Site icon Sanchika

మానస సంచరరే-22: అన్నా ‘అను’బంధం.. అనురాగ గంధం!

[box type=’note’ fontsize=’16’] “కారణాంతరాల వల్ల దూరంగా ఉన్నా మనకంటూ తోబుట్టువులున్నారనే భావనే కొండంత ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది” అంటున్నారు జె. శ్యామలమానస సంచరరే-22: అన్నా ‘అను’బంధం.. అనురాగ గంధం!’ కాలమ్‌లో. [/box]

[dropcap]సా[/dropcap]యం సమయం.. మబ్బు పట్టిన ఆకాశాన్ని చూస్తూ బాల్కనీలో నిలుచున్నాను. అంతలో స్కూలు బస్సులు వరసగా రాసాగాయి. పిల్లలు బిలబిలమని బస్సుల్లోంచి దిగుతున్నారు. పిల్లల హడావుడి, అల్లరి, అరుపులు, ఫ్రెండ్స్‌కు టాటాలు చెప్పడం చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది. కొందరు తల్లులు ఎదురొచ్చి పిల్లల్ని తీసుకెళుతున్నారు. అంతలో నా చూపుకు ఓ బాబు, పాప కనిపించారు. పాప పరుగెత్తబోయింది. “ఏయ్ చెల్లీ ఆగు”, అని వేగంగా ముందుకు నడిచి చిట్టిచెల్లెలు చేతిని గట్టిగా పట్టుకోని, “వెహికల్స్ వస్తుంటయ్, జాగ్రత్త అని అమ్మ చెప్పలేదూ, ఇంకెప్పుడూ సడెన్‌గా నా చెయ్యొదిలి పరుగెత్తకు. తెలిసిందా” అన్నాడు అన్నగారు.

‘నిన్ను ఓడించాలనుకుంటే ఆపేశావు?’ అలకగా అంది చెల్లెలు. ‘మహా ఓడించావులే.. మొన్న ఇలాగే అని పడ్డావు. మోకాలు దోక్కు పోయిందని అమ్మ నన్ను తిట్టింది. నువ్వే ఫస్టేలే. అందుకోసం పరుగెత్తకు’ అన్నాడు బుద్ధిమంతుడైన అన్నయ్య. ఎంత ముద్దుగా ఉన్నారో. అన్నగారి పెద్దరికం బహుముచ్చటగా ఉంది. వాళ్లింకా దూరమవడంతో మనుషులు తప్ప, మాటలు వినపడటం మానేశాయి. నా మనసు ఫ్రేమ్‌లో ఆ అన్నాచెల్లెలు నిలిచిపోయారు. అవునూ… ఎన్ని బంధాలున్నా రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువుల బంధానికి సాటి రాదు. అన్నయ్య నిజంగా ఓ పెన్నిధే అనుకుంటుంటే పాట గుర్తొచ్చింది.

“అన్నయ్య సన్నిధి
అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే
ఆ కనులలోన ఉన్నదిదీ..
ఒకే తీగ పూవులమై
ఒకే గూటి దివ్వెలమై
చీకటిలో, వేకువలో, చిరునవ్వుల రేకులలో
కన్నకడుపు చల్లగా కలసిమెలసి ఉన్నాము.
కలిమి మనకు కరువైనా కాలమెంత ఎదురైనా..
ఈ బంధం విడిపోదన్నా ఎన్నెన్ని యుగాలైనా
ఆపదలో ఆనందంలో నీ నీడగ ఉంటానన్నా…”

‘ఒకే తీగపూవులు’ అన్న పదప్రయోగం నాకెంతో నచ్చింది. తండ్రి తర్వాత కొండంత అండ అన్నేకదా.

అన్నట్లు ‘ఆడపడుచు’ చిత్రంలో అంధురాలైన చెల్లెలు

“అన్నా! నీ అనురాగం.. ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా..
పుట్టినరోజున మీ దీవెనలే వెన్నెలకన్నా చల్లదనం…
అన్నలు మీరే నా కన్నులుగా నన్నే నడిపించాలి..” అని కోరుకుంటుంది.
మరో సినీగీతంలో
‘కన్నయ్యలాంటి అన్నయ్య లేని
కన్నులెందుకు
ఆ అన్నయ్య చల్లగ నవ్వకపోతే వెన్నెలెందుకు’ అంటాడు కవి.

