Site icon Sanchika

మానస సంచరరే-27: ఇలను నడిపే ఇం‘ధనం’!

[box type=’note’ fontsize=’16’] “ధనం మనిషికెంత ముఖ్యమైనా దాన్ని మించి మనిషికి కావలసింది స్నేహధనం, మమత.. మానవతా ధనం, ఆత్మీయతాధనం.. మంచి ధనం” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]శ్రీ[/dropcap]రస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తు శుభమస్తు..

పేరొందిన పెళ్లి హాలు చేరుకునే సరికి చెవులకింపుగా పాట.. శ్రీపతిగారి అబ్బాయి పెళ్లి.. ఆత్మీయంగా పిలిస్తే దూరాభారాల్లెక్క చేయకుండా వెళుతుంటాను. అందుకే ఎక్కడో ఊరవతల ఉన్న ఈ మెగా ‘వెడ్డింగ్ హాల్’కు, సిటీలో మరో మూల ఉన్న నా నివాసం నుంచి బయల్దేరి వచ్చాను. జిగేలుమనిపించే లైట్లు, ముందు ఉద్యానవనంలోని పచ్చనిచెట్లు… పుష్పాలంకరణలు.. ముందుకెళ్లగానే గులాబీలిచ్చి అమ్మాయిలు స్వాగతం పలికారు. హాల్లోకెళ్లగానే నాలుగువైపులా చూశాను. వేదిక మీద రకరకాల పోజుల్లో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు ఫొటోలు దిగుతున్నారు. మరో వైపుకి చూపుతిప్పగానే కొద్ది దూరంలో శ్రీపతిగారు.. చుట్టూ ఐదారుగురు సూట్ వాలాలు.. సరే మావాళ్లెవరైనా అంటే మా ఆఫీసు వాళ్లెవరైనా వచ్చారా అని చూశాను.. అదే క్షణంలో నా భుజంపై ఓ చేయి. వెనుతిరిగితే మాధవి. ‘మేమంతా అదుగో అటు కూర్చున్నాం. రండి’ అంటూ దారి తీసింది. ‘అవునా’ అంటూ వెనుకే నడిచాను. కుర్రకారు ఎవరో చెప్పి పాటల ట్రెండ్ మార్చినట్లున్నారు.

‘వచ్చిండె మెల్లమెల్లగ వచ్చిండే
క్రీమ్ బిస్కట్ ఏసిండే
కుదురుగ నిల్సోనియ్యాడే
సన్నాసన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్బర్బ్ చేసిండే..!

“హాయ్ మేడమ్..రండి మేడమ్..” అంటూ మా కొలీగ్స్ బృందం వాళ్ల మధ్య సీటు చూపించారు. నేనూ అందర్నీ పలకరించాను. ఏవేవో కబుర్లు. ఇంతలో వెల్ కమ్ డ్రింక్, స్నాక్స్ వచ్చాయి. ‘మంచి క్యాష్ పార్టీనే పట్టారు’ అంది చతుర. ‘శ్రీపతిగారు, వాళ్లబ్బాయి ధనేష్‌కి క్యాష్ పార్టీని కాక, అల్లాటప్పావాళ్లని చూస్తారా’ సుభాషిణి అంది. ‘కట్నం లేదని చెప్పారు కదా’ అంది చేతన. ‘పప్పులో వార నేతిలో లాగారు’ అనేది మా బామ్మ. కట్నం లేకపోతేనేం, పెళ్లి గ్రాండ్‌గా చేయాలి. ఘనంగా లాంఛనాలు జరపాలి’ అంటారుగా’ అంది చతుర. ‘ష్..ఊరుకోండి..’ నేను అంటుండగానే శ్రీపతిగారు మా వైపు వచ్చారు. ‘చాలా సంతోష మమ్మా మీరంతా వచ్చినందుకు… అందరూ డిన్నర్ చేసి వెళ్లండి’ అన్నారు. మేం కూడా ఆయనకు శుభాకాంక్షలు చెపుతుండగానే మరెవరో ఆయనను పిలవడంతో ఆయన వేగంగా అటు తిరిగారు. డయాస్ మీద ఫొటోల అంకం ముగిసినట్లుంది. అమ్మాయి, అబ్బాయి మహారాజా ఆసనాలలో కూర్చున్నారు. అంతా గిఫ్ట్‌లు ఇచ్చేందుకు క్యూలో నిల్చున్నారు. ‘మేడమ్! పదండి మనమూ లైన్లో నిల్చుందాం. లేదంటే డిన్నర్‌కి ఆలస్యం అవుతుంది. తొందరగా బయటపడాలిగా’ అంది. దాంతో అంతా లేచి అటు నడిచాం. క్యూ మెల్లిగా కదులుతోంది. మా వంతు వచ్చింది. శ్రీపతిగారు మమ్మల్ని వాళ్లబ్బాయి ధనేష్‌కి పరిచయం చేశారు. మేం తెచ్చిన గిఫ్ట్ అందించి, గ్రూప్ ఫొటో అనంతరం డయాస్ నుంచి దిగాం.

