మానస సంచరరే-64: అవిరామ అన్వేషణ!

7
2

[box type=’note’ fontsize=’16’] “ఈ ప్రపంచం మొత్తం నిరంతరం ఏదో ఒక అన్వేషణలో నిమగ్నమై ఉంటుంది. ఆవిష్కరణలకు మూలం అన్వేషణే” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]ఉ[/dropcap]షోదయ సమయాన అలారం మోతకి ఉలిక్కిపడి లేచా. వేకువలో ముంగిట్లో ఉన్న వేపచెట్టు గాలిని హాయిగా ఆస్వాదించడం నాకెంతో ఇష్టం. మళ్లీ కొద్ది సేపటికే జనసందడి, వాహనాల రొదలతో మొత్తం దృశ్యం మారిపోతుంది కాబట్టి ‘భలే మంచి సమయము, మించినన్ దొరకదు..’ అనుకుంటూ తలుపుతీసి ముంగిట్లో నిలుచున్నా. చల్లని గాలి శుభోదయమంది. అదే తరుణంలో రాత్రంతా చెట్టు గూళ్లలో తలదాచుకున్న పక్షులన్నీ బద్ధకం వీడి బయటకొచ్చి రెక్కలు సాచి ఆహారాన్వేషణకు అమాంతం పైకెగిరాయి. ‘పక్షుల జీవితం భలే. ఏ రోజు తిండి ఆ రోజే. రెక్కల కష్టంతో దొరికిన చోటే కడుపు నింపుకోవడం, ఇంకా రెక్కలు రాని తమ పిల్లల కోసం కాసింత ఆహారం ముక్కున కరుచు కొచ్చి పెట్టడం.. అంతే.. దోచుకోవడం, దాచుకోవడం వాటికి తెలియదు, అవసరం కూడా లేదు. ఏ కాలమైనా నిత్యం ఆహారాన్వేషణ చేయాల్సిందే. ఆకాశమంతా ఎగురుతున్న పక్షులతో మరింత అందంగా మారిపోయింది. ఎంత అద్భుత చిత్రం! అంతలో ఇంతలో ఓ లేగ దూడ ఎక్కడి నుంచి వచ్చిందో ‘అంబా’ అంటూ తన తల్లిని పిలుస్తూ, వెదుకుతూ.. అంతలో జనసంచారం, వాహన శబ్దాలతో చక్కటి ప్రకృతి చెదిరిపోతుండగా నేను యాంత్రికంగా లోపలికి నడిచి, నా పనులు చేసుకుంటున్నా మనసు మాత్రం ‘అన్వేషణ’ను అన్వేషించే పనిలో పడింది…

అసలు ఈ ప్రపంచం మొత్తం నిరంతరం ఏదో ఒక అన్వేషణలో నిమగ్నమై ఉంటుంది. అన్వేషణకు వాడుక పదం వెతకటం. ఇళ్లలో, ఆఫీసుల్లో ఒక చోటనేమిటి, అన్ని చోట్లా వెతుకుడు కార్య క్రమం జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు కావలసిన వస్తువు మనముందే ఉన్నా, గందరగోళంలో అయోమయానికి లోనవటం వల్ల ఎదుట ఉన్నది కంటికి ఆనదు. దాంతో కంగారు పడటం, అందర్నీ కంగారు పెట్టడం. ఇలాటి వారి విషయంలోనే ‘ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికిందట’ అనే అచ్చ తెనుగు సామెతను వాడుతుంటాం. ఉదయాన్నే ఇళ్లల్లో సీన్ చిత్రంగా ఉంటుంది. పోపుల పెట్టెలో ఎండుమిరపకాయలు అయిపోయి, వేరే డబ్బాలోవి తీసుకుందామంటే ఆ డబ్బా కనపడక.. పోపు మాడిపోతుందని.. మిరపకాయలు లేకుండా పోపు వేయటం ఎలా అని.. ఆ డబ్బాకోసం గాలిస్తుంటే, మరోవైపు నా మొబైల్ ఎక్కడైనా చూశావా, రాత్రి సైలెంట్‌లో పెట్టా, ఎక్కడ పడుకుందో ఏమిటో అంటూ దానికోసం ఇల్లంతా వెతుకుతూనే అర్ధాంగిని అడగటం.. ‘మిరపకాయలు కనపడక పోపు ఆగిందిక్కడ, మొబైల్‌ట మొబైల్’ ఆమె ఆగ్రహవాక్కులు, ‘అమ్మా! నా ఇంగ్లీష్ హెమ్‌వర్క్ ఎంత వెతికినా కనపడటం లేదే’ అని పుత్రరత్నం .. ఇలా ఎవరి వెతుకులాట గొడవవారిదే..

