మానస సంచరరే-18: ఇల్లు… ఆనందాల హరివిల్లు!

7
3

[box type=’note’ fontsize=’16’] “రోజంతా – బయట గడిపినా ప్రతివారు సాయంత్రానికి తమ ఇంటికి చేరి సేదతీరాలనే కోరుకుంటారు” అంటున్నారు జె. శ్యామలమానస సంచరరే -18: ఇల్లు… ఆనందాల హరివిల్లు’ కాలమ్‌లో. [/box]

[dropcap]సా[/dropcap]యం సంధ్య! దివాకరుడు డ్యూటీ ముగించి దిగిపోతున్న వేళ! ఆకాశం వైవిధ్య వర్ణ సంశోభితమై, మబ్బులన్నీ చిత్రవిచిత్ర రూపాల్లో తరలిపోతున్నట్లు సాక్షాత్కరిస్తున్న సమయం! పక్షులన్నీ గుంపులుగా గూటికి చేరే తొందరలో రెక్కల వేగం పెంచి పయనిస్తున్న సందర్భం! బాల్కనీ నుంచి గగనవీధిని తిలకించటం.. ఎప్పటికప్పుడు సరికొత్తగా అనిపించటం నాకు మామూలే. నా చూపు నింగి నుంచి కాస్తంత కిందకు మారింది. ఎదురుగుండా ఉన్న ఖాళీ స్థలంలో ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టులో అక్కడక్కడా పక్షుల గూళ్లు.

ఓ గూటినుంచి రెండు పిల్ల పక్షులు ఆఫీసునుంచి వచ్చే అమ్మా, నాన్న కోసం ఎదురుచూస్తూ పదేపదే కిటికీనుంచి తొంగి చూసే పిల్లల్లా, తమ తలలు బయట పెట్టి చూస్తున్నాయి. మనిషయినా, పక్షి అయినా ఈ విషయంలో ఒకటే అనిపించింది. పక్షులు ఎంత అందంగా కట్టుకున్నాయో తమ గూటిని. సృష్టిలో ప్రతిజీవికి వాటి మనుగడకి అవసరమైన తెలివితేటలు, నేర్పు ప్రకృతిసిద్ధంగానే ఉంటాయి. చీమలకు, పాములకు పుట్టలు, సింహాలకు గుహలు, ఎలుకలకు కన్నాలు, ఉడతలకు తొర్రలు… ఇలా వేరే వేరు జీవులకు వేర్వేరు ఆవాసాలు… నివాసాలు. నా చూపు ఇంకొంచెం పక్కకు జరిగింది. రకరకాల ఇళ్లు, మేడలు… అపార్ట్‌మెంట్లు.. అటువైపు భవన నిర్మాణ శ్రామికుల గుడిసెలు..

“మేడంటే మేడ కాదు… గూడంటే గూడు కాదు
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది..
నేనయితే ఆకు, కొమ్మ తానైతే వెన్నెల వెల్ల
పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది…”

పాటను మది గుర్తుచేసుకుంది.

మనిషి కనీస అవసరాల్లో గూడు ఒకటి. తల దాచుకునేందుకు చేసిన ఆలోచన క్రమంగా విస్తరించి సుందర హార్మ్యాల నిర్మాణానికి దారితీసింది. ప్రతి మనిషికి పేరుకు ముందు ఓ ఇంటి పేరు ఉంటుంది. వీటిలో కొన్ని చిత్రంగా నవ్వించేవిగా కూడా ఉండటం మామూలే. అంతేనా… ఇంటి చిరునామా ప్రతివారికి ఉండాల్సిందే. మళ్లీ దానికొక ప్రూఫ్ కూడా అవసరమే. ‘చిరు’నామా అంటారేగానీ చాలాసార్లు అవి దీర్ఘనామాలుగానే ఉంటాయి. మళ్లీ ఎవరికి వారు వారింటికి – శ్రీనివాసం, ఆనందనిలయం, స్నేహకుటీరం, ప్రశాంత నిలయం వగైరా పేర్లు పెట్టుకోవడమూ తెలిసిందే.

ఇల్లంటే అది ఒక గది కావచ్చు. లేదా డ్రాయింగ్ రూమ్, డైనింగ్ హాల్, బెడ్ రూమ్, దేవుడి గది, స్టోర్ రూమ్, కిచెన్ల పేరిట వివిధ గదుల సముదాయం కావచ్చు. దీన్ని మించి టూ బెడ్రూమ్, త్రీ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పుడు మామూలయి పోయాయి. డబ్బు బాగా ఉంటే డూప్లెక్స్లు.

