మానస సంచరరే-35: అందాలలో అహో మహోదయం!

9
2

[box type=’note’ fontsize=’16’] “ఆస్వాదించే మనసు ఉండాలే కానీ ఈ ప్రకృతిలో అందాలకేం కొదవ? నేల నాలుగు చెరగులా అందాలకు చిరునామాలెన్నో” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]ఉ[/dropcap]దయానే టీ కప్పుతో ముంగిట్లోకి నడిచాను. సూర్యకిరణాల వెలుగులు పరుచుకుని ఆవరణ అంతా కాంతులీనుతూ ఉత్తేజకరంగా ఉంది. తల ఎత్తి ఓ వారగా చూపు సారించాను. ప్రకాశవంతమైన ఎరుపురంగునద్దుకున్న ఆకాశం అందంగా.. పేపర్ కుర్రాడు పేపర్ విసిరేసినట్లున్నాడు. అదొచ్చి పూలకుండీలో బైఠాయించింది. వెళ్లి దాన్నందుకుని రాతిచప్టా మీద బైఠాయించాను.

‘హ్యాట్రిక్ కేజీవాల్’ పతాక శీర్షిక.. అలా అలా పేజీలు తిప్పాను. ‘కరోనా…కుచ్ కరోనా..; సినిమా పేజీలో నటి ‘నిష’ అందాల ఆరబోత.. నవ్వొచ్చింది.. ఆరబోత.. వడబోతా.. ఏమిటో ఈ సినిమా భాష భలే గమ్మత్తుగా తయారవుతోంది. అందమైన లొకేషన్లలో ఖర్చుతో రాజీపడకుండా చిత్ర నిర్మాణం. సినిమా అందంగా రావాలన్నదే తమ లక్ష్యం.. అట. పేపర్ పక్కన పెట్టా. అంతరంగం అందుకుంది.. అందం అర్థాలే మారిపోతున్నాయ్ రానురాను. ఆస్వాదించే మనసు ఉండాలే కానీ ఈ ప్రకృతిలో అందాలకేం కొదవ? చుక్కల దుస్తుల్లో చక్కని నీలాకాశం, పచ్చచీరలో ముస్తాబైన చేలు, విరిసిన తామరలు నిండిన కొలను, గలగలపారే సెలయేరు, నవ్వుల పరవళ్ల నది, ఎగసిపడే అలలతో సందడి చేసే సముద్రం, సిగనిండా పూలు సింగారించుకున్నట్లున్న పూల చెట్టు, వన్నెచిన్నెల రామచిలక, నడకల కులుకుల నెమలి.. ఇలా నేల నాలుగు చెరగులా అందాలకు చిరునామాలెన్నో. మనిషి సౌందర్య పిపాసి. ఎవరైనా కనపడగానే అప్రయత్నంగా ముందుగా వారి రూపాన్నే స్టడీ చేస్తాడు. తెలుపా, నలుపా, విశాలనేత్రాలా, సోగకళ్లా, గుంటకళ్ళా, మిడిగుడ్లా, కోటేరులాంటి ముక్కా, కోడిగుడ్డులాంటి ముక్కా, లావా, సన్నమా, పొట్టా, పొడుగా, మీడియమా, నెత్తిమీద జుట్టు వత్తుగా ఉందా, పలచగా ఉందా, నల్లగానే ఉందా, నెరిసిందా వగైరా వగైరా వివరాలన్నీ క్షణాల్లో గ్రహిస్తాడు. ఈరోజు ఏమిటో ‘అందం’ ఆలోచనై కూర్చుంది అనుకుంటుంటే..

నిన్నలేని అందమేదో నిదురలేచె నెందుకో
నాలో నిదురలేచె నెందుకో
తెలియరాని రాగమేదో తీగెసాగెనెందుకో..
పూచిన ప్రతి తరువొక వధువు
పువుపువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్లీ శోభలన్నీ ఎచటదాగెనో.. ఓ..
తెలినురుగులె నవ్వులు కాగా
సెలయేరులు కులుకుతు రాగా..
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే.. ఏ
నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో..

‘పూజాఫలం’ సినిమాకి సినారె రాసిన మధురగీతమిది. మూడ్‌ను బట్టే ఏ అందమైనా రంజింపజేసేది..

