మానస సంచరరే-58: పరికించగ ‘ఫలం’!

8
2

[box type=’note’ fontsize=’16’] “అన్నీ మన చేతులో ఉండవు అన్న మాట కొంతవరకు నిజమే అయినా మనిషి తన వివేచనతో తన జీవితాన్ని సఫలం చేసుకునే దిశగా పయనించాలి” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]చ[/dropcap]లి చాటుకు వెళ్లి, వేడి వెలుగు వేంచేస్తున్న వేళ పెరట్లో తిరుగుతూ ఒక్కొక్క మొక్కను పలకరిస్తుండగా.. నా చూపు జామచెట్టుపై పడింది. చెట్టంతా ఆకులే.. అక్కడక్కడా ఒకటీ, అరా చిన్న పిందెలు. ఆఁ ఆ ఆకుల గుబురు మధ్య వన్నె మారిన పెద్ద జామపండు. ఇన్నాళ్లు బలే దాక్కుందే అనుకుంటూ చేయి పైకి సాచి ఆ కొమ్మను వంచాను. పెద్దకాయే. దోరగా పండింది.. కోశాను. చూస్తే దానిపై చిలక కొట్టుడు కనిపించింది. అయితే మరింత రుచిగా ఉంటుంది అనుకుని అక్కడే మేడమెట్ల పై బైఠాయించాను. ఎన్నో జామపండ్లు తినివుంటాను కానీ ఇంటి పెరటి చెట్టుకు పండిన కాయ కావటంతో అదెంతో అపురూపంగా అనిపిస్తోంది. దానివంక చూస్తుంటే వేటూరిగారు ‘పెళ్లి సందడి’ చిత్రానికి అందించిన ‘పండంటి’ పాట.. మదిలో మెదిలింది.

“మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసి..”

ఎన్నో రకాల పళ్లున్నా జామ పండు మజాయే వేరు. కొందరికి పచ్చి జామకాయలు కొరికి తినడమే ఇష్టం. మరికొందరికి కాస్త దోరగా ఉండాలి. బాగా పండితే చాలామంది ఇష్టపడరు. వాటి వాసన కూడా వేరుగా ఉంటుంది. పిల్లలకు, పెద్దలు కూడా మెచ్చే పండు జామపండు. మళ్లీ ఇందులో కోల్‌కతా జామ వేరు. ఇది లోపల తెల్లగా కాకుండా గులాబి రంగులో ఉంటుంది. దాని రంగు చూసి ముచ్చట పడతాం, కానీ రుచి చప్పగా ఉంటుంది. జామ పండు అంటే పిల్లలు మరీమరీ మక్కువ పడతారు.. అందుకే

‘ఉడుతా ఉడుతా హూచ్.. ఎక్కడికెడతావ్ హూచ్
కొమ్మమీది జాంపండు కోసుకొస్తావా
మా బేబీ కిస్తావా..’
అని పాడుతుంటారు.

అలాగే ‘కథా నాయకుడు’ చిత్రంలో మరో హుషారైన పాట

యా.. యహ.. పళ్లండి పళ్లండి పళ్లు.. జామపళ్లు, జామపళ్లు
అహ పలకమారిన పళ్లు, అహ చిలక కొట్టని పళ్లు
కలకత్తా జామపళ్లు కంటికి ఇంపైన పళ్లు ॥పళ్లండి..॥
గట్టితనం తెలుసుకోని ఖరీదెట్టి కొనండి
మెత్తగ ఉన్నాయంటే బొత్తిగ నిలవుండవండీ
రాజమండ్రి నుండి ఇవి రోజూ రోజూ వస్తాయండీ
రేపు మాపని చూస్తే రేటు పెరిగిపోతుందండీ

పండ్లంటే ఆషామాషీ కాదు.. అసలు సర్ ఐజక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఆపిల్ పండు రాలి తలపై పడటం వల్లే కదా. అది జరిగింది పదిహేడో శతాబ్దం. అయితే ఇంగ్లండ్ లోని ఊల్స్‌థోర్ప్ (లింకన్‌షైర్) లోని ఆ చెట్టు నాలుగు శతాబ్దాలయినా, ఇంకా సజీవంగా ఉండటం విశేషం. కాల గమనంలో ఆ చెట్టు అంట్లను ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీ ఆవరణలలో నాటారు కూడా.

