[box type=’note’ fontsize=’16’] “కలుపు మొక్కలవంటి ఆలోచనలను తొలగించివేస్తూ, మంచి ఆలోచనలను పెంపుచేసుకుంటూ మంచి బాటలో పయనించాలి” అంటూ పచ్చని వనాలలోకి తీసుకెళ్తున్నారు జె. శ్యామల. [/box]
[dropcap]‘ప[/dropcap]పపపప పప్పు దప్పళం
అన్నం నెయ్యి వేడి అన్నం కాచిన్నెయ్యి వేడి అన్నం
మీద కమ్మని పప్పు కాచిన్నెయ్య….
భోజనం.. వనభోజనం.. వనభోజనం జనరంజనం..’
పాట చెవిన పడటంతో ‘ప్చ్.. ఈ సంవత్సరం వనభోజనానికి వెళ్లటానికి వీలుపడనే లేదు..’ అనుకుంటుంటే హరిత వనాలు కళ్ల ముందు నిలిచాయి.. ఇంకేం.. మనసు వన విహారం మొదలు పెట్టింది. దాంతో బృందావనం తలపుకొచ్చింది.
‘మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం..’ గుర్తుకు వచ్చింది. ఎన్ని వనాలున్నా బృందావనం బృందావనమే.
‘బృందావనమది అందరిదీ.. గోవిందుడు అందరి వాడేలే ఎందుకె రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే..’ ఎంత చక్కటి సాహిత్యం!
వనం అంటే అచ్చతెనుగులో తోట. హృదయాలను అలరించే ఉద్యానవనాలు కోకొల్లలుగా ఉన్నాయి. మామిడి తోటలో కోకిలమ్మ కుహుకుహులు, జామ తోటలో చిలకలు వాలే చెట్లు, చెట్ల పైన గెంతుతూ, ఉయ్యాలలూగే కోతులు.. చెట్లపై తిరుగుతూ, పిందెల్ని కొరుకుతుండే ఉడుతలు… ఇలా తోటల్లో ఆకట్టుకునే దృశ్యాలెన్నో. కోతులేమిటి, మనిషికీ తోటలోని చెట్ల కాయలను కోసుకోవాలంటే ఎంత ఇష్టమో.
తోటలే నిత్యవ్యవహారంలో ‘పార్క్’లుగా మారాయి. సామాన్యుడికి సైతం సేదతీరేందుకు ఉండే ఏకైక తావు పార్క్ అంటే అతిశయోక్తి కాదేమో. నిరుద్యోగులకు, వృద్ధులకు, ప్రేమ జంటలకు, పిల్లలకు పార్క్‌లు ఉల్లాసాన్ని, ఉపశాంతిని ఇస్తాయి. రోజూ పార్క్ కెళ్లేవారూ ఉంటారు. ఉదయాల్లో పార్కుల్లో నడకసాగించే వారెందరో. అందమైన సాయంత్రాలలో పార్క్‌లో సరదాగా గడిపేవారు కొందరు. కొంతమందికి ఫలాని చెట్టు దగ్గర, ఫలాని సిమెంటు బెంచి మీదే బైఠాయించే అలవాటు కూడా ఉంటుంది. చిన్నఊళ్లల్లో సైతం కనీసం మున్సిపల్ పార్క్ అయినా ఉంటుంది. కోనసీమ కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. తోటల్లో అనేక రకాలు. పూల తోటలు, పండ్ల తోటలు, కూరల తోటలు వగైరా వగైరాలు. ఉద్యానవనాల పెంపకానికి సంబంధించిన శాస్త్రం ‘హార్టీ కల్చర్’. అదొక ప్రత్యేక శాఖ. ప్రతి సంవత్సరం ఆయా తోటల ఉత్పత్తులకు సంబంధించిన ప్రదర్శనలు, పోటీలు మామూలే. చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆ మే లైన, అందమైన ఉత్పత్తుల వెనుక వారి కృషిని గుర్తించాలి. ‘కష్టే ఫలి’ కదా.
