Site icon Sanchika

మానస సంచరరే-44: అంతులేని అంకెల లోకం!

[box type=’note’ fontsize=’16’] “’ఉన్నది ఒకటే జిందగీ’ అన్నది ఎంతైనా నిజం. అందుకే ఆ ఒక్క జిందగీని చిక్కులెక్క కాకుండా చూసుకోవడమే విజ్ఞత” అంటున్నారు జె. శ్యామల. [/box]

ఆదివార ఉదయాన..

టీ తాగుతూ, పేపర్ చదువుతున్న నాకు

‘ఏడుకొండల వాడా ఎక్కాడున్నావయ్యా
ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా….’

ఘంటసాల గానామృతం పేపర్ నుంచి నా దృష్టిని మరలించి ఆలోచనకు అంకురార్పణ చేసింది.. అవునూ.. సప్తగిరులపై వెలసిన స్వామి నెలవుకు చేరాలంటే అలిపిరి దారి నుంచి మూడువేల మూడువందల యాభై మెట్లెక్కాలి. ఆ పైన మనకు దొరకిన నిర్దిష్ట సంఖ్య గల బసకు చేరుకోవాలి. అంకెలు గల నోట్ల చెల్లింపుతో అందుకున్న ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పుచ్చుకుని, లేదంటే ధర్మదర్శనంలోనో కొన్ని వేల మంది ఉన్న క్యూలో, విశిష్ట ఆర్జిత సేవల కోవకు చెందినవారైతే నియమిత సంఖ్య గల క్యూలో నిలుచుని స్వామిని దర్శించుకోవాలి. అంకెలకు సంబంధించిన ప్రశ్నలు మనిషికి నిరంతరం ఎదురవుతూనే ఉంటాయి. అంటే మనిషి జీవితంలో అంకెలతో లంకె కొనసాగుతూనే ఉంటుంది.

అవునూ ఈ లాక్‌డౌన్ పుణ్యమా అని జీతాల్లో యాభై శాతం కోత చాలామందికి గుండెకోత అయింది. మరోవైపు కరెంటు బిల్లులేమో పొంతన లేకుండా వేలల్లో వచ్చాయి. ఇంకా నయం ఓ గుడిసె నివాసికి ఏకంగా ఎనిమిది లక్షల బిల్లు వచ్చిందట. ఇవేమి లెక్కలో! బిల్లు రూపొందించేవారికి లెక్క ఉండదు. కానీ డబ్బుల చెల్లింపులో లెక్క కచ్చితమే కదా. ధర్మం నాలుగు పాదాల కాదు కదా, ఒక పాదంతో కూడా కుంటుతూ నడుస్తోందనిపిస్తోంది. మళ్లీ నాలుగు.. అంకే కదా. ఆ మాటకొస్తే ముల్లోకాలు, పంచభూతాలు, పంచాగ్నులు, సప్త సముద్రాలు, నవగ్రహాలు, నవ ధాన్యాలు, సప్తర్షి మండలం, అష్ట దిక్కులు, అష్టలక్ష్ములు, అష్ట విధ నాయకలు, అష్టాదశ పీఠాలు, త్రిలింగదేశం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అరిషడ్వర్గాలు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు), బౌద్దమతంలో అష్టాంగాలు, త్రిపీటకాలు ఇలా ఎన్నో..

‘సాగర సంగమం’ చిత్రానికి వేటూరి రాసిన ఓ మంచి పాట గుర్తుకొస్తోంది.

ఓం… నమశ్శివాయ.. చంద్రకళాధర సహృదయా
సాంద్రకళా పూర్ణోదయాలయ నిలయా…
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై…
ప్రకృతి పార్వతి నీతో నడచిన
ఏడు అడుగులే స్వరసప్తకమై.. ॥ఓం॥
నీ దృక్కులే అష్ట దిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందారా
నీ మౌనమే
దశోపనిషత్తులై ఇల వెలయా..
ఓం..
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు, పాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమథాదులు నీ
సంకల్పానికి రుద్విజవరులై…

అంకెలన్నీ అద్భుతంగా, అర్థవంతంగా ఇమిడిన పాట ఇది. అవలోకిస్తే అంతటా అంకెలే.. ‘సూర్యాష్టకం’లో

ఆదిదేవ నమస్తుభ్యం… అంటూ
సప్తాశ్వరథమారూఢం
ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం.. అని స్తుతించటం తెలిసిందే.

