Site icon Sanchika

మానస సంచరరే-54: విహారం.. మదికి ఆహ్లాదం!

[box type=’note’ fontsize=’16’] “ఏమాత్రం వీలున్నా, ఆరోగ్యం సహకరించినంత వరకు ఉన్న బడ్జెట్ లోనే అడపాతడపా విహారయాత్రలకు వెళ్లటం ఎవరికైనా, ఎంతైనా అవసరం” అంటున్నారు జె. శ్యామల. [/box]

ముంగిట్లో విరిసిన ముద్దబంతిపూల విలాసాన్ని ఆస్వాదిస్తున్న వేళ ‘నేస్తమా! క్షేమమా!’ అన్న పలకరింపుతో ఉలిక్కిపడి చూశాను. ఎదురుగా అందంగా నవ్వుతోన్న ఆమని.

‘హాయ్ ఆమనీ! రారా’ ఆహ్వానిస్తూ లోపలికి దారితీయబోయాను.

‘ఇక్కడే బాగుంది. ఈ అరుగు మీద కూర్చుని మొక్కల్ని చూస్తూ మాట్లాడుకోవచ్చు’ అంది.

‘అయితే టీ తీసుకు వస్తాను’ అంటూ ఆమనిని మొక్కల మధ్యేవదిలి లోపలికెళ్లి గబగబా టీ తయారుచేసి, టీ కప్పులతో ఆమని దగ్గరకు చేరాను. ఇద్దరం టీ తాగుతూ కబుర్లు కలబోసుకున్నాం. నాకు హఠాత్తుగా ఓ విషయం గుర్తుకొచ్చింది. వెంటనే ‘ఆమనీ ఇంతకీ నీ హనీమూన్ కల నెరవేరిందా?’ అడిగాను. ఎందుకంటే కాలేజీలో చదువుకునే రోజుల్నుంచి ఆమనికి అందమైన ప్రదేశాలను దర్శించాలని ఎంతో కోరిక. కానీ వాళ్లింట్లో దానికి అవకాశం చిక్కేది కాదు. ‘పోన్లేవే, పెళ్లయ్యాక మీ శ్రీవారితో కలిసి హనీమూన్‌కి నీకెంతో ఇష్టమైన కులు, మనాలి వెళ్దువు గానిలే’ అని మిత్రబృందం అనునయించేవాళ్లం. అది గుర్తొచ్చే ఈ ప్రశ్న వేశాను. వెంటనే ఆమని ‘మా ఆయనా, హనీ.. హనీ అని పిలవటమే గానీ హనీమూన్ ఊసే లేదు’ అంది నిరాశగా. ‘అదేంటి ఆమనీ! ఇన్నేళ్లయినా నీ కోరిక తీరలేదా?’ అన్నాను. ‘పెళ్లయిన వెంటనే అడిగితే కొత్తగా చేరిన ప్రయివేట్ ఉద్యోగం. ఎక్కువ రోజులు సెలవు దొరకటం కష్టం అన్నారు. ఆ తర్వాత మా అత్తగారికి అనారోగ్యం, మాకు పిల్లలు పుట్టటం, వాళ్ల ఆలనా, పాలనాతోనే సరిపోయింది. ఆ తర్వాత మామగారికి అనారోగ్యం.. ఈ కష్టాలన్నీ గట్టెక్కి, పిల్లలు పెద్దయ్యారు అనుకుని ఇప్పుడైనా వెళదాం అనుకున్నామో లేదో, ఈ కరోనా మహమ్మారి ప్రపంచయాత్ర మొదలెట్టింది. క్యా కర్‌నా?’ అంది ఆమని.

పాపం అనిపించి, ఆమనిని కాస్తంత ఉత్సాహపరచాలని ‘ప్రేమయాత్రలకు బృందావనము, నందనవనమూ ఏలనో.. కులుకులొలుకు చెలి చెంతనుండగా కులు, మనాలి ఏలనో..’ సరదాగా పాడాను. ‘బాగానే పాడావు కానీ, మా ఆయన ముందు పాడకు. ప్రేమయాత్రలు కాకపోయినా, తీర్థయాత్రలయినా చేస్తామన్న ఆశ నాకింకా ఉంది. ఈ పాట వింటే మా ఆయన తీర్థయాత్రలకు కూడా సున్నా చుట్టేస్తాడు’ అంది.

