Site icon Sanchika

మానస సంచరరే-41: అమ్మ అం’తరంగం’!

[box type=’note’ fontsize=’16’] “’అమ్మ’ను దేవతగా కాదు, తనలోని ప్రాణమే ఆమె అనే గుర్తింపుతో ఆత్మీయత పంచితే చాలు, అమ్మ హృదయం ఆనందాల నదే అవుతుంది.. ఆనందనందనమే అవుతుంది” అంటున్నారు జె. శ్యామల. [/box]

‘వద్దురా కన్నయ్యా.. వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా…
పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పసిపాపలను బూచి పట్టుకెళ్లే వేళ… ॥వద్దురా॥
పీతాంబరము మట్టిపడి మా సేను
పాలుగారే మోము గాలికే వాడేను ॥వద్దురా॥
గొల్లపిల్లలు చాలా అల్లరి వారురా
గోలచేసి నీపై కొండెములు చెప్పేరు
ఆడుకోవలెనన్న, పాడుకోవలెనన్న
ఆడటను నేనున్న… అన్నిటను నీదాన.. వద్దురా కన్నయ్యా..

చక్కని సాయంత్రాన నాకిష్టమైన పాట వింటుంటే అంతరంగ కడలిలో ఆలోచనల కెరటాలు ఎగసిపడసాగాయి.

‘అర్ధాంగి’ చిత్రానికి ఆత్రేయ రాసిన ఈ పాట జిక్కి గొంతులో జీవం పోసుకుంది. అమ్మ మనసుకు అక్షరమై నిలిచిన పాట. యశోదకు నల్లనయ్యపై ఎంతటి ప్రేమ! ఆ సమయం పసిపాపలను బూచిపట్టుకెళ్లే వేళట. తాను కృష్ణయ్యకు ముస్తాబు చేసిన పట్టుపీతాంబరమేమో మట్టి పడి మాసిపోతుందట. పాలుగారే బాలకృష్ణుడి మోము గాలికే వాడిపోతుందట. అంతటితో అయిందా. అందరు తల్లుల్లాగే తనబిడ్డ బుద్ధిమంతుడు, అల్లరంతా ఇతర పిల్లలదే అంటోంది యశోద. గొల్లపిల్లలు గోల చేసి, కృష్ణయ్యపై నెడతారని, అందుకే ఆడుకోవటానికి బయటకు పోవద్దనీ, ఆడుకోవాలన్నా, పాడుకోవాలన్నా తాను సిద్ధంగా ఉన్నాననీ అంటుంది ప్రేమమయి యశోదా మాయి. ఆత్రేయ ఎంత గొప్పగా యశోద హృదయాన్ని ఆవిష్కరించారో.. అనుకుంటూ ముందుకు చూపు సారిస్తే ఎదురుగా ఆటస్థలం ఖాళీగా, బోసిపోతూ కనిపించింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధింపుతో ఆరుబయలు ఆటస్థలాలకు అగుపించని తాళాలు వేసినట్లయింది. ఇప్పుడిక ఇంట్లోనే ఆటలు. అమ్మా, నాన్నలు, తోబుట్టువులే సావాసగాళ్లు. అన్నట్లు తెల్లవారితే ‘మదర్స్ డే’. ‘అమ్మ’కు ఒక రోజేమిటి, ‘మాతృదేవో భవ’ అని పెద్దలేనాడో చెప్పారుకదా అనటం పరిపాటి. అయితే అమ్మ సతతం గౌరవనీయురాలే అయినా, వేగవంతమైన నేటి జీవన శైలిలో అమ్మను విస్మరిస్తున్న వారెందరో. అలాంటివారు కనీసం ఈ ‘మదర్స్ డే’ రోజునయినా తన ఉనికికి ఆధారమైన అమ్మను గుర్తుచేసుకొని, ఆమెతో ఆత్మీయంగా సంభాషించి, వీలైతే ఆమెతో గడిపి ఆశీస్సులందుకుంటే మంచిదే కదా. ప్రతి సంవత్సరం ‘మదర్స్ డే’ న అమ్మను కీర్తిస్తూ కవితలు రాయటం, వ్యాసాలు రాయటం, ఇంటర్వ్యూలు చేయటం మామూలే అయినా ఈ కరోనా వేళ అవని అంతటా అమ్మ హృదయం ఎంతో కల్లోలంగా ఉంది.

