మానస సంచరరే-40: చందమామ రావే.. మంచి రోజులు తేవే!’

6
2

[box type=’note’ fontsize=’16’] “మనిషి చల్లని వెన్నెలలా మనసునెప్పుడూ ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంచుకుని, సమున్నతంగా ప్రకాశించడానికి ప్రయత్నించాలి. తమ జీవితంలో వెన్నెలలు కురిపించుకుంటూ, ఇతరుల జీవితాలకూ వెన్నెలను ప్రసాదించేలా మనిషి జీవన యానం సాగించాలి” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]రా[/dropcap]త్రి సమయం. రేరాణులు (నైట్ క్వీన్) విరిసే సమయం. కరోనా కారణంగా, లాక్‌డౌన్ ప్రకటించడంతో అందరిళ్లలో సకాల భోజనాలు ముగిసి, కబుర్లలోనో, టీ’వీక్షణం’లోనో, నాలాగా మనో సమీక్షణంలోనో, ఊహావిహారం లోనో గడిపేవేళ..

ఇంతలో కరెంటు పోయింది. ఇన్వర్టర్ ఉన్న కారణంగా వెలుగుకు వెతుక్కోనవసరం లేకపోయినా శుక్లపక్షపు రోజులు.. వెన్నెలలు వెంటబెట్టుకు విహరించే చందురుడుండగా ఈ కృత్రిమ వెలుగులు నాకేల అనుకుంటూ ముందు తలుపు తీసి ముంగిట్లోకి నడిచాను. ముందున్న కొబ్బరి చెట్టు ఆకుల చేతులనూపుతూ రారమ్మని పిలిచింది. అలా చూస్తే కొబ్బరాకు సందుల్లోంచి, ఆకు ఊగినప్పుడల్లా చందమామ దోబూచులాడుతున్నాడు. చూపు తిప్పి నేరుగా నింగిలో చూపు నిలిపాను. రేరాజు విలాసంగా విహరిస్తూ.. మామగా ఆబాలగోపాలాన్ని అలరిస్తూ, చల్లదనాలు కురిపిస్తూ, తుషారశీతల సరోవరంలో తన రాక కోసం నిరీక్షించే కలువ భామల కోసమేమో తరలిపోతున్నాడు. ఎంత బాగుందో ఆకాశవీధి!

ఆకాశవీధిలో అందాల జాబిలి..
వయ్యారి తారను జేరి ఉయ్యాలలూగెనే
సయ్యాటలాడేనే..
జలతారు మేలిమబ్బు పరదాలు నేసి
తెరచాటు చేసి
పలుమారు దాగిదాగి పంతాలు పోయి
పందాలు వేసి
అందాల చందమామ దొంగాటలాడెనే
దోబూచులాడెనే…  పాట మదిలో మెదిలింది.

మాంగల్యబలం చిత్రానికి శ్రీశ్రీ రాసిన పాట. శ్రీశ్రీ ఇంత ‘చల్లని’ గీతం రాయటంఎంత వింత!

చందమామ చుట్టూ మనిషి ఎన్నెన్ని ఊహలల్లుకున్నాడు! మనసున ఆనందం ఉప్పొంగినా, వేదన వెల్లువైనా చంద్రుడిలోనే పంచుకోవడం ఎందరికో అలవాటు. ఆ భావపరంపరలకు ఎందరో కవులు చక్కని ‘కలంకారీ’ని జతచేర్చారు. వినే మనసుండాలే కానీ చంద్రుని పైనా, వెన్నెల చుట్టూ అల్లుకున్న గీతాలకు అంతేలేదు.

భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడని, సౌర వ్యవస్థలో చంద్రుడు అయిదవ పెద్ద ఉపగ్రహమని సైన్స్ చెబుతున్నా, అంతరిక్ష నౌకలు చంద్రగ్రహం చేరినా, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై నడిచివచ్చినా, ఆపైన ఎన్నో అంతరిక్షయానాలు జరిగినా, ఇస్రో చంద్రయాన్ సిరీస్ ప్రయోగాలలో తలమునకలవుతున్నా, చందమామతో మనిషి అల్లుకున్న అనుబంధం మాత్రం చెక్కు చెదరలేదు.