ఆ తర్వాత అంతా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన డిన్నర్ వైపు నడిచాం. అంతటా ఎక్కడికక్కడ త్రీడి స్క్రీన్స్ ఏర్పాటుచేశారు కాబట్టి అన్నివైపుల కోలాహలాలు కనిపిస్తూనే ఉన్నాయి. పైన కంప్యూటర్ డ్రోన్లు తిరుగుతున్నాయి. ఓ వైపు సౌత్ ఇండియన్ ఫుడ్, మరోవైపు నార్త్ ఇండియన్ ఫుడ్, ఇంకో వైపు రకరకాల టిఫిన్లు, ఛాట్.. ఫ్రూట్స్, ఐస్ క్రీమ్‌లు.. మా వాళ్లు ‘అది తిందాం, ఇది తిందాం’ అని సందడి చేస్తున్నారు. ‘డబ్బు నీళ్లలా ఖర్చుచేయడమంటే ఇదేనేమో’ అనుకున్నాను. వెంటనే ‘అయినా నీళ్లకే కరువొచ్చిందిగా. నీటితో పోల్చడం సరికాదు’ అనుకున్నాను… నాలో నేను మొదలైంది.

‘పెళ్లంటే డబ్బు అప్పు తీసుకోవడం ఆ ఏడుకొండలవాడికే తప్పలేదు. అప్పిచ్చిన కుబేరుడికి వడ్డీ ఇప్పటికీ కడుతూనే ఉన్నాడని, అందుకే శ్రీనివాసుడికి ‘వడ్డికాసులవాడు’ అనే పేరొచ్చిందని అంటారు. ఆయనే నయం. తన పెళ్లికి తానే అప్పుచేశాడు, కానీ ఆకాశరాజును అప్పుల పాల్జెయ్యలేదు. లక్ష్మీదేవే అర్థాంగి అయినా ఆయనే అప్పుభారం భరించాడు’ నేను ఆలోచిస్తుండగానే భోజనాలు ముగిశాయి. పాన్ అందుకుని నిష్క్రమిద్దామనుకుంటుండగా భారీ రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ అందించారు శ్రీపతిగారు. గెస్ట్‌లతో బిజీగా ఉన్నారు. ‘ఇంత రష్‌లో మళ్లీ వెళ్లి వెళ్తున్నామని ఏం చెపుతాం. పదండి పోదాం’ అంది సుభాషిణి. ‘కరెక్ట్’ అనుకుంటూ అంతా బయల్దేరాం. అందరికీ వీడ్కోలు చెప్పి క్యాబ్ ఎక్కానే కానీ ఆలోచన, నన్ను అంటి పెట్టుకునే ఉంది. ధనానికి అధిదేవత కుబేరుడు. ధనాన్ని ప్రసాదించేది లక్ష్మీదేవి అనే విశ్వాసంతో ఈ మధ్యకాలంలో చాలామంది కుబేర వ్రతాలు, వైభవలక్ష్మీ వ్రతాలు చేస్తున్నారు. యేటా వరలక్ష్మీవ్రతం మామూలే. అసలు ఏ వ్రతమైనా సంకల్పంలో ‘ధన, కనక, వస్తు సమృద్ధ్యర్థం… సకల ఐశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం’ అనే కదా చెప్పు కునేది.