తన బిడ్డల క్షేమం గురించి ఎందరు అమ్మలు దిగులుగా రేపవలు.. కళ్లముందు లేని కంటిపాప తలపుకొచ్చి కళ్లు చెరువులవుతుంటే.. కంటికి కునుకురాక.. పొట్టచేత పట్టుకుని పట్నం వెళ్లిన బిడ్డ, పట్నంలోనే చిక్కుకుపోయి, తమ పల్లెకు రాలేక, ఒంటరిగా, దిగులుగా, తినీ తినక ఎలా ఉన్నాడో అన్న ఆలోచన అతలాకుతలం చేస్తుంటే..

విదేశంలో ఉన్న బిడ్డలకు కరోనా గండం చుట్టుకోకూడదని మొక్కుకుంటూ, వీసా అవస్థలతో భవిష్యత్తు అయోమయమైన బిడ్డలు, దిగులుతో దీనవదనంతో వాట్సాప్ వీడియోటాక్‌లో ముందు నిలిస్తే సాంత్వన వచనాలతో, ధైర్యం చెపుతూ, ఆత్మస్థైర్యాన్నిస్తూ, తన బాధను, భయాన్ని తనలోనే అదిమిపడుతూ ఎందరెందరు తల్లులు..

ఉన్నపళాన ఉద్యోగాలు ఊడి, ఉద్యోగం ఉన్నా నామమాత్రపు జీతంతో నైరాశ్యంతో బిడ్డలు నీరుగారి పోతుంటే బిడ్డకు ఎంత కష్టం వచ్చిందని బాధపడుతూనే, కష్టాలు కలకాలం ఉంటాయా అని ధైర్యం చెప్పే అమ్మలు.

ఇదంతా ఓ వైపు దృశ్యం. మరోవైపు దృశ్యాన్ని అవలోకిస్తే.. మొన్న స్నేహ ఫోన్ చేసి … ‘ఆంటీ.. ఈ లాక్‌డౌన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, పిల్లలతో కాసింత ఎక్కువ సమయం గడిపినట్లు అనిపిస్తోంది. ఇది వరకు ఆఫీస్ నుంచి వచ్చాక మా చైత్ర అన్నం తినిపించమంటే అలసి ఉన్న నేను విసుక్కునేదాన్ని. చాలా రోజుల తర్వాత ఇప్పుడు చైత్రకు స్వయంగా అన్నం తినిపిస్తున్నా. మొన్న మా చైత్ర నా బొమ్మ వేసింది. ఓ పెద్ద సున్నా చుట్టి దాంట్లో కళ్లు, ముక్కు, రెండు వైపులా చెవులు, పువ్వుల చుడీదార్, తల పైన క్లిప్పు.. దాని ప్రయత్నం ముచ్చటేసింది. బొమ్మ కింద ‘మా అమ్మ’ అని క్యాప్షన్ కూడా రాసింది. ఎంత సంతోషం అనిపించిందో’ మురిపెంగా ఎంతో సేపు బిడ్డ ముచ్చట్లు చెప్పింది. పిల్లలతో ఇండోర్ గేమ్స్ ఆడిస్తూ, కథలు చెపుతూ, వాళ్లకు కావలసినవి వండి పెడుతూ.. బిడ్డలతో ఆనందంగా గడుపుతున్న అమ్మలు.. చక్కటి దృశ్యమే కదా. అసలు ‘అమ్మ’ అన్న పిలుపే ఎంతో మధురమైంది అనుకుంటుంటే.. ‘నానీ’ చిత్రానికి చంద్రబోస్ రాసిన పాట గుర్తుకొచ్చింది. ఉన్నికృష్ణన్, సాధన సర్గమ్ పాడిన పాట అది..

‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మ..
తనలో మమతే కలపి పెడుతుంది ముద్దగ
తన లాలిపాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ..
మనలోని ప్రాణం అమ్మ..మనదైన రూపం అమ్మ..

