Site icon Sanchika

మానస సంచరరే-48: అంతరంగమున అందెల రవళి!

[box type=’note’ fontsize=’16’] “కళలు సంస్కృతి ప్రతీకలు. వాటిని తరంతరం నిరంతరంగా కొనసాగిస్తేనే జాతి తన ప్రత్యేకతను నిలుపుకోగలిగేది” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]ఉ[/dropcap]దయాన్నే ఆకాశం ముసురుపట్టింది. ఆకాశంలో మధ్యమధ్య డిస్కోలైట్లలా మెరుపులు మెరిసి, వాన చిందులు మొదలయ్యాయి. ‘శంకరా.. నాద శరీరా పరా.. వేదవిహార హరా జీవేశ్వరా.. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు..’ మనసు పాడుతుంటే మొబైల్ మోగింది. చూస్తే లాస్య.. చాలా రోజులయిందనుకుంటూ మాట్లాడాను. విశేషం ఏమిటంటే వాళ్లమ్మాయి భావన డ్యాన్స్‌ని యుట్యూబ్‌లో చూడమంది. లింక్ వాట్సాప్ చేస్తానని వెంటనే చేసింది. నృత్య వీక్షణకు జాగెందుకని లింక్ నొక్కాను. చాలా చక్కగా ఉంది అమ్మాయి. అసలా ముస్తాబు లోనే అందముంది. భామాకలాపం అభినయిస్తోంది.

భామనే.. సత్యాభామనే.. సత్యభామనే.. సత్యాభామనే..
వయ్యారి ముద్దుల.. వయ్యారి ముద్దుల సత్యభామనే, సత్యాభామనే
భామనే పదియారువేల కోమలు లందరిలోనా..
లలనా చెలియా! మగువా సఖినా!
రామరో గోపాలదేవుని ప్రేమను దోచిన సత్యభామనే..

ఎంత బాగా అభినయిస్తోందో.. అందులో భామాకలాపం అంశం అందరినీ ఆకట్టుకుంటుంది. గడసరి, సొగసరి సత్యభామ హావభావాలను భావన చక్కగా ప్రదర్శించింది. అదే మెసేజ్ పంపాను. నా మనసులో ఆ నాట్యం తిష్ఠవేసి ఆలోచన అటు మళ్లింది.. నాట్యం ఎలా మొదలైందో.. అసలు అమ్మ కడుపులో ఉన్నప్పుడే శిశువు తకధిమి తకధిమి మొదలవుతుందిగా. ఆట – పాట అన్నారు. ఆనందంతో మది ఉప్పొంగిన వేళ మనిషి పదం పాడతాడు, అదేవేళ అతడికి తెలియకుండా పదన్యాసమూ జరుగుతుంది.

ఆ పద గతులే, చిత్రగతులై, కాలక్రమంలో అసంఖ్యాక నృత్యరీతులయ్యాయి. వచనం, గానం, అభినయం రసావిష్కరణ సమ్మిశ్రితం నృత్యం. వాక్కు, రుగ్వేదానికి; గానం, సామవేదానికి, అభినయం, యజుర్వేదానికి; నవరసాలు, అధర్వణ వేదానికి చెందినవని, అందుకే వీటన్నిటిని కలబోసి రూపొందించిన నాట్యశాస్త్రాన్ని ‘నాట్య వేదం’ అన్నారు.

వేదం అణువణువున నాదం.. వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై..
సాగర సంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయె
ఆ మథనం అమృతగీతం
జీవితమే చిరనర్తనమాయె
పదములు తామే పెదవులు కాగా…
గుండియెలే అందియలై మ్రోగా..

‘సాగర సంగమం’ చిత్రానికి వేటూరి అందించిన గీతామృతం. నాట్యదైవం నటరాజు, శివుని రూపం. ఇక శివతాండవం సంగతి తెలిసిందే. శివుని తొలి భార్య సతీదేవి, దక్షుడి కుమార్తె. ఆయనకు అల్లుడంటే చులకన భావం. అందుకే తాను యజ్ఞం చేస్తూ అందరినీ ఆహ్వానించి, కుమార్తెను, అల్లుడిని మాత్రం ఆహ్వానించలేదు. అయినా సతీదేవి పుట్టింటిమీది మమతతో వెళ్లింది. అక్కడ అవమానం ఎదుర్కోవడంతో సతీదేవి యజ్ఞ కుండంలోకి దూకి ప్రాణత్యాగం చేసింది. దాంతో శివుడు దుఃఖంతో, ఆగ్రహంతో రుద్రతాండవం చేశాడు. అది శివతాండవ నేపథ్య పురాణ కథనం.

