు కూడా ఎవరూ మనల్ని గుర్తించాలని ఆశపడకూడదు. ముందుగా మనలో ఉన్నది ఏమిటీ అన్నది మనం గుర్తిస్తే నీకు నిన్న పడ్డ మనస్తాపం ఉండేది కాదు. చూశావా! అలా బాధపడటంవల్ల నీ రోజు పాడైపోయింది. అదే నువ్వు దాన్ని తేలిగ్గా తీసుకొని ఉంటే నిన్నటి రోజుని ఇంకొక అవసరమైన దానికి ఉపయోగించేదానివి కదా? ఏ పని అయినా చిన్నదిగానీ పెద్దదికానీ కాదని గ్రహించాలి,” అనునయంగా చెప్పింది సంధ్య.

“అవును, నిజమే! నేను అసలు అలా ఆలోచించలేదు. నన్ను ఆ క్లాస్‌కి తీసుకోలేదని కుమిలిపోయానే కానీ.. తేలిగ్గా తీసుకొని ఇంకొక దానిమీద మనసు లగ్నం చెయ్యలేకపోయాను. అలాగే సంతోషం వస్తే పొంగిపోవడం, కష్టం వస్తే కుంగిపోవడంవంటివి చెయ్యకుండా స్థిరంగా ఉండటం నేర్చుకోవాలి నేను. నువ్వు చెప్పినట్టు ఎలాంటి పనిని అయినా చెయ్యగలిగే నైపుణ్యం సంపాదించాలి. నిజంగా నువ్వు ఇచ్చిన సలహా నన్ను ఆలోచించేలా చేస్తోంది”. మా పాప మాటల్ని మూర్తిగారు ఎంతో శ్రద్ధగా వినడం గ్రహించాను.

నాలుగు నెలలు గడిచాయి. మూర్తిగారి రిటైర్మెంట్ దగ్గర పడిపోయింది. మిగిలిన నాలుగు సామాన్లూ చేతబట్టుకొని స్వగ్రామానికి వెళ్ళిపోదామని తయారవుతోన్న సమయంలో అనుకోని పరిణామాలు సంభవించాయి. మూర్తిగారి పెద్దబ్బాయికి హైదరాబాదులో ప్రతిష్ఠాత్మకమైన మానేజ్మెంటు ఇన్స్టిట్యూట్ లో సీటు వచ్చింది. వచ్చిందన్న సంతోషానికి తోడుగా ఆ ఏడాదిన్నరలో పాతిక ముప్ఫై లక్షల ఖర్చు… తన రిటైర్మెంట్ ఫండ్స్ అన్నీ అందుకోసం ఖర్చుపెట్టడం మూర్తిగారికి ఇష్టంలేదు. వాళ్ళబ్బాయి బ్యాంకు లోన్లు తీసుకోవచ్చుగానీ అంత చిన్న వయసులో పాతిక లక్షల అప్పు అతనిమీద పెట్టడానికి మూర్తిగారికి మనసొప్పలేదు. ఆలోచనలో పడ్డారు. మరో రెండేళ్ళు ఉద్యోగం చెయ్యడానికి సిద్ధపడ్డారు.

మూర్తిగారికి పట్టుదల ఎక్కువ. మాట మీద నిలబడే మనిషి. మళ్లీ వెళ్లి మా ఆఫీసులో ఎక్స్టెన్షన్ అడగటం ఆయన స్వభావం కాదు. అంచేత ఆయన మరో ఉద్యోగం కోసం వెదకసాగారు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి. కానీ ఉద్యోగావకాశాలు తక్కువే. అయినా మన ప్రయత్నం మనం చేయాలి గదా! ప్రయత్నిస్తే ఏది సాధ్యం కాదు? ఎటూ తనకి ఉద్యోగానుభవం ఉంది. ప్రయత్నించగా చివరికి ఆయనకి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది; మంచిదే అనుకొన్నారు. ఒక చోటనుండి మరో చోటకి వెళ్ళాలంటే కష్టమే. కాని తప్పదు. ఆయన తన కుటుంబాన్ని కూడా ఒప్పించి బెంగళూరు దారి తీశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలంటే, తెలిసిన వాళ్ళుంటే బాగుంటుంది. తెలిసిన వాళ్ళున్నారనుకోండి. స్నేహితులను కలుస్తున్నామంటేనే ఆ ఆనందమే వేరు. మరొక పక్క వాళ్ళను ఇబ్బంది పెడుతున్నామేమో అనిపిస్తుంది. కాని తప్పదు. చివరకు కుటుంబంతో సహా బెంగుళూరు బయల్దేరుతూ, అక్కడ అంతా బాగా జరగాలని దేవుడికి దండం పెట్టుకొన్నారు.

