[‘మానసిక రుగ్మత’ అనే అనువాద కథని అందిస్తున్నారు శ్రీమతి స్వాతీ శ్రీపాద. ఒరియా మూలం హృషికేశ్ పాండా.]
: షిట్! ఈ అగ్గెపెట్టెంత బస్ యజమానికి పర్మిట్ ఉందా? అతని వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా?
: అరే, సర్, ఇక్కడ ఏది ఎలా జరుగుతుందో మీకు తెలియదా? మళ్ళీ అన్నీ అడుగుతున్నారా? అటు చూడండి, కిటికీ పైన ‘దేవుడికి అంకితం’ ఆ పెద్ద శీర్షిక. అంచేత ఈ బస్ దేవుని దయవల్ల ఇచ్చినది కాదు. అది నడుస్తుంది.
: ఎవడది నా బస్‌లో రాదలచుకోనిది? దిగిపొండి. వినబడిందా?
: ఓహ్ వాడికి ఆ వెధవకు డబ్బుంది. వాడు ఆఫీసర్లకు రెగ్యులర్‌గా లంచాలు ఇస్తాడు. అందుకే ఈ రూట్‌లో మరో బస్ నడవదు. ఈ మాత్రం రష్ ఉండదా? ఆ వెధవ, కొందరన్నట్టు, ఒక లెక్చరర్. దేవుడు కూడా తిట్టుకునే పీనాసి వెధవా, నువ్వే బస్ నడిపించగలిగితే కాలేజీ లెక్చరర్ ఎలా అవుతావురా? నాకది చెప్తావా?
సూర్యకాంతి. నీలాకాశం. అచ్చం ప్రేమలాగే. కిరణాలు నీటి ఉపరితలం మీద దూరానికి మెరుస్తూ కనబడతాయి. కిరణాలు ఏ రకంగా మహత్తరమైన దానినీ. పనికి రాని చెత్తనూ ఒకేలా ప్రకాశింపజేస్తాయి? ఎలా జినియా లను, వెన్నెల కిరణాలనూ, చిన్న కాలనీ క్వార్టర్స్‌లో సీతాకోక చిలుకలను వేటాడే అబ్బాయిని అవి ఎలా దోచుకు పోతాయి, సమయం పిడికిలి నుండి. ఎలా వేలకొద్దీ ప్రాంతాలను చక్కబెడతాయి, సంక్షిప్తంగానే అయినా? కాని కిరణాలు చిక్కనివి, దొరకనివి. నిరంతరం దేశ సంచారులు. నువ్వెంత ప్రాధేయపడినా కాస్సేపైనా విశ్రమించవు.
: ఎంత వేడిగా, ఉక్కగా ఉంది! దేవుడా! తమ్మీ బస్ స్టార్ట్ చెయ్యి. ఎందుకు ఇంకా ఇంకా ఎక్కువ మందిని బస్‌లో కుక్కుతున్నావు బాస్? చోటెక్కడుంది? వినబడుతోందా?
: కదలండి ముందుకు, నీలం చొక్కా? నీ వెనకాల బోలెడంత చోటుంది. కదలవెందుకు? (నీ అమ్మను దయ్యం ఎత్తుకెళ్ళ) నువ్వు, రెడ్ షర్ట్, నువ్వూ లోపలకు వెళ్ళాలి. మరి నువ్వు, షర్ట్ లేనోడా, ఏదో లోకంలో ఉన్నట్టు చూస్తున్నావేమిటి? భుజాన కాడి తగిలించుకుని బరువులు వేళ్ళాడ దీసుకుని మోస్తున్నావా? అక్కడక్కడే చుట్టూరా ఊక్కుంటూ తిరక్కు (నీ అమ్మకు దినం పెట్ట). సూటిగా ముందుకు తోసుకుంటూ వెళ్ళూ..
