[box type=’note’ fontsize=’16’] “ఊహల ఊయల బాగానే ఉంటుంది. కానీ ఆ ఊహలు మరీ ఆకాశాన్నంటితే నిజం కావడం కష్టసాధ్యమే. కానీ కష్టపడితే ఆ ఊహను నిజం చేసుకోవచ్చు” అంటున్నారు జె. శ్యామల. [/box]
[dropcap]సా[/dropcap]యం సమయం!
ఆకాశంలో అద్భుత వర్ణాల కలనేతలను అవలోకిస్తూ, ఆ వెలుగులు లోకానికి చిత్రవిచిత్ర సొబగులద్దుతుంటే ఆనందిస్తూ.. కాసేపు అలా నడిచొద్దాం అనుకుంటూ బయలుదేరాను. నా కాళ్లు అప్రయత్నంగా కాలనీ లోని పిల్లల పార్క్ కు దారితీశాయి. పార్కంతా పిల్లలతో కోలాహలంగా ఉంది ఓ చెట్టుకింద బైఠాయించి, ఆటలతో వినోదిస్తున్న చిన్నారులను చూడసాగాను. నా దృష్టి ఉయ్యాల ఊగే పిల్లలపై నిలిచింది. ఒకళ్లు ఊగుతుంటే వెనకనుంచి పెద్ద పిల్లలు కాస్త ఊపుగా ఉయ్యాలను తోస్తున్నారు. ఉయ్యాల ఎక్కువ పైకి వెళ్లగానే ఊగే పిల్లలు ఆనందంతో, ఒకింత భయంతో, గుండె ఝల్లుమంటుండగా ‘ఓ..’ అంటూ అరవడం మామూలే.
“ఇంక దిగు.. ఇప్పుడు నేను” అని ఇంకో అమ్మాయి అంటోంది. ‘ప్లీజ్ ఇంకో త్రీ టైమ్స్ అంతే..’ బతిమాలుతోంది ఊగుతున్న అమ్మాయి. “సరే. ఇదే లాస్ట్. మళ్లీ ప్లీజ్ అంటే కుదరదు. ఇప్పుడే చెపుతున్నా” అవతలి అమ్మాయి కచ్చితంగా చెపుతోంది.
“ఓ.కె.” అంది ఊగే అమ్మాయి.
మళ్లీ ఉయ్యాల ఊగసాగింది..
వాళ్ల మాటలు వింటూ చిన్నగా నవ్వుకున్నాను.
నా మనసులో ఆలోచనల ఊయల ఊపందుకుంది.
ఉయ్యాల! మనిషికి ఉయ్యాలతోటి అనుబంధం పుట్టినప్పటినుంచే మొదలవుతుంది. శిశువుకు అమ్మ ఒడి తర్వాత అంత ప్రియమైంది ఉయ్యాలే! తెలుగు బాలలు అమ్మ ఒడి దశ దాటాక బడిలో తీయనైన తేట తెలుగులో అచ్చులు నేర్చుకుంటూ ‘ఊ – ఊయల’ మాట నేర్చు కుంటారు. ‘ఊ’ అక్షరంఎంత అందంగా అంటే ఉయ్యాలంత అందంగా ఉంటుంది. పసిప్రాయం.. నిజంగా పసిడిప్రాయమే. ఉయ్యాలలో మెత్తటి పొత్తిళ్లలో బిడ్డను పడుకోబెట్టి ఊపుతూ, దానికి జతగా లాలిపాట పాడితే బిడ్డ హాయిగా నిద్రిస్తుంది. పాటల్లో లాలి పాటలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అవడానికి లాలిపాటలే అయినా ఎన్నో విశేషాలతో, పరమార్థాలతో అలరించే లాలిపాటలు ఎన్నో ఉన్నాయి.
