మనసులోని మనసా… 1

    13
    1

    [box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]

    [dropcap]ఒ[/dropcap]క బిందువు నుండి మరో బిందువు వైపు సాగిపోతున్న ఈ జీవన యానంలో మనకి అనుభవమైన సంగతులు ఆ క్షణం దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించి ఉండవచ్చు.

    కాని అప్పుడు వెల్లివిరిసిన నవ్వులో, సంతోషమో… కాలగతిలో వెలిసిపోయి వుండొచ్చు. లేదా హృదయానికి తగిలిన గాయాలు కానీ, కార్చిన కన్నీరుగాని ఎండిపోయి వుండొచ్చు. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. వాటిని తలచుకోవడం… ఇప్పుడు ఒంటరిగా పడుకుని మధురంగా వుంటుంది నా వరకు నాకు. ఒక్కోసారి అవే కదా… ఈ అడుగులు తడబడుతున్న కాలంలో మనసుకి వూరట నిచ్చేవి అనిపిస్తుంది.

    నా వరకు నాకు ఈ రచనా రంగంలో కాని, చిత్ర రంగంలో గాని అడుగులు వేయించింది ఈ ప్రకృతి మాత్రమే.

    ప్రకృతి అంటే తోటలో, వుద్యాన వనాలో కాదు… దట్టమైన అడవులంటే ప్రాణం నాకు. నా అదృష్టం కొద్దీ నా చిన్ననాట నర్సీపట్నం, సీలేరు, చింతపల్లి, పాడేరు, మాచర్ల ప్రాంతంలోని నల్లమల అడవులు చూడడం జరిగింది. అవి చూసినప్పుడు మనసు పురి విప్పి నెమలిలా ఆడేది. వళ్ళు తెలిసేది కాదు. ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుండేదాన్ని. కాలమే తెలిసేది కాదు. ఆ చర్యలని పెద్దలు తప్పు పట్టి తన్నేవారు. భయభక్తులు లేనిదానిగా పరిగణించేవారు. నాకు నా మనసేమిటో చెప్పే శక్తి లేదు. అవే నన్ను ఒంటరిగా కూర్చుని ఏదేదో రాసుకునేటట్లు, బొమ్మలు వేసుకునేటట్లు చేసింది.  నాగార్జున సాగర్ వరకూ నాకు కొంత స్వేచ్ఛ, నేను అనుకున్నవి చూసే భాగ్యం లభించింది. ఆ తర్వాత నగర జీవితమే.

    చాలా ఆడుతూ పాడుతూ నవ్వుతూ అల్లరి పిల్లగా పేరు తెచ్చుకున్న జీవితంలో పెళ్ళి నాకు ఒక్కసారి నెత్తిన బాధ్యతల్ని, బరువుల్నీ పెట్టింది. ఊపిరాడని పనులతో చాలావరకు నన్ను నేను కోల్పోయేను. ఒక యంత్రంలా పని చేసేను ఇంటా బయటా. అయినా రచయిత్రిగా నిలబెట్టుకున్నాను. కాని ఆ హాడావిడితో జీవితంలో నా రచనల్ని భద్రం చేసుకోలేకపోయాను.

    ***

    తిరిగి నాకు అమెరికా వెళ్ళినప్పుడు ఆ అవకాశం దొరికింది. డాలాస్ ఎయిర్‌పోర్ట్ నుండి ‘ఫెయిర్‌ఫాక్స్’ వెళ్తుండగా రోడ్డు కిరువైపులా దట్టంగా వున్న చెట్లను చూసి ‘అమెరికా అంటే అడవా’ అని ఆశ్చర్యపోయాను. ఎటు చూసినా ఎక్కడ చూసినా అడవే. ముఖ్యంగా పెన్‌సిల్వేనియా నుండి లాఫింగ్‌టౌన్, అటునుండి పిట్స్‌బర్గ్. చెప్పనలవి కాని దట్టమైన అడవులు, లోయలూ. రోడ్డు ఎత్తుపల్లాల మీద రిబ్బన్ మడతల్లా కనిపించేది. నేను ముందు సీట్లో వంశీ పక్కనే కూర్చునేదాన్ని. దారి పొడుగునా సముద్రం, రోడ్డు పక్కన టన్నెల్స్, పైన వంతెనలూ… అద్భుతమైన ప్రయాణాలవి!

    పోయినసారి వెళ్ళినప్పుడు ఒక తమాషా జరిగింది. వంశీ వాళ్ళు ఛాంటెలీ అనే కౌంటీ (గ్రామం)లో సౌత్ రెయిడింగ్ కాలనీలో ఇల్లు కొనుక్కుని షిప్టయిపోయారు. నేను ప్రొద్దుటే తలుపు తీసుకుని వాకింగ్‌కి వెళ్ళిపోయేదాన్ని. పేవ్‌మెంట్ మీద వెళ్తూ వెళ్తుండగానే దట్టమైన అడవుల్లా గుంపులు గుంపులుగా చెట్లు వచ్చేసేయి. పైన నల్లని మేఘాలు. పాండ్స్, వాటిలో ఈతలు కొట్టే బాతులు. నిర్మానుష్యంగా వున్న బెంచీ మీద వెళ్ళి కూర్చుంటే ఎన్ని కలలు! చిన్న చిన్న వంతెనలు, వాటి క్రింద పారుతున్న నీటిలో కదిలే రంగు రంగుల చేపలు… దూర దూర తీరాలకి మెలికలు తిరుగుతూ కనుమరుగయ్యే బాటలు… వళ్ళు తెలిసేది కాదు.