ఇక ఆఫీసుల్లో ఫైళ్ల వెతుకులాటలు మామూలే. ఆఫీసర్ అడిగినపుడు ఆ ఫైలు కనపడక, ఆనక ఎప్పుడో ఆ ఫైలు ‘ఇక్కడ ఉన్నానోచ్’ అంటుంది. కానీ ఆ సరికే బాస్ మహాశయుడు తిరస్కారంగా చూడటం, తిట్టడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే.

‘వెతుకులాట’ పదంలోనే ‘ఆట’ పదం మిళితమై ఉంది. దాగుడు మూతలు, ఇసుకగూటిలో పుల్లను దాచి వెతకమనడం వంటి ఆటలు బాల్యంలో అందరికీ సుపరిచితాలే. ‘జీవనజ్యోతి’ చిత్రంలో పాట గుర్తుకు వచ్చింది. పిల్లవాడి జ్ఞాపకాలతో చిన్నాభిన్నమైన ఓ తల్లి మనసు ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో, ఇక్కడ వెతికి, అక్కడ వెతికి పట్టుకో.. లారలల్ల, లారలల్ల అమ్మా..’ అని బిడ్డ తనను ఆటపట్టిస్తున్నట్లుగా భ్రమపడుతుంది. ‘వెతుకులాట’కు మరో పదం దేవులాడటం. చందమామ కథల్లో సాహసాన్వేషణలు ఎన్నో.. రాకుమారుడు, తాను వలచిన రాకుమారి ప్రాణం కాపాడటం కోసం అవసరమైన మహిమాన్విత లేపన భరిణ అన్వేషణకు బయల్దేరి ఏడు సముద్రాల అవతల, కొండలు, కోనలు దాటి కీకారణ్యంలోని రాక్షసుడి నివాసమైన ఓ మర్రిచెట్టు తొర్రలో దాచిన లేపన భరిణను సాధించి, ఆమె ప్రాణాలు కాపాడి, ఆమెను, అర్ధరాజ్యాన్ని కూడా గెలుచుకుంటాడు. అంతలో నాకు ‘పాతాళ భైరవి’ సినిమా స్మృతిపథంలో మెదిలింది. తోటరాముడు, రాజకుమారిని ప్రేమించి, ధన సంపాదన కోసం మాయావి అయిన మాంత్రికుని వెంట వెళతాడు.

అప్పుడు నేపథ్యంలో వినిపించే పాట అప్పటికీ, ఇప్పటికీ కూడా హిట్టే. పింగళిగారు రాసిన, వి.జె.వర్మ పాడిన ఆ పాట..

ప్రేమకోసమై వలలో పడెనె, పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు
వేమరు దేవుల వేడుకుని తన కొమరుని క్షేమం కోరుకుని..
ఏమైనాడో ఏమౌనోయని కుమిలే తల్లిని కుమలమని ॥ప్రేమ॥
ప్రేమ కన్ననూ పెన్నిధియేమని యేమి ధనాలిక తెత్తుననీ
భ్రమసి చూచు ఆ రాజకుమారిని నిముసమె యుగముగ గడుపుమనీ ॥ప్రేమ॥
ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకుని
ఏమి వ్రాసెనో, అటు కానిమ్మని బ్రహ్మదేవునిదే భారమనీ ॥ ప్రేమ॥

‘అన్వేషణ’ కవుల మనసుల్లోనూ కదం తొక్కింది. అన్వేషణ గురించి శ్రీశ్రీ తన ‘మానవుడా!’ కవితలో ఇలా అంటాడు…

ఆలోచనలు పోయేవాడా
అనునిత్యం అన్వేషించేవాడా
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా
ఆకసంలో, సముద్రంలో
అన్వేషించేవాడా!
అశాంతుడా! పరాజయం ఎరుగనివాడా!
ఊర్ధ్వ దృష్టి! మహామహుడా!
మహా ప్రయాణికుడా!
మానవుడా! మానవుడా! …

