Site icon Sanchika

మానస సంచరరే -10: ఉదయ రాగం.. హృదయగానం!

[box type=’note’ fontsize=’16’] “మనిషికి పాట తోటి అనుబంధం అనవరతమైంది, అవిభాజ్యమైంది. మనిషికి పని ఎంత ముఖ్యమో, పాట అంతే ముఖ్యం” అంటున్నారు జె. శ్యామల “మానస సంచరరే -10: ఉదయ రాగం.. హృదయగానం!” అనే కాలమ్‍లో. [/box]

[dropcap]కూ[/dropcap].. కూ… కూ.. కొమ్మల్లో కోయిలగానం.. మెలకువ వచ్చినా, అప్పటివరకు బద్ధకంగా పడకలోనే ఉండిపోయిన నేను ఒక్కసారిగా లేచాను. హాల్లోకి నడిచి కిటికీలోంచి చూపు సారించాను. నా ఊహ కరెక్టే. మామిడి చెట్టు మీద కోయిల నింపాదిగా కూర్చుని పాటకచేరీ మొదలెట్టింది. వింటూనే, వంటింట్లోకి వెళ్లి టీ ప్రయత్నాలు చేసి, బ్రష్ చేసుకొని టీ కప్పు తెచ్చుకుని మళ్లీ కిటికీ దగ్గరకు వెళ్లాను. ఇందాక కాస్త గ్యాప్ ఇచ్చిన కోయిల మళ్లీ తన ఉనికిని తెలియజేస్తూ ‘కూ’ అంది. రోడ్డున వెళ్లే కుర్రాడెవడో ‘కూ’ అని దాన్ని అనుకరించాడు. నవ్వుకుంటూ కుర్చీలో బైఠాయించి అటు కోయిల గానాన్ని, ఇటు టీని ఆస్వాదిస్తూ ఈ ఆదివారం, ‘ఆనందవారం’ అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ ఇంట్లో వాళ్లే కాదు పనిమనిషి కూడా నా ఏకాంతాన్ని భంగపరచదు. ఎందుకంటే ఈరోజు రానని నిన్ననే చెప్పింది. పైగా కోయిలగానంతో మొదలైంది.. అంతే.. నాలో ఆలోచనామృతవర్షిణి మొదలైంది.. గానంలో కోయిలదే అగ్ర తాంబూలం. వాల్మీకిని సైతం కోయిలతో పోలుస్తూ.. కూజంతం రామ రమేతి మధురం మధురాక్షరం.. ఆరూహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలమ్’. రామాయణమనే కవితా కొమ్మపై కూర్చుని రామనామగానం చేస్తున్న వాల్మీకి అనే కోకిలకు వందనం.. ఎంత హృద్యమైన సారూప్యం! కోకిల ప్రస్తావన వస్తే వెంటనే మదిలో మెదిలే భారత కోకిల సరోజినీ నాయుడు. ఘనమైన కళ గానం. అందుకే పెద్దలు ‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణి’ అన్నారు. శిశువులు, పశువులు, చివరకు సర్పాలను కూడా పాట అలరిస్తుంది. అంతేనా రాళ్లను సైతం కరిగిస్తుందని విశ్వసిస్తారు. జగదేక వీరుని కథ చిత్రంలో ఎన్టీఆర్ ‘శివ శంకరీ, శివానందరలహరి.. శివశంకరీ.. చంద్రకళాధరి ఈశ్వరీ.. కరుణామృతమును కురియజేయుమా.. మనసు కరుగగా మహిమ చూపవా, దీనపాలనమ సేయవే.. అని అద్భుత గానం వినిపించేసరికి శాపవశాత్తు శిలగా మారిన మనిషికి నిజరూపం వచ్చి, తాను వరుణదేవుడనని, జగదేకవీరుని గంధర్వగానాన్ని పరీక్షించడానికే అలా నటించానని చెబుతాడు. శిల కరిగి, కరిగి మానవరూపం ధరించే ఆ సీన్ మొత్తం ఆహా అనిపిస్తుంది. ఘంటసాల పాడిన గొప్ప పాటల్లో ‘శివశంకరీ” ఒకటిగా నిలిచిపోయింది. చతుర్వేదాల్లో మూడవది అయిన సామవేదం గానప్రధానమైందే. అందుకే గానరసాలూరి వారు ‘పాట పాడుమా ముకుందా… పలుకుతేనె లొలుకునటుల, మాటలాడుమా ముకుందా మనసుతీరగా.. సామవేద సారము, సంగీతము, సాహిత్యమేగా..” అన్నారు. మనిషికి పాట తోటి అనుబంధం అనవరతమైంది, అవిభాజ్యమైంది. మనిషికి పని ఎంత ముఖ్యమో, పాట అంతే ముఖ్యం. పైగా పనికి ఉత్సాహాన్నిచ్చేది పాట. ‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది’ అన్నాడో సినీకవి. పొల్లాల్లో పనిచేసుకుంటూ పాడే పాటలు, ఇంటి దగ్గర దంపుడు పాటలు, చల్ల చిలుకుతూ మేలుకొలుపు పాటలు, లాలిపాటలు, పెళ్లిపాటలు, భక్తి పాటలు, భజనలు, తరంగాలు, దండకాలు, మంగళహారతులు వగైరా.. వగైరాలెన్నో. సంగీతం.. అది శాస్త్రీయం కావచ్చు, లలిత సంగీతం కావచ్చు, జానపద సంగీతం కావచ్చు, పాశ్చాత్య సంగీతం కావచ్చు. ఏమైనా పాట పాటే. సంగీతం సార్వజనీనమైంది. భాషకు అతీతమైంది. భాష అర్థంకాకపోయినా ఆ రాగం, భావం మనసును కట్టిపడేస్తాయి. దాన్నే ఇప్పుడు పాటకు ట్యూన్ క్యాచీగా ఉండాలని వ్యవహరిస్తున్నారు. పాట భావం ఏదైనా, ట్యూన్ మనసును తాకిందో ఆరోజంతా ఆ పాటే పెదాలపై పదే పదే వర్తిస్తుంది. గతంలో అమ్మాయిలకు పెళ్లిచూపుల్లో పాడటం తప్పనిసరిగా ఉండేది. అందుకే అమ్మాయిలకు సంగీతం నేర్పించేవాళ్లు. ప్రతి ఇంట హార్మోనీ పెట్టి కూడా ఉండేది.

