Site icon Sanchika

మానస సంచరరే-51: దొరకునా ఇటువంటి పాట

[box type=’note’ fontsize=’16’] 25 సెప్టెంబరు 2020న మృతి చెందిన ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలను గుర్తుచేసుకుంటూ, వారి వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని వివరిస్తూ నివాళి అర్పిస్తున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]’న[/dropcap]రుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెండి నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా..


ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి
గుండియలను అందియలుగ చేసి
తకిట తధిమి తకిట తథిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన.’

పాట వింటూ ఎంత అర్థవంతమైన పాట.. వేటూరి కలం, బాలు గాత్రం, కమల్ హసన్ నటన మూడు వేటికవే దీటుగా రాణించాయి, అనుకుంటుంటే.. ‘ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం’ అన్న వార్త చూసి షాకయ్యాను. ఎందుకంటే బాలుగారికి కరోనా వచ్చినప్పుడు కూడా ఆయనే స్వయంగా తనకు కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, బాగానే ఉన్నానని, ఆసుపత్రిలో చేరుతున్నానని, ఎవరూ ఫోన్లు చేయవద్దని స్థిరమైన గొంతుతో చెప్పడంతో తగ్గిపోతుందనే ధైర్యం కలిగింది. ఆ తర్వాత పరిస్థితి ఆందోళనకరం అన్నారు. మళ్లీ వైద్యానికి ప్రతిస్పందిస్తున్నారు, ఆరోగ్యం నిలకడగా ఉంది, కొద్దిపాటి ఆహారం తీసుకున్నారు, కుమారుడితో మాట్లాడారు వంటి వార్తలు తెలుసుకొని, హమ్మయ్య ఆలస్యమైనా ఆరోగ్యం చేజిక్కుంచుకుంటారని ఆశించాను. కానీ హఠాత్తుగా విధి చేదు కబురు చేరవేసింది. అయినా ఎక్కడో ఆశ మిణుకు మిణుకు మంటోంది.

భగవాన్! బాలుగారు క్షేమంగా ఉండాలి..

రాత్రి పడుకున్నానే కానీ నిదురెంతో దూరం. మనసంతా బాలు పాటల తలపులే. దాదాపు అర్ధ శతాబ్ది కాలంగా నిత్యం ఇంటా, బయటా ఎక్కడైనా బాలుగారి పాట వినిపిస్తోంది, అలరిస్తోంది, సహానుభూతినిస్తుంది, సాంత్వననిస్తోంది. నవ్విస్తోంది, జోలపాడుతోంది, కలలలోకి పంపుతోంది, మేలుకొలుపుతోంది, స్ఫూర్తినిస్తోంది. అందునా బుల్లితెరలో ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ప్రారంభించాక బాలుగారు ప్రతి ఇంటికి మరింత దగ్గరయ్యారు. పాటలతో అంతకు ముందు పెద్దగా పరిచయం లేనివారికి కూడా పాటలమీద ఆసక్తిని కలిగించారు. ముఖ్యంగా పాత బంగారంలాంటి పాటలు మళ్లీ ఈతరం వినేలా, నేర్చుకునేలా, పాడేలా చేసిన ఖ్యాతి బాలుగారిదే. తొలిసారిగా ‘మర్యాద రామన్న’ (పాత) చిత్రంలోని ‘ఏమి ఈ వింత మోహం’ యుగళగీతంలో.. ‘రావే కావ్యసుమబాలా’ అంటూ తమ గళాన్ని వినిపించారు. మొదట్లో బాలుగారి గొంతు సుతిమెత్తగా ఉండేది.

చుక్కలతో చెప్పాలని..
ఏమని..
ఇటు చూస్తే తప్పని..
ఎందుకని..
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమో అని.. పాటకు ఆ తర్వాత వచ్చిన పాటలకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది.

ఒకటా, రెండా నలభైవేల పాటలు పాడిన గంధర్వుడు, పదహారుభాషలలో పాడిన అసమాన గాయకుడు. నిజానికి గంధర్వగానం ఎలా ఉంటుందో తెలియదుగానీ బాలుగారు పాడిన వైవిధ్యభరితమైన ఎన్నో పాటలు విన్నవారికి ‘ఇదే గంధర్వ గానం’ అనిపించకమానదు.

మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది పొదరిల్లు మాది..
నేనైలే ఆకు కొమ్మ.. తానైతే వెన్నెల వెల్ల..
పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది..