ఆవిష్కరణలకు మూలం అన్వేషణే. ప్రపంచస్థాయి అన్వేషకుల గురించి ప్రస్తావించుకోవాలంటే ప్రప్రథమంగా గుర్తొచ్చే పేరు క్రిస్టఫర్ కొలంబస్. ఇటలీకి చెందిన నావికుడు కొలంబస్ ఇజబెల్లా రాణి అంగీకారంతో మూడు నౌకలకు ఆధిపత్యం వహించి పశ్చిమ దిశగా సాహసయానం చేశాడు. తొలిసారి అన్వేషణలో క్యూబా, బహామా మొదలైన వెస్టిండీస్ దీవులను కనుగొన్నాడు. ఆ తర్వాత మరో రెండుసార్లు ప్రపంచదేశాల అన్వేషణలో సముద్ర యానాలు చేశాడు. నాలుగోసారి ఇజబెల్లా రాణి భారతదేశానికి కొత్త సముద్రమార్గాన్ని కనుగొనమని పంపితే కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుగొన్నాడు. ఏమైనా సాహసికులకు నాటికీ, నేటికీ స్ఫూర్తిగా నిలిచిన గొప్ప అన్వేషకుడు క్రిస్టఫర్ కొలంబస్.

ఇక సిద్ధార్ధుడి అన్వేషణ ప్రత్యేకమైంది. ప్రజల కష్టాలకు కారణాలు కనుగొనాలని సత్యాన్వేషణ నిమిత్తం ఓ అర్ధరాత్రి ఇల్లు విడిచి వెళ్లి సన్యాసం స్వీకరించాడు. కొంతకాలానికి గయలో బోధివృక్షం కింద ధ్యానం చేస్తుండగా జ్ఞానోదయం పొందాడు. బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందడంతో బుద్ధుడయ్యాడు. ఆ సత్యాన్వేషణ ఫలితంగానే బౌద్ధమతం రూపొంది ప్రపంచాన్నెంతగానో ప్రభావితం చేసి, శాంతి, కరుణ, సత్ప్రవర్తనలకు దోహదం చేసింది.

రామాయణంలో పవనసుతుడు హనుమంతుడు సీతాన్వేషణ కోసం ఆకాశంలోకి ఎగిరి సముద్రాన్ని లంఘించడం ఆయన శక్తికి నిదర్శనం. సముద్రుడు, హనుమకు సాయపడదలచి, తనలో దాక్కున్న మైనాకుడిని హనుమ కొద్ది సేపు విశ్రమించేందుకు వీలుగా పైకి పెరగమని కోరతాడు. మైనాకుడు అలాగే చేస్తాడు. హనుమ, మైనాక పర్వతంమీద కాసేపు విశ్రమించి, తిరిగి సముద్రాన్ని లంఘించగా, అతడిని పరీక్షించాలని దేవతలు, గంధర్వులు భయంకరాకారిణి సురసను పంపుతారు. అడ్డగించిన ఆమె నోట్లోకి సూక్ష్మ రూపంలో దూరి, బయటపడతాడు. అలాగే సింహికను కూడా సూక్ష్మరూపంతో ఆమె నోట్లో ప్రవేశించి, హతమారుస్తాడు. ఆ పైన లంకిణిని సంహరించి, లంకా నగరాన్ని కలయజూస్తూ, అశోకవనంలో ప్రవేశించి, చివరకు సీతమ్మను కనుగొంటాడు. ఇది సీతాన్వేషణకాగా, రామ, రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛనొందగా, రాత్రికి రాత్రే హిమాలయాలకు వెళ్లి సంజీవని మొక్కకై అన్వేషించి, దాన్ని గుర్తించలేక సుమేరు పర్వతాన్నే ఎత్తుకు రావడం మరో అపూర్వఘట్టం. అలా సంజీవని మొక్కరసంతో లక్ష్మణుడు మూర్చ నుండి తేరుకుంటాడు. అన్వేషణకు సంబంధించి తెలుగులో కౌబాయ్ సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో ‘మోసగాళ్లకు మోసగాడు’ చాలా పాపులర్. అలాగే హిందీలో ‘విక్టోరియా నం. 203’ సినిమాను తెలుగులో ‘అందరూ దొంగలే’ పేరుతో తీశారు. అందులో జైలునుంచి విడుదలైన దొంగలు చంటిబాబు, బుజ్జిబాబు జంటకు ఓ తాళంచెవి దొరుకుతుంది. దాన్లోనే తమ అదృష్టం దాగుందని, ఆ తాళం చెవి ఏ ఖజానాదో తెలుసు కోవాలని అన్వేషణ మొదలు పెడతారు. ఆ సందర్భంలో ఆరుద్ర రాసిన నవ్వించే తమాషా పాట ఒకటుంది. అది..