అన్నట్లు ‘అమ్మ రాజీనామా’ చిత్రంలో చిత్ర పాడిన మరో మంచి అమ్మ పాట ఉంది..

ఎవరు రాయగలరూ…
‘అమ్మ’ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు
‘అమ్మ’ అను రాగం కన్న తీయని రాగం
అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి..
అవతారమూర్తయినా అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు..

నిజమే.. రాముడైనా, కృష్ణుడైనా కౌసల్య తనయుడు, దేవకీ సుతులేగా. సిరివెన్నెల ఎంత గొప్పగా రాశారో ఈ పాటను. అమ్మంటే కన్నతల్లి మాత్రమే కాదు, పెంచిన తల్లి ప్రేమలో ఏమాత్రం తీసిపోదు. కృష్ణుణ్ణి దేవకి కన్నా, కంటి రెప్పలా కాచి, పెంచింది యశోదే. ఆ మాటకొస్తే కౌసల్య తనయుడు రాముణ్ణి కూడా మంథర దుర్బోధ చెవిన పడనంతవరకు కైకేయి అమిత ప్రేమతో చూసింది. ‘కుటుంబం’ చిత్రానికి సినారె అందించిన పాట..

అమ్మా.. అమ్మా.. చల్లని మా అమ్మా..
ఓ త్యాగమయీ.. అనురాగమయీ మా అమ్మా…
కన్నతల్లిని ఎరుగములే.. మే మెరుగములే
మము పెంచిన తల్లివి నీవేలే
అమ్మను మించిన అమ్మవులే.. మా అమ్మవులే
ఆ దేవుని మించిన దేవతవే
ఓ త్యాగమయీ..అనురాగమయీ..మా అమ్మా..
ఎవరో దేవుడు ఎందుకులే.. మాకెందుకులే
మా పాలిటి దైవము నీవేలే
మమతలు పొంగే హృదయములో.. నీ హృదయములో
మా స్వర్గాలన్నీ ఉన్నవిలే.. ఓ త్యాగమయీ..

ఎంతటి అర్థవంత మైన పాట!

ఈలోకంలో తల్లిలేని బిడ్డలెందరో పెంపుడు తల్లుల ప్రేమతో పెరిగి, పెద్దయిన వారున్నారు.

మహిళలు ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగినులయ్యాక పిల్లల పెంపకం సమస్యగా మారింది. ఇంట్లో పెద్దదిక్కు ఉన్నవారికి ఇబ్బంది లేకపోయినా ఎవరూ లేని సందర్భంలో, లేదా పెద్దవారు కూడా అనారోగ్యంతోనో, ఓపిక లేకుండానో ఉన్న సందర్భాల్లో పిల్లల పెంపకం కోసం కిడ్డీ కేర్ సెంటర్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాంటి సెంటర్ను నిర్వహించే మహిళలు, అక్కడి ఆయాలు కూడా తమ వద్ద చేర్చిన పిల్లల ఆలనాపాలనా చూసి, పసివారిని ప్రేమగా పెంచడం అదో కొత్త సమాజ చిత్రం. మరి తమ వద్ద ఉండే పసిపిల్లల సంరక్షణ చూసే క్రమంలో వారూ ఓరకంగా పెంచిన తల్లులే. ఆ పిల్లలు పెద్దయ్యాక కూడా వారిని గుర్తు పెట్టుకొని, ఆత్మీయత పంచిన ఉదంతా లెన్నో చూస్తున్నాం. ఇలాంటి సెంటర్స్‌లో పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ ఎక్కడో ఒకటీ, అరా అలా ఉండవచ్చేమో కానీ మెజారిటీ కిడ్స్ కేర్ సెంటర్లు సక్రమంగానే ఉన్నాయనుకోవచ్చు. వివాహం విఫలమయి, విడాకులు పొందిన ఎందరో మహిళలు సింగిల్ పేరెంట్‌గా పిల్లలను తమ ప్రేమానురాగాలతో సమర్ధవంతంగా పెంచి, పెద్దచేయటం తెలిసిందే.