రోజూవారీ జీవితంలో ఏదో ఒక పండు తినడం సాధారణ అంశం. అందరికీ అన్ని కాలాల్లో అందుబాటులో ఉండేది అరటిపండు. అరటిచెట్టును పరిచయం చేస్తూ, పిల్లలకు వారాల పేర్లు నేర్పించే పాట గుర్తుకొస్తోంది. అది..

ఆదివారం నాడు అరటి మొలిచింది
సోమవారం నాడు సుడివేసి పెరిగింది
మంగళవారం నాడు మారాకు తొడిగింది
బుధవారం నాడు పొట్టిగెల వేసింది
గురువారం నాడు గుబురులో దాగింది
శుక్రవారం నాడు పచ్చగా పండింది
శనివారం నాడు చకచకా గెలకోసి
అబ్బాయి అమ్మాయి అరటిపండ్లివిగో
అందరికీ పంచితిమి అరటి అత్తములు

అరటిపండును ఎక్కడైనా, ఎప్పుడైనా తినవచ్చు. కోయడం, ఒలవడం, గింజలు తీసేయడం వంటివేవీ ఉండవు. కేవలం పై తొక్క క్షణాల్లో తీసేసి తినేయడమే. ‘అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు’ అనే సామెత ఉంది. అలాగే ‘ఆటల్లో అరటిపండు’ అనే సామెత కూడా ఉంది.

నక్క – ద్రాక్షపళ్లు కథ బాల్యంలో అంతా చదువుతారు. అందులో ద్రాక్షపళ్లు తినాలని ఆశపడ్డ నక్క అవి ఎత్తులో ఉండి, ఎన్నిసార్లు ఎంత ఎగిరినా అందకపోవడంతో ‘అవి పుల్లగా ఉంటాయి’ అనుకుని సరి పెట్టుకుంది. కానీ ఆ తర్వాత వేరే నక్కలు ఆ ద్రాక్షపళ్లు తింటుండటం చూసి, ‘అవి పుల్లగా లేవా’ అని అడగ్గా, అవి నవ్వి అందని ద్రాక్ష పుల్లన అనుకోవటం పొరపాటు అనటంతో నక్క సిగ్గుతో తల దించుకుంటుంది. దీని ఆధారంగానే ‘అందని ద్రాక్ష పుల్లన’ అనే సామెత కూడా వచ్చింది. అయితే కొంతమంది జీవితంలో, అందిన ద్రాక్షలను పుల్లన అని భావించటం కద్దు. అలాగే కడవంత గుమ్మడి కూడా కత్తిపీటకు లోకువ అని మరో సామెత. ఏటా మండు వేసవిలో లభించే మధురఫలం మామిడి అందరికీ ఎంతో ప్రియమైనది. మామిడి పండు అన్ని పండ్లలో రారాజు. అందుకే దీన్ని ఫలరాజం అంటారు. దీని గొప్పతనాన్ని పద్యరూపంలో మరింత గొప్పగా, అందంగా.. ఇలా చెప్పారు వడ్డాది సుబ్బరాయ కవి.

ఫల చూడామణి చూతమెల్ల యెడలన్ భాసిల్ల జంబూఫలం
బులు నల్లబడె లజ్జ, కొబ్బరి ఫలంబుల్ భీతి నీరయ్యెలో
పలవృక్షంబుల ఈద నుండియున్, కోపసస్ఫూర్తి శూలాళి రొ
మ్ముల జిందెన్ పనసంబు, దాడిమ ఫలంబుల్ ప్రక్కలయ్యెన్ హృదిన్

పళ్లలో చూడామణిగా మామిడిపండు వాసికెక్కడంతో నేరేడుపండు ముఖం సిగ్గుతో నల్లబడిందట. కొబ్బరి కూడా అంత ఎత్తున ఉండి కూడా లోలోపల నీరు కారిపోయిందట. కోపం, అసూయలతో పనసపండు శరీరమంతా శూలాలు గుచ్చుకుందిట. ఇక దానిమ్మ పండు మధ్యలోకి బద్దలయిందట. ఇంత చక్కని పద్యాన్ని రాసినవారు వడ్డాది సుబ్బరాయకవి. మామిడి పండు మన జాతీయఫలం కూడా. మామిడి పళ్లలో రసాల రకాలు, కోత రకాలు ఎన్నెన్నో. మామిడి పళ్లలో వందల రకాలున్నాయి.