అటువంటి ప్రేమమూర్తులయిన అన్నలుండటం ఎంత అదృష్టం. చిన్నతనంలో ఎన్ని గిల్లికజ్జాలున్నా.. అంతలోనే ఒకటైపోవడం, ఇతరులు ఏమైనా అంటే ఒకరికొకరు సపోర్ట్‌గా మాట్లాడటం.. అందుకే ‘బ్లడ్ ఈజ్ థికర్ దేన్ వాటర్’ అన్నారు.

ఇప్పుడు పిల్లల విషయంలో దృక్పథం మారింది. పదిమంది పిల్లలున్నపాతకాలం పోయి ‘చిన్న కుటుంబం.. చింతలు లేని కుటుంబం’ అనే అవగాహనతో ఇద్దరు, లేక ముగ్గురు సంతానంతో సరిపెట్టుకునే కాలం వచ్చింది. ఆ పైన ముగ్గురు వెనుక్కుపోయి ‘మనం ఇద్దరం.. మనకిద్దరు’ ఫాలో అవసాగారు. ఇటీవల కాలంలో ఇంటికొక్కరు చాలనుకుంటున్న నేపథ్యంలో ఈ అన్నాచెల్లెళ్ల బంధాలకు ఆస్కారం తగ్గవచ్చనిపిస్తుంది. అసలు మమతలనేవి తమకే తెలుసంటాడు మరో చిత్రగీతంలో అన్నగారు.. అది..

‘చిట్టి అమ్మలు, చిన్ని నాన్నలు
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు..
ఎవరికెవరు వేశారు బంధమూ
ఒకరి కొకర మైనాము ప్రాణము
నీకు నేను అమ్మను, నాన్నను
నాకు నీవే లోకాన సర్వమూ..’ అంటాడు.
‘ఫూలోంకా తారోంకా సబ్ కా కహనా హై
ఏక్ హజారోం మే మేరీ బెహనా హై
సారీ ఉమర్ హమ్ సంగ్ రహనా హై’ అంటూ తన చెల్లెలు ఎంత ప్రత్యేకమైందో చెపుతాడు.

అన్నగారి ఉన్నతినే సదా కోరుకునే ఓ చెల్లెలు, అన్నయ్యకు విజయం లభించిందని తెలిసి..

‘అన్నయ్య కలలే పండెను
చెల్లాయి మనసే నిండెను.
బంగారుకాంతులేవో
నేడే తొంగి చూసేనూ…’ అని సందడి చేస్తుంది.

అన్నాచెల్లెళ్ల బంధాలు మనకు రామాయణ మహాభారతాల్లోనూ కనిపిస్తాయి. భారతంలో కృష్ణుడు సుభద్రకు, ద్రౌపదికి అన్నగా అన్నివేళలా ఆదుకుంటాడు. ఇక రామాయణంలో ప్రతినాయకుడైన రావణుడికీ ఓ చెల్లి ఉంది. ఆమే శూర్పణఖ. లక్ష్మణుడిపై ఆమె మనసు పడటం, అతడు తిరస్కరించి, ముక్కు, చెవులు కోయడంతో వెళ్లి అన్నగారికి చెప్పుకోవటం, ఆయన ప్రతీకారంగా సీతాపహరణానికి పూనుకోవటం తెలిసిందే. అన్నట్లు కౌరవులు వందమంది అయితే, వారి ఏకైక సోదరి దుశ్శల. వందమంది సోదరులు.. ఊహించుకోవటమే కష్టం. రాఖీ కట్టే మాటయితే దుశ్శల పని కష్టమే అనే ఊహతో నవ్వొచ్చింది. అన్నట్లు విరాటపర్వంలో ఉత్తరకుమారుడు, ఉత్తర అన్నాచెల్లెళ్లు. భీరువైన ఉత్తరకుమారుడు యుద్ధానికి వెళ్లబోతూ, చెల్లెలు ఉత్తరతో, యుద్ధరంగం నుంచి ఏం తెమ్మంటావో చెప్పమంటాడు. ఆ చెల్లెలు రంగురంగుల తలపాగా వస్త్రాలు తెచ్చిస్తే తన బొమ్మల పొత్తిళ్లకు వాడుకుంటానంటుంది.