కాలమానాలలో సౌరమానంతో పాటు చంద్రమానం ఉంది. దేవుడి పూజలో సంకల్పం చెప్పే ముందు… ‘అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన…’ అనడం తెలిసిందే. ముస్లిమ్‌లు, జూదులు చంద్రమాన క్యాలెండర్ అనుసరిస్తారు. రంజాను పండుగను నెలవంక కనబడటం ఆధారంగానే నిర్ణయిస్తుంటారు. చైనావారు లూనార్ క్యాలెండర్‌నే అనుసరిస్తారు.

ఏమైనా అందాల చందమామ ఇప్పటికీ మనకు అద్భుతమే. పిల్లలు బువ్వ తినటానికి మారాం చేస్తే బిడ్డనెత్తుకుని, అమ్మ, చందమామను చూపిస్తూ..

చందమామ రావె.. జాబిల్లి రావె
కొండెక్కి రావే.. గోగుపూలు తేవె…
వెండిగిన్నెలో వేడిబువ్వ తేవే
పైడి గిన్నెలో పాలబువ్వ తేవే…
తేరెక్కిరావె.. తేనెపట్టు తేవే
బండెక్కి రావె.. బంతిపూలు తేవే
అందాల పాపకు అందించి పోవే..

పాటను కమ్మగా పాడుతూ గోరుముద్దలు తినిపిస్తే పిల్లలు యిష్టంగా తినటం తెలిసిందే. కాకపోతే రోజులు యాంత్రికమై, వేగవంతమైన జీవనసరళితో చందమామను చూపించే తీరికలేక అమ్మలు వీడియో ముందు పెట్టి పిల్లలకు అన్నం తినిపించటం కద్దు. ఇప్పుడు కరోనా కారణంగా ఇంటిపట్టునే ఉన్న అమ్మలు పిల్లలకు నిజమైన చంద్రుడినే చూపిస్తుండవచ్చు. అలనాడు పసివాడైన రామచంద్రుడు తనకు చందమామ కావాలని మారాం చేస్తే తల్లి తెలివిగా చంద్రబింబాన్ని అద్దంలో చూపించి బాల రాముణ్ని మరిపించిందని రామాయణ కథనం. మంచి బాలుడు రాముడు నమ్మేశాడు కానీ ఇప్పటి పిల్లలయితే అద్దంలోంచి చందమామ బయటకు రావలసిందేనంటూ మంకు పట్టుపట్టి, అద్దాన్ని విసిరేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ‘చందమామ రావే’ పాట అన్నమాచార్య విరచితం. దాంట్లోనే మార్పులు, చేర్పులతో సినిమాపాటగా, పిల్లల రైమ్‌గా ఇప్పుడు వినబడుతోంది. దేశంలో వివిధ భాషలలో ప్రాచుర్యం పొందిన బాలల మాసపత్రిక ‘చందమామ’. బి.నాగిరెడ్డి, చక్రపాణి పందొమ్మిది వందల నలభై ఏడులో తెలుగులో ప్రారంభించిన ఈ పత్రిక అరవై ఐదేళ్లకు పైగా విలసిల్లింది. పిల్లల పత్రికే అయినా పెద్దలు సైతం ఆ కథలను ఎంతో మక్కువతో చదివేవారు.

మామూలుగా పున్నమి చంద్రుడి గురించి, పున్నమి వెన్నెల గురించి విశేషంగా చెప్పుకుంటాం. కానీ వేటూరి..

నవమినాటి వెన్నెల నీవు
దశమినాటి జాబిలి నేను
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి..

అంటూ ‘శివరంజని’ చిత్రానికి అందించిన పాటలో సరికొత్త ఊహ చేశారు. ఈ పాటకు రమేష్ నాయుడు సంగీతం కూడా అంతే గొప్పగా ఉంటుంది. వెన్నెల రేయిలోని హాయి ఈ పాటలో అనుభూతించవచ్చు.

