మానస సంచరరే-37: విద్య విశిష్ట దైవతము!

6
2

[box type=’note’ fontsize=’16’] “విద్య ప్రాముఖ్యతని చెబుతూ, ప్రపంచ పాఠశాలలో మనుషుల్ని చదవటంలో ప్రతివ్యక్తి జీవితాంతం నిత్య విద్యార్థే” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]మా[/dropcap]ఘమాసాన ఓ ఉదయం. మా చుట్టాలమ్మాయి విద్య పెళ్లికి బయల్దేరాను. మ్యారేజీ హాల్ రానే వచ్చింది. అంతా కోలాహలం. అందరిలో ఉత్సాహం.. ముఖాల్లో వెలుగు.. చిరునవ్వులు.. పలకరింపులు.. స్టేజీమీద ఉన్న విద్య వైపు చెయ్యూపి, నవ్వులు రువ్వి, ముస్తాబు అదిరిందని సైగలతోనే చెప్పి అటుగా చూశాను. మా కజిన్స్ గ్రూప్ కనిపించింది.. గబగబా వెళ్లి బైఠాయించాను. యోగ క్షేమాల మాటలయ్యాయి. ‘సునీత రాలేదే?’ మీనాక్షి అత్తయ్య ప్రశ్న సంధించింది. ‘ఇంటర్ పరీక్షలట కదా. వాళ్లబ్బాయి పరీక్షలని రాలేదు’ బదులిచ్చింది భార్గవి. ‘నీ పిల్లలేగా, జెరాక్స్ కాపీలల్లే ఉన్నారు. ఏం చదువుతున్నారేంటి’ మీనాక్షి అత్తయ్య మధుమితను అడిగింది. మధుమిత నవ్వేసి ‘మా పిల్లలే. పాప ఎయిత్, బాబు ఫిఫ్ట్ చదువుతున్నారు’ చెప్పింది. ‘మా మనవరాళ్లు సెవెన్, ఫోర్త్ చదువుతున్నారు. ఏం చదువులో, ఎప్పుడు చూడు ప్రాజెక్టు వర్క్‌లే. తల్లిదండ్రులకు పనిష్మెంట్. రోజూ ఆ వర్క్ షీట్, ఈ వర్క్ షీట్, కలర్స్, చమ్కీలు, పూసలు, కుండలు, బుట్టలు… కార్డ్ బోర్డులు… రకరకాల సరంజామాలు కొనాల్సిందే. యూ ట్యూబ్‌ను శోధించి, సాధించి ఆ ప్రాజెక్ట్ వర్క్‌లు పూర్తిచేస్తుంటారు. టీచర్లు చెప్పేది తక్కువ. హెూమ్ వర్క్ లెక్కువ’ గోడు వెళ్లబోసుకుంది. ఇంతలో హాసిని వచ్చింది. ‘ఏమ్మా కులాసానా? ఎన్నో నెల?’ ఆదిలక్ష్మి అత్తయ్య అడిగింది. ‘కులాసానే ఆంటీ. ఆరోనెల’ చెప్పింది.

‘పుట్టేవాళ్లని ఏ స్కూల్లో చేర్చాలో ఇప్పట్నుంచే ఆలోచించుకోండి’ చెప్పింది ఆదిలక్షి అత్తయ్య.

‘అవునాంటీ. అదే చూస్తున్నాం’ కాస్తంత దిగులుగా అంది హాసిని. చదువు మాటలు వింటుంటే నా మదిలో ఓ మంచి పాట మెదిలింది. అది..

“బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు!
పలు సీమలకు పోయి, తెలివిగల పాపాయి
కళలన్ని చూపించి ఘనకీర్తి పొందాలి..
మా పాప పలికితే మధువులే కురియాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి
ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప?
ఎవరీ పాపాయి అని ఎల్లరడగాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు..
తెనుగు దేశము నాది, తెనుగు పాపను నేను
అని పాప జగమంత చాటి వెలయించాలి
మా నోములవుడు మాబాగా ఫలియించాలి..

మంచాల జగన్నాధరావుగారు రాసిన మామంచి పాట.

బాలసరస్వతీదేవి మాబాగా పాడిన పాట.