‘ధనం మూలం ఇదం జగత్’ అన్నారు. అయితే ధనం విలువ తెలుసుకుని, ధనాన్ని ఎలా సద్వినియోగం చేయాలో ఎవరు గుర్తిస్తున్నారు. నేనేనాడో చూసిన ‘లక్ష్మీనివాసం’ సినిమా, అందులో ఎస్.వి.రంగారావు గారి మీద చిత్రించిన ‘ధనమేరా అన్నిటికీ మూలం.. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం..’ పాట గుర్తొచ్చాయి.

ఎంత అర్ధవంతమైన పాట!

“మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా..
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే..
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా…
ఉన్ననాడు తెలివిగలిగి పొదుపుచేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే..
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం..
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం..”

ఆరుద్ర ఎంత సందేశాత్మక గీతాన్ని అందించారో. కానీ సందేశాన్ని అందుకునేదెందరు?

డబ్బుంటేనే అంతా చుట్టాలు, స్నేహితులు.. అవే లేకుంటే అంతా దూరం దూరం.. ఒక ఇంటివారే విడిపోతుంటారు. అందుకే ఆర్థిక శాస్త్రం మనుషుల మధ్య ఆర్థికబంధాలే తప్ప హార్ధికబంధాలు ఉండవంటుంది. రూక ఉన్న వాడిదే రాజ్యం.

“రూపాయి రూపాయి రూపాయి…
నమో నమో శ్రీ రూపాయి.. నమోస్తుతే శ్రీరూపాయి..” పాట గుర్తొచ్చింది.

అసలు డబ్బు అనేది లేకముందు వస్తుమార్పిడి పద్ధతి (బార్టర్ సిస్టమ్)ఉండేది. అందులో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల మనిషి డబ్బును సృష్టించుకోవలసి వచ్చింది. మొదట్లో గవ్వలు, పెంకులు వంటివి కూడా డబ్బుగా చలామణి అయ్యేవట. క్రమంగా నాణేలు, కరెన్సీ నోట్లు ముద్రించడం నేర్చుకున్నాడు మనిషి. నాణేల ముద్రణకు టంకశాలలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తంమీద రాజ్యం చేసేది డాలర్. ఆయా దేశాల కరెన్సీ విలువలు వేరుగా ఉంటాయి. రూపాయికి ఉన్న విలువ తగ్గిన ప్రతిసారి రూపాయి పతనం గురించి, తలెత్తే ఆర్థికమాంద్యాల గురించి పేపర్లలో బిజినెస్ పేజీలు హైలైట్ చేస్తుంటాయి. ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవహారాలతోనే కదా నడిచేది. అందుకే ప్రపంచబ్యాంకు ఏర్పాటు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచబ్యాంకు నుంచి రుణాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అదలా ఉంచితే దేశంలో బ్యాంకులన్నీ వివిధరకాల రుణాలు ఇవ్వడం, తిరిగి ఆ డబ్బును నిజాయితీగా కట్టే సామాన్య పౌరులు, పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని, అప్పు ఎగొట్టి టో కరా వేయడం, విదేశాలకు చెక్కేయడం చేసే బడాబాబులు అన్నీ నిత్య సత్యాలే కదా. అప్పులు తీసుకోవడానికి అంతా అలవాటు పడి పోయారు. అందులోనూ క్రెడిట్ కార్డులు రంగంలోకి ప్రవేశించాక మరీను. ముందు ఖర్చుచేయడం, తర్వాత ఆ డబ్బు కట్టలేక తల కిందులవడం నేటి పోకడ. రుణాలిచ్చే సంస్థలు కూడా మీకు రుణం కావాలా, మీకు రుణం కావాలా అని వారే వెంటపడి మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పంపి, ఇంటికే వచ్చి మరీ డబ్బులు అందిస్తామని టెంప్ట్ చేయడం.. ఒకప్పుడు అప్పు చేయడం తప్పు అనే భావన ఉండేది. ఉన్నంతలోనే ఖర్చుచేయాలని పెద్దలు చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంత పరపతి ఉంటే అంత గొప్ప. అప్పులు చేస్తే ఆ తర్వాత పరిస్థితి గురించి కొసరాజు గారు రాసిన ఓ సరదా సినిమా పాట గుర్తొచ్చింది.