* * *

నేను “మూర్తిగారూ, మీరు బెంగళూరులో ఎక్కడ వుంటారు” అని అడగగానే ఆయన, “నా చిన్ననాటి స్నేహితుడితో మాట్లాడాను. మూడు నాలుగు రోజులు వాడి ఇంట్లో వుండి, యిల్లు వెతుక్కుంటాను” అన్నారు.

చిన్ననాటి స్నేహితుడని అతని ఇంటికి వెళ్ళినా రిసీవ్ చేసుకోవడంలో ఆ ప్రేమ కనిపించపోయేసరికి మూర్తిగారికి యిబ్బంది కలిగింది. ఇక ఆగలేక, నాకు ఫోన్ చేసి “ప్రసాదూ, నీకు తెలిసిన వారెవరి ద్వారానయినా నా ఆఫీసుకి దగ్గరలో మంచి యిల్లు ఏదయినా వుందేమో చెప్పవయ్యా!” అన్నారు.

మర్నాడు నేను ఫోన్ చేసి “మూర్తిగారూ మీ ఆఫీసుకి దగ్గరలో సౌకర్యవంతమైన ఒక యిల్లు వుంది” అనగానే సంతోషంతో మూర్తి సరే అనబోయేంతలోనే, “కాకపోతే ఒక చిన్న చిక్కువుంది. ఆ యింటి యజమాని ఉత్తరాదివాడు. నాకు మంచి స్నేహితుడు. మీకభ్యంతరం లేకపోతే సరే,” అని వివరంగా చెప్పాను. ఆ మాట వినగానే మూర్తిగారు “ఇక్కడ నా ఆఫీసు మొత్తానికి హెడ్ దక్షణాదివాడయినా నేను రిపోర్టు చెయ్యాల్సిన డిపార్టుమెంటు హెడ్ నార్త్ యిండియన్. నేను అద్దెకు వెళ్ళబోయే యజమానీ నార్త్ యిండియన్. ఏంచెయ్యాలి? ఇక్కడ కూడా నా పాలిట ఉత్తరాదివాళ్ళేనా?” అని అననే అనేశారు.

మూర్తిగారు తనకి ఇంకా తెలిసిన వాళ్ల ద్వారా అద్దె ఇంటి కోసం ప్రయత్నించారు కానీ ఏమీ ఫలించలేదు. బెంగుళూరులో అద్దె ఇంటి కోసం బ్రహ్మయత్నమే చెయ్యాలని ఆయనకు తెలిసొచ్చింది. ప్రతిచోటా ఆరునెలలు, సంవత్సరం అద్దె పగిడీగా అడుగుతున్నారు. ఇక సరే ఇదీ చూద్దాం అనుకుంటూ నేను చెప్పిన ఇంటికెళ్లారు మూర్తిగారు. ఇల్లు చాలా సౌకర్యంగా ఉంది. ఓనర్ రాంచరణ్ పాండేగారు ఏ షరతులు లేకుండా సంతోషంగా మూర్తిగారికి ఇల్లు అద్దెకిచ్చారు, అన్ని సవ్యంగా ఉన్నాయనుకొనేసరికి మరో అవాంతరం వచ్చి పడింది. మూర్తిగారి భార్యకి కొత్త వాతావరణం వల్లో, నీళ్ల మార్పువల్లో జ్వరంతో ఖాయిలా పడ్డారు. మూర్తిగారికి కొత్త ఆఫీసు, కొత్త ఉద్యోగం. సెలవుపెట్టే అవకాశం లేదు. పాండేగారి భార్యా తల్లీ తోడుగా ఉండి ఆమెకు సపర్యలు చేశారు. ఆఫీసులో మెల్లిమెల్లిగా మూర్తిగారు సెటిల్ అవుతున్నారు. ఇంటి యజమాని పాండేగారితో కూడా పరిచయం స్నేహంగా మారుతోంది. అలవాటైన హిందీ భాష మరికాస్త దోహదం చేసింది. ఒకరోజు తమ ఊరినుంచి హఠాత్తుగా వచ్చిన వార్తతో మూర్తిగారు ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయారు…….