నేటికాలంలో అభివృద్ధి చెందిన శాస్త్ర విజ్ఞానం కారణంగా ‘సరోగేట్ మదర్స్’ అయిన మహిళలూ ఉన్నారు. ధన అవసరాల నిమిత్తమే సరోగసీకి ఒప్పుకున్నా ఆమె కడుపులో పెరిగే బిడ్డ పై సహజమైన ప్రేమ ఎక్కడికి పోతుంది? బిడ్డ పుట్టాక ఆమె నుంచి దూరంచేసే క్షణాన ఆ తల్లి మనసు పడే వేదనకు అక్షరాలెక్కడ వెదకగలం?

అసలు ప్రతి మహిళలోనూ మాతృభావన సహజంగానే ఉంటుంది. అందుకే ఎక్కడనుంచో చంటిబిడ్డ ఏడుపు వినిపించినా తన బిడ్డే అన్నట్లు ఉలిక్కిపడుతుంది. ఎవరిబిడో తుమ్మినా అప్రయత్నంగానే ‘చిరంజీవ’ అంటుంది.

బిడ్డలకోసం తల్లి పడే ఆరాటం, అవసరమైతే ప్రాణానికి తెగించైనాచేసే సాహసం నిత్య కథనాలే. ఇటీవల కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌లో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైన పరిస్థితులలో బోధన్ నుంచి ఓ తల్లి నెల్లూరులో చిక్కుకున్న కొడుకును క్షేమంగా తన దగ్గరకు తెచ్చుకోవాలన్న తపనతో డిజిపి అనుమతితో స్కూటీ మీద బయలుదేరి పధ్నాలుగువందల కిలోమీటర్లు ప్రయాణించి, దారిపొడుగునా అడ్డుకున్న పోలీసులకు తన పరిస్థితి చెప్పి, వేడుకొని, కొడుకును వెంట తెచ్చుకోవటం తెలిసిందే. బిడ్డలకోసం ఎన్నిత్యాగాలకయినా వెనకాడదు అమ్మ. ‘దస్విదానియా’ చిత్రంలో కైలాస్ ఖేర్ రచించి, స్వరపరచి, గానం చేసిన పాట ఒకటుంది. అది..

మా మేరీ మా.. ప్యారీ మా మమ్మా
హాథోం కీ లకీరే బదల్ జాయేంగీ
గమ్ కీ యే జంజీరే పిఘల్ జాయేంగీ
హో ఖుదా పే భీ అసర్
తూ దువా వోం కా హై ఘర్
మేరీ మా.. ప్యారీ మా… మమ్మా..
దునియా మే జీనే సె జ్యాదా ఉల్ఝన్ హై మా
తూ హై అసర్ కా జహా
తూ గుస్సా కర్తీ హై బడా అచ్ఛా లగ్తా హై
తూ కాన్ పకడ్లీ హై బడీ జోర్ సె లగ్తా హై ॥మేరీ మా.. ॥

ఎంత చక్కటి పాట!

‘అమ్మ’ అనగానే ‘మాతృదేవోభవ!’ చిత్రం గుర్తొస్తుంది. తాను త్వరలో కన్నుమూస్తానని తెలిసి, పసివాళ్ళైన తన పిల్లల గురించి బెంగటిల్లి, తాను కన్నుమూసే లోపు తన పిల్లల బాధ్యతను ఆశ్రమాలకు కాక, మంచికుటుంబాలకు అప్పగించాలన్నది ఆమె ఆరాటం. ప్రేక్షకుల కళ్లే కాదు, హృదయమూ వర్షింపజేసే గొప్ప భావోద్వేగాల చిత్రమది.

