Site icon Sanchika

మానస సంచరరే-43: ఆనందాల చిరునామా.. ఆట!

[box type=’note’ fontsize=’16’] “ఆటను సీరియెస్‌గా తీసుకొని, చివరివరకూ గెలుపుకోసం కృషిచేసేవారు జీవితాన్ని ఆటగా తీసుకుంటే ఫర్వాలేదు. అప్పుడు జీవితంలోనూ గెలుపు బావుటాను ఎగురవేస్తారు” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]పి[/dropcap]ల్లల కేరింతలు, అరుపులు.. దీనంతటి చిరునామా పక్క ఇల్లు. లాక్‌డౌన్ నేపథ్యంలో పిల్లలకు ఇన్‌డోర్ గేమ్సే దిక్కయ్యాయి. మొన్నటివరకు ఏ మూలో పడేసిన క్యారంబోర్డులు, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ బోర్డులు వగైరాలు వాడకానికి వచ్చాయి. కొంత సేపటికి ‘నువ్వు తొండి ఆడావు’ పాప అరుస్తోంది. ‘నువ్వే తొండి’ బాబు దబాయిస్తున్నాడు. ‘నేనాడను పో’ పాప.. ‘చూడు మమ్మీ నేను గెలుస్తానని ఆట చివర్లో ఆడనని వెళ్లిపోతోంది’ బాబు ఫిర్యాదు. ‘ఆడేది తక్కువ, తగాదాలు ఎక్కువ’ వాళ్లమ్మ విసుక్కుంటోంది.. నాకు నవ్వు వచ్చింది. అదే క్షణంలో నా మనసు ఓ పాటను తలపోసింది..

ఆడుతుపాడుతు పనిచేస్తుంటే
అలుపుసొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే
ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది…

నిజమే. ఏ పని అయినా భారంగా భావిస్తే అది మరింత భారం అవుతుంది. అదే పనిని కూడా ఓ ఆటలా భావించి, దాని మీద ఇష్టం, శ్రద్ధ పెంచితే ఎంత పనయినా చేసేయవచ్చు.

అసలు మనిషికి పసిపాపగా ఉన్నప్పుడే ఆటవస్తువులు పరిచయమవుతాయి. పసిపిల్లల చేతికిచ్చే మొదటి ఆటవస్తువు గిలక్కాయ. పసిపాప తమ చిట్టి చేతులతో గిలక్కాయను అటు, ఇటు తిప్పి కుతూహలంగా చూస్తూ, రుచి చూద్దామని నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆడుకోవటం చూడముచ్చటైన దృశ్యం. ఆ తర్వాత కొద్దిగా పెద్దయ్యాక రబ్బరు బొమ్మలు ఇస్తుంటారు. రంగుల బొమ్మలు వారిని బాగా ఆకర్షిస్తాయి. పిల్లల బొమ్మల్లో కూడా ఆడ, మగ తేడాలు నిన్న మొన్నటి వరకు ఉండేవి. ఆడపిల్లకు కిచెన్ సెట్‌ల వంటివి కొని, మగపిల్లలకు కార్లు, విమానాలు, బైక్‌లు వంటివి కొనిచ్చేవారు. మహిళలు అనేక క్రీడల్లో రాణిస్తున్న నేటి తరుణంలో కూడా ఇంకా వివక్ష పూర్తిగా పోలేదనిపిస్తుంది.

బాల్యంలో ఆటలుంటే అన్నం కూడా అక్కర్లేదన్నట్లుగా ఉంటారు చాలామంది పిల్లలు. బడి అంటే ఇష్టం లేని పిల్లలకు కూడా గేమ్స్ పీరియెడ్ అంటే చెప్పలేనంత ఇష్టం.. ప్లే గ్రౌండ్‌లో వారి స్వేచ్ఛకు హద్దులే ఉండవు. ఆటలతో పిల్లలు సన్నిహితమవుతారు, స్నేహితులవుతారు. ఆ ఆటల ముచ్చట్లు పెద్దయ్యాక తీపి గురుతులవుతాయి.

