మానస సంచరరే-59: చిత్తగించిన ‘చిత్రం’!

11
2

[box type=’note’ fontsize=’16’] “చిత్రం నిజంగా ‘చిత్ర’మైందే. మనిషినే కాదు, సకల జీవ, నిర్జీవ సముదాయాలనూ ‘దృశ్యమానం’ చేస్తుంది చిత్రకళ” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]ఆ..[/dropcap] అ అ అ అ అ..
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో.. అ అ అ అ
రవి చూడనీ.. పాడని నవ్య నాదానివో.. రవి వర్మకే..

నీరెండలో కూర్చుని, తేనీరు సేవిస్తూ ఆ గీతం వింటూ ఆనందిస్తున్న నాకు ఆ పాట ఎప్పుడు ఆగిపోయిందో తెలియదు… నా మది గీతం నుంచి ‘రవివర్మ’ గీతలవైపు.. అదే చిత్రాలవైపు మళ్లింది. మన దేశానికే గర్వకారకుడైన చిత్రకారుడు రవివర్మ. కేరళకు చెందిన ఆయన చిత్రించిన తైలవర్ణ చిత్రాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి.. అష్టసిద్ధి వినాయకుడు, లక్ష్మి, సరస్వతి, ఇతిహాసాలలోని పాత్రలు.. చిన్నికృష్ణుడిని అలంకరించే యశోద, గంగావతరణం, ప్రేమలేఖ రాస్తున్న శకుంతల, రావణ జటాయు వధ, దమయంతి.. అయితే ఎన్నో చిత్రాలు చిత్రించిన ఆయనకు చివరి దశలో కేరళకే చెందిన పరమాచార్యులు.. శంకరాచార్యుల వారి చిత్రం వేయలేక పోయానని చింత కలిగిందట. ఫొటో సైతం లేకుండా ఎలా వేయడం అనుకున్న ఆయనకు స్వప్నంలో శంకరాచార్య దీర్ఘ సమయం కనిపించి ప్రేరేపించటంతో మర్నాడు ఉదయమే శిష్యులతో కూడి ఉన్న శంకరాచార్య చిత్రాన్ని అద్భుతంగా చిత్రించారట. వియన్నాలో జరిగిన కళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి నందుకుని అంతర్జాతీయ కీర్తి నందుకుని, భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింప జేసిన చిత్రకారుడు రవివర్మ.

లలిత కళల్లో ఒకటి చిత్రలేఖనం. చిత్రం నిజంగా ‘చిత్ర’మైందే. మనిషినే కాదు, సకల జీవ, నిర్జీవ సముదాయాలనూ ‘దృశ్యమానం’ చేస్తుంది చిత్రకళ. అంతలోనే జగద్విఖ్యాత ‘మోనాలిసా’ చిత్రం మదిలో మెదిలింది. పదహారో శతాబ్ది తొలినాళ్లలో లియోనార్డో డావిన్సీ చెక్కపై చిత్రించిన ఈ చిత్రం తాలూకు ఫొటోలు నాటికీ, నేటికీ పలు చోట్ల ప్రత్యక్షమవటం, పలుమార్లు ప్రస్తావనకు రావడం తెలిసిందే. సంతోషం, విషాదం మిళితమై, అరవిరిసిన నవ్వుతో అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగు పెట్టిన అమ్మాయి ముఖచిత్రం. అలాగే స్పానిష్ శిల్పి, చిత్రకారుడు అయిన ప్లాబో పికాసో ఇరవయ్యో శతాబ్ది ప్రథమంలో చిత్రించిన తల్లి ప్రేమ, గుయెర్నికా గొప్ప కళా ఖండాలుగా ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. ‘గుయెర్నికా’ చిత్రంలో కిరాతక సైనికుల దౌర్జన్యానికి సంకేతంగా ఎద్దులను, ఎదురు తిరిగిన ప్రజానీకానికి సంకేతంగా గుర్రాలను చూపించాడు.