‘వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం.. వాంఛలన్నీ వాయులీనం…

వేటూరి కలంతో చిత్రగారి గళం పోటీపడ్డ పాట యిది. అమ్మ హృదయంలోని ఆర్తిని ప్రతి అక్షరంలో పొదిగిన గీతం. ప్రేమానురాగాలకు, త్యాగాలకే కాదు వీరత్వానికి అమ్మ ప్రతిరూపం. అలనాడు ఝాన్సీ లక్ష్మీబాయి పసివాణ్ణి వీపున కట్టుకుని మరీ కదనరంగంలో వీరవిహారం చేయటం చరిత్ర చెప్పే సత్యం. నేడు సైతం సైనికరంగంలో మహిళలు పురోగమించటం తెలిసిందే. బిడ్డలను ఆర్మీకి పంపి త్యాగమాతలుగా నిలవటమేకాదు, బిడ్డలు రణరంగంలో వీరమరణం పొందితే తమను తామే నిబ్బరించుకుంటూ వీరమాతలుగా గర్వించే అసాధారణ వనితలెందరో. అంతెందుకు, నేటి కరోనా విపత్కర పరిస్థితులలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసీ, బిడ్డలు తమ సేవా విధులందిస్తుంటే వారి మాతృమూర్తులు ఆందోళనకు గురవుతూ, వారి క్షేమం కోసం మనసులోనే నిరంతర ప్రార్థనలు చేయటం లేదూ. డాక్టరమ్మలు, నర్సమ్మలు రోగుల పాలిట తల్లులే. రోగులకు కేవలం యాంత్రికంగా వైద్యం చేయటమే కాదు, ఆత్మీయమైన పలకరింపులతో వారి మనసులకూ సాంత్వన చేకూరుస్తుంటారు.

అమ్మకు, అన్నానికి అవినాభావ సంబంధం ఉంది. బాల్యంలోనే కాదు, పెద్దయినా అమ్మ స్వహస్తాలతో వడ్డిస్తే తినే తృప్తే వేరు. బిడ్డ ఆకలి అమ్మకే బాగా తెలుస్తుంది. తన కుటుంబానికే కాదు, సమాజంలోని ఇతరులకు తమకు చేతనైనంతలో తమ అమృత హస్తాలతో అన్నం పెట్టే అమ్మలెందరో ఉన్నారు. అన్నదానంలో మిన్నగా నిలిచి, అన్నపూర్ణగా ఖండాంతర ఖ్యాతి నార్జించిన డొక్కా సీతమ్మ అభ్యాగతులెందరి హృదయాలలోనో అమ్మగా నిలిచారు. ఈ కరోనా కష్టకాలంలోను అభాగ్యులకు, ఆకలిదప్పుల్లేకుండా విధులు నిర్వహిస్తోన్న రక్షకభటులకు భోజనం అందిస్తోన్న అమ్మలనూ మనం చూస్తున్నాం.

ఇక ఎక్కడో పుట్టి, మనదేశానికి వచ్చి దీనజనోద్ధరణకే జీవితాన్ని అంకితం చేసి, సేవాశ్రమాలను నెలకొల్పి ‘అమ్మ’గా కొనియాడబడ్డ మదర్ థెరిసాను ఎలా మరువగలం? అసలు దేవుళ్ల పరంగానూ అమ్మను ఆరాధించే సంస్కృతి మనది. త్యాగరాజయితే సీతారాములనే తల్లిదండ్రులుగా భావించాడు. అందుకే ‘సీతమ్మ మా యమ్మ… శ్రీరాముడు మాకు తండ్రి.. వాతాత్మజ సౌమిత్రి, వైనతేయ రిపు మర్దన, త భరతాదులు సోదరులు మాకు ఓ మనస.. సీతమ్మ మా యమ్మా.. అని తాదాత్మ్యంతో కీర్తించాడు.

రామదాసు సైతం..
‘ననుబ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లీ నను బ్రోవమని చెప్పవే.. నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి
జనకుని కూతురా జననీ జానకమ్మా అని భక్తి పూర్వకంగా వేడుకుంటాడు.

‘కామాక్షి.. అంబకామాక్షి.. అనుదినం మరువకనే
నీ పదములె దిక్కనుచు నమ్మితిని శ్రీకంచి కామాక్షి అని శ్యామశాస్త్రి భైరవిలో విన్నవించుకోవటం తెలిసిందే. ముత్తుస్వామి దీక్షితార్ ‘అమ్మ’ను భజిస్తూ ఎన్నో కీర్తనలు రాశారు. ‘సరసిజనాభ సోదరీ, శంకరీ పాహిమాం’ అంటూ నాగగాంధారిలో పాడిన కీర్తన ఓ మచ్చుతునక. ఇలా ఎందరెందరో. పోతన, చదువుల తల్లి సరస్వతిని అమ్మగా సంభావించటం గమనించవచ్చు.

