రాగ విపంచికలా విభిన్నమైన మధుర రాగాలని అందించిన నవల

    1
    2

    [dropcap]భు[/dropcap]వన చంద్ర గారు రచించిన ‘మనసు పొరల్లో‘ నవలలో, రచయిత మనసు పొరల్లో ఉన్న ప్రేమానుభూతుల సుగంధ సుమాలు తాజాగా విచ్చుకుంటూ, పరిమళాలు వెదజల్లుతూ, పాఠకులనెంతగానో ఆకట్టుకున్నాయి. ఇది ఒక ప్రేమ కథ కాదు, ఆధ్యాత్మిక గ్రంథమూ కాదు. ఈ ఇతివృత్తాన్ని ఒక మూసలో పోయడం కష్టం. ఈ నవల చదువుతున్నపుడు తన జీవితంలోని ఎన్నో సంఘటనలని భువనచంద్ర గారు అప్పుడే జరుగుతున్నట్టుగా తాజాగా ఎలా రాశారా అని ఆశ్చర్యం కలుగుతుంది. చాలా చోట్ల ఆయన భావాల వ్యక్తీకరణ చైతన్య స్రవంతిలా కనిపిస్తుంది. తన కళ్ల ముందు కనపడే ఎన్నో సన్నివేశాలకి ఆయన స్పందన చూస్తే భువనచంద్ర గారి మమత, మానవీయత, కవి హృదయపు ఆర్ద్రత అర్ధమవుతాయి.

    హిందీ సినిమాల్లోని ఎవర్‌గ్రీన్ పాటల పట్ల, ఆ సాహిత్యం పట్లా ఆయనకున్న అభిమానం ఈ రచనలో అక్కడక్కడ పొంగిపొర్లుతూ కనిపిస్తుంది. ఈ నవలా కాలంలో తనకు తారసపడ్డ ఎందరో వ్యక్తుల ప్రస్తావన ఇందులో ఉంది. వారి పట్ల ఆయనకున్న అభిమానం, స్నేహం, గౌరవం అక్షరాలనిండా పరుచుకుని దృశ్యమానమవుతుంది.

    ఒక సైనికుడుగా ఉంటూ ప్రతి రూపాయికీ తడుముకునే రోజుల్లో తన రూమ్‌లో పెట్టుకున్న కొత్త స్వెట్టర్‌ని ఎవరో కొట్టేస్తే, తర్వాత కొత్త స్వెట్టర్ కొనుక్కుని దాన్ని కబోర్డ్‌లో పెట్టినా దానికి తాళం వేయనని నిశ్చయించుకోవడం, ‘మనం సైనికులం, దొంగలం కాము’ అని రాసి ఆ కాగితాన్నికబోర్డ్‌కి అంటించడం గొప్పగా అనిపిస్తుంది.

    ‘ఏ నగరాన్నైనా చూడడం అంటే ఒక స్వీట్ ని చూడడం లాంటిది. చూస్తే రుచేం తెలుస్తుంది?’ అంటారు. ఏ చోట అయినా నివసిస్తేనే ఆ చోటు గురించి మనకి అర్థమవుతుందంటారు. తెలుగువాడు ఏ చోట నివసిస్తే ఆచోటికి అనుగుణంగా మారిపోతాడు అంటూ ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం కొత్తగా అనిపించింది. సుమకోమలి ‘నమ్రతా సహానీ’తో ఢిల్లీ నగర విహారాలు, ‘చాయ్ పే చర్చ’లూ, ‘జో తుమ్ కో హో పసంద్ వహీ బాత్ కరేంగే’ అంటూ కబుర్లూ, అడుగడునా తన ప్రియ మిత్రురాలు ఉమ జ్ఞాపకాలు పాఠకులతో పంచుకుంటూ; బబులీ, కుముదినీ, అలౌకిక, ఆమ్రపాలి … అపురూపమైన వ్యక్తిత్వాలని సొంతం చేసుకున్న స్త్రీలని పాఠకులకి పరిచయం చేస్తూ ‘వెన్నెలని చల్లగా’ రమ్మని పిలిచి, పూవుల తేనెలని తెప్పించి, పాఠకులకి అందించిన రచన భువన చంద్ర గారి ‘మనసు పొరల్లో’.

    వెన్నెలని చేత్తో పట్టుకోలేనట్టే ఈ రచన చదివాక ఇదమిత్థంగా ఇదీ కథ అని చెప్పలేం. ప్రేమ కథలా కనిపింపజేస్తూ ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లే విశేషమైన శైలి రచయితది. పూలవనం నిండా పరుచుకు పోయిన వెన్నెల్లో తిరిగి వచ్చిన భావన కలుగుతుంది నవల చదవడం పూర్తయ్యేసరికి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here