అసలు దేవుళ్లందరినీ సుమారుగా లెక్కించి ‘ముక్కోటి దేవతలు’ అని చెప్పారు పెద్దలు. ఆ దేవుళ్లలో ఈశ్వరుడైతే త్రినేత్రుడిగా వర్ణితుడు. ఆయన కుమారులు ఏకదంతుడు, షణ్ముఖుడు. సరే తాత బ్రహ్మయ్య అయితే చతుర్ముఖుడు. త్రిలోకసంచారి నారదుడు. రావణ బ్రహ్మ దశకంఠుడు. వేదాలు నాలుగు. పురాణాలు పద్దెనిమిది. ఉప నిషత్తులు రెండొందల పైమాటే. షడ్దర్శనాలు వగైరాలు ఇంకెన్నో. చిన్నికృష్ణుడు, యశోదకు తన నోటిలో పదునాల్గు భువనాలను చూపించాడట. శ్రీరాముడు, సీతాలక్ష్మణులతో సహా పదునాలుగేళ్లు వనవాసం చేశాడు. హనుమాన్ చాలీసాలో ‘యుగ సహస్ర యోజన పర భాను.. లీల్యో తాహి మధుర ఫల జానూ’ అంటారు తులసీదాసు. సూర్యబింబాన్ని మధురఫలంగా భ్రమించి, అందుకోవటానికి హనుమ ప్రయాణించిన దూరమది. అన్నట్లు కథల్లో దేవతలు వరాలిచ్చేటప్పుడు ముచ్చటగా మూడు వరాలిస్తారు. దేవతలే కాదు, యముడూ మూడు వరాలివ్వక తప్పలేదు.. ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రంలో సతీసావిత్రి నాటకంలో… సావిత్రి, తన పతి ప్రాణాలను తీసుకెళ్తున్న యముడి వెంటపడి.. తన మాటలతో అతడి మనసు కరగింపజేసి అతడు ఒకవరం ప్రసాదించగా, ‘ఒకటి నేనడిగితిని, రెండవది నీవిచ్చితివి, ముచ్చటగ మూడవది ఇవ్వకపోవుట పాడియే ధర్మమూర్తీ’ అంటూ మూడు వరాలూ పొందుతుంది.

ప్రేమపాటల్లో కూడా అంకెల లంకె ఉంది.

నాలుగు కళ్లు రెండయినాయి.. రెండు మనసులు ఒకటయినాయి
ఏడు రంగుల ఇంధ్రధనస్సు.. ఈడు వచ్చిన నా వయసు…అంటుంది ఓ నాయిక.

పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూచినా గుడికి చేరే ది నూటికి ఒకటే… అని ‘ఆనంద నిలయం’ చిత్ర నాయకుడు అంటే,

‘సువర్ణ సుందరి’ చిత్రంలో నాయిక
పిలువకురా.. అలుగకురా.
నలుగురిలో నను ఓరాజా
పలుచన సలుపకురా.. పిలవకురా.. అంటుంది.

నూటికో, కోటికో పుడతారు. అది మీరే మీరే మాష్టారు, ఆ దేవుడు మీరే మాష్టారు.. ఓ మంచి మాష్టారి పై శిష్యుల పాట.

ఒకటే కోరికా.. ఒకటే వేడుక
నా మనసులోని మధురమైన ప్రేమ గీతిక.. నా ప్రేమ గీతిక, ‘ప్రేమ కానుక’ సినిమాకు సినారె అందించిన చక్కని గీతం.

‘ఒకటి, రెండు, మూడయితే ముద్దు ముద్దు, అంతకు మించిన సంతానమయితె వద్దు వద్దు వద్దు’ బాలరాజు కథలో సందేశాత్మక గీతం అప్పట్లో చాలా పాపులర్.
క్షణ కాలంమీద అయితే ఎన్నో పాటలు…

ఒక్కక్షణం.. ఒక్క క్షణం
నన్ను పలకరించకు, నావైపిటు చూడకు.. ఒక్క క్షణం…

‘కలసిన మనసులు చిత్రానికి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు అందించిన మధురమైన యుగళగీతం.

‘మరో చరిత్ర’ చిత్రంలో ఆత్రేయగారు చక్కని గీతం అందించారు అది..

పదహారేళ్లకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు…
కోటి దండాలు.. శతకోటి దండాలు..

అన్నట్లు ‘బంగారు బాబు’ చిత్రంలో ఆత్రేయగారు రా సిందే మరో పాట..