ఆంధ్రమహాభాగవతాన్ని రాజుకి అంకితమివ్వమని పోతనపై వత్తిడి పెరిగిన సందర్భంలో, ఓరోజు శారదాంబ కన్నీరు కారుస్తూ ప్రత్యక్షమయిందట. దాంతో పోతన వెంటనే…

‘కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభ, దైత్య మర్దనుని, గాదిలికోడల! యో మదంబ! యో
హాటక గర్భురాణి! నిను నా కటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాటకీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

అని పద్యంలోనే హృద్యంగమంగా తన మనసులో మాట చెప్పాడు. స్వామి వివేకానంద సైతం ‘కాళీ ద మదర్’ పేరిట ఓ గొప్ప పోయమ్ రాశారు. అది..

ది స్టార్స్ ఆర్ బ్లాటెడ్ ఔట్
ది క్లౌడ్స్ ఆర్ కవరింగ్ క్లౌడ్స్
ఇటీజ్ డార్క్ నెస్ వైబ్రెంట్ సొనంట్
ఇన్ ది రోరింగ్, వర్లింగ్ విండ్…
ఎ థౌజండ్ థౌజండ్ షేడ్స్
ఆఫ్ డెత్ బిగ్రిమ్డ్ అండ్ బ్లాక్
స్కాటరింగ్ ప్లేగ్స్ అండ్ సారోస్
డాన్సింగ్ మ్యాడ్ విత్ జాయ్
కమ్ మదర్, కమ్
ఫర్ టెర్రర్ ఈజ్ దై నేమ్
డెత్ ఈజ్ ఇన్ దై బ్రెత్…
హు డేర్స్ మిజరి లవ్
అండ్ హగ్ ది ఫామ్ ఆఫ్ డెత్
డాన్స్ ది డిస్ట్రక్షన్స్ డాన్స్
టు హిమ్ ద మదర్ కమ్స్!..

పద్దెనిమిదివందల తొంభై ఎనిమిదిలో కాశ్మీర్‌లో ఉండగా దాల్ లేక్ పైని హౌస్‌బోట్‌లో వివేకానందుడు రాసిన పోయమ్ ఇది.

ప్రఖ్యాత రచయిత రుడ్‌యార్డ్ కిప్లింగ్ అమ్మపై ఓ మంచి కవిత రాశారు. అది..

ఇఫ్ ఐ వర్ హేంగ్డ్ ఆన్ ది హై య్యెస్ట్ హిల్
మదర్ ఒ మైన్, ఒ మదర్ ఒ మైన్
ఐనో హూజ్ లవ్ వుడ్ ఫాలో మి స్టిల్..
ఇఫ్ ఐ వర్ డ్రౌన్డ్ ఇన్ ది డీపెస్ట్ సీ
మదర్ ఒ మైన్, ఒ మదర్ ఒ మైన్
ఐనో హూజ్ టియర్స్ వుడ్ కమ్ డౌన్ టు మి
మదర్ ఓ మైన్..
ఇఫ్ ఐ వర్ డామ్డ్ ఆఫ్ బాడీ అండ్ సోల్
ఐ నో హూజ్ ప్రేయర్స్ వుడ్ మేక్ మి హోల్
మదర్ ఓ మైన్ ఒ మదర్ ఒ మైన్!

మాక్సిం గోర్కీ ‘అమ్మ’ పేరుతో ఓ గొప్ప నవల రాశారు. రష్యన్ విప్లవోద్యమం నేపథ్యంలో రాసిన ఈ నవల వందేళ్లకంటే ఇంకా ముందే రాసిందే అయినప్పటికీ ఎన్నో భాషల్లో అనువాదం అవటమే కాక, దేశదేశాలలో భిన్నకాలాలలో పాఠకులను ఆకట్టుకున్న, ఆకట్టుకుంటున్న పుస్తకం.