తండ్రి పరంధామయ్యకి మూర్తిగారు ఒక్కడే కొడుకు. కొడుకు రిటైర్ అయి స్వగ్రామం వచ్చేస్తున్నాడు అని సంతోషించే లోపు, అతను మరొక రాష్ట్రంలో మరొక ఉద్యోగానికి వెళ్ళాడు. ఆ విషయంలో సంతోషించాలో బాధపడాలో తెలియని పరిస్థితి. ఆ విషయాలే ఆలోచిస్తూ పార్కులో వాకింగ్ చేస్తూ ఎదురుదెబ్బ తగిలి పడిపోయారాయన. తగిలిన దెబ్బ చిన్నదే గానీ, ఆ వయసులో ఆ అదురుకి తట్టుకోలేక బీపీ పెరిగి మైల్డ్ గా గుండెపోటు వచ్చింది. భార్య లక్ష్మమ్మగారు కృంగిపోయినా, వారిని బాగానే చూసుకుంటున్నారు.

పార్కులో పడిపోవడం మూలంగా, వొకపక్క తన ఈడు వారందరూ పిల్లలు మనవలతో కలిసి వుంటే, తనూ, తన భార్యా ఇప్పటికీ వొంటరిగానే ఉండిపోయాం అనే భావన ఒక పక్క పీకుతూనే ఉంది పరంధామయ్యగారిని. అయినా ‘మాకేం రాజాలా బ్రతుకుతున్నాము. మాకొకరు పెట్టక్ఖర్లేదు, మమ్మల్ని ఒకరు చూడక్ఖర్లేదు’ అని బంధువులతో దర్జాగా చెప్పే పరంధామయ్యగారి గాంభీర్యం ఆ రోజు మూగబోయింది. పైకి మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తున్నా ఏదో తెలియని వెలితి అతని మనసులో ఉంది. ఈ విషయాలన్నీ నాకు చెప్పుకొని బాధపడ్డారు మూర్తిగారు.

తన పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి దానికోసం మూర్తిగారు బెంగుళూరు చేరుకోవలసి వచ్చింది. తన పిల్లల బాధ్యత వహించడానికి పడుతున్న కష్టం వొకపక్క, తనని కన్నవాళ్ళ ఆలనా పాలనా చూసుకోవడానికి ఇకనైనా వున్న వూరికి వెళ్లి వుండిపోలేకపోతున్నానన్న బాధ మరో పక్క, ఈ మనోవ్యధల మధ్య ఇప్పుడు తండ్రికి హఠాత్తుగా వచ్చిన ఉపద్రవం, ఆరోగ్యం అసలే అంతంతమాత్రంగా ఉన్న భార్యని పరాయి రాష్ట్రంలో వదిలిపెట్టి గభాల్న స్వగ్రామం వెళ్ళలేని నిస్సహాయత – వీటన్నిటి మధ్యా కొట్టుమిట్టాడారు మూర్తిగారు.