మనుషులకేమిటి, దేవుళ్లకూ ఆటలంటే మక్కువే. తిరుమల బాలాజీ, హథీరామ్ భావజీతో పాచికలాడాడని చెపుతారు. అలాగే కంచి కామాక్షి అమ్మవారు కూడా ఆదిశంకరాచార్యుల వారితో పాచికలాడినట్లు తెలుస్తుంది. ఇక భారతంలో ధర్మరాజు పాచికలాట వ్యసనంతోనే పతనమవడం తెలిసిందే. అంతేకాదు, పాండవులు బాల్యంలో బంతి ఆట ఆడుతుంటే, అది బావిలో పడటంతో దాన్ని తీయడమెలా అని వారు ఆలోచిస్తున్న తరుణంలో ద్రోణుడు ప్రవేశించి, బాణాలతో ఆ బంతిని పైకితీస్తాడు. ఆ తర్వాతే కౌరవ, పాండవులకు ద్రోణుడు గురువవుతాడు. పల్నాటి చరిత్రలో బాలచంద్రుడు వీధిలో బొంగరాల ఆట ఆడుతుండగా, అది వెళ్లి తోవన వెళ్తున్న ఓ మహిళ కాలికి తగలడం, ములుకు గుచ్చుకోవడం ఆ మహిళ కోపించి, ‘అవతల మీ తండ్రి యుద్ధం చేస్తుంటే నువ్విక్కడ బొంగరాలు ఆడుతూ కూర్చుంటావా?’ అని కోపగిస్తుంది. ఇక శ్రీకృష్ణుడు గోపబాలలతో, గోపికలతో ఆట లాడడం భాగవతంలో చదువుతాం. పెళ్ళిళ్లలోనూ వధూవరుల చేత పూబంతులాట ఆడించే సంప్రదాయం ఉంది.

ఆటలంటే సందడే సందడి. అలాటి సందడిని ప్రతిపదంలో వినిపించే పాట…

ముత్యాల చమ్మాచక్కా.. రత్నాల చమ్మాచక్కా
ఓ చెలి మురిపెముగా ఆడుదమా, పాడుదమా
కలకలకిలకిల నవ్వులతో, గాజులు గలగలలాడ..

హుషారైన ఈ పాటను ‘బొబ్బిలి యుద్ధం’ చిత్రం కోసం ఆరుద్ర అందించారు.

ఇలాంటిదే మరో పాట

జలకాలాటలలో.. గలగలపాటలలో
ఏమిహాయిలే హలా.. అహ ఏమి హాయిలే హలా..

చాలా హిట్ సాంగ్.

పిల్లల ఆటలు సూర్యచంద్రులను కూడా మెప్పిస్తాయని చెప్పే పాట..

సన్నజాజితీవెలోయ్.. సంపంగి పూవు లోయ్
చిలిపి చిన్నారులోయ్.. పాపలు సిరులొలికే చిన్నారులోయ్
ల్లలలా ల్లలలా…
దాగుడుమూతలాడితే సూరీడు మెచ్చేను
చమ్మాచక్కాలాడితే చందమామ మెచ్చేన
అ చమ్మచక్కా చారడేసిమొగ్గా
ఇల్లు పీకి పందిరేసి పకపకలాడితే
పిల్లలున్న లోగిలని దేవుడె మెచ్చేను…

మ్యూజికల్ చెయిర్‌కు సంబంధించిన పాటొకటి గుర్తుకొస్తోంది..

పాట ఆగిందా.. ఒకరి సీటు గోవిందా
సీటు పోయిందా.. ఒకరి ఆట గోవిందా..

‘కలెక్టర్ జానకి’ చిత్రంలో హుషారైన ఈ పాటను సినారె ఆ సందర్భానికి తగినట్లుగా ఎంతో బాగా రాశారు.

ఆటల్లో రెండు రకాలు.. ఇండోర్ గేమ్స్, అవుట్ డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అంటే ఇంట్లోనే ఆడుకునేవి. ఇందులో పాత, కొత్తలు ఉన్నాయి. ఇంట్లో ఆడుకునే ఆటలు కోకొల్లలు.. అష్టాచెమ్మా, పచ్చీసు, పులి-మేక, వామనగుంతలు, వైకుంఠపాళి, క్యారమ్స్, చెస్, చైనీస్ చెకర్స్, పేకాట, బిజినెస్ వగైరాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు. పల్లెల్లో ఇంటిముంగిట్లోనే ఆడే దాగుడుమూతలు, నేల బండ, తొక్కుడుబిళ్ల, కుంటాట, నాలుగు రాళ్ల ఆట.. మొదలైనవి.. ఇక ఓ కాగితం, పెన్సిల్ లేదా పలకా, బలపం ఉన్నా ఆడుకోగల ఆటలూ ఉన్నాయి. మచ్చుకు సున్నాలు పెట్టి, వాటిని కలుపుతూ ఇళ్లు కట్టే ఆట.

