[box type=’note’ fontsize=’16’] “దైవం ఉన్నాడన్న భావన మనిషికి ఒక టార్చ్‌లైట్ లాంటిది. ఆ వెలుగు మనిషికి ఓ ధైర్యాన్ని ఇస్తున్నప్పుడు, సత్పథాన్ని చూపుతున్నప్పుడు అంతర్యామిని స్మరించుకోవడంలో తప్పేముంది” అంటున్నారు జె. శ్యామల ‘మానస సంచరరే -15: పరిపరి విధముల భక్తి పరిమళం!’ కాలమ్‍లో. [/box]
తూరుపు ఇంకా తెలతెలవారినట్లే లేదు. అంతలో… ‘నీలకంథరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా.. నీలకంథరా దేవా..’ ఉదయాన్నే నాకు ఇష్టమైన ఘంటసాల పాట… ముఖ్యంగా ఈ పాటలో ‘అన్యదైవమూ గొలువా… ఆ.. అన్యదైవమూ గొలువా నీదు పాదమూ విడువ.. అన్యదైవమూ…’ అన్నచోట, ‘కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా.. కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా’ అనే చోట పాడిన తీరు నాకు చాలా చాలా ఇష్టం..
ఓఁ… అన్నట్లు ఈ రోజు శివరాత్రి కదూ. అందుకే ఇంత ఉదయానే దగ్గర్లోని శివాలయంనుంచి ఇంత చక్కటి పాట. వాకిట్లోకి తొంగిచూశాను. ఆ చివర నుంచి ఈ చివర వరకు కార్లు పార్క్ చేసి ఉన్నాయి… అవన్నీ గుడికి వచ్చిన భక్తజనుల వాహనాలు. పట్టువస్త్రాలు ధరించి, పూలసజ్జలు పుచ్చుకొని, పదపదమంటూ హడావిడి పడుతున్నారు. ‘చెప్పులు కార్లోనే వదిలేయండి’ ఎవరిదో హెచ్చరిక. ఇప్పుడు కార్లలో చెప్పులు వదిలే సౌలభ్యం ఉంది. లేదంటే గుడి దగ్గర చెప్పులను పదిలపరిచి టోకెన్ ఇచ్చి, తర్వాత డబ్బులిస్తే, టోకెన్ చూసి ఎవరి చెప్పులు వారికి అందించే సదుపాయాలు ఉన్నాయి. పాతకాలంలో ఇవేవీ లేక బయట చెప్పులు వదిలి వెళ్లటంతో దండం పెట్టుకునే సమయంలో కూడా చెప్పులను గురించిన చింత తప్పేదికాదు. అందుకే ‘చిత్తం శివుడి పైన, భక్తి చెప్పుల పైన’ అనే సామెత వచ్చింది.
ఇంతలో మరో కర్ణపేయమైన పాట “దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హరనమో నమో….” ఈ పాటలోనూ ఘంటసాల ‘పంకజ నయన.. పన్నగ శయన, పంకజ నయన, పన్నగ శయన శంకర వినుత నమో నమో..’ అనే చోట, ‘నారాయణ హరి నమో నమో… నారాయణహరీ నమోనమో… నారద హృదయ విహారీ నమోనమో… నారద హృదయ విహారీ నమోనమో… నారాయణ హరి… నారాయణహరి… నారాయణ హరి’ అనటంలో తన ప్రత్యేకతతో శ్రోతలను భక్తపరవశుల్ని చేస్తాడు. ఈ రోజంతా శివయ్య పాటలే వినిపిస్తాయి..