నాట్యం అనగానే ఇంద్రుడి సభలో నాట్యం చేసే అప్సరసల కథనాలు గుర్తుకు రాక మానవు. నాట్యశాస్త్రం ప్రకారం అప్సరసలు.. మేనక, రంభ, తిలోత్తమ, ఘృతాచి, మంజుకేశి, సుకేశి, మిశ్రకేశి, సులోచన, సౌదామిని, దేవదత్త, దేవసేన, మనోరమ, సుదతి, సుందరి, విగ్రధ్ధ, వివిధ, బుధ, సుమల, సంతతి, సునంద, సుముఖి, మగధి, అర్జుని, సరళ, కేరళ, ధృతి, నంద, సుపుస్కల, సుపుష్ప మాల, కలభ ఉన్నా, మనకు సాహిత్యంలో ప్రముఖంగా పరిచయమయ్యే పేర్లు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ. అనుకోగానే యమగోలలో పాట గుర్తొచ్చింది. .

ఆడవె అందాల సురభామిని.. పాడవె కళలన్ని ఒకటేనని
గానమేదైన స్వరములొక్కటే.. నాట్యమేదైన నడక ఒక్కటే
భాష ఏదైన భావమొక్కటే.. అన్ని కళల పరమార్ధమొక్కటే
అందరినీ రంజింపచేయుటే ఆఆ ఆఆ ఆఆఆఆ
ఓహె రంభా సకల కళా నికురంభ
రాళ్లనైనా మురిపించే దానవట.. అందానికి రాణివట
ఏదీ నీ హావభావ విన్యాసం.. యేదీ నీ నాట కళా చాతుర్యం..
ఓహెూ ఊర్వశీ అపురూప సౌందర్యరాశి
ఏదీ నీ నయన మనోహర నవరస లాస్యం
ఏదీ నీ త్రిభువన మోహన రూప విలాసం..
ఓహె మేనకా మదన మయూఖా.. సాగించు నీ రాసలీల
చూపించు శృంగార హేల..

అంతలోనే సువర్ణ సుందరిలోని పాట పిలిచింది మరి. అది..

పిలువకురా.. అలుగకురా.. నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా..
ఏలినవారి కోలువుర సామీ.. ఆ.ఆ.ఆ.ఆ.ఆ.
మది నీరూపే మెదలినగాని, ఓయనలేనురా కద లగలేర..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..

ఓ దేవకన్య ఇంద్రుడి కొలువులో నాట్యం చేస్తూ, తాను ప్రేమించి, పెళ్లాడిన జయంతుడి వేణువు పిలుపుకు తక్షణం వెళ్లి వాలాలని ఉన్నా, కదలలేని స్థితిలో తన మానసాన్నే గానం చేస్తూ నృత్యం చేసే సందర్భానికి సముద్రాల సీనియర్ ఎంత అర్థవంతమైన పాటనందించారో. గతంలో మహారాజుల పోషణలోనే నృత్యం విలసిల్లింది. రాజులు కళాపోషకులుగా ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయలకు నృత్యమంటే ఎంతటి అనురక్తి తెలిపే ఉదంతాన్ని ‘మల్లీశ్వరి’ చిత్రంలో చూడవచ్చు. రాయలు ఒకసారి తన పరివారంతో కలిసి మారువేషంలో పర్యటిస్తూ దారిలో వర్షం రాకతో దాపులోని పాత భవన ప్రాంగణానికి చేరుకుంటాడు. అక్కడే మల్లీశ్వరి, నాగరాజు కూడా తల దాచుకుంటారు. నాగరాజు కోరిక మేరకు మల్లీశ్వరి ఓ జావళిని అభినయిస్తుంది. అది.. దేవులపల్లి రచించగా భానుమతి ఆడి, పాడిన పాట.