అవుట్ డోర్ గేమ్స్ మనదేశంలో బాగా వాడుకలో ఉన్నవి చెప్పుకోవాలంటే కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఖోఖో, మ్యూజికల్ చెయిర్స్ ఇలా ఎన్నెన్నో. రన్నింగ్, కుస్తీ, షూటింగ్, ఆర్చరీ.. వగైరాలు మరోరకం. వాటర్ స్పోర్ట్స్‌లో స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ ఏరోబిక్స్, వాటర్ పోలో, బోట్ రేసింగ్ స్కీయింగ్, సర్ఫింగ్, వేక్ బోర్డింగ్, రోయింగ్, సెయిలింగ్, రాఫ్టింగ్. ఇలా ఎన్నెన్నో.. ఇక గగనవీధిలో ఆడే ఆటలు ప్యారాచూటింగ్.. అదే స్కై డైవింగ్, హ్యాంగ్ గ్లైడింగ్, పారా గ్లైడింగ్, బంగీ జంపింగ్, బేస్ జంపింగ్.. ఇలా ఎన్నో.

మన జాతీయ క్రీడ హాకీ. ధ్యాన్‌చంద్ హాకీ పితామహుడుగా పేరొందారు. మనకు ఎన్ని ఆటలున్నా క్రికెట్‌కు ఉన్న క్రేజే వేరు, క్రికెట్ మ్యాచులు జరిగే రోజుల్లో అందరి దృష్టి దానిమీదే. ఉత్కంఠతో అందరి కళ్లు టీవీలకు అతుక్కుపోయే ఉంటాయి. శతకవీరులు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచు ప్రేక్షకుల మది దోచుకుంటారు. కపిల్ దేవ్, సచిన్, అజరుద్దీన్, గంగూలీ, యువరాజ్, ధోని, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి.. వగైరా – పేర్లు తెలియని వారుండరేమో. సచిన్ తెందూల్కరకు ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అని నిక్ నేమ్ కూడా ఉంది. కరోనా కారణంగా క్రికెట్ సందళ్లు కూడా సద్దుమణిగాయి. నేషనల్ గేమ్స్, ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ సీజన్లలో అందరి నోటా ఆటల మాటలే. ఇటీవలి కాలంలో క్రికెట్ బెట్టింగ్లు కూడా మొదలయ్యాయి. క్రీడారంగంలో స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచినవారెందరో ఉన్నారు.

క్రీడలు, క్రీడాకారుల జీవితాలు కథాంశాలుగా ఎన్నో సినిమాలు వచ్చాయి. షత్రంజ్ కే ఖిలాడీ, చక్ దే ఇండియా, లగాన్, మేరీకోమ్, దంగల్, బెండ్ ఇట్ లైక్ బెక్ హామ్, గోల్డ్, మిలియన్ డాలర్ ఆర్మీ, సాలా ఖదూస్, బుధియా సింగ్, ఎమ్.ఎస్. ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ, సుల్తాన్, పాన్ సింగ్, అజహర్, ఇక్బాల్, పాటియాల హౌస్, సచిన్: ఎ బిలియన్ డ్రీమ్.. ఎన్నెన్నో ఈ రకం సినిమాలు హిందీతో పోలిస్తే తెలుగులో కొంత తక్కువే. జెర్సీ, కౌసల్యాకృష్ణమూర్తి, గురు, మజిలీ, బిజిల్, కబడ్డీ కబడ్డీ, భద్రాచలం, ఒక్కడు, సై, తమ్ముడు, భద్రాచలం, భీమిలీ కబడ్డీ జట్టు, అశ్విని, అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి వగైరాలున్నాయి.