భక్తి సంగీతం ప్రాచీనమైంది. ‘సంగీత జ్ఞానము… భక్తి వినా, సన్మార్గము కలదే ఓ మనసా.. సంగీత జ్ఞానము’ అన్నారు మన త్యాగయ్య. భక్తి మార్గాలు వివిధాలు. శ్రవణం, దర్శనం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, సమర్పణం, సేవనం, దాస్యం, సఖ్యం.. ఆత్మ నివేదనం.. జయభేరిలో మల్లాదిగారి పాట కీర్తనంకు మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. ‘మది శారదాదేవి మందిరమే.. కుదురైన నీమమున కొలిచే వారి.. మది శారదాదేవి మందిరమే… రాగభావమ మరేగమకముల.. ఆఆఆఆ.. నాదసాధనలే దేవికి పూజా… తరళతానములే హారములో.. వరదాయని కని గురుతేరీ గిన.. మన మది శారదాదేవి మందిరమే..’ కలకాలం నిలిచే పాట. శంకరాభరణం శంకరశాస్త్రిగారయితే.. ‘రాగం తానం పల్లవి.. నా మదిలోనే కదలాడి కడతేరమన్నవి..’ అన్నారు. భక్తిమార్గంలో కీర్తనాన్ని ఎంచుకున్నవారనేకులున్నారు. త్యాగయ్య, దీక్షితార్, శ్యామశాస్త్రి, పురందరదాసు, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, మీరాబాయి, జయదేవుడు వారిలో కొందరు. అన్నట్లు సంగీతం ప్రస్తావన వస్తే తక్షణం స్ఫురణకు వచ్చే పేరు ‘తుంబురుడు’. మేటి గంధర్వుడు. కుబేరుడి వద్ద, ఇంద్రుడివద్ద విష్ణు సంకీర్తన చేసేవాడు. తుంబురుడి, నారదుడి వైశిష్ట్యాన్ని తలపులో ఉంచుకునే వేటూరి.. ‘శ్రీ తుంబుర నారద నాదామృతం.. స్వర రాగ రస భావ తాళాన్వితం… సంగీతామృత పానం, ఇది స్వరసుర జగతి సోపానం.. శివుని రూపాలు, భువికి దీపాలు, స్వరం, పదం, ఇహం, పరం కలసిన.. శ్రీతుంబుర నారద నాదామృతం’ అంటూ ఆణిముత్యం లాంటి పాటను ప్రసాదించారు. గంధర్వులకు, కిన్నెరలకు తుంబురుడే గురువట. గంధర్వగానం అంటుంటాం. అటువంటి గంధర్వులకే మరి తుంబురుడి గాన మాధుర్యాన్ని ఎంతగా ఊహించుకోవాలో!