అన్నాచెల్లెళ్ల బంధాన్ని విశిష్టంగా నిలిపే పండుగ ‘రాఖీ.. అదే రక్షాబంధనం’. ఉత్తరాదిలోను, దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలలోను ఘనంగా జరుపుకునే పండుగ ఇది. శ్రావణపౌర్ణమినే రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం తెలిసిందే. ఆడపిల్లలు, అన్నలకు, తమ్ముళ్లకు రాఖీలు కడతారు. అన్నలు, తమ్ముళ్లు, రాఖీ కట్టిన అక్కలేదా చెల్లెలుకు కానుకలిస్తారు. పెళ్లయి దూరాన ఉన్న అమ్మాయిలు సైతం రాఖీ రోజున పుట్టిళ్లకు వెళ్లి అన్నలకు, తమ్ముళ్లకు రాఖీ కడతారు. వెళ్లలేని దూరాభారాలైతే ఈకాలంలో రాఖీలను పోస్ట్ చేసే సదుపాయాలు కూడా ఉన్నాయి. రాఖీ రావడానికి వారం ముందరనుంచే మార్కెట్లలో రకరకాల డిజైన్ల రాఖీలు అమ్ముతుంటారు. రాఖీల తయారీ నిజంగా ఓ సృజనాత్మక కళ. రాళ్లు పొదిగినవాటికి ఖరీదు ఎక్కువే. రాఖీ తయారీ కళ ఎందరికో ఉపాధి కూడా. అసలు ఈ రాఖీబంధనం ఈనాటిది కాదని పురాణకాలం నుంచి ఉందని తెలుస్తోంది. రక్షాబంధనానికి సంబంధించి చరిత్రలో కూడా ఎన్నో ఉదంతాలు ఉన్నాయి – అలెగ్జాండర్ ఇండియా పైకి దండెత్తివచ్చినప్పుడు, అతడి భార్య రొక్సానా, పురుషోత్తముడికి ఓ రాఖీని పంపి, యుద్ధంలో తన భర్తకు హాని తల పెట్టవద్దని కోరుకుంటుంది. పురుషోత్తముడు, సోదరి అనురాగ బంధానికి కట్టుబడి, అలెగ్జాండర్‌ను చంపకుండా వదిలేస్తాడు. భారతంలో సైతం రక్షాబంధనానికి సంబంధించి ఓ కథ ఉంది. ఓసారి కృష్ణుడు, చెరకు గడ కారణంగా వేలికి గాయం కావడంతో రుక్మిణి బయటకు కబురుపంపి సాయం కోరగా, సత్యభామ వేలికి కట్టుకట్టేందుకు వస్త్రాన్ని తేవడానికి వెళుతుంది. కానీ ద్రౌపది మాత్రం తన చీరెనుంచి చిన్నముక్క చించి వేలికి కట్టుకట్టింది. ఆరోజున కృష్ణుడు, ద్రౌపదికి ఆపదల్లో ఆదుకుని, అండగా ఉంటానని వరమిస్తాడు. మరో కథ.. యముడు, చాలాకాలం తర్వాత తన సోదరి యమున వద్దకువెళ్లగా ఆమె అతడికి రక్ష కట్టింది. చెల్లి ప్రేమకు కరిగిపోయిన యముడు ఆమెను చిరంజీవిని చేస్తాడు. అలాగే సోదరీమణులు రాఖీ కడితే ఆ అన్నలు చిరంజీవులవుతారని ప్రకటిస్తాడు.