ఇక బెంగుళూరులో తనకు ఊరు కొత్త. మనుషులు కొత్త. పరిసరాలు కొత్త. సంగతి తెలుసుకున్న పాండేగారు “మూర్తిగారూ! మీరు నిర్భయంగా వెళ్లి నాన్నగారిని చూసి రండి. మేమంతా ఉన్నాం మా చెల్లెమ్మని చూసుకోవటానికి” అని స్వంత అన్నదమ్ముడికంటే ఆప్యాయంగా ధైర్యం చెప్పారు.

 ఆలోచనలో పడ్డారు మూర్తిగారు. ఇంతకాలం తాను పొరపాటుగా ఆలోచించానేమోనని. ప్రాంతీయ భేదాలు కావు – మనుషుల మనస్తత్వాల్లోనే ఉంది లోపమని. ప్రమోషన్ విషయంలో కూడా తాను పడ్డ ఆందోళన సమంజసం కాదేమోననీ అనిపించింది.

తాను తండ్రిని చూడటానికి వెళ్లగానే అనుకోని సంఘటన జరిగింది.

ఇక్కడ భార్యకు మామూలు జ్వరంతో మొదలై చివరికి టైఫాయిడ్ లోకి దింపింది. ఆసుపత్రిలో ఉంచవలసి వచ్చింది. అఫ్పుడు పాండేగారి కుటుంబం చేసిన సేవ అంతా ఇంతా కాదు.

వెనక్కి తిరిగి వచ్చిన మూర్తిగారి ఆలోచనావిధానంలో ఈ సంఘటన మార్పు తెచ్చింది.

ఏదో భ్రమలో ఉంటాము. ఊరు కాని ఊరని, మన ప్రాంతం కాదని, మన భాష కాదని, మనని సరిగా ఆదరించరని, మనకు అన్యాయం చేస్తారని. ప్రాంతం ఏమీ చేయదు. భాషా ఏమీ చేయదు. అది మానవ నైజం. ఈ క్లిష్ట పరిస్థితిలో ప్రతి రోజూ ఫోన్ ద్వారా మూర్తిగారి సంపర్కంలో ఉన్న నాకు ఆయన ఆలోచనలలోని మార్పు స్పష్టంగా తెలియసాగింది.

* * *

మూర్తిగారిలో వచ్చిన మార్పు వలన రెండు కుటుంబాలూ మరింత దగ్గరయ్యాయి. ఒకరికొకరు సాయంగా, ప్రేమాభిమానాలతో మెలగసాగారు. అపుడే వారిని మరింత దగ్గర చేసే ఒక సంఘటన జరిగింది. పాండేగారి ఇరవై ఆరేళ్ళ కూతురు రచన సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆ పెద్ద కంపెనీలోనే ఇంకో డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న తెలుగు అబ్బాయి ఆదిత్య, ఆమె ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి, తమ పెద్దవాళ్ళకి తెలియజేశారు. పాండేగారు మూర్తిగారికి ఆదిత్య వివరాలు చెప్పి, అతని గురించి వాకబు చెయ్యమని కోరారు. మూర్తిగారు ఆరాతీయగా, ఆదిత్య తన ఆఫీసులో పనిచేసే మదన్మోహన్ కొడుకేనని తెలిసింది. మదన్మోహన్ తో సన్నిహితంగా ఉండే వాళ్ళను మూర్తిగారు సంప్రదించగా వాళ్ళు ఆదిత్య చాలా మంచి అబ్బాయని, కళ్ళు మూసుకుని అమ్మాయిని ఇవ్వొచ్చనీ చెప్పారు. మూర్తిగారు రెండు కుటుంబాల మధ్యా వారధిగా నిలబడి, సఖ్యత ఏర్పడడానికి దోహదపడ్డారు. ఆదిత్య తరపు పెద్దవాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరకుండా, అనవసరపు ఖర్చులు లేకుండా పెళ్లి నిరాడంబరంగా జరిగేలా చూశారు. పెళ్లి పనుల్లోకూడా పాండేగారికి ఎంతో సాయంచేసి పనులన్నీ నిరాటంకంగా జరిగిపోయేలా తోడ్పడ్డారు.