తేటతేట తెలుగుపాట మాధుర్యం ఎంత విన్నా తనివి తీరదు. ‘పాడనా తెలుగుపాట.. పరవశమై.. మీ ఎదుట మీ పాట.. కోవెల గంటల గణగణలో.. గోదావరి తరగల గలగలలో, మావుల తోపుల మూపుల పైన మసలే గాలుల గుసగుసలో.. మంచి ముత్యాల పేట, మధురామృతాల తేట.. ఒకపాట.. పాడనా తెలుగు పాట’ అని అమెరికా అమ్మాయి పాత్రకోసం దేవులపల్లివారు అపురూపమైన పాటను అందించారు.. అలాగే ‘నీ లీల పాడెద దేవ.. మనవి ఆలించ వేడెద దేవ.. నను లాలించుమా ముద్దు దేవ’ అని ఎస్.జానకి సన్నాయితో పోటీపడి పాడిన పాట ఎంత గొప్పగా ఉంటుంది! ప్రార్థనా గీతాలు మరొక ఎత్తు. తనకు బాగా నచ్చింది ‘గుడ్డి’ సినిమాలో పాట. స్కూల్లో ప్రార్థన మొదలయ్యాక జయబాధురి ఆదరాబాదరా వచ్చి చేరుతుంది. ‘హమ్‌కో మన్ కి శక్తి దేనా… మన్ విజయ్ కరే.. దూసరోం జీ జైసే పహలె ఖుద్కొ జయ్ కరే.. భేద్ భావ్ అప్నే దిల్ సే సాఫ్ కర్ సకే.. దోస్తోం సే భూల్ హెతో మాఫ్ కర్ సకె.. రూట్ సే బచే రహే సచ్ కదమ్ భలే..’ పాట, సన్నివేశం కూడా చిత్రానికి హత్తుకుంటాయి.

ఇక హాస్యప్రధానమైన పాటలైతే చిన్నా, పెద్ద అందర్నీ అలరిస్తాయి. ‘అయ్యయో చేతిలో డబ్బులు పోయెనే.. అయ్యయో జేబులు ఖాళీ ఆయెనే.. ఉన్నది కాస్తా ఊడిందీ, సర్వమంగళం పాడింది.. పెళ్లాం మెడలో నగలతో సహా తీరుక్షవరమైపోయింది.. అయ్యయో..’, ‘చవటాయెను నేను వట్టి చవటాయను నేను… నీకంటే పెద్ద చవటాయను నేనే..’, ‘వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయం చెబుతాను, అసలు విషయం చెబుతాను’ వగైరా పాటలు నవ్వులు పంచేవే. నవ్వించే పాటల మాట అటుంచితే ఒక్కోసారి పాటల వల్లే హాస్యం జనిస్తూ ఉంటుంది. అన్నట్లు దమయంతి పిన్ని వాళ్లింట్లో చదువుకునే కుర్రాళ్లు అద్దెకు ఉండేవారు. ఆమె చెపుతూ ఉండేది, ఆ కుర్రాళ్లు లల్లాయి పదాలు పాడుతూ ఉంటారని. ‘నా చేతులే తలదిండులుగా దాచినాను నీకోసం’ అనే అదే పనిగా పాడుతుంటారని ఆమె ఇమిటేట్ చేస్తూ చెపుతుంటే నవ్వాగేది కాదు. మరో పోర్షన్లో కొత్తగా పెళ్లయిన దంపతులు ఉన్నారని, అతగాడు అనుమానప్పురుగని, కాలేజీ కుర్రాళ్ల చూపు తన భార్యపై పడుతుందన్న అనుమానంతో ఆమెను బయటకు రానివ్వడని, పైగా ఆ కుర్రాళ్లను సినిమా పాటలు పాడటం తనకు నచ్చలేదని ఫిర్యాదు చేశాడట. అదంతా విన్న తను ఆ తర్వాత దానికి మరి కొంత కల్పన జోడించి ఓ కథ రాసింది. అందులో భార్య ఓ శుభముహూర్తాన చాదస్తపు మొగుడితో తండ్రివి కాబోతున్నావని చెబుతుంది. మొగుడు సంతోషించే సమయంలోనే పక్క పోర్షన్ లోని కుర్రాడు ‘ఆరు మాసాలాగు.. పుడతాడు మనకో బాబు’ అని పాడటంతో అనమానప్పురుగు ఆగ్రహంతో ఊగిపోయి ‘నాకంటే ముందే వాడికి తెలిసిపోయిందన్నమాట. ఎన్నాళ్లనుంచి ఈ వెధవ్వేషాలు’ అంటూ భార్యను బాదేస్తాడు. ఆమె అవమానంతో, బాధతో కుంగిపోతుంది. చాదస్తపు మొగుడు ఇల్లు ఖాళీ చేయాలని తీర్మానించుకుని ఏ వసతులు లేని ఇంటికి ఎక్కువ అద్దె ఇచ్చి చేరుతాడు. అక్కడ కుర్రాళ్లెవరూ లేరన్నదే అతడికి నచ్చిన అంశం. తీరా ఇంట్లో చేరిన మర్నాడే అరవై యేళ్ల ఇంటి ఓనరు ‘ఏమే ఒప్పుల కుప్పా.. నిను ప్రేమిస్తే అది తప్పా… నీ అందం దాచెదవేలా రావేలా.. అంటూ ఇంత గొంతేసుకు పాడటంతో చాదస్తపు మొగుడు హతాశుడవుతాడు. ఆ కథ ఎందరినో నవ్వించింది.