ఉపవాసం కొన్ని పర్వాలకు మామూలే అయినా, జాగరణ మాత్రం శివరాత్రి ప్రత్యేకతే. ఎక్కడ చూసినా అరటిపళ్లు, పుచ్చకాయలు, కర్బూజాలు, కమలాలు, ద్రాక్షలు, కర్జూరాలు గుట్టలుగా.. ఎంత రేటయినా సరే ‘అసలే ఉపవాసం’ అంటూ కొనేయడమూ మామూలే. మా స్నేహితురాలు మల్లిక మాత్రం “ఉపవాసమా! ఎలా ఉంటాం ఏమిటో.. నాకు మాత్రం వంటల ఘుమఘుమల వాసన గుర్తిస్తే చాలు నోరూరిపోతుంది. పొట్ట పోరునాపటం నావల్ల కాదు బాబూ” అంటుంది. గుళ్ళో దేవుణ్ణి దర్శించుకొని, భక్తిగా దండం పెట్టుకొని, అంతే భక్తిగా భోజనం చేస్తుంది. అసలు ఉపవాసమంటే నిరాహారంగా ఉండమని కాదు అర్థం, దేవుడికి దగ్గరగా ఉండమని… అంటే మనసును దేవుడిమీదే ఉంచమని అంటారు కొందరు. మల్లికను గుర్తుచేసుకున్నందుకేమో నాకు ‘టీ’ మీదకు మనసు మళ్లింది. ఇంకేముంది. వంటింట్లోకి వెళ్లి టీ తెచ్చుకున్నాను. ఇప్పుడు ‘టీ కప్పులో తుఫాను’ కాదు కానీ టీ కప్పులో భక్తిగత ఆలోచనలు చెలరేగాయి… ఆకాశవాణిలో ఉదయాన ‘భక్తిరంజని’ కార్యక్రమంలోనే ప్రతి ఇంటా పనులు మొదలయ్యేవి. అంతేనా, భక్తి గీతాల కార్యక్రమాలూ ఉండేవి. త్యాగయ్య ‘రామభక్తి సామ్రాజ్యం… రామభక్తి సామ్రాజ్యమే మానవులకబ్బెనో మనసా ఆ మానవుల సందర్శన మత్యంత బ్రహ్మానందమే’ అంటూ ‘ఈలాగని వివరింపలేను చాలా స్వానుభవవేద్యమే…’ అంటాడు. మరో కీర్తనలో.. ‘సంగీత జ్ఞానము… భక్తి వినా… సన్మార్గము కలదే ఓ మనసా…’ అంటాడు.
దైవం ఉన్నాడనుకునేవారికి ఈ భక్తిమార్గ శోధన, సాధన. త్యాగయ్య రామ భక్తుడయితే, పురందరదాసు విఠల భక్తుడు, శ్యామశాస్త్రి అంబ భక్తుడు, అన్నమయ్య వేంకటాధీశుడి భక్తుడు.. మీరా కృష్ణభక్తురాలు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టదైవ సంకీర్తనం. ఎందరెందరో భక్తులు. రామభక్తుడనగానే కళ్లముందు నిలిచే రూపు హనుమ. రాముడి సేవకే అంకితమై, సీతాన్వేషణ చేసి, ఆపైన వారధి నిర్మాణంలో పాల్గొని, యుద్ధసమయంలో మూర్ఛనొందిన లక్ష్మణుణ్ని రక్షించడానికి ఏకంగా సంజీవని పర్వతాన్నే మోసుకొచ్చిన అపరభక్తుడు. శబరి భక్తి అనుపమానమైనది. రాముడినే ధ్యానిస్తూ ఆయన రాక కోసం ఎదురుచూసి, చూసి, రాముడు రాగానే ‘కదలలేదు వెర్రి శబరి, ఎదురుచూడలేదని.. నాకోసమే నాకోసమే నడచి నడచి నడచి.. నాకన్నా నిరుపేద నా మహారాజు పాపం అడుగో’ అంటుంది. రాముడికి సమర్పించే పళ్లు తియ్యగా ఉన్నాయో, లేదోనని తాను ముందుగా రుచి చూసి మరీ రాముడికి అందిస్తుంది. కృష్ణభక్తులు సరేసరి. పల్లెల్లో ప్రతి ఇంటా కృష్ణుడే. మోహనమురళిని మోహించని వారే లేరు. బృందావనంలో గోపికలందరూ కృష్ణుడినే మనసా, వాచా తలచి, ఆడిపాడారు.