అంతవరకూ బానే జరిగిన కథ, సుఖాంతం కాబోయే ముందు క్రొత్త మలుపు తిరిగింది.

ఆదిత్య, రచనలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారనే కదా అంతా కలసి పెళ్ళి చేశారు! పెళ్ళయిన కొద్ది వారాల్లోనే వాళ్ళ మధ్య పొరపొచ్చాలు మొదలయాయి.

ఆదిత్యకి రోజూ పొద్దున్నే లేచి తయారయి ఆఫీసుకెళ్ళేవరకూ, మ్యూజిక్ సిస్టంలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి స్వరంలో విష్ణుసహస్రనామాలు మోగుతూ ఉండాల్సిందే. మెలకువ వచ్చినప్పటినుంచీ ఇంగ్లీష్ పాటలని ఇయర్ ఫోన్స్‌లో వింటూ ఉండకపోతే రచనకి వెలితిగా అనిపిస్తుంది. ‘వాల్యూం తగ్గించవచ్చుగా’ అంటే ‘ఆ మాత్రం ఉండాల్సిందే’ అంటాడతను. ఆమె తెలుగువంటలు నేర్చుకుంటుందని ఆశించిన అతనికి, అది ఇప్పట్లో తీరే కోరిక కాదని రూఢి అయిపోయింది.

పెళ్ళయిన కొద్ది వారాలకే వచ్చిన హోలీ వేడుకల్లో, రచన చాలా ఉత్సాహంగా పాల్గొనడం, అందరితోనూ కలివిడిగా డాన్సులు చేస్తూ రంగులు పూయడం-పూయించుకోవడం చూసి ఆదిత్యకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అతనికి చిన్నప్పట్నుంచీ హోలీలో రంగులు చల్లుకోవడం అస్సలు నచ్చదు. ఆమె చీర కట్టుకుంటే అతనికి నచ్చుతుంది. ఆమెకి కాజువల్ వేర్ అలవాటు ఎక్కువ. చీరలూ, కుర్తా పైజమాలూ ఎప్పుడో కానీ ధరించదు. అవి అంత కంఫర్టబుల్ గా ఉండవంటుంది.

ఇలా వేషభాషల్లోనూ, ఆచార వ్యవహారాల్లోనూ, ఆహార-విహారాల్లోనూ పొంతన లేకపోవడం, ఎవరికి వారికే తమతమ ఇష్టాఇష్టాలు సరైనవనిపించడంతో పొరపొచ్చాలు మొదలయ్యాయి. అవి బాగా ముదిరిపోవడం జరిగిపోయింది. కొద్దిరోజుల తర్వాత నేను ఆఫీసు పనిమీద బెంగుళూరుకి వెళ్లాను. కలిసీ కలియగానే మూర్తిగారు రచన-ఆదిత్యల ప్రస్తావన తీసుకువచ్చి “ఇలానే కొనసాగితే వాళ్లకాపురం ఎక్కువకాలం నిలవదు,” అనేశారు. “ఎందుకలా భావిస్తున్నారూ?” అని నేను అడిగాను.

‘ఉత్తరాదివారితో కలవటం కష్టమని పదవీవిరమణ చేసీ చెయ్యగానే ముందు బెంగుళూరుకు షిఫ్టయ్యాను. తప్పు గ్రహించి వెనక్కివెళ్లే అవకాశమే లేకపోయింది, అలాంటిది ఇష్టపడి పెళ్లిచేసుకున్న భార్యాభర్తల మధ్య ప్రేమ, సఖ్యత, సరైన అవగాహన ముఖ్యం కానీ భాషా, ఆచారాలు కేంద్రబిందువులు కాకూడదు, ఇది తెలుసుకోకుండా కాపురాలు చెడగొట్టుకుంటున్నారు వీళ్లు. సర్దిచెప్పాల్సిన బాధ్యత నాకూ ఉంది, ఏం చేద్దాం’ అన్నారు మూర్తిగారు.

నాకే ఆశ్చర్యం వేసింది, ఎంత మార్పు ఆయనలో.