‘అప్పులు చేయకురా నరుడా
తిప్పలు తప్పవురా.. నరుడా తిప్పలు తప్పవురా..
అప్పంటే అది నిప్పులాంటిది. అంటుకుంటే అది వదలనంటది
అప్పు ఇచ్చినా, అప్పు తెచ్చినా ఇద్దరి చేతులు కాలును గదరా..’ అని ఓ పాత సినిమా పాట ఉంది.
అంతెందుకు సుమతీ శతకకారుడు బద్దెన
“అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక బారు నేరును, ద్విజుడున్
జొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకువు సుమతీ!” అన్నాడు.

అప్పిచ్చువాడు, వైద్యుడు, నిరంతరం పారే ఏరు, బ్రాహ్మణుడు లేని ఊళ్లో ఉండకండని చెప్పా డు. అంటే రుణదాత ఊళ్లో ఉండటం చాలా అవసరమని చెప్పాడు. అయితే ఆ తర్వాత అప్పిచ్చేవాడే వైద్యుడని కొందరు సరదాగా దానికి విపరీతార్థం కల్పించారు కూడా. అన్నట్లు ఈ మధ్య ఐక్యరాజ్యసమితికే డబ్బు సమస్య వచ్చింది. సభ్యదేశాలు డబ్బు చెల్లించడం లేదట.

అన్నట్లు గతంలో చేతిలో నగదు లేకపోతే ఖర్చుచేసే అవకాశం ఉండేది కాదు. బ్యాంకు చెక్కులతో ఖర్చు పరిమితంగానే ఉండేది. ఈ మధ్య కాలంలో ఎటిఎమ్‌లు వచ్చాక ఏ టైమ్‌లో అయినా ఎటిఎమ్‌కు కార్డ్ పట్టుకెళ్లి క్యాష్ తెచ్చుకునే సౌకర్యం ఏర్పడింది. అలాగే క్రెడిట్ కార్డులు వీలైనన్ని ఉంచుకొని ఎడా పెడా వాడేస్తుంటారు చాలామంది. ఎటిఎమ్ లు కూడా ‘నో మనీ’ అనడం, బ్యాంకుల్లో ‘పరిమితంగానే’ డబ్బు తిరిగి తీసుకోవాలనే నిబంధనలు వచ్చా యి.. అది వేరు సంగతి. రెండేళ్ల కిందట ఐదొందల రూపాయల నోట్ల రద్దు పెద్ద సంచలనమే అయింది. ఆ నోట్లను గడువు లోపల బ్యాంకుల్లో జమచేయడానికి జనం నానా అగచాట్లు పడాల్సివచ్చింది. అయినా ఇంట్లో అక్కడా, ఇక్కడా దాచుకున్న నోట్లు ఆ తర్వాత ఎప్పుడో కనిపించి చాలామంది వాపోవటమూ జరిగింది.

డబ్బు సంపాదించడానికి వారివారి తోవలో అంతా తాపత్రయపడుతూనే ఉంటారు. డబ్బు సంపాదించడమెలా?, ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించండి?’ వంటి పుస్తకాలు తరచు దర్శనమిస్తుంటాయి. డబ్బుఖర్చు పెట్టడమెలా? అని ఎందుకు రాయరో? అది ఎవరికి తెలియదని అనుకోవటం పొరపాటు. ఎలాగోలా ఖర్చు పెట్టడం కాదు, సద్వినియోగం ఎలా చేయాలన్నది ప్రతివారు తెలుసుకోవాల్సిందే. పొదుపంటే మరీ పిసినారిగానూ ఉండకూడదు. ఖర్చుచేయడమంటే దుబారాగా ఖర్చుచేయడమూ తప్పే. ఖర్చుచేసే వైఖరుల్లో కూడా తేడాలుంటాయి. ఎవరి అభిరుచులను బట్టి వారు ఆయా వస్తువులపై విపరీతంగా ఖర్చుచేస్తుంటారు. దుర్వ్యసనాల పై ఖర్చుచేసేవారు ఎంతోమంది. సిగరెట్లు, తాగుడు, జూదము వగైరాలకు బానిసలై ఎంతమంది బికారులవటంలేదు?