పిలచిన బిగువటరా ఔరర.. పిలచిన బిగువటరా
చెలువలు తామే వలచి వచ్చిన.. భళిరా.. రాజా..
గాలుల తేలెను గాఢపు మమతలు..
నీలపు మబ్బుల నీడలు కదిలెను..
అ౦దెల రవళుల సందడి మరిమరి..
అందగాడ ఇటు తోందరజేయగ.. ॥పిలచిన॥

ఒక వైపు వర్షం.. మరోవైపు మనోహర నృత్యం… నాగరాజే కాదు, చాటుగా ఉండి తిలకించిన రాయలవారూ పరవశిస్తారు, హారం బహకరిస్తారు. నాగరాజు తుంటరిగా మల్లీశ్వరికి రాణివాసపు పల్లకీ పంపాలని చిలిపి కోరిక కోరుతాడు. అదే చివరకు ఆ జంటకు అనర్థమైంది. అది వేరే సంగతి. జావళి ప్రత్యేక కోవకు చెందింది. శృంగారపరంగా ఉండి అందరికీ అర్థమయ్యే రీతిలో మనోజ్ఞమై అలరిస్తుంది.

పూర్వం దేవాలయాల్లో దేవుడికి నాట్యం కూడా ఒక సేవగా ఉండేది. అందుకే అంకితమైన నాట్యకత్తెలు ఉండేవారు. వారినే దేవదాసీలనే వారు. ‘ఆనందభైరవి’లో దేవులపల్లిగారి గీతం ఎంతో ప్రసిద్ధిపొందింది. అది..

కొలువైతివా రంగశాయి.. హాయి.. కొలువైతివా రంగశాయి
కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి..
సిరి మదిలో పూచి తరచి రాగము రేపి.. చిరునవ్వు విరజాజు
లేవోయి.. ఏవోయి.. ॥కొలువైతివా॥..
ఔరా.. ఔరారా.. ఔరా.. ఔరారా..
రంగారు జిలుగ బంగారు వలువ సింగారముగ ధరించి..
ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి
జిలిబిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి..
ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ..
శ్రీరంగమందిర నవసుందరా పరా.. ॥కొలువైతివా॥

దసరా ఉత్సవాల సందర్భంలో దేవాలయాలలో కూడా నృత్య ప్రదర్శనలు రమణీయంగా జరుగుతాయి. ‘సప్తపది’ చిత్రంలో ఈ సందర్బ నేపథ్యం లోనే నృత్య ప్రదర్శనతో కథకు బీజం పడుతుంది.

ఓంకార పంజర శుకీమ్.. ఉపనిషదుద్యాన కేళికలకంఠీమ్
ఆగమ విపిన మయ వారీ.. ఆర్యాం అంతర్విభావ యేత్ గౌరీమ్
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ..
శుభగాత్రి గిరిరాజపుత్రి.. అభినేత్రి శర్వార్ధగాత్రి..
ఆ.. సర్వార్ధ సంధ్రాతి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి..
చతుర్భాహు సంరక్షిత శిక్షిత చతుర్బశాంతర భువనపాలిని
కుంకుమరాగశోఖిణి కుసుమ బాణ సంశోభిని
మౌన సుహాసిని.. గానవినోదిని.. భగవతి పార్వతి దేవీ…॥ అఖిలాండేశ్వరి॥

ఆటకు, పాటకు పోటీ అయితే ఎలా ఉంటుందనేది ‘చెల్లెలి కాపురం’ చిత్రంలో పాట తెలియజేస్తుంది. ఆ పాట…

చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన
కరకంకణములు గలగలలాడగా.. హ..హ..హ
అడుగులందు కలహంసలాడగా.. నడుములో తరంగమ్ములూగగా
వినీల గజభర.. విలాస బంధుర.. తనూలతిక సంచలించిపోగా..
ఆడవే మయూరీ.. నటనమాడవే మయూరీ..
కనులలోన.. కనుబొమలలోన.. అధరమ్ములోన.. వదనమ్ములోన..
గళసీమలోన.. కటిసీమలోనా.. కరయుగములోన.. పదయుగము
లోన.. నీ తనువులోని అణువణువులోన.. అనంతవిధముల అభినయించి
ఇక ఆడవే.. ఆడవే.. ఆడవే..

సినారె కవితా అక్షర ప్రతిభకు ప్రతిరూపమన దగ్గ పాట. అలాగే పాటకు, ఆటకు పోటీగా సినారే రాసిన మరో పాట కూడా ఉంది. గౌరీ, గంగల ఇతివృత్తంతో సాగే ఆ పాట ‘విచిత్ర దాంపత్యం’ చిత్రంలోది. ఆ పాట..