ఇలా కూర్చుంటే కుదరదనుకుంటూ లేచి పనిలో మునిగి పోయాను. అయినా ఓ వైపు మనసులో అందం ట్రాక్ నడుస్తూనే ఉంది.

అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే లాలిలో
నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే…
లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో
వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో
మిలామిలా హిమాలే జలాజలా ముత్యాలుగా
థళాథళా గళాన తటిల్లతా హారాలుగా
చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే
ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే
ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో..
అందాలలో అహె మహోదయం..

వేటూరి పాటలో పదాలు అలవోకగా గుబాళిస్తాయి.

వంటచేయాలని కూరలు ముందేసుకుని వాటికేసి చూపు సారించా. తాజాగా, ఎర్రగా టొమేటోలు ఇట్టే ఆకర్షించాయి. పసుపువన్నె గుండ్రని దోసకాయ నేనూ ఉన్నానంది. నవనవలాడే నిడుపాటి వంకాయలు మా తర్వాతే ఎవరైనా అన్నట్లున్నాయి… కూరల్లో సైతం అందం ఆకట్టుకుంటోంది. తాగే టీకప్పు నుంచి తలకింద పెట్టుకునే తలగడ వరకు అందంగా ఉండాలనే తాపత్రయపడతాం. పక్కింట్లోంచి లక్ష్మీ శత నామావళి వినిపిస్తోంది…

ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మ సుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మ ముఖ్యై నమః..

అవును.. ఈ స్తోత్రాలన్నిటా దైవరూప విశిష్టతను స్తుతించడమే ఉంటుంది. అన్నట్లు లలితా త్రిపురసుందరిని స్తుతిస్తూ పుష్పదంతుడు, ఆదిశంకరాచార్యులు రచించిన ‘సౌందర్య లహరి’ ఉండనే ఉంది. ఓ ప్రేమికుడు తన భావుకతతో ప్రకృతినే తన ప్రేమికగా రూపుదాల్చమనే వచన కవితను అందించారు సినారె. అది..

కలువపూవుల చెంత చేరి కైమోడ్పు సేతును
నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని
మబ్బులతో ఒక్కమారు మనవి చేసికొందును
నా అంగన ఫాలాంగణమున ముంగురులై కదలాలని
చుక్కలతో ఒక్కసారి సూచింతును
నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలని
పూర్ణ సుధాకర బింబమ్మునకు వినతి సేతును
నా పొలతికి ముఖబింబమై కళలు దిద్దుకోవాలని
ప్రకృతిముందు చేతులెత్తి ప్రార్థింతును కడసారిగా
నా రమణికి బదులుగా ఆకారము ధరియించాలని..

బాలు స్వరంలో అచ్చమైన ప్రేమికుడు వినిపిస్తాడు. అందాన్ని మరింత ఇనుమడింపజేయడానికి రకరకాల అలంకారాలు ప్రాచీనకాలంనుంచే వాడుకలో ఉన్నాయి. రకరకాల నగలు, దుస్తులు, కేశాలంకరణలు..

అలంకరణ అంటే కళాపూర్ణోదయంలోని సుగాత్రీ శాలీనుల కథ గుర్తుకొస్తుంది.