నేను నవ్వేశాను. ఆ తర్వాత టాపిక్ మారిపోయింది. ఏవేవో ఊసులు. కొద్ది సేపటికి ఆమని వెళ్లిపోయింది. కానీ నా మనసు ఆలోచనల విహారం మొదలు పెట్టింది.

మనిషికి బతకటానికి ప్రాణవాయువు ఎంత అవససరమో, మనసు ఉత్సాహవంతంగా, ఉత్తేజభరితంగా, ఉల్లాసంగా ఉండటానికి యాత్రలు అంతే అవసరం. అవి మనసుకు ఆక్సిజన్ అందిస్తాయి. జీవితమే ఒక యాత్ర అయితే అందులో ఈ యాత్రలు ఓ భాగం. అసలు ప్రయాణం అనగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఒక్కరే వెళ్లే యాత్రలు, జంటగా లేదా కుటుంబంతో వెళ్లే యాత్రలు లేదా స్నేహబృందంతో వెళ్లే యాత్రలు.. ఇలా యాత్రలు రకరకాలు. యాత్రానుభూతి అనేది, చూసింది ఒకే ప్రదేశమయినా, ఒంటరిగా వెళ్లినప్పుడు ఓ రకంగా, కుటుంబంతో వెళ్లినప్పుడు మరోరకంగా, స్నేహితులతో వెళ్లినప్పుడు ఇంకోరకంగా ఉంటుంది. దీని ప్రత్యేకత దానిదే. ‘కుంకుమరేఖ’ చిత్రానికి ఆరుద్ర రాసిన పాట..

“తీరెను కోరిక తీయతీయగా

హాయిగ మనసులు తేలిపోవగా

కలిసి ప్రయాణం, కలదు వినోదం

కలలు ఫలించెను కమ్మకమ్మగా..” మనసు నెమరువేసింది.

ప్రకృతి సౌందర్యం భోగుల్ని, యోగుల్ని కూడా ఆకర్షిస్తుంది. సౌందర్యారాధకులను మాత్రమేకాదు, అన్నిటినీ త్యజించిన తాపసులను సైతం ప్రకృతి మురిపింపజేస్తుంది. అందాల హిమగిరుల సౌందర్యాన్ని చూసి పరవశించని హృది ఉంటుందా? ‘పాండవ వనవాసం’ చిత్రానికి సముద్రాల సీనియర్ అందించిన గీతం మదిలో మెదులుతోంది..

“హిమగిరి సొగసులు.. మురిపించును మనసులు.. 

చిగురించునేవో ఏవో ఊహలు.. హిమగిరి సొగసులూ..

యోగులైనా, మహా భోగులైనా మనసుపడే మనోజ్ఞసీమ

సురవరులు సరాగ చెలుల..

కలసి, సొలసే అనురాగ సీమ.. … ॥హిమగిరి॥

ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించెనేమో…

సుమశరుడు రతీదేవి జేరీ.. కేళి, లేలి, లాలించెలేమా…”

మనోజ్ఞసీమతో పోటీపడే మనోజ్ఞగీతం!

నిత్యం వైదిక కర్మలతో క్షణమాత్రం తీరికలేకుండా ఉండేవారు సైతం ప్రకృతి రమణీయ ప్రదేశాలను చూసి పులకించాలనుకుంటారు. అందుకు మనుచరిత్రలోని ప్రవరుడే గొప్ప ఉదాహరణ. తమ గృహానికి అతిథిగా విచ్చేసిన సిద్ధుడు, తన కాలికి అద్భుత శక్తి గల పసరు రాయగా, హిమగిరులను చూడాలని ఆకాంక్షించి అక్కడికి చేరుకున్నాడు. అతడి మానసం ఆనందడోలికల్లో తేలియాడిపరవశంతో గానం చేసింది.. ఈ ఘట్టాన్ని ‘మనుషుల్లో దేవుడు’ చిత్రంలో నాటకంగా చిత్రీకరించారు. అందులో సినారె సమకూర్చిన సుమధురగీతం…

“అహో హిమవన్నగము, భరతావనికే తలమానికము

అంబరచుంబి శిఖరాలు, స్పరఝరీ తరంగాలు

ఆ అభంగ, తరంగ, మృదంగ రవముల..

అభినయమాడు మయూరాలు.. ॥అహో॥

భగీరథుడు తపియించిన చోటు, గగనగంగనే దించిన చోటు..

