మనసులోని మనసా-14

3
2

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]

నేను చూసిన మొదటి సినిమా నటి:

[dropcap]ఈ[/dropcap] సంగతి ఇప్పుడు చెబుతుంటే నాకు నవ్వు తన్నుకొస్తున్నది. మా చిన్నతనంలో నటులని చూడాలంటే చాలా కష్టం. వారు చాలా అరుదుగా కనిపించేవారు. వాళ్ళంతా అప్పట్లోని మద్రాసులోనే వుండేవారు. షూటింగులు కూడా ఎక్కువగా ఇన్‌డోర్‌లో స్టూడియోల్లోనే జరుగుతుండేవి. అంచేత వాళ్ళ దర్శనం చాలా అపురూపం. ఇక మా నాన్నగారు ఉద్యోగం చేసే చిన్నపాటి వూళ్ళలో వాళ్ళెక్కడ కనిపిస్తారు?

కాని నేను అనుకోకుండా ఒక నటీమణిని చూసేశాను. అదీ మొదటిసారి.

మా నాన్నగారప్పుడు గురజాలలో జాబ్ చేస్తున్నారు. అక్కడ ఒక్క సంవత్సరం మాత్రమే ఆయన జాబ్ చేసి, నాగార్జున‌సాగర్‌కి ట్రాన్స్‌ఫరయ్యారు. అప్పుడు నాకు తొమ్మిదో సంవత్సరం.

అక్కడ ఆఫీసర్స్ అందరికీ ఒక కాలనీ ఉండేది. దాన్ని శౌరయ్య కాంపౌండ్ అనేవారు. శౌరయ్య అనే అతను కట్టించాడట. మా ఎదురుగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్, పక్కగా మేజిస్ట్రేట్.. అలా ఉండేవారు. మేజిస్ట్రేట్ గారి అమ్మాయి లలితతో స్నేహం బాగా ఉండేది. మా యింటి పెరటి గుమ్మం మేజిస్ట్రేట్ గారి యింట్లోకి వుండేది. అలా వాళ్ళింట్లోంచి వీధిలోకి వెళ్ళిపోవచ్చు. నేనెక్కువగా స్కూలుకి లలితతో కలిసి అటుగానే వెళ్తుండేదాన్ని. మా వీధి గుమ్మం కాలనీలో వుండేది.

ఒకరోజు నబి అని మా పోస్టాఫీసులో మెయిల్ ప్యూన్ వచ్చి రహస్యంగా, “అమ్మాయి గారూ… మెయిన్ రోడ్ మీద బస్సులో కనకం గారున్నారండీ” అని చెప్పేడు. అంతే! మా అమ్మగారు వేస్తున్న జడ ఆమె చేతిలోంచి వూడబీక్కుని రయ్యిమని మేజిస్ట్రేట్ గారింట్లోంచి రోడ్డు మీదకి పరిగెత్తి మెయిన్‌రోడ్ మీద ఆగిన బస్సు దగ్గర సరిగ్గా కనకం గారు కూర్చున్న కిటికీ దగ్గర నిలబడ్డాను.

కనకం అంటే చాలామందికి ఇప్పుడు తెలియకపోవచ్చు. నిజానికి నాకు ఊహ వచ్చేటప్పటికే ఆమె సినిమాలు లేవు. చాలా రోజుల తర్వాత ఆమె లేత మనసులు, భక్త ప్రహ్లాద లో కనబడ్డారు.

కాని… నేను మాచర్ల టూరింగ్ టాకీసులో పాత పాత సినిమాలు చూడడం వల్ల ఆమె నాకు తెలిసింది.

అక్కడ సినిమాల ఫార్సే వేరు. రీలు రీలుకీ ఇంటర్వెల్. ఆగిపోయిందని విజిల్స్, గోల! ఒక్కోసారి హాల్లోకి పాములు కూడా వచ్చేయి. అంతే గోల గోల! పరుగులు! మళ్ళీ ఆ సినిమా మర్నాడు వేసేవారు.