మనిషిలో బాల్యం నుంచే ఇల్లు గురించి చిరు ఊహలు ఉంటాయి. గతంలో పిల్లలు బొమ్మరిల్లు కట్టి ఆడుకోవటం పరిపాటిగా ఉండేది. ఇప్పుడు అలా కాకపోయినా ప్లాస్టిక్ లేదా ఉడ్ పీసెస్‌తో ఇళ్లను పేర్చటం.. విజ్ఞానదాయక ఆట ఆడుతున్నారు.

‘ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందుముందు పొదరిల్లు పొదరిల్లు’ అని ఓ చిత్రంలో, యువజంట ఆకాంక్షను అందంగా రాశారు ఓ సినీకవి. ఇల్లు-ఇల్లాలు జంటపదాలు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమని లోకోక్తి, ఇంటి తీరుతెన్నులు ఇల్లాలికి ప్రతీకలని దాని భావం. అందుకే సినిమాల్లో సైతం.. ‘ఇల్లే ఇలలో స్వర్గమనీ, ఇల్లాలే ఇంటికి దేవతనీ.. రుజువు చేశావు, నువ్వు రుజువు చేశావు’ అని,

‘ఇంటికి దీపం ఇల్లాలు… ఆ దీప కాంతుల కిరణాలే పిల్లలూ.. పిల్లలూ’ వంటి పాటలు వచ్చాయి. కానీ నేటిరోజుల్లో అది పూర్తిగా అన్వయించదు. ఎందుకంటే… ఇంటినీ తీర్చిదిద్దుకోవటంలో స్త్రీ, పురుషులిరువురి పాత్ర ఉన్నందున.

ఇళ్లలో మళ్లీ అద్దె యిల్లు, సొంత యిల్లు. ఎన్నాళ్లున్నా అద్దె ఇల్లు అద్దె ఇల్లే, అందుకే ఆర్థిక వెసులుబాటను బట్టి చిన్నదో, పెద్దదో సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే అంతా తాపత్రయపడుతుంటారు. తీరా కట్టుకున్నాక పన్నులు కట్టుట, వాయిదాలు కట్టుట, ఇంటి నిర్వహణ వగైరా బాధ్యతలు మీద పడటంతో కొంతమంది ‘అద్దె ఇల్లే నయం, ఏ బాదరబందీ ఉండదు’ అని తమ అనుభవసారం వినిపిస్తారు. ఇల్లు కట్టటమంటే అంత ఈజీ విషయం కాదు. గతంలో అయితే కష్టపడి సరంజామా అంతా సిద్ధంచేసుకుని, మేస్త్రీలతో దగ్గరుండి కట్టించుకునేవారు. అందువల్ల ఆ ఇంటిమీద మమకారం, అనుబంధం ఎక్కువగా ఉండేవి. అందుకే ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు…’ అనే సామెత వచ్చింది. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ ఇళ్లు. అభిరుచిని బట్టి, తాహతును బట్టి ఎంపిక చేసుకుని బహుళ అంతస్తుల భవనాల్లో ఏదో ఒకదాంట్లో చేరిపోవడమే. మళ్లీ అపార్టుమెంట్ల వ్యవహారం అదో బృహత్ విషయం. మరీ సంపన్నులయితే ఏ విల్లానో సొంతం చేసుకుంటారు. అది వేరు సంగతి. ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇళ్లను కట్టిచ్చే పథకాలను ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే విదేశాల్లో మార్కెట్లోనే ఇళ్లు అమ్మకానికి రెడీగా ఉంటున్నాయి. స్థలం చూసుకొని ఇల్లు కొనుక్కొచ్చుకుని అక్కడ ఫిక్స్ చేసుకోవటమే.