శ్రీ గౌరి శ్రీ గౌరియే, శివుని శిరమందు ఏగంగ చిందులు వేసినా..
సతిగా తన మేను చాలించి , పార్వతిగా మరుజన్మ ధరియించి..
పరమేశునికై తపియించి, ఆ హరుమేన సగమై పరవశించిన.. శ్రీగౌరి..
సురలోకమున తాను ప్రభవించినా, తరళాత్మయైనది మందాకిని..
ఒదిగిఒదిగి పతి పదములందు నివసించి యుండు గౌరి..
ఎగిరి ఎగిరి పతి సిగను దూకి నటి యించుచుండు
గంగ లలిత రాగ కలితాంతరంగ గౌరి..
చలిత జీవన తరంగ రంగ ధవంశు కీర్తి గౌరి..
నవ ఫేనమూర్తి గంగ..

అర్ధాంగి స్థానాన్ని, మధ్యలో వచ్చిన ఇతర స్త్రీ చెదరగొట్టలేదన్న అర్థంలో అర్థవంతంగాసాగుతుంది.

నాట్య విశిష్టత కథాంశంగా వచ్చిన సినిమాలు అనేకం. సిరిసిరిమువ్వ, సాగరసంగమం, స్వర్ణకమలం, మయూరి ఇలా అనేకం. ‘గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది.. గుండె ఝల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది’ సిరిసిరి మువ్వ చిత్రం అంటే, ‘ఓం నమశివాయ.. చంద్రకళాధర సహృదయ.. సాంద్రకళాపూర్ణోదయాలయ నిలయా.. ఓం.. త్రికాలములు నీ నేత్ర త్రయమై, చతుర్వేదములు ప్రాకారములై, గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి రుత్విజ వరులై..’ అన్నది సాగరసంగమం.

‘అందెల రవమిది పదములదా.. అంబరమంటిన హృదయముదా ‘స్వర్ణకమలం’ అడిగితే, ‘భరతవేదముగ నిరత నాట్యముగ, కదిలిన పదమిది ఈశా’ అంటుంది పౌర్ణమి చిత్రం. ‘ఈ పాదం ఇలలోన నాట్య వేదం.. ఈ పాదం నటరాజుకే ప్రమోదం.. కాల గమనాల గమకాల గ్రంథం’ అంటుంది మయూరి చిత్రం.

‘మయూరి’ నిజజీవిత కథాంశం. సుధాచంద్రన్ జీవితకథ ఆధారంగా తీసిన చిత్రమిది. ఈ చిత్రంలో నాయికకు నాట్యమంటే ప్రాణం, కానీ ఆమె తల్లి నాట్యం చేసినందువల్లే తడ్రి మరణించాడని నమ్మటం, ఆ పైన వివాహమయ్యాక భర్త అంగీకారంతో నృత్యం చేసినా ప్రమాదవశాత్తు ఆమే మరణించిన నేపథ్యంలో పినతల్లి ఆమె నాట్యం నేర్చుకోవడానికి ససేమిరా అంటుంది. అయినా నాట్యంపై ఉన్న మక్కువను చంపుకోలేక రహస్యంగా నేర్చుకుని ప్రదర్శన ఇస్తుంది. ఆ పైన కారు ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. దాంతో కథ మలుపు తిరుగుతుంది. అయినా కృంగిపోకుండా జైపూర్ ఫుట్ తోనే నాట్య సాధన చేసి, నిష్ణాతురాలై, వాసికెక్కడం విశేషం. స్ఫూర్తిదాయక కథనంతో వచ్చిన ఈ సినిమా గొప్ప హిట్ కొట్టింది.