తన బిడ్డ భవిష్యత్తులో చదువుకుని ఖండాంతర ఖ్యాతినార్జించాలనే ఓ అమ్మ ఆకాంక్షకు ఎంత చక్కని పాట రూపాన్నిచ్చారో.. మధ్య ఎవరో వాట్సాప్ గ్రూప్‌లో పెడితే విన్ననాకు ఒక్కసారిగా నాటి రేడియో రోజులు గుర్తుకొచ్చాయి. నాకిష్టమైన లలిత గీతాల్లో ఇదొకటిగా ఉండేది అనుకొంటుంటే మొబైల్ మోగింది. శర్వాణి మా ఆఫీస్ కొలీగ్ ఫోన్ చేసింది. ‘వచ్చే ఆదివారం మా పాపకు బాసరలో అక్షరాభ్యాసం చేస్తున్నాం. మీరూ వస్తారా’ అడిగింది. ‘లేదు వాణీ. ఆరోజు ఆల్రెడీ ఓ ప్రోగ్రామ్‌కు రిజర్వ్ అయిపోయింది. పాపకు చదువుల తల్లి సమక్షంలో అక్షరాభ్యాసం చేస్తున్నారన్నమాట. పాపకు నా ఆశీస్సులు’ అన్నాను. ‘థ్యాంక్యూ మేడమ్. ఉంటాను’ అంది. ‘ఓ.కే. బై వాణీ’ అంటూ ఫోన్ పెట్టేశాను.

అక్షరాభ్యాసం అనగానే నా అక్షరాభ్యాసం గుర్తొచ్చింది. నాన్నే విజయదశమిరోజున పూజచేసి, నాచేత పలకమీద ‘ఓం నమశ్శివాయః‘ అక్షరాలు దిద్దించారు. ఆ తర్వాత

సరస్వతీ నమస్తుభ్యం
వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి
సిద్ధిర్భవతుమే సదా..

శ్లోకం నేర్పించారు.

ఇప్పుడు నేను రాసే అక్షరాలన్నీ నాన్న భిక్షే. పిల్లల్ని బల్లో చేర్చడమనేది ఇప్పుడు ఓ కీలక ఘట్టం. ఒకప్పుడంటే ఏ వీధిబడికో, ప్రభుత్వ పాఠశాలకో పంపేవారు కాబట్టి అది మామూలుగా జరిగిపోయేది. ఇప్పుడు బిడ్డ పుట్టబోతోందని తెలియగానే స్కూల్లో సీటును రిజర్వు చేసే రోజులు. డొనేషన్ల భారం మోయలేక సతమతమయ్యే తల్లిదండ్రులు.. తొలిరోజు పిల్లల్ని బడికి పంపే సీన్లు చూసి తీరాల్సిందే. కొందరు పిల్లలు బెదిరిపోయి…. బడివద్దు, ఇంటికే పోదాం అని రాగాలాపనలు మొదలు పెడితే కొందరు పిల్లలు చక్కగా అమ్మానాన్నకు ‘బై’ చెప్పిలోపలికి వెళ్లిపోతారు.

ఎన్ని తిప్పలు పడ్డా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలనే తాపత్రయం. చదువు ప్రాముఖ్యత అలాంటిది.

“విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పురుషాళికిన్
విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగనివాడు మర్త్యుడే?” అన్నాడు భర్తృహరి.

పోతన సైతం…

“చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ!” అన్నాడు.

వేమన కూడా

“చదువు జదవుకున్న
సౌఖ్యంబులును లేవు
చదువుజదివెనేని సరసుడగును
చదువు మర్మమెరిగి చదువంగ చూడుము
విశ్వదాభిరామ వినురవేమ..”

వేమనే కాదు, మన సినీకవులు కూడా చదువు ప్రస్తావన విరివిగానే చేశారు. ‘ఖైదీ కన్నయ్య’ చిత్రంలోని “తీయ తీయని మాటల తేనెలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు… “పాటలో

“తెలియని చీకటి తొలగించి
వెలుగిచ్చేది చదువే సుమా మానవద్దు
దొంగల చేతికి దొరకనిది
దానము చేసిన తరగనిది
పదురుగురిలోన పరువును పెంచి
పేరుతెచ్చే పెన్నిధది..” అని వివరిస్తే

“పాఠాలన్నీ చదివేస్తా… ఫస్టుగ నేను పాసవుతా” అంటాడు ఆ బాలుడు. ఇలాంటి బుద్ధిమంతులైన బాలలు కొందరుంటారు. ఆఁ.. అన్నట్లు ‘బుద్ధిమంతుడు’ చిత్రంలోని పాటలో…

“బడిలో ఏముంది బాబూ గుడిలోనే ఉంది..” అని అన్నగారంటే
“గుడిలో ఏముంది బాబూ బడిలోనే ఉంది
భుక్తి, శక్తి కావాలంటే, మానవ సేవా చెయ్యాలంటే…” అంటాడు తమ్ముడు.