సుగాత్రి కాశ్మీరానికి ప్రధానమైన శారదాపీఠంలోని శారదాదేవిని పూజించే పూజారి కుమార్తె. ఆమె భర్త శాలీనుడు. ఇల్లరికపుటల్లుడనే అనుకోవాలి. తొలిరాత్రి సుగాత్రిని అందంగా అలంకరించి శాలీనుడి వద్దకు పంపారు. కానీ చిత్రం.. అతనామెను పట్టించుకోనేలేదు. ఆమె నిరాశగా వెనుతిరుగుతుంది. మూడు రోజులూ అదే పునరావృతమవుతుంది. ఆ తర్వాత రోజు చెలికత్తెలు ఆమెనే చొరవచేయమని సలహా ఇస్తారు. దాంతో సుగాత్రి సిగ్గును అధిగమించి, శాలీనుడికి తాంబూలమందిస్తుంది. అయినా శాలీనుడు చలిస్తేనా.. సుగాత్రి యిక అతడి యిష్టం ఎలాగో అలాగే కానీ అనుకుంది. తల్లిని కూడా శాలీనుడిని ఏమీ అనవద్దని వారించింది. తల్లి కొంతకాలం చూసి, అతణ్ని దండగ మనిషి అనుకొని, కనీసం పూలతోట పెంపకం చూడమంది. అప్పటికీ శాలీనుడు అమ్మవారి పూజకోసం పెంచే పూలతోటలో పనిచేస్తే తప్పేమిటనుకున్నాడు. ఎంతో శ్రద్ధగా తోటపని చేయసాగాడు. సుగాత్రి అంతా చూస్తోంది. తానూ అతడికి సాయపడాలనుకుంది. కానీ సిగ్గు అడ్డం వచ్చింది. ఓరోజు భారీ వర్షం కురవసాగింది. తోటలో ఉన్న శాలీనుడికి ఏం కాకూడదని ప్రార్థించింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తోటకు బయల్దేరింది. దైవానుగ్రహం వల్ల ఆమె ఏమాత్రం తడవలేదు. వాగులు కూడా పక్కకు తప్పుకున్నాయి. తోటకెళ్లి చాటుగా నిలిచి చూస్తే శాలీనుడు తడవకుండానే ఉన్నాడు. తోట చెక్కు చెదరలేదు. ఆ తర్వాత ఆమెకు భర్తకు ఎలాగైనా సాయపడాలని కోరిక కలిగింది. ఓరోజు తోటకెళ్లి నగలన్నీ తీసేసి, మూటకట్టి పక్కన పెట్టి చెట్ల పాదులు తవ్వి, మళ్లకి నీళ్లు పెట్టి తోటపనులు చేసింది. ఆమెకేసి చూసిన అతడిలో కదలిక వచ్చింది. ‘నువ్వెక్కడ, ఈ పనులెక్కడ?” అంటూ ఆమె మోమున చేరిన స్వేదాన్ని ఉత్తరీయంతో తుడుస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. తోటలోని పొదరిల్లే పడకటిల్లయింది. మళ్లీ ఇంట్లో నగలతో కనిపించినపుడు మాత్రం శాలీనుడు విముఖతనే ప్రదర్శించాడు. ఏ నగలూ లేకుండా శ్రామికగా ఉంటేనే అతడి కిష్టంఅని, సొమ్ములు కాదు సొంపులే అతడిని ఆకట్టుకునేవి అని సుగాత్రికి అర్థమైంది. అతడి ఇష్టమే తన ఇష్టంగా మార్చుకొంది. ఇంకేముంది.. ఇద్దరిదీ ఆనందలోకం.

అంతలో నా మదిలో మెదిలిందో పాట…

అందంగా లేనా.. అసలేం బాలేనా
అంత లెవలేంటోయ్ నీకు…
అందంగా లేనా అసలేం బాలేనా
ఈడు జోడూ కాదనా..

వేటూరి పాటను కె.ఎమ్.రాధాకృష్ణన్ ఎంత అందంగా స్వరపరిచారో. సునీత అంతే అందంగా పాడింది.

ఎంతకూ మనసు విప్పని అబ్బాయిని, అమ్మాయి అలా పాటతో నిలదీసింది.

అందం ఇప్పుడు పెద్ద పరిశ్రమ. సౌందర్యసాధనాలు లేని ఇల్లంటూ ఉండదు. రకరకాల సౌందర్య సాధనాలు. పౌడర్లు, ఫౌండేషన్లు, క్రీములు, లోషన్లు, లిప్‌స్టిక్‌లు, నెయిల్ పాలిష్‌లు.. వగైరా వగైరాలు.