అడవుల్ని కూడా వనాలుగా వ్యవహరిస్తుంటాం. పురాణాల్లో వన ప్రస్తావన విరివిగా కనిపిస్తుంది. రామాయణంలో సీతారాముల వనవాసం తెలిసిందే. సీతను అపహరించుకు వెళ్లిన రావణుడు, ఆమెకు అశోకవనాన్నే విడిదిని చేశాడు. అశోకవనాన్ని వాల్మీకి ఎంత సవిస్తరంగా వర్ణిస్తాడో.
కృష్ణుడైతే సరేసరి. ఆయన చిరునామాయే బృందావనం.
‘చందన చర్చిత నీల కళేబర
పీతవసన వనమాలి’.. వనమాలి అంటే తులసీమాల ధరించినవాడని అర్థం. విష్ణువుకు తులసి ఆకులు ప్రీతి. శివుడికి మారేడు దళాలు ప్రీతి. వినాయకుడికి అయితే పత్రి పూజే పరమానందం. ఇవన్నీ తోటల్లో లభించేవే.
పోతనగారు భాగవతంలో శ్రీమహావిష్ణువు ఇంటి చిరునామాను ఎంతో వివరంగా వర్ణిస్తారు ఇలా.
అలవైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు
దా పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై.
వైకుంఠపురంలోని రాజభవనసముదాయంలో ప్రధాన సౌధం లోపల మందారవనంలోని సరస్సులో కమలపుష్ప పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నవాడు.. అంటూ విష్ణుమూర్తి ఎక్కడ, ఎలా ఉన్నదీ చెపుతాడు. ఇక్కడ కూడా మందారవనం ఉండనే ఉంది.
సరస్వతీ దేవీ అంతే..
‘మాణిక్యవీణా ఉపలాలయంతీ
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగి..’ అంటూ
‘మాతా మరకత శ్యామా మాతంగినీ మధుశాలినీ
కుర్యాత్ కటాక్షమ్ కల్యాణి కదంబ వనవాసిని..’ అంటారు. కదంబ వనమే ఆమె నివాసం. అదే శ్లోకంలో మళ్లీ.. ‘కాదంబ కాంతార వాసప్రియే’… అంటారు. కదంబవనం ఆమెకెంతో ఇష్టమట. హాయిగా, ప్రశాంతంగా వీణ వాయించకోవడానికి వనం సరైన తావుకదా. అన్నట్లు తిరువరూర్ దగ్గర కీఝక్ వేలూరులో ఓ బదరీ వనం ఉంది. అక్కడ అక్షయలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి. అమ్మవారు వనమూలై నాయకి. అమృతమథనం సందర్భంలో ఓ చుక్క అమృతం ఇక్కడ పడ్డదట. ముత్తుస్వామి దీక్షితార్ ఇక్కడ అక్షయ లింగ విభో స్వయంభో కీర్తన రాశారట.
అయితే.. మనసు నిండా వలపు ఉండాలేగానీ వనాలతో ఏం పని అంటూ చక్కని యుగళగీతాన్ని అందించారు. సినీకవి పింగళి. అది….
‘ప్రేమయాత్రలకు బృందావనము, నందనవనము ఏలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగ వేరే స్వర్గము ఏలనో..’
విప్రనారాయణలో విప్రనారాయణడు తోటమాలిగా పనిచేస్తూ, అనవరతం భగవద్భక్తితో ఉంటాడు.
దేవదేవి అతడి మనసు మళ్లించే ప్రయత్నంలో పాటందుకుంటుంది.
‘ఎందుకోయీ తోటమాలీ
అంతులేనీ యాతనా..
యిందుకేగా.. నీవుచేసే పూజలన్నీ తపోధనా!’
ఇక ఏకవీర చిత్రంలో తొలి పరిచయాన్ని స్మరించుకుంటూ నాయిక
‘తోటలో నారాజు తొంగి చూసెను నాడు..
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు..’ అంటుంది.
మాయాబజార్ సినిమాలో పింగళి నాగేంద్రగారు
‘చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము’ అంటూ చక్కని పాటనందించారు. అందులో శశిరేఖ ఇలా పాడుతుంది..
‘శరముల వలెనె చతురోక్తులను
చురుకుగ విసిరే నైజములే
ఉద్యానమున వీర విహారమే..
చెలికడనోహెూ శౌర్యములే..’ అంటూ తోటలో వీర విహారం అంటూ ఆటపట్టిస్తుంది.