అడవి. లేదా పల్లె శివారా? ఆ ఇరుకైన, సన్నటి అడుగులతో నలిగిన బాట ఎక్కడికి తీసుకెళ్తుంది? అక్కడ కూడా ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటారా? అక్కడ కూడా జీవన శ్వాస సౌకుమార్యంతో తడిసి ముద్దై దెబ్బతీస్తుందా? మనోరమ రథ్, ఆమె అత్తగారు అక్కడ ఉంటారా? నేనక్కడ ఆ అబ్బాయిని అడగనా? కాలేజీ స్టూడెంట్‌లా ఉన్నాడు. అతనికి తప్పకుండా తెలిసే ఉంటుంది, తన నోట్ బుక్‌లో ఇక్కడి అమ్మాయిల ముఖ్యమైన వివరాలు వ్రాసుకునే ఉంటాడు. కాని అతను నన్నొక్కటి పీకితేనో? మనోరమ రథ్ అతనికి ఏ అక్కో అయితేనో? అయితే అవనీ. నేనెందుకు లెక్క చెయ్యాలి? మీకు తెలుసు, నా పేరు బులు. నేను జనాలను బులిపించి బెదిరిస్తాను. నేను ఎవరికైనా భయపడతానా? నేను నిర్లక్షంగా వ్యవహరించే వాడిని, ఎప్పుడూ ఒక మడత కత్తి నా జేబులో కదులుతూ ఉంటుంది, మూడంగుళాల పొడవున్న పదునైన అంచుతో.
: ఇక్కడ. సర్, ధరలు ఎంతగా ఆకాశాన్ని అంటుతున్నాయంటే, ఊపిరి పీల్చుకుందుకు కూడా జనం భయపడుతున్నారు. కారణం, నువ్వు ఊపిరి పీల్చుకుంటే తిన్న తిండి త్వరగా అరిగిపోతుంది. దానికి తోడు బ్రతికుండే బాధ. నీకో పెళ్ళి చెయ్యాల్సిన కూతురు ఉంటేనా..
: పెళ్ళికొడుకు కోసం చూస్తున్నావా?
: లేదు సర్, నేనా పని ఎలా చెయ్యగలను? చెవిపోగు ఉన్నా, పెట్టుకుందుకు చెవి ఉండదు కొందరికి. చెవి ఉన్నా కొందరికి పెట్టుకుందుకు చెవిపోగు ఉండదు. నా కూతురు కోసం ఎవరైనా అబ్బాయి నాకు నచ్చితే నా చేతులు అతన్ని అందుకోలేవు. ఒకవేళ అందుకున్నా నా హృదయం, “ఇతను నీ బిడ్డకు తగ్గవాడు కాదు” అంటుంది. ఇహ పిల్లాడిని ఎలా చూడగలం?
(నువ్వెలా మర్చిపోగలిగావు డియర్, నీ పుట్టుకే ఒక నరకం అని. ఆ బాధ ఇంకా తాజాగా ఉన్నా నువ్వింకో బాధకు సిద్ధపడుతున్నావు. నువ్వు రోజూ పురాణాలు, భగవద్గీత వల్లిస్తావు, మళ్ళీ ఈ భౌతికంలోనే కుళ్ళిపోతావు. విషాదం లోకి అడుగులు వేస్తావు.)
: ఇప్పుడిహ ఈ రోడ్డు! వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జనాల గురించి చెప్పక్కర్లేదు. ఏ రకంగానూ దారికి రారు. చూసారా సర్, ఎలా మట్టి ముద్దలు, ముద్దలుగా వదిలేసారో ఇక్కడ అయిదారు వేలు ఖర్చుపెట్టకపోయినా యాభై వేల బిల్ సిద్ధం అవుతుంది. దేవుడీ అవినీతిని ఎలా భరిస్తున్నాడో.
: ఎందుకు భరించడు. మన స్వంత దేవుడే సగం సగం చెక్కి వదిలేసి ఉన్నాడు, మన జగన్నాథుడిని సగమే చెక్కలేదా? ఇక్కడ పాపాత్ములే పైకి వస్తారు. మనలాటి వాళ్ళకి చోటెక్కడ ఉంది?
: అంతే. అంతే. మీరు చూడట్లేదూ, సర్, ఈ మనిషి ఈ పాకెట్ సైజ్ బస్‌తో ఎంత డబ్బు చేసుకుంటున్నాడు. వాడికిప్పుడు స్వంతంగా ఏడు బస్‌లు ఉన్నాయి. ఈ బాంకర్లు సోషలిజమ్ సపోర్ట్ చెయ్యాలి, కాని ఎక్కడా మాయలమారితనమే.
అక్కడ టెలిఫోన్ కేబుల్ మీద ఒంటరి లకుముకి పిట్ట
ఎందుకలా లకుముకి పిట్ట ఒంటరిగా ఉంది, ఎప్పుడూనా?
దానికి మిత్రులు లేరా? లేదా ఈ ఆకాశపు వైశాల్యం దానికి సరిపోవడం లేదా?