“జో అచ్యుతానంద జోజో ముకుందా
రార పరమానంద రామ గోవిందా..జో..జో
తొలుత బ్రహ్మాండంబు తొట్టిగావించి
నాలుగు వేదాల గొలుసులమరించి..జో..జో”
నిజంగా ఇదెంత గొప్ప ఊహ. బ్రహ్మాండమే ఊయల. నాలుగు వేదాలే గొలుసులు..
గతంలో ప్రతి ఇంట ఊయల తప్పనిసరిగా ఉండేది. ఉయ్యాలలో అనేక రకాలున్నాయి. ఇల్లు, వాకిలి లేని నిరు పేదలు సైతం చెట్టు కొమ్మకు గుడ్డ ఉయ్యాల కట్టి పసిబిడ్డను పడుకోబెట్టడం తెలిసిందే. ఇంట్లో అయితే ఏ దూలానికో చీరెతో ఉయ్యాల కట్టేవారు. తర్వాత కాలంలో కూడా దూలాలు లేకపోయినా, మధ్య తరగతి, పేద వర్గాల వాళ్లు ఇంట్లో తగినంత చోటు లేని పక్షంలో ఓ ఇనుపరాడ్ తగిలించి, దానికి చీరెతో ఉయ్యాల కట్టడం తెలిసిందే. ఆసుపత్రులలో స్టాండింగ్ ఉయ్యాలలుంటాయి. ఇళ్లలోనూ కొంతమంది వాటినే వాడుతుంటారు కానీ వాటి వల్ల పెద్దగా ఊపే అవకాశం ఉండదు. అయితే వీటిని ఎక్కడంటే అక్కడకు మార్చుకోవచ్చు.
పాతకాలంలో కొయ్య ఉయ్యాలలు పెద్దవి ఉండేవి. పిల్లలు కనీసం ఓ నాలుగేళ్ల వయసు వరకు కూడా పడుకోగలిగేంత పెద్దవిగా ఉండేవి. పైగా ఎంతో కళాత్మక డిజైన్లతో, చప్పుడు చేసే గిలకలతో ఉండేవి. వాటికి మధ్యలో రంగు అద్దాలు, బొమ్మలు ఉండేవి. ఉయ్యాల పైన రంగురంగుల చిలకల బొమ్మలు కట్టేవాళ్లు. పిల్లలకు అవి ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతో వాటికేసి చూస్తూ కాళ్లు, చేతులు ఆడిస్తూ కేరింతలు కొడుతు ఆడుకునేవాళ్లు. రామదాసుగారికి పసిపిల్లల చేష్టలు, వారి హావభావ విన్యాసాలు ఎంతగా తెలుసో ‘రామాలాలి..’పాట చెబుతుంది.
‘రామాలాలీ మేఘశ్యామా లాలి
తామరస నయన దశరథ తనయా లాలీ..
అద్దాలతొట్టెలోనేమో అనుమానించేవూ
ముద్దుపాపలున్నారని మురిసి చూచేవూ’..అంటారు.
మన సినారెగారు ‘స్వాతిముత్యం’ చిత్రానికి ముత్యంలాంటి లాలిపాట అందించారు.
“లాలీ లాలీ లాలీ లాలి
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి ..ఆ….ఆ..ఆ..ఆ..
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి..”
పసిబిడ్డను దైవంగా భావించి పాడే లాలిపాటలెన్నో. లాలిపాటలు మహిళలే కాదు, కొన్నిసార్లు పురుషులూ పాడతారు.
ధర్మదాత చిత్రంలో
“జోలాలి.. జోలాలి..
లాలి నా చిట్టి తల్లి..లాలి నన్నుగన్న తల్లి
లాలి బంగారు తల్లి.. లాలి నా కల్పవల్లి..
రతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాలలూగించలేను…
కనుపాపలా నిన్ను కాపాడుకోనా
నిరు పేద ఒడిలోన నిను దాచుకోనా..