‘అయ్యయో.. చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయో.. జేబులు ఖాళీ ఆయెనే
ఉన్నది కాస్తా ఊడింది
సర్వమంగళం పాడింది
పెళ్లాం మెడలో నగలతో సహా
తిరుక్ష వరమైపోయింది..
అని సినిమాలో ఓ పేకాటరాయుడు పాడతాడు. అంతా అయిన తర్వాత మళ్లీ ఆడటానికి ప్రోత్సహిస్తూ మరొకడు ‘చేయి తిరగవచ్చు.. మళ్లీ ఆడి గెల్వవచ్చు’ అంటాడు.
‘పోతే’ అని సందేహం వ్యక్తంచేస్తే
‘అనుభవమ్ము వచ్చు..
చివరకు జోలెపట్టవచ్చు’

పాట సరదాగా నవ్వుకోవడానికి భలేగా ఉందనుకుంటాం. కానీ వ్యసనానికి అలవాటు పడ్డవారి మనస్తత్వాలు ఎంతగా దానికి అంటుకుని ఉంటాయో ఈ పాట చెపుతుంది.

మనదికాని డబ్బుని తర్వాత సర్దుబాటు చేయడం కూడా పెద్ద తప్పే. అది ముప్పును తెచ్చి పెడుతుంది. నాడు భక్త రామదాసుగారు భద్రాచల రాముడికి, సీతకు.. పరివారం మొత్తానికి ఆభరణాలు చేయించి, రాజు గారికి కట్టవలసిన పైకాన్ని కట్టలేకపోయాడు. దాంతో ఎన్నో చిక్కులు వచ్చిపడ్డాయి. చివరకు బందిఖానాకు పంపారు. దాంతో రామదాసు, రాముడిలో నిష్ఠూరంగా ‘నీకోసమేకదా నేను ఖర్చు చేసింది’ అని నిలదిస్తూ..

“ఇక్ష్వాకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్రా
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా
చుట్టూ ప్రాకారములు సొపుంతో కట్టిస్తి రామచంద్రా
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా
భరతునకుచేయిస్తి పచ్చల పతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా
కలికి తురాయి నీకు మెలకువగ చేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్రా” అని నిలదీస్తాడు. అంతేనా..
“నీతండ్రి దశరథ మహారాజు పెట్టెనా రామచంద్రా
లేక నీ మామ జనక మహరాజు వం పెనా రామచంద్రా..” అని సూటిగా ప్రశ్నిస్తాడు. బాధావేశాలతో అలా ప్రశ్నించినా అంతలోనే..

“అబ్బ తిట్టితినని యాస పడవద్దు రామచంద్రా,
ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా..” అని విన్నవించుకుంటాడు.

ఇక సత్య హరిశ్చంద్రుడుగారయితే విశ్వామిత్రుడికి రాజసూయ యాగానికి దక్షిణ ఇస్తానని చెప్పి ఉన్నదంతా ఇచ్చేస్తాడు. అయినా అది సరిపోదు. దాంతో ముందుగా కొడుకును, తర్వాత భార్యను అమ్మేస్తాడు. తాను కాటికాపరి అవుతాడు. ఇలా సత్య హరిశ్చంద్రుడి కష్టాలకు అంతే లేకుండా పోతుంది.

డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? అంటారు కానీ… నిజంగా అలాంటిదే జరిగితే.. ఎవరి శక్తి కొద్దీ వారు ఊహించుకోవచ్చు. డబ్బులు కాసే చెట్టేమో కానీ, అన్నట్లు ‘రూపాయిచెట్టు’అని సలీంగారు ఓ మంచి కథ రాశారు. అదలా ఉంచితే అదృష్టాన్నిస్తుందని చాలామంది ‘మనీ ప్లాంట్’ను పెంచడం తెలిసిందే. ‘డబ్బులెవరికీ ఊరికే రావు’ అంటారు ‘గుండంకుల్’ గా పేరొందిన లలితా జువెలర్స్ అధినేత. త్యాగరాజు గారు.. ధనంకు సంబంధించి ఓ కీర్తన ఇలా పాడారు.