మాకు సినిమాలు ఫ్రీ. అందులో ఆ టూరింగ్ టాకీసు మా యింటి పక్కన ఖాళీ స్థలంలోనే వుండేది. సినిమా మొదలయ్యేవరకు పాత పాటల రికార్డులతో ఆ ప్రాంతమంతా మారుమోగేది. మా రన్నర్స్ మాకు యింటి నుండి కుర్చీలు తెచ్చి హాల్లో వేసేవారు. పాముల భయంతో కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని కూర్చునేవాళ్ళం. మా నాన్నగారు టార్చ్ లైట్ వేసి చుట్టూ చూస్తుండేవారు. అలా వచ్చిన సినిమాలల్లా చూసేసేవాళ్ళం. ఇక నచ్చిన సినిమా వున్నా, సన్నివేశం వున్నా నేను పరుగున వెళ్ళి నిలబడి చూసి వచ్చేదాన్ని.

అందువలన సినిమా నటి కనకాన్ని చూడటానికి నేను పరుగెత్తి వెళ్ళడంతో ఆశ్చర్యం ఏముంది!

నేను వెళ్ళేసరికి కనకం సోడా తాగుతున్నారు. నేను కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాను. ఆమె సోడావాడికి డబ్బులిచ్చి పరధ్యానంగా నా వైపు చూశారు. నేను సంతోషంగా నవ్వాను. ఆమె అటూ ఇటూ చూసి మళ్ళీ నా వైపు చూశారు. నేనేమయినా చూపు తిప్పితేనా! చివరికి ఆమెకి నేను తనని చూడటానికే వచ్చానని అర్థమయ్యింది.

చివరికి చిరునవ్వు నవ్వి “ఇలా రా” అని పిలిచేరు!

ఇంకేముంది. పరవశంగా ఆవిడ దగ్గరకి పరిగెత్తేను.

“నీకు నేను తెలుసా?” అనడిగారు.

తెలుసని నేను రుబ్బురాయిలా తల తిప్పేను.

“ఎక్కడ చూశావ్?”

“సినిమాల్లో”

“ఓహో! ఏ సినిమాలు చూశావ్?”

నేను గుర్తొచ్చినవన్నీ ఏకరువు పెట్టేను.

ఆవిడ నవ్వి, నా బుగ్గలు నొక్కి, నా చదువు వివరాలడిగేరు.

అన్నీ చెప్పేశాను. మా నాన్న ఉద్యోగం… అన్నీ.

బస్సెందుకో అక్కడ చాలా సేపే ఆగింది.

“ఇంక ఇంటికెళ్ళు. మీ వాళ్ళు చూస్తుంటారు” అన్నారామె. నేనేం వెళ్ళలేదు. బస్సు కదిలేవరకు అక్కడే వుండి ఆవిడకి టాటా చెప్పి ఇంటికొచ్చేను.

అప్పటికి మా అమ్మగారు మూడో నేత్రం తెరిచారు.

“నీకు చూడటానికి కనకం తప్ప ఎవరూ దొరకలేదా… జడేస్తుంటే పరిగెత్తుతావా..” అని దండకం చదివి బడిత పూజ చేసేరు.

“నీకిక జడ వెయ్యను ఫో!” అన్నారు కోపంగా.

“హమ్మయ్య” అనుకున్నాను నేను కూడా.

ఎందుకంటే తలస్నానం చేసేటప్పుడు, జడలేసేటప్పుడు ఎప్పుడూ మేమంతా మా అమ్మగారికి దొరికిపోతూంటాం. ఆవిడ పాత కక్షలన్నీ అప్పుడే తీర్చుకునేవారు.

నేనిక తర్వాత ఆమె చేత జడ వేయించుకోలేదు. వంకరటింకర పాపిడయినా తీసుకుని అష్టవంకరలతో జడలు వేసుకుని స్కూలుకి వెళ్ళిపోయేదాన్ని.