పరమేశుని ప్రాణేశుగ బడసి, గిరినందన తరియించిన చోటు ॥అహో॥”

పురాణాలలో నారదుడు త్రిలోక సంచారిగా పేర్కొన్నారు. ఆయన నారాయణ మంత్రం మననం చేసుకుంటూనే అలా అలా అలా నిరతం సంచరిస్తూనే ఉంటాడు. అందరినీ దర్శించి, యోగక్షేమాలు విచారించటమే కాదు, అక్కడి కబుర్లు ఇక్కడ, ఇక్కడి కబుర్లు అక్కడ చెపుతూ, చిలిపితనంతో వారిమధ్య కలహాలకు కారణమై నారదుడు కలహభోజనుడుగా పేరొందాడు.

విహార ప్రదేశాలను మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. అవి ప్రకృతి రమణీయ ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు.. ప్రకృతి రమణీయ ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాల కంటే పుణ్యక్షేత్రాలు సందర్శించే వారే ఎక్కువ

అనుకోవచ్చు. కారణం భక్తి భావన, ఆధ్యాత్మికత. అంతేగాక ఆపదల్లో ఇష్ట దైవాలకు మొక్కుకుని, ఆపద గట్టెక్కితే, మొక్కుబడులు తీర్చుకునే నిమిత్తం యాత్రలు చేస్తుంటారు. అలాగే తలచినది నెరవేరినపుడు.. పరీక్షల్లో ర్యాంకులు, ఉద్యోగాలు సాధించినపుడు, అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లో నిర్విఘ్నంగా జరిగినపుడు దైవదర్శనానికి యాత్రలు పరిపాటి. అయితే పుణ్యక్షేత్రాలు చాలావరకు ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన కొండలమీదే ఉండటం గమనార్హం. ఆ రకంగా చూస్తే దైవదర్శనంతో కలిగే ప్రశాంతతతో పాటు ఆహ్లాద ప్రకృతి ఇచ్చే ప్రశాంతత కూడా మనసును పరవశింపజేస్తుంది.

‘అందని ద్రాక్ష పుల్లన’ అని ఓ సామెత. అయితే ఒక్కోసారి మనిషి వైఖరికి ‘అందిన ద్రాక్ష పుల్లన’ అని సామెతను మారిస్తే సరిపోతుందనిపిస్తుంది. ఎందుకంటే వ్యయ ప్రయాసలు అధికంగా ఉండే దూర పర్యాటక ప్రదేశాల గురించి ఆలోచిస్తూ, వాటిని దర్శించాలని తహతహల లాడుతూ, తమకు సమీపంలో ఉన్నసుందర ప్రదేశాలను విస్మరిస్తుంటారు.

చారిత్రక విశిష్టత గల ప్రదేశాలను సందర్శించేవారికి ఆయా ప్రాచీన కోటల నిర్మాణ శైలి, శిల్పవైచిత్రిని నిశితంగా తిలకించి, వాటిని ఆస్వాదించి, ఆ శిల్పుల గొప్పతనాన్ని, ఆ శిల్పరీతుల ప్రత్యేకతను గుర్తించగలిగే అభిరుచి ఉండాలి. అక్కడి శిలాశాసనాలను చదివి, ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు, చరిత్రను అవగాహన చేసుకోవలసి ఉంటుంది. పర్యాటక కేంద్రాలలో ఆయా స్థలచరిత్రను, విశేషాలను వివరించడానికి గైడ్లు సైతం అందుబాటులో ఉండటం తెలిసిందే.

‘బాలరాజు కథ’ చిత్రంలో చిన్నపిల్లవాడైన బాలరాజు గైడ్‌గా పనిచేస్తుంటాడు. యాత్రికులకు మహాబలిపురం చరిత్రను చక్కని పాటలో వివరిస్తాడు. అది…

“మహాబలిపురం, మహాబలిపురం మహాబలిపురం..

భారతీయ కళాజగతికిది గొప్ప గోపురం

కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు, ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు..

కంచి రాజధానిగా పాలించాడు…

ఇది మంచిరేవు పట్నంగా కట్టించాడు..

తెలుగు సీమ శిల్పుల్నీ రప్పించాడు..

పెద్దశిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు..

పాండవుల రథాలనీ పేరుపడ్డవి..

ఏకాండి శిలలనుండి మలచపడ్డవి

వీటిమీద బొమ్మలన్నీ వాటమైనవీ..

తాము సాటిలేనివాటిమంటూ చాటుతున్నవి.. ॥మహాబలిపురం॥

పాశుపతం కోరెనూ పార్థుని మనసూ..

