Site icon Sanchika

మానస సంచరరే-36: పరిమళ ప్రకృతి

[box type=’note’ fontsize=’16’] “మనిషికి ఉండాల్సింది మానవత్వమనే పరిమళం. ఎన్ని పరిమళద్రవ్యాలు శరీరానికి పూసుకున్నా, మనసు మంచి మానవత్వ పరిమళాలను కలిగి ఉండకపోతే ఆ మనిషి అమానుషుడే అవుతాడు” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]చ[/dropcap]ల్లని సాయం సమయం. పెరట్లో తీరిగ్గా తిరిగి ఎన్నిరోజు లయిందో అనుకుంటూ అటు నడిచా. ప్రకృతికి చక్కదనాలనద్దే చైత్రం వచ్చేసిందేమో మల్లెచెట్టు విరబూసి విష్ చేసింది. దగ్గరగా వెళ్లాను. పరిమళం పలకరించింది.

వెన్నెలలో మల్లియలు.. మల్లెలలో ఘుమఘుమలు..
ఘుమఘుమలో గుసగుసలు.. ఏవేవో కోరికలు..

మనుషులు-మమతలు సినిమాకి దాశరథి రాసిన మధురగీతం గురుతుకొచ్చింది.

చూపు ముందుకు సారిస్తే సోయగాల సన్నజాజి నేనేం తక్కువా అన్నట్లు సొగసుగా నవ్వింది.

ఇటుగా కుండీల్లో గులాబీలు గుబాళింపుతో తమ ఉనికిని తెలిపాయి. అటుగా నడిచి పూతసింగారంతో అక్కడక్కడా పిందెలతో అందమంటే మాదేలే అని అతిశయంచూపుతున్న మామిడి చెట్టును మనసారా చూసి చిగురందుకున్నాను. మావి వాసన.. ఇంతలో మొబైల్ మోతతో ఇంట్లోకి నడిచాను. తీరా చూస్తే అది రాంగ్ నంబర్. టేబుల్ మీద మొన్నటి జామకాయ బాగా పండిందల్లే ఉంది. మిగలమగ్గిన వాసన వచ్చింది. ఓ కప్పు టీ తాగితే బాగుంటుందనిపించి వంటింట్లోకి నడిచాను. ఇలాయిచీ వేస్తే ఆ టేస్టే వేరనుకుంటూ ఏలకుల కోసం స్పైసెస్ డబ్బా తెరిచాను. ఇంకేముంది.. ఏలకులు, లవంగాలు, మిరియాలు, జాజికాయ, జాపత్రి వగైరాలన్నీ మేమూ సుగంధవంశం వాళ్లమే అని గుర్తు చేశాయి. ఏలకులతో టీ చేసుకుని హాల్లోకి నడిచి సోఫాలో బైఠాయించాను. సుగంధ ద్రవ్యాలతోనే కదా రుచికరమైన వంటకాల తయారీ అనుకుంటుంటే మనుషులకూ సుగంధమున్నట్లు చదివిన సాహిత్యం గుర్తు కొచ్చింది. శంతనుడు పెళ్లాడిన సత్యవతి మత్స్యగంధి. ఆమెకే యోజనగంధి, గంధవతి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆమె తనువుకున్న సువాసన యోజనాల దూరం వరకు వ్యాపించేది కాబట్టి ఆమె యోజనగంధి అయింది. మనుచరిత్రలో వరూధినిది పాటల పుష్పాల సుగంధం. అందుకే ఆమె పాటలగంధి అయింది. ఈ ఇతివృత్తాల ఎరుకతోనే ఓ సినీ కవి

తనువా.. ఉహూ… హరిచందనమే
పలుకా .. ఉహు.. అది మకరందమే
కుసుమాలు తాకగనే నలిగేను కాదా ఈ మేను.. గీతం అందించారేమో.

పరిమళం అనురక్తికే కాదు, భగవంతుడికి, భక్తుడికి కూడా అనుసంధానమై నదే. అందుకే త్యాగరాజస్వామి

గంధము పుయ్యరుగా.. పన్నీరు గంధము పుయ్యరుగా
అందమైన యదునందనుపై కుందరదనలిరవొందర పరిమళ..
గంధము పుయ్యరుగా…
తిలకము దిద్దరుగా
కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమని ముఖకళకని సొక్కుచు
పలుకుల నమృతము లొలి నడు స్వామికి..
గంధము పుయ్యరుగా..

అంటూ కృష్ణయ్యను ఎంత మధురంగా సేవించారో.