ఓసారి బలి చక్రవర్తి, తనను రక్షించవలసిందిగా విష్ణువును కోరుతాడు. విష్ణువు ద్వారపాలకుడిగా అక్కడే ఉంటాడు. వైకుంఠంలో లక్ష్మీ, విష్ణువు లేక ఒంటరిదవుతుంది. దాంతో లక్ష్మీ ఓరోజున మారువేషంలో బలి చక్రవర్తి రాజభవనానికి వెళుతుంది. ఆమె రాజభవనంలో అడుగు పెట్టగానే సకల సంపదలతో ఆ భవనం నిండిపోతుంది. లక్ష్మీదేవి, అతడికి రాఖీ కట్టి, శుభాకాంక్షలందిస్తుంది. బలి సంతోషించి, ఆమెను ఏం కావాలో కోరుకోమంటాడు. లక్ష్మి, విష్ణువువంక చూపుతుంది. బలి చక్రవర్తి ఆమె కోరికను ఆమోదిస్తాడు. అలా లక్ష్మీదేవి, విష్ణువును తిరిగి పొందగలుగుతుంది.

ఇలా చెప్పాలంటే పురాణాల్లో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. వాటి మాట ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా అన్నా చెల్లెళ్లు కలుసుకోవడం కోసం ఓ ప్రత్యేకమైన రోజుగా రాఖీని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఓ ఇరవై ఏళ్లపాటు కలిసి పెరిగేవారు, ఆ తర్వాత చదువుల పేరిట, పెళ్లిళ్ల కారణంగా దూరం అవుతారు. అత్తవారింట ఉండే అక్కలు, చెల్లెళ్లు, అన్నదమ్ముల్ని తప్పనిసరిగా కలుసుకొనేలా చేస్తుంది రాఖీ పండుగ. అన్నాచెల్లెళ్లకు ఇది నిజమైన పున్నమే.

అన్నాచెల్లెళ్ల బంధం అంటే ముఖ్యంగా గుర్తొచ్చే పాట రక్తసంబంధం లోనిది… విధి వక్రించి దూరమైన అన్నాచెల్లెలు వేదనకు గురై పాడుకునే పాట మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఆచంద్రతారార్కం నిలిచే పాట.

“చందురుని మించు అందమొలికించు
ముద్దుపాపాయివే… నిను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే..
అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా..
కలతలకు లొంగి, కష్టముల క్రుంగు నేటి కథ పాడనా..
కన్నీటి కథ పాడనా..
కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసె.. వెతలలో తోసే
మిగిలెనీ శోకమే..
మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా
బంధమే నిల్పుమా.. మా బంధమే నిల్పుమా
దివిలో తారకలు.. భువిలో మానవులు ధూళిలో కలసినా
అన్నచెల్లెళ్ల జన్మబంధాలె నిత్యమై నిల్చులే”.

మేనరికాలు విరివిగా జరిగిన నాటి మాట ఇది. మేనరికాలు ఆరోగ్యకరం కాదన్న అవగాహనతో క్రమంగా మేనరికాలు తగ్గిపోయాయనే చెప్పాలి. ప్రజాగాయకుడు గద్దర్ సైతం చెల్లెలు గురించిన అన్న పాటను ఎంతో అందంగా అర్థవంతంగా రాశారు. వందేమాతరం శ్రీనివాస్ స్వరంలో అది మరింత అమృతమైంది.

“ఆ… ఆ… మల్లెతీగకు పందిరివోలె
మస్క చీకటిల వెన్నెల వోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా..”
ఇందులో చెల్లెమ్మను ఆదర్శవంతంగా ఎలా పెంచి పెద్ద చేస్తాడో వివరిస్తాడు..
“పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లకు ఆంక్షలు ఎన్నో
చూసేదానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు..
అటువంటి నీ అన్నను గాను చెల్లెమ్మ
నీ చిన్ననాటి స్నేహితుణ్ణమ్మా చెల్లెమ్మా..
అడవిలోన నెమలివోలె చెల్లెమ్మ
ఆటలాడుకో, పాటపాడుకో చెల్లెమ్మ.
ఒక్క క్షణం నువ్వు కనబడకుంటే
నా కనుపాపలు కమిలిపోతాయి
నువ్వు ఒక్క గడియ
మాట్లాడకుంటే చెల్లెమ్మ
నే దిక్కులేని పక్షినైతనమ్మ చెల్లెమ్మ..”
అంతేనా..
“చదివినంత నిన్ను చదివిస్తానమ్మ
ఎదిగినంత నిన్ను ఎదగనిస్తానమ్మ
నీకు పెళ్లీడు వచ్చేనాటికి
పువ్వో పట్టో కూడబెట్టుతా
నచ్చినోనికే ఇస్తానమ్మ చెల్లెమ్మ
నా కన్నీళ్లతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మ
రిక్షా బండికి మేనాగడతా చెల్లెమ్మ
మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మ”