పాట ఎందరి గుండెలకో చేరువైంది.

ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయేనే..

పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే…
పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే… పాట ప్రతి హృదినీ అలరించింది. నేటికీ అది నవ పారిజాతమే.

ఘంటసాల గారితో కలిసి పాడిన మరో చక్కని పాట –

ప్రతిరాత్రి వసంత రాత్రి ప్రతిగాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలి
ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి…
ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక
విరజాజి తీగ పుంత జరిగింది మావి చెంత అనడంలో గమకాలు పలికించి..

ననుజూచి, నిను జూచి వనమంతా వలచింది
ననుజూచి ప్రియాప్రియా వనమంతా వలచింది

నిజమే బాలుగారు బ్రతుకంతా పాటతోనే సాగారు. ఆయన పాటను లోకమంతా వలచింది. అలాగే ఘంటసాల గారితో కలిసి పాడిన..

ఎన్నాళ్లో వేచిన ఉదయం, ఈనాడే ఎదురవుతుంటే
ఇన్నినాళ్లు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే
ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి’ పాటలో శోభన్‌బాబుకు బాలు గొంతు, కృష్ణగారికి ఘంటసాల గొంతు ఎంత చక్కగా సరిపోయాయో.

ఎఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరికీ కూడా ఒప్పేలా తన స్వరాన్ని తగినట్లుగా మార్చటంలో, ఉచ్చారణ, పదాల విరుపు, చిన్న చిన్న చేర్పుల హంగులతో సెహభాష్ అనిపించుకున్నారు. అడవిరాముడు చిత్రంలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ’ యుగళంలో ఎన్టీఆర్ గొంతుకు నూరుపాళ్లు సరిపోయేలా పాడి సూపర్ హిట్ చేశారు. అలాగే పుణ్యభూమి నా దేశం నమో నమామి.. ధన్యభూమి నా దేశం సదా స్మరామి..’ వంటి ఎన్నెన్నో పాటలు..

వందనం.. అభివందనం… నీ అందమే ఒక నందనం..
వందనం అభివందనం..నిన్నకు రేపుకు సంధిగ నిలిచిన సుందరీ
పాదాభివందనం పాదాభివందనం… పాట అక్కినేనే పాడారా అన్నంత అందంగా పాడారు.

హీరోలకే కాదు, కమెడియన్లకు, ఇతర క్యారెక్టర్ యాక్టర్లకు సైతం చక్కగా నప్పేలా పాడిన క్రెడిట్ బాలుగారిది.

ముత్యాలు వస్తావా, అడిగిందీ ఇస్తావా, ఊర్వశిలా ఇటురావే వయారీ..’ పాట వింటే అల్లు రామలింగయ్యగారే పాడారా అన్నంత గొప్పగా ఉంటుంది.

తాళికట్టు శుభవేళ.. మెడలో మందారమాల‘ పాట ఎంతో వెరైటీ, మిమిక్రీ తోడైన ఈ పాట సూపర్ హిట్. అలాగే ‘జూనియర్.. జూనియర్.. ఇటు అటు కాని హృదయముతోటి ఎందుకురా ఈ తొందర నీకు‘ వెంట్రిలాక్విజమ్ కూడిన పాట కూడా భిన్నమైనదే. ఇక

ఉప్పొంగెలే గోదావరి.. ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి.. మా సీమకే చీనాంబరి…
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇల్లే ఓడలైపోతున్న ఇంటిపనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపురా పడవ మీద రాగా.. ప్రభువు తానూ కాగా..  పాటలో ప్రతి మాట బాలుగారు పలికిన తీరు అనన్యసామాన్యం అనిపిస్తుంది. అలాగే ‘వేదంలా ఘోషించే గోదావరి.. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి‘ పాటలో అలనాటి రాజమహేంద్రవరాన్ని, ఆ గొప్పతనాన్ని తన స్వరంతో మన కళ్ల ముందు నిలుపుతారు.

శివరంజనీ నవరాగిణీ.. వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృతవాహినీ.. పాట కర్ణామృతమే.

అభినవ తారవో.. నా అభిమాన తారవో..’ పాట మరో అందమైన పాట. అభినందన చిత్రంలో ‘అదే నీవు, అదే నేనూ, అదే గీతం పాడనా; ఎదుట నీవే, ఎదలోన నీవే, ఎటు చూస్తే అటు నీవే, మరుగైనా కావే; ప్రేమ లేదని ప్రేమించరాదని; ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం, చేసినాను క్షీరసాగర మథనం, మింగినాను హలాహలం..‘ పాటలన్నీ నా మనసు నింపేవే. అన్నట్లు సంగీత దర్శకత్వంలోనూ బాలూగారూ తమ ప్రతిభ చూపారు. తూర్పువెళ్లే రైలు’ చిత్రంలోని పాటలకు ఆయనే దర్శకత్వం వహించారు.

చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా..
బొట్టూ కాటుక పెట్టి.. నేకట్టే పాటకు చుట్టీ,
ఆశపడే కళ్లళ్లో ఊససులాడు వెన్నెల బొమ్మ.. పాట సుందరం, సుమధురం.

ఏ రసమైనా బాలుగారి గొంతులో అవలీలగా అద్భుతంగా ఒదిగి పోతుంది. శృంగారగీతాలు ఎన్నో ఉన్నాయి కానీ ‘మిస్టర్ పెళ్లాం’ చిత్రంలోని

సొగసు చూడ తరమా.. హ.. హ..
నీ సొగసు చూడ తరమా
నీ ఆపసోపాలు నీ తీపి శాపాలు
ఎర్రని కోపాలు, ఎన్నెన్ని దీపాలు
అందమే సుమా..నీ సొగసు చూడతరమా.. అంటూ పాటను ఎంతో సొగసుగా పాడారు.

మదినిండా పాటల ఊసులే. రాత్రంతా కలత నిదురే. తెల్లవారింది. అయినా ఏ శుభవార్తా లేదు. ఇంకా అత్యంత విషమమనే మాటే. యాంత్రికంగా పనులు చేస్తున్నా మనసులో బాలుగారి పాటలమాటలే. హిందీ పాటలతో ఉత్తరాదిలోనూ విజయకేతనం ఎగురవేశారు బాలుగారు. ‘ఏక్ దూజే కేలియే’ చిత్రంలో ‘తెరె మేరె బీచ్ మె కైసా హై యే బంధన్ అంజానా..’ పాట ప్రత్యేకంగా అలరించింది. ‘హమ్ ఆప్కే హై కౌన్’ లో పాటలు ఒక ఊపు ఊపేశాయి. ‘పెహ్‌లా పెహ్‌లా ప్యార్ హై.. పెహ్‌లీ పెహ్‌లీ బార్ హై‘; లతామంగేష్కర్‌తో కలిసి పాడిన ‘దీదీ తేరా దేవర్ దివానా హయ్ రామ్ కుడియోంకో డాలే దానా’లో ‘భాభీ తేరీ బెహనాకో మాన.. హయ్ రామ్ కుడియోంకా హై జమానా.. ఓరబ్బా ముఝ్‌కో బచానా, హయ్ రామ్‘.. అంటూ హుషారైన పాటను ఎంతో అందంగా పాడారు.

అన్ని పాటలు ఒక ఎత్తు, శంకరాభరణం చిత్రంలోని పాటలు మరో ఎత్తు. ఈ పాటల్లో బాలుగారు సరికొత్త స్వరాన్ని వినిపించారు. ‘ఓంకార నాదాలు సంధానమౌ గానమే శంకరాభరణము’; ‘శంకరా నాదశరీరా పరా’; ‘దొరకునా ఇటువంటి సేవ’.. అజరామరాలు. అలాగే…

శ్రీ తుంబుర నారద నాదామృతం…
స్వరరాగ రసభావ తాళాన్వితం
సంగీతామృత పానం ఇది స్వరసురజగతికి సోపానం
స్వరం పదం ఇహం పరం కలిసిన‘..

ఆ నారద తుంబురులను మన ముందుంచినట్లుంటుంది.

నా పాట పంచామృతం.. నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ..
గళము కొలను కాగా ప్రతిపాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా విధి సతి పాదపీఠికాగా
శ్రుతిలయలు మంగళహారతులై.. స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం.. సరస్వతీ సమర్పణం

ఈ పాట పంచామృతమన్నది నిక్కమైన నిక్కము.

ఇక అన్నమయ్య, భక్త రామదాసు చిత్రాల్లోని పాటలు నిండైన భక్తి భావంతో పరవశింపజేస్తాయి.

అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం..
అంతరంగమున ఆత్మారాముడు.. అనంతరూపముల వింతలు
సలుపగ.. సోమసూర్యులును సురలు తారలును..
ఆ మహాంబుధులు అవనీజంబులు..అంతా రామమయం..