ఏడడుగుల సంబంధం.. ఏనాడో వేసిన బంధం
నిన్ను నన్ను పెనవేసిన బంధం
ఎన్నో జన్మల సంబంధం
ఎన్నెన్నో జన్మల అనుబంధం..

హిందీలో తేజాబ్ చిత్రంలోని
ఏక్ దో తీన్ చార్ పాంచ్ ఛె సాథ్ ఆర్ నౌ దస్ గ్యారా, బారా, తెరా.. పాట ఎంత హిట్టో.

చల్తీకా నామ్ గాడీలో ‘పాంచ్ రూపయ్యా బారా ఆనా’, ‘నైన్టీన్ ఫార్టీ టు ఎ లవ్ స్టోరీ’ సినిమాలో ‘ఏక్ లడ్‌కీ కో దేఖాతో ఐసా హువా’; ‘ఘరౌందా’ చిత్రంలోని ‘దో దివానే షెహర్ మే; ‘పరదేశి’ చిత్రంలోని దో దిల్ మిల్ రహే హై; ‘పీకే’లో ‘చార్ కదమ్’; ‘విశ్వాత్మ’లోని ‘సాత్ సముందర్ పార్ మె తేరే.. ఇలా ఐదు, పది కాదు.. ఎన్నెన్నో.

మహాభారతం పద్దెనిమిది పర్వాలు. పాండవులు ఐదుగురు. కౌరవులు నూరుగురు. పాండవులు పదమూడేళ్లు వనవాసం, ఒక ఏడాది అజ్ఞాత వాసం చేశారు. కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. ఆ యుద్ధంలో పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం పాల్గొందట. అందులో పాండవులది ఏడు అక్షౌహిణులు కాగా, కౌరవులది పదకొండు అక్షౌహిణులు. ఒక్కో అక్షౌహిణిలో ఇరవై ఒక్కవేల ఎనిమిదివందల డెబ్బై రథాలు, అదే సంఖ్యలో ఏనుగులు, అరవై ఐదు వేల ఆరువందల పది గుర్రాలు, ఒక లక్షా తొమ్మిదివేల, మూడువందల యాభై పదాతి దళాలు ఉంటాయి. అసలన్నిటికన్నా ముందు కాలమానం.. రెప్పపాటు, ఘడియలు, విఘడియలు వంటివి పక్కనుంచితే.. స్థూలంగా అరవై సెకన్లు ఒక నిమిషం, అరవై నిమిషాలు ఒక గంట, ఇరవై నాలుగు గంటలు ఒకరోజు, ఏడురోజులు ఒక వారం, రెండు వారాలు ఒక పక్షం, రెండు పక్షాలు ఒకనెల, పన్నెండు నెలలు ఒక సంవత్సరం. మరో లెక్క.. రెండుమాసాలు ఒక రుతువు, మూడు రుతువులు ఒక ఆయనం, రెండు ఆయనాలు ఒక సంవత్సరం. పన్నెండు సంవత్సరాలు ఒక తప, వంద సంవత్సరాలు ఒక శతకం, పది శతకాలు ఒక సహస్రకం, నాలుగుసహస్రకాలు ఒక యుగం, నాలుగు యుగాలు ఒక మన్వంతరం, వంద మన్వంతరాలు ఒక బ్రహ్మదినం. తెలుగు సంవత్సరాలు అరవై. యుగాలు నాలుగు. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు. ఇప్పటికి ఆరు మన్వంతరాలు గడిచాయి. ఏడవది అయిన వైవస్వత మన్వంతరం నడుస్తోంది. కాల గణన లేకుండా జగతి నడిచేనా?