ఆకారానికి చిన్నవే అయినా రేగిపళ్ల విశిష్టత ప్రత్యేకమైంది. రేగిపళ్లు పుల్లపుల్లగా, తీయగా ఉండటంతో అందరూ ఎంతో ఇష్టపడతారు. వీటిలో గంగరేగి రకం వేరు. అవి పెద్దవిగా ఉంటాయి. రేగిపళ్లను సంక్రాంతి పండుగ రోజుల్లో భోగినాడు పిల్లలకు పోసే భోగిపళ్లకు వాడతారు. అలాగే సంక్రాంతి పండగరోజుల్లో ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలతో పాటు కొన్ని రేగిపళ్లను కూడా ఉంచుతారు. ఇవన్నీ అటుంచి భక్తశబరి, శ్రీరాముడికి రేగిపళ్లను రుచి చూసి మరీ మేలైనవి సమర్పించిందని రామాయణం చెపుతోంది. దీనికి సంబంధించి ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలో దేవులపల్లివారు రాసిన ఓ గొప్ప పాట మదిని తాకింది. అది..

ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది
ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది
ఎందుకో ఎందుకో ప్రతి పులుగు యేదో చెప్పబోతుంది..
కొలను నడిగి తేట నీరు, కొమ్మ నడిగి పూల తేరు
గట్టు నడిగి, చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు..
పుట్టతేనె రసాలు
దోరవేవో కాయలేవో అరముగ్గినవేవోగాని
ముందుగా రవ్వంత చూసి విందుగా అందీయనా..

అదీ శబరి భక్తి! రేగి తలపుల్లో ఉండగానే నేరేడు దూసుకు వచ్చింది. నేరేడు కూడా ప్రత్యేక సీజన్‌లో దొరికే పండే. నేరేడు ఆరోగ్యానికి ఎంతో మంచివి. నేరేడు అనుకోగానే వేటూరి గారి గీతం ‘సొమ్మొకడిది సోకొకడిది’ చిత్రంలోది గుర్తొచ్చింది. అది…

అబ్బో.. అబ్బో నేరేడు పళ్లు..
అబ్బాయి కళ్లు…అల్లో నేరేడు పళ్లు
పులు పెక్కే పోకళ్లు, కై పెక్కే ఆకళ్లు.. లేలేత కొబ్బరినీళ్లు..

ఆ వెంటనే ‘డాక్టర్ బాబు’ చిత్రంలోని పాట..

అల్ల నేరేడు చెట్టుకాడ అమ్మలాలా
లేత సూరీడు పొడిచాడే అమ్మలాలా..
పలకరించింది.

హనుమకు పండ్లంటే ప్రీతి కాబట్టే అలనాడు ఆకాశంలో సూర్యుణ్ణి చూసి అది ఫలమని భ్రమసి అందుకోవాలని దాపుకెళ్లాడు. ఈ ఘట్టాన్ని వర్ణిస్తూ తులసీదాసు హనుమాన్ చాలీసాలో..

యుగ సహస్ర యోజన పరభానూ
లీల్యో తాహి మధుర ఫల జానూ.
. అన్నారు.

అన్నట్లు భగవద్గీతలోకూడా గీతాకారుడు

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః

‘నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వుగాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడినదానిని, నేను సంతోషంగా ఆరగిస్తాను’ అన్నాడు. అంటే ఫలం భగవంతుడికి ప్రీతిదాయకమనే కదా. అందుకే నారికేళ ఫలాలను, ఇతర ఫలాలను భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.

కొంతభాగం కొరికిన యాపిల్ పండునే ‘లోగో’గా పెట్టుకున్న యాపిల్ కంప్యూటర్స్ అందరికీ తెలిసిందే. దానికి కారణం కంప్యూటర్ సైంటిస్ట్ అయిన అలన్ టురింగ్ సైనేడ్‌తో కూడిన యాపిల్ పండు తినడం వల్ల మరణించడమే. ఆయన మరణం గురించి భిన్న కథనాలున్నా, ఆయన గౌరవార్థం ఆ తర్వాత యాపిల్ కంప్యూటర్స్ సంస్థ వారు కొద్దిగా కొరికిన యాపిల్ పండునే తమ లోగోగా ఎంచుకున్నారన్నది ఒక కథనం.