పూలతోటలన్నీ ఒక ఎత్తయితే మల్లెతోట మరో ఎత్తు. దాని పరిమళమే పరిమళం. అందులో మధుమాసంలో.. అందుకే ‘అందమె ఆనందం’ చిత్రానికి దాశరథి..
‘మధుమాస వేళలో మరుమల్లె తోటలో
మనసైన చిన్నదీ లేదేలనో..’ అంటూ ఓ చక్కని పాటను అందించారు.
అన్నట్లు ‘బుద్ధిమంతుడు’ చిత్రానికి సినారె గారు అందించిన ఓ గీతం.
‘తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా.. గడసరి తుమ్మెదా
మా మల్లె మనసెంతో తెల్లనిది.. ఏ వన్నెలేచిన్నెలెరుగనిది’..
అసలు సినిమాల్లో యుగళ గీతాల్లో చాలావరకు అందమైన ఉద్యానవనాల్లో చిత్రీకరించేవే.
జానపదంలోనూ తోటల ప్రస్తావనతో పాపులర్ పాటలున్నాయి.
‘మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్యా
నువ్వు మరువకు మరువకు మావయ్యా..’
అంతెందుకు పిల్లలు పాడుకునే రైమ్స్ లోనూ తోటల మాట ఉండనే ఉంది…
‘చిట్టి చిలకమ్మా.. అమ్మ కొట్టిందా
తోటకెళ్లావా.. పండుతెచ్చావా
గూట్లో పెట్టావా.. గుటుక్కుమన్నావా’
అని పిల్లలు ముదుముద్దుగా చెప్పడం వింటుంటాం.
ప్రఖ్యాత మిమిక్రీ కళాకారులు శివారెడ్డిగారు ఈ రైమ్‌ను ఆధారంగా చేసుకొని చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కె.సి.ఆర్‌గారు ఎలా మాట్లాడుతారో చెప్పి కడుపుబ్బ నవ్వించారు.
అన్ని ఆకుకూరలూ తోటల్లో పెరిగేవే అయినా ఒక్క ఆకుకూర మాత్రమే ‘తోటకూర’గా వ్యవహారంలోకి వచ్చింది. అందులో మళ్లీ ‘పెరుగు తోటకూర’. బహుశా అది పెద్దదిగా పెరగటం వల్ల అది పెరుగుతోటకూర అయింది. చిన్నప్పుడు దాన్ని తినే పెరుగుగా అర్థంచేసుకొని, తోటకూరకు, పెరుగుకు ఏం సంబంధం అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత తెలుసుకుని నాకు నేనే నవ్వుకున్నాను. ‘తోటకూర నాడే దండించి ఉంటే…’ అని ఓ సామెత. తప్పుచేసిన తొలిసారే దండిస్తే ఆ తర్వాత పెద్ద తప్పు చేసే అవకాశం ఉండదని సారాంశం. అలాగే ‘గంజాయి వనంలో తులసి మొక్క’ అని ఓ సామెత. చెడ్డవాళ్ల గుంపులో ఓ మంచి వ్యక్తి ఉన్నప్పుడు ఈ సామెతను అన్వయిస్తుంటారు. అలాగే బంధుత్వానికి, వ్యవహారానికి సంబంధం ఉండదనటానికి ‘ఎక్కడన్నా బావ గాని, వంగతోట కాడ కాదు’ అని సామెత చెపుతుంటారు. అన్నట్లు తోట రాముడు, తోటలో పిల్ల కోటలో రాణి వంటి సినిమాలూ వచ్చాయి.
అన్నట్లు చరిత్రలో ‘వేలాడే తోటలు’ (హేంగింగ్ గార్డెన్స్) ఉన్నాయి. ప్రాచీన కాలానికి సంబంధించిన ఏడు అద్భుతాలలో బాబిలోన్‌లోని హేంగింగ్ గార్డెన్స్ ఒకటి.