అలా మొత్తానికి కనకం గారిని చూసేసిన ఘనత సంపాదించాను.

నాగార్జున సాగర్‌లో ఒక దేవకన్యని చూశాను – అనుకోకుండా. ఆవిడే మధుబాల.

అక్కడేదో హిందీ సినిమా షూటింగ్ జరిగిందట. ఆవిడ టెలిఫోన్ చెయ్యడానికి మా పోస్టాఫీసు కొచ్చింది.  అది మా అదృష్టం.

అప్పుడెక్కడబడితే అక్కడ ఫోన్‌లు లేవు. ఎంతటి వారయినా రావల్సిందే. ఇంకేముంది మా ఇల్లు ఆఫీసు కలిసే వుంటాయి కదా! పరిగెత్తి ఆఫీసులోకి వెళ్ళిపోయాను.

నా జీవితంలో అంతటి సౌందర్యరాశిని మరలా చూడలేదు. దంతం లాంటి రంగు, ఒడ్డూ పొడువు, మెరిసిపోతున్న కళ్ళు – పాలుగారే చెంపలు, గులాబీ రంగు పెదవులు – పూలతో చేసినట్లున్న రూపం. అంత చిన్న వయసులో చూసినా ఆ రూపం మరచిపోలేనిది!

ఆమె ఏ మాత్రం మేకప్ వేసుకోకుండా తెల్లని షిపాన్ చీరని ముసుగేసుకుని వచ్చింది. ఏదో హిందీలో మాట్లాడి పక్కనే నిలబడ్డ నా వైపు చూసి చిరునవ్వు నవ్వి… వెళ్ళి కారెక్కారు. అది మరొక థ్రిల్!

బాగా చిన్నప్పుడు కొత్తగూడెంలో రంగస్థల నటుడు వేమూరి గగ్గయ్యగారిని చూసి బిగుసుకుపోయి, మా పెదనాన్నగారిని గట్టిగా పట్టుకుని కూర్చున్నాను. అందులో ఆయన కంసుడి వేషంలో వుండి భీకరంగా పద్యాలు పాడి గద తిప్పుతూ స్టేజంతా కలయదిరుగుతున్నారాయె.

అప్పుడు మా పెదనాన్నగారు నన్ను గ్రీన్ రూమ్‌లోకి తీసుకెళ్ళి గగ్గయ్య గారిని పరిచయం చేసి భయం పోగొట్టారు. ఆయన పేపర్ మెష్‌తో చేసిన గదని నా చేతికిచ్చారు. చాలా తేలిగ్గానే వుందది నిజానికి!

తర్వాత పెద్దయ్యేక రచయిత్రి నయ్యేక అనేక ప్రెస్ మీట్‌లలో నేను పెద్ద పెద్ద నటుల్ని, దర్శకుల్ని కలిసేను. మాట్లాడేను. కథలు చెప్పేను. విశ్వనాథ్ గారు స్వయంగా ఎదురొచ్చి శుభలేఖ సినిమా చూపించారు. ప్రెస్ మీట్‌లో చిరంజీవి గారు దగ్గరగా వచ్చి తన ఎడ్రెస్ యిచ్చి ఇంటికి రమ్మని ఆహ్వానించారు. టి.వి. సీరియల్స్ కథల కోసం స్వయంగా ఎంతోమంది నటులు, నటీమణులు మా యింటికి రావడం జరిగింది.

సినీనటుడు సుమన్ గారు తన జీవిత కథ నా చేత రాయించుకున్నారు. దాసరి గారికి రెండు సీరియల్స్ రాశాను. అలా చాలామంది నటులు, దర్శకులూ పరిచయమైనా, నేను మొదటిసారి కనకం గారిని చూసిన థ్రిల్ మాత్రం ఫీల్ కాలేదు.

ఆ కిక్కే వేరబ్బా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here