గంధము పుయ్యరుగా అని.. మళ్లీ పన్నీరు గంధము పుయ్యరుగా అంటారు. పన్నీరుతో కలిపిన గంధం మరింతగా పరిమళిస్తుంది. గంధపు పూతలతో సరిపెట్టలేదు.

నల్లనయ్య మోమున అందాల తిలకం దిద్దాలనుకున్నారు. అదీ ఎటువంటి తిలకం అంటే.. తిలకము దిద్దరుగా.. కస్తూరి తిలకము దిద్దరుగా అంటారు. త్యాగయ్య భక్తి పరిమళమది.

శ్రీ కృష్ణ కర్ణామృతాన్ని రచించిన లీలాశుకుడు కూడా

కస్తూరి తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం.. అని కృష్ణుణ్ని వర్ణించాడు.

అష్టపదుల దేవుడు జయదేవుడు కూడా పరిమళ ద్రవ్యాల ప్రాధాన్యతను విస్మరించలేదు.

చందన చర్చిత నీలకళేబర
వీతవసన వనమాలీ..

అని శ్రీకృష్ణుణ్ణి వర్ణించాడు. నిత్యం దేవుడికి రకరకాల సువాసనలు గల అగరొత్తులు వెలిగిస్తుంటారు. పూజలో సైతం పుష్పై పూజయామి అంటూ పరిమళ భరిత పుష్పాలు అర్పించడమే కాదు, గంధాం ధారయామి అంటూ చందనాన్ని చిలకరిస్తారు. అగరుబత్తీలు సరేసరి.. అనేకానేక సుగంధాలతో అందుబాటులోకి వచ్చి అలరిస్తూనే ఉన్నాయి.

లక్ష్మీదేవిని పద్మగంధిన్యై నమః అని స్తుతిస్తారు.

తేనీటి సేవనం అయిపోయినా మనసులో పరిమళాల పరిమళం అ దేపనిగా వీస్తోంది.

గంధంచెట్లు ఎంతో విలువైనవి కాబట్టే స్మగ్లింగ్‌కు గురవుతున్నాయి. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ నొటోరియస్ అయిపోయాడుగా. ఒకప్పుడు సెంటు వాడకం పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు సెంట్లు, డియోడరెంట్లు నిత్యవాడకంలోకి వచ్చేసాయి. ఇందులో మళ్లీ పురుషులవి వేరు, మహిళలవి వేరు. గతంలో అత్తరు పదం విస్తృతంగా వినిపించేది. అందులోనూ అత్తరును ముస్లిమ్‌లే అమ్ముతారన్నట్లు అత్తరు సాయిబు అనేవాళ్లు. పెళ్ళిళ్లలో ఈ గంధాలు, సెంట్ల వాడకం బాగా ఉంటుంది. పెళ్లికి వచ్చేవారికి ప్రవేశద్వారం వద్దే సెంటు చల్లి మర్యాదచేసి లోపలికి పంపుతుంటారు. అదీ గాక పెద్ద పెద్ద బ్లోయర్లతో సుగంధాలను చల్లే ఏర్పాట్లు కొన్ని పెళ్లిళ్లలో చేస్తున్నారు. మగ పెళ్లి వారికి జరిపే మర్యాదల్లో ఈ సెంట్లు కూడా ఒకటి.

పెళ్లివారమండీ.. ఆడ పెళ్లివారమండీ..
పెళ్ళివారమండీ.. మగ పెళ్లివారమండీ

అని ‘పెళ్లిరోజు’ సినిమాలో ఓ సరదా పాట ఉంది. ముందు ఈ పాట రేడియోలో లలితగీతంగా వినిపించేది. ఆ తర్వాత సినిమాలో వాడారు. పి.బి.శ్రీనివాస్, జమున పాడారు. బహుశా నటి జమున పాడిన ఏకైక సినీగీతం ఇదేనేమో. అందులో మగ పెళ్లి వాళ్ల డిమాండ్లన్నీ వినిపిస్తూ..

సీమచదువుల మా అబ్బాయికి లక్షల కట్నం ఏదండీ.. ఏదండీ.. అని ప్రశ్నిస్తే
చక్కదనాల చుక్కను మించే వధువే లక్షల విలువండీ…అని ఆడ పెళ్లివారి జవాబు.
ఆ పైన మగ పెళ్లివారి తరఫున
ఘుమఘుమలాడే పన్నీరు.. అత్తరు వాసనలేవండీ…మరో ప్రశ్న
అందుకు ఆడ పెళ్లివారి తరఫున జవాబు..
కమ్మని నవ్వులు కురిపించే అమ్మాయి చూపులె చాలండీ..
చక్కటి పాట.