నిరు పేద ఒడిలోన నిను దాచుకోనా.. జో లాలి.. ” అని ఓ మంచి పాట ఉంది. తల్లిలేని బిడ్డకు నాన్నే అమ్మై లాలించే పాట అది.
పురాణాల్లోనూ ఈ ఊయల ఘట్టాలెన్నో ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో ప్రహ్లాదుడి జననం తర్వాత ఊయల వేడుక ఉంటుంది.
“సిరిసిరి లాలి.. చిన్నారి లాలి
నోముల పంటకు నూరేళ్ల లాలీ
ఊగుమా ఊయలా..”
అని తల్లి లీలావతి పాడతుండగానే నారదుడు ప్రవేశించి
“పదునాల్గులోకాల తరియింపజేయ
ప్రభవించినావయ్య వరభక్త శీల
కలలెన్నో నీకొరకు కాచుకుని
పూచే ఫలియింపజేయుమా అరుదైన బాలా..
అరుదైన బాలా..” అని పాడుతాడు.
బిడ్డ పుట్టాక ఇరవైఒకటవ రోజున ఉయ్యాలలో బిడ్డను వేసి వేడుక జరపటం కొందరికి ఆనవాయితీ. అదే సందర్భంలో ఉయ్యాల్లోని బిడ్డ చెవిలో ఓ పది పేర్లు చెప్పి, ఓ పేరుకు బిడ్డ ‘ఊ’ అనే శబ్దం చేస్తే ఆ పేరు పెట్టే ఆచారాలు కూడా కొన్నిచోట్ల ఉన్నాయి. అయితే రోజులు మారి, ఆధునికంగా కొత్త కొత్త పేర్లు ఆలోచించి పెడుతున్న ఈరోజుల్లో అలాంటి ఆచారాలు వెనుకకు పోవటం సహజం. బాల్యంలోనే కాదు కౌమారంలోనూ ఆడపిల్లలు ఉయ్యాలలూగడం మన సంప్రదాయంలో ఉంది. ముఖ్యంగా ఏటా అట్లతద్ది రోజున ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుని, ఉదయాన్నే పెరుగన్నం తిని, ఉయ్యాలలూగడం పరిపాటిగా ఉండేది. ఇప్పటికీ ఈ ఆచారం పల్లెల్లో ఇంకా ఉనికిలో ఉందనటానికి ఈమధ్య ఓ వాట్సాప్ పోస్ట్ సాక్ష్యంగా నిలిచింది. పడుచుపిల్లలు ఊగే ఉయ్యాల అనగానే గుర్తొచ్చేది ‘పదహారేళ్ల వయసు’ చిత్రంలో శ్రీదేవి ఊగే ఉయ్యాల. అందమైన పూల ఉయ్యాల.
“సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా..
చిన్నారి చిలకమ్మా..
నావాడు ఎవరే నా తోడు ఎవరే
ఎన్నాళ్ల కొస్తాడే.
కొండల్లో కోనల్లో కోయన్న ఓ కోయిలా
ఈ పూలవానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వలపంతా వల పై మనసే మైమరు పై ఊగేనే
పగలంతా దిగులు రేయంత వగలు రేగేనే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడేన్నాళ్ల కొస్తాడో.. ” గొప్ప హిట్ పాట.