ఇంతకన్నా మార్దవంగా, మెల్లగా సాగే మధురగీతం ‘చివరకు మిగిలేది’ చిత్రంలోని…

సుధవోల్ సుహాసిని.. మధువోల్ విలాసిని
ఓహెూ కమనీ! సరసం సరాగమేల
రావే వరాల బాలా.. ఓహెూ కమనీ…
నీవేలె ఈ వెన్నెల.. నేనేలె ఈ తెమ్మెర
సడిలేని నడిరేయిగా
జవరాల మనమౌదమే.. ఓహెూ కమనీ!

మల్లాది రామకృష్ణశాస్త్రిగారు ఈ అపురూపమైన పాటను రచిస్తే, ఘంటసాల ఈ పాటను ప్రత్యేక శ్రద్ధతో పండించారు. బ్లాక్ అండ్ వైట్ చిత్రం కనుక ఆ దృశ్య చిత్రీకరణ మరింత సహజంగా, మనోహరంగా అనిపిస్తుంది. సావిత్రి అభినయం అద్భుతమయితే, అశ్వత్థామ సంగీతం మహాద్భుతం.

చందమామను అందానికి ప్రతిరూపంగా భావిస్తుంటారు. అందుకేనేమో..

చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే… అని ‘రక్త సంబంధం’ చిత్రానికి అనిశెట్టి చక్కని పాటనందించారు.

ఓ ప్రేమికుడు చెలి అందాన్ని వైవిధ్యభరితంగా పొగడుతూ…

ఈ పగలు రేయిగా పండువెన్నెలగ మారినదేమి చెలీ
ఆ కారణమేమి చెలీ.. వింతకాదు నా చెంతనున్నది.

వెండివెన్నెల జాబిలి.. నిండుపున్నమి జాబిలి..  అంటాడు. ఆ సొగసంతా ఆత్రేయ కలానిదే. అంతెందుకు, త్యాగయ్య కూడా చంద్రుడిని విస్మరించలేదు. తనను చూడవచ్చిన మైసూరు ఆస్థాన వైణికుడు, తిరువాన్కూర్ ఆస్థాన జంత్రగాత్ర విద్వాంసుడు, లక్ష్య లక్ష్యవేత్త షట్కాల గోపాలదాసు ప్రభృతులు ఓ కీర్తన వినిపించమని కోరగా గానం చేసిన పంచరత్న కీర్తనలో యుగయుగాలుగా ఉన్న భక్తుల గొప్పతనాన్ని వర్ణిస్తూ

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు.. ఎందరో..
చందురూ వర్ణుని అందచందమును
హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు
వారెందరో మహానుభావులు.. అన్నారు.

ఇక వెన్నెల రేయి పడవ షికారు ఎంత మధురమో పాత ‘మాయాబజార్’ చిత్రం చూపుతుంది.

లాహిరి లాహిరి లాహిరిలో ఓహే జగమేగా ఊగెనుగా, తూగెనుగా.
ఆఆ.. ఆఆ…
తారాచంద్రుల విలాసములతో
విరిసే వెన్నెల పరవడిలో.. ఉరవడిలో
పూలవలపుతో ముఘుమలాడే పిల్లవాయువుల లాలనలో… లాహిరి..

అలాగే ‘తోబుట్టువులు’ చిత్రానికి అనిశెట్టి రాసిన మాధుర్యప్రధాన గీతం కూడా మరువలేనిదే…

మధురమైన రేయిలో
మరపురాని హాయిలో
పండువెన్నెలే నేడు పాడెనేలనో
తళుకు తళుకు తారలే అద్దాల నీట ఊగెలే
కలలరాణి జాబిలి నాకన్నులందు దాగెలే.. పండువెన్నెలే