ఇక మన ఎమ్.ఎఫ్.హుస్సేస్ క్యూబిస్ట్ స్టైల్లో తమాషాగాను, సీరియెస్ గాను ఉండే చిత్రాలెన్నో వేశారు. గాంధీ, మదర్ థెరీసా, రామాయణ, మహాభారత, బ్రిటిష్ రాజ్, పల్లె, పట్టణ జీవితాలు వగైరాలు. పందొమ్మిది వందల అరవై ఏడులో ‘త్రూ ది ఐస్ ఆఫ్ ఎ పెయింటర్’ మూవీకి ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా జాతీయ ఫిలిమ్ అవార్డు నందుకున్నారు. చిత్రకారుడిగా ఆయన భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డు నందుకున్నారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఆయన ఆ తర్వాత హిందూ దేవతల, భరత మాత చిత్రాలను నగ్నంగా చిత్రించి వివాదాస్పదుడయ్యాడు. కడకు దేశాన్నే వీడి విదేశాల్లో కన్నుమూశాడు. ఇక చిత్రాల గురించి చెప్పాలంటే ఒక్కోసారి, అసలు మనిషి కంటే చిత్రం బాగుంటుంది, కొన్ని సార్లు అసలు మనిషే బాగుండొచ్చు. ఈ సందర్భంలో ‘అమాయకుడు’ చిత్రంలో ఓ మధుర యుగళ గీతం మది గుర్తు చేసుకుంది.

బొమ్మను గీసేవు, ముద్దుల బొమ్మను గీసేవు
బొమ్మ తానే రమ్మంటే ఓయమ్మో ఏమి చేసేవు..
బొమ్మను గీసేను.. ముద్దుల బొమ్మను గీసేను
బొమ్మ కన్నా అందమున్న అమ్మాయినే చూసేను..
ఓయమ్మో నేను చూసేను..

మరోగీతం ‘బొమ్మరిల్లు’ చిత్రంలో భాస్కరభట్ల అందించింది.. అది..

బొమ్మను గీస్తే నీలా ఉంది.. దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెళ్తే దాని మనసే నీలో ఉందంది..
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..

ఇక తెలుగు నేలపై ప్రముఖ చిత్రకారులెందరెందరో.. వారిలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వారిలో దామెర్ల రామారావు ముందు వరుసలో నిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన దామెర్ల రామారావు పద్దెనిమిదివందల నలభై ఏడులో జన్మించారు. స్థానిక ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆంగ్లేయుడు ఆస్వాల్డ్ కూల్డ్రే రామారావు ప్రతిభకు ముగ్ధుడై బొంబాయి లోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదువుకోవడానికి ఖర్చు భరించారు. కలకత్తాలో జరిగిన చిత్రకళా ప్రదర్శనలో రామారావు ప్రదర్శించిన ‘ఋష్యశృంగ బంధనం’ చిత్రానికి ప్రథమ బహుమతిగా వైస్రాయ్ ఆఫ్ ఇండియా పతకం బహూకరించారు. అంతేకాదు, అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రామారావు వేసిన చిత్రం ఒకటి కొనుక్కున్నారట కూడా. ఆయన చిత్రించిన గొల్లపడుచు, గోదావరి లోయ, పుష్పాలంకారం, ద్రోణుడు, సిద్ధార్థుని రాగోదయం, బావి దగ్గర, భరతవంశపు రాకుమారులు, కైకేయి దురాలోచన, కార్తీక పౌర్ణమి, పేరంటం, నందిపూజ వగైరా చిత్రాలు దేశ, విదేశాల్లో ప్రశంసలు పొందాయి. ఎంతో మంది యువకులకు చిత్రకళలో శిక్షణ కూడా ఇచ్చారు. రాజమండ్రిలో జాతీయ చిత్రకారుల సదస్సును కూడా నిర్వహించారు. ఎన్నో ప్రాంతాలలో పర్యటించి అక్కడి చిత్రలేఖన రీతులను గ్రహించిన రామారావు తమ ఊరికి తిరిగివస్తూ రైల్లో వేసిన చిత్రం ‘మరణం’. ఆశ్చర్యమేమంటే అదే ఆయన చివరి చిత్రం. ఆ తర్వాత ఆయన జబ్బు పడి ఇరవై ఎనిమిదవ ఏటే అకాలమరణం చెందారు. రాజమండ్రిలో నేటికీ దామెర్ల రామారావు ఆర్ట్ గేలరీ, వారి కళా ప్రాభవాన్ని చాటుతూనే ఉంది. దామెర్ల రామారావుకు సమకాలీనులైన అడవి బాపిరాజు గొప్ప రచయిత మాత్రమే కాదు, గొప్ప చిత్రకారులు కూడా. ఈయన చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ స్థాపించారు. నవరంగ సంప్రదాయ రీతిలో ఈయన చిత్రాలు చిత్రించారు. వీరి చిత్రం ‘శబ్ద బ్రహ్మ’ డెన్మార్క్ ప్రదర్శన శాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం చిత్రాలు తిరువాన్కూర్ మ్యూజియంలో ఉన్నాయి. ఈయన చిత్రించిన సముద్రగుప్తుడు, తిక్కన చిత్రాలు బాగా ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథవారి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతోనే రూపొందింది.