ఆ భక్తి మాధుర్యం శ్రోతను అలౌకిక జగత్తుకు తీసుకెళుతుంది. పాట ఆసాంతం శ్రోతల్ని పులకితుల్ని చేస్తుంది. మరోపాట.. ‘అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితినీ‘.. అన్నమయ్య ఆర్తిని బాలుగారు ప్రతి అక్షరంలో పలికించిన పాట. అయినా ప్రతి ప్రభాతాన తెలుగింట బాలుగారు పాడిన లింగాష్టకమో, హనుమాన్ స్తుతో, గణేశ స్తుతో చిత్తాన్ని ప్రశాంతం చేస్తాయి. ఈవేళ, ఆవేళ అని ఏమిటి అన్ని వేళలా ఆబాల గోపాలానికి బాలగంధర్వుడి స్వరం తోడుగా ఉంటూనే ఉంటుంది. బాలు కేవలం గాయకుడు మాత్రమే కాదు, బాలుగారు చిత్ర నిర్మాత, మంచి నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఆరు జాతీయ అవార్డులు, పాతిక నంది అవార్డులు, ఆరు ఫిలిమ్‌ఫేర్ అవార్డులు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పద్మభూషషణ్ పురస్కారం, రెండువేలపదహారులో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా సిల్వర్ పీకాక్ మెడల్, తమిళనాడు, కర్నాటక వగైరా రాష్ట్రాలందజేసిన అసంఖ్యాక అవార్డులు.. ఇలా ఎన్నెన్నో కీర్తి కిరీటాలు. ‘మిథునం’ చిత్రంలో బాలుగారి నటన అద్వితీయం. ఆ పాత్ర ఆయన కోసమే పుట్టిందా అనిపించేంత సహజంగా నటించారు. బాలుగారికి పాట అంటే ప్రాణం. మంచి పాట అంటే మరీమరీ ఇష్టం. అపూర్వ సంగీత, సాహిత్య మేలుకలయికల పాటలుకొన్నింటిని పాడే అవకాశం తనకే వచ్చి ఉంటే ఎంత బాగుండేది అనుకుంటారు. ‘చివరకు మిగిలేది’ (పాత) చిత్రంలో మల్లాది రామకృష్ణశాస్త్రిగారు అందించిన

సుధవోల్ సుహాసినీ, మధువోల్ విలాసినీ..
ఓ…..రమణీ… సరసం సరాగమేలా, రావే వరాల బాలా..
ఒహో కమనీ.. సుధవోల్ సుహాసినీ..
అంతులేని ప్రేమ నాదిగా, ఆనందజ్యోతి నీవుగా..
ఓహో కమనీ.. సుధవోల్ సుహాసినీ..
నీవేలే ఈ వెన్నెలా నేనేలె ఈ తెమ్మెరా
సడిలేని నడిరేయిలా జవరాల మనమౌదమే..
ఓ కమనీ…సుధవోల్ సుహాసినీ..

ఘంటసాల మాస్టారు పాడిన పాట ఆయన కెంతో నచ్చింది. ఆ పాటను స్వరాభిషేకం కార్యక్రమంలో తాను అచ్చు అలాగే ఈలతో సహా పాడి అందరినీ అబ్బురపరిచారు.

బాలుగారు కళాకారులుగానే కాదు, మహోన్నతమైన వ్యక్తిత్వంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వినమ్రత, సీనియర్‌ల పట్ల అపార భక్తి, గౌరవాలు, సేవాభావం, తెలుగు భాష పట్ల అపరిమిత ప్రేమాభిమానాలు, యువతరానికి మార్గదర్శనం. ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. తెలుగులో పద్య ప్రక్రియ విశిష్టత గురించి తరచు వివరించేవారు. సామాజికహితం కోరుతూ ఎన్నెన్నో మంచి మాటలు తమవంతు బాధ్యతగా చెప్పారు. పాటల దిగ్గజమైన బాలుగారు టీవీ కార్యక్రమం ద్వాం అసంఖ్యాక గాయనీ గాయకులను తీర్చిదిద్ది, వారికి గొప్ప భవిష్యత్తు ప్రసాదించారు. తెలుగు సినీ నేపథ్య సంగీతంలో బాలు శకంగా గుర్తించేంతగా కృషి చేశారు, రాణించారు. మధ్యాహ్నమైంది. ఆశలన్నిటినీ వమ్ముచేస్తూ, నిన్నటి వరకు నమ్మించిన విధి, హఠాత్తుగా వంచించి బాలును మరలిరాని లోకాలకు లాక్కెళ్లింది. పంథొమ్మిదివందల నలభై ఆరు జూన్ నాలుగున నెల్లూరులోని కోనేటమ్మ పేటలో పుట్టిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు అంటే రెండువేల ఇరవై సెప్టెంబర్ ఇరవై అయిదున పాట, మాట ఆపి, పనుందంటూ పరలోకాలకేగారు. ఎందుకిలా?