చంటిబాబూ.. ఓ బుజ్జిబాబూ.. చంటిబాబూ.. ఓ బుజ్జిబాబూ..
నీ పంట పండితే నవాబూ
ఉంది తాళం.. ఏది బీగం.. లేనే లేదా జవాబూ?..
మంచి ఖజానా.. మనకు ఠికానా
దారినబోయే చక్కనిదానా.. బాగున్నానా.. నీ పక్కకు రానా ॥చంటి॥
దారిలోన మాకు చిక్కింది లక్కీ నాడా.. చిన్నదాన నువు చెప్పాలి
గుర్రపు జాడా..
వెదకాలీ దీనికి జోడి.. అది చూపవె ఓ వగలాడీ..
ఒప్పులకుప్ప, చెపితే తప్పా, కంటికి రెప్ప, ముత్యపు చిప్ప
ఎక్కడ ఉందా తాళంకప్ప.. చోటు చెప్పు.. చిక్కుముడి విప్పు ॥చంటి॥

మాధవపెద్ది సత్యం, ఎస్.పి.బాలు గళాలు, చిత్రంలో ఎస్.వి.రంగారావు, నాగభూషణంలకు ఎంతో చక్కగా నప్పాయి.

‘భార్యాబిడ్డలు’ చిత్రంలో నాగేశ్వరరావు వివాహితుడైనా, ఉద్యోగం కోసం, బ్రహ్మచారినని చెప్పి సంకట పరిస్థితి నెదుర్కొంటాడు. అదే సమయంలో పల్లెలో అతని కుటుంబం కారణాంతరాల వల్ల రోడ్డున పడటం జరుగుతుంది. పిల్లలు అతణ్ని వెదుకుతూ ఓ పాట పాడతారు. ఆత్రేయ రాసిన అర్థవంతమైన ఆ చక్కని పాట..

చక్కనయ్యా చందమామ.. ఎక్కడున్నావు
నీవులేక దిక్కులేని చుక్కలైనాము..
మబ్బు మబ్బు మాటున.. ఈమసక చీకటి చాటున
దిక్కు దిక్కున దిక్కులన్ని.. తిరుగుతున్నాము..
వెతుకుతున్నాము.. ॥చక్కనయ్యా..॥

‘అన్వేషణ’ పేరుతో ఓ మిస్టరీ చిత్రం వచ్చింది. అందులో వేటూరి గారు రాసిన టైటిల్ సాంగ్ …

ఇలలో కలిసే శిధిలాకాశం
కడదాకా జరిగేనా నా అన్వేషణ.. ॥ఇలలో॥
కలలో పలికే సుఖ సంగీతం
కడదాకా జరిగేనా నా అన్వేషణ ॥ఇలలో॥

ఇక ప్రేమించిన అమ్మాయిని పెద్దలు దుర్మార్గంగా దూరం చేస్తే అతడు ఆమె కోసం చేసే అన్వేషణను కులశేఖర్ గారు చక్కని పాటగా ‘నువ్వు నేను’ చిత్రానికి అందించారు. ఆ గీతం..

నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన
ఎడబాటు రేపిన విరహ వేదన నరక యాతన
కాలమే దీపమై దారి చూపునా.. ॥ నీకోసమే॥

రోజువారీ ప్రపంచంలో దొంగలు దొంగతనానికి మార్గాలను అన్వేషించడం, తప్పించుకు తిరిగే దోపిడీ దొంగల్ని, ఇతర నేరస్థులను అన్వేషించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉండటం తెలిసిందే. అద్దె ఇంటి అన్వేషణలు, పిల్లల చదువుకోసం మంచి పాఠశాలల అన్వేషణ, నిరుద్యోగుల ఉద్యోగాన్వేషణ, తప్పిపోయినవారి కోసం, ఇంటినుంచి చెప్పకుండా వెళ్లిపోయిన వారికోసం అన్వేషణ.. ఇలా ఎన్నెన్నో రకాలు. అన్నట్లు ఇంకో ముఖ్యమైన అన్వేషణ పెళ్లి సంబంధాల అన్వేషణ. గతంలో పెళ్లిళ్లు బంధువర్గం లోనే, తమ ఊరి కుటుంబాలవారి తోనే చేసేవారు. ఆ తర్వాత పెళ్లి సంబంధాలు కుదిర్చేందుకు ప్రత్యేకించి పెళ్లిళ్ల పేరయ్యలు మొదలయ్యారు. ఇప్పుడు పెళ్లిళ్ల పేరయ్యలున్నా, మేట్రిమోనీల జోరే ఎక్కువగా ఉంది. లక్షల సంబంధాల్లో నచ్చినదాన్ని ఎంచుకోవచ్చని పబ్లిసిటీ. కులాల వారి మేట్రిమోనీలు, సంపన్న వర్గాలకోసం ప్రత్యేక మేట్రిమోనీలు ఇలా రకరకాలున్నాయి. ‘..నాకులాగే తనకూ ఆవకాయంటే ఇష్టం’ అని ‘..ఘుమఘుమలు ఇప్పుడు మా ఇంట్లోనే..’ అంటూ తిండి అభిరుచులనే హైలైట్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఎన్ని మేట్రిమోనీలున్నా సంబంధాలు కుదరడానికి మాత్రం కొన్ని సంవత్సరాలు పడుతున్నమాట వాస్తవం. ఇప్పటి ట్రెండ్ ఇదే కావటంతో పిల్లల తల్లిదండ్రులు ఆ ప్యాకేజీలకు డబ్బు కడుతూ, మళ్లీ మళ్లీ రెన్యూ చేస్తూ, ఆశాభావంతో ముందుకు సాగుతుంటారు.

ఇక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అయితే అన్వేషణలు అనంతంగా సాగుతూనే ఉంటాయి. ఖనిజాల గనుల కోసం, సహజవాయు నిక్షేపాల కోసం.. నిరంతర అన్వేషణ.. శోధన జరుగుతూనే ఉంటుంది. జాబిలిమీద జలాలున్నాయని, జాబిలిమీద హీలియం త్రీ ఉందని అన్వేషణ, శోధనల ద్వారే శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అభివృద్ధికి ఈ శోధనలే కీలకంగా నిలుస్తున్నాయి. మానవుడి శక్తి యుక్తులు అమేయమైనవి కాబట్టే నిరంతరం ఎన్నో నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి.

అన్నట్లు ఏదైనా పదం తెలియకపోతే తక్షణం అన్వేషించేది నిఘంటువులోనే. ఇక విషయ వివరణలు కావాలంటే శోధించేది విజ్ఞాన సర్వస్వం (ఎన్‍సైక్లోపీడియా)లోనే. ఇది మొన్న మొన్నటివరకు. కానీ నేడు అన్నిటికీ ఆశ్రయించేది గూగులమ్మ(గూగుల్ శోధన)నే. ఇందులో చూసి మాత్రమే కాదు, అడిగి కూడా జవాబు తెలుసుకు నే వీలుండటం మహా సౌకర్యంకదా. అక్షరాలింకా రాని చిన్న పిల్లలు కూడా ‘ఓకే గూగుల్’ అంటూ అనేకానేక సందేహాలను అడిగి తీర్చుకుంటున్నారు. ఏ మాటను ఎలా పలకాలో కూడా నేర్చుకుంటున్నారు. గూగుల్ సెర్చ్ విజ్ఞానానికి గొప్ప సెర్చ్ లైటే. విజ్ఞానానికేనా, దారి తెలియని ప్రదేశాలకు వెళ్లాలన్నా ఆ అన్వేషణలో గూగుల్ మ్యాప్ కరదీపికగా నిలిచి తోడ్పడుతోంది.