భక్తపోతన, భక్తరామదాసు వంటి పరమభక్తులు నడయాడిన నేల మనది. భక్త శిరియాళ, భక్త ప్రహ్లాద, భక్త కన్నప్ప వంటి భక్తాగ్రేసరులు, భక్త మార్కండేయ, భక్త శబరి వంటి భక్త శిఖామణుల ఉదంతాలెన్నో మన పురాణాల్లో ఉన్నాయి. దైవభక్తిని ‘నవవిధ భక్తి’గా వివరించారు పెద్దలు. అందులో మొదటిది శ్రవణం. అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తును ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శుకమహర్షి వర్ణించిన భాగవతాన్ని నిరంతరంగా ఏడురోజుల పాటు విని మోక్షాన్ని పొందాడు. రెండవది కీర్తనం. ఇందుకు ఉత్తమ ఉదాహరణ నారదుడు. నిరంతరం నారాయణ, నారాయణ అంటూ హరినామ కీర్తనమే చేస్తుంటాడు. మూడవది స్మరణం.. ఇందుకు ప్రహ్లాదుడిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎన్ని అవరోధాలెదురైనా, తండ్రి ఎన్ని చిత్రహింసలు పెట్టినా నిరంతరం నారాయణ మంత్రాన్ని స్మరిస్తూ దైవానుగ్రహానికి పాత్రుడయ్యాడు. నాల్గవది పద సేవనం. లక్ష్మీదేవి, విష్ణు పద సేవనంలో అనవరతం నిమగ్నమై ఉంటుందట. అన్నమయ్య ‘బ్రహ్మ కడిగిన పాదము..’ కీర్తనలో విష్ణుపాదాలను కీర్తిస్తూ ‘ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము.. పామిడి తురగపు పాదము’ అంటూ ఇంకా, ‘పరమయోగులకు పరిపరివిధముల పరమొసగెడి నీపాదము, తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదమూ’ అని విష్ణుపాదాలను స్తుతించాడు. దేవాలయాలలో పూజారి భక్తులకు తీర్థం ఇచ్చాక శఠగోపం పెట్టడం తెలిసిందే. ఆ శఠగోపం మీద దేవుడి పాదాలే చిత్రించి ఉంటాయి. ఐదవది అర్చన. పుష్ప, పత్ర, జల, ఫలాలతో అర్చించడం. పూజా విధానంలో ‘షోడశోపచారాలు’ ఉంటాయి. అవి.. ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, శ్రీగంధం, అలంకారం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. తాంబూలం, నీరాజనం. ఈ క్రియలు సభక్తితో చేసినపుడే దానికో అర్థం, పరమార్థం. అందుకే తెలిసో, తెలియకో పొరపాటు చేసి ఉండవచ్చనే పూజ చివర ‘మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన… యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే’ అని వేడుకుంటారు. ఆరవది వందనం. ప్రార్థనే వందనం. నిండుమనంతో చేసే ప్రార్థన. అన్నిటా దైవాన్నే దర్శించేంతగా లీనమై చేసే ప్రార్థన. ఏడవది దాస్యం. దాసుడు అనగానే