విశ్వనాథ గారిని తలచుకోగానే ‘ఏకవీర’ గుర్తు కొచ్చింది. ‘ఏకవీర’ చిత్రంలో సేతుపతి, వీరభూపతిల తొలి సంభాషణ…

ఉదయ సంధ్యలు దిగివస్తున్న మధుర ప్రభ
పరమేశ్వరుడు ప్రపంచానికందిస్తున్న ప్రణయ పాట
సృష్టికి జీవకళ లద్దుతున్న సూర్యకిరణాలు
ఏ చిత్రకారుడి కుంచెకూ అందని సువర్ణ చిత్రాలు..

వీరభూపతి, ఏకవీర చిత్రాన్ని చిత్రించటం, ఆమె వచ్చి చూసి, తానూ తన భావాన్ని చిత్రించడం… వీరభూపతి అది గమనించి, చిత్రాన్ని తిలకిస్తూ పాడే గీతం..

ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ…
గిరిమల్లికలు తప్ప, గరిక పూవులు తప్ప
ఏ కానుకలను అందించగలనో చెలీ
గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప
జగతి పై నడయాడు చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా.. శరదిందు చంద్రికా..

భళారే చిత్రం అనిపించుకున్న మరో చిత్రకారుడు వడ్డాది పాపయ్య వ. పా. గా సుపరిచితులు. పందొమ్మిది వందల ఇరవై ఒకటిలో జన్మించిన వీరు దాదాపు యాభై ఏళ్లపాటు చిత్రాలు వేశారు. తెలుగు సంస్కృతి, కావ్య నాయికలు, పురాణ పురుషులు, పండుగలు, ప్రసిద్ధ వ్యక్తులు.. ఇలా వైవిధ్య భరిత చిత్రాలను, తమదైన, అరుదైన శైలిలో చిత్రించారు. చిత్రాలు చేసే చిత్రాలు ఇన్నీ అన్నీకావు అనుకుంటుంటే ‘దానవీర శూర కర్ణ’ చిత్రంలోని సినారె పాట గుర్తొచ్చింది. భానుమతి, దుర్యోధనుడి చిత్రాన్ని రచిస్తూ, ఊహల్లో తేలే సందర్భంలోని ఆ పాట..