ఇవన్నీ కాక మరో గంధం కూడా ఉంది. అదే వీరగంధము..

వీరగంధము తెచ్చినారము వీరు డెవ్వడొ తెల్పుడీ .. అని ఓ చక్కని పద్యం ఉంది.

అనురాగ బంధం పరిమళించి మదిని పరవశింపజేస్తే అది కూడా ఓ చక్కటి యుగళ గీతంగా రూపొందిన వైనం కన్యాకుమారి చిత్రంలో ఓ పాటలో వినవచ్చు. అది.. .

ఓహో చెలీ.. ఓ నా చెలీ
ఇది తొలి పాట.. ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట.. ఆ పాట…
ఎదుట నీవు ఎదలో నీవు ఎదిగి ఒదిగి నాతో ఉంటే
మాటలన్ని పాటలై మధువులొలుకు మమతే పాట..
పరిమళించు ఆ బంధాలే పరవశించి పాడనా..పాడనా..

అసలు ఈ సుగంధాలన్నిటినీ గ్రహించేది నాసిక… ముక్కు. అటువంటి ముక్కును వర్ణిస్తూ నంది తిమ్మన ‘పారిజాతాపహరణం’ లోఓ గొప్ప పద్యం రాశాడు. అది…

నానాసూన వితాన వాసనల నానందించు సారంగమే
లా నన్నొల్ల దటంచు గంధఫలి బల్కాకం తపంబంది యో
షా నాసాకృతి బూని సర్వ సుమన స్సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణమాలికా మధుకరీ పుంజంబు నిర్వంకలన్

అని ఈ పద్యంతో నంది తిమ్మన, ముక్కు తిమ్మన అయ్యాడు. ముక్కు తిమ్మన ముద్దుపలుకు అని ప్రశంసలందుకున్నాడు.

అన్నట్లు వాసనలనేక రకాలు. కూరలు వేటికవి ప్రత్యేక వాసనలు కలిగి ఉంటాయి. చేదుకాయలు సైతం చేదు వాసన వెదజల్లుతుంటాయి. చేదు దోస, చేదు బీర వాసన వేరుగా ఉంటుంది. వేప వాసన తెలిసిందే కదా. ఇవే కాదు పాలుపొంగితే వచ్చే వాసన పరిచయం కాని వారుండరేమో. అన్నం ఉడుకుతున్నా మంచి వాసన వస్తుంది. ఇక ఇంగువ దట్టించి లేదా వెల్లుల్లి వేసి పోపు వేస్తే వచ్చే వాసన పక్కింటిని, వెనకింటిని కూడా అదరగొట్టేస్తుంది. ఉల్లిపాయలు వేసి మరిగించే పులుసు వాసన, ధనియాల, మిరియాల చారు వాసన, ఆవ పెట్టి వండే వంటకాల ఘాటు అబ్బబ్బ వెంటాడుతూనే ఉంటాయి. స్వీట్లు, హాట్లు.. వంటల ఘుమఘుమలు నిద్రపోతున్న ఆకలిని ఇట్టే లేపేస్తాయి. ఆవకాయ, మాగాయ, దోస ఆవకాయ వంటి ఊరగాయల వాసన తినేదాకా ఊరిస్తూనే ఉంటుంది. రుచికరమైన భోజనం గురించి ఓ పాటుంది.

భోజనం.. వనభోజనం..

ఇదంతా శాకాహారం. మాంసాహార ఘుమఘుమలు మాంసాహారులను అలరిస్తాయి. కాఫీ ప్రియులకయితే కాఫీ గింజల్ని వేయించి, గ్రాండ్ చేసిన పొడితో కాఫీ తయారు చేస్తుంటే వచ్చే వాసన ఆహా! అనిపిస్తుంది.

ఔషధాల వాసనలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని భరించటం కొంచెం కష్టమే. అయితే పిల్లల మందులకు తీపి వాసనలు చేరివారు మారాం చేయకుండా తాగే వీలు కల్పిస్తున్నారు. తాంబూలంలో సైతం పచ్చకర్పూరం వంటివి వేయడం తెలిసిందే. అలాంటి విశిష్టమైన తాంబూలాల సేవనం పద్యం రాయడానికి మూడ్ నిచ్చే వాటిల్లో ఒకటని అల్లసాని పెద్దనగారు..

“నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజన ముయ్యెలమంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞు  లూహ తెలియంగల లేఖకపాఠకోత్తముల్
దొరికినగాని యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే?”

అంటూ కవికి కావలసిన వాటి జాబితా చెప్పారు.

ధూమపానప్రియులకు సిగరెట్లు, బీడీలు, చుట్టల వాసనలే చుట్టాలు. సరే గంజాయిలు, హుక్కాల వాసనల కలవాటు పడ్డ దొంగ సాధువులు, ఇతరుల సంగతి సరేసరి.

మందుబాబులకయితే బీరు, విస్కీ, రమ్, ఓడ్కాల వాసనలే ఇంపుగా ఉంటాయి.

పెయింట్ల వాసన కొంతమందికి ఇష్టంగా ఉంటుంది. మరికొందరికి కష్టంగా ఉంటుంది. ఆసుపత్రుల వాసన ఇబ్బందికరంగా ఉంటుంది. ఫినాయిళ్లు, అనస్తీషియాలు, ఇంజెక్షన్ మందులు వగైరాల వాసన తప్పనిసరయితే భరించక ఏంచేస్తాం. ఇవన్నీ అలా ఉంచి ఇటీవల ఓ కథలో చదివాను..

చావు వాసన అని… వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గర చావు వాసన వస్తున్నట్లుగా ఫీలవుతాడు పుత్రరత్నం. సాధారణంగా ఇళ్లల్లో ఒక్కోసారి ఎలుక చచ్చిన కంపు వస్తోందనుకోవటం పరిపాటి.

సరే రోడ్లమీద నడుస్తుంటే చెత్త వాసన, రబ్బర్లు, ప్లాస్టిక్స్ కాలిన వాసన, కొన్నిసార్లు క్రిమిసంహారకాల వాసన, ఫ్యాక్టరీలలో నుంచి వెలువడే వ్యర్థరసాయనాల వాసన, డ్రెయినేజీ వాసన… ఇలా ఎన్నెన్నో దుర్గంధాలు ముక్కుమూసుకునేలా చేస్తాయి. ఈ దుర్గంధాలన్నిటికీ కారణం మళ్లీ మనిషే. ఇవన్నీ స్వయంకృతాలే. చెత్తను రోడ్లమీద, ఎక్కడంటే అక్కడ నిర్లక్ష్యంగా పడేయటం, చెత్తను కాలిస్తే సరిపోతుందని రబ్బర్లు, ప్లాస్టిక్కులను కూడా కాల్చేయడం, దాంతో వాయుకాలుష్యం ఏర్పడటం తెలిసిందే. అన్నిటికన్నా ముఖ్యమైంది, మనిషికి ఉండాల్సింది మానవత్వమనే పరిమళం. ఎన్ని పరిమళద్రవ్యాలు శరీరానికి పూసుకున్నా, మనసు మంచి మానవత్వ పరిమళాలను కలిగి ఉండకపోతే ఆ మనిషి అమానుషుడే అవుతాడు.

మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం..
స్వాగతం.. సుస్వాగతం..

మంచి పాట మననం చేసుకున్నాను. లేచి వంట ప్రయత్నం చేస్తున్నా మదిలో వాసనల మాటలు జరుగుతూనే ఉన్నాయి. అబ్బో! వాసనలమీద ఎన్ని సామెతలు, లోకోక్తులు ఎన్నో..

పువ్వు పుట్టగానే పరిమళించినట్లు, పూవుకు తావి అబ్బినట్లు, ఇంగువ కట్టిన గుడ్డ..

నీవులేని నేను లేనే లేనులే …అదీ నిజములే
విలేని పూవు విలువ లేనిదే..అదీ నిజములే..

పూవుకు తావి అబ్బితే గొప్పే. అలా అని తావిలేని పూలను తీసి పారేయడం తగదు. గడ్డిపూవు సౌందర్యం గడ్డిపూవుదే… వంట, భోజన కార్యక్రమం అయిపోతున్నాయి. వాసనలు ఆలోచనలో వీస్తూనే ఉన్నాయి. రాత్రయింది. కిటికీలోంచి నైట్ క్వీన్ లోపలికి పరిమళాలను పంపుతుండగా అలసిన నేను ఆలోచనలకు గుడ్ నైట్ చెప్పుకుంటుండగా నిద్రాదేవి రమ్మని నన్ను లాక్కెళ్లింది. అంతే.. ఆలోచనెటో..నేనెటో..

Exit mobile version