ఇద్దరి మధ్య సంవాదం భలేగా ఉంటుంది.

చదువు ఎంత ముఖ్యమైనదయినా ప్రబలిన నిరుద్యోగం ఫలితంగా కొందరు పేదలు పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నారు. దీనికి సంబంధించే ‘రేపటి పౌరులు’ చిత్రంలో ఓ చక్కటి పాట ఉంది.

“అయ్యా నేను చదివి బాగుపడతా
ఓరయ్యా నేను చదివి బాగుపడతా
పుస్తకాలు చదివి నేను మన బతుకులు మారుస్త
అయ్యా నేను చదివి బాగుపడతా..” అని కొడుకు,
“అమ్మమ్మ నీయమ్మ కొంప నాది తీస్తవెంది
చదువు బూతంపడితే నువ్వు సంకనాకి పోతావు
బి.ఎ., ఎం.ఎ. చదివినోల్లె బికార్లయ్యి తిరుగుతుండ్రు
చదువుగోల నీకొద్దురో, కొడుకా
చావు బతుకు మనకొద్దురా…”

పాటంతా తండ్రీ కొడుకుల వాద, ప్రతివాదం నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది.

ఈ చదువుల వ్యవహారం ఇతిహాసాల్లోనూ ఉంది. మహాభారతంలో ద్రోణుడు కౌరవులకు, పాండవులకు అస్త్రశస్త్ర విద్యలు నేర్పి, వారి యుద్ధవిద్యల ప్రదర్శన ఏర్పాటుచేస్తాడు. పెద్దలందరూ విచ్చేస్తారు. ఆ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం.. పెద్దలందరూ ఆసీనులై ఉండగా విద్యల ప్రదర్శన జరుగుతుంది. కుమారుల వీరోచిత విద్యా ప్రదర్శన చూసి తల్లులు వీరమాతలుగా పులకించిపోతారు. కుమారాస్త్ర విద్యా సందర్శనం ఘట్టం రకరకాల భావోద్వేగాలతో ముందు కథకు అంకురార్పణగా తీర్చిదిద్దారు. ఇక పోతన విరచిత ‘మహాభాగవతం’లోని ప్రహ్లాద చరిత్రలో దైత్యుడయిన హిరణ్యకశిపుడు, కుమారుడి చదువు ఎందాకా వచ్చిందో తెలుసుకుందామని గురుకులాన్ని దర్శిస్తాడు. గురువుల వద్ద ఏం నేర్చుకున్నావని కుమారుణ్ని ప్రశ్నిస్తాడు. అందుకు ప్రహ్లాదుడు..

“చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్యశాస్త్రంబులు నే
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల జదివితి తండ్రీ”
అని బదులిస్తాడు.

చివరి పాదము చదువులలో మర్మమెల్ల జదివితి తండ్రీ‘ అనేది మాత్రం నాటి నుంచి నేటివరకు కూడా తెలుగు నాల్కలమీద నాట్యం చేస్తూనే ఉంది.

విద్యార్థులు అందరూ ప్రతిభావంతులై ఉండకపోవచ్చు. అందుకు చక్కటి నిదర్శనం పరమానందయ్యగారి శిష్యులు. వారి అమాయకత్వం, మూర్ఖత్వం ఎంతగానో నవ్విస్తాయి.

కానీ గురువైన పరమానందయ్య మాత్రం వారిని బాగా అర్థం చేసుకుంటాడు. గురువు అనుగ్రహించకపోయినా విద్యలో విజేతలయ్యే ఏకలవ్యుడిలాంటివారు అరుదుగా ఉంటారు.

చదువుకు వయసుతో నిమిత్తం లేదు. ఏ వయసు వారైనా చదువుకోవచ్చు. అందుకే ప్రభుత్వాలు వయోజనులకోసం రాత్రి బడుల్నినడిపేది. ‘మట్టిలో మాణిక్యం’ చిత్రంలో

“నా మాటే నీ మాటై చదవాలి
నేనంటే నువ్వంటూ రాయాలి
అఆ ఇఈ ఉఊ ఎ ఏ…
మట్టిలో రాసిన రాతలు గాలికి
కొట్టుకుపోతే ఎట్లాగా.. ఎట్లాగా
మనసున రాసి మననం చేస్తే
జీవితమంతా ఉంటాయి.. నిలిచుంటాయి
ఆమాటే నిజమైతే నేర్పమ్మా
మనసంతా రాసేస్తా కోకమ్మా..
పడవ – కడవ
చిలక – పలక..”