ఎంతటి మంచి మనసు.. ఎంతటి విశాలమైన మనసు.. ఇంత గొప్ప పాట రాసినందుకు కవి గద్దర్‌కు అన్నాచెల్లెళ్లందరూ ఋణపడి ఉంటారు.

సోదర, సోదరీ భావమనేది అంతర్జాతీయమైంది. ప్రపంచమంతా ఓ కుటుంబం అనే భావనలో ఇది ఇంకా బాగా అన్వయిస్తుంది. సీరియెస్‌గా అయినా, కాకపోయినా అమెరికాను పెద్దన్నగా వ్యవహరించడం తెలిసిందే. మనం నిత్యం జాతీయగీతం పాడిన తర్వాత చేసే ప్రతిజ్ఞలో ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్..’ అని చెపుతాం. కొంటెకోణంగులు దానికి ‘ఎక్సెప్ట్ వన్ పర్సన్’ అంటూ నవ్వడం మామూలే.

ఇక రాఖీ వచ్చిందంటే అమ్మాయిలంతా వచ్చి రాఖీలు కడితే చిలిపి అల్లర్లకు ఇబ్బందని, అబ్బాయిలు కాలేజీలకు డుమ్మా కొడతారంటారు. అయితే సొంత అక్కా, చెల్లెళ్లు లేనివాళ్లు కోరుకుని మరీ ఇతరులతో రాఖీ కట్టించుకునే సందర్భాలూ ఉంటాయి. రాఖీ కట్టడానికి సహోదరులే కానవసరం లేదు. వారి మధ్య ఉండే బలమైన ఆ భావనే ముఖ్యం. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు కలిసి పెరిగినా, పెద్దయ్యే కొద్దీ ఎవరి వ్యక్తిత్వాలు వారివిగా రూపొందుతాయి. అభిప్రాయాలు, భావాల్లో మార్పులు సహజం. అయినప్పటికీ కూడా ఇవేవీ అనురాగ బంధానికి అడ్డు నిలవవు. కారణాంతరాల వల్ల దూరంగా ఉన్నా మనకంటూ తోబుట్టువులున్నారనే భావనే కొండంత ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. ఎక్కడ ఉన్నా తోబుట్టువులు చిరకాలం ఆనందంగా ఉండాలనే ఆకాంక్ష ప్రతి అన్నాచెల్లెలి హృదిలో పదిలంగా ఉంటుంది. రాఖీ రోజున మళ్లీ ఓసారి అన్నాచెల్లెళ్లు తమ బాల్యానుబంధాలను, చిలిపి తగవులను, ఆటలను, పాటలను గుర్తుచేసుకోవడం, ఆ స్మృతులతో మనసు లోగిళ్లను ఆనందానుభూతులతో నింపుకోవడం ఎంత అర్థవంత సందర్భమో కదా. అవును, అన్నయ్యను కలిసి చాలా కాలమైంది ఎలా ఉన్నాడో అనిపించింది.

ఆలోచనలో సమయం తెలీలేదు. అంతలోనే “ఏమ్మా కులాసానా?” అన్నయ్య పలకరింపుతో ఉలిక్కిపడ్డాను. ఎదురుగా పెద్దన్నయ్య! ఆనందాశ్చర్యాలతో నా నోట మాట రాలేదు. ‘అన్నయ్యా’ అంటూ వేగంగా నా అడుగులు అన్నయ్యవైపు.. తలచుకోగానే నా ముంగిట మా అన్నయ్య. నాన్న తర్వాత నాన్న.. మనసంతా ఆనందాల నదిగా మారి భావోద్వేగ అలల తాకిడి.. అనిర్వచనీయానుభూతిని మనసు రికార్డు చేసుకుంటోంది.

Exit mobile version