ఇంటి నిర్మాణం ఇలా ఉంటే శుభకరం అని వివరించే శాస్త్రం వాస్తు శాస్త్రం. గతకాలంలో కన్నా ఈమధ్య కాలంలో వాస్తు ప్రాధాన్యత ఎంతగానో పెరిగిపోతోంది. వాస్తును పూర్తిగా పాటించలేక, విస్మరించలేక సతమతమయ్యేవారు ఎంతో మంది. నూతన గృహప్రవేశాలు… ఆ సందళ్లు అదో ఘట్టం. నూతన వధూవరులతో గృహ ప్రవేశం చేయించడం మన సంప్రదాయం. గతంలో ఇళ్లకు కొన్ని గుర్తులుండేవి. సింహాల మేడ, ఏనుగుల మేడ, బొంబాయి మేడ వగైరాలు. ఒంటి స్తంభం మేడలు అదో వెరైటీ. మన సామెతల్లో సైతం ఇల్లు పాత్ర ఇంతింత కాదనవచ్చు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’; ‘అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గరా…’; ‘ఇల్లలకగానే పండగ కాదు’; ‘ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీల మోత’; ‘కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం’; ‘ఇంటి గుట్టు లంకకు చేటు’; ‘ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు’ వంటివెన్నో వాడుకలో ఉన్నాయి. ఇంట్లో మళ్లీ కొన్ని గదుల్ని మాత్రమే ఇల్లును జతచేసి పేర్కొంటుంటాం. వంటిల్లు, పడకటిల్లు.. అలాగే ఇంటల్లుడు, ఇంటి కోడలు, పుట్టిల్లు, మెట్టినిల్లు, అత్తవారిల్లు.. అమ్మమ్మ ఇల్లు మాత్రం అన్నిటికంటే ప్రత్యేకమైంది. పిల్లలకు ఆ ఇంట ఉండే స్వేచ్చ, దొరికే ప్రేమామృతము సాటిలేనివి. అది జీవితాంతం మనసు గూటిలో పదిలంగా ఉండే తీపి గురుతు. అభిరుచి ప్రకారం ఇల్లు నిర్మించుకునేవారు కొందరు. ప్రత్యేకతలతో ఇళ్లు విలక్షణంగా ఉంటాయి. ప్రత్యేకమైన ఇల్లు అనగానే నా మదిలో ‘రుద్రవీణ’ చిత్రంలో పాట మెదిలింది. అది..

“రండి రండి రండి… దయచేయండి
తమరి రాక మాకెంతో సంతో మం సుమండీ..
ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు
ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య
గడప దాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్య
క్లయింట్లు, కంప్లైంట్లు మసలే ఈ గది బారు
తక్కిన నా గృహమంతా గానకళకు దర్బారు
గానకళ ఇలవేల్పుగ ఉన్న మా ఇంట
శునక మైన పలుకు కనకాంగి రాగాన..
గాలైనా కదలాడు సరిగమల త్రోవ.
నా యింటికి ముందున్నవి కావు రాతిమెట్లు
అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు..
మాకు నిలయ విద్వాంసులు చిలకరాజుగారు
కీరవాణి వీరి పేరు, పలుకు తేనెలూరు
నవ్వు మువ్వకట్టి
ప్రతి నిమిషాన్ని తుళ్లిస్తూ
సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్లిస్తూ
ఇదే మాదిరి సుధామాధురి పంచటమే పరమార్థం
అదే అదే నా సిద్ధాంతం”

అతిథిని ఆప్యాయంగా ఆహ్వానిస్తూ ఇంటిని, ఇంట్లోని సభ్యులను పరిచయం చేస్తూ సాగే ఈ పాట ఎంతో వైవిధ్యభరితం.

త్యాగరాజ స్వామి, తన ఆరాధ్యదైవమైన రాముణ్ణి ఇంటిదాకా రమ్మని వేడు కొంటారు..

“రారా మా ఇంటిదాకా రఘువీర
సుకుమార మొక్కేరా
రారా దశరథ కుమార
నన్నేలుకోర తాళలేరా…
దిక్కునీవనుచు తెలిసి నన్ను బ్రోవ
గ్రక్కున రావు కరుణను నీచే
చిక్కియున్నదెల్ల మరతు రా ఇక శ్రీ
త్యాగరాజుని భాగ్యమా..” అంటారు.

దేవుళ్లని తమతమ ఇళ్లలో కొలువుదీరమని భక్తులు కోరుకోవటం తెలిసిందే. ముఖ్యంగా ‘లక్ష్మీ మా యింటికి రావే’ అని లక్ష్మీదేవిని వేడుకుంటుంటారు. అన్నట్లు పల్లెల్లో సంక్రాంతివేళల సందళ్లను ప్రతిబింబించే హరిదాసు పాటను ఎలా మరిచిపోతాం..

“రావమ్మా మహాలక్ష్మి రావమ్మా..
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని
కొలువై ఉందువుగాని.. కలుముల రాణి…
కడివెడు నీళ్లు కళ్లాపి చల్లి గొబ్బిళో గొబ్బిళ్లు
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ల గొబ్బిళ్లు
ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్లు
రతనాల ముగ్గుల్లో, ముగ్గుల్లో గొబ్బిళ్ళు”…

ఇల్లు, వాకిలి జంటపదాలు. వాకిలి అలంకరణ కూడా ఇంటికి సంబంధించిందే.