ఆ పనే చేశారు కూడా. ఈ ఆదివారం ఉదయం కొత్త దంపతుల్ని పిలిచి మాట్లాడారు. నన్నూ తమతోబాటు కూర్చోమన్నారు.

“చూడండి, మీరిద్దరూ చక్కటి తెలివితేటలు కలవాళ్ళు. మీ వ్యక్తిత్వాలు మీకున్నాయి. ఒకరినొకరు ఇష్టపడిన తర్వాతే అందరి ఆమోదంతోనూ పెళ్లి చేసుకున్నారు. రెండు బిందెల్నయినా ఒక చోట పెడితే ఒకదానికొకటి తగిలి చప్పుడు చేస్తుంటాయి. ఇక ఒక ఇంట్లో కలిసి కాపురం చేసే భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలూ, చిన్న చిన్న తగాదాలూ రావడంలో ఆశ్చర్యమేముంది? ఆ మాటకొస్తే కాపురంలో మజా వాటితోనే పెరుగుతుంది. మీకు తెలుసో లేదో, నేను కూడా నలభయ్ ఏళ్ళపాటు నా ఉద్యోగంతో ఇలాంటి కాపురమే చేశాను”.

ఆదిత్య, రచనలు శ్రద్ధగా వింటున్నారు. ఆయన వయసుకి గౌరవమిచ్చి కొంతా, తమని కలపడానికి ఆయన చేస్తోన్న ప్రయత్నం గుర్తొచ్చి, కృతజ్ఞతతో మరి కొంతా.

“నా భాష మీద, నా రాష్ట్రం మీద, నా సంస్కృతి మీదా ఎడతెగని గౌరవాభిమానాలు ఉన్న నాకు, ఉత్తర భారతదేశం ఒక పట్టాన నచ్చలేదు. అక్కడ ఉన్నన్నాళ్లూ నన్ను నేను ఒక పరాయివాడిగానే భావించుకుంటూ మసిలాను. అక్కడి వాళ్ళని స్వంతవాళ్ళుగా ఎప్పుడూ అనుకోలేదు.

ఇక్కడికి వచ్చి ఈ దక్షిణ భారతదేశంలో మరో కొత్త చోట వాలినప్పుడుగానీ తెలిసి రాలేదు అక్కడి వాళ్ళలోని మంచితనాలేమిటో. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏ ఉత్తరాది వాళ్ళని పరాయివాళ్లనుకున్నానో వాళ్ళే నాకు ఇక్కడా సాయపడ్డారు. ఇప్పుడు నాకు ప్రాక్టికల్గా తెలిసింది – భాష, సంస్కృతులకన్నా గొప్పది స్నేహమని, సహజీవన సౌందర్యమని, అదే మానవత్వమని.

ఏది ఏమైనా, వెళ్ళిన చోట ఉండే పరిస్థితులకి అనుగుణంగా మనల్ని మార్చుకోవలసింది మనమే కదా!

ఇప్పుడు మీ ఇద్దరిదీ, రెండు సంస్కృతులు ఒకదాన్నొకటి అరకొరగా అర్థం చేసుకోవడంవల్ల వస్తున్న క్లాష్ అనుకుంటున్నాను. నాకు ఆ క్లాష్ ని అర్థం చేసుకోవడానికి, అసలది క్లాష్ అన్న స్పృహ కలగడానికే ఇన్నేళ్ళు పట్టింది. మీ తరం మాకంటే చురుకైంది. మీకు ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తే సులువుగా అర్థమవుతాయి. అలా అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు మీకు కనిపిస్తోన్న సమస్యలన్నీ పై పై విషయాలని స్పష్టమవుతుంది. అది జరిగిన నాడు మీ ప్రేమ పరిపక్వమవడానికి రహదారి ఏర్పడుతుంది”. చెప్పుకుపోతున్న మూర్తిగారు ఆపి, వాళ్ళవంక చూశారు.

వాళ్ళ చేతులు అప్పటికే కలిసిపోయి ఉన్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here