కొన్ని ప్రశ్నలకు బదులే ఉండదు. అభిమానులంతా బాధాతప్త హృదయాలతో..

బాలుగారు చివరగా పాడిన పాట, ఏప్రిల్ నాలుగు ఈనాడు దినపత్రికలో వచ్చిన బహుమతి పొందిన కవిత ‘మనిషిని నేను’. తంగెళ్ల రాజగోపాల్ (అమలాపురం) గారి కవిత. బాలుగారికి ఆ కవిత బాగా నచ్చి వెంటనే ఏ మ్యూజిక్ లేకుండానే తన కోసమే తాను మొబైల్‌లో పాడుకున్న పాట…

విశ్వం నాకోసమే విస్తరించి ఉందని
పుడమి నాకోసమే పుట్టిందని…
సమస్త జీవరాశులు నా బానిసలని
నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను.. మనిషిని నేను
అవనిని అమ్మంటాను నేను.. ఆదిత్యుణ్ని నాన్నంటాను నేను
నడక వచ్చేదాకే అణిగిమణిగి ఉంటాను
నేను ఎగిరితే మేమం అడ్డు రాకూడదన్నాను..
నేను ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను
అడుగేస్తే అడవి దారి విడాలన్నాను
పడవెక్కితే అలలు తలొంచాలన్నాను…
అమ్మ కడుపులో బంగారం ఉందని తొలిచేశాను
సాగర గర్భంలో చమురుందని చిలికేశాను
మరి రేపటికో అంటే నేనుండనుగా అని నవ్వేశాను..
నేలమీద గీతలు గీసి నీది నాది అని పంచేసుకున్నాను
నా ముందు నా తర్వాతని కాలాన్ని విడగొట్టాను
నేనే రాజునన్నాను తక్కినదంతా నా రాజ్యమన్నాను
నా కొట్లాటలు చరితన్నాను.. రుజువు కోసం రాళ్లు పాతాను
నేను చెప్పినట్లు నడిచే.. నేను చెక్కినట్లు కనిపించే
నాలాగే ఉండే దేవుణ్ని సృష్టించుకున్నాను
నన్ను నడిపేది వాడేనని నమ్మ బలికాను
ఏడంటే అడుగో అని చేతులు పైకెత్తాను
దాన్ని దీన్ని చంపుకుతిన్నాను
వింత రోగమంటించుకొని ఊరంతా ఏగాను..
గండం గడిచేదాకా గమ్ముగుంటానన్నాను గుమ్మం దాటనన్నాను
నే స్వాగతం పాడకుంటే వసంతం ఆగిపోయిందా
నా స్వాగతం వినబడకపోతే ఆమని పాట ఆపిందా
నే చతికిలబడగానే భూభ్రమణం నిలిచిందా
నా సందడి లేదే అని అంబరం ఊడిపడిందా
రాజు కాదు, బూజు కాదు కిరాయికి నేనుంటున్నాను
బతికుంటే చాలంటూ గోలగోల పెట్టాను
నీ మాటే వింటానని మట్టి ముట్టుకున్నాను
బుద్ధేదో వచ్చినట్టు వినయమొలకబోశాను.
మందో మాకో దొరకంగానే మళ్ళీ గద్దెనెక్కుతాను
ఒళ్లు చక్కబడంగానే నువ్వెంతని అంటాను
నాకేదీ సాటి రాదంటూ మళ్ళీ మొదటికొస్తాను.
మనిషిని నేను, మాయదారి మనిషిని నేను
మనిషిని నేను, మాయదారి మనిషిని నేను
మనిషిని నేను, మాయదారి మనిషిని నేను’

‘పాడాలనిపించింది పాడేశాను… పాడాలనిపించింది పాడేశాను’ అన్నారు.

నిష్క్రమించబోతూ కూడా మన కోసం

ఓ చక్కని సందేశాత్మక గీతాన్ని అందించిన

బాలుగారికి నివాళిగా ఈ కాసిన్ని అక్షర సుమాలు!

Exit mobile version