Site icon Sanchika

కవిత్వంలో మహ్మద్ ఖాలిద్ తొలి అడుగులు – ‘మనమంతా ఒక్కటే!’

[శ్రీ మహ్మద్ ఖాలిద్ రచించిన ‘మనమంతా ఒక్కటే!’ అనే కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు సందినేని నరేంద్ర.]

[dropcap]మ[/dropcap]హ్మద్ ఖాలిద్ కరీంనగర్‌లో వృత్తి రీత్యా ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. వీరు ప్రవృత్తి రీత్యా కవిత్వ సృజన  చేస్తున్నారు. మహ్మద్ ఖాలిద్ కలం నుండి జాలువారిన ‘మనమంతా ఒక్కటే’ కవితా సంపుటిని చదివాను. ఇది అరువది ఆరు కవితలతో అలరారుతూ ఉంది. ఈ కవితా సంపుటిని తన కుమారుడు మహ్మద్ బిలాల్‌కు అంకితం ఇవ్వడం సముచితంగా ఉంది.

‘మనమంతా ఒక్కటే’ కవితా సంపుటి 2023 సంవత్సరంలో భవాని సాహిత్య వేదిక ద్వారా ప్రచురింపబడినది. వీరు 2014 సంవత్సరం నుండి కరీంనగర్‌లో ఎన్నీల ముచ్చట్లు సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఎన్నీల ముచ్చట్లు సాహిత్య వేదికలో కవులు కవిత్వం చదువుతుంటే చూసి వీరికి  ప్రేరణ కలిగింది. ఎన్నీల ముచ్చట్ల ద్వారా ఖాలిద్ కవిత్వం జనించింది. ఎన్నీల ముచ్చట్లను ప్రారంభించిన వారిలో నలిమెల భాస్కర్ ఒకరు.

డాక్టర్ నలిమెల భాస్కర్ కవితా సంపుటికి ముందు మాట రాస్తూ “ఇది అతని మొదటి పుస్తకం. అప్పుడే అతని అభివ్యక్తి,కళాత్మకంగా వుందా లేదా అని ఆలోచించడం అనాలోచిత కార్యం” అన్నారు. దాస్యం సేనాదిపతి తన ముందు మాటలో “తెలుగు భాషపై మరింత పట్టు సాధిస్తూ అధ్యయనం ద్వారా కవిత్వం రచనలోని మెళుకువలు, శైలి, అభివ్యక్తి, శిల్పం వంటి అంశాలను తెలుసుకొని తన కలానికి పదును పెట్టుకోవాలని కోరుకుందాం” అన్నారు.

~

‘మన భారతదేశం’ కవితలో నవ భారతాన్ని నిర్మిస్తాం, అభివృద్ధి ఫలాలు సామాన్యుని చెంతకు చేరేట్లు చూస్తాం అని అంటున్నారు ఖాలిద్. సామాన్యుల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల సొమ్ము పక్క దారి పడుతున్నది. అవినీతి అధికారులు మరియు రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును కాజేస్తున్న దుస్థితి మారాలి. అభివృద్ధి ఫలాలు సామాన్యునికి అందాలి. ప్రజలు కోరుకున్న రామ రాజ్యం కల సాకారం కావాలి. దేశం కోసం కవితలో ప్రతి యువకుడు కావాలి ఓ సైనికుడు, అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ కలం ద్వారా ప్రతిన పూనడం చక్కగా ఉంది.

‘బంగారు తెలంగాణ’ కవితలో రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతోంది. అమరుల ఆశయాలను, తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసుకుందాం, జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణాగా మారుతోంది అంటూ ఆకాంక్షను వ్యక్తం చేశారు.

‘మనమంతా ఒక్కటే’ కవితలో మనం భారతీయులం ఏ ప్రాంతంలో ఉన్నా మనమంతా ఒక్కటే,కలిసి మెలిసి ఉందాం అని అంటున్నారు. ప్రజలంతా ఐక్యంతో ఉంటే దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది అనే భావన అద్భుతం.