పరమశివుని కోసమూ చేసెను తపసూ

సృష్టంతా కదలివచ్చి చూడసాగెనూ,

ప్రతిసృష్టికి శిల్పమనీ పేరు వచ్చెనూ ॥మహాబలిపురం..॥”

ఆరుద్ర రాసిన అందమైన పాట యిది. ఇంతటి అందాలను చూడటం కన్నుల పండుగే. మరి ఆ కంటిచూపే కరువైనవారి సంగతి.. తోడుగా ఉన్నవారే వారికి ఆ అందాలను కళ్లకు కట్టాలి. అలాంటి పాటే ‘మంచి మనసులు’ చిత్రంలో ఉంది. అది

“అహో! ఆంధ్రభోజా.. శ్రీకృష్ణదేవరాయా..

విజయనగర సామ్రాజ్య తేజో విరాజా

ఈ శిధిలాలలో చిరంజీవివయినావయా..

శిలలపై శిల్పాలు చెక్కినారు…

మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు..

ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు..

ఒకప్రక్క ఉరికించు యుద్ధభేరీలు

ఒక చెంప శృంగారమొలుకు నాట్యాలు..

నవరసాలొలికించు నగరానికొచ్చాము

కనులు లేవని నీవు కలతపడవలదు.. నా కనులు నీవిగా చేసికొని చూడు ॥శిలల పై॥

ఏకశిల రథము పై లోకేశు వడిలోన ఓరచూపులదేవి ఊరేగిరాగా..

రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదనిసా స్వరములే పాడగా..”

ఆత్రేయ తన అక్షరశక్తితో ఆ కాలాన్ని మన ముందు నిలబెట్టిన పాట.

విద్యార్థులను వికాసం కోసం ప్రతి సంవత్సరం విహారయాత్రలకు తీసుకెళ్తుంటారు. కాలేజీ విద్యార్థులకు కూడా ఏటా ఎక్స్‌కర్షన్స్ ఉంటాయి. ఆ విహారయాత్రల ఆనందానుభూతులు పిల్లలకు మరువలేని తీపి గురుతులుగా మిగిలిపోతాయి. ఆ ఫొటోలు, వీడియోలు దాచుకుని ఎన్ని సంవత్సరాలు గడిచినా, మళ్లీ వాటిని తిలకించి, ఆ రోజులను స్మరణకు తెచ్చుకుంటుంటారు. స్కూలు పిల్లలను చంద్రగిరి కోటకు తీసుకెళ్ళే సన్నివేశం ‘కోడెనాగు’ చిత్రంలో ఉంది. ఆ సందర్భానికే మల్లెమాల ఎంతో అర్థవంతమైన పాటను అందించారు. అది..

“ఇదే చంద్రగిరీ.. శౌర్యానికి గీచిన గిరి.. ఇదే చంద్రగిరీ..

తెలుగుజాతి చరితలోన చెరిగిపోని కీర్తి సిరి

తెలుగు నెత్తురుడికించిన వైరులకిది మృత్యువు గరి ॥ఇదే..॥

తిరుమల శ్రీ వేంకటేశు చిరదరిశన వాంఛతో

ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము

ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా

వెలసినదిట స్వర్గము వెయ్యేళ్లకు పూర్వము ॥ఇదే చంద్రగిరీ..॥

ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు

నీతి రాటుదేలి రాయల గురువైనాడు

ఈ మహలే కవిగాయక పండితజన మండల మొకనాడు

ఈ శిథిలాలే గత వైభవ చిహ్నములై మిగిలినవీనాడు ॥ఇదే..॥”

అలాగే హైదరాబాద్ చరిత్రను చక్కగా పొదిగిన పాట ‘ఎం.ఎల్.ఎ’ చిత్రంలో ఉంది..అది…

“ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం….

పాలించెను గోలుకొండ కులీ కుతుబ్‌షాహి..

భాగమతి అతని యొక్క ముద్దుల దేవి

ప్రేయసికై కట్టినాడు పెద్ద ఊరు, ఆ ఊరే ఈనాడు హైదరబాదు..

అలనాడు వచ్చెనిట మహమ్మారి, అల్లా దయవల్ల ఆ పీడ పోయినాది

ఆ గండం తప్పిందని గుర్తు నిలిపినారు…

ఆ గురుతే అందమైన చారుమినారు ॥ఇదేనండి..॥

శ్రీరాముడు కనుపించే తానీషాదీకోట, భద్రాద్రి రామదాసు బందిఖానా..