జమున బోధనలో చలం చకచకా చదివేస్తాడు.

‘జీలకర్ర.. బెల్లం..!’ మీనాక్షి అత్తయ్య గట్టిగా చెప్పటంతో ఉలిక్కిపడి వేదికవైపు చూశాను. ‘ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టడమే ముఖ్యం..!’ మీనాక్షి అత్తయ్య చెపుతోంది. ‘పెళ్లి కొడుకు చదివాడో..’ ఎవరో అడిగారు. ‘ఎంబిఎ..’ మరెవరో బదులిచ్చారు. ‘ఇదివరకు లాగా అబ్బాయి ఎక్కువ చదివి ఉండాలనుకోవడం లేదు. శాలరీ బాగుంటే చాలనుకుంటున్నారు.’ ఆదిలక్ష్మి అత్తయ్య చెపుతోంది.

నవ్వొచ్చింది నాకు. ‘ఆడపిల్లలకు అధిక విద్య అవసరమా?’అనే టాపిక్ మీద మా కాలేజీ రోజుల్లో జరిగిన వ్యాసరచన పోటీ గుర్తొచ్చింది. నేనూ రాశాను. చదువుకు అధికమనేది ఏమీ లేదని, ఆసక్తిని బట్టి ఎవరైనా, ఎంతైనా చదువుకోవచ్చని, ఆడపిల్లలకు అధికవిద్య అవసరమా అన్న మాటే అనుచితమని రాశాను. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. నా మనసుకు తోచింది రాశాను. ప్రైజ్ వస్తుందన్న ఆలోచన కూడా లేదు. ఇప్పుడైతే అమ్మాయిల చదువుపట్ల అలక్ష్యాన్ని తొలగించడానికి ప్రభుత్వాలే ‘బేటీ బచావో బేటీ పడావో’ వంటి పథకాలతో ప్రోత్సహిస్తున్నాయి. చదువుకునే రోజులు నిజంగా బంగారు రోజులు. విద్యాబుద్ధులు నేర్పేది చదువులమ్మ ఒడే కదా. చదువయిపోయి ఆ విద్యాలయాన్ని వీడిపోవాలంటే ఎంత బాధగా ఉంటుందో.. గురువులతోటి అనుబంధం, స్నేహితులు, సహాధ్యాయులతోటి అనుబంధాలకు బ్రేక్ పడుతుందంటే ఎంత బాధ. స్నేహితులతో అనుబంధం కొనసాగినా, రోజూ కలిసిమెలిసి తిరిగే వీలుండదు కదా. ఈ సందర్భంలో విద్యార్థుల మనోగతానికి దర్పణంలాంటి పాటను ‘స్టూడెంట్ నంబర్ వన్’ చిత్రానికి చంద్రబోస్ అందించారు. అది..

“ఓ మైడియర్ గాల్స్.. డియర్ బోయ్స్.. డియర్ మేడమ్స్.. గురు బ్రహ్మలారా
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు.. వీడుకోలంటు
వెళ్లిపోతున్నాము.. చిలిపితనపు చివరి మలుపులో
వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్… వియ్ మిస్ యూ..” ఎంత చక్కటి భావవ్యక్తీకరణ!

క్లాస్ వర్క్, హోమ్ వర్క్, ఎగ్జామ్స్, గేమ్స్, సింగింగ్, డాన్సింగ్, కాంపిటీషన్స్, సెలబ్రేషన్స్ అండ్ వాట్ నాట్…

హోమ్ వర్క్ అంటే అదో భారంగా చాలామంది భావించినా నిజమైన విద్యార్థులు మాత్రం హోమ్ వర్క్‌ను ఇష్టంగా చేస్తారు. ‘హోమ్ వర్క్’ అంశంపై కెన్ నెస్‌బిట్ అనే ఇంగ్లీషు కవి ‘హోమ్ వర్క్ ఐ లవ్ యు’ అంటూ ఓ పొయమ్ రాశారు. అందులో..