దేవుడు మనకిచ్చిన ఆహార సంపదలో అద్భుతమైంది ఫల సంపద. ఎన్నిరకాల పళ్లు! అరటి, మామిడి, జామ, బత్తాయి, కమల, నారింజ, ద్రాక్ష, సపోట, దానిమ్మ, రేగి, నేరేడు, బొప్పాయి, పనస, పంపర పనస, అనాన, పుచ్చ, కర్బూజా, సీతాఫలం, రామా ఫలం, అత్తి, తాటిపండు, కర్జూరం, యాపిల్, చెర్రీలు, బెర్రీలు, స్ట్రాబెర్రీ, కివి, ఆప్రికాట్, స్టార్ ఫ్రూట్, రాస్ బెర్రీ, పియర్, పీచ్, ప్లమ్, లిచీ, అవకాడో.. అనేకానేకాలు. విచిత్రమైన పేరు గల పండు ‘డ్రాగన్ ఫ్రూట్’. దీని జన్మస్థానం దక్షిణ అమెరికా అయినా తర్వాత కాలంలో తూర్పు ఆసియా దేశాలకు విస్తరించింది. దీనికి ఈ పేరు రావడానికి గల కారణం దీని ఆకర్షణీయమైన రంగే. డ్రాగన్ చైనా వారికి పవిత్రమైన జంతువు. అది నోటినుండి అగ్ని జ్వాలలను వెలిగక్కుతూ శత్రుసంహారం చేస్తుంది. ఇప్పటికీ డ్రాగన్లు ఉన్నాయని చైనీయుల విశ్వాసం. డ్రాగన్ ఫ్రూట్ ముదురు గులాబీ రంగులో ఉండి, చుట్టూ పసుపు పచ్చ రేకులు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు మనదేశంలో కూడా డ్రాగన్ ఫ్రూట్ లను పండిస్తున్నారు. ఇక ఎండు ఫలాలు (డ్రై ఫ్రూట్స్) జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా, ఎండు ఖర్జూరం వగైరాలెన్నో. కాయగూరల్లో కూడా కొన్నిటిని పండుగా వ్యవహరించడం కద్దు. నిమ్మపండు, దోసపండు, వెలగపండు, దొండ పండు, గుమ్మడిపండు వంటివి. కాయగూరల్లో కొన్ని ఎక్కువ రోజులుంటే పండబారుతాయి. దొండ, కాకర, అరటి, వంకాయ, పచ్చి మిర్చి, ఒక్కొక్కసారి పొట్లకాయ కూడా పండబారుతుంది. గుమ్మడి అనగానే బాల్యంలో ఆడుకునే ఆట ‘వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమి?’ గుర్తుకు వచ్చింది.

వెలగపండు అందరికీ తెలిసిందే. అయితే దాన్ని పగలగొడితే కదా లోపల గుజ్జు వచ్చేది. కానీ సుమతీ శతకకారుడు ఓ పద్యంలో ఇలా అంటాడు…

సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ.!

సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. కానీ అదే సంపద పోయినప్పుడు మాత్రం ఏనుగు మింగిన వెలగపండులో గుజ్జు మాయమైనట్లుగా ఉంటుందని దీని అర్థం. ఏనుగుకు ఉన్న విశేష జీర్ణ శక్తి వల్ల అది మింగిన వెలంగపడు అలాగే ఉండి, దానిలోని గుజ్జు మాయమవుతుందని తెలుగు కవులు రాశారు. కానీ దీని పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏనుగైనా ఏమాత్రం రుచి చూడకుండా దాన్నలా మింగేస్తుందా అన్నది కొందరి ప్రశ్న. సంస్కృతంలో ‘గజభుక్త కపిత్థవత్’ అని ఉందని, దీనికి ‘గజక్రిమి రూపేణ’ అని వ్యాఖ్య చెపుతూ, కంటికి కనపడని క్రిమి వెలగకాయలోకి అది పువ్వుగా ఉన్నదశలోనే ప్రవేశించి గుజ్జునంతటిని హరిస్తుందని, ఈ పురుగునే కరిపురుగు అంటారని విజ్ఞుల వివరణ. అంటే ఇక్కడ కరిపురుగు మింగిన వెలగపండని భావం.