ఇంటికి గడప చాలా ముఖ్యమైంది. పాతకాలంలో గడపలు ముఖ్యంగా ప్రధాన ద్వారానికి ఉండే గడప చాలా పెద్దదిగా, పిల్లలు దాటలేనంత పెద్దదిగా ఉండేది. పచ్చటి గడప పై రంగురంగుల బొట్లు, పూలతల డిజైన్లు ఎంతో కళాత్మకంగా ఉండేవి. ఇప్పుడు ఇళ్లల్లో ప్రధాన ద్వారానికి ఓ చిన్న గడప ఉంటుందంతే. ఆ గడపపై డిజైన్లు వేసేందుకు గడపకు ఇన్ని రూపాయల లెక్కన కళాకారులు అందుబాటులో ఉన్నారు. అసలు పల్లెల్లో ఇళ్ల సంఖ్య చెప్పవలసి వస్తే ‘మా ఊళ్లో ఇన్ని గడపలున్నా’యనే చెపుతారు.

మనుషులకే  కాదు దేవుళ్లకూ ఇళ్లున్నాయి. విష్ణుమూర్తికి వైకుంఠం, పరమేశ్వరుడికి కైలాసం..ఇలా. ఓ సినీకవి.. శివుడి గురించి.. ‘ఇల్లు, వాకిలి లేనివాడు… బిచ్చ మెత్తుకుని తిరిగేవాడు’ అంటాడు. అయితే అది ఆ సందర్భానికి సరితూగేలా రాసిందే. నిజానికి ఆదిమధ్యాంతరహితుడికి ఇల్లేమిటీ?

పోతనగారు గజేంద్రమోక్షంలో మకరికి చిక్కిన గజరాజు మొరపెట్టుకున్న ఘట్టంలో విష్ణుమూర్తి ఎక్కడ, ఎలా ఉన్నదీ ఇలా వర్ణించారు..

అలవైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంకరమావినోదియగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము ‘పాహి పాహి’ యనఁ గుయ్యాలించి సంరంభి యై.

విష్ణుమూర్తి విలాసాన్ని వివరంగా చెప్పిన పద్యమిది.

ఇక భారతంలో పాండవులను మట్టుబెట్టటానికి కౌరవులు శకుని సలహాపై వారణావతం అరణ్యంలో పురోచనుడితో లక్కయిల్లు నిర్మింపజేస్తారు. పాండవులను కుంతితో సహా అక్కడకు పంపి అందరినీ ఒక్కసారిగా అంతమొందించాలన్నది వారి పన్నాగం. కానీ విదురుడు పాండవులు తప్పించుకునేందుకు ఆ యింట ఓ సొరంగమార్గం నిర్మింపజేస్తాడు. దాంతో లక్కయింటిని తగులబెట్టినా పాండవులు క్షేమంగా బయటపడగలుగుతారు. ప్రమాదవశాత్తు పాండవులు మరణించారని ప్రకటించవచ్చనుకున్న కౌరవుల కుతంత్రం విఫలమైంది.

భారతంలో అతి ప్రధానమైంది మయసభ, మయుడు పాండవులకు కట్టి ఇచ్చిన మహాద్భుత భవనం. సందర్శనానికి వచ్చిన దుర్యోధనుడు ఆ భవనంలో భ్రమింపజేసే రకరకాల వింతలు చూసి తబ్బిబ్బవటంతో పాటు తనకు భంగపాటు అయినట్లు బాధపడ్డాడు. చివరకు నీళ్లు లేవనుకున్నచోట నీళ్లుండి, వాటిలో జారిపడతాడు. అది చూసి ద్రౌపది నవ్వటంతో సుయోధనుడికి అవమానంతో ఆగ్రహం మిన్నంటింది. అదే అతడిలో పగను మరింత పెంచింది

ఇక ఇంద్రుడి నివాసం సరేసరి. ఏదైనా గొప్ప యింటి గురించి చెప్పవలసి వస్తే ‘ఇంద్రభవనం’ అంటుంటాం.