ఆయ్ భళారే విచిత్రం.. అయ్యారే విచిత్రం
ఈ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం
పిలువకనే ప్రియ విభుడే విచ్చేయుటే విచిత్రం.. అయ్యారే..
రాచరికపు జిత్తులతో.. రణతంత్రపుటెత్తులతో.. ఓఓఒ..
సతమతమౌ మా మదిలో మదనుడు సందడి సేయుటే చిత్రం..
ఎంతటి మహరాజైనా.. ఎపుడో ఏకాంతంలో
ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం..

‘పెయింటింగ్ ఈజ్ సైలెంట్ పొయెట్రీ అండ్ పొయెట్రీ ఈజ్ పెయింటింగ్ దట్ స్పీక్స్’ అంటాడు ఫుటార్క్.

అన్నట్లు చిత్రకారుడిగా, శిల్పిగా ప్రసిద్ధులైన పి.టి.రెడ్డి (పాకాల తిరుమల్ రెడ్డి) విభిన్న ప్రక్రియలలో వేలాది చిత్రాలు చిత్రించారు. వీరు పందొమ్మిదివందల ముప్పైఐదులో బొంబాయి వెళ్లి, అక్కడి జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేశారు. అక్కడే కుడ్య చిత్రకళను కూడా అధ్యయనం చేశారు. పందొమ్మిదివందల నలభై రెండులో ‘వ్యష్టి’ చిత్రకళా ప్రదర్శన నిర్వహించి, ఖ్యాతి చెందారు. అప్పట్లో అభ్యుదయ కళోద్యమం వీరి నేతృత్వంలో సాగింది. తన చిత్రాలతో ఒక పోర్ట్‌ఫోలియోను ప్రచురించారు. ప్రముఖుల చిత్రాలు, ప్రకృతి దృశ్యాలు, దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేకానేక సందర్భాలు ఆయన కళలో చోటు చేసుకున్నాయి. పి.టి.రెడ్డి నైరూప్య శిల్పాలు కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి.

సిద్దిపేటకు చెందిన మరో మహోన్నత కళాకారుడు కాపు రాజయ్య. పందొమ్మిదివందల ఇరవైఐదులో జన్మించిన వీరు చిత్రకళలో, డ్రాయింగ్‌లో డిప్లొమాలు చేశారు. లలిత కళా అకాడమీ ద్వారా చెకోస్లోవేకియా, హంగేరి, రుమేనియా, బల్గేరియాలలో ప్రదర్శనలు నిర్వహించారు. జెఎన్‌టియు నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఏ బొమ్మ గీసినా జీవం ఉట్టిపడేలా గీయడం ఆయన ప్రత్యేకత. ఆయన చిత్రాలలో వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంటపొలాలు, వసంతకేళి, కోలాటం వంటివి ఎంత గానో ప్రాచుర్యం పొందాయి. తెలంగాణకే చెందిన తొలితరం మేటి చిత్రకారులు కొండపల్లి శేషషగిరిరావు. బాల్యం నుంచే చిత్రకళలో ఆసక్తి పెంచుకున్న వీరు ఆంధ్రా యూనివర్సిటీ, రాజస్థాన్ బనస్థలి విద్యాపీర్, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్‌లో చిత్రకళ నభ్యసించారు. శాంతినికేతన్‌లో నందలాల్ బోస్ వద్ద శిష్యరికం చేశారు. పందొమ్మిదివందల యాభైలో సంతాల్ హార్మని, కాకులు లాంటి చిత్రాలకు బహుమతులు అందుకున్నారు. ప్రకృతి, పక్షులు, జంతువులు, చారిత్రక అంశాలు, ఆయన చిత్ర కళకు వస్తువులు. జె.ఎన్.టి.యు.కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. వీరి చిత్రాలలో నిజాం పాలన, తల్లీ-బిడ్డ, వరూధిని ప్రవరాఖ్య, దమయంతి, శకుంతల, సరస్వతి వగైరాలు ప్రాచుర్యం పొందాయి. రెండువేల పన్నెండులో తనువు చాలించినా, తన చిత్రాలతో కళాభిమానుల హృదయాలలో ఆయన ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు.