గుర్తొచ్చేది హనుమ. సీతాన్వేషణ, లంకాదహనం, వారధి నిర్మాణం, సంజీవనిని తెచ్చి లక్ష్మణుణ్ని బతికించడం… అందుకే హనుమను దాసాంజనేయస్వామి అని కూడా అంటారు. ఎనిమిదవది సఖ్యం. దైవాన్ని స్నేహితుడిగా భావించి, కష్ట,సుఖాలను పంచుకోవడం. అర్జునుడు, శ్రీకృష్ణుడిని అదే విధంగా భావించి, కురుక్షేత్రంలో యుద్ధం చేయకపోయినా, కేవలం తన పక్కన ఉంటే చాలనుకున్నాడు. తొమ్మిదవది ఆత్మనివేదనం. తనను తాను సమర్పించుకోవడం. ఇందుకు బలిచక్రవర్తిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వామనుడు మూడో అడుగుమోపడానికి బలి చక్రవర్తి తన తలనే సమర్పించాడు. ఎందరెందరో పరమభక్తులు, భక్తాగ్రేసరులు, భక్త శిఖామణులు. భక్తపోతన, భక్తరామదాసు, త్యాగయ్య, భక్తప్రహ్లాదుడు, భక్త సిరియాళుడు, భక్త మార్కండేయుడు, భక్తకన్నప్ప, భక్త శబరి, మీరా.. మనుషులే కాదు ఇతర ప్రాణులు సైతం భక్తిలో తరించినవి ఉన్నాయి. శ్రీకాళహస్తిలో సాలీడు, పాము, ఏనుగు భక్తితో లింగాన్ని పూజించి, చివరకు మోక్షాన్ని పొందిన స్థలపురాణకథ తెలిసిందే. అంతేకాదు, గజేంద్రమోక్షంలో మకరికి చిక్కిన కరి… విష్ణువును ప్రార్థించి ఎక్కడో ఉన్న… అలవైకుంఠపురంబులో, నగరిలో, ఆమూల సౌధంబు దాపల… పర్యంక రమావినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహిపాహి యన గుయ్యాలించి సంరంభియై.. శంఖ చక్రాలను సైతం ధరించక పరుగున విచ్చేసి, గజరాజును కాపాడాడట. వారధి నిర్మాణంలో ఉడుత సైతం ఇసుకరేణువుల్ని మోసి, రాముని కృపకు పాత్రురాలైందని, రాముడు ప్రేమగా దాని వీపు నిమిరినందునే ఉడుతకు మూడుచారలు ఏర్పడ్డాయని ఓ కథనం. అంతెందుకు దేవుళ్ల వాహనాలన్నీ పక్షులు, జంతువులే. గరుడపక్షి- విష్ణువుకు, ఎద్దు- శివుడికి, హంస- బ్రహ్మసరస్వతులకు, సింహం-పార్వతికి, మూషికం-వినాయకుడికి, నెమలి-కుమార స్వామికి… ఇలా ఎనెన్నో ప్రాణులు, ఎన్నెన్నో దేవుళ్లకు వాహన సేవలందిస్తున్నాయి.
ఏమైనా దైవం ఉన్నాడన్న భావన మనిషికి ఒక టార్చ్‌లైట్ లాంటిది. ఆ వెలుగు మనిషికి ఓ ధైర్యాన్ని ఇస్తున్నప్పుడు, సత్పథాన్ని చూపుతున్నప్పుడు అంతర్యామిని ఎవరికి నచ్చిన రూపంలో వారు స్మరించుకోవడంలో తప్పేముంది. భక్త రామదాసుగారు ‘తక్కువేమి మనకూ.. రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనేయుండగ’ అనుకొంటూ ఎంతటి నిశ్చింతను అనుభవించారో కదా.