లేదూ అది బిడియపడుతోందా?
లకుముకి పిట్ట కవిత్వం వ్రాస్తుందా?
ఒక వేళ వ్రాస్తే అది ఏం వ్రాస్తుంది?
బహుశా ఇలా వ్రాస్తుందా? :
చాలా విశేషాలు జరుగుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి
శుష్కించిన, ఆ హాస్యగాడి చెత్తా చెదారపు బుర్రమీద
బంగారు కుండ నీళ్ళు గుమ్మరిస్తుంది.
వర్షం వెన్నెల కిరణాలను చెట్లలో వెదజల్లుతుంది.
కాలేజీ వదిలేసిన వెనకబడిన సోమరి
ఒక మినిస్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసినట్టు
చాలా జాగర్తగా
ఒక్క గెంతులో చేప ఒకటి
కొంగమహారాజు గొంతులోకి ఎగిరినట్టు, జరగవచ్చు.
ఈ లోగా, ఎక్కడా ఏం జరగక పోయినా
కొండ శిఖరం ఎప్పటిలా నిశ్శబ్దంలో వేళ్ళాడుతుంది
కాలం కరుగుతూ ఆగిపోయినట్టు.
: హమ్‌మ్, గంటకు పైగా బస్ నెందుకు ఆపి ఉంచారు? ఇంకెంత డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు?
: అది నీకెందుకు? ఓహ్ వయొలెట్ షర్ట్ బాబు. కాస్త సర్దుకుంటావా?
: ఓకె. నేను డబ్బు చెల్లించి నీ బస్‌కు యజమాని నవుతాను. అది నీకు ఓకేనా? ఒప్పుకుంటావా?
: నా బస్ కి ఓనర్ అయ్యేదెవడు? దిగిపో..
: హీ, హీ జోక్ అంతే. జోక్ చేస్తున్నాను. దయచేసి మాకు సూటిగా చెప్తారా? మిస్టర్ కండక్టర్, ఇంకా టికెట్ ధర ఎంత ఇస్తే నువ్వ్వు మరికొంత మంది పాసెంజర్లకోసం ఎదురు చూడటం మానేస్తావు? ఈ నరకంలో కుతకుతా ఉడికి పోడం తప్పిస్తావు?
ఒక్క తెలిసిన మొహమైనా ఓ సిగరెట్ కొనుక్కునేందుకు పదిపైసలు అప్పివ్వడానికి కనబడటం లేదు. కాని బాగా తెలిసిన మామిడాకులు. మా గ్రామంలో వాటిలాగా. అక్కడ గ్రామంలో తోటల్లో కొబ్బరాకుల కొమ్మలనుండి సూర్యకిరణాల చుక్కలు కిందకు జారుతాయి. అక్కడ గ్రామంలో బాగా పరిచయమైన ఎద్దు గూని లాగ, దాని గాయం చాలా కాలం మానదు, విస్తరించే పుండులా మారిపోతుంది – అని నాన్న అనేవాడు. ఇప్పటికి మూడు నెలలయింది. జనాలు అంటారు – అది చెయ్యకండి, ఇది చెయ్యకండి, అది ఓకేనా? అతన్ని వెల్లూరు తీసికెళ్ళవచ్చుగా? లేదా అమెరికా? అబద్ధాలు, తెల్ల అబద్ధాలు. నాకో కల వచ్చింది ఈ మధ్యన. నాన్న వచ్చారు, ముప్పై యేళ్ళ వాడిలా ఉన్నాడు. కిడ్నీ బాగానే ఉంది. ఏదో హార్మోనుల అసమతుల్యత. అయిదారు ఇంజెక్షన్ల తరువాత అంతా సర్దుకుంది. ఇక్కడి డాక్టర్లు వెధవలు. నీకు చెప్పకుండా అమెరికా వెళ్ళాను అన్నాడు నాన్న.
: డాక్టర్ బాబు, నమస్కారం మీరేంటి ఇక్కడ? రండి ఇక్కడ కూచోండి.
: అబ్బే, వర్రీ అవద్దు, ఇట్స్ ఓకే.
: లేదు సర్, మీరు కూచోవాలి. మీరు నుంచుని మేము కూచోటం బాగుండదు. హే గిరిధారి, లే నీ సీటు ఖాళీ చెయ్యి. సర్, నేనా వార్త విన్న క్షణం..
: ఏ వార్త?