సినిమాల్లో అయితే పళ్లను ఎక్కువగా వాడి, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పేరొందిన దర్శకులు రాఘవేంద్రరావు. సౌందర్య వర్ణనలో కూడా ఫలాలతో పోల్చడం మామూలే. నేరేడుపళ్ల లాంటి కళ్లు, దొండపండు లాంటి పెదవులు, దానిమ్మ గింజల్లాంటి పండ్లు వగైరాలు. సౌందర్యసాధనాల తయారీలో సైతం పండ్లను వాడతారు. పేరంటాలలో, నోములలో, మామూలుగా కూడా పండ్లు ఇవ్వటం సాంప్రదాయం. ‘పదహారు ఫలాలనోము’ అని ప్రత్యేకించి ఒక నోము కూడా ఉంది. ఈ మధ్య పెళ్లిళ్లలో అతిథుల కోసం పండ్ల స్టాల్‍ను ఏర్పాటు చేయడం తెలిసిందే. రకరకాల పండ్ల రసాలు ఇళ్లలో తయారు చేసుకు తాగుతుంటాం. బయట కూడా పండ్లరసాల అమ్మకాలు మామూలే. ఇవే కాకుండా రకరకాల ఫ్రూట్ డ్రింక్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మామిడిపండ్లతో ‘తాండ్ర’ కూడా తయారు చేస్తారు. చాక్లెట్‌లు, జెల్లీలు, కేకులు, ఐస్ క్రీమ్ తయారీల్లో పండ్ల వాడకం అధికంగా ఉంటుంది. ‘పండంటి బిడ్డ పుట్టాలి’ అనే ఆశీర్వాదాలు తెలిసినవే. చాలామంది తమ చిన్నారులను ‘పండు’ అనే ముద్దు పేరుతో పిలుచుకోవటం పరిపాటి. అన్నట్లు కాశీ వెళ్లే భక్తులు అక్కడ గంగలో విడిచి పెట్టే ఇష్టమైన వాటిలో, ఇష్టమైన పండు కూడా ఉంటుంది. అక్కడ వదిలేసిన పండును ఆ పైన జీవిత కాలంలో మరెన్నడూ తినకూడదన్నది నియమం. ఇంకో వింతగా తోచే మాట ‘విభూది పండు’. విభూది ఉండను ‘విభూది పండు’ అని ఎందుకన్నారో మరి. అలాగే పొలాల్లో పంట పండింది అంటాం. ఇక సినిమాల విషయానికి వస్తే పూజాఫలం, పండంటి కాపురం, పండుగాడి ఫొటో స్టూడియో వగైరాలున్నాయి. ఇక ‘పండు’ అనే మాటను రకరకాల సందర్భాల్లో రకరకాలుగా వాడుతుంటాం. వృద్ధులయిన వారిని ‘పండుటాకు’లనటం, వారు గతిస్తే, పండుటాకు రాలిపోయింది అనటం వింటూనే ఉంటాం. ఏదైనా వ్యవహారం సానుకూలమయిందా, ప్రతికూలమయిందా అనేందుకు, పండా, కాయా అని అడగటం తెలిసిందే. పచ్చీసు లాంటి ఆటల్లో పావులు పండాయంటారు. అన్నట్లు ‘భక్త ప్రహ్లాద’ చిత్రం లో ఆరుద్రగారు ఓ చక్కటి లాలిపాట రాశారు. అది..

సిరి సిరి లాలి, చిన్నారి లాలి
నోముల పంటకు నూరేళ్ల లాలి
ఊగుమా ఊయలా..
అంటూ
కలలెన్నో నీకొరకు కాచుకుని పూచే
ఫలియింపజేయుమా అరుదైన బాలా.. ఊగుమా ఊయలా..

ఇక్కడ తమ కలలు పండించాలన్న ప్రయోగం కూడా చేశారు.

ఆరుద్రగారే రాసిన మరోపాట ‘నోము’ చిత్రంలో ఇలా..

నోము పండించవా స్వామీ, నన్ను కరుణించరావేమీ
నిను నమ్మితిరా, నిను కొలిచితిరా
అలక చాలించి పాలించవా..

‘ఆత్మీయులు’ చిత్రంలో దాశరథిగారి యుగళగీతం…

‘చిలిపి నవ్వుల నిను చూడగానే.. వలపు పొంగేను నాలోనే
ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను..’