ఇక మనదేశంలో ఎన్నెన్నో నృత్యరీతులు ఉన్నా సంగీత నాటక అకాడమీ గుర్తించిన ఎనిమిది శాస్త్రీయ నృత్యరీతులు.. భరత నాట్యం, కథక్, కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, మోహినీ ఆట్టం, మణిపురి, సత్రియ. భరతముని నాట్యశాస్త్ర ప్రవర్తకుడిగా ప్రఖ్యాతి చెందాడు. నందీశ్వరుడు ‘అభినయ దర్పణం’ లిఖించాడు. కాకతీయుల కాలంలో జాయప సేనాని ‘నృత్త రత్నావళి’ రచించాడు. పాకాలలోని రామప్పగుడిలో ఉన్న నాట్య భంగిమల్లోని శిల్పాలు నాటి నాట్యరీతులకు సాక్ష్యాలు. ఇక కూచిపూడి క్రీ.శ.పదిహేనవ శతాబ్ది నాటిది. సిద్ధేంద్రయోగి కూచిపూడి నృత్య రీతి తీర్చిదిద్దాడు. వెంపటి చినసత్యంగారి కృషితో కూచిపూడి నృత్యానికి ఖండాంతర కీర్తి దక్కింది. నారాయణ తీర్థుల తరంగాలు, క్షేత్రయ్య పదాలు, జయదేవుడి అష్టపదులు, అన్నమయ్య, త్యాగరాయ కీర్తనలకు నట్టువాంగం సమకూర్చి, కొత్త ప్రయోగాలు చేసిన ఖ్యాతి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారిదే. ఇత్తడి పళ్లెంపై నిల్చుని, చేతులలో, తలపై దీపాలు ఉంచుకుని చేసే నృత్య ప్రయోగం కూడా వీరిదే. చింతా వేంకటరమణయ్య దశావతార నృత్య అంశాన్ని ప్రవేశ పెట్టారు. రుక్మిణీ అరుండేల్, తంజావూర్ బాలసరస్వతి, సుమతీ కౌశల్, కె.ఉమా రామారావు, యామిని కృష్ణమూర్తి, మృణాళినీ సారాభాయ్, పద్మాసుబ్రహ్మణ్యం, చిత్రా విశ్వేశ్వరన్, ఆనంద శంకర్ జయంత్ వంటి వారెందరో భరతనాట్యం, కూచిపూడి నృత్యరీతులలో విశేషకృషి చేశారు.

తర్వాతకాలంలో శోభానాయుడు ‘చండాలిక’ వంటి సామాజికాంశాలతో నృత్యరూపకాలను రూపొందించారు. తెలుగు చిత్రాలలో నృత్య ప్రస్తావనలో వేదాంతం రాఘవయ్యగారి పేరు మరువలేనిది. ఆయన ‘రహస్యం’ చిత్రానికి దర్శకత్వం వహించి, కొరియోగ్రఫీ కూడా అద్భుతంగా నిర్వహించారు. ఆ చిత్రంలోని ‘గిరిజా కల్యాణం’ ఎంతగానో ప్రాచుర్యం పొందింది. అలాగే గతంలో తెలుగు సినిమాల్లో ఎస్.వరలక్ష్మి, భానుమతి, అంజలి, ఎల్.విజయలక్ష్మి మొదలైనవారు నృత్యంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

తర్వాత కాలంలో మంజుభార్గవి, భానుప్రియ, శోభన చిత్రాలలో తమ నృత్యకౌశలంతో ఎంతగానో ఆకట్టుకున్నారు. కమల్ హసన్ నాట్యం ఎంత అవలీలగా చేస్తారో ‘సాగర సంగమం’ చిత్రంలో ‘ఏలా నీదయా రాదూ.. బాల కనకమయ చేలా..’ త్యాగరాయ కీర్తనకు చేసిన అభినయం చూస్తే అర్ధమవుతుంది. అన్నట్లు కథక్‌లో కృష్ణ తాండవ, శివ తాండవ, రావణ తాండవ అని మూడు రకాల తాండవ నృత్యాలున్నాయి. కొన్ని సార్లు కాళిక తాండవం కూడా ప్రదర్శిస్తారు. మణిపురిలో శివ తాండవం, కృష్ణతాండవం ప్రదర్శిస్తారు. రాధాకృష్ణుల ప్రేమను లాస్య రీతిలో ప్రదర్శిస్తారు. కృష్ణుడు కాళీయుడి పై తాండవ నృత్యం చేశాడని పురాణాలు చెపుతున్నాయి. గణేశుడి ఎనిమిది హస్తాలను అష్టభుజ తాండవ నృత్య భంగిమగా వర్ణిస్తారు. కాకతీయుల కాలంలో విలసిల్లి, ఆ పైన మరుగున పడిన పేరిణి శివతాండవాన్ని డా.నటరాజ రామకృష్ణ గారు పునరుద్ధరించి, దానికి మళ్లీ పూర్వవైభవం తెచ్చారు. పేరిణి శివతాండవం పురుషులు మాత్రమే చేసే నృత్యమైనా పేరిణిలో ‘లాస్య’ రీతి కేవలం మహిళలు మాత్రమే చేసేదిగా ఉంది. పేరిణి శివతాండవాన్ని తెలంగాణ రాష్ట్ర నృత్యరీతిగా గుర్తించారు. మన దేశంలో వివిధ నృత్య రీతులలో ఎందరెందరో ప్రఖ్యాత నర్తకులున్నా ఆబాల గోపాలానికి తెలిసిన పేర్లు కథక్‌లో పండిట్ బిర్జూ మహరాజ్, ఒడిస్సీలో కేలుచరణ్ మహాపాత్ర, కథాకళిలో కలమండలం గోపి, మోహినీయాట్టంలో సునంద నాయర్, మణిపురిలో గురుబిపిన్ సింగ్, ఝవేరీ సిస్టర్స్, సత్రియలో బాపురామ్ బయన్ అటై, ఇందిరా పి.పి.బోరా. హిందీ సినిమాల్లో కథక్ రీతి నృత్యగీతాలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఉమ్రావ్ జాన్ లోని ‘దిల్ చీజ్ క్యా హై.. ఆప్ మెరీ జాన్ లీజియే.. బస్ ఏక్ బార్ మేర కహా మాన్ లీజియే’ పాటకు రేఖ ఎంత అందంగా డ్యాన్స్ చేసిందో. అలాగే పాకీజా, బాజీరావ్ మస్తాని, దేవదాస్ చిత్రాలలో ఈ రీతి పాటలు చాలా పాపులర్ అయ్యాయి.