దైవభక్తి ఒకటేగాక ఇంకా అనేకరకాల భక్తులున్నాయి. పితృభక్తి, ఇందుకు రాముడే గొప్ప ఉదాహరణ. పితృవాక్య పరిపాలన కోసం, పట్టాభిషిక్తుడు కావలసిన రాముడు పదునాలుగేండ్లు వనవాసానికి పయనమయ్యాడు. అలాగే భారతంలో దేవవ్రతుడు, తండ్రి కోరుకున్న వివాహం చేసుకునేందుకు తాను బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞచేసి భీష్ముడయ్యాడు. మాతృదేవో భవ, పితృదేవోభవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నది ఆర్యవాక్కు. శ్రవణకుమారుడు అంధులైన తల్లిదండ్రులమీద భక్తితో వారి సేవకే అంకితమవటం తెలిసిందే. గురుభక్తి.. ఏకలవ్యుడు ద్రోణుడు అడిగిందే తడవుగా తన బొటనవేలును గురుదక్షిణగా సమర్పించాడు. అది ఇతిహాస కథే అయినా సర్వేపల్లి రాధాకృష్ణన్ పట్ల భక్తితో విద్యార్థులు, ఆయనను బగ్గి ఎక్కించి స్వయంగా లాగడం తెలిసిందే. విశ్వరూపం సినిమాలో నూటికో, కోటికో ఒక్కరు… ఎప్పుడో, ఎక్కడో పుడతారు… అది మీరే మీరే మాష్టారు, మా దేవుడు మీరే మాష్టారు’ అని విద్యార్థులు పాడతారు. ‘బడిపంతులు’ చిత్రంలో అయితే బడిపిల్లలు మాష్టారికీ ఓ ఇంటినే కట్టి ఇస్తారు. సోదర భక్తికి లక్ష్మణుడు, భరతుడు సిసలైన ఉదాహరణలు. లక్ష్మణుడు అన్నగారి మీద భక్తితో భార్య ఊర్మిళను వదిలి, పదునాలుగేండ్లు అన్నగారితో పాటుగా వనవాసం చేసి, అన్నగారికి అండగా నిలిచాడు. భరతుడు తానే పాలించే అవకాశం ఉన్నా రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి నిమిత్త మాత్రుడిగా రాజ్యపాలన చేసి, పదునాలుగేళ్ల గడువు తీరగానే అన్నగారికి రాజ్యాన్ని అప్పగించాడు. ప్రభుభక్తి, స్వామి భక్తి గలవీరులెందరో చరిత్రలో నిలిచిపోయారు.
ఇక దేశభక్తి… దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ, ‘ఏ దేశమేగినా… ఎందుకాలిడినా.. పొగడరా నీతల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ అని రాయప్రోలు… ఎందరెందరో దేశభక్తి పూరిత గీతాలందించారు. ఎందరో మహనీయులు దేశభక్తితో దేశసేవకే అంకితమయ్యారు. అసంఖ్యాక సైన్యం దేశభక్తితో అహరహం దేశరక్షణ కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. తాజాగా భారత వాయుదళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మన మిలటరీ బేస్‌ను టార్గెట్ చేసిన పాక్ విమానాన్ని వెంబడించి… ఆ క్రమంలో శత్రువు చేతచిక్కినా, ప్రాణహాని ఉన్నా దేశభక్తికి ప్రతి రూపుగా నిలిచి దేశ ప్రజలందరి జేజేలందుకున్నాడు.
ఆశయభక్తి.. బాల ధృవుడు తమ్ముడిలాగా తానూ తండ్రి తొడపై కూర్చోబోగా, సవతి తల్లి అతడి నిరోధించి తండ్రి తొడపై కూర్చోవాలంటే తపస్సు చేస్తే కానీ అందుకు అర్హత రాదంటుంది. అంతే. ధృవుడు తపస్సుతో దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలనే ఆశయంతో బయల్దేరుతాడు. ఒంటికాలిపై తపస్సుచేసి దైవాన్ని మెప్పించి, వరాలు పొందుతాడు. తిరిగివచ్చిన ధృవుడిని, తండ్రి రాజ్యానికి అభిషిక్తుని చేస్తాడు. అలా ధృవుడు భక్తితో తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు.