తల్లి నవమాసాలు మోసి బిడ్డను కంటుంది. మనిషి భౌతిక రూపానికి ఎన్నో లెక్కలున్నాయి. రెండు కళ్లు, ఒక ముక్కు, ఒక నోరు, ముప్పయ్ రెండు పళ్లు, రెండు చెవులు, రెండు చేతులు, రెండు కాళ్లు, ఒక్కోచేతికి అయిదు వేళ్లు, ఒక్కోపాదానికి అయిదు వేళ్లు. ఎదిగిన మనిషిలో మొత్తం రెండువందల ఆరు ఎముకలుంటాయి. మనిషి గుండె నిముషానికి డెబ్బైరెండుసార్లు లబ్ డబ్ మని కొట్టుకుంటుంది. శిశువు జన్మించాక పదకొండవ రోజున పురిటి స్నానం చేయిస్తారు. ఇరవయ్యొకటవ రోజున శిశువును ఉయ్యాలలో వేస్తారు. ఆరోగ్యవంతులైన శిశువులు మూడునెలలకు బోర్లపడటం, ఆరునెలలకు పాకటం, ఎనిమిదో నెలకు కూర్చోవటం, పదినెలలకు లేచి నిలబడటం, పన్నెండు నెలలకు అడుగులు వేయటం అన్నీ లెక్క ప్రకారమే జరుగుతుంటాయి. పధ్నాలుగేళ్ల వరకు బాల్యం, ఆ పైన కౌమారం, రెండు పదులు దాటాక యవ్వనం, నలభయ్యో దశకంలో నడివయసు, అరవై దాటితే జీవన సంధ్య. అరవై నిండితే షష్ఠిపూర్తి జరుపుకుంటారు కొందరు. గతంలో తొంభై దాటేవరకు, కొందరయితే నూరేళ్ల వరకు బ్రతుకటం సర్వసాధారణంగా ఉండేది. కానీ ఇప్పుడు నూరేళ్లు బ్రతికే వారు ఎక్కడో ఓ చోట ఉంటే అది విశేష వార్త అవుతోంది. ‘శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి’ సుపరిచితమైన వేదమంత్రం. వివాహాలలో, ఇతర శుభకా ర్యాలలో సైతం ఆశీర్వచనంగా ఈ మంత్రం చెప్పటం పరిపాటి.

నర్సరీలోనే

వన్ టు బకిల్ మై షూ
త్రీ ఫోర్ షట్ ది డోర్
ఫైవ్ సిక్స్ పికప్ ది స్టిక్స్
ఎయిట్ నైన్ లే దెమ్ స్ట్రెయిట్
నైన్ టెన్ ఎ బిగ్ ఫాట్ హెన్

రైమ్ అర్జెంటుగా నేర్చేసుకుంటారు పిల్లలు. అలాగే తెలుగులో..

ఒకటి ఒకటి ఒకటి.. మానవులంతా ఒకటి
రెండు రెండు రెండు.. మంచి చెడులు రెండు
మూడు మూడు మూడు.. జెండారంగులు మూడు
నాలుగు నాలుగు నాలుగు.. వేదాలు మనకు నాలుగు
ఐదు ఐదు ఐదు.. చేతికి వేళ్లు ఐదు
ఆరు ఆరు ఆరు.. రుతువులు మనకు ఆరు
ఏడు ఏడు ఏడు.. వారానికి రోజులు ఏడు
ఎనిమిది ఎనిమిది ఎనిమిది.. దిక్కులు మూలలు ఎనిమిది
తొమ్మిది తొమ్మిది తొమ్మిది.. గ్రహాల కూటమి తొమ్మిది
పది పది పది.. పాపలు పాడే పాట ఇది

గతంలో దూరదర్శన్ ఓ చక్కటి పాట తరచు ప్రసారం చేసేది. పాట, యానిమేషన్ కూడా ఎంతగానో ఆకట్టుకునేది. జాతీయ సమగ్రత సందేశాన్నిచ్చే ఈ పాట మధ్య మధ్య అక్కా, తమ్ముళ్ల సంభాషణలతో పిల్లల్ని, పెద్దల్ని కూడా అలరించేది. అది..

హమ్‍మ్.. హింద్ దేశ్.. హూహూహూ.. హమ్ సఖీ ఏక్ హై
తరరరరా భాషా అనేక్ హై….
సూరజ్ ఏక్.. చందా ఏక్.. తారె అనేక్..
సూరజ్ ఏక్, చందా ఏక్, ఏక్ ఏక్ ఏక్ కర్‌కె తారె బనే అనేక్
దేఖో దేఖో ఏక్ గిలహరి
పీఠో పీచే అనేక్ గిలహరియా
ఏక్ తిత్లీ.. ఏక్ ఔర్ తిత్లీ
ఏక్ ఏక్ కర్ కె హో గయె అబ్ అనేక్ తిత్లియా..
ఏక్ ఉంగ్లీ, అనేక ఉంగ్లియా…
ఏక్ ఛిడియా, ఏక్ ఏక్ కర్ కె అనేక్ ఛిడియా..
బేలా గులాబ్ జుహి చంపా ఛమేలి
ఫూల్ హై అనేక్ కింతూ మాలా ఫిర్ ఏక్ హై

ఏ శాస్త్రం చూసినా లెక్కలతో కూడుకున్నదే.