ఎన్నో భాషల్లో ఎన్నో రకాల పాటలు ఉన్నా ప్రపంచం మొత్తంమీద అత్యధికంగా పాడే పాటగా ‘హేపీ బర్త్ డే టు యు’ గిన్నిస్ రికార్డుకెక్కింది. విశ్వవ్యాప్తంగా నిత్యం అసంఖ్యాకుల బర్త్ డేలు జరుగుతూనే ఉంటాయి, పాడుకుంటూనే ఉంటారు. ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ కావడంతో ఏ దేశం వారైనా ఆ పాటను అలాగే పాడుకుంటున్నారు. ఎన్నో భాషల్లోకి అనువాదమయిందట కానీ చాలావరకు ఇంగ్లీషు పాటే వినిపిస్తుంటుంది.

తెలుగులో పద్యాలు సైతం పాటలతో పోటీపడతాయి. గతంలో నాటకాల్లో పద్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఆ రాగాలు అనంతంగా సాగుతూ ఔరా అనిపించేవి. లవకుశ సినిమాలో శ్రీరాముడు అశ్వమేధయాగం చేసి అశ్వాన్ని వదలిపెట్టగా లవకుశలు దాన్ని పట్టుకుంటారు. శ్రీరాముడు దాన్ని వెదుక్కుంటూ వస్తాడు. తన పిల్లలే అని తెలియని రాముడు ఆ చిన్నారులను చూసి మృదువుగా వారికి నచ్చజెప్పచూస్తాడు.. వారి మధ్య పద్యరూపంలో సంవాదం నడుస్తుంది. స్త్రీ, బాల, వృద్దుల తెగవేయబూనుట పాడిగాదని నే వెనుకాడుచుంటి అని మొదలు ఎట్టి, ‘ముక్కుపచ్చలారని మునికుమారుల చంపకూడదంచు నే గొంకుచుంటి’ అని శ్రీరాముడంటే, ‘రిపులపై ఎవరైన కృప వహింతురటయ్య గొంకుగాదది నీకు జంకుగాని” అని, చివరకు ‘రణమో, శరణమో చెప్పుమా రాఘవేంద్రా’ అని శ్రీరాముణ్నే ఎదిరిస్తారు ఆ చిన్నారులు. గొప్ప సన్నివేశం!