‘ఓటు’ కవితలో ధనం మద్యంకు లొంగకు ఓటు హక్కును అమ్ముకోకు అంటూ పౌరులకు ఓటు యొక్క విలువను తెలియజేసారు. ప్రజలు సరియైన నాయకుడికి ఓటు వేయాలి, ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు అనే సందేశం ఉంది.

‘మన లక్ష్యం’ కవితలో బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదాం అని దేశభక్తిని చాటుతున్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అమరులు కోరుకున్నట్లుగా బంగారు తెలంగాణ పునర్నిర్మాణం కాంక్షించడం సంతోషదాయకం, రాష్ట్ర ప్రజలకు శ్రేయోదాయకం అంటున్నారు.

‘మనిషి మేలుకో’ కవితలో కుల మతాల పేర కొట్లాటలు, విద్వేషాలు ఎందుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు. అందరు కలిసిమెలిసి ఉంటేనే అసలైన మానవులు అని చెబుతున్నారు. మన దేశం లౌకిక దేశం. అన్ని మతాలు సమానం. ప్రజలు పరస్పరం సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలి. విద్వేషాలు పనికి రావు అని వ్యక్తం చేస్తున్నారు.

‘ఐకమత్యమే బలం’ కవితలో ఐకమత్యమే మన బలమని గుర్తెరిగి రేపటి భవితకు మార్గం చూపాలి అంటూ ఐకమత్యం యొక్క ఆవశ్యకతను తెలియజేశారు.

‘పేదరికం’ కవితలో పేదల తలరాతలు మారలేదు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందాన పేదల బతుకులు చీకటిలో మగ్గుతున్నాయి. పేదల బతుకులు మారాలని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుతున్నారు.

‘శ్రామికులు’ కవితలో ఉన్నదానితో తృప్తిని పొంది కాలంతో పోటీపడి ముందుకు సాగుదాం అంటున్నారు.

‘తెలంగానం’ కవితలో తెలంగాణ వికాసానికి అడుగులు వేద్దాం, అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వం, బంగారు తెలంగాణ కల సాకారం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్రం పట్ల గల ప్రేమను ఎలుగెత్తి చాటుతున్నారు.

‘పచ్చదనంకై పరిగెత్తుదాం’ కవితలో చెట్లు తమ కోసం జీవించవు, పరుల కోసం జీవిస్తాయి. పచ్చదనంతో ఈ నేలను అలంకరించుదాం అంటూ చెట్లు మానవాళి సంక్షేమం కోసం ఉపయోగపడుతున్నాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘సమ న్యాయం’ కవితలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. అప్పుడే  సమాజం పురోగతి సాధిస్తుంది అనే భావం వ్యక్తం చేశారు. ‘ఒకే మార్గం’ కవితలో కరోనా మహమ్మారిని తరిమికొడతాం ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన కరోనాను ఓర్పుతో ఎదుర్కొందాం అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘ప్రకృతి’ కవితలో ప్రకృతిని ప్రేమించు, పచ్చని ప్రకృతిని సంరక్షించే బాధ్యత మనదే అంటూ ప్రజల్లో ప్రకృతి పట్ల అవగాహన కలిగిస్తున్నారు.

‘వలస జీవులకు దారేది?’ కవితలో వలస కార్మికులు ఏ ప్రాంత ప్రజలైన అందరు మానవులే మానవత్వంతో అందరిని ఆదుకోవాలి అంటూ వలస కార్మికుల పట్ల ప్రేమను వ్యక్తం చేయడం బాగుంది.

‘రైతన్నల ఆత్మహత్యలు ఆగేదెప్పుడు?’ కవితలో రోజు రోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, రైతులను ప్రభుత్వ ఆదుకోవాలి అనే సంకల్పంతో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘ఇంకెన్నాళ్లు?’ కవితలో జెండాలు ఎజెండాలు మారుతున్నా పేదవాడి కష్టాలు ఇంకెన్నాళ్లు అంటూ పేదవాని బతుకుల్లో వెలుగులు విరజిమ్మాలని ఆశిస్తున్నారు.