ఇక అందానికి నిర్వచనం చెప్పాల్సి వస్తే ‘బాపు బొమ్మ’ అనడం తెలుగునాట పరిపాటి. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ అయినా ‘బాపు’ గానే అందరి మనసుల్లో స్థిరపడ్డారు. ‘బాపు’రే! అనిపించుకున్న కార్టూనిస్ట్, చిత్రకారులు, సినీ దర్శకులు. కోతి కొమ్మచ్చి, బుడుగు, సీ గాన పెసూనాంబ, రెండుజళ్ల సీత, అప్పుల అప్పారావు, గిరీశం వగైరాలు ఎంతటి గంభీరులనైనా నవ్వించి తీరుతాయి. ఆయనతో తమ పుస్తకాలకు ముఖచిత్రం వేయించుకోవటం తమ అదృష్టంగా భావించేవారు రచయితలు. అందులో వింతేమీ లేక పోయినా మంచి పుస్తకానికి బొమ్మ వేయటం అదృష్టంగా బాపు భావించడం ఆయన వ్యక్తిత్వ విశేషం. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ‘బాపు’ మార్క్‌తో ఎంతగానో ప్రజాదరణ పొందాయి. తెలుగుతనం నింపుకుని, హావ, భావ, విలాసాలతో ఎంతో ప్రత్యేకంగా ఉండే ఆయన చిత్రాలు చిత్రాలను అలరిస్తాయి. ఆరుద్ర బాపు గురించి ఇలా ..

కొంటె బొమ్మల బాపు..
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు.. ఓ కూనలమ్మా..

‘గోపాలరావుగారి అమ్మాయి’ చిత్రంలో వేటూరి అందించిన టైటిల్ సాంగ్ ఎంతో హిట్. అది ఇలా..

‘గోపాలరావుగారి అమ్మాయి..లోకం తెలియని పాపాయి
దేవులపల్లి కవితల్లే, బాపు గీసిన బొమ్మల్లే
ఎవరైనా మీకెదురైతే ఆమే.. గోపాలరావుగారి అమ్మాయి..’

అలాగే ‘గ్రీకు వీరుడు’ చిత్రంలో భువనచంద్ర ‘బాపు గీసిన బొమ్మే నువ్వా.. బాలు పాడిన పాటే నువ్వా‘ అని ఓ చక్కనిగీతం రాశారు. ఇలా ఎన్నో గీతాల్లో బాపు గీత ప్రస్తావన ఉంది. బొమ్మలే కాదు, ఆయన అక్షరాలు అంతే అందమైనవి. బాపు ఫాంట్‌గా మనకు దక్కాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం బాపుకు గౌరవడాక్టరేట్, కళాప్రపూర్ణల నందించి తనను తాను గౌరవించుకుంది. అమెరికా తెలుగు అసోసియేషన్ (అటా) వారు ‘శిరోమణి’ అవార్డునందించి అభిమానాన్ని చాటుకున్నారు.

కళాభిమానం అనుకోగానే ‘అభినందన’ చిత్రం గుర్తొచ్చింది. అందులో కార్తీక్ పాత్ర చిత్రకారుడు, గాయకుడు. పెయింటింగ్ నేపథ్యంలోనే చిత్రించిన మధురమైన యుగళగీతం..

రంగులలో కలవో.. ఎద పొంగులలో కళవో
నవ శిల్పానివో, ప్రతి రూపానివో, తొలి ఊహల ఊయలవో..
కాశ్మీర నందన సుందరివో కైలాసమందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో.. మరుని బాణమో, మధుమాస గానమో
నవపరిమళాల పారిజాత సుమమో..
రంగులలో కలనై, ఎద పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతి రూపాంగినై, నీ ఊహల ఊగించనా….
ముంతాజు అందాల అద్దానివో.. షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో, ప్రణయ దీపమో, నా విరహ తాపమో
నా చిత్రకళా చిత్ర చైత్రరథమో..