ప్రపంచంలో అందమైన తోటల్లో ప్రథమ స్థానంలో నిలిచింది జపాన్ లోని కనజవలో ఉన్న కెన్రొకుయెన్ గార్డెన్స్. పదిహేడవ శతాబ్దం నుంచే ఈ తోట ఏర్పాటు ప్రారంభమైందట. మనదేశంలో సుందరవనాలు పశ్చిమబెంగాల్ లోని హుగ్లీనది నుంచి, బంగ్లాదేశ్ లోని బలేశ్వర్ వరకు విస్తరించాయి. గంగానది, బ్రహ్మపుత్ర, మేఘన నదుల కలయిక వల్ల ఏర్పడ్డ డెల్టాయే ఈ సుందరవనాలకు ఉనికిపట్టు. మడ చెట్లకు ఈ సుందరవనాలు ప్రసిద్ధి.
మనదేశంలో పెద్ద ఉద్యానవనాలుగా పేరొందినవి.. ముంబైలోని హేంగింగ్ గార్డెన్స్, మైసూర్‌లోని బృందావన్ గార్డెన్స్, చండీఘర్ లోని రాక్ గార్డెన్, ఢిల్లీలోని లోడి గార్డెన్స్, పింజోర్ లోని పంచ్‌కుల గార్డెన్స్, కాశ్మీర్ లోని షాలిమార్ బాగ్, శ్రీనగర్ లోని నిషాతా బాగ్, బెంగళూర్ లోని లాల్ బాగ్, శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్.. ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు.
పురాణాలలో ఇంద్రుడి నందనవనాన్ని ప్రముఖంగా పేర్కొనటం జరిగింది. కవులు స్వర్గంలోని ఈ నందనవనాన్ని ఎంతగానో వర్ణించారు. కాళిదాసు ఈ నందనవనాన్ని వర్ణిస్తూ ఇందులోని పది వృక్షాలు సతత హరితాలుగాను, ఫలపుష్ప భరితంగానూ ఉన్నాయని వివరించాడు. రావి, మర్రి, గంధం, దేవకాంచనం, కదంబం, మామిడి, వేప, బ్రహ్మమాలిక, నేరేడు వగైరాలున్నాయని వివరించాడు.
పారిజాత పుష్ప ప్రహసనంలో సత్యభామ అలక తీర్చడానికి శ్రీకృష్ణుడు, ఇంద్రుడి నందనవనంనుంచి పారిజాత వృక్షాన్నే పెకలించి తెస్తాడు.
వనం అంటే తోట కావచ్చు, పెద్దదైన అడవి కావచ్చు. రామాయణమైనా, భారతమైన ఈ వనంతోనే ముడిపడి ఉన్నాయి. రామాయణంలో కైకేయి రాముణ్ని పధ్నాలుగేళ్లు వనవాసం పంపాలని కోరటం, పితృవాక్యపాలన కోసం రాముడు వనవాసానికి బయలుదేరటం, సీత, లక్ష్మణుడు రాముణ్ని అనుసరించటం.. అడవుల్లో ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరంగా గడుపుతుండగా రావణుడు, సీతను అపహరించడం.. వగైరా.. వగైరా.. తెలిసిన కథే.
మహాభారతంలోనూ జూదంలో ధర్మరాజును మోసంతో ఓడించి, పందెం ప్రకారం పాండవులను పదమూడేళ్లు వనవాసం, ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం చేయమనడం, వనవాసం, అజ్ఞాత వాసం పూర్తయ్యాకకూడా కనీసం ఐదు ఊళ్లు ఇవ్వడానికి ఒప్పుకోకపోవటంతో కురుక్షేత్ర యుద్ధానికి దారితీయడం తెలిసిందే.
‘బిహైండ్ ఎ వాల్’ పొయెమ్‌లో ఎమీ లొవెల్ ఇలా అంటుంది..
‘ఐ ఓన్ ఎ సొలేస్ షట్ వితిన్ మై హార్ట్
ఎ గార్డెన్ ఫుల్ ఆఫ్ మెనీ ఎ క్వెయిట్ డిలైట్
అండ్ వార్మ్ విత్ డ్రౌజీ, పాపిడ్
సన్ షైన్, బ్రైట్
ఫ్లేమింగ్ విత్ లిల్లీస్’.