“హోమ్ వర్క్, ఐ ల వ్ యు, ఐ థింక్ యు ఆర్ గ్రేట్,
ఇటీజ్ వండర్‌ఫుల్ ఫన్ వెన్ యు కీప్ మి అప్ లేట్
ఐ థింక్ యు ఆర్ ది బెస్ట్ వెన్ అయామ్ టోటల్లీ స్ట్రెస్ట్
ప్రిపేరింగ్ అండ్ క్రామ్మింగ్ ఆల్ నైట్ ఫర్ ఎ టెస్ట్…

హోమ్ వర్క్ ఐ లవ్ యు, యు థ్రిల్ మి ఇన్ సైడ్
అయామ్ ఫిల్డ్ విత్ ఎమోషన్స్. ఐ యామ్ ఫిట్ టు బి టైడ్.
ఐ కాంట్ కంప్లెయిన్ వెన్ యు ఫ్రాజిల్ మై బ్రెయిన్
అఫ్ కోర్స్ దట్స్ బికాజ్ అయామ్ కంప్లీట్లీ ఇన్‌సేన్”.

అన్నట్లు ‘వివాహాయ.. విద్య నాశాయ’ అంటుంటారు. అది చాలావరకు ఆడపిల్లలకే నిన్నమొన్నటివరకు వర్తించేది. అప్పటికీ పట్టుదల ఉన్న మహిళలు పెళ్లయ్యాక కూడా, పిల్లల్ని పెంచుతూ కూడా చదువుకుని డిగ్రీలు సాధించినవారున్నారు. అయితే చిత్రం ఏమిటంటే ఇతిహాసాల్లో రాజకుమారులకు విద్యే వివాహ అర్హతగా ఉండటం. వారికి విద్య అంటే విలువిద్యే ప్రధానమైంది. రాముడు శివధనుర్భంగం చేసే కదా సీతను వివాహమాడింది. అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని వివాహమాడాడు. ఇలా వీరత్వమే వారికి వివాహ అర్హత అయ్యేది. అతివలైతే సౌందర్యమే అర్హతగా భావించారు.

పేరుపక్క పది డిగ్రీలు రాసుకునే క్రేజ్ గతంలో ఉండేది. పేరుకు నాలుగురెట్లు డిగ్రీలు రాసుకోగలిగితే గొప్ప. అడ్రెస్ రాసేటప్పుడు పేరుతో పాటు డిగ్రీలు కూడా రాసేవాళ్లు. అలాగే ఇంటికి ఉండే నేమ్ ప్లేట్‌లో కూడా పేరు పక్కనే డిగ్రీలు రాసుకునేవాళ్లు. ఇప్పుడా పోకడ వెనక్కిపోయింది. శుభలేఖల్లో సైతం వధూవరుల డిగ్రీలు రాయటం లేదు.

‘అమ్మా.. అక్షతలు తీసుకోండి’ బ్రహ్మగారి మాట విని, ఉలిక్కిపడి అందుకున్నాను. ఇటుగా చూస్తే ఇందిర కనపడింది. పక్కనే వాళ్ల పాప అవని. ‘బాగున్నారా?’ పరస్పరం ఒకేసారి పలకరించుకుంటుండగానే అవని, వాళ్లమ్మ చేతిలోని అక్షతలు అందుకుని తన తలపై వేసుకుంది. నవ్వొచ్చింది నాకు.

‘చదవేస్తే ఉన్న మతి పోయిందని.. అక్షతలు నీతలపై వేసుకోవడమేంటి?’ కోప్పడింది ఇందిర. భలే సామెత. కొత్త ‘దేవదాసు’లో

“పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ
ఇరుగింటి చినదానికి తగని మక్కువ..” పాటలో
“చదవేస్తే ఉన్న మతి జారిందేమో
మదినిండా వలపుంటే చదువులెందుకు…”

ప్రేమలో పడ్డ వాళ్లకు కాస్తోకూస్తో మతిపోవడం మామూలే.. చదువుకోకముందు ‘కాకర’ అంటే చదువుకున్నాక ‘కీకర’ అన్నాడని మరో సామెత..

తాళికట్టు శుభవేళ.. మేళాల మోత..మెడలో కల్యాణమాల.. వగైరాలన్నీ అయిపోయాయి.

‘భోజనాలకు పదండి’ ఎవరో పిలుపునిచ్చారు.

అందరితో పాటు నేనూ నూతన వధూవరులపై అక్షతలు చల్లి, శుభాకాంక్షలు తెలిపి, వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు కోసం డైనింగ్ హాల్‌కి నడిచాను.