చరిత్రలో క్రీ.పూ., క్రీ.శ. తేదీలు, సంవత్సరాలు దర్శనమిస్తాయి. ఏ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది వగైరాలన్నీ చరిత్ర చదివే విద్యార్థులు బట్టీపట్టవలసిందే. ఈ తేదీలు, సమయాలు నిత్య జీవితంలోనూ అత్యంత ప్రాముఖ్యతసంచరించుకున్నాయి. క్యాలెండర్ ప్రకారమే పనుల ప్రణాళికలు. అంతెందుకు ‘దూకుడు’ చిత్రానికి రామజోగయ్య శాస్త్రిగారు ఓ వెరైటీ ప్రేమ గీతాన్ని అందించారు. అది..

గురువారం మార్చి ఒకటి.. సాయంత్రం ఫైవ్ ఫార్టీ
తొలిసారిగ కలిసానే నిన్ను…

సైన్స్ లోకి తొంగిచూస్తే ప్రాథమికంగానే ‘హెచ్‌ టు ఒ’ అంటే ప్రతి నీటి అణువులో రెండు హైడ్రోజన్ పరమాణవులు, ఒక ఆక్సిజన్ పరమాణువు ఉంటాయని చెబుతుంది. భౌతికశాస్త్రమైనా అంకెల గతుల్లోనే.. అర్థశాస్త్రం లేదా ఆర్ధిక శాస్త్రమంతా సంఖ్యల సందడే. భాషల విషయానికి వచ్చినా.. తెలుగు భాషకు అక్షరాలు యాభై ఆరు.. తెలుగులో అంకెల లిపి వేరు. తెలుగులో పద్యరచనకు ఛందస్సు అంతా లెక్కలమయమే. గురువు, లఘువు లెక్కతోనే ఛందస్సు నడుస్తుంది. సమాసాలలో ద్విగు సమాసం అంకెలున్న పదాలకు అంటే దశావతారాలు, ముల్లోకాలు వంటి పదాలకు వర్తిస్తుంది. ఇక విభక్తులు ఏడు, సంభోదనా విభక్తిని కలిపితే ఎనిమిది.

కర్ణాటక సంగీతానికి మూలాధారం సప్తస్వరాలే. ఇక మేళకర్త రాగాలు లేదా జనకరాగాలు డెబ్భైరెండు. జనకరాగాలన్నిటిలో ఆరోహణ, అవరోహణల్లో సప్తస్వరాలన్నీ ఉంటాయి. జనకరాగాల నుంచి వారి వారి సృజనాత్మకననుసరించి రూపొందించేవి జన్యరాగాలు. ఇవి వేల సంఖ్యలో ఉన్నాయి.

కళల విషయానికి వస్తే అరవై నాలుగు కథలున్నాయి. చదరంగంలో అరవైనాలుగు గడులుంటాయి. పచ్చీసు, అష్టా చెమ్మా ఆటలు కూడా అంకెల లింకు ఉన్నవే. రోజూ ఇంటి ముందు వేసే ముగ్గులకు పెట్టే చుక్కలకు సైతం ఓ లెక్క ఉంటుంది. మనం ఉండే ఇంటికి, వీధికి, వాహనాలకు అంకెలు ఉండనే ఉంటాయి.

ఆలీబాబా నలభై దొంగలు, ఇద్దరు మిత్రులు, రెండురెళ్లు ఆరు, రెండుజళ్ల సీత, ఒకే ఒక్కడు, రెండు కుటుంబాల కథ, త్రినేత్రుడు, పదహారేళ్ల వయసు, ఆదిత్య మూడొందల అరవై తొమ్మిది, ఖైదీ నెంబర్ ఏడు ఎనిమిది ఆరు, నాలుగు స్తంభాల ఆట, ఆ నలుగురు, హండ్రెడ్ పర్సెంట్ లవ్, శతమానం భవతి, రాగల ఇరవై నాలుగు గంటల్లో, దో ఆంఖే బారా హాత్, శ్రీ ఫోర్‌ట్వంటీ వగైరా వగైరా సినిమా పేర్లన్నీ అంకెల అనుబంధాలే. అంతెందుకు, చిన్నప్పుడు రాజుగారు.. ఏడుచేపలు కథ విననివారే ఉండరు.

బతుకమ్మ పాటల్లోనూ అంకెలతో అల్లిన పాట ఇలా..