ఆధ్యాత్మిక గురువులుగా ఎందరో అమ్మలున్నారు. మాతా అమృతానందమయి ‘హగ్గింగ్ సెయింట్’ గా పేరొందారు. ఆమె తన ఆత్మీయ ఆలింగనంతోనే భక్తులకు సాంత్వన చేకూర్చటం చూస్తూనే ఉన్నాం.

అమ్మ ఎంత బాగా పెంచినా, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్లనో, దుర్బుద్ధితోనో దారి తప్పే పిల్లలందరూ ఏదో ఒక రోజున పశ్చాత్తాప పడవలసిందే.

‘పాండురంగ మహాత్మ్యం’ చిత్రంలో..

అమ్మా అని పిలిచినా ఆలకించరావేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా..
పదినెలలు ననుమోసి పాలిచ్చి పెంచి
మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసినా
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితీ
తలపకమ్మ తనయుని తప్పులు క్షమియింపవమ్మ…

పశ్చాత్తాపంతో పుండరీకుడు పాడేపాట యిది.

అసలు ఈ ప్రకృతి అంతా అమ్మ ఒడిలాగే దర్శనమిస్తుంది. నేలతల్లి, నదీమతల్లి, అమ్మ చెట్టు.. ఇలా ఎన్నింటినో అమ్మగానే సంభావించుకుంటాం. తల్లి ప్రేమ మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ గమనించవచ్చు. బిడ్డకు ఆహారాన్ని తెచ్చి పెట్టి పెంచి పెద్దచేసే పక్షులు, తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాలిచ్చి పెంచే క్షీరదాలు, ఆహార సంపాదనను, బతుకు తెలివిని తన పిల్లలకు నేర్పే జంతువులు ఎన్నెన్నో మన కళ్లముందే ఉన్నాయి. దేవుడు ప్రతిచోట ఉండలేక అమ్మను యిచ్చాడంటారు. కానీ అలాంటి అమ్మకు నేటి కాలంలో చాలాచోట్ల దీనావస్థ తప్పటం లేదు. అలసిన రెక్కల అమ్మకు బిడ్డల నీడన సేదతీరే పరిస్థితి లేదు. అనాథ ఆశ్రమాలో, వృద్ధాశ్రమాలో దిక్కవుతున్నాయి. అమ్మను ప్రేమించమని ఒకరు చెప్పవలసి రావటం శోచనీయమైన స్థితి. నవమాసాలు మోసి, పురిటి గండాలకు ఎదురీది బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. పాలిచ్చి, లాలపోసి, జోలపాడి, బిడ్డను కంటికి రెప్పలా సాకుతుంది. తన బిడ్డ బాగా చదువుకుని, పెద్ద పదవు లందుకోవాలని, పదిమందిలో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటుంది.

అందుకు సదా అండగా ఉంటుంది. తన కల నిజమైతే కొండంత పొంగిపోతుంది, కొండెక్కి మొక్కులు తీర్చుకుంటుంది. అటువంటి ‘అమ్మ’ను దేవతగా కాదు, తనలోని ప్రాణమే ఆమె అనే గుర్తింపుతో ఆత్మీయత పంచితే చాలు, అమ్మ హృదయం ఆనందాల నదే అవుతుంది.. ఆనందనందనమే అవుతుంది. అమ్మల దరహాసాలే అవనికి ఆశీస్సులు’ అనుకుంటూ ఉంటే ఎక్కడినుండో ‘మ్యావ్, మ్యావ్’ అని పిల్లిపిల్ల పిలుపు వినపడటంతో ఆలోచన ఆగింది. తెల్లటి, బుజ్జిపిల్లి మళ్లీ మళ్లీ పిలుస్తూ తన అమ్మను వెతుక్కుంటూ వెళుతోంది. తలపుల్లో సమయం తెలియలేదు. బాప్‍రే.. చిక్కని చీకటి.. లైట్ వేయాలనుకుంటూ ఇంటిలోపలకు నేను, అజ్ఞాతంలోకి ఆలోచన!

Exit mobile version