ఆత్రేయ ఎంత హృద్యంగా రాశారో… ఒకరా, ఇద్దరా నాటి నుంచి నేటి వరకు ఎందరెందరో ఎందరెందరో చిత్రకారులు. ఎవరి ప్రత్యేకతలు వారివే. చిత్రకళలో ఎన్నో రకాలు. ఆయిల్ పెయింటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్, పేస్టల్ పెయింటింగ్, అక్రిలిక్ పెయింటింగ్, డిజిటల్ పెయింటింగ్, ఇంక్ వాష్ పెయింటింగ్, హాట్ వాష్ పెయింటింగ్, స్ప్రే పెయింటింగ్.. వాల్ పెయింటింగ్, ఎనామిల్ పెయింటింగ్, శాండ్ పెయింటింగ్.. ఇలా అనేకానేకాలు. ఆధునిక కాలంలో పెయింటింగ్‌లో రకరకాల టెక్నిక్‌లు. మనదేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధరకాల చిత్ర కళారీతులు.. నిర్మల్ పెయింటింగ్, నకాషీ కళ, కలంకారీ, బాతిక్ పెయింటింగ్, మధుబని, వర్లి, కాళీఘాట్, ఫడ్, మీనియేచర్ పెయింటింగ్, గోండ్ పెయింటింగ్, కేరళ మ్యురల్స్, పటచిత్ర, పిచ్ వాయ్ వగైరాలు.

మరి పెయింటింగ్ చేయాలంటే చేతులు ముఖ్యం అనుకుంటాం గానీ చేతుల్లేని వారు కూడా కేవలం సంకల్ప బలంతో కాలివేళ్లతోనే చిత్రాలు వేసేవారూ ఉన్నారు. చేతులు, కాళ్లూ కూడా లేనివారు కూడా కొందరు నోటితో బ్రష్ పట్టుకుని చిత్రాలు గీసేవారూ ఉన్నారు. ఢిల్లీకి చెందిన షీలా శర్మ ప్రమాదవశాత్తు రెండు చేతులు, ఒక కాలు కోల్పోయినా, ఒంటి కాలితోనే చిత్రాలు వేస్తూ సెహభాష్ అని పించుకుంటున్నారు. వేర్వేరు రకాలుగా దివ్యాంగులైన శ్రీకాంత్ దూబే, సి.వి.సురేంద్రన్, అమితా దత్తా, విపుల్ మిట్టల్, శివరాజ్ సింగ్, నీలేష్ గణేష్ ఆత్మ విశ్వాసంతో పెయింటింగ్ ఆర్ట్‌లో పేరు తెచ్చుకున్నారు. ఇలా ఎందరెందరో. చిత్రకళ అంటే డిప్లొమాలు పొందడం, శిక్షణ పొందడం ఉంటేనే సాధ్యం అనుకుంటాం కానీ కేవలం తమ సొంత ఊహతో, సృజనతో చిత్రాలు వేసేవారెందరో. రోడ్డుమీద క్షణాల్లో దేవుళ్ల చిత్రాలు వేసే వారిని చూసినపుడు అవాక్కవ్వాల్సిందే. బాడీ పెయింటింగ్ ఓ వైవిధ్యం. అయితే ఇది తాత్కాలికమే. అలాగే చాక్‌పీస్‌ల మీద, సబ్బులమీద, గోళ్ల మీద, ఆఖరికి బియ్యపు గింజల మీద.. ఒకటనేమిటి సృజనశక్తి ఉండాలే కానీ కాదేదీ చిత్రకళకనర్హం.