అయితే ఇటీవల కాలంలో ఆటల్లో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ వచ్చాయి. వీడియో గేమ్స్‌తో పిల్లలు సమయం వృథా చేసుకుంటున్నారని, అలాటి గేమ్స్ వల్ల శారీరక దారుడ్యం ఏమీ సమకూరదని పెద్దలందరూ వాపోయారు. ఆ తర్వాత మరింత ప్రమాదకరమైన ఆన్‌లైన్ ఆటలొచ్చాయి. ది బ్లూవేల్ గేమ్, పోక్ మాన్ గో గేమ్, ది పాస్ అవుట్ ఛాలెంజ్, ది కటింగ్ ఛాలెంజ్ వగైరాలు. వీటి వ్యామోహంలో పడి పిల్లలు ప్రమాదాల బారిన పడటం, కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగింది. చివరకు ఒకరినొకరు చావగొట్టుకునే ఆటలు ఆడి ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలున్నాయి.

ఇక కారు రేస్లు, బైక్ రేస్లు, గుర్రపుపందాలు వంటి వ్యసనాలు ప్రాణాంతకాలు, దివాలా తీయించేవి. పేకాటతో ఎన్ని కుటుంబాలు ఛిద్రమయ్యాయో, అవుతున్నాయో చెప్పలేం. పేకాటకు సంబంధించి ‘కులగోత్రాలు’ చిత్రంలో కొసరాజుగారు రాసిన ఓ మంచి పాట ఉంది. అది..

అయ్యయ్యో .. చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో.. జేబులు ఖాళీ ఆయెనే..
ఉన్నది కాస్తా ఊడింది.. సర్వమంగళం పాడింది..
పెళ్లాం మెడలో నగలతో సహా తిరుక్షవరమైపోయింది…
అయ్యయ్యో..
గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు.
మళ్లీ ఆడి గెల్వవచ్చు
ఇంకా పెట్టుబడెవడిచ్చు
ఇల్లు కుదువ బెట్టవచ్చు
ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు
పోతే..
అనుభవమ్ము వచ్చు
చివరకు జోలె కట్టవచ్చు.. అయ్యయ్యో

ఈ పాట వినడానికి సరదాగా ఉన్న చివరి మాటను చెవినెక్కించుకుంటే డబ్బుతో పేకాట ఎంత ముప్పు తెస్తుందో తెలుస్తుంది. కోడిపందేలు, ఎడ్లపందాలు ఇలాంటివే.

క్రీడాస్ఫూర్తిని శక్తిమంతంగా తన పాటల్లో నింపిన వారిలో సుద్దాల అశోక్ తేజ ఒకరు. ‘భద్రాచలం’ చిత్రానికి ఆయన రాసిన పాట..

ఒకటే జననం.. ఒకటే మరణం
ఒకటే గమనం..ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకు అలుపులేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకూ
కష్టాలు రానీ, కన్నీళ్లు రానీ, ఏమైనాగానీ ఎదురేదిరానీ
వద్దు రాజీ పడొద్దు నిద్రా నీకొద్దు నీకేది హద్దు..

ఆయన రాసిన మరో అద్భుతమైన పాట

అవరోధాలను అధిగమించుతాం
అపజయాలను గెలిచి తీరుతాం
నారీలాగివదిలిన బాణంలా
గెలుపు పతాకై పరిభ్రమిస్తాం.. విజయదుందుభై ప్రతిధ్వనిస్తాం..
ఆశాభంగాలెన్నైనా.. అవమానాలే ఎదురైనా
అభంగతరంగ నదీగంగలా
జలపాతాలై ఎగిసిదూకుతాం..
మట్టి లోనుండి దేశభక్తిని
గాలిలో నుండి మంత్రస్ఫూర్తిని
నీటిలో నుండి ప్రవాహశక్తిని అందిపుచ్చుకుంటాం
సమూహమై సైన్యంగా మహోన్నతోన్నత గిరుల జయిస్తాం.
రాష్ట్రపతాకను, దేశంలో.. దేశపతాకను, విశ్వంలో
ప్రతిష్ఠించుటకు పతిజ్ఞచేసి అవరోధాలను గెలిచి తీరుతాం.
తారతమ్యాల బేధమే లేని.. వర్ణవర్గాల వాదమేరాని
భాషాద్వేషం జోలికే పోని ఆట ప్రాణమంటాం…

వింటుంటేనే గొప్ప ఉత్సాహం..