పాటకు సంబంధించి అనేకమైన సినీగీతాలున్నాయి. ‘నా పాట నీ నోట పలకాల సిలకా..’ ఎంత గొప్ప హిట్! ‘పాడుతా తీయగా చల్లగా… పసిపాపలా నిదురబో తల్లిగా.. బంగారు తల్లిగా..’ అంటూ నిదురబుచ్చే పాట, ‘పాడవేల రాధికా, ప్రణయ సుధా గీతికా.. గోపాలుడు నిను వలచి.. నీ పాటను మది తలచి, ఏ మూలనో పొంచిపొంచి వినుచున్నాడని ఎంచి.. పాడవేల రాధికా…’, ‘పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే’ అనే ప్రేమికుడు, ‘మళ్లీమళ్లీ పాడాలి ఈ పాట, నీ బతుకంత కావాలి పూలబాట..’ అనే స్నేహితురాలు, ‘ఇదే పాట, ప్రతీ చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను’ అనే విషాద నాయకుడు, ‘పాడెద నీ నామమే గోపాలా’ అనే పెళ్ళికూతురు, ‘సరిగమప పాట పాడాలి, పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి’ అనే టీచరమ్మ, ‘పాడమని నన్నడగవలెనా, పరవశించి పాడనా’ అనే ప్రేమిక. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది’ అంటూ ఊరట పొందే నాయిక.. ఇలా తీరుతీరుల తీరైన పాటలు. గాన కళా ప్రావీణ్య పోటీలే ప్రధానాంశంగా వచ్చిన సినిమాలూ ఉన్నాయి పాటల్లో సోలోలు, డ్యూయెట్లు, బృందగీతాలు.. రకరకాలు. ఆడ, మగ గళాలను ఒక్కరే పలికించగల గాయకులూ ఉన్నారు. లేగొంతుకలు, ముసలి గొంతు కలను పలికించడంలో ఎస్.జానకి పెట్టింది పేరు. గాత్ర సంగీతం ఒక ఎత్తు, వాద్య సంగీతం మరో ఎత్తు. కృష్ణుడు వంశీకృష్ణుడు. తన వేణుగానంతో వ్రేపల్లెనంతటినీ సమ్మోహపరిచిన వాడు. మురళి ప్రస్తావనవస్తే గుర్తొచ్చే పాట ‘వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి, నవరస మురళి, ఆనందన మురళీ.. ఇదేనా ఆ మురళి.. మోహన మురళి, ఇదేనా ఆ మురళి’ మరో ప్రపంచం లోకి లాక్కెళ్లే పాట. చదువుల తల్లి సరస్వతి వీణాపాణి. ఆమె ప్రశాంతంగా, ఏకాంతంగా వీణవాయించుకుంటున్న చిత్రాలనే ఎక్కువగా చూస్తుంటాం. పాటకు ఉన్న శక్తి అసాధారణమైంది. ప్రతి దేశానికి ఓ జాతీయగీతం, రాష్ట్రాలకు, రాష్ట్రగీతాలు ఉండటం తెలిసిందే. జనగణమన వినగానే ప్రతి భారతీయుడి మది దేశంపట్ల భక్తి భావంతో పులకించడం సహజం. అలాగే వందేమాతర గీతం. ఏం విన్నా ఏమీ అనిపించదు అంటే వాళ్లు మనుషుల లెక్కలోకి రారనే అనుకోవాలి. తెలుగు రాష్ట్రాల గీతాలు రెండూ ఎంత మధురంగా ఉంటాయి! శంకరంబాడి సుందరాచారి రచించిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు..’ అ పాట పాడితే పరవశించని మది ఉంటుందా? అలాగే అందెశ్రీ రచించిన తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.. తరతరాల చరితగల తల్లీ నీరాజనం’ అని పాడుతుంటే గుండె ఉప్పొంగిపోదూ. ఇక ఉద్యమగీతాలు జనానికి ఇచ్చే స్ఫూర్తి అనంతం. భారత స్వాతంత్ర్య సమయంలో దేశభక్తి గీతాలు వెల్లువెత్తి భారత ప్రజను ఒక్కతాటిపై నిలిపాయనవచ్చు. నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాడిన “పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా… పోరు తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా..’ పాటను కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా వందలాది పోరు పాటలు వచ్చాయి. పనిచేస్తూ పాటలు పాడుకోవటం ఒకటైతే, పాటలే వృత్తి, ప్రవృత్తిగా ఉన్న వారూ అనేకులున్నారు. ఓ బాలమురళి, ఓ సుబ్బులక్ష్మి, ఓ ఘంటసాల, ఓ సుశీల, ఓ జానకీ, ఓ వాణీ జయరామ్, ఓ చిత్ర, ఓ బాలసుబ్రహ్మణ్యం, ఓ జేసుదాస్.. ఇలా ఎందరెందరో తమ గానవిద్వత్తుతో విశ్వమంతటికీ వీనుల విందు చేశారు, చేస్తున్నారు. మరో పార్శ్వాన్ని చూస్తే ఏ పాండిత్యము, విద్వత్తు లేకపోయినా ఇంటికే పరిమితమైన సుస్వరాలెన్నో. రైళ్లలో, ఇతర చోట్ల బిచ్చగాళ్లు సైతం పాటలు పాడి అడుక్కో వడం తెలిసిందే. విన్నపాటలను తమదైన శైలిలో వినిపిస్తుంటారు వారు. అవి కొంత ప్రత్యేకంగా ఉంటాయి. హరికథాగానం మరొక వైవిధ్యం. ఆదిభట్ల నారాయణ దాసుగారు తన హరికథలతో అందర్నీ అలరించి హరికథా పితామహుడిగా గుర్తింపు పొందారు. అక్బర్ కొలువులో ఉన్న తాన్‌సేన్ వంటి వారు గానకళలో ప్రసిద్ధిచెంది, చరిత్రలో నిలిచిపోయారు. పండిట్ భీమ్‌సేన్ జోషి, హరిప్రసాద్ చౌరసియా.. ఒకరా, ఇద్దరా ఎందరెందరో భారతదేశ నలుచెరగులూ ఎందరెందరో.. ఎన్నో భాషల్లో, ఎన్నో రీతుల్లో తమదైన ప్రత్యేకతలను చాటుకుంటున్నారు. కర్ణాటక సంగీతంలాగే హిందుస్తానీ కూడా ఎంతగానో అలరిస్తుంది. గజల్స్, ఖవ్వాలీ శైలులు రస హృదయులను ఆనందడోలలూగిస్తాయి. ఆనంద ప్రకటనకు పాటే చక్కటి మార్గం. మది పరవశమైతే, ‘గాతా రహే మేరా దిల్.. తుహీ మేరీ మంజిల్.. కహీ బీతేనా యే రాతే.. కహీ బీతేనా యే దిన్..’ అని పాడుకోవడంలో వింతేముంది!