అన్నట్లు మనుషులే కాదు జంతువులూ చిత్రాలు వేయడం మరో అద్భుతం. దక్షిణ ఆఫ్రికాలో ఓ వరాహం చక్కగా బొమ్మలు వేస్తుంది. దీని పేరు ఎంతో అర్థవంతంగా ‘పిగ్ కాసో’ అని పెట్టారు. అలాగే గుర్రాలు, ఏనుగులు, చిలుకలు, డాల్ఫిన్లు, కోతులు, పిల్లులు శిక్షణతోనే అయినా చిత్రకళలో రాణించటం అబ్బురమే. అసలు సౌందర్య దృష్టి ఉండాలే కానీ ఆకాశమే ఒక అద్భుతం అనుకుంటూ గగనతలం వైపు చూపు సారించా.. ఆకాశం కాన్వాస్‌పై వర్ణచిత్రాలు క్షణాల్లో మారిపోతూ.. అలరిస్తూ, చూసేందుకు రెండు కళ్లూ చాలనంత అందంగా.. వెంటనే ‘బూంద్ జొ బన్ గయీ మోతీ’ చిత్రంలో ముఖేష్ పాట గుర్తొచ్చింది.. అది…

హరీ హరీ వసుంధర.. నీల నీల యే గగన్
కె జిస్ పె బాదలోంకి పాల్ కి ఉడా రహా పవన్
దిశాయే దేఖో రంగ్ భరీ.. చమక్ రహి ఉమంగ్ భరి
యే కిస్ నె ఫూల్ ఫూల్ పె కియా సింగార్ హై
యే కౌన్ చిత్రకార్ హై, యే కౌన్ చిత్రకార్ హై..
యే కౌన్ చిత్రకార్ హై..
తపస్వియోం సి హై అటల్ యే పర్వతోంకి ఛోటియా
యే సర్ప్ సీ ఘుమేరదార్ ఫేరదార్ ఘాటియా
ధ్వజా సె యే ఖడే హుయే హై వృకై దేవదార్ కె
గలీచె యే గులాబ్ కె, బగీచె యే బహార్ కె
యే కిస్ కవీకి కల్పనా.. యే కిస్ కవికీ కల్పనా కా చమత్కార్ హై
యే కౌన్ చిత్రకార్ హై..
కుదరత్ కి ఇస్ పవిత్రతకో తుమ్ నిహార్ లో
ఇస్ గుణోంకో అప్‌నె మనమె తుమ్ ఉతార్ లో
చమ్కాలో ఆజ్ లాలిమా..
చమ్కాలో ఆజ్ లాలిమా.. అప్‌నే లలాట్‌ కి..
కణ కణ్ సె ఝాంక్ తీ.. తుమ్హే ఛబి విరాట్ కి..
అప్‌నీ తొ ఆంఖ్ ఏక్ హై.. ఉక్ హజార్ హై..
యే కౌన్ చిత్రకార్ హై.. యే కౌస్ చిత్రకార్ హై..

భరత్ వ్యాస్ కలం, ముఖేష్ గళం రెండూ గొప్పవే. ఇంతలో ఉరుములు.. ఎడా పెడా వర్షం.. నేను గుమ్మం లోపలకు చేరి చూస్తున్నా. పది నిముషాల్లో వాన ఆగింది. ఆకాశంలో అందాల హరివిల్లు ప్రత్యక్షమయి ఆనందించమంది. ప్రకృతి చిత్రానికి సాటి ఏముంది? చిత్రకారుల సృజనకు ప్రకృతేగా ఆధారం.. ఆ పైనే ఊహ. అందుకే మనిషి ప్రకృతిని, వికృతి చేయకుండా, విచక్షణతో పది కాలాలపాటు కాపాడుకోవాలి.. అనుకుంటూ ఉంటే గోడ గడియారం గంటలు కొట్టి ఆలోచనను ఛేదించడంతో తిలకించిన ప్రకృతి చిత్రాలను మది ఆల్బమ్ లోకి సాగనంపుతూ ముందుకు కదిలాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here