చూడండీ ఇదిగో ఈ కోటలోన ॥ఇదేనండి..॥”

ప్రపంచంలోని ఇతరదేశాలను సందర్శించటం, ఆ విశేషాలను లిఖించడం ఏనాటినుంచో ఉంది. ఫాహియాన్, మెగస్తనీస్, అల్ బెరూని మొదలైన వారెందరో భారత్‌ను సందర్శించి ఆనాటి భారతదేశ పరిస్థితులను, విశేషాలను గ్రంథస్థం చేశారు. విమానాలు లేని కాలంలో దేశదేశాలన్నీ చూసి రావాలంటే సముద్రయానమే ఆధారం. ప్రయాణ సాధనమైన ‘ఓడ’ గురించి గేల్ అట్టల్ ఇలా అంటాడు… ‘ఏ షిప్ ఈజ్ సేఫ్ ఇన్ ది హార్బర్, బట్ దట్ ఈజ్ నాట్ వాట్ షిప్స్ ఆర్ బిల్ట్ ఫర్’. నిజమేకదూ. ప్రయాణంలో పగటి ప్రయాణం అనుభూతులు వేరు, రాత్రి ప్రయాణం అనుభూతులు వేరు. అయితే ఎటూ కదలకుండా పడకమీదే ప్రపంచాన్ని చుట్టి రావడం గమ్మత్తుల్లో కెల్లా గమ్మత్తు. దీపా థామస్ రాసిన ఆంగ్ల కవిత గుర్తుకొస్తోంది. అది..

“నైట్ ట్రావెలర్

అయామ్ ఎ నైట్ ట్రావెలర్ … ట్రావెల్ ఆల్ త్రూ ద నైట్

అండ్ మై బె డ్ ఈజ్ ఎ సెయిలింగ్ బోట్

ఐ రీచ్ మై బెడ్ ఎవ్విరి నైట్..

అండ్ టేక్ ఎ ట్రిప్ ప్లేసెస్ ఫార్ అవే

టు సీ న్యూ థింగ్స్ అండ్ పీపుల్

ఐ ట్రావెల్ పాస్ట్ ది హార్బర్స్.. ఫుల్ ఆఫ్ ఎంకర్డ్ బోట్స్

ఐ ట్రావెల్ పాస్ట్ ది బీచెస్.. విత్ స్వేయింగ్ కోకోనట్ ట్రీస్

ఐ వాచ్ ది వేవ్స్… ఎంబ్రేసింగ్ ది షోర్

ఐ వాచ్ ది కిడ్స్ ప్లేయింగ్.. అండ్ రీచ్ అవుట్ మై ఆర్మ్స్

దెన్ ఐ టచ్ మై ఓన్ బెడ్.. హియర్ కమ్స్ ఫ్లాష్

అండ్ మై బోట్ ఈజ్ బ్యాక్.. అండ్ అయామ్ బ్యాక్ ఇన్ బెడ్…”

చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయాన్ని ఎంత అందంగా చెప్పారో! అసలు అలా ప్రపంచ వీక్షణాన్ని గురించిన బలమైన ఆకాంక్ష వల్లే ప్రపంచాన్ని చుట్టి వచ్చే కలలు వస్తాయేమో. విదేశాలవారు పర్యటనలపై అమితాసక్తి చూపుతారు. మనదేశంలో కూడా ఇటీవల కాలంలో ప్రతివారు పర్యటనల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఏ రవాణా సౌకర్యాలు లేని పూర్వకాలంలో కాశీకి వెళ్లిన వాడు కాటికి వెళ్లినవాడు ఒకటే అని భావించేవారు. కారణం బండ్లపై అంతదూరం ప్రయాణం అంటే ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఇప్పుడు రకరకాల రవాణా సౌకర్యాలున్నాయి. పర్యాటక కేంద్రాలలో వసతి సౌకర్యాలు కూడా ఎంతగానో పెరిగాయి. ప్రభుత్వాలు కూడా పర్యాటకానికి ప్రత్యేకంగా ఒక శాఖను నెలకొల్పాయి. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ఆయా ప్రదేశాలను ఎంతగానో తీర్చిదిద్దుతున్నారు, ‘ఇంక్రెడిబుల్ ఇండియా’ అంటూ విస్తృత ప్రచారం చేస్తూ పర్యాటకంనుంచి ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు. ప్యాలెస్ ఆన్ వీల్స్, మహారాజా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు. అయితే విదేశీయాత్రికుల పట్ల మర్యాద విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. వారిని మోసం చేయటం, విదేశీ మహిళా సందర్శకులపై అత్యాచార యత్నాలు వంటి హేయమైన చర్యలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠకు భంగం కల్గించవూ? భద్రతలేని తావులను ఎవరైనా ఎందుకు సందర్శిస్తారు? ‘అతిథి దేవో భవ!’ మన సంస్కృతి. దాన్ని విస్మరిస్తే విపరిణామాలే. విదేశీయులు పర్యటనల పట్ల అమితాసక్తి కలిగిఉంటారు. తరచు ప్రయాణాలు చేస్తుంటారు. ఇటీవల కాలంలో మన దేశంలో కూడా పర్యాటకుల సంఖ్య పెరగడం ఆనందదాయకం. కొంతమంది ప్రభుత్వోద్యోగులు, పెద్ద కంపెనీల ఉద్యోగులు ఏటా తమ ఎల్‌టిసిలను సద్వినియోగం చేసుకుంటున్నారు . ప్రస్తుతం ప్రపంచమంతా కూడా కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన పరిస్థితి. లాక్‌డౌన్ దశల వారీగా ఎత్తివేయడం జరుగుతోంది. అయితే కొన్ని దేశాల్లో మళ్లీ కరోనా చెలరేగుతున్న పరిస్థితి. కరోనా కారణంగా ఘోరంగా దెబ్బతిన్న రంగాలలో పర్యాటకం కూడా ఒకటి. అయితే స్వదేశంలో జరుగుతాయనుకున్న కొన్ని వివాహాలు కరోనా పరిస్థితుల కారణంగా విదేశాల్లో జరగటం విశేషం.

అబ్బాయి, అమ్మాయి యుఎస్‌లో ఉంటేవారు రావడం కుదరని పరిస్థితిలో ఇరు కుటుంబాలు అక్కడికే వెళ్లి వివాహం చేయడం, పనిలోపనిగా దగ్గరలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు సందర్శించడం హర్షణీయమే. ఏమాత్రం వీలున్నా, ఆరోగ్యం సహకరించినంత వరకు ఉన్న బడ్జెట్ లోనే అడపాతడపా విహారయాత్రలకు వెళ్లటం ఎవరికైనా, ఎంతైనా అవసరం. కొందరు అంతదూరం వెళ్లడమెందుకు? హాయిగా నట్టింటకూచుని ‘నెట్టింట్లో కోరిన ప్రదేశాలు చూసేయక..’ అంటారు. కానీ విహారానుభూతి ఎలా వస్తుంది?

కొండ, కోన; లోయలు, గుహలు; గుడి, గోపురం; కోట, పేట; తోట,పాట; పువ్వు, నవ్వు; ఇష్టపడని వారుంటారా! ఎక్క డినుంచో నాకెంతో ఇష్టమైన పాట..

“సుహానా సఫర్ ఔర్ ఎ మౌసమ్ హసీఁ…

హమే డర్ హై, హమ్ ఖో నాజా యే కహీఁ

యె కౌస్ హ హై ఫూలోం మె ఛుప్‍కర్

బహార్ బెచైన్ హై కి ధున్ పర్?

కహీ గున్ గున్, కహీ రుఝున్ కె జైసె నాచె జమీ..॥సహానా॥

ఎ గోరీ నదియోం కా చల్నా ఉఛల్‌కర్

కె జైసె అల్హడ్ చలె పీ సె మిల్‌కర్

ప్యారె ప్యారె ఎ నజరె నిఖార్ హై హర్ కహీ ॥సుహానా॥

ఓ ఆస్‌మా ఝుక్ రహా హై జమీ పర్

ఎ మిలన్ హమ్ నె దేఖా యహీ పర్

మెరి దునియా, మెరె సప్నే మిలెంగె శాయద్ యహీ ॥సుహానా॥”

“మధుమతి’ చిత్రానికి శైలేంద్ర అందించిన,ముఖేష్ గానం చేసిన మధురగీతం. మనసు ముందు అందాల ప్రకృతి ఆవిష్కరణ.. అంతలోనే ‘గురుతుకొస్తున్నాయి’ అంటూ ఓ నేస్తం మా ‘మణిపూర్’ పర్యటన ఫొటోలు ఫార్వార్డ్ చేయడంతో మనసంతా ఆనందనందన విహారం!

Exit mobile version