‘నిధి చాల సుఖమా.. రాముని సన్నిధి సేవా సుఖమా
నిజముగ పల్కు మనసా?’ అంటాడు.

ఇప్పుడు త్యాగరాజులు కనిపించరు. అంతా ధనరాజులే. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలో ఇనప్పెట్టెలు కామన్. కాలక్రమంలో ఇనప్పెట్టెలు వెనక్కుపోయి బీరువాలు అందుబాటులోకి వచ్చాయి. డబ్బులో మళ్లీ తెలుపు, నలుపు అని రెండు రకాలు. ప్రభుత్వానికి లెక్కలు చూపించగలిగే డబ్బు మామూలు డబ్బు అంటే వైట్ మనీ. అదే లెక్క చూపించలేని డబ్బు నల్లడబ్బు. ఫోర్బ్స్ పత్రిక ప్రపంచ స్థాయిలో ధనవంతుల ర్యాంకులు ప్రకటిస్తుంది. ఇండియా అంతటికీ ముఖేష్ అంబానీగారు అత్యంత సంపన్నుడు. ప్రపంచం మొత్తంమీద అత్యంత సంపన్నుడు అమెజాన్.కామ్ ఇంక్ వ్యవస్థాపకుడు, సీఇవో, ప్రెసిడెంట్ అయిన జెఫ్ బిజోస్. ఆయన నెట్ వర్త్ పదకొండు వేల ఇరవై కోట్ల యుఎస్ డాలర్లట. ఒకప్పుడు లక్ష అంటే ఎంతో గొప్పగా ఉండేది. అందుకే ‘లక్షాధికారి’ పేరిట సినిమా కూడా వచ్చింది. ఈకాలంలో లక్ష అంటే లక్ష్యపెట్టేవారే లేరు. లక్ష కనీస సంఖ్య అయి పోయింది. ఇప్పుడు కోటీశ్వర్లులైతే ఒక రేంజ్ ఉన్నట్లు భావిస్తున్నారు. డబ్బు అనంతంగా పెరిగిపోయి, దాచటానికి దేశీయ బ్యాంకులు సరిపోక, స్వదేశీ ప్రభుత్వానికి తెలియకుండా స్విస్ బ్యాంకుల్లో దాచుకునే బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు ఎందరో. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచిన భారతీయుల వివరాలు వెల్లడించమని వారిని కోరడం కూడా జరిగింది. ఇటీవల స్విస్ బ్యాంక్ కొన్ని పేర్లు వెల్లడించినట్లు పేపర్లలో వచ్చింది.