ఇక జానపద నృత్యరీతులెన్నెన్నో. అన్నీ హృదిని అలరించేవే. వెస్ట్రన్ డ్యాన్స్ సైతం ఆషామాషీ కాదు. దేని గొప్పతనం దానిదే. నిత్య జీవితంలో కూడా నాట్యం ఎంతగా మమేక మైందంటే, ‘నెత్తినెక్కి డ్యాన్స్ చేయటం, ఆడింది ఆట, పాడింది పాట, మనసు ఆనందంతో నృత్యం చేసింది, కరాళ నృత్యం, ప్రళయ తాండవం, విలయతాండవం’ వంటి పదాలు పలుమార్లు వినిపిస్తుంటాయి. చిన్న పిల్లలను తారంగం ఆడిస్తూ ‘తారంగం తారంగం.. తాండవ కృష్ణా తారంగం’ అని పాడుతుంటారు. నాట్యకళ దైవదత్తం. బాల్యంలో చాలామంది నాట్యం నేర్చుకోవటం మొదలెడతారు. కానీ అది అనేకానేక కారణాల వల్ల మధ్యలోనే భరతవాక్యం పలుకుతుంది. ఏ కొందరో తపనతో సాధన చేస్తూ, కళకే అంకితమవుతారు. కళలు సంస్కృతి ప్రతీకలు. వాటిని తరంతరం నిరంతరంగా కొనసాగిస్తేనే జాతి తన ప్రత్యేకతను నిలుపుకోగలిగేది. కొంతకాలంగా మసకేసిపోతున్న సంప్రదాయ సంగీత, నాట్యకళలను పునరుజ్జీవింప జేసిన సినీ దర్శకులుగా కె.విశ్వనాథ్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఒకటా, రెండా సప్తపది, శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, శ్రుతి లయలు, స్వాతి కిరణం, స్వర్ణకమలం.. అన్నీ సంగీత, నృత్య సమలంకృతాలే. ఈ చిత్రాల ప్రభావంతో మళ్లీ సంగీత, నృత్య రంగాలు కొత్త చివుళ్ళు వేసి విలసిల్లుతున్నాయి.. ‘ఆంటీ’ పిలుపుతో తుళ్లిపడి చూశాను. పక్కింటి పాప రవళి. దాంతో తలపులన్నీ మది తలుపు చాటుకు.. ‘ఏంటి’ అన్నట్లు చూశాను. ‘ఆంటీ నాకు డ్యాన్స్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది’. ‘ఏం డ్యాన్స్ చేశావు?’ అడిగాను. ‘నెమలికి నేర్పిన నడకలివి.. ఆన్లైన్ స్కూల్ కదా, వీడియో పంపాం’ అంటూ ‘చూస్తారా ఇప్పుడు మళ్లీ చేయనా’ ఉత్సాహంగా అడిగింది. ‘చెయ్యవోయ్, చూడటానికి నేను రెడీ’ అనటం ఆలస్యం.. ‘నెమలికి నేర్పిన నడకలివి.. మురళికి ఆందని పరుగులివీ.. శృంగార సంగీత నృత్యాభినయ వేళ.. చూడాలి నా నాట్య లీల..’. నిండా ఎనిమిదేళ్లు లేవు, ఎంత బాగా చేస్తోందో.. రవళి నృత్యం చూస్తూ నా మదిలో మొదలైంది ఆనంద నృత్యం!

Exit mobile version