మనిషికి, ఉయ్యాలకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ప్రాచీన కాలంలోనే మనిషి పెద్ద పెద్ద చెట్ల ఊడలు పట్టుకుని ఊగటం, అలా ఆ ఊపుతో సెలయేళ్లలోకి దూకటం ఉండేది. చరిత్రపరంగా చూస్తే ప్రాచీన గ్రీకుకు సంబంధించి లభ్యమయిన క్రీ.పూ.ఐదవ శతాబ్దినాటి వేజ్‌ల పై పిల్లలు, మహిళలు ఉయ్యాలలూగే బొమ్మలున్నట్లు గుర్తించారు. ఇక పార్క్‌లలో ఉండే ఉయ్యాలను మొదటగా రూపొందించినవాడు ఛార్లెస్ విక్ స్టెడ్. ఆ తర్వాత తర్వాత ప్రతి ఎమ్యూజ్‌మెంట్ పార్క్, ఎగ్జిబిషన్‌లలో పందొమ్మిది వందల ఎనిమిది నుంచి స్వింగ్ రైడ్లు చాలా పాపులర్ అయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద స్వింగ్ క్వీన్స్‌లాండ్ (న్యూజిలాండ్)లో ఉంది. ఉయ్యాలలు అనేక రకాలు. కొయ్య, తాడు, స్టీలు, ప్లాస్టిక్ వగైరాలతో ఉయ్యాలలు తయారవుతున్నాయి. ఈమధ్య కాలంలో ప్రతివాళ్లు పేముతో చేసిన ఓ గూడులాంటి ఉయ్యాలను ముందు హాల్లో ఏర్పాటు చేసుకొని చిన్న, పెద్ద విలాసంగా ఊగుతుండటం కామన్ అయింది. ఉయ్యాల ఊగటంలో ఫిజిక్స్ కూడా ఇమిడి ఉంది. ఉయ్యాల ఊగే టప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీగా మారుతుంది. మళ్లీ పై నుంచి కిందకు వచ్చేటప్పుడు కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీగా మారిపోతుంది.
అన్నట్లు బతుకమ్మ పాటల్లోనూ ఉయ్యాల ప్రస్తావన ప్రముఖంగా ఉంది.
“బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు గౌరమ్మ ఉయ్యాలో
పసుపుకుంకుమలిచ్చి ఉయ్యాలో
కాపాడవే తల్లి ఉయ్యాలో..” అంటూ సాగే పాట తరంతరం నిరంతరం వినిపించేదే.
ప్రపంచ వ్యాప్తంగా కూడా పిల్లలకు ఇష్టమైంది ఉయ్యాల. కవులకు ఉయ్యాల ఒక సబ్జెక్ట్. ఇంగ్లీషు కవి రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్.. ‘ది స్వింగ్’ పేరిట ఓ పొయెమ్ రాశాడు. అది..
“హౌ డు యు లైక్ టు గో అప్ ఇన్ ఎ స్వింగ్
అప్ ఇన్ ది ఎయిర్ సో బ్లూ?
ఓ, ఐ డు థింక్ ఇట్ ది ప్లజెంటెస్ట్ థింగ్
ఎవర్ ఎ చైల్డ్ కెన్ డు!
అప్ ఇన్ ది ఎయిర్ అండ్ ఓవర్ ది వాల్
టిల్ ఐ కెన్ సీ సో వైడ్
రివర్ అండ్ ట్రీస్ అండ్ కాటిల్ అండ్ ఆల్
ఓవర్ ది కంట్రీ సైడ్
టిల్ ఐ లుక్ డౌన్ ఆన్ ది గార్డెన్ గ్రీన్
డౌన్ ఆన్ ది రూఫ్ సో బ్రౌన్
అప్ ఇన్ ది ఎయిర్ ఐ గో ఫ్లైయింగ్ ఎగైన్,
అప్ ఇన్ ది ఎయిర్ అండ్ డౌన్!..” అంటాడు.
దేవుడికి చేసే సేవల్లో ఉయ్యాల సేవ ఒకటి. దాన్నే తమిళంలో ఊంజల్ సేవగా పేర్కొంటారు. అన్నట్లు ఈ సందర్భంలో అన్నమయ్య పాట ఒకటి గుర్తిస్తోంది..
డోలాయాం చల డోలాయాం చల డోలానాం.. హర. డోలాయాం చల.. అంటూ ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మి దశావతారాలను ఎంత హృద్యంగా గానం చేసిందో. కృష్ణాష్టమికి కృష్ణుడి బొమ్మను ఉయ్యాల్లో ఉంచి వేడుక జరపటం తెలిసిందే. దేవుళ్లు.. ఉయ్యాల అనుకోగానే సతీ అనసూయ ఉదంతం మదిలో మెదులుతోంది. తనను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను సతీ అనసూయ పసిబిడ్డలుగా మార్చేసి ఉయ్యాలలో పడుకోబెట్టి లాలిపాడుతుంది.
“ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని
జగములూపే ముగురు మూర్తులే కంటిపాపలు కాగా..
మా ఇంట ఊయలలూగా..లాలీ..లాలీ..” అని.
మామూలు ఉయ్యాల కాకుండా నిన్నమొన్నటి వరకు చాలామంది ఇళ్లల్లో ఉయ్యాల బల్ల ఉండేది. హాల్లో అదెంతో ఠీవిగా, అందంగా దర్శనమిచ్చేది. పెద్దవాళ్లు సైతం పడుకోగలిగేట్లుగా ఉండి, ఇనుప గొలుసులతో మంచి స్ట్రాంగ్‌గా ఉండేది. ఈజీగా ఓ ముగ్గురు కూర్చు నైనా కూర్చోవచ్చు. అలాంటి ఉయ్యాల బల్ల ఒక్కోసారి ప్రాణాన్ని కూడా రక్షిస్తుంది. వరదలొచ్చినప్పుడు కదలలేని అమ్మమ్మను ఉయ్యాలబల్ల పైనే కూర్చోబెట్టి గొలుసుల్ని బాగా కట్టి ఉంచారట. నీటిమట్టం కాస్త తగ్గే దాకా ఉయ్యాల అలా అమ్మమ్మను కాపాడటం నిజంగా విశేషమే కదా. ఇవన్నీసరే.. మనసు సైతం ఊయలలూగటం ప్రతివారికి అనుభవంలోకి వచ్చేదే. ‘ఊయలలూగినదోయి మనసే.. తీయని ఊహల తీవెల పైనా.. ఊయలలూగినదోయి మనసే’ అని భానుమతి చక్కటిపాట గానం చేసింది.
మతిమరుపు గురించి సామెత చెపుతూ ‘ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికింది’ అంటారు. ఊహల ఊయల బాగానే ఉంటుంది. కానీ ఆ ఊహలు మరీ ఆకాశాన్నంటితే నిజం కావడం కష్టసాధ్యమే. కానీ కష్టపడితే ఆ ఊహను నిజం చేసుకోవచ్చు. మనిషి ఊహల ఊయల్లో ఊగటమే కాక అందుకు అవసరమైన కృషిచేసినప్పుడే ఊహలు సాకారమయ్యేది. అంతలో నా మొబైల్ మోగింది. ఉలిక్కి పడ్డాను. ఇంటినుంచే. ఎప్పుడు చీకటిపడిందో, ఆలోచనల్లో గమనించనే లేదు’ అనుకుంటూ లేచాను. పార్క్‌లో పిల్లలు ఊగి వెళ్లిన ఉయ్యాల ఇంకా స్లో మోషన్లో చేస్తున్న శబ్దం నా చెవులను తాకుతుంటే, నా అడుగులు ముందుకు.
నాలుగడుగులు వేశానో లేదో ఒక ఇంట్లోంచి..
“మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో, ఏమనునో గాని ఆమని, ఈవని..”
నడుస్తుంటే పాట చెవులకు దూరమైంది కానీ నా మనసులో అది కొనసాగింది.
“ఒకరి ఒళ్లు ఉయ్యాల
వేరొకరి గుండె జంపాల
ఉయ్యాల, జంపాల
జంపాల.. ఉయ్యాల
పలకరింతలో.. పులకరింతలో
ఏమో.. ఏమగునో గాని ఈ కథ, మన కథ.. చిన్నగా రాగం తీస్తూ మా ముంగిట్లోకి వచ్చానో లేదో ఊహల ఉయ్యాల ఇక ఉంటానంది!