ఇకపోతే జీవితాన్నే ఒక ఆటగా భావించేవాళ్లు ఎందరో. ‘కొండవీటి దొంగ’ సినిమాలో వేటూరి రాసిన పాట ఇలా..

జీవితమే ఒక ఆట.. సాహసమే పూబాట..
నాలో ఊపిరి ఉన్నన్నాళ్లు ఉండవు మీకు కన్నీళ్లు
అనాధలైనా, అభాగ్యులైనా అంతా నావాళ్లు
ఎదురే నాకు లేదు నన్ను ఎవరూ ఆపలేరు…

అయితే ఎవరైనా ముఖ్యమైన విషయంపై సీరియస్‌గా లేకపోతే ‘ఆటగా ఉందా’ అంటాం. తమాషా అన్నట్లుగా. అలాకాక ఆటను సీరియెస్‌గా తీసుకొని, చివరివరకూ గెలుపుకోసం కృషిచేసేవారు జీవితాన్ని ఆటగా తీసుకుంటే ఫర్వాలేదు. అప్పుడు జీవితంలోనూ గెలుపు బావుటాను ఎగురవేస్తారు. గతంలో మన దేశంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, క్రీడారంగానికి పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం జరగకపోయినా, తర్వాత కాలంలో క్రీడా రంగానికి ప్రాధాన్యం పెంచారు. స్కూళ్లల్లో గేమ్స్ పీరియడ్ తప్పనిసరిగా ఉంటుంది. ఆటల పోటీలు స్కూల్లోను, స్కూళ్ల మధ్య, జిల్లాల మధ్య, రాష్ట్రాల మధ్య, జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో జరగడం తెలిసిందే. అంతర్జాతీయస్థాయిలో మెరిసిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు, ఇతర బహుమానాలు ఇవ్వడం, ఉద్యోగాల్లో సైతం స్పోర్ట్స్ కోటా క్రీడాస్ఫూర్తిని ఇనుమడింపజేసేందుకే. ఇంకా విశేషం దివ్యాంగులకు కూడా పారాలింపిక్ గేమ్స్ నిర్వహించడం.

అయితే ఆటల్లోను రాజకీయాలు, దుర్నీతులు చోటుచేసుకోవడం బాధ కలిగిస్తుంది. టీమ్‌లో చేర్చుకునే విషయంలో కొన్నిసార్లు అన్యాయాలు జరగడం తెలిసిందే. అలాగే ఆట నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం.. రన్నింగ్‌లో గెలవాలని స్టెరాయిడ్స్ తీసుకోవటం, క్రికెట్ బౌలర్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటం వంటివి తొండి కాక మరేమిటి?

ఇటీవల కాలంలో రాజకీయ రంగంలో ‘మైండ్ గేమ్’ అనే మాట వినిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయటం, వారిని మానసికంగా కృంగదీయటం ఈ మైండ్ గేమ్ లక్ష్యం. ప్రజా సేవను పక్కన పెట్టి ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి వాటికి పాల్పడటం గర్హనీయం. పరమాత్మ ఆడించే నాటకమే ఈ ప్రపంచం అని భక్తులెందరో భావిస్తుంటారు. తనికెళ్ల భరణిగారి ‘ఆటకదరా శివా, ఆట కద కేశవా… ఆటగదరా నీకు అమ్మతోడు..’ శివతత్వాలు ఎంతటి ప్రాచుర్యం పొందాయో తెలిసిందే. ‘ఆటకదరా శివ’ పేరుతో చంద్ర సిద్ధార్థ తీసిన చిత్రం కూడా ఉంది. బాగా గమనిస్తే ఆటకు బహుముఖాలు. ఏమైనా ఏ ఆటైనా నిజాయితీతో, నిబద్ధతతో ఆడితే గెలుపు ఖాయం. నా మనసనే మైదానంలో ఆలోచనల ఆట సాగుతుండగా ఫెళ ఫెళమంటూ ఉరిమిన శబ్దం.. వర్షం వస్తున్నానంటూ అరిచి మరీ చెపుతోంది. దాంతో నా ఆలోచనల ఆటకు అంతరాయం.. పీఛే ముడ్.

Exit mobile version