‘మిషన్ కాకతీయ’ కవితలో మా ఊరు చెరువును కాపాడుకుందాం, చెరువు గ్రామస్తులందరికీ బతుకుదెరువు, మా ఊరి చెరువు ఊరికి ప్రాణాధారం అంటున్నారు. మనుషులకు, పశువులకు, పక్షులకు వ్యవసాయానికి చెరువు నీరే ఆధారం. త్రాగునీరు, సాగునీరు అందించే చెరువును పరిరక్షించుకోవాలి అనే భావన చక్కగా ఉంది.

‘ఉగాది’ కవితలో జీవితమంటేనే కష్టసుఖాల సమ్మేళనమని, ఆరు రుచుల పచ్చడి హితవు పలుకుతున్నదని, తెలుగువారికి ప్రీతిపాత్రమైన ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ప్రజలందరు వర్ధిల్లాలని చెప్పిన భావం అద్భుతంగా ఉంది.

‘తియ్యనైన భాష’ కవితలో తెలుగుతోనే తియ్యదనం, తెలుగు భాష జీవితాలలో వెలుగు నింపుతుంది, తెలుగు భాష అభివృద్ధి కొరకు ముందుకు సాగుదాం అంటూ తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తు చేస్తున్నారు.

‘తల్లిదండ్రుల విలువ’ కవితలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దు, బంగారు భవిష్యత్తును అందించిన తల్లిదండ్రులకు గుప్పెడు ప్రేమ, ఆత్మీయత, ఆదరణ అందించాలనే భావం ఉంది. ఈ కవితలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల ప్రేమను చాటుతున్నారు.

‘జై జవాన్’ కవితలో ప్రాణాలు తృణప్రాయంగా భావిస్తావు, దేశ రక్షణకై నీ జీవితాన్ని అర్పిస్తావు సైనికుడా అందుకో వందనం అంటూ దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికుల దేశభక్తిని శ్లాఘించారు.

‘తెలుగు భాష’ కవితలో తెలుగు పాలు తేనెల వలె తీయనైనదని, తెలుగు భాష రక్షణే మన లక్ష్యంగా ముందుకు సాగుదామని, తెలుగు భాషను కాపాడుకుందాం అని తనకు తెలుగు భాష పట్ల గల అపారమైన ప్రేమను వ్యక్తీకరించారు.

‘న్యాయం ధర్మం’ కవితలో న్యాయాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు వందనం అంటున్నారు. న్యాయం ధర్మం కాపాడబడితేనే ప్రజలు సుఖ శాంతులతో జీవించగలరు. న్యాయము, ధర్మము రెండు కళ్ళలాంటివి. న్యాయమును కాపాడడానికి అహోరాత్రులు శ్రమిస్తున్న న్యాయమూర్తులు కొనియాడదగినవారు.

‘రాయాలని ఉంది’ కవితలో పేదరికం వెంటాడుతుంది, కవిత్వం రాయాలంటే కష్టంగా ఉంది, కలం వదిలేయాలని ఉంది అని అన్నప్పటికీ కాలాన్ని చూస్తే మళ్ళీ కవిత్వం రాయాలని ఉంది అంటున్నారు. కవి ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికీ కవిత్వం రాయడం శ్వాసగా బతుకుతాడు. కవిత్వం రాయడం ఆపడు. కాలం మారినా కవిత్వం రాయాలనే కాంక్ష మారదు అనే సందేశం  వ్యక్తం చేస్తున్నారు.