ఇవిగాక బ్యూటీపార్లర్లు వీధికి ఒకటైనా ఉంటున్నాయి. ఫేషియల్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, హెయిర్ కేర్, ఎన్నెన్నో సేవలు అందుబాటులోకొచ్చాయి. మహిళలకే కాదు, పురుషులకోసం మెన్స్ పార్లర్స్ కూడా వెలిశాయి. బ్యూటిషియన్ కోర్సుకు డిమాండ్ బాగా పెరిగింది. ఉపాధిగా ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఇక ఫంక్షన్లు, పెళ్లిళ్ల సందర్భాల్లో అయితే బ్యూటీషియన్లకు ప్రత్యేకం డబ్బు కేటాయించుకోవలసిందే. ఎన్ని సౌందర్య సాధనాలున్నా చిరునవ్వును మించిన అలంకారం మరొకటి లేదన్నది ఎంతైనా వాస్తవం. చిరునవ్వు ముఖానికి అదనపు అందాన్నిస్తుంది. పైగా ఖర్చులేని చిరునవ్వు…

ఇదంతా ఒక ఎత్తయితే మిస్ హైదరాబాద్, మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొని, విజేతలవటమే లక్ష్యంగా పెట్టుకొని, కొందరు సౌందర్యసాధనకే అంకితమవుతున్నారు. మొదట్లో ఈ పోటీలు కేవలం ఇంత పొడుగు, ఇంత వెడల్పు వంటి లెక్కలు, నడకలు ఆధారంగానే నడిచినా ఇప్పుడు వాటిలో కూడా కొంత మార్పు వచ్చింది. వారి పర్సనాలిటీకి సంబంధించి అడిగే ప్రశ్నలకు జవాబివ్వవలసి ఉంటుది. వివేకంతో, విచక్షణతో కూడిన జవాబులిస్తేనే విజేతలు కాగలుగుతారు. అది కొంత మెరుగైన అంశమే. అలా అంతర్జాతీయంగా కూడా అందం ప్రాచుర్యం పొందింది. అందంగా ఉండాలనే తాపత్రయంలో కొంతమంది జీరో సైజ్‌కు మారాలని ప్రాణాల మీదికి తెచ్చుకోవటం మాత్రం ఆందోళన కలిగించే అంశమే.

అయినా అందం అందరినీ మురిపించేదే. కొందరు అబ్బాయిలు అందమైన అమ్మాయి గురించి కలలు కంటూ ‘సౌందర్య లహరీ స్వప్న సుందరీ.. నువ్వే నా ఊపిరి’ అని పాడుకోవటం పరిపాటే. ఒకవేళ సరిజోడు కుదిరి యస్సంటే.. ‘అందం హిందోళం.. అధరం తాంబూలం’ అంటూ తక్షణం పాటందుకోవడం లవ్ లక్షణమే. లేదంటే ‘అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే..’ అంటూ అదరగొట్టేయొచ్చు. ‘ధర్మాత్మ’ సినిమాలోని హిట్ సాంగ్ గుర్తుకొస్తోంది.

క్యా ఖూబ్ లగ్‌తీహో
బడి సుందర్ దిఖ్‌తీ హో…
ఫిర్ సె కహో
కహ్‌తే రహో
అచ్ఛా లగ్‌తా హై
జీవన్ కా హర్ సప్‌నా
అబ్ సచ్ఛా లగ్‌తా హై..

మరో పాట.. మహమ్మద్ రఫీ పాట ‘తెరి ప్యారీ ప్యారీ సూరత్‌కో కిసీకి నజర్ న లగే చష్మే బదూర్..’  గుర్తుకొచ్చింది.

జాన్ కీట్స్ గారయితే

ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫరెవర్
ఇట్స్ లన్లీనెస్ ఇంక్రీజెస్, ఇట్ విల్ నెవర్
పాస్ ఇటు నథింగ్‌నెస్, బట్ స్టిల్ విల్ కీప్
ఎ బోవర్ క్వైట్ ఫర్ అజ్ అండ్ ఎ స్లీప్
ఫుల్ ఆఫ్ స్వీట్ డ్రీమ్స్, అండ్ హెల్త్ అండ్ క్వైట్ బ్రీతింగ్.. అంటాడు.

మన సీనియర్ సముద్రాలగారు కూడా ‘బ్రతుకు తెరువు’ చిత్రానికి ‘అందమె ఆనందం.. ఆనందమే జీవిత మకరందం…‘ అందమైన పాటను అందించారు.