ఇవన్నీ కాక ఎక్కువగా కనిపించేది కోరికల భక్తి. ఏదో ఒక కోరికతో దేవుడిని పూజించడం. కోరిక తీరిస్తే మొక్కులు చెల్లిస్తామని విన్నవించుకోవడం. ఈ కోరికలు అనంతాలు. ఒక కోరిక తీరితే మరో కోరిక మొలుచుకొస్తుంది. ఏకకాలంలో బహుళ కోరికలు కూడా సర్వసాధారణమే. కారణం కోరికలన్నీ ఒకదానితో ఒకటి లింక్ కలిగి ఉండటమే. అయితే దేవుణ్ణి ఏ కోరికా కోరకుండా ప్రార్థించాలని ఆధ్యాత్మిక వాదులు కొందరు చెపుతారు. అయితే దేవుణ్ణి కాకపోతే మనం ఇంక ఎవరిని అడగగలం, అందులో తప్పేమీ లేదనేవారు కోకొల్లలు. సరే, కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ‘అన్యధా శరణం నాస్తి… త్వమేవ శరణం మమ’ అని దైవాన్ని స్మరించుకోవలసిందే. యవ్వనకాలం వరకు భక్తిఛాయలు కనిపించకున్నా, జీవిత సంధ్యలో అడుగు పెట్టాక చాలామందికి భక్తి అలవడుతుంది. అది ఆలోచనల్లో వచ్చిన మార్పు కావచ్చు, లేదా మరణ భీతి కావచ్చు. చలం లాంటి వారే చివరకు అరుణాచలాన్ని ఆశ్రయించారు. భయభక్తులు జంట పదాలు. భయం వల్లే భక్తి ఏర్పడుతుందని అంతా అనే మాటే. భక్తి భయాన్నిబాపుతుందని భక్తుల విశ్వాసం. భక్తి శ్రద్ధలు, భక్తి విశ్వాసాలు కూడా జంటపదాలే. అసలు ఏదైనా భక్తి సంబంధితమే. పనే దేవుడుగా భావించేవారికి పని పట్ల భక్తి ఉండి తీరుతుంది. ఈ రకంగా ఆలోచిస్తే మనిషి ఏదో రకంగా భక్తిమార్గాన పయనిస్తున్నట్లే లెక్క. ‘ఏమి సేతురా లింగా ఏమీ సేతురా గంగ ఉదకము తెచ్చి నీకు లింగపూజలు చేతమంటే గంగనున్న చేపపిల్ల ఎంగిలంటున్నది లింగా ఏమి సేతుర లింగా ఏమీ సేతురా…’ మంగళంపల్లి వారు తత్వాన్ని ఎంత చక్కగా ఆలపించారో.
నిజమే… సకల సృష్టి దైవానిదయినప్పుడు మనిషి ఆయనకు ఇవ్వగలిగిందేముంది?…
అన్నట్లు దేవుళ్లలో కూడా భక్తసులభులున్నారని పురాణాలు చెపుతున్నాయి. శివుడు బోళా శంకరుడని, అందువల్ల భక్త సులభుడని అంటుంటారు. అయితే శ్రీహరి కూడా భక్తసులభుడనే అనేక పురాణకథల్లో ఉంది. భక్తి విషయంలో ఎవరికీ ఇబ్బంది కలిగించనంతవరకు ఎవరి మార్గాన్ని వారు అనుసరించవచ్చు. అయితే మూఢభక్తి పనికిరాదు. దొంగస్వాములు, దొంగబాబాల మాయల్లో పడి.. కష్టనష్టాల పాలయ్యేవారిది మూఢభక్తి మరి. అలాగే ఎటువంటి మానవప్రయత్నం చేయకుండా, సామెత చెప్పినట్లు.. ‘గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ’ అనడం కూడా మూఢభక్తే. ముప్పుతెచ్చే మూఢభక్తికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.
“ఏమిటి ఇవాళ ఆఫీసు లేదా?” మావారి ప్రశ్నతో అప్పటిదాకా నా మనో సంద్రంలో ఎగసిపడ్డ భక్తిగత ఆలోచనపుటలలు ఒక్కసారిగా అణిగి పోయాయి. అవును. ఆఫీసు… టైమ్… బాబోయ్. శివరాత్రులకు, శ్రీరామనవములకు సెలవులిచ్చే ఉద్యోగంకాదు నాది. పనే దైవం అని తెలుగువారు, ‘కామ్ భగవాన్ హై’ అని హిందీవారు, ‘వర్క్ ఈజ్ వర్షిప్’ అని ఇంగ్లీషువారు ముక్తకంఠంతో చెప్పనే చెప్పారు’ అనుకుంటూ ఉద్యోగం మీద భక్తితో ఒక్క ఉదుటున లేచాను.