ఆ అందాలరేయిని మన కళ్లముందు ఆవిష్కరించే పాట యిది. మనం బంధువులెందరు ఉన్నా ఆత్మీయ బంధువుగా భావించేది మేనమామనే. అయితే మేనమామ ఉన్నా, లేకున్నా ప్రపంచం అంతటికీ ఉండే మామ చందమామ. కవులకయితే ప్రియమైన మామ చల్లనివాడు… వెన్నెలలు కురిపించేవాడు, శుక్లపక్షంలో రేయంతా వెన్నెల వెలుగులు పంచేవాడు మన చందమామ. అసలు అల్లరిగా నవ్వే లక్షణం మనకు ఈ మేనమామ నుంచే వచ్చిందేమో. ఎందుకంటే చంద్రుడు లంబోదరుడిని చూసి పక పక మనడమే. కథలోకి వెళితే, వినాయకుడు, వినాయకచవితి రోజున, భక్తులందరూ పెట్టిన ఉండ్రాళ్లు.. వగైరాలన్నీ తిని భారీ ఉదరంతో తిరిగి కైలాసానికి ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులకు ప్రణామం చేయబోయాడు. కానీ అతిగా నిండిన పొట్ట అందుకు సహకరించలేదు. వినాయకుడి అవస్థ చూసి శివుని శిరసున ఉన్న చంద్రుడు వికటంగా నవ్వాడట. దాంతో వినాయకుడికి దిష్టి తగిలి పొట్టపగిలిపోయింది. తల్లి పార్వతి శోకావేశాలతో చంద్రుడి ముఖం ఎవరూ చూడరాదని, చూసినవారికి ఆపదలు తప్పవని శపించింది. దాని ఫలితంగా ఋషిపత్నులకు నీలాపనిందలు కలగటం, దేవతలు, మునులు ఆ ఆపదను పరమేష్టికి తెలపటం, ఆయన అది చంద్రదర్శనంవల్ల వచ్చిన నిందేనని వారిని సమాధానపరిచి, వారితోపాటు కైలాసానికి వచ్చి, వినాయకుడిని బ్రతికించి పార్వతికి సంతోషం కలిగించి, లోకాలకు కీడుచేసే ఆ శాపాన్ని ఉపసంహరించుకోమని కోరటంతో, పార్వతి, వినాయకచతుర్ది నాటి రాత్రి మాత్రమే చంద్రుడిని చూడరాదని శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించింది. సరే ఆ తర్వాత కాలంలో వినాయక చవితి రోజున శ్రీకృష్ణుడు పాలలో చంద్రుని నీడను చూసి నీలాపనిందల పాలుకావడం.. వగైరా వృత్తాంతాలన్నీ వినాయకచవితి రోజున చదివే కథల్లో తెలుసుకుంటాం.

ఇక ‘తారా శశాంకం’ కథలో బృహస్పతి భార్య తార, చంద్రుణ్ని చూసి మోహిస్తుంది. ఇంకేముంది, చంద్రుడు సైతం ఎస్సనటంతో ప్రేమకథ ముందుకు నడుస్తుంది. తార గర్భవతి కావటం.. చంద్రుడు ఆమెను తన వెంట తీసుకెళ్లడం జరుగుతాయి. బృహస్పతి విషయం తెలుసుకుని చంద్రుడిని, తారను విడిచి పెట్టమంటాడు. చంద్రుడు ససేమిరా అంటాడు. తారకు ‘బుధుడు’ పుడతాడు. బృహస్పతి, తారను తనకు ఇప్పించమని బ్రహ్మకు మొర పెట్టుకుంటాడు. బహ్మ, బుధుడు చంద్రుడి వద్దనే ఉండేట్లు, తార మాత్రం బృహస్పతి వద్దకు తిరిగి వెళ్లేట్లు ఒప్పందం కుదురుస్తాడు. ఇదిలా ఉంచితే, చంద్రుడు క్షీణ, వృద్ధి గతుల్ని పొందడానికి సంబంధించి మరో కథ ఉంది. దక్షప్రజాపతి ఇరవై ఏడుమంది కుమార్తెల (నక్షత్రాలు) ను చంద్రుడు వివాహమాడినా, అతడికి ఒక్క రోహిణిపైనే మక్కువ అధికం కావటంతో కాలమంతా ఆమెతోనే గడుపుతుంటాడు. మిగిలినవారు భర్త నిరాదరణకు వగచి, తండ్రితో మొర పెట్టుకుంటారు. దక్షుడు, చంద్రుడిని పత్నులందరినీ సమంగా చూసుకోవాలని సున్నితంగా మందలిస్తాడు. అయినా చంద్రుడి వైఖరిలో మార్పులేకపోవటంతో దక్షప్రజాపతి ఆగ్రహంతో- క్రమంగా క్షీణించి, మరణిస్తావని చంద్రుడిని శపిస్తాడు. అతడి కుమార్తెలు అది విని తల్లడిల్లి శాపాన్ని ఉపసంహరించుకోమని వేడుకుంటారు. శాపాన్ని వెనక్కు తీసుకోలేనని, పరమశివుణ్ని ప్రార్థిస్తే ఫలితం ఉండవచ్చని అంటాడు దక్షప్రజాపతి. దాంతో చంద్రుడు, ప్రభాసతీర్ధం వెళ్లి శివలింగాన్ని భక్తితో పూజించి శివుణ్ని మెప్పిస్తాడు. శివుడు విషయం తెలుసుకుని, శాపాన్ని పూర్తిగా తొలగించడం కుదరదని, అయితే పదిహేను రోజులు క్రమంగా క్షీణిస్తూ, మళ్లీ పదిహేను రోజులు క్రమంగా వృద్ధిచెందుతూ ఉండేట్లు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, నెలవంకను తన శిరసున దాలుస్తాడు. భక్తుడికి అంతకంటే కావలసిందేముంది? అలా శివుడు చంద్రశేఖరుడు, చంద్రమౌళి అయ్యాడు. చంద్రుడు పూజించిన లింగమే సోమనాథ్ లోని శివలింగమని భక్తుల విశ్వాసం.