~

ఇప్పుడిప్పుడే కలం పట్టిన ఖాలిద్ సాహిత్యంలో ఓనమాలు దిద్దుతున్నారు. ప్రాచీన, ఆధునిక కవులు రాసిన సాహిత్యం విస్తృతంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కవిత్వం రాయడమంటే ఆషామాషి వ్యవహారం కాదు. కవిత్వంలో పద సంపద, భాష, భావం పొంగిపొర్లితేనే పాఠకుల హృదయాలను అది రంజింపజేస్తుంది. కవితలోని భాషలో, భావంలో పదును రావాలంటే బాగా చదవాలి. మన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించాలి. మనకు నిత్య జీవితంలో ఎంతో మంది మనుషులు తారసపడతారు. ఆ మనుషుల మనస్తత్వాలు, వారు మాట్లాడుతున్న తీరు, వారి హావభావాలు గమనించాలి. తోటి వారి నుండి ఎన్నో విషయాలు మనకు అవగతం అవుతాయి. ఎన్ని కవితలు రాశాను అన్నది ముఖ్యం కాదు. కవితల సంఖ్య అసంఖ్యాకంగా ఉండవచ్చు. నీవు రాసిన కవితలో వాసి ఎంత ఉంది అనేది ముఖ్యం. నీవు రాసిన కవితను శ్రద్ధతో పరిశీలించాలి. అప్పుడే అందులో చెప్పిన భావాలు పాఠకులకు నచ్చుతున్నాయా లేదా అనేది తెలుస్తుంది. నీవు రాసిన దానిని నీవు బాగా చదివితేనే దాని తీరుతెన్నులు తెలుస్తాయి. సృజనకారుడు పుస్తకాలను భావి తరాలకు అందిస్తున్నాడంటే అందులో ఎంతో కొంత సాహిత్య ప్రయోజనం ఉండాలి. పుస్తకాల వల్ల సమాజానికి మేలు చేకూరాలి. మంచి పుస్తకాలు చదివితే మంచి జ్ఞానం లభిస్తుంది. కాలక్షేపానికి రాసినది చెత్తబుట్టలోకి చేరుతుంది.

కవి ఖాలిద్ చక్కటి అధ్యయనపరుడిగా ఎదగాలి. మంచి సృజనకారుడిగా రాణించాలి. నవనవోన్మేషమైన కవిత్వం రాయాలి. ఖాలిద్ లోక రీతిని, సాహిత్య మెళుకువలను తెలుసుకొని కవిత్వం రాస్తే ముందు ముందు గొప్ప కవిగా రాణించే అవకాశం ఉంది.


కవి పరిచయం:

మహ్మద్ ఖాలిద్ తేది 10 – 04 – 1974 న జన్మించారు. కరీంనగర్ పట్టణం లోని షాషాబ్ స్ట్రీట్‌కు చెందిన వారు. ఫహిమిద బేగం, మహ్మద్ ఖాజా వీరి తల్లితండ్రులు. మహ్మద్ ఖాజా పండ్ల వ్యాపారి. ఖాలిద్ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కరీంనగర్ లోని కుమార్వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. 2001 వరకు పండ్ల వ్యాపారం చేశారు. 2001 సంవత్సరంలో ఆంధ్రా బ్యాంక్ నుండి లోను తీసుకుని ఆటో కొన్నారు. ఆటో నడుపుతూ జీవనం గడుపుతున్నారు. సబియ బేగంను 1996 సంవత్సరంలో మంథని గ్రామంలో వివాహం చేసుకున్నారు. మహ్మద్ ఖాలిద్, సబియ బేగం దంపతులకు ముగ్గురు సంతానం.1) ఫరహ బేగం, 2) మహ్మద్ బిలాల్,3) సనా అంజుం.

వీరు తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి స్వగృహంలో ఉంటున్నారు. వీరు చేస్తున్న పనుల్లో తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల సహకారం ఉంది. వీరు వృత్తిరీత్యా ఆటోను నడుపుతున్నప్పటికీ పలు సాహిత్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరు వివిధ రంగాల్లో అనేక పురస్కారాలు, సత్కారాలు పొందారు.

***

‘మనమంతా ఒక్కటే!’ (కవిత్వం)
రచన: మహ్మద్ ఖాలిద్
ప్రచురణ: భవాని సాహిత్య వేదిక
పేజీలు: 92
వెల: ₹ 100/-
ప్రతులకు:
మహ్మద్ ఖాలిద్,
ఇంటి. నెం. 1 – 2 – 66,
షాషాబ్ స్ట్రీట్,
కరీంనగర్ – 505002.
ఫోన్ నెంబర్ 9618175421.

Exit mobile version