: మీ బదిలీ, సర్. నేనా వార్త వినగానే జగబంధు దగ్గరకు పరుగెత్తుకు వెళ్ళాను.
: ఏ జగబంధు?
: మన ప్రజల ప్రతినిధి. సర్, కాని ముందు మీరు కూచుంటారా? మీరు అసలే సన్నటి బక్కపలచని మనిషి, అస్థిపంజరం లాగ. తెలివైన జనం సన్నగా ఎముకల గూళ్ళలా ఉంటారు, కదూ?
(ఒక చతురస్రపు మేఘం లోనికి తేలివచ్చింది. ఆ మేఘం సూర్యకిరణం సంపర్కించిన చోట బీద స్త్రీ చీరలాగా చిరిగింది. ఎక్కడో ఆ వైపున నిశ్శబ్దం మింగేస్తోంది. లేదా వర్షమేఘం దిగివస్తోందా?)
: ఓ బాబు, అక్కడ, కిటికీ మూసెయ్యరాదూ?
: వద్దు వద్దు. ముయ్యొద్దు. మేమిక్కడ ఉక్కలో ఊపిరాడక చచ్చి పోవాలా?
: ఎవరు నువ్వు?
: ఇదేమన్నా నీ సామ్రాజ్యమా?
: ఓహ్, మీరంతా ఆపుతారా? ఈ ఉక్కపోత సాయంత్రం మీద ఈ కారు కూతలు, భరించలేం.
: ఏమంటున్నావ్? భరించలేవా? కారు కూతలూ, ఉక్కపోతా అవి రెండు బాగానే ఉంటాయి, ఉండవూ?
నేను యంత్రాన్నైతే ఎంత బాగుండేది? డాక్టర్ అన్నాడు, “నాకళ్ళకు శుక్లాలు వస్తున్నాయి. నేనే గనక యంత్రాన్ని అయితేనా, నేను వాటిని మార్చుకుంటాను. నాన్న కూడా ఒక యంత్రం అయితే బాగుండు కదా, అతని మృత మూత్రపిండాలను మార్చేసే వాడిని. నేను డబ్బు కోసం వెంపర్లాడే వాడిని కాదు. ఆ పనికి ఒక మెకానిక్ వచ్చే వాడు, లాబ్‌లో లాగా. కాని తాళం చెవి మాటేమిటి? ఎక్కడి నుండి తేను? ఎవరు దాన్ని తిప్పుతారు? నేనేనా? ఒక యంత్రం దాని తాళం చెవి అదే తిప్పగలదా?”
: నర్సింగ్ పూర్, పాసెంజర్స్.
: భువనేశ్వర్ నుండా, సర్, మా గ్రామంలో రోడ్ గురించి ఏమైనా చెయ్యగలరా?
(ఒక కుటుంబం దిగింది. ఒకడు చిన్నవాడు, ఇంకొకడు మొదటి వాడికన్న పెద్ద వాడు. మూడూ, నాలుగూ – అమ్మా , నాన్న. అయిదు పెద్దకొడుకు, అతని చేతుల్లో రెండు మూటలు. )
: రోడ్ బురదగా ఉందా?
: ఆ కంసాలి సందు వరకు మీరు నడవగలరు. అక్కడి నుండి మీరు మీ చెప్పులు తీసి నడవాలి.
నీటి మడుగులోని అద్దం ముక్కలయింది. అక్కడ ఒక భర్త లేని స్త్రీ స్నానం చేస్తోంది. ఆమె మనోరామ రథ్‌ను గుర్తు చెసుకుంది. ఎందుకో తెలియదు. మనోరమ రథ్ బస్ దిగలేదు. మనోరమ రథ్ ఉయల్లో ఊగుతున్న ఒక పల్లెటురి గులాబీ బాల. ముందరున్న ఈ దారి పాదముద్రలతో నలిగిన ఇరుకు దారి మా గ్రామం నుండి మొదలవుతుంది. లేదా అదక్కడ తిరుగుతూ ఉంటుందా? గ్రామ బాట ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది? మనోరమ రథ్ ఎందుకా చెరువు మీది అద్దాన్ని విరగ్గొట్టి చెల్లాచెదరు చేసింది? మేఘాలు మా అందరి మీద ఆవరించుకున్నాయి. అవి ఖాళీ అవుతాయా? మనోరమ రథ్ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుందా? ఎక్కడ?
ఒరియా మూలం –హృషికేశ్ పాండా
తెలుగు సేత — స్వాతీ శ్రీపాద