ఇతిహాసాల్లో తపోవనాల్లో మునివాటికలు ప్రకృతిసిద్ధ సౌందర్యంతో, ప్రశాంతతతో అలరారుతుంటాయి. కణ్వాశ్రమం, వాల్మీకి ఆశ్రమం, సీతారాములు నివసించిన ‘పర్ణశాల’ వగైరాలు. ఇప్పుడు కూడా ‘రిసార్ట్స్’ పేరుతో ఇటువంటి నికుంజాలు ఉన్నా, వీటిని పూర్తిగా మునివాటికలతో పోల్చలేం. ఇక చరిత్రలో ఎందరో రాజులు నిర్మించిన ప్రాసాదాలు నేడు పర్యాటక స్థలాలుగా విలసిల్లుతున్నాయి. వాటిని చూసినప్పుడు కొంత తడవు ఆ కాలాన్ని, వారి నిర్మాణ కౌశలాన్ని స్మరించుకొని ముచ్చటపడుతుంటాం. సబర్మతీ ఆశ్రమం చూస్తే బాపూజీ, కస్తూరిబా నివసించిన ఆ చిన్న గదులు… వారి నిరాడంబరత… ఎంతటి మహనీయత అనిపిస్తుంది. దేశ ప్రధాని నివాసం, రాష్ట్రపతి నిలయం, రాష్ట్రపతి అతిథిగృహాలు వగైరాలు అందరకూ ‘చూడ’ముచ్చట.

రోజంతా – బయట గడిపినా ప్రతివారు సాయంత్రానికి తమ ఇంటికి చేరి సేదతీరాలనే కోరుకుంటారు. పెద్ద హెూటళ్లకో, లాడ్జిలకో, రిసార్ట్స్‌కో వెళ్లినా కూడా తాత్కాలికంగా ఆహా అనిపించినా, ‘మనిల్లే మనకు రైట్’ అనుకునేవారూ ఉంటారు. అందుకే కొన్ని తావుల్లో వారి నివాసాలు ఇళ్ల మాదిరే ఉంటాయని చెప్పటానికి ‘హెూమ్స్ ఎట్మాస్పియర్’ అని ప్రచారం చేస్తుంటారు. ఇంటిమీద బెంగను ‘హెూమ్ సిక్’ అని, ఇంటిమీద గాలి మళ్లిందని అంటుంటారు. ఏ కొందరో మాత్రం అనేకానేక పరిస్థితుల వల్ల ‘ఇంటికన్న గుడి పదిలం’ అనుకోవటం కద్దు. ఇంటితోటి అనుబంధం అక్షరాలకందనిది. ఇంట్లో ప్రత్యేకించి మనకిష్టమైన చోటనేది కూడా ఉంటుంది. అలాంటి ఇల్లును, సుదీర్ఘకాలంగా ఉన్న ఇల్లును ఏదో కారణాల వల్ల వదిలివేయవలసి వస్తే, లేదా ఆర్థిక కారణాల వల్ల వేలం వేసే పరిస్థితులే వస్తే ఆ ఇంటివారికి అది ఎంత బాధాకరమో. చిన్న ఇల్లయినా, పెద్ద ఇల్లయినా ఇల్లు ఇల్లే. ప్రతి ఇంట ఏవో ఒకసమస్యలు ఉంటుంటాయి. ఇంటింటికీ ఓ కథ ఉంటుంది.

‘ఇంటింటి రామాయణం… వింతైనా ప్రేమాయణం, కలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలము’ అనే దాన్లో ఎంతో నిజం ఉంది. ఇల్లు ఇరుకయినా మనసు విశాలంగా ఉంటే ఇబ్బంది ఉండదు. ఇల్లంటే కేవలం నాలుగు గోడలు, నాలుగు కిటికీలు కాదు. అది ఇంటి సభ్యుల అనుబంధాలను, అనుభూతులను అద్దుకున్న లోగిలి. ఆత్మీయానురాగాలను పంచే పంచవటి. చిన్నారుల అల్లరితో, ఆటపాటలతో, నవ్వులతో కళకళలాడే ఇంటికేదీ సాటి! ఆ ఇల్లే స్వర్గ సీమ! అందుకే ఓ సినీకవి ‘ఓ భావిభారత పౌరులారా ఓ భావి భారత భాగ్య విధాతలారా, యువతీ యువకులారా… స్వానుభవమున చాటు నా సందేశమిదే… వారెవ్వా… పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాపురముండాలోయ్.. ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగా ఉండాలోయ్.. హాయిగా ఉండాలోయ్” అని అన్నాడు.

అంతలో రివ్వున చల్లగాలి వీయడం, స్టాపర్ ఉంచని తలుపు ఢామ్మని, ఇక లోపలికి రమ్మనడంతో నా తలపుల మది గదికి ఆటోమేటిక్ లాక్ పడింది. ‘అరె. ఇంట్లో లైట్ వేయలేదే’ అనుకుంటూ లేచి అడుగుముందుకేశాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here