ఇక్కడ పుణ్యాల ఫలితమన్న అర్థంలో వాడటం జరిగింది. అదే పాపాల విషయంలో ‘బుల్లెమ్మ బుల్లోడు’ చిత్రంలో రాజశ్రీ గారు

‘నీ పాపం పండెను నేడు.. నీ భరతం పడతా చూడు
నీ పాలిటి యముణ్ని నేను..నీ కరెక్టు మొగుణ్ని నేను’

అంటూ పాపం పండితే శిక్ష ఖాయమంటారు.

పండటం అనేది పరిపక్వత అనే అర్థంలో కూడా చెప్పుకోవచ్చు. ఫలాని పనిలో పండిపోయారు అంటే మంచి అనుభవం గడించారని. అలాగే ఆలోచనల్లో పరిపక్వత.. దాన్నే ఇంగ్లీషులో మెచ్యూరిటీ అంటారు. ‘ఫలాపేక్ష’ అనే పదం ఉంది. అంటే ఫలితం మీద ఆశ. దీని గురించి గీతాకారుడు.. ‘నీరు తామరాకును అంటదు. అలాగే పరమేశ్వరార్పణ బుద్దితో ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసే వాడిని పాపాలు అంటవు’ అంటాడు. అలాగే ‘కర్మకు కూడా ఫలం ఉంది, అది ఒకటి కారణం, రెండవది కార్యం . రెండింటికీ గల సంబంధం ఒకానొక శక్తి ఫలితం. దాన్నే దైవమని పిలుస్తాం.’ ‘దైవం కర్మఫల ప్రదాత’ అంటారు ఆధ్యాత్మికవేత్తలు. ‘ఫలశృతి’ అంటే ప్రయోజనం. ఉగాదినాడు జరిగే పంచాంగ శ్రవణంలో మొదటిది ఫలశృతి కాగా, రెండవది ఫలితాంశం. ఆముష్మికంలో పరమార్థాన్ని మించిన ఫలశృతి లేదు. లౌకికంలో ’వ్రతం చెడ్డా ఫలం దక్కా’లన్నది ఒక సామెత.

ఆంగ్ల కవి ఎమిలీ డికెన్‌సన్ ‘ఫర్‌బిడెన్ ఫ్రూట్’ పేరుతో ఓ చక్కని కవిత రాశాడు. అది..

ఫర్ బిడెన్ ఫ్రూట్ ఎ ఫ్లేవర్ హాజ్
దట్ లాఫుల్ ఆర్చర్డ్స్ మాక్స్
హౌ లషియస్ లైన్ ది పీ వితిన్
ది పాడ్ దట్ డ్యూటీ లాక్స్.

చేపట్టిన పనులలో విజయం సాధిస్తే సఫలం, ఓటమి పాలయితే విఫలం లేదా వైఫల్యం అంటుంటాం. జీవితం సఫలం కావాలనే అందరూ కోరుకుంటారు. తమ స్వప్నాలు ఫలించాలని ఆశిస్తారు. అనుకుంటుంటే ఓ చక్కని పాట – ‘అనార్కలి’ చిత్రంలోది గుర్తుకొచ్చింది. అది…

జీవితమే సఫలము..రాగసుధా భరితము
ప్రేమకథా మధురము.. ఈ జీవితమే సఫలము..

గొప్ప పనులు పదుగురికి మేలు చేసే పనుల ద్వారా జీవితాన్ని సఫలం చేసుకున్న విశిష్ట వ్యక్తులకు ‘జీవన సాఫల్య’ పురస్కారాలు ఇవ్వడం కూడా తెలిసిందే.

అన్నీ మన చేతులో ఉండవు అన్న మాట కొంతవరకు నిజమే అయినా మనిషి తన వివేచనతో తన జీవితాన్ని సఫలం చేసుకునే దిశగా పయనించాలి. రెండువేల ఇరవై ఒకటి నూతన సంవత్సరంలో అందరి ఆశలు, ఆకాంక్షలు ఫలించాలి, ప్రపంచం మొత్తం సుఖశాంతులతో వర్ధిల్లాలి అనుకుంటుంటే నా ఆలోచనా కెరటాలను పడగొడుతూ వీధిలోంచి వినవచ్చింది, ‘సంత్రాలు.. సంత్రాలు’ కేక..

ఇంకేముంది మా పెరటి జామతో నా అడుగులు ఇంటిలోపలికి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here