పాటల్లో బ్రెత్లెస్ (నాన్ స్టాప్) పాటలెంతగానో ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా శంకర్ మహదేవన్ పాడిన ‘కొయి జో మిలాతో ముఝె అయిసా లగ్‌తా థా..’ ఎంత పాపులర్ అయిందో! తెలుగులో సైతం ‘ఓం మహప్రాణ దీపం శివం శివం మహ ఓంకార రూపం శివం శివం మహ సూర్యచంద్రాధినేత్రం..పవిత్రం..’ శంకర్ మహదేవన్ పాటను మరువగలమా.

అసలు మనసుతో వినాలే కానీ ప్రకృతి అంతా సంగీతమయమే. గాలుల సవ్వడి, కొమ్మల, రెమ్మల సడులు, సెలయేటి గల గలలు అంతెందుకు… ఇంటి తలుపు సైతం తెరిచి, మూస్తుంటే ఓ వాద్య సంగీతం వినిపిస్తుంది. అందుకే ఓ సినీ కవి అన్నట్లు హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం, కనగలిగిన మనసుంటే బ్రతుకే అనురాగమయం. గానానికి వర్షం కురిపించే శక్తి, దీపాలు వెలిగించే శక్తి వగైరాలు ఉన్నాయంటారు. అంతేనా రోగాలను కూడా నయంచేసే శక్తి గానానికీ ఉందని అంటున్నారు. అదేమో కానీ ఉపశమనంగా ఉంటుందన్నది మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. హాయిని, హుషారును, అలౌకిక ఆనందాన్ని కలిగించే పాట, మనిషికున్న అదృష్టాలలో ఒకటి. ‘ప్రతి రాత్రి వసంతరాత్రి ప్రతి గాలి పైరగాలి.. బ్రతుకంతా ప్రతినిముషం పాటలాగ సాగాలి..’ అని ఆకాంక్షించడంలో తప్పులేదుగా. “రోడ్డుమీద ఎన్నికల ప్రచార వాహనం వెళ్తూ ‘ఓటరన్నా.. ఓటు వేయరన్నా’ పాట వినిపించడంతో నా ఆలోచనలకు అంతరాయం కలిగింది.. ఇంకేముంది.. పవమాన సుతుడు బట్టు పాదారవిందములకు.. నీ నామా రూపములకు నిత్య జయ మంగళమ్..

Exit mobile version