దేవుడికోసం అన్వేషణ నాటి నుంచి నేటివరకు ఎందరెందరో చేస్తూనే ఉన్నారు. ‘బాలరాజు కథ’లో బాలరాజు, ఓ సాధువుని తనకున్న సందేహాలన్నీ అడుగుతాడు. ఆ సందేహాల గీతాన్ని కొసరాజుగారు అద్భుతంగా రాశారు. అది..

అడిగానని అనుకోవద్దు.. చెప్పకుండ దాటేయొద్దు
ఏమిటీ రహస్యం.. స్వామీ ఏమిటీ విచిత్రం..
మహమ్మదీయులు పిలిచే దేవుడు
క్రైస్తవులంతా కొలిచే దేవుడు
ఏడుకొండల వేంకటేశ్వరుడు గోవిందా.. గోవిందా..
శ్రీశైలంలో మల్లికార్జునుడు
వారూ వీరూ ఒకటేనా.. వేరువేరుగా ఉన్నారా..
అని అడిగితే
సర్వవ్యాపి నారాయణుడు..
సర్వవ్యాపి నారాయణుడు ఎక్కడ జూచిన ఉంటాడు
ఆ స్వామి కొరకె నే శోధిస్తున్నా.. తీర్థాలన్నీ తిరుగుతు ఉన్నా..
అంటాడు సాధువు.

ఆధ్మాత్మిక పథంలో రమణ మహర్షి అన్వేషణ ప్రత్యేకమైంది. ఆయనకు అరుణాచలం గురించి తొలి సారిగా సుబ్బారావు అయ్యర్ అనే అతిథి ద్వారా తెలిసింది. ఆయనకు అరుణాచలం పేరు వినగానే ఏదో సమ్మోహనశక్తి ఆవహించినట్లు అనుభూతి కలిగింది. అంతే..ఆత్మ సాక్షాత్కార అన్వేషణలో ఇల్లు విడిచి తిరువణ్ణమలై వెళ్లి, అరుణాచలేశ్వర మందిరానికి చేరి సన్యాసం స్వీకరించారు. రమణ మహర్షి ఇలా అంటారు.. “ఆత్మజ్ఞాన అన్వేషికి ‘నేను’ను విచారించుటే సూటి మార్గం. ‘నేను’ అనే ఆలోచన పుట్టిన తర్వాతే వేలకొద్దీ ఆలోచనలు పుడుతున్నాయి. ‘నేనెవరు’ గురించి నిరంతరం ఆలోచిస్తే నిజమైన ‘నేను’ అనుభవమవుతుంది. నిద్రపోయే ముందు, మేల్కొన్నాక ఈ ప్రశ్న వేసుకోవాలి. ఈ రెండు సమయాల్లో అఖండ విశుద్ధ ప్రజ్ఞ తృటికాలం ఉంటుంది. ఇది ధ్యానానికి ఉత్తమ సమయం”.

కష్టాలలో కొట్టుకు పోతూనే మనిషి సుఖాల తీరం కోసం అన్వేషిస్తుంటాడు. ఎంతో విలువైన జీవితాన్ని ఫలప్రదం చేసుకోవాలనే సత్యాన్ని శ్రీశ్రీ ‘వెలుగునీడలు’ చిత్రం కోసం రాసిన ఓ సందేశాత్మకగీతంలో ఇలా చెప్పారు…

కలకానిది.. విలువైనది
బ్రతుకూ కన్నీటి ధారలలోనే బలిచేయకు.. ॥కల॥
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయీ కలవరించనేలా ఓ.. ఓ.. ఓ.. ఓ..
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో ॥కలకానిది॥
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..
ఏది తనంత తానై నీ దరికి రాదూ
శోధించి సాధించాలి, అదియే ధీరగుణం ॥కల కానిది॥

నిజమే. విజయ సాధనకు శోధనే మూలం అనుకుంటుంటే, అవునూ నేను కూడా నూతన అంశాలపై, కొత్త పుంతలలో రచనలు చేయాలని మదిలో శోధిస్తున్నాను కదా ఆ విషయం గుర్తురావడం, అదే క్షణంలో నా మెదడులో మెరుపు మెరవడం.. అంతే! నిన్న ఎక్కడో పెట్టి మరిచిపోయిన కలం కోసం మొదలైంది నా అన్వేషణ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here