డబ్బు పొదుపును పిల్లలకు అలవాటు చేయాలని ఇంట్లో మట్టి హుండీలుండేవి. చిల్లర పైసలు ఉన్నప్పుడల్లా పిల్లలచేత అందులో వేయించేవారు. అలాగే బంధువులొచ్చినప్పుడు ఆ పిల్లలకు పదో పరకో ఇచ్చినా (గతంలో) అవి హుండీలో వేసేవాళ్లు. ఆ తర్వాత కిడ్డీ బ్యాంక్ మొదలైంది. ఆంధ్రాబ్యాంకు మొదటగా ఈ కిడ్డీ బ్యాంకింగ్ ప్రవేశపెట్టింది. అన్నట్లు ప్రతి గుడిలో హుండీ ఉంటుంది. దేవుడికి కానుకగా హుండీలోడబ్బులు వేస్తుంటారు. తిరుపతి హుండీ ఆదాయంలో అగ్రగామిగా ప్రసిద్ధమైంది. ఆ హుండీ డబ్బు నిరంతరం లెక్క పెడుతూనే ఉంటారు. దాన్ని ‘పరకామణి’ అంటారు. బ్యాంకుల్లో అయితే కరెన్సీ లెక్కింపుకు మెషిన్లే ఉంటుంటాయి. డబ్బు లెక్క పెట్టడం కూడా అంత ఈజీకాదు. కొంతమంది చకచకా లెక్క పెట్టేస్తారు. కొంతమంది కంగారుగా, లెక్క సరిపోక మళ్లీ మళ్లీ లెక్క పెడుతూ అవస్థపడతారు. ఇంకా కొంతమంది ఉంటారు. పాతకొత్తనోట్లను వేర్వేరుగా, మళ్లీ ముద్రణ సంవత్సరం ప్రకారంగా వేటికవిగా కట్టలు కడుతూ, తామెంతో సిస్టమెటిక్ అనుకునే చాదస్తులు ఉంటారు. కరెన్సీ నోట్ల మీద ఎటువంటి రాతలు రాయకూడదన్నది ఇప్పటికీ అసంఖ్యాకులు పాటించటం లేదు. తమ సంతకాలు వగైరాలు రాయడం, నిర్లక్ష్యంగా నలిపేసి, చింపి, ప్లాస్టర్తో అతుకులు వేసి.. ఇలా నోట్లను వికృతంగా తయారు చేసే వారెందరో. చూసుకోకుండా అలాటినోట్లను తీసుకున్నామో, వాటిని మళ్లీ మార్చడానికి నానాతంటాలు తప్పవు. మళ్లీ పాత, చిరుగునోట్లకు కొత్త నోట్లిచ్చే బిజినెస్ కూడా ఉంటుంది. ఎక్కువ డబ్బు తీసుకుని, తక్కువ ఇస్తారన్న మాట. చెల్లని నోటుకు వచ్చిందే చాలనుకుని అలా మార్చేసుకునేవాళ్లు కొంతమంది. ఇక చిల్లర శ్రీమహాలక్ష్మి అంటుంటారు. చిల్లర బిజినెస్ కూడా ఎంతోమంది నడుపుతుంటారు. ఎంత చిల్లర కావాలంటే అంత చిల్లర ఇస్తారు. అందుకు కమీషన్ తీసుకుంటారు. ఇంక చిట్టీల బిజినెస్లు, చిట్ ఫండ్ల బిజినెస్లు తెలిసినవే. ఇందులో కొన్నిసార్లు మోసాలు, దివాలా తీయడాలు, డబ్బుతో పారిపోవడాలు ఎన్నెన్నో ఘటనలు జరగడం కూడా కద్దు.

అన్నట్లు ‘మనీ’ చిత్రానికి సిరివెన్నెల మంచి పాట రాశారు. అది..

“చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీమనీ
అమ్మచుట్టము కాదు, అయ్య చుట్టము కాదు అయినా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికి పాడెకట్టడానికి మధ్య అంతా తనే అంది మనీమనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ..”

సుమతీ శతకకారుడు తనదైన శైలిలో
‘ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
తెప్పలుగ చెరువు నిండిన
కప్పలు పదివేలు జేరు గదరా సుమతీ’ అన్నాడు.

ఇలా డబ్బు విశ్వరూపాన్ని ఇంకా ఎందరో కవులు అనేకరకాలుగా పాటల్లో, పద్యాల్లో దర్శింపజేశారు. అన్నట్లు అవార్డులు, పురస్కారాలలోను ధనం ఉంటుంది. దాన్నే ‘నగదు పురస్కారం’ అంటారు.

ఇంతలో మొబైల్ మోగింది. చూస్తే లక్ష్మీ ప్రసన్నగారు.. ఈసారి మా ‘బొటిక్’లో ధనలక్ష్మీ పూజకు మీరు తప్పకుండా రావాలి.. ఆహ్వానం. ‘ఓకే అండీ’ అంటూ అప్పటికి తప్పించుకున్నాను. అన్నట్లు దీపావళి ముందు ‘ధతెరాస్’ పేరుతో బంగారం కొనడం ఉత్తరాదినుండి క్రమంగా దక్షిణాదికి పాకిపోయింది. ధనం మనిషికెంత ముఖ్యమైనా దాన్ని మించి మనిషికి కావలసింది స్నేహధనం, మమత.. మానవతా ధనం, ఆత్మీయతాధనం.. మంచి ధనం’ అనుకుంటుండగానే ఇంటి ముందు క్యాబ్ ఆగటంతో ఆటోమేటిక్‌గా డబ్బు ఆలోచన వెనక్కు, మనీ పర్స్ ముందుకు.

Exit mobile version