తింటుండగా మర్యాద పురుషోత్తమ్ గారు కనిపించారు. వాళ్లింటి పేరు ‘మర్యాద’.

బాగున్నారా.. అయిపోయింది. వాళ్ల పుత్రరత్నాన్ని పరిచయం చేశాడు.. ‘మా వాడు వినయ్.. ఇంటర్. ఇంటెలిజెంట్. అయినా ఎందుకైనా మంచిదని కోచింగ్ ఇప్పిస్తున్నా’ అంటూ… వినయ్ ఛాట్ ఏదో తింటూ, మరో చేత్తో మొబైల్ హ్యాండిల్ చేస్తూ బిజీగా ఉన్నాడు. నాకేసి తలతిప్పలేదు.

‘ఆంటీని విష్ చేయరా’ మర్యాద పురుషోత్తమ్ గారు హెచ్చరించారు.

అయినా వినయ్ పట్టించుకోలేదు. అతడి ధ్యాసంతా మొబైల్ గేమ్ పైనే ఉంది. నేనే పురుషోత్తమ్ గారిని వారించి ‘ఆటలో ఉన్నాడు. డోస్ట్ డిస్టర్బ్ హిమ్’ అన్నాను.

పురుషోత్తమ్ గారు నిస్సహాయంగా ఉండిపోయి, ఏదో వడ్డించుకోవాలన్నట్లు అక్కడ్నుంచి కదిలారు.

‘వినయేన శోభతే విద్య’ అని వినయ్ తెలుసుకుంటే బాగుండు అనుకున్నాను.

స్కూలు స్థాయి దాటి కాలేజీకి చేరటంతోనే తామేదో ప్రపంచాన్ని గెలిచాశామన్న ఫీలింగ్‌లో ఉంటారు చాలామంది. ఇంటర్ దాటితే అది ఇంకొంచెం ముదురుతుంది. అప్పుడే చిలిపితనం చిందులువేస్తుంది.. అల్లరి ఆరంగేట్రం చేస్తుంది.

పఢ్‌నా లిఖానా చోడో ఆవో
జమ్ కె మౌజ్ మనాయే..
పిక్చర్ దేఖే డిస్కో జాయె
ఝూమె నాచె గయే
ఉమర్ అభి హై మస్తీకి
మస్తీ మె ధూమ్ మచాయె
హోటల్ జాయె ఐస్ క్రీమ్ ఖాయె
ఝూమె రంగ్ జమాయె
హిందీ ఇంగ్లీష్ రాత్ దిన్
పఢ్ కె హమ్ తొ హెగయె హై బోర్.. అంటూ ‘అంగరక్షక్’లో పూజాభట్‌లా జోష్‌లో మునిగితేలుతుంటారు.

లంచ్ అయి, అందరి దగ్గర సెలవు తీసుకుని తిరుగుముఖం పట్టినా నా ఆలోచనలు మాత్రం చదువు చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఇప్పటి చదువులంతా ఎక్కువశాతం వీడియో పాఠాలు వినడాలు, చూడడాలే. మహేష్ బాబు యాడ్‌లో చెప్పినట్లు.. యాప్ వాడుకుని ఫ్యూచర్ ఎడిసన్లు, ఐజాక్ న్యూటన్లు కావచ్చేమో. ఏమైనా ఎంత చదివినా విద్యతో పాటు కొన్ని విలువలను, సంస్కారాన్ని నేర్చుకోలేకపోతే ఆ విద్య అనర్థాన్నే మిగులు స్తుంది. ప్రవర్తనారీతుల్ని, మహిళల పట్ల గౌరవభావాన్ని, సమాజంలోని అందరి పట్ల సమభావనల్ని ప్రోదిచేయగలిగేది, ఈ విశ్వంపట్ల విశ్వమానవుడి బాధ్యతను, దేశభక్తిని, సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని కలిగించేదిగా విద్య ఉండాలి. విద్యా సుమానికి అప్పుడే పరిమళమబ్బేది. అటువంటి విద్య ఇంకెంతదూరమో. ‘అయినా ప్రపంచ పాఠశాలలో మనుషుల్ని చదవటంలో ప్రతివ్యక్తి జీవితాంతం నిత్య విద్యార్థే’ అనుకుంటుంటే మా ఇల్లు దగ్గరైంది.. ఆలోచన ఆవలకు, నేను ఇంటి లోపలకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here