అన్నట్లు అందంగా ఉండేది ఆడా?, మగా? అన్న వివాదాలూ సరదాగా జరగడం పరిపాటే. గతంలో ఓసారి ఈ విషయమై ఆఫీసులో చర్చ జరిగింది. చివరకు పక్షులు, జంతువుల్లో అందం మగవారి సొత్తు, మనుషుల్లో ఆడవారి సొత్తు అని తీర్మానించారు. ఎందుకంటే కోళ్లలో పుంజుకే నెత్తిమీద ఎర్రటి కిరీటం ఉంటుంది. అలా నెమళ్లలో పురివిప్పి నృత్యం చేసేవి మగనెమళ్లే. సింహాలలో మగసింహానికే జూలు ఉంటుంది. ఇలా అనేక ఉదాహరణలిచ్చారు.

అది అటుంచి మన విషయానికి వస్తే అన్నిసార్లు మనిషి అందానికే పట్టం కడుతున్నాడా అంటే కానే కాదు, కారణం అందం కేవలం శరీరానికి సంబంధించింది కాకపోవడమే. అందంగా ఉండే వాళ్లు ప్రవర్తనలో అసహ్యంగా ఉంటే ఆ అందం అందగించదు. చూసే చూపును బట్టి అందం గోచరిస్తుందన్నది ఒక భావన. అందుకే ‘తావలచింది రంభ’ అనే నానుడి వచ్చింది. కొంతమంది చూడగానే అందంగా అనిపించరు. కానీ వారితో సాన్నిహిత్యం పెరిగిన కొద్దీ వారి మాటల్లోని మనసులోని, ప్రవర్తనలోని అందం ఆకట్టుకుని వారి రూపం కూడా బాగున్నట్టే తోస్తుంది. కలువల్లాంటి కన్నులు, సంపెంగ లాంటి ముక్కు, దొండపండులాంటి పెదవులు అంటూ కావ్యాల్లోని వర్ణనతో పోల్చుకుంటే కష్టమే. అసలు అలా ఉంటే ఎలా ఉంటుందో ఓ కార్టూనిస్ట్ బొమ్మ వేసి నవ్వించారు కూడా.

సిరివెన్నెలగారు ‘గోవిందా గోవిందా’ సినిమాకి అందమా అందుమా అందనంటే అందమా?‘ అని ఓ చక్కని పాటనందించారు. అవునూ.. ‘సొగసు చూడ తరమా..’ పాట ఉంది కదా. చాలామంది అది సినిమా పాటే అనుకుంటారు కానీ త్యాగరాజు, రాముణ్ణి ఉద్దేశించి రచించిన కృతి పల్లవినే వాడారు. కానడ గౌళ రాగంలో త్యాగయ్య తాదాత్మ్యంతో ఆలపించిన ఆ కీర్తన యిలా..

సొగసు జూడ తరమా… నీ సొగసు జూడ తరమా..
నిగనిగమనుచు.. కపోల యుగముచే మెరయు మోము
చిరునవ్వో, ముంగురులో, మరి కన్నులతేటో
వరత్యాగరాజార్చిత వందనీయ
ఇటువంటి.. సొగసుజూడ తరమా…

ఇక పోతనగారయితే కృష్ణుణ్ని..

నల్లనివాడు పద్మనయనంబుల వాడు గృపారసంబు పై
జల్లెడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు.. అని వర్ణిస్తారు.

‘అందంగా పుట్టటం అనేది మన చేతుల్లో లేకపోయినా, అందమైన మనసు కలిగి ఉండటం… హృదయ సౌందర్యం కలిగి ఉండటం మన చేతుల్లోనే ఉంది. ఒకింత మానవతా పరిమళం అద్దుకుని, నొప్పింపక, తానొవ్వక రీతిలో, మంచితనాన్ని పెంచుకుంటూ, పంచుకుంటూ ఉండటంలోనే అసలైన అందం దాగుంది’ అనుకుంటుంటే ఒక్కసారిగా ప్రస్తుతంలోకి వచ్చా. వంట పూర్తయింది. ఇవాళ ఆఫీసుకు వెళ్లటం లేదు కానీ ఇంటికి గెస్ట్‌లొస్తున్నారు. అందువల్ల ‘ఇంటిని కాసింత అందంగా సర్దేయాలి’ అనుకుంటుంటే, అందం గురించిన ఆలోచనలు వెళ్లొస్తామన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here