    అలా చాలా సేపు కూర్చుని ఇంటికి వస్తుండగా వంశీ సైకిల్ వేసుకుని రావడం కనిపించింది. నేను వాణ్ణి చూసి నవ్వితే వాడు నవ్వలేదు. నా దగ్గరగా వచ్చి ‘ఎక్కడి కెళ్ళేవ్’ అన్నాడు సీరియస్‌గా. వాడి మొహమంతా గాభరా. వాడు ఎప్పుడూ అంత కోపంగా మాట్లాడడు. “ఏం, వాకింగ్ కెళ్ళాను” అన్నాను.

    “పోన్ కూడా పట్టుకెళ్ళలేదు. నేనెంత గాభరా పడి వెతుకుతున్నానో తెలుసా?” అన్నాడు.

    “ఎందుకురా, నాకీ దారులన్నీ తెలిసిపోయాయి” అన్నాను గర్వంగా.

    “అది కాదు, అలా వెళ్ళడం చాలా ప్రమాదం. పద” అన్నాడు.

    వాడి మొహం ఇంకా జేవురించే వుంది.

    ఇంటికి వెళ్ళేక కాఫీ యిచ్చి చెప్పేడు.

    “మొన్ననే ఒక ఇండియన్ పేరెంట్ ఇలానే వాకింగ్‌కి వెళ్ళి అమాయకంగా ఒక అమెరికన్ ఇంట్లోకి స్టేర్ చేసి చూశాడట. వాళ్ళు వెంటనే అతని మీద పోలీసులకి రిపోర్ట్ చేసేరుట. వాళ్ళు వెంటనే వచ్చి బేక్‌బోన్ విరిగిపోయేట్లు కొట్టారట. అతనికి ఇంగ్లీషు రాదు. వాళ్ళబ్బాయి తెలుసుకుని పోలీసులతో మాట్లాడి తండ్రిని ఇంటికి తీసుకొచ్చేసరికి తలప్రాణం తోకకి వచ్చిందట. పాపం వాళ్ళ తండ్రి మాత్రం కోలుకోలేదట. ఇక్కడ స్టేర్ చేసి చూడడం చాలా నేరం” అని చెప్పుకొచ్చేడు.

    నా ఆనందంలో ఇంత ప్రమాదముందని తెలిసి హతాశురాలయ్యాను ఒక్కసారి.

    కూకట్‌పల్లిలో మా ఎపార్టుమెంట్ ఎదురుగా మంచి పార్కు వుండేది. కాలనీవాసులంతా పార్కుని బాగా డెవలప్ చేసుకున్నారు. పూల చెట్లు చాలా బాగా వేశారు. ఆ గుబురుల మధ్య నడక దారులు భలే వుండేవి. నేను చీకట్లు ఇంకా విచ్చుకోకుండానే వెళ్ళిపోయేదాన్ని… నడిచినంత నడిచి ఓ మూల బెంచీ మీద ఒంటరిగా కూర్చునేదాన్ని. ఈ లోపున ఒక బేచ్ ఆడవాళ్ళు గలగల మంటూ వచ్చి నాలుగయిదు బెంచీలు ఆక్రమించి, వాళ్ళ యింటి కబుర్లు, ఆవకాయ పచ్చడి ఎలా పెడితే బాగుంటుంది, దొండకాయతో ఎన్ని రకాలు చెయ్యొచ్చు, చీరలు ఎక్కడ రోలింగ్ కిస్తే బాగా చేస్తారు – ఇలాంటి మాటల్ని అరుచుకుంటూ చర్చించుకునేవారు. వాకింగ్ చేసేవారు కాదు. కనీసం మౌనంగా కూడా కూర్చునేవారు కాదు. వాళ్ళ మాటలతో పార్కంతా డిస్ట్రర్బయిపోయేది. అందుకే నేను వాళ్ళు వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేసేట్లు వెళ్ళేదాన్ని.

    ప్రొద్దుటే… చీకటి వెలసి, వచ్చే వెలుగు రేఖల్ని, అరుణోదయమవుతున్న ఆకాశాన్ని, నిద్ర లేచి హడావిడి పడుతున్న పక్షుల కిలకిలల్ని, విచ్చుకుంటున్న మొగ్గల సువాసనల్ని, రాలిన నిన్నటి పూల వెలుగులో ద్యోతకమవుతున్న పచ్చదనాన్ని కనులతో స్పృశించి ఆనందించడంలో ఎంత హాయి వుందో ఎలా చెప్పగలం.

    ఇప్పుడా జ్ఞాపకాలు ఎంతో ఆనందాన్ని పంచుతుంటే, వాటిని ఆస్వాదించడమే హాయి హాయి కదా…

    తిరిగి మరో జ్ఞాపకంతో మళ్ళీ కలుద్దాం.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here