[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘మనసు తలుపు తట్టకు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]మ[/dropcap]నసు తలుపు తట్టకు
తట్టుకోలేవు
కదిపి చూడకు
కాళ్ళూ చేతులూ ఆడవు
చిచ్చి కొట్టి వుంచు
బుజ్జి పాపాయిల హాయిగా నవ్వుతుంది
రెచ్చగొట్టి చూశావో
చిచ్చు రేపుతుంది
బుట్టలో పెట్టేందుకు పాము కాదు
బుస కొట్టి వూరుకోవడానికి
నస పెట్టి చంపుతుంది
నిన్ను నిన్నుగా వుండనీయదు
నిన్నే రెండుగా చేస్తుంది
నిలువునా చీలుస్తుంది
నరకాన్ని ముంగిటిలోకే తెస్తుంది
ప్రళయాన్ని పరిచయం చేస్తుంది
అందుకే మనసు జోలికి పోకు
జీవం లేని మనిషివవుతావు
ఏ భావం లేకుండా పోతావు