అర్ధచంద్రుడైనా అందానికేం కొదువ.. అనుకుంటుంటే ‘నవరంగ్’ లోని పాట మదిలో మెదిలింది.

ఆధా హై చంద్రమా రాత్ ఆధీ
రెహనజాయే తెరీమెరీ బాత్ ఆధీ.. ములాకాత్ ఆధీ..
పియా ఆధీ హై ప్యార్ కి భాషా
అధీ రహెనేదో మనకి అభిలాష
ఆథె ఛల్ కె నయన్, ఆధీ ఛల్ కె నయన్
ఆధీ పల్కోం మె భీ హై బర్సాత్ ఆధీ..

భరత్ వ్యాస్ లిఖించిన ఈ పాట ఆశాభోంస్లే, మహేంద్రకపూర్ గళాలలో జీవం పోసుకుంది. ఆకాశంలో చంద్రుడు కొరవడిన వేళను కూడా సినీకవి శైలేంద్ర ‘కాలా బజార్’ సినిమాకు అందించిన పాటలో చక్కగా పొదిగారు అది –

ఖొయా ఖొయా చాంద్.. ఖులా ఆస్మాన్
ఆంఖోం మె సారీ రాత్ జాయేగీ…..
తుమ్ కో బీ కైసే నీంద్ ఆయేగీ… ఖొయా ఖొయా చాంద్..

అసలు మనిషి మనసును అదుపు చేసేది చంద్రుడేనంటుంది జ్యోతిషశాస్త్రం. ధ్యానం, ఏకాగ్రత వంటివి చంద్రానుగ్రహాలే నట. అన్న ట్లు ‘చంద్రుడికో నూలుపోగు’ అని సామెత. కారణం, చంద్రుడికి మనలాగే దుస్తులంటే మక్కువ ఎక్కువట. అందుకే చాలామంది చంద్రుడి పేరిట వస్త్రదానాలు చేస్తుంటారు.

ధనికులు దానం చేయగలరు, కానీ బీదల మాటేమిటి, అందుకే గతంలో బీదలు కూడా తమ కండువాలోని ఓ నూలుపోగు తీసి వదిలేసే వారట. ఆ రకంగా ‘చంద్రునికో నూలుపోగు’ వాడుకలోకి వచ్చిందని పెద్దల ఉవాచ.

చందమామ సమతావాది. ధనికుడి సిల్వర్ గిన్నె పైన, ముష్టివాడిజర్మన్ సిల్వర్ బొచ్చె పైన అదే వెన్నెల ప్రసరింపజేస్తాడు.