మనం.. మనుషులం.. వనంతోనే ముడిపడి ఉన్నాం. వనం లేనిదే మనం లేం. వృక్ష నిలయాలు వనాలు. వనాలు కేవలం ఆహ్లాదానందాలు కల్గించడమే కాదు, కార్బన్ డైయాక్సైడు స్వీకరించి, ప్రాణికోటికి ఆక్సిజన్‌ను అందించడంలో మహత్తరమైన పాత్ర పోషిస్తున్నాయి. మనకు ఆహారానికి కూరలను, పళ్లను, ఇంకా అనేకానేక పదార్థాలను అందించి మన ఆకలి తీరుస్తున్నాయి. మనకు కలపనందించి, ఇంటి నిర్మాణానికి, ఫర్నిచర్ తయారీకి తోడ్పడుతున్నాయి. వానలకు వనాలే సాయపడుతుతున్నాయి. అనేకానేక ప్రాణులకు ఆశ్రయమిచ్చేవి వనాలే. జీవవైవిధ్యానికి వనాలే మూలతావులు. ఇలా మనకు మహోపకారం చేస్తున్న వనాలు మనిషికి మార్గదర్శులు కూడా. నోరులేని వాటి గొప్ప లక్షణాలను నోరున్న మనిషి నేర్చుకోగలిగితే ‘మనీషి’ కాగలడు. కానీ దానికి బదులుగా స్వార్థంతో చెట్లను కొట్టేస్తూ, వాటికి మేకులు కొట్టి ప్రకటనల బోర్డులను ఉంచటం, పేర్లను చెక్కుతూ.. వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఫలితంగానే పర్యావరణం ప్రమాదంలో పడుతోంది. గంధం చెట్లను నరికి అక్రమరవాణా చేసిన వీరప్పన్ లాంటి వారెందరో ఈ సమాజంలో ఇంకా మిగిలే ఉన్నారు.
కొట్టేసినా, కొంతకాలానికి చిగురులు తొడిగే ఆత్మస్టైర్యం చెట్లది. అంతటి ఆత్మవిశ్వాసాన్ని మనిషి ఎప్పుడు అలవరచుకుంటాడో. మనిషి మనసు కూడా ఓ వనంలాంటిదే. మనం ఎలాంటి ఆలోచనలనే చెట్లను నాటితే అలాంటి ఫలితాలనే ఫలాలు లభిస్తాయి. కలుపు మొక్కలవంటి ఆలోచనలను తొలగించివేస్తూ, మంచి ఆలోచనలను పెంపుచేసుకుంటూ మంచి బాటలో పయనించాలి.. అనుకుంటూ ఉండగానే ఫోన్ మోగింది.
చూస్తే సహజ. ‘బహుకాల భాషణం.. ఎలా ఉన్నావ్’ అన్న నా ప్రశ్నకు బదులిస్తూ.. ‘నా కవితలు పుస్తకం వేశానోయ్. ఆ బిజీలో ఉండే ఫోన్ చేయలేకపోయాను. పుస్తక ఆవిష్కరణ. నువ్వు తప్పక రావాలి’ అంది.
‘ఇంతకూ సంకలనం శీర్షిక ఏంటి?’ అడిగాను. ‘వృక్ష గీతిక’ చెప్పింది. ‘ఆవిష్కరణ’ ఎక్కడ, పెద్దలు ఎవర్ని పిలుస్తున్నావ్ అడిగాను. ‘వచ్చే ఆదివారం.. ఆనందవనంలో.. వృక్షాల సమక్షంలోనే ఆవిష్కరణ. మా అమ్మే ఆవిష్కరిస్తుంది. స్నేహితులు, సన్నిహితులనే పిలుస్తున్నాను. విందు భోజనం.. మాట.. పాట. నువ్వు తప్పక రావాలి’ అంది.
“వేదికలతో పనిలేకుండా ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేస్తే రాకుండా ఎలా ఉంటాను. తప్పక వస్తాను” అన్నాను. ‘కలుద్దామంటూ’ కాల్ ముగించాక.. వనం గురించి ఆలోచిస్తుంటే వనమే ఆహ్వానించింది అనుకుంటుండగా, నా ఆలోచనకు లైక్ బటన్ నొక్కినట్టుగా కిటికీలోంచి కొబ్బరాకు నా వైపుగా గాలికి ఊగింది.