ఒక్కేసి పువ్వేసి సందమామ
ఒక్క జాములాయే సందమామ
రెండేసి పువ్వేసి సందమామ
రెండు జాములాయే సందమామ
మూడేసి పువ్వేసి సందమామ
మూడు జాములాయే సందమామ
నాలుగేసి పువ్వేసి సందమామ
నాలుగు జాములాయే సందమామ
ఐదేసి పువ్వేసి సందమామ
ఐదు జాములాయే సందమామ..

అందంగా పాట సాగుతుంది.

అంకెలు, సంఖ్యలకు సంబంధించిన ‘న్యూమరాలజీ’ ఎంతో పాపులర్. ఎందరో దాన్ని విశ్వసిస్తూ తమ జాతకం ప్రకారం ఆ అంకెలున్న కారులు, ఇతర వస్తువులు కొనుక్కోవటం వగైరాలు చేస్తుంటారు. హిందూ జ్యోతిష శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు. రాశులు పన్నెండు.

నిత్యం చేసే పూజలో చదివే కేశవ నామాలు ఇరవయి నాలుగు (చతుర్వింశతి), వినాయక చవితికి ఇరువది ఒక్క పత్రాలతో పూజ చేయటం తెలిసిందే. ఇక అష్టకాలు, అష్టోత్తర శతనామావళి అంటే నూట ఎనిమిది నామాలు, సహస్రనామాలు.. ఇలా ఎన్నో. ఇక దోష నివారణలకు చేసే జపాలకయితే నిర్దిష్ట సంఖ్యలుంటాయి. అలాగే ప్రదక్షణలు కూడా మూడు, పదకొండు.. నూరు.. ఇలా వారి వారి ఇచ్ఛానుసారం చేస్తుంటారు. అలాగే మండలం రోజులు చేసే పూజావిధులూ ఉంటాయి. అంకెల్లో కొన్ని తమాషా అంకెలున్నాయి. ఆరును తల్లకిందులు చేస్తే తొమ్మిదవుతుంది. ఎటుతిప్పినా ఒకటిగానే ఉండేది ఒకటి, ఎనిమిది, పదకొండు వగైరాలు. లెక్క తప్పితే చిక్కులే. చాలామంది పిల్లలకు లెక్క లంటే తికమక, భయం ఉంటుంటాయి. ఆ భయాన్ని అధిగమిస్తేనే ఉన్నది. బ్యాంకుల్లో క్లోజింగ్ టైమ్‌కి అకౌంట్స్ ట్యాలీ కాకపోతే పెద్ద ఇబ్బంది.. కొన్నిసార్లు ఏం చేయలేక ఆ లోటును తలాకాస్త వేసుకొని పూడ్చేవారు (గతంలో). కంప్యూటర్లు వచ్చాక అలాంటి ఇబ్బంది ఉండదేమో. జీవితం అంతా కూడిక, తీసివేత, గుణకారం, భాగహారమే అని నిర్వచిస్తారు గణితంలో ఆరితేరినవారు. జీవితానికి, జీతానికి లంకె ఉందన్నది కాదనలేని వాస్తవం. గతంలో జీతం ప్రస్తావన వస్తే నాలు గంకెల జీతగాడు.. అలా చెప్పేవాళ్లు. ఇప్పుడు ఫిఫ్టీ కె… అని చెపుతున్నారు. సాధారణ లెక్కలు కాస్త శ్రద్ధ పెట్టి చేస్తే కరెక్టు జవాబులొస్తాయేమో కానీ జీవితమనే లెక్క అలా కాదు, అదెప్పుడూ నిశ్శేషం కాదు. పైగా ఏడు జన్మలున్నాయనుకుంటూ వచ్చే జన్మలో అయినా ఫలానాగా పుడితే, ఫలానాగా ఉంటే అని ఆశపడుతుంటారు. ఉందో, లేదో తెలియని మరుజన్మ గురించి పగటి కలలు కనటం కన్నా ఉన్న జీవితం గురించి ఆలోచించుకోవటం ఉత్తమం. ‘ఉన్నది ఒకటే జిందగీ’ అన్నది ఎంతైనా నిజం. అందుకే ఆ ఒక్క జిందగీని చిక్కులెక్క కాకుండా చూసుకోవడమే విజ్ఞత అనుకుంటూ ఉంటే మా పాత గోడ గడియారం ఏడు గంటలు ఠంగ్, ఠంగ్ మంటూ కొట్టి నా అంకెల సంకెల ఆలోచనను విడగొట్టింది.

Exit mobile version