మామా చందమామా.. వినరావా మా కథా
వింటే, మనసు ఉంటే కలిసేవు నా జతా.. అని సంబరాల రాంబాబు గోడు వెళ్లబోసుకున్నా..
రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా… తన మతమేదో తనదీ, మన మతమసలే పడదోయ్
మనము, మనదను మాటే అననీయదు, తాననదోయ్.. అని మిస్సమ్మ హీరో తన ప్రేమిక గురించి ఫిర్యాదు చేసినా.. ఇంకా వేరువేరు సినిమాల్లో

‘ఈ వెన్నెలా, ఈ పున్నమి వెన్నెల
ఆనాడు, ఈనాడు ఒకే వెన్నెలా..
వలపుల వెన్నెలా… జత కలిపే వెన్నెలా
అల్లరి వెన్నెలా.. కలలల్లే వెన్నెలా…

అని ప్రేమికులు పరవశించినా…

‘పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా
దండగైపోయింది సెందరయ్యా…’ అని వాపోయినా…

‘నా కంటిపాపలో నిలిచిపోరా’ అని..

‘ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో
జాబిలి వెలిగేన మనకోసమే..
ఆ చందమామలో ఆనందసీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా..’

అని ప్రేమజంట సరదాపడ్డా..

‘అందాల ఓ చందమామ రావోయి
నీ కొంటె కొంటె నవ్వుల వలపించ రావోయి..
మది పులకించ రావోయి.
తెల్లని మబ్బుల పల్లకిలో తేలుచు తేనెల కురిసేవు
వలపుల రాజా చాలులే.. నీ చిలిపి గుణాలే మానులే..’

అని ఓ పరువాల జంట చంద్రుడిని ప్రస్తుతించినా

చందమామ మాత్రం అలా అలా అవలోకిస్తూ, చల్లగా సాగుతూ వెన్నెల సుధ కురిపిస్తూ, అలరిస్తూ, సాంత్వన కలిగిస్తుంటాడు. పూర్వకాలంలో మనిషి ఎనభై, తొంభై సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించేవాడు. జీవనశైలిలో మార్పులతో ‘అరవై ఏళ్లు బతికితే గొప్పే, ఆ పైన ఆయుషంతా దేవుడిచ్చిన బోనస్ గానే భావించాలి’ అనుకోవటం పరిపాటి అయింది. గతంలో సహస్ర పూర్ణచంద్రోదయాలను చూసిన వ్యక్తి (ఎనిమిది పదులు దాటితే) దాన్నొక విశిష్టసందర్భంగా వేడుక జరుపుకోవటమూ ఉంది. కానీ కరోనా ఇప్పుడు వయసు పైబడినవారిపై పగబట్టిన నేపథ్యంలో సహస్ర పూర్ణ చంద్రోదయాలను చూసే వారెందరు మిగులుతారో.

చంద్రుడికి వృద్ధి, క్షయాలెలా ఉన్నాయో, మనిషికీ జయాపజయాలు, కలిమిలేములు, ఉచ్చ, నీచదశలు ఉండనే ఉన్నాయి. మనిషి చల్లని వెన్నెలలా మనసునెప్పుడూ ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంచుకుని, సమున్నతంగా ప్రకాశించడానికి ప్రయత్నించాలి. తమ జీవితంలో వెన్నెలలు కురిపించుకుంటూ, ఇతరుల జీవితాలకూ వెన్నెలను ప్రసాదించేలా మనిషి జీవన యానం సాగించాలి అనుకుంటుండగా రోడ్డుమీద పోలీస్ వాహన ధ్వనితో ఉలిక్కిపడ్డాను. ఆలోచన చెదిరింది. అబ్బో! చందమామ గురించిన తలపుల్లో చాలా సమయం గడిచిపోయింది అనుకుంటూ.. ఆకాశంలోకి చూస్తే సుదూరంగా చందమామ.. ‘చందమామ రావే.. మంచి రోజులు తేవే..’ పాడుకుంటూ ఇంట్లోకి నడిచాను..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here